పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : దక్షుఁడు దాక్షాయణిం దిరస్కరించుట

1-131-ఆ.
ట్టివిధము చూచి యాత్మలోఁ గోపంబు
పుట్టుటయును ధీరబుద్ధి నద్రి
న్యయైన మేటి గావున సైరించి
సామవృత్తి నాదిభామ పలికె.

టీక :-
ఆత్మ = మనస్సు ; ధీరబుద్ధి = గాంభీర్యము, మనోధైర్యము; అద్రికన్య= పర్వతపుత్రి, పార్వతీదేవి; మేటి = అధికురాలు; సైరించు = సహించు, మన్నించు; సామమువృత్తి = సామదానభేదదండోపాయాలు అను చతురోపాయములలో నగునది, సామరస్యముగా చెప్పుట; ఆదిభామ= పురాతనమహిళ, పార్వతీదేవి.
భావము :-
దక్షుడు చేసిన పనికి పార్వతికి మనస్సులో కోపం వచ్చింది. కానీ పర్వత పుత్రిగా ఆ గొప్ప ధీరత గలామె కావున, సౌమ్యంగా ఇలా అన్నది.

1-132-శా.
"తండ్రీ! నీ దగు నోము చూడఁ దగమా? ర్కింప నా పిన్న చె
ల్లెండ్రంబిల్చియు నన్ను జీరవు; మదీయాధీశు నీ యున్న య
ల్లుండ్రంబిల్చియుఁ బిల్వరావు; యిలవేల్పుల్ గర్తలే? పూజనల్
వీండ్రంజేసిన నేమి గల్గు? చెపుమా విశ్వేశ్వరుం డుండఁగన్.

టీక :-
తర్కించు=విచారించు; చీరుట= పిలుచుట ; మదీయ = నాయొక్క; అధీశు = స్వామి (భర్త); ఇలవేల్పులు= కులదేవతలు; కర్త = బ్రహ్మ; వీండ్రు= వీరు.
భావము :-
“తండ్రీ! నీ యజ్ఞము చూడదగినవారము కాదా మేము? నా చెల్లెళ్ళను పిలిచావు. నన్ను పిలువలేదు. నా భర్తను తప్ప మిగిలిన అల్లుళ్ళందరినీ పిలిచావు. ఈదేవతలు పరబ్రహ్మలా? విశ్వేశ్వరుడు లేకుండా వీరిని పూజించిన ఏమి ఫలము చెఫ్పు?

1-133-శా.
దేవేంద్రాది దిగీశ సంఘములకున్ దివ్యప్రభాలక్ష్ములే
దేవుం డిచ్చె ధరాధరుం డజరుఁ డేదేవుండు శేషాహి కా
దేవుం డిచ్చె నగణ్యదక్షత జగద్దేవేశుఁ డెవ్వాఁడు త
ద్దేవుం డిచ్చకు నేఁడు రావలవదే థీయుక్తిఁ జింతింపుమా.

టీక :-
సంఘములు = సమూహములు; దిగీశులు = దిక్పాలకులు; ప్రభ = వెలుగు; లక్ష్మి= ఐశ్వర్యము; ధరాధరుడు= ఆదిశేషుడు; అజరుడు = దేవుడు; శేషాహి = ఆదిశేషుడు; అగణ్య= లెక్కింపరాని; దక్షత = నేర్పు; తత్ = కారణమైన(ఆయొక్క); ఇచ్చ = స్వేచ్ఛగా; ధీయుక్తి = బుద్ధితో; చింతించుట = ఆలోచించుట.
భావము :-
దేవేంద్రుడు, దిక్కులు మొదలైన వారికి ఐశ్వర్యాన్ని ఇచ్చినవాడు, నాశనంలేనివాడు, లోక సంరక్షకుడు, ఆదిశేషునకు తన కార్యనిర్వహణలో సామర్ధ్యాన్ని ఇచ్చినవాడు ఎవరు? జగదీశ్వరుడు ఎవరు? ఆదేవుడు కదా ఇక్కడకు రావలసినవాడు. కొంచం బుధ్ధి నుపయోగించి ఆలోచించు.

1-134-క.
ఏ దేవు కతన విష్ణుం
డేదేవుని కతన బ్రహ్మ యీడేరిరి; తా
మే దేవుఁ గూర్చి బ్రతికిరి;
యాదేవుఁడు రాక వీరి రుగం దగవే?"

