పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : పంచమ పూర్వ - 139 - సంపూర్ణం

సింధుపతి విప్ర సంవాదంబు

(139) అంతటఁ గొన్ని హాయనములు చన సింధు¯ భూపాలనము చేయు భూవరుండు¯ ధీరత నిక్షుమతీ తీరమున నున్న¯ కపిల మహామునిఁ గాంచి తత్త్వ¯ విజ్ఞాన మెఱిఁగెడు వేడ్క తోడుత శిబి¯ కారోహణము చేసి యరుగుచుండ¯ నాలోన నాశిబికావహు లా చేనఁ¯ గాపున్న విప్రునిఁ గాంచి తెచ్చి (139.1) శిబిక మోపింత మీతనిచేత ననుచుఁ¯ బట్టి మూపునఁ బల్లకిఁ బెట్టి మోపు¯ మనుచు మోపించునంత ధరామరుండు¯ శిబిక మూఁపున నిడి యందుఁ జింత లేక. (140) తన మనసు కొలఁది నప్పుడు¯ మునుకొని యట్లప్రయత్నమున నడవఁగ నా¯ జనపతి నిమ్నోన్నతమై¯ చనుట యెఱిఁగి శిబిక మోచు జనులకు ననియెన్. (141) "మీర లిప్పు డిచటఁ జేరి మిక్కిలి ప్రయ¯ త్నంబుతోడఁ దగిలి నడచుచుండ¯ విషమ మగుచు గమనవేగంబు నను బాధఁ¯ బెట్టుచున్న" దనిన బెస్త లనిరి. (142) "దేవా! యీ విషమగమనంబు మావలన నైనది గా; దీ తురీయవాహకుండు సుఖగమనంబుగా నడవ నేరండు; వీనితోడ మేము నడవ నేరము"యనిన రహూగణుం డను నా రాజు పాసిత వృద్ధజనుం డైనను బలాత్కారంబునం బుట్టిన కోపంబునం గోపించి విమర్శ దప్పి నీఱుగప్పిన నిప్పునుం బోలె నెఱుంగరాని బ్రహ్మతేజంబుగల బ్రాహ్మణునికిం గంటకంబుగా నిష్ఠుర వాక్యంబుల నిట్లనియె. (143) "అలసితి; వెంతయున్ ముసలి; వాఁకట డస్సితి; వెన్ను మిక్కిలిం¯ బలుచన యున్న; దీ శిబిక భారము; దూరము మోసి; తే గతిన్¯ నిలిచెద?" వంచు భూవరుఁడు నిష్ఠురముల్దగ బల్క నా యెడం¯ బలుకక మోసె నా శిబిక బ్రాహ్మణవర్యుఁడు పార్థివేశ్వరా! (144) అప్పు డా విప్రవరుండు దనకుం గడపటి శరీరం బయిన కళేబరంబు నందు నహంకార మమకారంబులం బొందనీక మిథ్యాజ్ఞానరహితుండై బ్రహ్మభూతుండై మౌనవ్రతంబున నా శిబిక మోయుచున్న విషమగమనంబుఁ జూచి యతి కుపితుం డగుచు నా భూవరుండు వెండియు నిట్లనియె. (145) "ఓరి! దుర్మద! విన రోరి జీవన్మృత!¯ నా యాజ్ఞఁ దప్పించి నడచె దీవు; ¯ నీ వక్రమార్గంబు లిన్నియు విడిపించి¯ నడపింతు నిన్ను సన్మార్గమందు"¯ నని రాజగర్వాంధుఁ డగుచు గుణత్రయం¯ బున వృద్ధిఁ బొందిన భూవరుం డ¯ బద్ధప్రలాపము ల్పల్కుచుండినఁ జూచి¯ శమదమాదులచేఁ ప్రశస్తుఁ డగుచు (145.1) జగతి బ్రహ్మస్వరూపమై సకలభూత¯ ములకునత్యంతహితుఁడైన భూసురుండు¯ యోగివర్తన దెలియ లేకున్న రాజు¯ నంత వీక్షించి యల్ల ని ట్లనుచుఁ బలికె. (146) "నరేంద్రా! నీవు చెప్పునది సత్యంబు; భారం బీ శరీరంబునకే కాని నాకుం గలుగనేర; దైనను స్థౌల్యకార్శ్యంబులు