పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : క్షీరసాగరమథనము

3-218-వ.
అని పలికి మఱియు నమ్మహాత్ముండు దేవేంద్ర దండధర వరుణ కుబేర ప్రముఖు లగుదిక్పాలకులును; దనుజ భుజంగ కిన్నర కింపురుష గరుడ గంధర్వ నాయక సమూహంబులును; నపరిమిత భుజబల పరాక్రమవంతులును; ననేక దేవజనంబులును; నుద్దండ సాహసులును శరధిమథనసాహసులై తన్నుఁ బరివేష్టించి కొలిచి నడువం జనుదెంచి యల్లకల్లోలమాలికారావ నిరంతరబధిరీభూత దిగంతరాళంబును; మకర కమఠ కర్కటక మండూక తిమి తిమింగలాది జలచరావాసంబును; క్రౌంచ కాదంబ కారండవ కర్కశ సారస చక్రవాకాది విహంగ నివాసంబును; అకాల కుసుమ ఫల భరిత నానా తరులతా విరాజిత వేలాయుతంబును; సనక సనందనాది మునీంద్ర సంచారణంబును; ననంత గంభీరంబును; నఖిల రత్న సముదయ జనదేశంబును; జలజనయనశయనస్ధానంబును; నమృతజలమయంబునునై వైకుంఠపుర సమీపంబున నొప్పుచున్న క్షీరార్ణవంబుఁ బొడగని డాయ నేతెంచిరి సంభ్రమంబున.

టీక :-
అల్లకల్లోలము = అలజడి; అల్ల = ప్రసిద్ధమైన; కల్లోలము = పెద్ద అలలు కలది; బధిరి = చెవిటి; దిగంతరాళము = ఎల్లదిక్కులకూ నడిమి చోటు; మకరము = మొసలి; కమఠము = తాబేలు; కర్కటకము = ఎండ్రకాయ; మండూకము = కప్ప; తిమి = నూరు యోజనములు పొడవు గల చేప; తిమింగిలము = తిమిని మింగెడు చేప; క్రౌంచ = కొంగ; కాదంబ = హంస; కారండవ = కన్నెలేడి అనే పక్షి; సారస = బెగ్గురు పక్షి; వేల = సముద్రపు ఒడ్డు.
భావము :-
అని పలికి ఆ విష్ణువు దేవేంద్ర యమ వరుణ కుబేర మొదలైన ప్రముఖులైన దిక్పాలకులును, రాక్షస సర్ప కిన్నెర కింపురుష గరుడ గంధర్వ నాయక సమూహములును, పెక్కు భుజబల పరాక్రమవంతులును, అనేకమంది దేవతలును, సాహసులును, సముద్ర మథనానికై తన చుట్టూచేరి కొలుస్తూ నడుస్తుండగా వెళ్ళి బాగా పెద్ద అలలహోరుతో ప్రతిధ్వనించే దిక్కుల మధ్యభాగమును, మొసలి తాబేలు ఎండ్రకాయ కప్ప తిమి తిమింగలము వంటి నీటిజంతువుల నివాసమునూ,, కొంగ హంస కారండవ కర్కశ సారస చక్రవాకము మొదలైన నీటిపక్షుల నివాసస్థానమును, ఎల్లప్పుడూ ఫలములతో నిండియుండే రకరకాలైన చెట్లు లతలతో విరాజిల్లే సముద్ర తీరమును, సనక సనందాది మునీంద్రుల సంచారము కలదియును, చాలా గంభీరముగా యుండి రత్నములు పుట్టు స్థానమును, విష్ణుమూర్తి నిద్రించే ప్రదేశమును, అమృత జలమయమును ఐన వైకుంఠము వద్ద గల పాలసముద్రాన్ని చూసి దగ్గరగా వెళ్ళారు.

3-219-శా.
అంభోజప్రభవాండముల్ దిరిగిపాదైక్రుంగిఘూర్ణిల్లఁ బ్రా
రంభంబొప్పఁగ మందరాద్రినెఱెవారన్వీఁక మైనెత్తి య
య్యంభోజాక్షుఁడు పట్టి వైచె చలితంబైకుంభనాదంబుతో
నంభోరాశియు భూమియున్ నడల నయ్యంభోధి నుజ్జృంభుఁ డై.