టీక :-
కతన = కారణము; ఈడేరు =వర్ధిల్లు; అరుగు =పోవు; తగవు = న్యాయము.
భావము :-
ఏదేవుని కారణంగా విష్ణు,బ్రహ్మలు వర్ధిల్లారు? వారు ఏ దేవుని గూర్చి బ్రతికారు? అలాంటి పరమేశ్వరుడు రాకుండా వీరు రావచ్చా?” అని పార్వతి అడిగింది.

1-135-క.
వుడు దక్షుం డదరుచుఁ
లుచుఁ గోపించి చూచి "మలదళాక్షీ!
వినునీకంటెను నెక్కుడు
నిశము నీ యున్న కూఁతు లందఱు గౌరీ!

టీక :-
అనవుడు = అనగా; అదరు =వణుకు, కంపించు; కనలు = మండిపడు; అనిశము = ఎల్లప్పుడూ.
భావము :-
ఆమాటలకు దక్షుడు అదిరిపడ్డాడు. కోపంతో మండిపడుతూ పార్వతిని చూసి ”అయితే, విను. గౌరీ! నీకన్నా నాకు మిగిలిన కుమార్తెలే ఎక్కువ.

1-136-త.
గ నీ తనయాధినాథులు భాగ్యవంతులు, శ్రీయుతుల్,
రుసఁ దల్లియుఁ దండ్రియుం గలవారు, నిత్యమహావ్రతుల్;
ణిలోఁ గులగోత్రవంతులు ద్ఙ్ఞు లెందుఁ దలంపఁగన్;
రుణి యిన్నియు నేల నీ పతి ల్లిదండ్రులఁ జెప్పుమా?

టీక :-
పరగన్ = ఒప్పుగా; తనయ = కుమార్తె; అధినాథులు = భర్తలు; భాగ్యము = అదృష్టము; శ్రీయుతులు = ఐశ్వర్యవంతులు; నిత్యము = ప్రతిదినము; మహా = గొప్ప; వ్రతులు= నోములు చేసేవారు; ధరణి = భూమి; తదజ్ఞులు = జ్ఞానులు; తలచుట = ఆలోచించుట; తరుణి = స్త్రీ.
భావము :-
చక్కగా ఈ నా కూతుళ్ళ భర్తలు అదృష్టవంతులు, ధనవంతులు. తేజోవంతులు. తల్లిదండ్రులు కలవారు. రోజూ గొప్పవ్రతాలు చేసేవారు. కులగోత్రములు కలవారు. జ్ఞానులు. ఇవన్నీ అనవసరం. నీ భర్త యొక్క తల్లిదండ్రులెవరో చెప్పు చాలు.

1-137-సీ.
ట్టంగ దిక్కులే కాని కోకలు లేవు;
తిరుగు జోగిఁ దగునె దేవుఁ డనగ?
కాలకూటమె కాని కంఠమాలిక లేదు;
ణి గాని తొడుగంగ ణులు లేవు;
లినాకసమె కాని లవెండ్రుకలు లేవు;
తలకుఁ బువ్వులు లేవు నెలయ కాని;
కుడువ గంచము లేదు వెడద పున్కయ కాని;
యొక్క గుఱ్ఱము లేదు యెద్దు గాని;

1-137.1-ఆ.
మూడుమూర్తు లందు మొగి నెవ్వడును గాఁడు;
జాతిలేదు పుట్టుజాడ లేదు;
పరముఁ డొంటిగాఁడు; బ్రహ్మాదు లెఱుఁగరు;
తిరుగు జోగిఁ దగునె దేవుఁ డనగ?

