పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : పార్వతిశంకరుని నీలగళ కారణం బడుగుట.

3-200-వ.
అనిన వాయుదేవుం డిట్లనియె.
భావము :-
మునీశ్వరులు అలా అడుగగా, వాయుదేవుడు చెప్పసాగెను

3-201-సీ.
"లధౌతగిరిమీఁద గౌరీశుఁ డొకనాఁడు
పనీయమయశిలాలము నందుఁ
దొడలపైఁ దన కూర్మి తొయ్యలి నగజాత
నెక్కించుకొని గోష్ఠి నేర్పు మెఱసి
వేంచేసియున్నచో విశ్వేశు వదనార
విందంబు తెఱఁగొప్ప వెలఁది చూచి
"యోభూతనాయక! యోగోపతిధ్వజ!
కొమరారు నీ కంఠకోణమందు

3-201.1-ఆ.
నలతి నలుపు కప్పు నిలువఁ గారణ మేమి
నాకుఁ జెప్పు” మనిన వ్వి శివుఁడు
నితకోర్కెఁ దీర్పలయుఁబొమ్మని చెప్పెఁ
గొలువువారు వినఁగ మెలఁతతోడ.

టీక :-
కలధౌత = వెండి; తొయ్యలి = స్త్రీ; వెలది = స్త్రీ; అలతి = అల్పము; మెలత = స్త్రీ.
భావము :-
వెండి కొండపై పరమేశ్వరుడొకనాడు బంగారుమయమైన శిలాతలముపై తొడలపై హైమవతిని కూర్చోబెట్టుకొని కొలువుదీరి యుండగా గౌరీదేవి ఆ విశ్వేశ్వరుని ముఖారవిందమును తేఱిపార చూసి “ఓ భూతపతీ! ఓ నందివాహనా! అందమైన నీ కంఠము వంపులె కొంచం నలుపు ఉండడానికి కారణమేమి నాకు తెలియచేయండి.” అని అడుగగా శివుడు నవ్వి ఆమె కోరిక తీర్చడానికి చుట్టూ ఉన్నవారు కూడా వినేలా ఇలా చెప్పాడు.

3-202-వ.
నాఁ డేను పరమేశ్వరుకొలువున నున్నవాఁడఁ దన్నిమిత్తంబునఁ గొంత యెఱుంగుదు వినుండు విన్నవించెద" నని మఱియు "నమ్మహాదేవి మహాదేవున కిట్లనియె.

టీక :-
నిమిత్తము = కారణము.
భావము :-
ఆ రోజు నేను ఆ కొలువులో ఉండుటచే కొంత తెలుసును. వినండి. చెప్తాను.” అని మరల ఇలా చెప్పసాగాడు “ఆ మహాదేవి శివునితో ఇలా అన్నది.

3-203-శా.
కైలాసాచలవాస! నీవు ధవళాకారుండ వై యుండఁగాఁ
గాలాంభోధరదీప్తి మెచ్చక భుజంగభృంగసంకాశ మై
నీచ్ఛాయ యిదేమి భంగిఁ బొడమెన్ నీకంఠకోణంబునన్
వాలాయంబుగ నాకుఁ జెప్పుము కృపన్ వాగీశసంవూజితా!”

టీక :-
ధవళము = తెలుపు; అంబోధరము = మబ్బు; భృంగ = తుమ్మెద; సంకాశము = సమానము; వాలాయము = అవశ్యము; వాగీశుడు = బ్రహ్మదేవుడు.
భావము :-
“కైలాసాచలవాసా! శంకరా! నీవు తెల్లని వాడివై యుండగా కాలమేఘముల ఛాయను మించిన పాము,తుమ్మెదల ఛాయతో సమానమైన నల్లని మేఘమువంటి ఈ నీలపు మచ్చ కంఠాన ఏమిటో దయతో నాకు తప్పకుండా చెప్పుము.”

3-204-వ.
అనినఁ జంద్రశేఖరుం డిట్లనియె.
భావము :-
పార్వతీదేవి అడుగగా, శివుడు ఇలా అనెను.

3-205-మ.
పొలఁతీ! తొల్లి సురాసురేంద్రులు సుధాంభోరాశిలో మందరా
ముం గవ్వము చేసి వాసుకిని బెల్చంద్రాడుఁగాఁ దర్చఁ దా
లువన్ ఘోరవిషంబు పుట్ట నది హాహాయంచుఁ గంఠస్ధలిన్
నిలుపన్ లోకము నీలకంధరుఁ డనెన్ నీలాలకా! బాలికా!”

