పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : శివుండుపార్వతీ సహితుఁడై మంగళస్నానాదుల చేయుట.

3-165-వ.
ఇట్లు పరమేశ్వరుండు పురంబుఁ బ్రవేశించి యందుఁ దుహినాచలేంద్రుండు తనకు నియమించినవిడిదికి నెయ్యంబు తోడ నిట్లు వచ్చిన.

టీక :-
నెయ్యము = ఇంపుగా.
భావము :-
ఇలా పరమేశ్వరుడు పురము ప్రవేశించి అక్కడ హిమవంతుడు తన కోసం ఏర్పాటు చేసిన విడిదికి సంతోషంతో రాగా.

3-166-సీ.
తివలు కస్తూరి లికించి ముత్యాల
ముగ్గులు దీరిచి ముదముతోడ
త్నపీఠమునకు రాజాస్య మేనక
తోఁబార్వతీదేవిఁ దోడి తెచ్చి
సుపుటక్షింతలు రఁగంగ దీవించి
పెట్టి వాద్యంబులు బెరసి మ్రోయ
ల్లిదలంటంగఁ గుమజ్జనము లార్చి
యొప్పారఁ దడియొత్తు లోలిఁ దాల్చి.

3-166.1-ఆ.
హుళరత్న చయము డిసిపొందుగ వైచి
పట్టుపుట్టములను గట్ట నిచ్చి
పేరఁటాండ్రు చూడ పెండ్లికుమారిఁ గై
సేయఁ దలఁచి గడగి చెలువు మిగుల.

టీక :-
మజ్జనము = స్నానము; ఓలి = వరుస.
భావము :-
పురస్త్రీలు కస్తూరితో అలికి ముత్యాలతో ముగ్గులు పెట్టారు. రత్న పీఠము వద్దకు రాణి మేనకతో పార్వతిని తీసుకువచ్చారు. మంగళ వాయిద్యాలు మ్రోగుచుండగా పసుపు అక్షతలతో చక్కగా దీవించారు., తల్లి తలంటగా తగినట్లు స్నానాలు చేయించి తడి తుడిచుట చేసారు. అనేక రత్నాలు పొందారు.. పట్టుబట్టలు కట్టుటకు ఇచ్చారు. పేరంటాళ్ళు చూడడానికి వస్తారని శోభాయమానంగా సిద్దంచేయ దలచారు.

3-167-ఆ.
దేవిరూపమునకు దృష్టిదాఁకెడు నంచు
మాటుసేయుభంగి ణిసువర్ణ
పుష్పవస్త్రగంధముల నలంకారించి
రెలమితోడ గౌరి నిందుముఖులు.

టీక :-
ఎలమి = సంతోషము.
భావము :-
ఆ పుర స్త్రీలు సంతోషంగా, గౌరీదేవి రూపమునకు దృష్టి దోషం తగులుతుందని ఆమెమీదనుండి దృష్టి మరల్చడం కోసం మణులు, బంగారములు, పుష్పములు, వస్త్రములు, గంధములతో గౌరీదేవిని అలంకరించారు.

3-168-వ.
ఇట్లు శృంగారించి శైలవల్లభు పెండ్లింటిలోనికిఁ దోడి తెప్పించి రంత; నప్పరమేశ్వరుం డంతఁ దన యున్న మందిరంబున శ్రౌత పుణ్యాహవాచనంబులు బ్రహ్మచేతంజేయించి వివాహ కౌతూహలంబున.

టీక :-
శ్రౌత = వేదమునందు విధింపబడిన; కౌతూహలము = కోరిక.
భావము :-
ఈ విధంగా అలంకరించి గౌరిని హిమవంతుడేర్పాటు చేసిన కల్యాణశాల లోనికి తీసుకువచ్చారు. ఆపరమేశ్వరుడు తానున్న విడిదిలో వేదాలు యందు విధించిన పుణ్యాహవచనంబులు బ్రహ్మ చేత చేయించెను. వివాహమీది కుతూహలంతో.

3-169-ఉ.
పొందుగఁ బుష్ప మేఘములు పువ్వులవానలు జల్లుజల్లునన్
దుందుభి కాహళధ్వనులు తూర్యరవంబులతో గణాధిపుల్
సండిచేయ దేవతలు సంభ్రమతం జయవెట్ట బ్రహ్మ గో
వింపురందరుల్ గదిసి వేడ్క గెలంకుల యందుఁ గొల్వఁగన్.

టీక :-
పురందరుడు = ఇంద్రుడు.
భావము :-
గణనాయకులు పూలమేఘాలు పూలవాన జల్లుగా కురియుట, భేరి, దుందుభులు, బాకాలు మొదలైన వాయిద్యాలు వాయుంచుటలతో సందడి చక్కగా చేసారు, దేవతలు సంభ్రమంతో సందడిగా జయ జయ ధ్వానాలు చేసారు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు శివుని ప్రక్కనే యుండి సేవించారు.

3-170-చ.
చెలువ పులోమనందనయు శ్రీయు నరుంధతియున్ సరస్వతీ
నయుఁ బెక్కువస్తువులు లాలితవృత్తిఁ బసిండిపళ్లెరం
బునమరించి దేవ ముని పుణ్యవధూ జనకోటితోడఁ గ్రం
లుగొని పాడుచున్ నడువ న్యులు దిక్పతు లెల్లగొల్వఁగన్.

