పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ ఆశ్వాసము : మిగతా భాగము - రతీదేవి శివునిపైఁ బోవల దని మన్మథుని మందలించుట

2-147-క.
“అన్నా! నీచెలికాఁ డిటు
వెన్నెలధరుమీఁద వచ్చి వేఁగుట నీకున్
న్నుగ నెవ్వరు చెప్పిరి
న్నారఁగనట్టివేళ గాంచితొలేదో.

టీక :-
వెన్నెలధరుడు= శశిధరుడు, శివుడు; వేగు = మండు, కాలు; పన్నుగ = ఒప్పునట్లుగా; కన్నారగ = స్పష్టముగా.
భావము :-
అన్నా! నీ స్నేహితుడు ఇలా శివుని పైకి వచ్చి కాలిపోవుట నీకు చక్కగా ఎవరు చెప్పారు? స్పష్టముగా ఆవేళ చూసావో! లేదో!

2-148-క.
తాకు తపోమహత్వము
నాయ దేవతలు నతని యానందంబున్
గౌరీనాయకు కోపము
కోరిక మరుఁ బట్టి భుక్తిఁ గొనియెం జుమ్మీ.

టీక :-
అరయు = తెలిసికొను; మరుడు = మన్మథుడు; భుక్తిగొను = తిను.
భావము :-
తారకాసురుని తపోమహత్వమును తెలుసుకొన్న దేవతలు వారి ఆనందము, శివుని కోపము కోరిక అన్నీ కలసి మన్మథుని తినేశాయి.

2-149-ఆ.
ప్రాణనాథుఁ బాసి ప్రాణంబు నిలువదు
పోవవలయు నాకుఁ బోవకున్న
సురభి! యింక నీవు సొదఁ బేర్చుఁ వేవేగఁ
జిచ్చుఁ జొత్తు గాముఁ జేరవలసి.

టీక :-
పాయు = విడుచు; సురభి = వసంతుడు; సొద = చితి; చిచ్చు = అగ్ని; చొచ్చు = ప్రవేశించు.
భావము :-
ప్రాణనాథుని విడిచి ప్రాణముండదు. పోవాలి. పోకపోతే సురభీ! ఇక నీవు త్వరగా చితి పేర్చు. అగ్నిలో ప్రవేశించి కాముని చేరాలి.

2-150-క.
ల ముఖంబున సతులకు
నుగమనముచేసి దివికి ధిపుఁడు దానుం
నుట మహాధర్మం బని
వినిపించెడి బుధులమాట వినవే? చెపుమా!

టీక :-
అనలము = అగ్ని; సతి = భార్య; అనుగమనము = సహగమనము; దివి = స్వర్గము; అధిపుడు = ప్రభువు, భర్త; బుధులు = పండితులు.
భావము :-
అగ్నిలో భార్యలు సహగమనం చేసి, తానూ భర్తా స్వర్గానికి చేరడం గొప్ప ధర్మమని పండితులు చెప్పినమాట వినలేదా? చెప్పు!

2-151-వ.
అనిన వసంతుండు ప్రలాపించు తదీయ ప్రకారంబుల విచారించి సముచిత ప్రకారంబున నిట్లనియె.

టీక :-
ప్రలాపము = అర్థరహిత వాక్యము; తదీయ = తత్సంబంధమైన, ఆమె యొక్క; విచారించి = దుఃఖించి; సముచితము = తగిన.
భావము :-
రతీదేవి ఆ విధంగా చేసిన శోక ప్రలాపనలు విని వసంతుడు దుఃఖించి తగిన విధంగా ఇలా అన్నాడు.

2-152-సీ.
యేల నిట్లాడెద వేకచిత్తంబున;
నా మాట వినవమ్మ లిననేత్ర!
గౌరినాయకుఁడింక గౌరీసమేతుఁడై;
సుఖమున్న నింద్రాది సురలు వచ్చి
నీ ప్రాణనాథుండు నిష్పాపుఁడని చెప్ప;
రలను బడయుదీ రుదుగాఁగ
దిగాక మన్మథుం మరుల పంపున;
జెడినవాఁడునుగానఁ జెప్పి బలిమి

2-152.1-ఆ.
విబుధులెల్ల విన్నవించిన పరమేశ్వ
రుండు భక్తవత్సలుండుగాన
పంచబాణు నిచ్చు భావింపు మిమ్మాట
వెలఁది! నమ్మునీవు వేయునేల.”

