పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

లక్షణ ప్రకరణము : భాషాభాగములు

భాషా భాగములు

.

వర్ణములు నుండి అక్షరాలు – అక్షరాలు నుండి పదాలు ; పదాలునుండి – వాక్యాలు

-x-

  భావాలను వ్యక్తపరచుకొను చక్కటి ప్రక్రియ భాష. నిర్దుష్ట భావాన్ని వ్యక్తపరచే భాషలోని ప్రక్రియ వాక్యము. ఒకటి కాని ఎక్కువకాని వాక్యాలతో భావ వ్యక్తీకరణ జరుగుతుంది. భావ వ్యక్తీకరణకు వ్యక్తులు జాతులు, గుణం, భావం వంటివి గుర్తించే వాటిని "పదాలు" అంటారు. ఒకటి కాని ఎక్కువ పదాలతో వాక్యాలు ఏర్పడతాయి. ఆ విధంగా భావవ్యక్తీకరణలో అతి చిన్న వ్యక్తీకరణ “పదం”. ఉదాహరణకు ఒక పదం “చెట్టు” అనగానే భౌతికమైన చెట్టు భావంలో మెదుల్తుంది. అలా పదాలు భాషలో మూల భాగములు. అంత ప్రాముఖ్యం ఉంది కనుక, పదాల రకాలను భాషా భాగములు అంటారు. పదాలు ఒకటి కాని ఎక్కువకాని అక్షరాలతో ఏర్పడతాయి.
చాలా వరకు పదాలు అనేక అక్షరాలతో ఉన్నవే కనుక, ఉదాహరణలు అక్కర్లేదు.
  ఒకే అక్షరం కల పదాలు ఉన్నాయి. ఉదా- ఆఁ, ఊఁ, రా, పో;
  ఓకే సంజ్ఞ / వర్ణం కల పదాలు ఉన్నాయి. ఉదా. అ, ఈ, ఓ

భాషాభాగములు రకములు

  (అ) మన తెలుగులో భాషాభాగములు ఐదు (5) రకములు. అవి:- 1. నామవాచకము, 2. సర్వనామము, 3. విశేషణము, 4. అవ్యయము, 5. క్రియ.

  1. నామవాచకము:
ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకములు అని అందురు.
ఉదా - రాముడు, బాణము, గిరి
రాముడు మంచి బాలుడు.
పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం
నామవాచకము ఐదు (5) రకములు అవి, 1. సంజ్ఞానామవాచకములు, 2. జాతి నామవాచకములు, 3, గుణనామవాచకములు, 4. సాముదాయక నామవాచకములు, 5. క్రియానామవాచకములు.

  1- సంజ్ఞా నామవాచకము
వ్యక్తుల, స్థలాల పేర్లు వంటివి. అంటే వ్యక్తిగతంగా వాడు నామవాచకములు, అంటే ఆ పేరుతో ఒకరే కాని ఒకే జంతువుకాని, వస్తువుకాని, పిలవబడుతుంది అన్నమాట
ఉదా- శిఖరిజ (పార్వతీదేవి) 1-2-ఉ., మన్మథుడు 1-2-ఉ.,, గంగానది 1-15-వ., చంద్రమండలము 1-16-సీ., భాగవతము 1-23-వ., ద్వారకానగరము 1-178-వ.,, నైమిశారణ్యము 1-38-క.

  2- జాతి నామవాచకము
సమానమైన, స్వరూపములు, గుణములు, స్వభావములు గల సమూహములులోని వాని పేర్లు అంటే అదే పేరుతో అనేకమైన అట్టివాటిని పిలవచ్చు అన్నమాట
ఉదా - గోవు, అరణ్యము, దినము

  3- గుణ నామవాచకము
గుణము లేదా స్వభావము తెలియజేసే పదములు
ఉదా - సత్త్వగుణము, కోపము, మంచి, తెలుపు, మధురము

  4- సాముదాయక నామవాచములు
సమూహాన్ని సూచించే పదాలు.
ఉదా. సమూహము, సైన్యము, గుంపు, దండు

  5- క్రియా నామవాచకములు
క్రియ అంటే పని. అలా పని పేరును తెలిపే పదాలు
ఉదా – చేరుట, మ్రొక్కుట, కాపాడుట