టీక :-
తర్చు = మథించు.
భావము :-
“నల్లని కురులు కలదానా! బాలికా! పార్వతీదేవి! పూర్వము దేవతలు, రాక్షసులు పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వముగా, వాసుకిని త్రాడుగా చేసి అలసిపోయేలా చిలుకగా ఘోరవిషము పుట్టగా నేను హా హా యంటూ కంఠంలో నిలుపగా లోకము నన్ను నీలకంఠుడు అన్నది.”

3-206-వ.
అని మఱియు “నీ ప్రకారంబు సవిస్తారంబుగా నెఱింగించెద విను” మని కాలకంధరుండిట్లనియె.

టీక :-
ప్రకారము = విధము; కాలకంథరుడు = శివుడు.
భావము :-
అని శివుడు ఇంకనూ ఈ విషయం మరింత వివరంగా చెప్తాను. విన” మని శివుడు ఇలా చెప్పాడు.

3-207-క.
“శైలారియుఁ బావకుఁడును
గాలుఁడు దనుజేశ్వరుండుఁ గంధులరాజున్
గాలియుఁ గిన్నరవిభుఁడును
శూలియును ననేక కోటి సురసంఘంబుల్.

టీక :-
శైలారి = (గోత్రభిత్తు= పర్వతముల ఱెక్కలు నరికినవాడు) ఇంద్రుడు; పావకుడు = అగ్ని; కాలుడు = యముడు; దనుజేశ్వరుడు = నిఋతి; కంధి = సముద్రము; కిన్నరేశుడు = కుబేరుడు; శూలి = ఈశానుడు.
భావము :-
“ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు, అనేకమంది దేవతా సమూహాలు.

3-208-వ.
తొల్లి మహాయాగంబున నప్రతిహత పరాక్రమ గర్వ దుర్వారులును;అనేక సకలభువనరాజ్యధురంధరులును; నిరంతరలక్ష్మీనివాసులు నై; యొక్కనాఁడు మేరుధరణీధరశిఖరంబునఁ గొలువున్న సమయంబున; లోకోపకారార్ధంబుగా నమృతంబు బడయవలయు నని విచారించి పాలవెల్లిఁ దరువం దలంచి యమృతశరధిశయనుం డగు భజంగశాయిపాలికిం జని వినతులై “మహాత్మా! మే మందఱము నొక్క ప్రయత్నంబు సేయ గమకించినారము; నీవు భూభార దక్షుండ వవధరింపు” మని విన్నవించిరి.

టీక :-
తొల్లి = పూర్వము; పాలవెల్లి = పాలసముద్రము; తర్చు = మధించు; అమృతశరధి = పాలసముద్రము; గమకించు = ఆయత్తమగు; అవధరింపుము = దయతో వినుము.
భావము :-
వీరంతా పూర్వము చేసిన ఒక మహా యాగములో పరాక్రమవంతులు, రాజ్యలక్ష్ములు, సంపదలు గలవారై, యొకనాడు మేరు పర్వత శిఖరముపై కొలువున్న సమయంలో లోకోపకారము కొరకు అమృతాన్ని సాధించాలనుకొని పాలసముద్రాన్ని చిలకాలని భావించారు. పాలసముద్రంలో శేషపానుపుపై నిద్రించే విష్ణువు వద్దకు వెళ్ళి ”మేము ఒక పని చేయ సమకట్టాము, నీవు భూభార దక్షుడవని నీకు చెప్పాలని వచ్చా” మని చెప్పారు.

3-209-క..
“అమృతంబుఁ బడయు వేడుక
మృతాబ్ధి మధింపఁ దలఁచి రుదెంచితి మో
మృతాబ్ధిశయన! నీవును
ముఁబనిగొనవలయు నయ్య! న్ననతోడన్.”

టీక :-
అమృతము = సుధ; అమృతము = పాలు; అబ్ధి = సముద్రము.
భావము :-
“అమృతాన్ని సంపాదించాలనుకున్నాం. దానికొరకు పాలసముద్రాన్ని చిలకాలనుకున్నాము. ఓ పాలకడలి శయనా అందుకే వచ్చాము. మన్నించి నీవు కూడా పూనుకోవాలి“.