టీక :-
కోక = వస్త్రము (బట్ట); భూతి = బూడిద; కాలకూటము = విషము; ఫణి = పాము; నలిన్ =సన్ననిది; ఆకసము = ఆకాశం; నెల = చంద్రుడు; కుడుచు = తిను; వెడద = విశాలమైన; పున్క = పుఱ్ఱె; మూడుమూర్తులు = బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు; మొగి = సమూహము; జాడ = ఆనవాలు (గుర్తు); పరము = కేవలము; ఎఱుఁగరు = తెలుసుకోలేరు; జోగి = సన్యాసి.
భావము :-
నీ భర్త కట్టుకోవడానికి దిక్కులు తప్ప వస్త్రములు లేవు. పూసుకోవడానికి బూడిద తప్ప గంధము లేదు. కంఠానికి ఆభరణంగా విషపు గుర్తే తప్ప హారము లేదు. తొడగడానికి పాములే తప్ప మణులు లేవు. తలపైన పల్చటి ఆకాశం తప్ప వెంట్రుకలు లేవు. తలపై అలంకరణకు నెలవంకే కాని పువ్వులు లేవు. తినడానికి కపాలమే తప్ప కంచము లేదు. ఎక్కడానికి ఎద్దు తప్ప గుఱ్ఱము లేదు. నీ భర్త త్రిమూర్తులలో ఏ ఒక్కడూ కాదు. జాతి లేదు. ఎప్పుడు పుట్టాడో తెలియదు. కేవలము ఒంటరి. తిరుగుబోతు. నీభర్త గురించి బ్రహ్మాదులకు కూడా తెలియదు. అతనా దేవుడంటే?

1-138-ఉ.
లోములోన లేఁడు; నృపలోకములోనన లేఁడు; కుండలి
ళ్లోములోన లేఁడు; మునిలోకములోనన లేఁడు; దేవతా
లోములోన లేఁడు; సురలోకములోనన లేఁడు; వెఱ్ఱిము
ప్పోలఁ బోవు టే నెఱిఁగి పూజలు సేయఁగ నెంతవాఁడొకో?

టీక :-
లోకము = జగము; నృ = మానవుడు; నృపుడు = రాజు; కుండలిని = పాము; సురులు = దేవతలు; ముప్పోకలు = సత్వ, రజ, తమోగుణములు; ఎఱిఁగి = తెలిసి.
భావము :-
మర్త్యలోకము కాదు. నాగలోకము కాదు. ఋషిలోకము కాదు.దేవతాలోకము కాదు. తక్కిన సురలోకాలూ కాదు. ఏలోకమునకు చెందినవాడూ కాదు. మూడులోకాలలోనూ తిరుగుతూ ఉండే వెఱ్ఱివాడు.పూజలు చేయడానికి ఎంతటివాడని?

1-139-క.
తా నెక్కడ? నే నెక్కడ?
తానాకుం దలప సరియె? నుఁ గొలువంగా
నే నాఁడు వచ్చి నిలిచిన
తానాకుఁ బ్రియంబు సేయఁ లఁచెనె చెపుమా?

టీక :-
ప్రియంబు = బంధుత్వము.
భావము :-
కావున శివుడెక్కడ? నేనెక్కడ? నాకు అతను సరియైనవాడా? ఆనాడు నేను అతనిని కొలువడానికి వచ్చినపుడు నాకు తగినట్లు వ్యవహరించాడా? చెప్పు.

1-140-క.
నీ నాయకుఁ డల్లుం డగుఁ
గానిమమున్ ధిక్కరించెఁ గాక; భవానీ!
మానుగఁ గనియును నీవును
కానిగతి నుండ లేల ర్వము లేలా?
భావము :-
నీ భర్త నాకు అల్లుడే. కానీ నన్ను ధిక్కరించాడు. భవానీ! మరి నువ్వు కూడా చూసీ చూడనట్టు ఎందుకున్నావు? ఇంత గర్వము ఎందుకు?

1-141-క.
చెలువా! పిలువక ముందట
నఱి మా యింటి కేల చ్చితి చెపుమా;
పిలువని పేరంటము పని
వారునుబోలె సిగ్గు గాదే రాఁగన్?"

టీక :-
చెలువ = అందగత్తె; వలనఱి = పద్దతి తప్పి.
భావము :-
సుందరీ! పిలువకుండా మా ఇంటికి ఎందుకువచ్చావో చెప్పు? పిలువని పేరంటానికి పెద్ద అని ఉన్నట్లు రావడానికి సిగ్గుగా లేదా?”

1-142-వ.
అనవుఁడు న మ్మహాదేవి కోపవివశ యై య య్యాగమంటపంబున సుఖాసీనులై యున్న సభాపతుల నవలోకించి యిట్లనియె.

టీక :-
అనవుడు = అనిన తరువాత; అవలోకించి = చూసి.
భావము :-
ఆ మాటలకు పార్వతికి కోపంతో వివశురాలు అగుతూ, యాగమంటపంలో కూర్చుని ఉన్న సభాపతులను చూసి ఇలా అంటోంది.