వ్యాధులు నాధులు క్షుత్తృష్ణలు నిచ్ఛావిరోధభయంబులు జరామరణంబులు రోషనిద్రాజాగరణంబులు నహంకార మమకార మదశోషణాదులు దేహంబుతోడన జనియించుం గాని నాకుం గలుగనేరవు; జీవన్మృతుండ నేన కాదాద్యంతంబులు గలుగుటం జేసి యందఱి యందును గలిగి యుండు; స్వామిభృత్య సంబంధంబులు విధికృతంబు లగుచు వ్యవహారంబులం జేసి శరీరంబులకుం గలుగుంగాని జీవునికి లేక యుండుు; నదియునుంగాక రాజాభిమానంబున నీవు నన్నాజ్ఞాపించెదవేనిం బ్రమత్తుండవైన నీకుం బూర్వస్వభావం బెట్లుండె; నట్లుగాక యేనేమి చేయుదు? నెఱింగింపు; మున్మత్త మూకాంధ జడులు బోలె సహజస్వభావంబునుం బొందిన నాయందు నీ శిక్ష యేమి లాభంబుఁ బొందింప నేర్చు. నదియునుం గాక స్తబ్దుండు మత్తుండు నైన నాకు నీ శిక్ష వ్యర్థంబగు"నని పలికి యుపశమశీలుండైన మునివరుండు పూర్వకర్మశేషంబున గల్గు భారవాహకత్వంబుం దలంగం ద్రోయుటకు భారంబు వహించి శిబిక మోచుచుం జనునెడ నా రాజవల్లభుండు దత్త్వజ్ఞానాపేక్షితుండై చని యెడివాఁ డగుటం దన హృదయ గ్రంథి విమోచకంబులును బహు యోగగ్రంథ సమ్మతంబులును నగు బ్రాహ్మణవాక్యంబులు విని యా శిబిక దిగ్గన డిగ్గనుఱికి యావిప్రునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి సర్వ గర్వవర్జితుండై ముకుళిత హస్తుం డగుచు ని ట్లనియె. (147) "ధరణీసురులలోనఁ దలఁప నెవ్వఁడవు నీ¯ వవధూతవేషివై యవనియందు¯ నేమిటికై చరియింపంగ వచ్చి? తి¯ చట నొక్కఁడవు నొంటి చనుట నేఁడు¯ ననుఁ గృతార్థునిఁ జేయ ననుకూలుఁ డగుచున్న¯ యట్టి యా కపిలమహామునీంద్రుఁ¯ డవొ? నీ మహత్త్వంబు దవిలి విచారింప¯ నెఱుఁగక చేసితిఁ; గరుణఁ జూడు (147.1) తప్పుసైరింపు; నే యమదండమునకు¯ హరుని శూలంబునకును వజ్రాయుధమున¯ కనల చంద్రార్క ధనదశస్త్రాస్త్రములకు¯ వెఱవ విప్రుని కే మది వెఱచినట్లు. (148) మఱియు నిస్సంగుండవయి జడుండునుంబోలె నిగూఢ విజ్ఞానంబు గలిగి చరియించుచు నున్నవాఁడవు; నీ వచనంబులు యోగశాస్త్ర సమానంబులై వాఙ్మనసంబులకు నభేద్యంబులయి యున్న; వే నవ్విష్ణుకళావతీర్ణుండు సాక్షాద్ధరియు నగు కపిలమహాముని వలన బ్రహ్మవిద్య దెలియం గోరి చనుచున్నవాఁడ; నీవు లోకనిరీక్షణార్థం బవ్యక్తలింగుండవై చరియించుచున్న కపిలమహామునీంద్రుండవు గాబోఁలుదువు; మందుండైన గృహస్థుండు యోగీశ్వర చరిత్రంబు లెట్టు లెఱుంగనేర్చు? కర్మవశంబున దృష్టంబైన భ్రాంతి వహించుచు నడచుచునున్న యీ యాశ్రమంబు నాకునుం బోలె నీకు నగు నని తోఁచుచున్న; దది యెట్లనిన ఘటంబు లేక జలంబు దేనేరని తెఱంగున లేనిది గలుగనేరదు; గావునం బ్రమాణమూలం