  నామవాచకము రకములు
1) లింగానుసారంగా నామవాచకములు పుల్లింగం, స్త్రీలింగం, నపుంసక లింగం అని మూడు (3) రకాలు
ఉదా – కృష్ణుడు (పు), రుక్మిణి (స్త్రీలింగం), రథము (నపుంసక లింగం)
2) వచనమును (ఎన్ని ఉన్నవో లెక్కను) అనుసరించి నామవాచకానికి ఏకవచనం బహువచనం అని రెండు (2) రూపాలు ఉంటాయి
ఉదా- బాణము (ఏకవచనం) – బాణములు (బహువచనం)


  2. సర్వనామము
నామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు.
ఉదా - అతడు, ఆమె, అది, ఇది, ఒకటి, అందరు, వీరు, కొన్ని, ఎవరు
రాముడు మంచి బాలుడు. అతడు పెద్దల మాట వింటాడు.
ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు రాముడు అనే అర్ధం. అయితే రాముడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం.


  3. విశేషణము
నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.
ఉదా - మంచి బాలుడు యందు మంచి విశేషణము
విశేషణము ఆరు (6) విధములు: అవి 1. జాతిప్రయుక్తాలు, 2. క్రియాప్రయుక్తాలు, 3. గుణప్రయుక్తాలు, 4. ద్రవ్యప్రయుక్తాలు, 5. సంఖ్యాప్రయుక్తాలు, 6. సంఙ్ఞాప్రయుక్తాలు.

  1- జాతిప్రయుక్త విశేషణము
ఉదా - గొల్లపిల్లవాడు – ఇందు పిల్లవాడు అను నామవాచకమునకు, గొల్ల జాతిప్రయుక్త విశేషణము

  2- క్రియాప్రయుక్త విశేషణము
ఉదా - పోవువాడు అర్జునుడు . పోవు క్రియ, పోవువాడు క్రియాప్రయుక్త విశేషణము

  3- గుణప్రయుక్త విశేషణము
ఉదా - ప్రసన్నవినోది. వినోది ఎలాంటివాడు అంటే ప్రసన్న మైన అన్న విశేషణము కనుక. విశేషణప్రయుక్త విశేషణము.

  4- ద్రవ్యప్రయుక్త విశేషణము
ఉదా – సువర్ణదానము – సువర్ణము అను ద్రవ్యమును దానమునకు విశేషణముగా వాడారు కాబట్టి సువర్ణ ద్రవ్యప్రయుక్త విశేషణము

  5- సంఖ్యాప్రయుక్త విషేషణము
ఉదా – దశకంఠుడు దశ సంఖ్యాప్రయుక్త విశేషణము

  6- సంజ్ఞాప్రయుక్త విషేషణణు
ఉదా – వ్యాసపుత్రుడు - వ్యాస సంజ్ఞానామవాచకమును పుత్రుడు అను సర్వనామమునకు విశేషణముగా వాడారు కనుక వ్యాస పదం సంజ్ఞాప్రయుక్త విశేషణము


  4. అవ్యయము
లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు అని అంటారు
ఉదా - అక్కడ, ఏది, అహో,
అవ్యయములు మూడు (3) రకములు. అవి ప్రతిపదోక్తాలు, లాక్షణికాలు, సముచ్ఛయాలు

  1- ప్రతిపదోక్త అవ్యయము - సహజంగా ఏర్పడే అవ్యయము
ఉదా – అక్కడ, ఎక్కడ, ఊరక, ఎట్టకేలకు ఆశ్చర్యార్థకంలో - ఔరా! ఆనందార్థకంలో - ఆహా! దుఃఖార్థకంలో - అయ్యో! సంతాపార్థకంలో అకటా! కటకటా! ప్రశ్రార్థకంలో - ఏల?