1-143-చ.
"నిమములార! ధర్మపదనిర్ణయులార! మునీంద్రులార! యో
నిమమహాత్ములార! ఘననిర్ణయులార! దిగీంద్రులార! భూ
నచరాదులార! భవఖండనులార! యతీంద్రులార! యే
నిమము లందుఁ జెప్పె శివనింద యెఱింగితి రేనిఁ జెప్పరే?

టీక :-
నిగమములు = వేదములు; దిగీంద్రులు = దిక్పాలకులు; గగనచరాదులు = ఆకాశంలో సంచరించేవారు; భవఖండనులు = సంసారమునుండి వెలువడినవారు; యతీంద్రులు = మునులు.
భావము :-
“వేదవిదులారా! ధర్మమార్గ నిర్ణయాలు చేసే పెద్దలారా! మహర్షులారా! వేదవేద్యులారా! గొప్ప నిర్ణయాలు చేసేవారా!దిక్పాలకులారా! భూమ్యాకాశాలలో సంచరించేవారా! యతులారా! సాధువులారా! శివనింద చేయవచ్చని ఏవేదం చెప్పిందో తెలిస్తే చెప్పండి.

1-144-చ.
ఱుఁగరు బ్రహ్మవిష్ణువులు నింతని కానఁగలేరు దేవతల్
గురియిడ లేరు తాపసులు గోచరనీయులు గాని యోగులా
ముఁ దలంప లే రతని బాగు లగణ్యము లిట్టిచోట వీ
డొవున శంకరుం దెగడనోపె సభాసదులార వింటిరే.

టీక :-
ఎఱుఁగరు =తెలుసుకోలేరు; కానగలేరు = చూడలేరు; గురియిడలేరు=నిశ్చయించి చెప్పలేరు; తాపసులు = సాధువులు; గోచరము = విషయము; పరము = మోక్షము; అగణ్యము = లెక్కింపరానిది; ఒఱవు = విధము.
భావము :-
పరమేశ్వర తత్వాన్ని బ్రహ్మ, విష్ణువులు చూడలేరు. దేవతలు ఖచ్చితమైన రీతిలో నిశ్చయించి చెప్పలేరు. తాపసులు కనలేరు. యోగులు తలవలేరు. ఆయన గొప్పదనము లెక్కింపలేము. అటువంటిది ఈ దక్షుడు ఏమి తెలుసని శివుని ఈ విధంగా దూషిస్తున్నాడు? సభాసదులారా విన్నారు కదా!

1-145-ఉ.
వేము లం దెఱింగిన వివేకము లెక్కడఁ బోయె నేఁడు? పు
ణ్యోయబుద్ధి యెం దణఁగి యున్నది నేఁడు? దపంబుఁ బొల్ల యే
నీగు దక్ష తాద్భుతము నీతియు నెక్కడ దాఁగె నేఁడు? బ్ర
హ్మాదులఁ బోలు ప్రఙ్ఞ యది యారడి వోయెనె నీకు? నక్కటా!
భావము :-
అయ్యయ్యో! నేడు వేదములన్నీ తెలిసిన నీ వివేకము ఏమైపోయెను. పుణ్యపు బుద్ధి ఎక్కడ అణిగిపోయెను ; తపస్సంతా ఏల డొల్లబోయెను కదా; పెద్ద దక్షతకలవాడవనీ నీతిమంతుడవనీ ప్రసిద్ధుడవు కదా అదంతా ఏమైపోయెను;. బ్రహ్మదేవాదులతో తులతూగే నూ ప్రజ్ఞంతా వ్యర్థమయ్యెను కదా.

1-146-శా.
రాదక్ష! యదక్షమానస! వృథా యీ దూషణం బేలరా?
యోరీపాపము లెల్లఁ బో విడువరా; యుగ్రాక్షుఁ జేపట్టరా;
వైరంబొప్పదురా; శివుం వలఁపరా ర్ణింపరా; రాజితో
త్కారాతుం డగు నీలకంఠుఁ దెగడంగా రాదురా; దుర్మతీ!

