పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థాశ్వాసము : పార్వతికోపంబున భద్రేశ్వరి యను కన్య పుట్టుట.

4-56-క.
రుద్రునకుం బొడచూవెను
రుద్రాణియు నంతలోన రోషాత్మక యై
ధ్రేశ్వరి యనుకన్యక
రౌద్రతఁ బుట్టెంచె ఘనకరాళానన యై.

టీక :-
పొడచూపు = కలుగు, పుట్టు, కనబడు; రోషము = కోపము; కరాళము = భయము పుట్టించునది.
భావము :-
అలా రుద్రునకు వీరభద్రుడు పుట్టెను. అంతలో రుద్రాణి కోపముతో భద్రేశ్వరి యను కన్యను పుట్టించెను. ఆ భద్రేశ్వరి మహా భయంకరమైన ముఖము కలది మహారౌద్రము కలది.

4-57-వ.

అంతఁ దత్సమయంబున వీరభద్రేశ్వరుండు భద్రేశ్వరిం గూడుకొని పరమేశ్వరునిపాదపంకజంబులకు సాష్టాంగదండప్రణామంబు లాచరించి కరసహస్రంబులు మొగిడ్చి " దేవా! మీరు నన్నుం బుట్టింపఁ గారణం బేమియో యవధరింపుఁ" డని యిట్లనియె.

టీక :-
మొగిడ్చు = జోడించు.
భావము :-
అప్పుడు వీరభద్రేశ్వరుడు భద్రేశ్వరితో కలసి శివుని పాదపద్మములకు సాష్ఠాంగ నమస్కారము చేసెను. తనవేయి చేతులనీ జోడించి తనను పుట్టించిన కారణం చెప్పమని అడిగి మరల ఇట్లనియె..

4-58-సీ.
"నీయాజ్ఞఁ గడచి యీ నిఖిలంబులకుబ్రహ్మ
కొన్నిమిక్కిలి సేయు చున్నవాఁడొ
నీయాజ్ఞగడచి యీ నీరజనాభుండు
నొండుజాడలఁ బోవుచున్న వాఁడొ
నిను మీఱి పవనుండు నేలయు నింగియు
నొక్కటిగావించుచున్న వాఁడొ
నీపంపుదప్పి యీ నింగిమార్తాండుండు
పన్ని మిక్కిలి కాయుచున్నవాఁడొ

4-58.1-గీ.
ట్లుగాకయుఁ బడబాగ్ని యంతజలముఁ
రముగ్రోలుచున్నది యొకో కాముఁడేచు
చున్నవాఁడేమొ యీశాన చెప్పవేమి?
చిక్కఁబట్టికేలున వారి నుక్కణంతు.

టీక :-
జాడ = పద్ధతి; పంపు = ఆజ్ఞ ఏచు = బాధించు .
భావము :-
"నీ యాజ్ఞ కాదని ఈ జగములకు బ్రహ్మ ఏమైనా ఎక్కువ చేస్తున్నాడా? నీ యాజ్ఞలతిక్రమించి విష్ణువు వేరు పద్ధతుల్లో పోతున్నాడా? నిన్ను ధిక్కరించి వాయువు నింగీనేలా ఒకటి చేస్తున్నాడా? నిన్ను కాదని ఆకాశంలో సూర్యుడు వరుసగా ఎండ ఎక్కువగా కాస్తున్నాడా? అలాకాక బడబాగ్ని సముద్ర జలాన్నంతా తాగేస్తోందా? కాముడు బాధిస్తున్నాడా? ఈశా చెప్పవేమి? వారిని చేతికి చిక్కించుకొని వాని గర్వమణుస్తాను.

4-59-క.
ట్టలుక మీరు నన్నును
బుట్టింపఁగ నేల వలసె బొలుపుగ నాకున్
నెట్టన యానతి యీవే
పుట్టువు నంత్యంబు లేనిభూతాధిపతీ!