టీక :-
ఏకచిత్త = ఏకాగ్రతతో, ఒకే విషయంపై మనస్సు నిలిపినవాడు; పడయు = పొందు; అరుదుగాగ = అపూర్వంగా.
భావము :-
ఎందుకిలా మాట్లాడుతున్నావు ఒకవైపే ఆలోచించి? నామాట వినవమ్మా! నలిననేత్రా! గౌరీ నాయకుడు గౌరితో కలసి సుఖముగానుంటే ఇంద్రుడు మొదలుగాగల దేవతలు వచ్చి నీ భర్తకు ఏపాపం తెలియదని చెబితే మరలా నీ భర్తను అపూర్వంగా పొందగలవు. అదీగాక మన్మథుడు దేవతలు పంపగా దేవతలకోసం నశించాడు కావున వేల్పులంతా గట్టిగా మనవిచేస్తే పరమేశ్వరుడు భక్తవత్సలుడు కావడం వలన మన్మథుని తిరిగి ఇస్తాడని భావించు. వెలదీ! వేయి మాటలెందుకు? నువ్వు నమ్ము.

2-153-క.
ని పలికినపలుకులకును
నుగుణమై యీప్రకార గు నిజమనుచున్
వినువీథి నొక్క నినదము
నుగుణముగ మ్రోసె జనుల కాశ్చర్యముగన్.

టీక :-
అనుగుణము = తగిన; వినువీధి = ఆకాశ మార్గము; నినదము = ధ్వని; మ్రోయు = ధ్వనించు.
భావము :-
అంటూ వసంతుడు పలికిన పలుకులకు తగినట్లు ఈవిధముగా నిజంగా జరుగుతాయంటూ ఆకాశవాణి ఒక ధ్వని ధ్వనించింది ప్రజలాశ్చర్య పడునట్టుగా.

2-154-వ.
ఇట్లు పలికిన గగనవాణి పలుకులును వసంతుపలుకులును నాలించి రతీదేవి యిట్లనియె,

టీక :-
గగనవాణి = ఆకాశవాణి; ఆలించు = విను.
భావము :-
ఇలా పలికిన ఆకాశవాణి మాటలు, వసంతుని మాటలు విన్న రతీదేవి ఇలా అన్నది.

2-155-ఉ.
చ్చటినుండి యిందుధరుఁ డిప్పుడు పార్వతిఁగూఁడుఁ గూఁడెఁబో
యిచ్చునె మన్మథుం దివిజు లెప్పుడు చెప్పుదు రిట్టివాక్యముల్
మెచ్చునె లోకముల్ వినిన మేదినిఁ జచ్చినవారు వత్తురే
చెచ్చెర నిప్పుడీ బయలుచెప్పిన మాటలు నమ్మవచ్చునే?

టీక :-
ఇందుధరుడు = శివుడు; దివిజులు = దేవతలు; మేదిని = భూమి; చెచ్చెర = శీఘ్రముగా; బయలు = ఆకాశము, శూన్యము.
భావము :-
ఎప్పడినుండి చంద్రశేఖరు డిప్పుడు పార్వతితో కలుస్తాడు? కూడినా మన్మథుని ఇస్తాడా? దేవతలెప్పుడు ఇలాంటి మాటలు చెప్తారు? ఇది విని లోకములు మెచ్చుకుంటాయా? భూమిపై చనిపోయినవారు తిరిగి వస్తారా? ఆకాశవాణి ఆ మాటలు నమ్మవచ్చునా?

2-156-ఉ.
 దురాశ పోవిడువు మెన్నితెఱంగులనైనశోకసం
చాలిత చిత్తనై విధవనై గతిమాలిన దీనురాలనై
తూలుచుఁ గాలుచున్ వగల దుస్థితిఁ బొందఁగఁజాలఁ బావక
జ్వాలఁజొచ్చి నా హృదయల్లభు మన్మథుఁ గానఁబోయెదన్.

టీక :-
పోవిడుచు = వదలు; తెఱంగు = విధము; చాలిత = చలింతిన; విధవ = పెనిమిటి లేని యామె; వగ = దుఃఖము; పావక = అగ్ని; చొచ్చు = ప్రవేశించు.
భావము :-
ఎందుకు దురాశ? విడిచిపెట్టు. ఇన్ని విధాలుగా శోకచిత్తముతో, విధవనై, దిక్కులేని దానినై, దీనురాలనై, తూలుతూ, రగులుతూ, దుఃఖముతో హీనగతిని పొందడం చాలు. అగ్ని జ్వాలలలో ప్రవేశించి నాభర్తను మన్మథుని చేరుటకు వెళ్తాను.