టీక :-
అదక్ష = దక్షతలేని; వృధా = వ్యర్ధము; దూషణ = నింద; ఉగ్రాక్షుడు = శివుడు; వైరము = శతృత్వము; ఒప్పదు =తగదు; వర్ణించు = పొగడు; రాజిత = ప్రకాశించిన; ఉత్కారాతుండు = ఉత్(ఉన్నతమైన) కార(పథము)న నుండు వాడు, శివుడు; తెగడు = తిట్టు; దుర్మతి = చెడ్డబుద్ది కలవాడు.
భావము :-
చెడ్డబుద్ధి కలవాడా! ఏరా! దక్షా! దక్షతలేని హృదయం కలవాడా! ఈ శివనింద ఎందుకు? ఈపాపాలన్నీ పోగొట్టుకో. శివుని చేపట్టు. శివునితో శతృత్వం తగదు. శివుని మనస్సులో నిలిపి స్తుతించు. .ఆనీలకంఠుని తిట్టరాదు.

1-147-క.
దువులు నాలుగు శివుఁ గని
యెమంచును వెదకుఁ గాని యెబ్భంగులఁ ద
త్సమలరూపముఁ గానక
పడి తమలోనఁ జిక్కుడ్డవి దక్షా!

టీక :-
చదువులు = వేదములు; కనియెదము = చూస్తాము; భంగులు= భంగి (విధము)కి బహు వచనము; తత్ = ఆయొక్క, అతని; సదమల = మిక్కిలి నిర్మలమైన; పదపడి =తరువాత, ఆపైన.
భావము :-
వేదాలు శివుడిని చూస్తామని వెదకుతాయి. కానీ ఎన్ని విధాలుగా చూసినా మిక్కిలి నిర్మలమైన ఆ రూపము చూడలేక తమలో తామే చిక్కులుపడుతూ ఉంటాయి.

1-148-సీ.
లయ నీరేడులోముల దొంతులతోడఁ;
దాన కాన నింద గదు సేయ.
మూఁడు మంత్రములతో మూఁడు కాలములతో;
భ్రమయించు పుణ్యపాములతోడ;
లలిత ఖేచరార జంతుకోటితో;
భూరితేజములతో భూతితోడఁ;
జంద్రానలావనీ ల వాయు గగనాత్మ
రణులతోడఁ; జిత్రములతోడ;

1-148.1-ఆ.
ర్గదివ్యమహిమ బ్రహ్మాండములు సేయుఁ
గాచు నడఁచుఁ గాని కానరాదు
నిఖిల మెల్లఁ దాన నీవును నేనును
దాన కాన నింద గదు సేయ.

టీక :-
కలయ = అంతటా; ఈరేడు = పద్నాలుగు; దొంతులు = ఒక దానిపై మరొకటి; మంత్రము= వేదము, అక్షరము, సూర్యారాయాంధ్ర నిఘంటువు. భ్రమయించు = భ్రమించు; సలలితము = మనోహరము; ఖేచరులు = ఆకాశంలో సంచరించేవారు; అచరములు = కదలలేనివి (వృక్షము, మొదలైనవి); భూరి = గొప్ప; భూతి = ఐశ్వర్యము (విభూతి); అనలము = అగ్ని; అవని = భూమి; తరణుడు= సూర్యుడు; చిత్రము = వింత; భర్గుడు = శివుడు; దివ్య =దివ్యమైన; కానరాదు = కనబడదు; నిఖిలము = సమస్తము; దాన = మాలలోని పూస; తగదు = కూడదు.
భావము :-
పద్నాలుగు లోకాల దొంతర్లతో, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులనే మూడు రూపాలతో,సత్వ-రజో-తమగుణాలనే వేదములుఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము అను మూటితోనూ, అక్షరత్రయములు అ ఉ మ్ కూడిన ఓంకారముతోనూ, భూత, భవిష్యత్, వర్తమాన కాలములనే మూడుకాలములతో, భ్రమించు పాపము పుణ్యములతో, పక్షి, వృక్ష, జంతుకోటితో, గొప్ప తేజస్సుతో, విభూతితో, చంద్ర-అగ్ని-భూమి-జల-వాయు-గగన-ఆత్మ-సూర్యులతో, వీటి చిత్ర రచనలతో., ఒప్పే శివుని మహిమ విను. అది బ్రహ్మాండములను నిర్మిస్తుంది. రక్షిస్తుంది. వాటియందే ఉంటుంది. కానీ కనబడదు. సర్వమూ దానిలోనే ఉంటుంది. నువ్వు, నేను కూడా మాలలోని పూసల్లాగ అందులోనివారమే. కావున శివుని నిందించడం తగదు.