3-210-వ.
అని యివ్విధంబున దేవతలు పలుకఁ గమలామనోనాథుండు వారిపై దయాపూరిత చిత్తుండైయిట్లనియె.
భావము :-
అని ఈ విధముగా దేవతలు పలుకగా నారాయణుడు వారియందు దయకలిగిన మనసుతో ఇలా అన్నాడు.

3-211-సీ.
"సురలార! మీకు భాసురలీల నమృతంబు
దొరకు నుపాయంబు సరవి వినుఁడు
రమర్ధి దనుజులఁ పటంపుసంధిగాఁ
జేసి వారును మీరు చెలువుతోడ
మందరాచలము సంభ్రమముతోఁ గొని వచ్చి
వ్వంబుగాఁజేసి డిమిమీఱఁ
దాలిమితో శేషుఁ రి త్రాడుగాఁ జుట్టి
రసత్వమునఁజాల లధిఁ దరువఁ

3-211.1-ఆ.
లిగినట్టితాల్మి లిగిన మీకెల్ల
మృతమబ్బు వేగ ర్ధిదాని
లన ముదిమి చావు లుగదునేవింపఁ
గాన వేగఁ జేయడఁగుఁ డింక.”

టీక :-
భాసుర = ప్రకాశించనది; సరవి = క్రమముగా; కరమర్ధి = కరము + అర్థిన్, మిక్కిలిగా కోరి; దనుజులు = రాక్షసులు; చెలువు = అమరిక; సంభ్రమము = వేగము; కడిమి = పరాక్రమము; తాలిమి = ఓర్పు; తరి = మథనము; సరసత్వము = పద్దతి; తాల్మి = సహనము; కడగు = యత్నించు.
భావము :-
దేవతలారా! మీకు గొప్పదైన ఆ అమృతం దొరికే ఉపాయం విధము చెప్తాను. వినండి. మీరు రాక్షసులతో కపటపు సంధి చేసుకోండి. వారూ, మీరూ కలసి అమరికగా మందరపర్వతాన్ని వేగముగా తీసుకువచ్చి కవ్వముగా చేసి పరాక్రమముతో ఓర్పుతో శేషుని (మందర పర్వతం చుట్టూ) చిలికే తాడుగా చుట్టి సముద్రాన్ని చాలా పద్ధతిగా మధించాలి. దానికి చాలా ఓర్పుగా ఉండాలి. అప్పుడు మీరు కోరుకున్న అమృతం లభిస్తుంది. దాని వలన జరామరణములు సంభవింపవు. కావున వేగముగా ప్రయత్నము మొదలుపెట్టండి.”

3-212-వ.
అని బుద్ధికరపిన వారలు నిజనివాసంబులకుఁ జనుదెంచి యా రాత్రి సుఖంబుండి మఱునాఁడు సురేంద్రుండు సకల దివ్యులు దన్నుఁ బరివేష్టించి యుండఁ జింతామణి దివ్వ సింహాసనంబుననుండి తత్సమయంబున వాచస్పతిం గనుంగొని యిట్లనియె.

టీక :-
వాచస్పతి = బృహస్పతి.
భావము :-
అని విష్ణువు బుద్ధి చెప్పగా దేవతలు ఆ రాత్రి సుఖముగా యున్నారు. మరునాడు ఇంద్రుడు దివ్యమైన సింహాసంమీద ఆసీనుడై ఉన్నాడు. సకలదేవతలూ చుట్టూ కొలువై యున్నారు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతితో ఇలా అన్నాడు.

3-213-క.
“హరియానతిచ్చె నమృతము
దొకు నుపాయంబుఁ గడిమితోఁజని రాత్రిం
వరులఁ బొందుపఱపుచు
నివుగఁ గొనిరండు మీర లిప్పుడు వారిన్.”

టీక :-
కడిమి = అతిశయము; రాత్రించరులు = రాత్రి సంచరించేవారైన రాక్షసులు; పొందుపరచు = అనుకూలపరచు; ఇరవు = స్నేహము.
భావము :-
“హరి అమృతము దొరికే ఉపాయము సెలవిచ్చాడు. దానవుల వద్దకు వెళ్ళి మిక్కిలిగా సానుకూలపరచి, పొత్తుగా వారిని తీసుకురండి.:”

3-214-వ.
అని పలికిన నగుంగాక యని సురగురుండు దైత్యులపాలికిం జని హరివచనంబుల వినిపించి వారలం దోడ్కొని వచ్చిన; దేవనాథుండు వూర్వదేవతాసహితుండై మధుసూదనుండు తోడరా మందరనగేంద్రంబుకడకుం జని యమ్మహాశైలంబుఁ బెకలించి మూపులం దాల్చి సంభ్రమాయత్తచిత్తులై పవన వేగంబునఁ జనుచుండఁ బాద ఘట్టనంబులం గులపర్వతంబులు కందుకంబులం బోలి తూలియాడుచున్న సమయంబున.