టీక :-
చెలువ = అందమైన స్త్రీ; పులోమనందన = శచీదేవి (ఇంద్రుని భార్య); శ్రీ = లక్ష్మీదేవి; వధూజనము = స్త్రీలు; క్రంత = పెండ్లి కొడుకువారు పెండ్లి కూతునకు తీసుకుపోయెడి ప్రధాన ద్రవ్యము.
భావము :-
అందమైన శచీదేవి, లక్ష్మీదేవి, అరుంధతి, సరస్వతీదేవి మొదలైనవారు బంగారు పళ్ళెములలో చాలా వివాహ సంభారాలను మనోజ్ఞమైన విధంగా అమర్చి దేవ, ముని పుణ్య స్త్రీలతో కలసి క్రంతలు తీసుకొని పాటలు పాడుతూ నడుస్తున్నారు. ధన్యులైన దిక్పతులు సేవిస్తున్నారు.

3-171-క.
వేదంబులు గీర్తింపఁగ
నాట సన్మునులు గొల్వ ర్షముతోడన్
దిగిరీంద్రుని యింటికి
వేదాంతవిదుండు శివుఁడు వేంచేసె నొగిన్.

టీక :-
ఆదట = తృప్తి; ఒగిన్ = క్రమముగా.
భావము :-
వేదములు తనివితీరా కీర్తిస్తున్నారు. మునులు ఆనందముతో సేవిస్తున్నారు. ఆ విదంగా హిమవంతుని యింటికి వేదాంతవేద్యుడైన పరమ శివుడు వచ్చెను.

3-172-ఆ.
వామదేవు వైభవంబుతోడనె వైభ
వంబు మెఱసి యప్పురంబు వెలసె
చందురుండు వొడమ నందంద ఘూర్ణిల్లు
పాలవెల్లిభంగిఁ బ్రజ్వరిల్లి.

టీక :-
ఘూర్ణిల్లు = కలగుపడు, పోటెత్తు; పాలవెల్లి = పాల సముద్రము.
భావము :-
(పున్నమి) చంద్రుడు ఉందయించడంతో పోటెత్తి ఎగిసిపడే పాల సముద్రంలా వామదేవుని వైభవముతో ఆ పురము వైభవంతో మెరిసింది.

3-173-వ.
అమ్మహాదేవుండు తుహినాచలమందిరంబుఁ బ్రవేశించి నందికేశ్వరుండు డిగ్గునవసరంబున నంతటసుందరీజనంబులు పసిండిపళ్లెరంబులతోడ మణి మరకత వజ్ర వైడూర్య పుష్యరాగ గోమేధిక నీలముక్తాఫలంబు లమరించి నివాళించి రంత.

టీక :-
ముక్తాఫలములు = ముత్యాలు; నివాళి = హారతి.
భావము :-
ఆ శివ మహాదేవుడు హిమవంతుని మందిరము ప్రవేశించి నంది వాహనం దిగగానే సుందరులు బంగారు పళ్ళెములలో మణి, మరకత, వజ్ర, వైఢూర్య, పుష్యరాగ, గోమేధిక, నీల, ముత్యముల (నవరత్నాల) హారతులిచ్చారు.

3-174-క.
దురుగ సేసలు చల్లుచుఁ
పడి సింహాసనంబు పైఁబరమేశున్
ముమార నునిచి దేవర
కమలము లద్రిరాజు క్తిం గడిగెన్.

టీక :-
సేసలు = అక్షతలు; పదపడి = తరువాత; అద్రి = కొండ.
భావము :-
ఎదురుగా అక్షతలు చల్లి పిమ్మట సింహాసనముపై సంతోషంగా కూర్చుండజేసి, ఆ శివదేవుని పదకమలములను కొండలరాజు హివంతుడు భక్తితో కడిగెను.

3-175-క.
మెయంగా మధుపర్కము
కంఠుని కిచ్చి వెనుక మనీయముగా
ఱిఁగట్ట నిచ్చి కన్యకు
ఱువుగఁ దెరవారఁ బంచె హితాత్మకుఁడై.

టీక :-
మధుపర్కము = పెండ్లిలో వధూవరులకిచ్చెడి వస్త్రము.
భావము :-
గొప్ప మనసు కలవాడై పర్వతరాజు నీలకంఠునికి మధుపర్కం ఇచ్చి కట్టుకోమన్నాడు. పిమ్మట గౌరీదేవికి మధుపర్కమిచ్చి. ఆమెను తెరచాటుకు తీసుకువెళ్ళి చక్కగా కట్టించి తెమ్మని పంపాడు.

3-176-వ.
ఇట్లు తెరవారం బంచిన.

టీక :-
పంచిన = పంపగా.
భావము :-
ఈ విధంగా తెరచాటుకు పంపగా.

3-177-క.
రుణాపాంగుఁడు శంభుఁడు
సుపతి కైదండఁ గొనుచు సురుచిరగతులన్
దెమ్రోల వచ్చి నిలిచెను
దెమీఁదను గోటిచంద్రదీప్తులు వాఱన్.

టీక :-
కైదండ= చేయూత ; సురుచిరము = మిక్కిలి రమణీయమైన; మ్రోల = ఎదురు.
భావము :-
దయామయుడు శంభుడు ఇంద్రుని చేయూతగొని, మిక్కిలి రమణీయంగా తెర ఎదురుగా నిలువగా తెరపై కోటి చంద్ర కాంతులు పరచుకొన్నవి.

3-178-క.
రువురు దమ రొండొరువుల
వదనాబ్జములు చూడ వాంఛితమతు లై
తెయెప్పుడు వాయునొ యని
రినువ్విళ్లూరి రపుడు తియుం బతియున్.

టీక :-
వదనాబ్జములు = ముఖపద్మములు; వాయు = వెళ్ళు.
భావము :-
సతీదేవి, శివప్రభువు యిద్దరూ తెర ఎప్పుడు ఎత్తుతారా, తాము ఒకరి ముఖము మరొకరు ఎప్పుడు చూసుకుంటామా అని మిక్కిలి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.