పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : దాక్షాయణి హిమవత్పుత్త్రియై పుట్టుట

1-167-శా.
ప్రాలేయాచల వల్లభుండు నియతిం బాటించి సద్భక్తితోఁ
గాళీసుందరిఁ గూఁతుఁ గాఁ దలఁచి వేడ్కల్ పల్లవింపన్ యశ
శ్శ్రీలోలుండు తపంబు సేయ నచటన్ శృంగారసాంగత్యమై
లోలానందము బొంది యున్న నతఁ డాలోకించి సంరంభుఁడై.

టీక :-
ప్రాలేయాచల వల్లభుడు = హిమపర్వతరాజు; నియతి = నియమము; పల్లవించు = అతిశయించు; యశశ్శ్రీలోలుడు = కీర్తివంతుడు; శృంగార సాంగత్యము = శృంగారముతో కూడినది; లోలానందము= ఆనందముతో కదులు; ఆలోకించి = చూచి; సంరంభము = వేగగిరపాటు.
భావము :-
హిమవంతుడు నియమాన్ని పాటిస్తూ మంచి భక్తితో కాళీ సుందరిని కూతురుగా ఊహిస్తూ కీర్తికాంక్షిస్తూ తపస్సు చేస్తున్న చోట గౌరి శృంగారముతో కూడిన మిక్కిలి ఆనందంతో ప్రత్యక్షం అయింది. హిమవంతుడా విషయాన్ని గమనించి వెంటనే....

1-168-చ.
"చంలనేత్రి! యో ముగుద! ల్లనిచూపులతల్లి! నిన్ను నేఁ
గాంచిన యంతనుండి పులకల్ మెయినిండఁగ నంకురింప నీ
మించినరాకయున్ విభుని మేరయు నీ దగు పేరుపెంపు నీ
మంచిగుణంబు లన్నియును మంగళవంతము లంచు మ్రొక్కుదున్.

టీక :-
చంచలనేత్రి = కదలెడి కన్నులు కలది; ముగుద =ముగ్ధ; కాంచుట = చూచుట; పులకల్ = పులకరింతలు; మెయి = శరీరము; అంకురించు = మొలకెత్తు; మేర = హద్దు; మంగళవంతము= శుభాలనిచ్చునది.
భావము :-
“కదలెడి కన్నులు కలదానా! ఓ ముగ్ధా! చల్లగా చూచు తల్లీ! గౌరీ! నువ్వు కనబడగానే నా శరీరం పులకరిస్తుంది. నీ రాక, నీ భర్త హద్దు, నీ పేరు, ప్రతిష్ట, నీ మంచి గుణములు అన్నీ కూడా శుభాలే. నీకు మ్రొక్కుతానమ్మా.” అంటూ నమస్కరిస్తున్నాడు.

1-169-వ.
అనిన నా కుమారీతిలకం బి ట్లనియె.

టీక :-
కుమారీతిలకం = కన్యలలో శ్రేష్ఠమైనది.
భావము :-
అలా హిమవంతుడు మ్రొక్కగా ఆ కన్యకా శిరోమణి ఇలా అన్నది.

1-170-శా.
"నా నాథుండు మహేంద్ర దేవమునిరా ణ్ణాగేంద్ర దిగ్రాజవాక్
శ్రీనాథాగ్ర కిరీటకూట విలసత్శృంగార దివ్యప్రభా
నానారత్న నికాయ సంతత లసన్నవ్యస్ఫురత్పాదు కే
శానాలంకృతుఁ డీశుఁ డాతనికి నిల్లాలన్ శివాసుందరిన్.

టీక :-
నాథుడు = భర్త; మహేంద్రుడు = ఇంద్రుడు; దేవమునిరాణ్ = నారదుడు; రాణ్ = వాసి(ప్రసిద్ధి); దిక్ = దిక్కులు; రాజ = చంద్రుడు; వాక్ = సరస్వతి; శ్రీనాథుడు = విష్ణువు; కూటము = సమూహము; విలసత్శృంగార = అలంకారంతో ప్రకాశించేది; దివ్యప్రభ = వెలుగుతో ప్రకాశించేది; నికాయ = ప్రోగు; లసత్ = ప్రకాశమానమైన; నవ్య = కొత్త; స్ఫుర = తళతళలాడే.
భావము :-
“నా భర్త ఇంద్రుడు, నారదుడు, ప్రసిద్ధి పొందిన నాగేంద్రుడు, దిక్కులు, చంద్రుడు, సరస్వతి, విష్ణువు మొదలైనవారి కిరీటాలకు అలంకరించిన నానారత్నముల వెలుగులతో ప్రకాశించే సరికొత్త కాంతులతో ప్రకాశించేపాదుకలు కలవాడూ, ఈశాన్యదిక్కును అలంకరించి ఉండువాడూ, ఈశ్వరుడూ. నేను అతని ఇల్లాలైన శివాసుందరిని.