టీక :-
నెట్టన = తక్షణమే.
భావము :-
మీరు నన్ను చాలా కోపంతో ఎందుకు పుట్టించవలసి వచ్చింది? పుట్టుక అంత్యము లేనివాడా! భూతపతీ! వెంటనే నాకనుజ్ఞ ఇవ్వండి."

4-60-వ.
అనిన విని యల్లన నవ్వు మొగంబున నద్దేవున కిట్లనియె.
భావము :-
అనగా విని మెల్లగా నవ్వుతూ వీరభద్రునితో శివుడు ఇలా అన్నాడు.

4-61-శా.
వింటేయంతయు వీరశేఖర! మమున్ వెల్వెట్టి దక్షుండు నీ
వెంటన్ వేల్వఁదొడంగినాఁడు మరలన్ విష్ణుండు నింద్రుండు న
వ్వెంటన్ బోయినవారు వారి నచటన్ వేవేగ దండించి నీ
వింటన్ బుట్టు శరానలంబున రణోర్విన్ నీఱుగావింపుమా.

టీక :-
వేలిమి = హోమము; అనలము = అగ్ని;నిర్వీర్యము = చైతన్యం కోల్పోవడం.
భావము :-
"వీరశేఖరా! అంతా విన్నావు కదా మమ్మల్ని వెలివేసి దక్షుడు యాగము చేస్తున్నాడు. ఇంకా విష్ణుమూర్తి, ఇంద్రుడు కూడా వెళ్ళారు. నీవు శీఘ్రమే వెళ్ళి నీ రణాగ్ని యందు వారిని దండించి రమ్ము..

4-62-ఉ.
మ్ముల నీవు వేగ చని యేచి మహారణకేళి యాడు మీ
మ్మయు నేను వచ్చి ముని యాశ్రమభూమి వసించి నీ విలా
మ్ములు చూచుచుండెదము ర్జరితంబుగ దక్షుఁ జంపి యా
మ్ముహరించి ర”మ్మనుచు నానతి యిచ్చిన వీరుఁ డిట్లనెన్.

టీక :-
ఇమ్ముల = ఇంపుగా; జర్జరితము = శిధిలము.
భావము :-
నీవు చక్కగా గాశీఘ్రమే వెళ్ళి వానిని బాధించి యుద్ధక్రీడ ఆడుకో. మీ తల్లి, నేను వచ్చి ముని ఆశ్రమ భూమిలో యుండి నీ విలాసములు చూస్తూ యుంటాము. దక్షుని చంపి యాగము శిధిలమయ్యేలా చేసి ర"మ్మని శివుడు యానతీయగా వీరభద్రుడు ఇలా అన్నాడు.

4-63-క.
భాజమదసంహర! నా
నావేదాతీత! వినుత నాగాధిపతీ!
దేవేంద్రార్చిత పదయుగ!
దేవా! దేవాదిదేవ! త్రిదశాధిపతీ!

టీక :-
భావజుడు = మన్మథుడు; నాగాధిపతీ = ఆదిశేషుడు; త్రిదశాధిపతి = త్రిదశలు యనగా దేవతలు వారికి అధిపతి శివుడు.
భావము :-
"మన్మథుని మదమును అణచినవాడా! సకల వేదాలకు అతీతమైనవాడా! ఆదిశేషునిచే పొగడబడేవాడా! దేవేంద్రుడు అర్చించే పాదములు కలవాడా! దేవా! దేవాధిదేవా! శివా!

4-64-ఉ.
కుంభిని ద్రెంతునో? జముని గుండెలు చెండుదునో? సురాచల
స్తంము ద్రెంతునో? సురల ట్టలు చీరుదునో? కడంగి ది
క్కుంభుల ద్రుంతునో? యజుని క్రొవ్వణగింతునొ? సూర్యచంద్రులన్
జృంణమెల్ల మాన్పుదునొ? చుక్కల డుల్తునొ? పార్వతీశ్వరా!