2-157-వ.
అని బహుప్రకారంబుల రతియును వసంతుండును దమలో నుచితాలాపంబులు పలుకుచున్న సమయంబున.

టీక :-
ఉచిత = తగిన; ఆలాపములు = మాటలు.
భావము :-
అలా రకరకాలుగా రతీదేవియును, వసంతుడు తమలో తాము చాలా మాట్లాడుకొనుచున్న సమయంలో...

2-158-ఉ.
మృగాక్షి! నాపలుకులేటికి? నమ్మవుశూలికొండరా
చూలి వివాహమైన యెడ శోభన మంగళవృత్తినున్నచో
వేలుపులెల్ల నంగజుఁడు వేఁగుటఁ జెప్పినఁ గామునిచ్చు నా
నీగళాంకుఁ డీవిధము నిక్క మటంచు నభంబు మ్రోయుఁడున్.

టీక :-
మృగాక్షి = లేడి వంటి కన్నులు కలది; ఏటికి = ఎందుకు; శూలి = శివుడు; కొండరాచూలి = పార్వతి; అంగజుడు = మన్మథుడు; వేగుట = మండు, కాలిపోవుట; నీలగళాంకుడు = శివుడు; నిక్కము = యదార్థము; నభము = ఆకాశము; మ్రోయు = ధ్వనించు.
భావము :-
“ఏమి? మృగాక్షీ! నా మాటలెందుకు నమ్మవు? శివపార్వతుల వివాహమై శుభముగా మంగళకరంగా యుంటారు. దేవతలంతా మన్మథుడు కాలిపోవుటను గూర్చి తెలియచేస్తారు. యా నీలకంఠుడు కాముని ఇస్తాడు. ఇది యదార్థ” మంటూ ఆకాశవాణి పలకడంతో...

2-159-క.
మిం నశరీరవాణియుఁ
దొంటి విధంబునను బలికెఁ “దోయజనేత్రీ!
వింటివె నీ నాయకుఁ డే
వెంన్ మరలంగవచ్చు వికచాబ్జమఖీ!

టీక :-
మిన్ను = ఆకాశము; అశరీరవాణి = దైవవాణి; తొంటి = పూర్వపు.
భావము :-
“ఓ పద్మాక్షీ! రతీదేవి! ఆకాశంలో అశరీరవాణి పూర్వము చెప్పినట్లే మరల చెప్పింది. విన్నావా ఎలాగైనా నీభర్త తిరిగి వచ్చును..

2-160-వ.
అని మఱియు ననేకవిధంబుల నూరడించి వసంతుని పలుకు లగుంగాక యని నత్యంత విహ్వలచిత్తంబున.

టీక :-
విహ్వల = స్వాధీనత తప్పిన, చెదిరిన.
భావము :-
అంటూ ఇంకా అనేక రకాలుగా యూరడించిన వసంతుని మాటలకు సరేయని చెదిరిన మనసుతో...

2-161-క
తంబునతులవేదన
తి బొందుచు హృదయకమల ధ్యమునందున్
తిఁ దలఁచి చింతసేయుచు
తి దా వర్తించె నొండు తిలేని గతిన్.

టీక :-
అతుల = సాటిలేని; రతి = ఆసక్తి.
భావము :-
రతీదేవి ఎప్పుడూ అంతులేని బాధను పొందుతూ హృదయములో భర్తనుగూర్చి బాధపడుతూ వేరే యాసక్తి యేమీలేకుండా ప్రవర్తించెను.

2-162-ఉ.
కాముని బిల్చి పెద్దయును గౌరవ మొప్పఁగ బుజ్జగించి సు
త్రాముఁడు శంభుపై బనుప ర్పకుఁడుం జనుదెంచి యేయుచో
సోకళావతంసుఁడును స్రుక్కక మూఁడవకంటిచూపునన్
గాముని నీఱుసేయుట జగంబుల మ్రోయుటయున్నఖండమై.

టీక :-
సుత్రాముడు = ఇంద్రుడు; సోమకళావతంసనుడు = చంద్రశేఖరుడు, శివుడు; స్రుక్కు = వెనుదీయు; మ్రోయుట = ధ్వనించుట; అఖండము = సమస్తము.
భావము :-
మన్మథుని పిలిచి గొప్పగా గౌరవించి బుజ్జగించి ఇంద్రుడు శివునిపైకి పంపగా కాముడు వెళ్ళి పూలబాణము వేసాడు. శివుడుకూడా వెనుదీయక మూడవకంటి చూపుతో కాముని బూడిద చేయుట సమస్త లోకాలకూ అఖండంగా మార్మోగుట జరిగింది.