1-149-వ.
అదియునుం గాక.
భావము :-
అదీకాక...

1-150-క.
దేతలు మునులు గృతమిడి
దేవుఁడు పరమేశుఁ డైన దేవుం డనుచున్
భావించినచోఁ జదువులు
దేవుఁడు శ్రీకంఠుఁ డనుచుఁ దెలిపెనొ లేదో?

టీక :-
కృతమిడి = ప్రయత్నించి.
భావము :-
దేవతలూ, మునులూ ప్రయత్నించి దేవుడు పరమేశ్వరుడని భావించారు. వేదాలు దేవుడు శివుడని తెలిపినవి కదా.

1-151-క.
ఱియాగంబులలోపల
బుదనుజారాతి ప్రథమ పూజ్యం డెలమిన్
సులకు నందలిహవ్యము
యఁగ నతఁ డెలమి నిచ్చె నంతయు వినమే?

టీక :-
పురదనుజారాతి = శివుడు (త్రిపురాసుర శతృవు); ఎలమిన్ =సంతోషంతో; సురలు = దేవతలు; హవ్యము = హోమద్రవ్యము; అరయగ = విచారింపగా.
భావము :-
యాగాలలో త్రిపురారి ప్రథమపూజ్యుడు. దేవతలకు కూడా ఆయా హవ్యాన్ని పొందే అధికారం ఆయనే ఇచ్చాడు.

1-152-క.
విశ్వములోపలఁ దనరెడు
శాశ్వత మగు వేదసంజ్ఞ ద్విజ్ఞునకున్
శ్వద్వైఖరి చెల్లున్
యీశ్వరుమహిమాబ్ది నీకు నెఱుఁగన్వశమే?

టీక :-
విశ్వము = దే లోకము; తనరు = అతిశయించు; శశ్వద్వైఖరి = మరలమరల, మెల్లిగా పలుకుట, మననము చేయుట;
భావము :-
లోకములో బ్రాహ్మణులకు శాశ్వతమైనది, వేదము లను పేర పరగునది ఐన విజ్ఞానము మననము చేసికొనుట విధితమే, ఐననూ, మహేశ్వరుని మహిమ అను సముద్రము లోతులు తెలుసుకొనుట సాధ్యమగునా?

1-153-మత్త.
సాసంబున మందరంబును సారె కవ్వముఁ జేసి తా
రూక్షీరపయోధిఁ ద్రచ్చుచు నున్న శ్రీరమణాదులన్
దాదోహల నీలవర్ణులఁ ద్దయున్వడిఁ జేయు హా
లాలమ్మఱచేతఁ బట్టి గళంబులోన ధరింపడే?

టీక :-
సారె = మాటిమాటికి; ఊహ = యోచన; క్షీరపయోధి = పాలసముద్రము; త్రచ్చు= చిలుకు; శ్రీరమణుడు = విష్ణుమూర్తి; దాహ = అగ్ని; దోహల = మిక్కిలి ఉత్సాహము; తద్దయు= మిక్కిలి; వడి = వేగము; హాలాహలము = విషము; గళము = కంఠము.
భావము :-
మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకొని తామంతా సాహసంతో మాటిమాటికి పాలసముద్రాన్ని చిలుకుతున్న సమయమునందు, అప్పుడు పుట్టిన విషాగ్ని విష్ణువు మొదలైనవారిని ఉత్సాహంగా మంటలతో కాలుస్తూ వేగంగా నీలంరంగుగా మార్చివేయు నపుడు, శివుడు ఆ హాలాహలాన్ని అరచేతిలోకి తీసుకొని కంఠంలో పెట్టుకున్నాడు కదా.

1-154-క.
బ్రహ్మశిరంబును ద్రుంచుట
బ్రహ్మాండము లతని యందుఁ బ్రభవించుటయున్
బ్రహ్మాదు లెఱుఁగకుండుట
బ్రహ్మాదులచేత వినవె ర్గునిమహిమల్?