బయిన లోక వ్యవహారంబు సత్పథంబున సమ్మతంబై యుండుటం జేసి నీ వాడు వాక్యంబులు నాకు సమ్మతంబు గానేర"వని సింధు దేశాధీశ్వరుండు వినిపించిన నా విప్రుండు లోకవ్యవహారంబునకు నిత్యత్వం బౌపాధికం బగుంగాని నిత్యంబు గానేరదని దృష్టాంత నిదర్శనంబుగా నిట్లనియె. (149) "పావక శిఖలచే భాండంబు దాఁ దప్త¯ మగుఁ; దప్త ఘటముచే నందు నున్న¯ జలము తపించు; నా జలముచేఁ దండులం¯ బులు తప్త మొంది యప్పుడు విశిష్ట¯ మైన యన్నం బగు; నా చందమునను దా¯ దేహేంద్రియంబులఁ దెలివితోడ¯ నాశ్రయించుక యున్న యట్టి జీవునకు దే¯ హంబునఁ బ్రాణేంద్రియాదికమున (149.1) జరుగుచుండు నిట్లు సంసారఘట వృత్తి¯ దుండు నయిన రాజు దుష్టమైన¯ కర్మములకుఁ బాసి కంజాక్షపద సేవఁ¯ జేసెనేని భవముఁ జెందకుండు." (150) అనుచు ధారుణీసురాత్మజుఁ డీ రీతి¯ బలుకుటయును రాజు పరిణమించి¯ వినయవాక్యములను వినుతించి క్రమ్మఱఁ¯ బుణ్యుఁ డైన సింధు భూవరుండు. (151) "మహాత్మ! నేను రాజ ననియెడి యభిమాన మదాంధుండనై మహాత్ములం దిరస్కరించిన నన్నుఁ గరుణింపుము; నీ వార్తబంధుండవు; నీ కృపాదృష్టింజేసి మహాత్ముల నవమానంబు చేసిన దురితంబువలన విముక్తుండ నయ్యెద; విశ్వసుహృత్త వైన నీకుం గోపంబు గలుగనేర; దసమర్థులయిన మాబోఁటి వారలు మహాజనావమానంబున శీఘ్రంబె నశింతురు; గావున నీవు దయాళుండ వయి నన్ను మన్నింపు"మనిన నా విప్రుం డిట్లనియె. (152) "కడు వేడ్క నీ వవిద్వాం¯ సుఁడవై యుండియును మిగులఁ జోద్యము విద్వాం¯ సుఁడుఁ బోలెను బలికెద వి¯ ప్పుడు మేలనవచ్చుఁగొంత పురుషులలోనన్ (153) పరఁగఁ బెద్ద లీ ప్రపంచమంతయుఁ దథ్య¯ మనరు; నీవు తథ్య మనుచుఁ బలికి; ¯ తట్లుగాన నిన్ను నధికుండ వని పల్క¯ రాదు నాకుఁ జూడ రాజచంద్ర! (154) యజ్ఞాదికములందు నామ్నాయములయందుఁ¯ దఱచుగాఁ దత్త్వవాదంబు లేదు ¯ స్వప్నంబునందుల సౌఖ్యమాకారంబు¯ నందుల నిత్యమై యంతలేని¯ యట్టి చందమున వేదాంత వాక్యంబులు¯ తత్త్వంబు నెఱిఁగించి తలఁగుఁగాని¯ నిత్యంబులై యుండనేరవు; పురుషుని¯ చిత్తంబు గుణములఁ జెంది యెంత (154.1) కాలముండును మఱి యంత కాలమందు¯ నరయ విజ్ఞాన కర్మేంద్రియములచేత¯ మరగి ధర్మంబులను నధర్మంబులట్లు¯ దగిలి పుట్టించుచుండు నత్యంత మహిమ. (155) మఱియు ధర్మాధర్మవాసనాయుక్తంబు విషయానురక్తంబు నైన చిత్తంబు గుణ ప్రవాహంబులచేత వికారంబు నొంది దేవతిర్యఙ్మనుష్య రూపంబు లయిన దేహంబులం బుట్టించుచుఁ గాలప్రాప్తంబులైన సుఖదుఃఖ తదుభయ ఫలంబు లననుభవించుచు ననవరతంబు జీవునికిం బ్రత్యక్షం బగుచు స్థూల సూక్ష్మరూపంబుల నుండు; స్వాంతంబు