టీక :-
కుంభిని = భూమి; జముడు = యముడు; సురాచలము = మేరు పర్వతము; కడంక = యత్నము; అజుడు = విష్ణువు; జృంభణము = అతిశయము; అడలు = భయము.
భావము :-
పార్వతీశ్వరా! భూమిని బ్రద్దలు కొడతాను. యముని గుండెలు చీలుస్తాను. మేరు పర్వతాన్ని విరగ్గొడతాను. దేవతల చట్టలు చీరుస్తాను. పూని దిక్కులను తుంచేస్తాను. విష్ణువు కొవ్వు అణచేస్తాను. సూర్యచంద్రుల అతిశయాన్ని మాన్పిస్తాను. చుక్కల్ని రాలుస్తాను.

4-65-శా.
బ్రహ్మేంద్రామరపూజితాంఘ్రియుగళా! బాలేందుచూడామణీ!
బ్రహ్మేంద్రాదులఁ బట్టి వ్రేల్పు టది మద్బాహాబలప్రౌఢికిన్
బ్రహ్మంబే పరమేశ! నీవుఁ బ్రణుతింపం గర్వదుర్వారులన్
బ్రహ్మాదుల్ దెగ రూపడంతు నొకఁడన్ బ్రహ్మాండభాండావళుల్.

టీక :-
అంఘ్రి = పాదము; వ్రేల్చు = అగ్ని గుండములో కాల్చు; ప్రౌఢి = సామర్థ్యము.
భావము :-
బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలు పూజించే పాదములు కలవాడా! బాలచంద్రమౌళీ! బ్రహ్మేంద్రాదులను పట్టి వ్రేల్చడమనేది నా వంటి గొప్ప బల సమర్ధునికి సిద్ధమే! పరమేశా! నీవు గొప్పగా పొగిడేలా నివారింపలేని గర్వము గల బ్రహ్మాదులను, బ్రహ్మాండభాండములను నేనొక్కడనే రూపమడంచగలను.

4-66-మ.
తున్ దక్షునిమీఁదఁ గయ్యమునకున్నా రాచఘోరాగ్నులన్
బుమిం దేవగణంబులం దునిమి సంపూర్ణాహుతుల్ పోసెదన్
డిమిం గెల్చెదఁ గూల్చెదం గలచెదం గాలించెదన్ జంపెదన్
డిఖండంబులు జేసెదన్ నుఱిమెదన్ ఖండించెదన్ మించెదన్.

టీక :-
నారాచ = ఇనుపబాణము; కడిమి = పరాక్రమము; కలంచు = క్షోభపెట్టు; గాలించు = వెదకు; ఉరుము = హుంకరించు; మించు = అతిశయించు.
భావము :-
దక్షుని పై యుద్ధమునకు వెళ్ళెదను. దేవగణాలను నా బాణములతో చంపి సంపూర్ణ ఆహుతి చేస్తాను. పరాక్రమంతో గెలుస్తాను, కూలుస్తాను, క్షోభ పెడతాను, వెతికివెతికిమరీ చంపుతాను, ముక్కలుముక్కలు చేస్తాను, హూంకరిస్తాను, నరుకుతాను, అతిశయిస్తాను.

4-67-క.
నాకెదురెవ్వరు జగముల
నీకెదురెవ్వరు మహేశ! నిఖిలాధిపతీ!
నాకీతెరువునఁ బొడమఁగ
నీకంఠవిషంబు నీవె నిర్మలమూర్తీ!
భావము :-
లోకంలో నాకెదురెవరూ లేరు. నీకెదురెవరూ లేరు. సర్వేశ్వరా! నేనిలా యుండడానికి నీ కంఠ విషమియ్యవయ్యా నిర్మలమూర్తీ!"

4-68-వ.
అనిన విని మెచ్చి పార్వతీ దేవి యవ్వీర శేఖరున కిట్లనియె.
భావము :-
అనగా విని పార్వతీ దేవి యా వీరభద్రునితో ఇలా అన్నది.