  2- లాక్షణిక అవ్యయములు – లక్షణాన్ని బట్టి ఏర్పడ్డవి, అంటే వ్యాకరణశాస్త్రం ప్రకారం అవ్యయాలుగా మారినవి. అలా అసమాపక క్రియలన్నీ లాక్షణిక అవ్యయాలే
ఉదా – పోయిన ప్రాణం, వేసిన బాణం,

  3- సముచ్ఛయ అవ్యయము
"ను", "యును" అనునవి సముచ్ఛయార్థకాలు. "యును" అనునది ఉకారంతము కాని పదాల మీద; "ను" అనునది ఉకారాంత పదముల మీద వస్తాయి.
ఉదా. నీవును, మఱియును


  5. క్రియ
పనులను తెలుపు పదములను క్రియలందురు.
ఉదా - తినటం, తిరగటం, నవ్వటం...
క్రియలు కర్మానుసారంగా రెండు (2) రకాలు; సకర్మకాలు, అకర్మకాలు


1. సకర్మకక్రియ: క్రియను చేసేవారు కర్త, క్రియతో ఏమి, ఎవరిని, దేనిని వంటి ప్రశ్నల సమాధానం కర్మ. ఉదా. రాముడు బాణము వేసేను. ఇందులో వేయడం పని కనుక వేసెను క్రియ. ఆ క్రియ చేసినవాడు రాముడు కనుక రాముడు కర్త. ఏమి వేసెను అంటే బాణం కనుక బాణం కర్మ. ఇవి వాక్యంలోని విభాగాల పేర్లు. ఇలా క్రియ కర్మను కోరుతుంది. ఇలా క్రియ కోరిన కర్మ ఉంటే దానిని “సకర్మక క్రియ” అంటారు.
2. అకర్మక క్రియ: ఇంకొక వాక్యం చూద్దాం. ఉదా. రావణుడు చచ్చెను, ఇందులో చచ్చెను క్రియ. రావణుడు కర్త. కాని ఈ క్రియ కోరే కర్మ లేదు. ఇలా క్రియ కోరే కర్మ ఉండని క్రియలను “అకర్మక క్రియ” అంటారు.

  (ఆ) క్రియారూపాలు
1. వాక్యం క్రియతో పూర్తి ఐతే సమాపక క్రియ. కాకపోతే అసామపక క్రియ ఉదా. రాముడు బాణం వేసి, రావణుని చంపెను. ఇందులో వేసి అనే క్రియతో పని పూర్తి కాలేదు కనుక అసామపకము. చంపెనుతో క్రియ పూర్తి ఐంది కనుక సమాపకము
2. కాలాములను, వచనాన్ని, లింగాన్ని అనుసరించి, క్రియారూపాలు ఉంటాయి.
ఉదా – కొట్టు క్రియ, తద్దర్మము కొట్టెను,
భూతకాలం (గడచిపోయినది)- కొట్టాడు (ఏకవచన పుల్లింగం), కొట్టింది (ఏకవచన స్త్రీలింగం, నపుంసక లింగం), కొట్టాయి (బహువచన నపుంసక లింగం), కొట్టారు (బహువచనం పుల్లింగం, స్త్రీలింగం)
వర్తమానకాలం (నడుస్తున్నది)- కొట్టుచున్నాడు (ఏకవచన పుల్లింగం), కొట్టుచున్నది (ఏకవచన స్త్రీలింగం, నపుంసక లింగం), కొట్టుచున్నవి (బహువచన నపుంసక లింగం), కొట్టుచున్నారు (బహువచనం పుల్లింగం, స్త్రీలింగం).
భవిష్యత్కాలము (జరగబోవు కాలము)- కొట్టును, కొట్టుతాడు (ఏకవచన పుల్లింగం), కొట్టుతుంది (ఏకవచన స్త్రీలింగం, నపుంసక లింగం), కొట్టుతాయి (బహువచన నపుంసక లింగం), కొట్టుతారు (బహువచనం పుల్లింగం, స్త్రీలింగం)



(ఆ) భాషాభాగముల విధములు

  (క) వచనములు
వచనములు అంటె ఎన్ని ఉన్నాయో లెక్క ఆధారంగా చెప్పేవి. ఇవి నాలుగు (4) రకములు-
1. ఏకవచనము ఒకటి ఉన్నప్పుడు ఏకవచనము, ఉదా- సీత, కృష్ణుడు
2. బహువచనము ఒకటి కన్నా ఎక్కువ ఉంటే బహువచనము ఉదా- సీతలు, కృష్ణులు
3. నిత్యైకవచనములు – ఎప్పుడు ఏకవచనరూపంలో మాత్రమే చెప్పబడునవి. బంగారము, వెండి, అక్కడ, ఇక్కడ, బియ్యము
4. నిత్యబహువచనములు ఎప్పుడు బహువచన రూపంలోనే చెప్పబడునవి ఉదా- అందరు, గుజ్జెనగూళ్ళు, కందులు, పెసలు