గుణరహితంబైన ముక్తి కారణంబగు; ఘృతవర్తులుగల దీపంబు సధూమ శిఖలం బుట్టించు; ఘృతవర్తులు నాశంబు నొందిన స్వరూపంబుఁ బొందు; నీ తెఱంగున మనంబు గుణకర్మానుబంధంబైన జన్మాదులం బుట్టించు; గుణకర్మంబులం బాసెనేనిం బరతత్త్వంబు నొందు; జ్ఞానేంద్రియంబు లేనును విషయంబులమీఁదఁ దోఁచు; బుద్ధు లేనును నభిమానంబును నను నేకాదశవృత్తులం గూడిన మనంబు జీవునికి నసంఖ్యంబు లయిన జన్మంబుల బొందించు; మనోవృత్తుల నతిక్రమించిన జీవుండు పరంజ్యోతియైన నారాయణ స్వరూపంబుగా నెఱుంగుము; స్థావర జంగమంబు లయిన జీవులకుం బవనుండు ప్రాణంబై యున్న చందంబున నీశ్వరుండు సర్వభూతాంతర్యామి యగుచు జీవాత్మ స్వరూపంబున నుండు; జీవాత్ముండు జ్ఞానోదయంబునం జేసి మాయ నెంతకాలంబు గెలువకుండు నంతకాలంబు ముక్తసంగుండు గాఁ; డరిషడ్వర్గంబును జయించి పరతత్త్వంబు నెఱింగిన నీశ్వరుం డగు; చిత్తం బెంత కాలంబు విషయాసక్తం బగు నంతదడవు సంసారచక్రంబు నందు సంచరించుం గావున మహావీరుండైనను దనకు శత్రువైన మనంబు నప్రమత్తుండయి యుపేక్షాబుద్ధింజేసి యిచ్ఛావిహారంబున జరగనీక పరమ గురుండైన శ్రీహరిచరణోపాసనాస్త్రంబునం జిత్తంబు గెలిచినం బరతత్త్వంబు నొందు"నని విప్రుండు పలికిన నతని మహిమకు వెఱఁ గంది బ్రాహ్మణునకు నమస్కారంబుచేయుచు భూవరుం డిట్లనియె. (156) "కారణ విగ్రహంబు నురుకాయము నీ యవధూతవేషమున్¯ భూరిధరామరత్వమును బూర్వసమాగమ మాత్మభావముం¯ జారువిహార మత్యతుల శాంతి గుణంబును గూఢ వర్తనం¯ బారయఁ గల్గు నీకు ననయంబును మ్రెక్కెదఁ బెక్కు భంగులన్. (157) జ్వరితార్తుం డగు రోగి కౌషధ మతీష్టంబైన చందంబునన్¯ ధరలో నాతపతప్త దేహి గడు శీతంబైన తోయంబునున్¯ గరిమం గోరినరీతి నెంతయు నహంకారాహి దష్టుండనై¯ పరఁగున్ నాకును నీ వచోమృతము దప్పన్ మందు వేఱున్నదే? (158) విప్రవర్య! నేను వేడ్కతో నా సంశ¯ యంబులెల్ల నిన్ను నడిగి తెలియఁ¯ దలఁచి యున్నవాఁడ; దప్పక యెఱిఁగింపు¯ ముచితవృత్తిఁ దత్త్వయోగమెల్ల. (159) అని యడిగిన యా రాజునకు విప్రుం డిట్లనియె. (160) కాన వచ్చిన ఫలములు కర్మమూల¯ ము లగుటను జేసి సంసారములను జిత్త¯ మెపుడు వర్తించుచుండఁగా నెఱుఁగ లేవు¯ తత్త్వయోగంబు మిగుల నిత్యం బటంచు. (161) మఱియు నీ వసుంధర నున్న చరణంబులకు నెక్కుడు జంఘ లా మీఁద జానువు లా పొడవున నూరువు లందులకు నుపరిప్రదేశంబున మధ్యం బట మీఁద నుర మందులకు నెక్కున కంఠం బటమీఁద స్కంధం బందుల దారు వా దారువున శిబిక శిబిక యందు రాజ ననియెడి యభిమానంబుగలిగి నీవున్నవాడ విట్టి చోద్యంబయిన కష్టదశంబొందిన