టీక :-
శిరము = తల; త్రుంచు= నఱుకు; ప్రభవించు = పుట్టు; ఎఱుగుట = తెలియుట.
భావము :-
బ్రహ్మ దేవుని శిరస్సును త్రుంచటం , బ్రహ్మాండాలన్నీ శివునిలోనుండే పుట్టడం, బ్రహ్మాదులకు కూడా అతను తెలియకపోవడం మొదలైన శివుని మహిమలు ఈ బ్రహ్మాదుల వలన వినలేదా?

1-155-క.
శివుఁడెచ్చట వేంచేయును
శితర మచ్చోటు వినుతిసేయఁగ వశమే
శివుఁడెచ్చట వేంచేయఁడు
శివుఁడెచ్చో నిండిలేఁడు సిద్ధము దక్షా!

టీక :-
వేంచేయు = వచ్చు, నివసించు; సిద్ధము= నిజము.
భావము :-
శివుడెక్కడకు వస్తాడో ఆ స్థలం శుభకరమైనది. శివుడిక్కడకు రాలేడో చెప్పడం కుదురుతుందా! దక్షా! యదార్ధానికి శివు డెక్కడ లేడు (అంతటా శివుడే నిండి యున్నాడు)?

1-156-క.
రుగూర్చి సేయు తప్పులు
మై యొప్పిద మొనర్చు ప్పురుషులకున్
రుని వెలిసేయు నొప్పులు
మై తప్పిదము లనెడునది మఱచితివే.

టీక :-
హరుడు = శివుడు; హరము = పోగొట్టు; వెలి = బహిష్కారము.
భావము :-
శివుని తెలుసుకొనగోరే ప్రయత్నంలో తప్పులు చేసినా అవి వారి ఒప్పులుగానే పరిగణించబడతాయి. శివుని వదలివేసి చేసే ప్రయత్నంలో ఒప్పులు చేసినా అవి వారి తప్పులుగా పరిగణించబడతా యని మరిచావా?

1-157-క.
ఖండేందుబింబభూషణు
నొండొరులకు నెఱుఁగవశమె యోహో వినుమా
; మండిత మగు నీ యాగము
పండిన తుదిఁ బండు పండు ర్గుఁడు కాఁడే?

టీక :-
ఖండేందుభూషణుడు = చెద్రరేఖ అలంకారముగా కలవాడు, శివుడు; ఒండొరులు = ఇతరులు; మండిత = అలంకరింపబడిన; తుది = చివరి; పండు = విజయము, ఫలించు, ఫలితము.
భావము :-
చంద్రరేఖాధరుడైన శివుని గురించి తెలుసుకొనడం ఇతరులకు సాధ్యమా? విను! అలంకారితమైన ఈ యాగము విజయవంత మైన పిమ్మట చివరికి ఫలించు ఫలితము పరమేశ్వరుడు కదా!

1-158-క.
ట్టిమహేశ్వరుఁ డిచటికి
నెట్టన రాఁగలఁడు చెఱుప నీ యఙ్ఞము నీ
పుట్టిన దేహముతోఁడను
ట్టున శివుఁ జేరరాదు రమార్థ మిలన్.

టీక :-
నెట్టన = తప్పక, అనివార్యముగ; పట్టున = పట్టుదలవహించు; చేరరాదు = చేరుట సాధ్యముకాదు.
భావము :-
శివుని చేరుట యే ఈ లోకంలో పరమార్థము. అటువంటి శివుడు నీ యజ్ఞము భంగము చేయడానికి తప్పకుండా వస్తాడు. ఎంత పట్టుపట్టినా నీవు ఈశరీరంతో శివుని చేరుట సాధ్యము కాదు.

1-159-క.
ఈ యొడలు రోతఁ గాదే
పాక పరమేశు నొందఁ ని సేయంగా
వేయును నేటికి మాటలు
పోయెదరా కీడు నొంది పొగిలి దురాత్మా?"

టీక :-
ఒడలు = శరీరము; రోత = అసహ్యకరముము; పాయక = విడువక; వేయును = వెయ్యి సంఖ్య, చాలా; ఏటికి = ఎందులకు; పొగిలి = కుమిలి; దురాత్మ = చెడ్డ మనసు కలవాడు.
భావము :-
దురాత్మా! దక్షుడా! పరమేశ్వరుని వద్దకు వెళదామంటే ఈశరీరం అసహ్యకరమైంది కదా. వేయి మాటలెందుకు? దుఃఖంతోనే ఈ శరీరాన్ని విడిచిపెడతాను.