  (చ) పురుషలు
పురుషలు అనగా కర్తతో సంబంధించినవి అనవచ్చు. ఇవి మూడు (3) రకములు. అవి
1. వాడు అది ఆమె వారు : ప్రథమ పురుష
2. నీవు మీరు : మధ్యమ పురుష
3. నేను మేము మనము : ఉత్తమ పురుష

  (ట) లింగములు మూడు (3) రకములు. అవి
పుల్లింగము - పురుషులకు చెందినవి. ఉదా- పరీక్షిత్తు
స్త్రీలింగము - స్త్రీలకు చెందినవి ఉదా- సర్సవతీదదేవి
నపుంసకలింగము – మిగిలినవి ఉదా. కైవల్యము, భక్తి, రథము  

  (త) విభక్తులు
పదముల మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసే వాటిని విభక్తులు అంటారు. ఆయా విభక్తుల వర్గములలోనికి వచ్చు వాటిని ప్రత్యయములు అంటారు. విభక్తులు ఎనిమిది (8) రకములు

ప్రత్యయాలు : విభక్తి పేరు
1. డు, ము, వు, లు : ప్రథమా విభక్తి
2. నిన్, నున్, లన్, గూర్చి, గురించి : ద్వితీయా విభక్తి.
3. చేతన్, చేన్, తోడన్, తోన్ : తృతీయా విభక్తి
4. కొఱకున్ (కొరకు), కై : చతుర్ధీ విభక్తి
5, వలనన్, కంటెన్, పట్టి : పంచమీ విభక్తి
6. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ : షష్ఠీ విభక్తి.
7. అందున్, నన్ : సప్తమీ విభక్తి
8. ఓ, ఓరీ, ఓయీ, ఓసీ : సంబోధన ప్రథమా విభక్తి

  (ప) విరామ చిహ్నములు -
. 1. బిందువు : వాక్యం పూర్తయినప్పుడు, పూర్తి అయినట్లుగా సూచించడానికి బిందువు పెడతారు. దీని సూచిక (.).
2. వాక్యాంశ బిందువు : చెప్పవలసిన అంశం ముగియనప్పుడు, అసమాపక క్రియలను వాడి వాక్యం వ్రాస్తున్నప్పుడు వాక్యాంశ బిందువు లేదా కామా ఉపయోగిస్తాము. దీని సూచిక (, ).
3. అర్థ బిందువు : ఒక పెద్ద వాక్యములో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్థ బిందువు వస్తుంది. దీని సూచిక (;).
4. న్యూన బిందువు : వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు ఉపయో గిస్తారు. దీని సూచిక (:).
5. అనుకరణ చిహ్నాలు : ఒకరు అన్న మాట ఇంకొకరు చెప్పుచున్నప్పుడు, వేరే ఏదో ఒక గ్రంథం నుండి తీసిన వాక్యాలు చెప్పునప్పుడు వాటి ముందు వెను క అనుకరణ చిహ్నాలు వాడతాము. దీని సూచిక ( ". . ." ).
6. ప్రశ్నార్థకం : ఏదైనా విషయాన్ని గురించి, అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ప్రశ్నార్థకం ఉపయోగిస్తారు. దీని సూచిక (?).
7. ఆశ్చర్యార్థకం : పిలుపులు, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని, వింతను, మెచ్చుకోలును తెలిపే పదాల చివర ఆశ్చర్యార్థకమును ఉపయోగిస్తాము. దీని సూచిక (!).
8. అడ్డ గీత : వాక్యంలో వచ్చే విషయాలు వివరణ ఇచ్చేటప్పుడు అడ్డ( పొడవు) గీత వాడతాము. దీని సూచిక (-).
9. కుండలీకరణం : భాషా పదాల వివరణ నిచ్చుటకు, ఇతర నామాలు తెలుపుటకు, వివరణ నిచ్చుటకు వాటి ముందు వెనుక కుండలీకరనములను ఉపయోగిస్తారు. దీని సూచిక ( (...), {...}, [...] ) .
10. మూడు చుక్కలు : చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలున్నాయని సూచించడానికి గాఉ ఈ మూడు చుక్కలను ఉపయోగిస్తారు. దీని సూచిక (...)