నీవు ప్రజాపాలనంబు చేయుచున్నవాఁడ; నను గర్వంబున మా వంటి మహాత్ముల సభలలోనం బూజ్యుండవుగాక యున్నవాడ; వీ స్థావర జంగమంబులకు నివాస స్థానంబు వసుంధర యైన చందంబున సత్క్రియలచేత నెఱుఁగం దగిన జగత్కారణంబైన తత్త్వంబు నెఱింగించెద; పరమాణు సముదయం బీ ధరిత్రియైన చందంబున నవిద్యామనంబులచేతం గల్పితం బయిన కృశస్థూల బృహదణు సదసజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ కాల నామ బుద్ధిరూపంబైన మాయచే జగత్తు రెండవదియై కల్పింపంబడియె; బాహ్యాభ్యంతరంబులం గలిగి స్వప్రకాశంబై భగవచ్ఛబ్దవాచ్యంబును విశుద్ధంబును బరమార్థంబును జ్ఞానరూపంబును నైన బ్రహ్మంబు బొకటియే సత్యంబు; జగత్తసత్యం బగు"; నని పలికి మఱియును (162) ధరలోన బ్రహ్మంబుఁ దపమున దానంబు¯ లను గృహధర్మంబులను జలాగ్ని¯ సోమసూర్యులచేత శ్రుతులచే నైనను¯ బరమ భాగవతుల పాదసేవఁ¯ బొందిన మాడ్కిని బొందంగ రాదని¯ పలుకుదు రార్యులుఁ బరమమునులు¯ ఘనతపోబాహ్య సౌఖ్యములకు విముఖులు¯ నై పుణ్యులు హరిగుణానువాద (162.1) మోదితాత్ములు నగు బుధపాదసేవ¯ ననుదినంబును జేసిన నంతమీఁద¯ మోక్షమార్గంబునకును బద్మాక్షునందు¯ బట్టుపడి యుండు నెప్పుడుఁ బరఁగబుద్ధి. (163) నరేంద్రా! యేను బూర్వంబున భరతుం డను రాజను; సర్వసంగపరిత్యాగంబు చేసి భగవదారాధనంబు చేయుచు మృగంబుతోడి స్నేహంబు కతన మృగంబనై పుట్టియు నందును హరిభక్తి దప్పకుండిన కతంబున నిప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గంబును బాసి యేకాకి నై చరియించు చున్నవాఁడ; నరుండు వృద్ధసంసేవం జేసి సంసార మోహంబును బాసి హరిధ్యానకథలచే లబ్ధజ్ఞానుండై పుండరీకాక్షునిం బూజించుచుం బరలోకంబునుం బొందు"నని పలికి విప్రుండు మఱియు నిట్లనియె (164) "ధరణీశ! మాయచేతను దాఁటఁగారాని¯ పదమునఁ బెట్టంగఁబడ్డ జీవుఁ¯ డెలమిమై గుణకర్మములఁ జేయుచును లాభ¯ మాశించి తిరుగు బేహారి మాడ్కి¯ ఫల మపేక్షించుచుఁ బాయక జీవుండు¯ సంసారగహన సంచారి యగుచు¯ ననవరతము నుండు నా మహావనమందుఁ¯ గామ లోభాది తస్కరులుగూడి (164.1) ధరణి విజితేంద్రియుఁడు గాని నరునిఁబట్టి¯ ధర్మ మనియెడి యా మహాధనమునెల్ల¯ నరసి గొనిపోవుచుండుదు రనుదినంబుఁ¯ గాన సంసారమందు నాకాంక్ష వలదు. (165) అరయఁగ సంసారాటవిఁ¯ దరలక యా పుత్రమిత్ర దారాదు లనం¯ బరఁగుచు నుండెడు వృకములు¯ పరువడి నరబస్తములను భక్షించు వడిన్. (166) మలసి సంసృతి ఘోరకానన మందిరంబుల నెల్లనుం¯ జెలఁగి గుల్మలతాతృణాదులచేత గహ్వరమైన ని¯ శ్చలనికుంజములందు దుర్జన సంజ్ఞలంగల మక్షికం¯ బుల నిరోధము