4-69-శా.
ట్టల్కన్ గణలోకనాథ! నిను మత్కార్యార్ధమై యీ యెడన్
బుట్టించెన్ భుజగేంద్రభూషణుఁ డొగిన్ భూతేశు నిందించి తాఁ
బెట్టన్ జన్నము దక్షుఁ డద్దివిజులన్ బిల్పించినాఁ డా సభన్
ట్టుగ్రంబుగఁ గూల్చి ర”మ్మనుచు నాకాళ్యాణి దీవించుచున్.

టీక :-
కట్టల్కన్ = (కడు+అలుకన్) మహా కోపముతో; గణలోకనాధుడు = శివుడు; మత్కార్యార్థము = నాకోసం; ఒగిన్ = చక్కగా, లెస్సగా, క్రమముగా; కట్టుగ్రంబున = (కడు + యుగ్రంబున) మిక్కిలి భయంకరముగా; కళ్యాణి = గౌరి.
భావము :-
"భుజంగభూషణుడైన శివుడు ఇప్పుడు మహా కోపముతో నిన్ను నాకోసం  పుట్టించాడు. భూతేశుని నిందించి దక్షుడు యజ్ఞము తలపెట్టి దేవతలను పిలిచాడు. ఆ దక్షుని సభను మిక్కిలి భయంకరముగా పాడుచేసి ర"మ్మని గౌరీదేవి దీవించింది.

4-70-క.
ట్టడ హరుఁడును దానును
బెట్టిరి తగ వీరసేను బీరముతోడన్
నెట్టనఁ బ్రణమిల్లి వెసన్
జెట్టిమగండైన వీరశేఖరుఁ డెలమిన్.

టీక :-
కట్టడ = తీరు, విధము; బీరము = పరాక్రమము; నెట్టనన్ = తక్షణమే; వెసన్ = త్వరగా; జెట్టి = శూరుడు; ఎలమి = సంతోషము.
భావము :-
ఈ విధముగా పార్వతీపరమేశ్వరులు వీరభద్రుని దీవించారు. తక్షణమే వీరభద్రుడు వారికి నమస్కరించి, శీఘ్రమే...

4-71-వ.
అట్టి పనిఁ బూని దక్షయాగంబుపైఁ బోవ గమకించి వీరభద్రుం డతులిత రౌద్రాకారుండైయిట్లని విచారింపందొణంగె.

టీక :-
అతులిత = సాటిలేని.
భావము :-
ఆలా శీఘ్రమే దక్షయాగ ధ్వంసమునకు బయలుదేరిన వీరభద్రుడు కోపంగా ఇలా ఆలోచించసాగాడు...

4-72-ఉ.
శూము యూపగంబమును శోణితధారలు వేయుబాణముల్
చాలిన దర్భలుం గుణము ప్పుడు మంత్రము సృక్కులుం దొనల్
గ్రాలురణోర్వి మంటపముగా సుర గోవుల సోమయాజి యై
వ్రేలుచు రోషణాగ్నులను వీరుఁడు భద్రుఁడు శంభు ప్రీతిగన్.

టీక :-
యూపకంబము = యూపస్తంబము, యజ్ఞ పశువును కట్టివేయడానికి నిలిపిన కొయ్య; శోణితము = రక్తము; గుణము = అల్లెత్రాడు; స్రుక్కు = ఆజ్యాహుతి చేసే మాని గరిటె; దొన = అమ్ములపొది, తూణము; క్రాలు = అల్లలాడు; సోమయాజి = యజ్ఞము చేసినవాడు.
భావము :-
నా శూలమే యూపస్తంభం, రక్తధారలు. నా బాణాలే దర్భలు. వింటినారి ధ్వనే మంత్రములు. అమ్ములపొదులే సృక్కులు. రణభూమే మండపము. దేవతలనే గోవులకు సోమయాజియై ఈ వీరభద్రుడు కోపమనే అగ్నులందు వ్రేల్చి శివుడు ప్రీతి చెందేలా చేస్తాను."