టీక :-
దైత్యులు = రాక్షసులు; పూర్వదేవతలు = దైత్యులు; మధుసూదనుడు = విష్ణువు; మూపు = భుజశిరము; కందుకము = ఆడెడు చెండు (బంతి).
భావము :-
అని దేవేంద్రుడు పలుకగా సరే యని బృహస్పతి దానవుల వద్దకు వెళ్ళి విష్ణువు మాటలు వారికి చెప్పి వారిని తీసుకు వచ్చాడు. ఇంద్రుడు దేవతలు, రాక్షసులతో కలసి విష్ణువు తోడురాగా మందర పర్వతము వద్దకు వెళ్ళి దానిని పెకలించి భజాలపై పెట్టుకొని వాయువేగముతో వెళ్తుండగా వారి పాదముల తాకిడికి కులపర్వతములు బంతుల్లా తూలిపోతున్నాయి. ఆ సమయమున.

3-215-శా.
జంభారాతి దిగీశులున్ దనుజులున్ శైలంబుమూలంబులన్
శుంల్లీలల మ్రోవలేమిఁ గని దా నూఁదెన్ భుజాగ్రంబునన్
అంభోజాక్షుఁడు పట్టి వైచెఁ జలనంబైకుంభనాదంబుతో
నంభోరాశిజలంబు మిన్నడువ నయ్యంభోధి నుజ్జృంభుఁడై.

టీక :-
జంభారాతి = ఇంద్రుడు; దిగీశులు = దిక్పతులు; శుంభత్ = ప్రకాశించే; ఉజ్జృంభణ = పెరుగుట.
భావము :-
ఇంద్రుడు, దిక్పతులు, దానవులు పర్వతమూలమును సరిగా మోయలేకపోవడం చూసి, విష్ణుమూర్తి తాను తన భుజాలపై తెచ్చి పాలసముద్రంలో పడవేసెను. సముద్ర జలాలు కదలి సముద్రము పెద్ద శబ్దంతో ఉప్పొంగి ఆకాశాన్నంది.

3-216-వ.
“ఉపేంద్రా! యేప్రకారంబున మహార్ణవంబు డగ్గరి తరవ వచ్చు దీనికిం జేరును, గుదురును, గవ్వంబును నేమి గావలయు నానతిచ్చి రక్షింపు” మని పలికిన నయ్యిందిరావల్లభుండిట్లనియె.

టీక :-
ఉపేంద్రుడు = విష్ణువు; మహార్ణవము = మహా సముద్రము; డగ్గరి = దగ్గర; చేరు = చిలుకుతాడు; కుదురు = ఆధారముగా క్రింద నుండునది.
భావము :-
“విష్ణుమూర్తీ! ఈ మహాసముద్రాన్ని ఏవిధంగా మధించవచ్చు? దీనికి తాడు, ఆధారము, కవ్వము ఏమేమి కావాలో తెలిపి రక్షించు.” అనగా ఆ ఇందిరావల్లభుడు ఇలా అన్నాడు.

3-217-చ.
గొకొని మీకు నంబుధికిఁ గుంభినికిం గుదురై వసించెదన్
తర మందరాచలముఁ వ్వము చేసెద నెత్తి తెచ్చెదన్
నిధిలోన నిల్పెదను వాసుకిఁ జేరుగఁ జేసి తెచ్చెదన్
వినుఁడమృతంబు గాంచెదను వేలుపులార! భవత్సహాయినై.

టీక :-
గొనకొను = యత్నించు; అంబుధి = సముద్రము; కుంభిని = భూమి; కుదురు = ఆధారము; వననిధి = సముద్రము; చేఱు = తాడు; భవత్ = మీరు (మీకు).
భావము :-
“దేవతలారా! పూని మీకు సహాయంగా ఉంటాను. సముద్రానికీ కొండకూ కుదురు అయి నిలుస్తాను. గొప్పదైన మందర పర్వతాన్ని ఎత్తి తెచ్చి కవ్వముగా చేస్తాను. సముద్రంలో నిలబెడతాను. వాసుకిని తాడుగా చేసి తీస్తాను.