దన్ను సోఁకినఁ బొందుచుండు విపద్దశన్. (167) మఱియు నీ గృహస్థమార్గంబునం దెల్ల¯ విషయములను బొంది విశ్వమెల్లఁ¯ గడఁకతోడ నిట్లు గంధర్వలోకంబుఁ¯ గాఁ దలంచి మిగుల మోదమందు. (168) మరిగి కాననమునఁ గొఱవిదయ్యముఁ గాంచి¯ యగ్నిఁగోరి వెంట నరుగుమాడ్కిఁ¯ గాంచనంబు గోరి కలవారియిండ్ల పం¯ చలను దిరుగు నరుఁడు చలనమంది. (169) బహుకుటుంబి యగుచు బహుధనాపేక్షచే¯ నెండమావులఁగని యేగు మృగము¯ కరణిఁ బ్రేమఁజేసి గురువులు వాఱుచు¯ నొక్కచోట నిలువకుండు నెపుడు. (170) మఱియు నొక్కచోట మత్తుఁ డై పవన ర¯ జోహతాక్షుఁ డగుచుఁ జూపు దప్పి¯ దిక్కెఱుంగ కొండుదిశ కేగు పురుషుని¯ కరణిఁ దిరుగు నరుఁడు నరవరేణ్య! (171) మఱియు నొక్కచోట నులూక ఝిల్లీ స్వనంబులతోడ సమానంబు లయిన శత్రురాజి తిరస్కారంబులకు దుఃఖపడుచు, నొక్కచోట క్షుధార్దితుండై యపుణ్య ఫలవృక్షంబుల నాశించు మాడ్కిఁ బాపకర్ములు ద్రవ్యహీనులు నగు వారి నాశ్రయించుచు, నొక్క యెడం బిపాసాతురుండై జలహీనం బయిన నదికిఁ జనిన రీతి నిహపరదూరు లైన పాషండుల సేవించుచు, మఱియు నొక్క ప్రదేశంబునం దగ్నిచేతం దప్తుడయిన వాఁడు దావాగ్నిం జేరి వ్యధ నొందురీతి, నన్నార్థి యగుచు దాయాదులం జేరి దుఃఖించుచు, మఱియు నొక్కచోటఁ బరబాధం జేసి మున్ను గానక రాజ్యాభిలాషం బ్రాణసఖులైన పితృపుత్రభ్రాతృ జ్యేష్ఠుల నైనను వధియించుచు, మఱియు శూరులచేతం గొట్టుబడి సర్వధనంబును బోనాడి చింతాపరవశుండై దుఃఖించుచు నున్నంత గంధర్వనగరప్రాయంబైన సంసార సుఖంబు ననుభవించి మోదించుచు, మఱియు నగారోహణంబు చేయు నరుండు గంటక పాషాణాదులవలనం బాదపీడితుం డగుచు దుఃఖించు చందంబున గృహాశ్రమోచిత మహానుష్ఠానంబునకు నుపక్రమించి వ్యసన కంటక శర్కరాపీడితుండై దుఃఖించుచు, నొక్కచోటన్ జఠరాగ్నిపీడితుండై కుటుంబంబు మీఁద నాగ్రహించుచు, వనంబున నజగరగళితుండై జీర్ణితుండైన చందంబున రాత్రి గృహాటవి యందు నిద్రాపరవశుండై యెఱుంగక వర్తించుచు, మఱియును వనంబునఁ దృణచ్ఛన్న కూపపతితుం డగుచు సర్పదష్టుండైన తెఱంగున సంసారి యై దుర్జనులచేత వ్యధితహృదయుం డగుచు నంధుండై యజ్ఞానాంధ కూపంబునం బడుచు, నొక్క యెడ జుంటితేనియకునై మక్షికాబాధ నత్యంతదుఃఖితుం డయిన మాడ్కిని సంసారకాముండై పరదార ద్రవ్యా భిలాషి యగుచు భూపాలకులచేతనైనను గృహపతిచేతనైనను దాడితుండై నరకంబునం బడుచు యౌవనంబున సంపాదించిన ద్రవ్యంబులు పరులచేతం బోనాడిన విధంబున శీతవాతాద్యనేక ప్రయాస లబ్ధంబైన ధనంబు వోనాడి సంసారి యతిచింతాక్రాంతుం డై యుండు; మఱియును వనంబున లుబ్ధకులు సంసృష్టంబయిన