1-171-క.
నీకుంగూఁతుర నయ్యెదఁ
జేకొనుమీ తండ్రి!" యనుఁడు "శ్రీకంఠున కీ
వేకాంత వైన నిజముగ
నీకుంగల రూపు చూపు నీవు కుమారీ! "

టీక :-
శ్రీకంఠుడు = కంఠమునందు గరళము కలవాడు (శివుడు).
భావము :-
తండ్రీ! నీకు కూతురినౌతాను. గ్రహించండి.” అనగా “అమ్మాయీ! నిజముగా నీవే శివుని భార్యవైతే నీ నిజస్వరూపం ఒకసారి చూపించు.”. అని హిమవంతుడు అడిగాడు.

1-172-తే.
నుడును హిమవంతు నాలోకనముఁ జేసి
తొలఁకు నగవు మొగముఁ దొంగలింప
"తండ్రి! నీదు పుత్రి తా నెంతయో కన్ను
లారఁజూడు" మనుచు నంబుజాక్షి.

టీక :-
తొలకు = అతిశయంతో కదలు; అంబుజాక్షి = నీటినుండి పుట్టిన పద్మము వంటి కన్నులు కలది, శివాని.
భావము :-
అలా అన్నటువంటి హిమవంతుని చూసి ఆ అంబుజాక్షి ముఖమునందు ఉప్పొంగుతున్న చిరునవ్వుతో “తండ్రీ! నీ కుమార్తె ఎంతటిదో కన్నులారా కాంచుము” అంటూ . . .

1-173-సీ.
పొలుపారు నీరేడుభువనంబులకు నెల్ల
డఁతి సన్నుతించె ర్వతుండు.
గ్రొమ్మెఱుంగులమంటఁ గూడియు నెంతయు
వితతమై తాకుఁచు వెనుక రాగ;
చ్చి కూడని భంగి లనించుకయు లేక;
యేరుపఱుపరాక యెఱుఁగరాక;
యేవర్ణమునుగాక యేరూపమునుగాక;
కొలదియు లేకున్ని పొలయునట్లు

1-173.1-ఆ.
మలజాండ మెల్ల న్నియ దాన యై
తోఁచియున్నఁ జూచి తొట్రుపడుచు
మూర్ఛవోయి తెలిసి మోడ్పుఁ గే లెనయంగఁ
డఁతి సన్నుతించె ర్వతుండు.

టీక :-
పొలుపారు = ఒప్పారు; నీరేడు = పధ్నాలుగు (ఇరు + ఏడు) లోకములు; మహితము = గొప్పది; దేదీప్యమానము= ప్రకాశవంతంగా వెలుగు; క్రొమ్మెఱుగులు = కొత్తమెరుగులు; వితతము = వ్యాపించిన; వర్ణము = రంగు. కమలజాండము = బ్రహ్మాండము; తొట్రుపడు = తడబడు; మోడ్పుకేలెనయగ = చేతులు దగ్గరగా చేర్చి నమస్కరిస్తూ; సన్నుతించు = స్తుతించు.
భావము :-
పదునాల్గు భువనాలు నిండిపోయేంత గొప్ప ప్రకాశవంతమైన వెలుగుతో సరికొత్త కాంతి పుంజములు కూడా రాగా ప్రత్యక్షమైంది, ఆమె ఏ విధంగానూ అంతుపట్టరానిదీ, అలవికానిదీ, తెలియరానిదీ, ఏవిధమైన శరీరఛాయ కానీ, రూపము కానీ కానట్టిదీ, అపరిమితమైనదీ అయిన రూపము ధరించి ఉంది ఆమె. బ్రహ్మాండమంతా వ్యాపించి తానే అయినట్లు ఉంది. ఆ మహద్రూపము చూసి తడబడుతూ మూర్ఛపోయి తేరుకొని చేతులు జోడించి నమస్కరిస్తూ హిమవంతుడు ఆ తల్లిని ఇలా స్తోత్రం చేసాడు.