పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : దేవతలక్షేమంబు నీశ్వరుండడగుట

3-91-వ.
ఇట్లు గౌరీకళ్యాణవిలోకనకాంక్షులై సకలమైన వారును కలధౌతధరణిశిఖరంబుఁ బ్రవేశించి పరమేశ్వరుం గాంచి వినతులై వినుతించుచున్న సమయంబున వారలఁ గరుణతోడం గనుంగొని యమ్మహేశ్వరుం డిట్లనియె.

టీక :-
విలోకనము = చూచుట; కలధౌత తరణి శిఖరము = కైలాసము.
భావము :-
ఈ విధంగా గౌరీ కళ్యాణము చూడాలనే కోరికతో అందరూ కైలాసమునకు విచ్చేసి పరమేశ్వరుని చూసి వినయంగా నమస్కరించే సమయములో వారిని కరుణతో చూసి ఆ మహేశ్వరుడు ఇలా అన్నాడు.

3-92-మ.
లితానందమె? పాకశానన! మనోల్లాసంబె? సప్తార్చి! మం
మే? భానుజ! లెస్సలే? దనుజ! సౌఖ్యంబే? జలాధీశ! సం
మే? మారుతి! మోదమే? ధనద! విశ్రామంబె? యీశాన! శ్రీ
పొలుపే? మాధవ! యంచు నేమ మరసెన్ భూతేశుఁ డింద్రాదులన్.

టీక :-
పాకశాసన = పాక అనే రాక్షసుడిని శాసించువాడైన ఇంద్రుడు; సప్తార్చి = ఏడు జ్వాలలు కలవాడు, అగ్నిదేవుడు; భానుజుడు = సూర్యపుత్రుడైన యముడు; జలాధీశుడు = వరుణదేవుడు; మారుతి = వాయుదేవుడు; ధనదుడు = కుబేరుడు; శ్రీ = లక్ష్మీదేవి; మాధవుడు = విష్ణుమూర్తి; పొలుపు = ఒప్పు, సంతోషము; .
భావము :-
దేవేంద్రా! ఆనందంగా ఉన్నావా? అగ్నిదేవుడా! ఆహ్లాదమేనా? యమధర్మరాజా! శుభమేనా? నిరృతీ! సుఖమేనా? వరుణదేవుడా! జలములతో నిండి యున్నావా? వాయుదేవా! ముదమేనా? కుబేరా! విశ్రాంతిగా యున్నావా? ఈశానా! కుశలమా? విష్ణుమూర్తీ! లక్ష్మితో సంతోషంగా ఉన్నావా? అంటూ భూతేశుడైన పరమశివుడు ఇంద్రాదుల క్షేమములు విచారించాడు.

3-93-వ.
ఇట్లడిగిన నంత నమ్మహదేవునకు దేవత లిట్లనిరి.

టీక :-
మహాదేవుడు = శివుడు.
భావము :-
ఇలా అడిగిన పరమేశవరునితో దేవతలిలా అన్నారు.

3-94-క.
ణార్ధి భక్తవత్సల!
ణార్ధి పురాణయోగినమందారా!
ణార్ధి దురిత సంహర!
ణార్ధి మహేశ! రుద్ర! లజాక్షనుతా!

టీక :-
శరణార్థి = శరణు కోరినవాడు; మందార = కల్పవృక్షము; దురితములు = పాపములు, కలతలు; జలజాక్షుడు = విష్ణువు.
భావము :-
భక్తుల యందు వాత్సల్యం కలవాడా! ప్రాచీనకాలంనుండీ యోగులకు కల్పవృక్షము వంటివాడా! శరణుకోరినవారి పాపములను, కలతలను పోగొట్టేవాడా! మహేశా! రుద్రా! శివా! విష్ణువుచే ప్రస్తుతించబడువాడా!

3-95-క.
దేవా!మీ కృప గలుగఁగ
భావింపఁగ మాకు నెపుడు ద్రము సుమ్మీ!
దేవేశ! మిమ్ముఁ గంటిమి
కావున ధన్యులమఁ గామె గంగాధిపతీ!

టీక :-
భద్రము = క్షేమము.
భావము :-
దేవా! దేవేశా! గంగాధిపతీ! ఈశ్వరుడా! మీ దయ యుండగా మాకెప్పుడూ కుశలమే సుమా! మిమ్మల్ని చూసాము. కనుక మేము ధన్యుల మయ్యామయ్యా!

3-96-వ.
అని మఱియు బహుప్రకారంబుల వినుతింప నద్దేవ సమూహంబుల ముందఱ నిల్చి విరించి యిట్లనియె.

టీక :-
విరించి = బ్రహ్మదేవుడు.
భావము :-
ఇలా అంటూ రక రకాలుగా పొగుడుచుండగా ఆ దేవ సమూహముల ముందరకు వచ్చి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు.

3-97-మ.
నింపం గడు లెస్స నేఁడు శుభలగ్నంబెల్లి బృందారకుల్
లాక్షాదులు వచ్చినారు తడయంగానేల వేంచేయుఁ డీ
హిశైలేంద్రుని వీటినుండి వినయం బేపార నిచ్చోటికిన్
ణన్ లేఖలు వచ్చెఁ బెండ్లికి మిమున్ మ్మంచు సర్వేశ్వరా!

టీక :-
బృందారకుడు = వేలుపు; కమలాక్షుడు = విష్ణువు; వీడు = పురము; ఏపారు = అతిశయించు; రమణ = ఒప్పిదము.
భావము :-
“పరమేశ్వరా! విచారించగా నేడే శుభలగ్నం. చాలా బాగుంది. విష్ణుమూర్తీ మొదలగు దేవతలందరూ వచ్చేసారు. ఇక ఆలస్యమెందుకు బయలుదేరండి. హిమవవంతుని నగరం నుండి మిమ్మల్ని రమ్మంటూ శుభలేఖలు కూడా వచ్చాయి.”

3-98-వ.
అని విన్నవించిన విరించి వచనంబులకుఁ బంచాననుండు రంజిల్లి లౌకికాచారంబు విచారించి తన మనంబున.

టీక :-
పంచాననుడు = ఐదు ముఖములు కలవాడైన శివుడు; లౌకికాచారము = లోకములో ఆచరణలో యున్న ఆచారము.
భావము :-
అని విన్నవించిన బ్రహ్మదేవుని మాటలకు శివుడు సంతోషించి లౌకికాచారము తెలిసి తన మనస్సులో.....

3-99-ఆ.
గౌరి తాన పోయి లయంగ నిటమీఁద
భువన మెల్ల శైలపుత్రి యనఁగ
వతితల్లి యనుచు జాలి బొందెడు నని
ప్రీతి నేకదంతుఁ బిల్వఁ బంచె.

టీక :-
ఏకదంతుడు = వినాయకుడు.
భావము :-
(గణపతి ప్రథమ కల్పంలో జన్మించాడు. అప్పుడూ అమ్మవారి కొడుకే. ఆ తరువాత చాలా మన్వంతరాలు గడచిన తర్వాతది ఈ ఘట్టం.)
తాను వెళ్ళి కలిసే గౌరిని ఇకమీదట శైలపుత్రి అని అందరూ పిలుస్తారు. అపుడు సవతి తల్లి అనుకుంటూ గణపతి జాలి పొందుతాడేమోనని ప్రీతితో గణపతిని పిలిపించాడు.