యల్పామిషంబునకు నన్యోన్య వైషమ్యంబునం గలహించిన విధంబున సంసృష్ట వ్యవహారియై యల్పద్రవ్యంబులకుం బోరాడుచుండు"నని భూపాలు నకు విప్రుండు సంసారాటవి తెఱం గెఱింగించి వెండియు నిట్లనియె. (172) "అల్పధనుఁడు విశ్రమాస్థానములఁ దృప్తిఁ¯ బొంద కొరుల ధనముఁ బొందఁ గోరి¯ యరిగి వారివలన నవమానములఁ బొంది¯ యధికమైన దుఃఖ మనుభవించు. (173) అంతఁ గొందఱల్ల నన్యోన్యవిత్తాది¯ వినిమయమునఁ గడుఁ బ్రవృద్ధమైన¯ వైరములనుబొంది పోరాట మొందుదు¯ రాత్మచింత లేక యనుదినంబు. (174) సంసారమార్గ సంచారుఁడై యధిక ప్ర¯ యాసంబునను గూర్చు నర్థములను¯ విహరించుచును గొంద ఱిహలోక ఫలములఁ¯ గోరుచు మోక్షంబు గోర కంతఁ¯ జెడిపోవుచుందు; రెపుడు గాని యందుకుఁ¯ గడపటి యోగంబుఁ గానలేరు; ¯ మానవంతులు నసమానశౌర్యులు నగు¯ వారు మిక్కిలియైన వైరబుద్ధి (174.1) నాహవంబున మడియుదు; రంతె కాని¯ మోక్షమార్గంబు గానరు మూఢవృత్తి¯ ననుచు సంసార గహన విహార మెల్లఁ¯ దెలిపి క్రమ్మఱ ననియె ధాత్రీసురుండు. (175) "మఱియుం గాలచక్రనియంత్రితుండై చక్రాయుధునిం గొల్వక కాక గృధ్ర బకసమానులైన పాషాండులతోడి సఖ్యంబునం జేసి వారలచేత వంచితుండై బ్రాహ్మణకులంబునంజేసి శ్రౌత స్మార్తకర్మానుష్ఠానపరుం డై విషయసుఖంబు లందుఁ దగులుబడి కాలంబు తుద నెఱుంగక వృక్షంబులుం బోలె నైహికార్థంబులయందుఁ దృష్ణ గలిగి మైథున నిమిత్తంబు సుతదారాదులయందు స్నేహంబు చేయుచుఁ బథికుండు మాతంగంబుల యందు భయంబున దీర్ఘనిమ్నకూపంబునం బడిన తెఱంగున సంసారమృత్యు గజ భయంబున గిరికంధరప్రాయం బయిన యజ్ఞాన తమంబునం బడుం గావున మాయచేత సంసారమార్గం బైన రాజ భావంబు విడిచి సర్వభూతమైత్రి గలిగి జితేంద్రియుండవై జ్ఞానాసిచే మార్గంబు కడపల గను"మని పలికిన భూపాలుం డిట్లనియె. (176) "అక్కట! మానుష జన్మము¯ పెక్కువయై యుండు నెపు డభేదమతిం బెం¯ పెక్కిన యోగిసమాగమ¯ మక్కజముగఁ గలిగెనేని నఖిలాత్ములకున్. (177) ధరణీసురవర! నీ శ్రీ¯ చరణాంబుజ యుగళ రేణు సంస్పర్శము నా¯ దురితంబు లడఁచె; నింతట¯ హరిభక్తియు నంతకంత కధికం బయ్యెన్. (178) మఱియు విప్రవరులయందు యోగీశ్వరు లవధూత వేషంబునం జరియించు చుందురు; గావున విప్రులు పిన్న పెద్ద లనక యందఱకు నమస్కారం"బని స్తుతియించిన నా యోగీశ్వరుండును సింధుపతికిఁ గరుణాన్వితుం డగుచుఁ దత్త్వజ్ఞానం బుపదేశించి యారాజుచేత వందిత చరణుండై పూర్ణార్ణవంబునుం బోలె సంపూర్ణకరుణారసపూరిత స్వాంతుండై వసుంధరం జరియించుచుండె; సింధుభూపతియును సుజన సమాగమంబున లబ్ధతత్త్వజ్ఞానుండయి దేహాత్మభ్రమం బాసె;" నని