4-73-వ.
అని సకలలోకంబులుం గొనియాడ వీరయాగంబు సేయవలయు నని విచారించి.
భావము :-
అలా యోచిస్తూ లోకాలన్నీ పొగిడేలా వీరంగము చెయ్యాలని భావించి.

4-74-శా.
ఝంకార భ్రుకుటాననుం డయి ధరాక్రంబు ఝూర్ణిల్లఁ గా
హుంకారించిన భద్రుమేన లయకాలోగ్రాగ్నికీలావళిన్
సంకాశోద్ధత కోపచిత్తులు రణోత్సాహుల్ జగద్భీషణా
హంకారుల్ ఘను లంతకాంతకు లుదగ్రాగ్నుల్ మహావిక్రముల్.

టీక :-
ఝంకార = తుమ్మెద ధ్వని; ఘూర్ణిల్లు = మ్రోగు; లయకాలము = ప్రళయకాలము; సంకాశము = సమానమైన.
భావము :-
ఝామ్మంటూ కనుబొమలు ముడివేసి భూమి దద్దరిల్లేలా హూంకరించాడు వీరభద్రుడు. అతని శరీరం నుండి ప్రళయకాలంలో వచ్చే యగ్ని జ్వాలలతో సమానమైన కోపం గలవారు, యుద్ధమంటే యుత్సాహం గలవారు లోకభయంకరమైన యహంకారము గలవారు, గొప్పవారు అంతకాంతకులు మహోగ్రమైన అగ్ని వంటివారు, మహా విక్రములు.

4-75-ఉ.
సాసధైర్యమానసులు చంద్ర ఫణీంద్ర విభూషణుల్ శివ
ద్రోరగండకీర్తు లతిదోర్బలగేయులు భూరి తీవ్రహా
లాలజృంభితుల్ శిఖివిలంబితనేత్రులు చారుగోపతీ
వాహులు వైరివీరమదవారణసింహులు పుట్టి రుగ్రతన్.

టీక :-
శిఖి = అగ్ని; దోర్బల = బాహుబలము కలవాడు; విలంబిత = ఆశ్రయించబడిన.
భావము :-
ధైర్యసాహసములు కలవారు, చంద్రుడు నాగులు ఆభరణములుగా కలవారు, శివద్రోహులను హరించ కలవారు, అతి భుజబలులు, బహు తీవ్రమైన కాలకూటము వలె విజృంభించేవారు, అగ్ని నేత్రులు, నంది వాహనులు, శతృవుల మదమణిచే సింహముల వంటి వీరులు రౌద్రంగా పుట్టుకొచ్చారు.

4-76-వ.
ఇట్లు పుట్టిన.

4-77-ఉ.
క్కడఁ జూడ వారె యయియేపున లక్షలుఁగోట్లునెందఱో
దిక్కులు పిక్కటిల్ల నతితీవ్రత లెక్కకుదాఁటి యుగ్రతన్
జుక్కలు మోవ నేచి యలచుక్కలు రాల నుదగ్రమూర్తి యై
యొక్కట యార్పుగొన్నఁ బ్రతిహుంకృతిఁ జేసె నజాంజభాండముల్.

టీక :-
ఏపు = బాధించు; అల = అక్కడ; ప్రతిహృంకృతి = హుంకారానికి ప్రతిధ్వని.
భావము :-
ఎక్కడచూసినా వారే యయ్యి లక్షలు కోట్లుగా పెరిగి ఎంతోమందియై దిక్కులు పిక్కటిల్లేలా అతి తీవ్రముగా మహోగ్రతతో చుక్కలు కనబడేలా, చుక్కలు రాలునట్లు హుంకారాలు అజాండభాండము నిండా ప్రతిధ్వనించాయి.

4-78-వ.
అంతఁ దదీయ గణనికాయంబులు తన్నుఁ బరివేష్టించి దండప్రణామంబు లాచరించి సంభ్రమంబున.

టీక :-
నికాయము = సమూహము.
భావము :-
అంతట అతని గణ సమూహములు తనచుట్టూ చేరి సంభ్రమంతో చేతులెత్తి నమస్కరించి....