టీక :-
అంభోజాండములు = బ్రహ్మాండములు; పాదు = క్రిందు; ఘూర్ణిల్లు = తిరుగుడు పడు; నెఱె = పగులు; వీక = పరాక్రమము; అడలు = భయపడు.
భావము :-
సాగరమథన ప్రారంభంగా, విష్ణువు విజృంభించి మందర పర్వతాన్ని తన పరాక్రమంతో పైకెత్తి పాలసముద్రంలో పడవేసాడు.. భూమి, సముద్రము పెద్దధ్వని కుంభనాదము చేస్తూ కంపించాయి. బ్రహ్మాండములు తలక్రిందై తిరుగుడుపడ్డాయి.

3-220-వ.
ఇవ్విధంబున ననంత సుందరం బగు మహార్ణవ మధ్యంబున మందరగిరి కవ్వం బై తిరుగ నియమించి ధరణీధరము నడుగు వలయంబునకుఁ గమఠపతిఁ గుదురుగా నియమించి వాసుకి మహానాగంబును దరువంజేరుఁ గావించి పంచబాణజనకుండు సురాసురుల నవలోకించి యిట్లనియె.

టీక :-
మహార్ణవము = మహా సముద్రము; కమఠపతి = కూర్మావతారుడు; తరచుచేఱు = చిలుకుతాడు; పంచబాణజనకుడు = విష్ణువు; అవలోకించి = చూసి.
భావము :-
శ్రీమహావిష్ణువు ఈ విధంగా బాగాఅందమైన పాలకడలి మధ్యలో మందరగిరి కవ్వముగా తిరిగేలా చేసి; సముద్రపు అడుగున మందరపర్వతము క్రింద కూర్మావతారుని కుదురుగా నియమించి; నాగరాజు వాసుకిని చిలుకుతాడుగా చేసి; దేవతలతోను రాక్షసులతోను ఇలా అన్నాడు.

3-221-చ.
లువురు గూడి మీర లతి బాహుబలాఢ్యుల మంచు నెప్పుడున్
యుచుఁ బోరుచుండుదురు మందరశైలముఁ ద్రిప్పి మీ భుజా
ములు నేఁడు చూపుఁ డని పంచిన వాసుకిఁ జేరి దానవుల్
యును దోఁక నిర్జరులు ద్దయు నుగ్రతఁ బట్టి రత్తఱిన్.

టీక :-
పలువురు = పెక్కుమంది; మలయు = ఉద్రేకించు; పంచిన = పంపగా; అత్తఱిన్ = ఆసమయంలో.
భావము :-
మీరందరూ మహాబాహుబలులమంటూ ఎప్పుడూ ఉద్రేకముగా పోరాడుతుంటారు కదా! మందర పర్వతాన్ని తిప్పి మీ భుజబలాలు నేడు చూపండి అని విష్ణుమూర్తి నియమించాడు. అప్పుడు వాసుకిని చేరి రాక్షసులు తలను దేవతలు తోకను పట్టుకొని తీవ్రంగా పాలసముద్రాన్ని మథించసాగారు,

3-222-వ.
ఇవ్విధంబున.

టీక :-
ఇవ్విధంబున = ఈ విధానము వలన.
భావము :-
ఈ విధంగా మథించుతుండుట వలన

3-223-మ.
గేంద్రుండు విషంబుఁ గ్రక్క భరమై యొండొండ ఘూర్ణిల్లుచున్
ణీచక్రము దిర్దిరం దిరుగ భూవ్రాతముల్ భీతిలన్
బొరినంభోనిధి గుబ్బుగుబ్బు రనుచున్ బోర్కల్గదేవాసురుల్
శౌర్యోన్నతిఁ బేర్పి దర్చిరి సుధాల్లోలినీ వల్లభున్.

టీక :-
భరము = భారము; ఒండొండ = క్రమక్రమముగా; ఘూర్ణిల్లు = కదలు; దిర్దిరతిరుగు = పరిభ్రమించు; వ్రాతము = సమూహము; పొరి = మాటిమాటికి; పోర్కాడించు = నీళ్ళుజల్లు.
భావము :-
దేవాసురులు తమ బాహుబలాతిశయాన్ని చూపి పాల సముద్రాన్ని చిలికుతున్నారు. ఆ శ్రమభారానికి తిరుగుడులు పడుతున్నారు. వాసుకి విషం కక్కుతున్నాడు. భూమండలం గిరగిరా తిరుగిపోతోంది. ప్రాణి సమూహాలు భయపడుతున్నవి. మాటిమాటికి సముద్రం గుబ్బుగుబ్బుమని తుళ్ళుతోంది.