పలికిన శుకయోగీంద్రునకుం బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. (179) "అరయఁగ మక్షికంబు వినతాత్మజుఁ గూడఁగలేని రీతి యీ¯ భరతుని సచ్చరిత్రములు ప్రస్తుతి చేయఁగ నీ వసుంధరన్¯ నరపతు లెల్ల నోపరు మనంబున నైనను నెంచ; నింక నా¯ భరతుని పుణ్యవర్తనముఁ బ్రస్తుతిచేయఁగ నాకు శక్యమే? (180) నరేంద్రా! భరతుండు సుతదారరాజ్యాదులను బూర్వకాలంబునంద విడిచి భగవత్పరుం డగుచు యజ్ఞరూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును బ్రకృతిపురుష స్వరూపంబును నైన నారాయణునకు నమస్కారం బనుచు మృగరూపంబును బాసె; నట్టి భరతుని చరిత్రం బెవ్వరు చెప్పిన నెవ్వరు వినిన నట్టివారలఁ బుండరీకాక్షుండు రక్షించు; నాయు రభివృద్ధి యగు; ధనధాన్య సమృద్ధియు నగుచుండ స్వర్గోపభోగంబులం బొందుదు; రని.

పూర్ణి

(181) నరదేవాసుర యక్షరాక్షస మునీంద్రస్తుత్య! దివ్యాంబరా¯ భరణాలంకృత! భక్తవత్సల! కృపాపారీణ! వైకుంఠ మం¯ దిర! బృందావనభాసురప్రియధరిత్రీనాథ! గోవింద! శ్రీ¯ కర! పుణ్యాకర! వాసుదేవ! త్రిజగత్కల్యాణ! గోపాలకా! (182) పరమపదవాస! దుష్కృత¯ హర! కరుణాకర! మహాత్మ! హతదితిసుత! భా¯ సురగోపికామనోహర! ¯ సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా! (183) సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా! ¯ భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా! ¯ నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా! ¯ గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా! (184) ఇది సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్యప్రణీతంబైన శ్రీ మహాభాగవతపురాణమునందుఁ బ్రియవ్రతుని సుజ్ఞాన దీక్షయు, బ్రహ్మదర్శనంబును, నాగ్నీధ్రాదుల జన్మంబును, నుత్తమ తామస రైవతుల జన్మంబును, బ్రియవ్రతుండు వనంబునకుం జనుటయు, నాగ్నీధ్రుం డప్సరసం బరిగ్రహించుటయు, వర్షాధిపతుల జన్మంబును, నాగ్నీధ్రుండు వనంబునకుం జనుటయు, నాభి ప్రముఖుల రాజ్యంబును, నాభి యజ్ఞంబును, ఋషభుని జన్మంబును, ఋషభుని రాజ్యభిషేకంబును, భరతుని జన్మంబును, ఋషభుండు దపంబునకుఁ జనుచు సుతులకు నతుల జ్ఞానం బుపదేశించుటయు, భరతుని పట్టాభిషేకంబును, భరతుండు వనంబునకుఁ జనుటయు, భరతుండు హరిణపోతంబునందలి ప్రీతింజేసి హరిణగర్భంబున జనించుటయు, మరల విప్రసుతుండై జనియించుటయు, విప్రుండు చండికాగృహంబున బ్రదికివచ్చుటయు, సింధుపతి విప్ర సంవాదంబును నను కథలు గల పంచమ స్కంధంబు నందుఁ ప్రథమాశ్వాసము సమాప్తము.