పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 77-180

కృష్ణాది నిర్యాణంబు

(77) యదుకులనిధియగు కృష్ణుని¯ పదజలజవియోగతాపభరమున మాటల్¯ ప్రిదులక హృదయంబెరియఁగఁ¯ బెదవులుదడుపుచును వగలఁ బెంపఱియుండెన్." (78) అనిచెప్పి బాదరాయణి¯ మనుజేంద్రునివలను సూచి మఱి యిట్లనియెన్¯ "విను మొకనాఁడీ యుద్ధవుఁ¯ డనయము నైదేండ్ల బాలుఁడై యున్నతఱిన్. (79) మున్ను కృష్ణునిం గూడియాడు బాలకులలో నొక్క బాలునిఁ గృష్ణునింగా భావించి పరిచర్యసేయుచుండ గుణవతీమతల్లి యగు తల్లి సనుదెంచి "యాకొంటి విదియేల రావన్న"యని పిలిచిన జననీవాక్యంబులు గైకొనక యఖండతేజోనిధియైన పుండరీకాక్షుపాదారవింద మకరందసేవానురక్తింజేసి యున్న యుద్ధవుండు నేఁడు కృష్ణవియోగతాపంబున హరివార్త విదురునకుఁ జెప్పంజాలక యొప్పఱి యుండుట యేమి చిత్రం"బని వెండియు నిట్లనియె "అంత నుద్ధవుండు సరోజాక్షపాదారవింద మకరందసుధాజలనిధి నిమగ్నమానసుం డై గద్గదకంఠుం డగుచు. (80) ఘనముగ నెమ్మనమున మిం¯ చిన కృష్ణవియోగజనిత శిఖిదరికొనఁగాఁ¯ గనుఁగవఁ బెడచే నొత్తుచుఁ¯ బెనుపొందిన దురితశిఖరిభిదురున్ విదురున్. (81) కనుంగొని యిట్లనియె (82) "యముఁడను ఘనకాలభుజం¯ గమపుంగవుఁడెగచిపట్టఁగా యదువంశో¯ త్తముల చరిత్రలుఁదత్కుశ¯ లములేమని చెప్పుదుంగలంగెడిమనమున్. (83) మునిజనముఖపద్మములు ముకుళింపంగ¯ ఖలజనలోచనోత్పలము లలర¯ జారచోరులకోర్కి సఫలతనొందగ¯ దానవదర్పాంధతమస మడర¯ వరయోగిజనచక్రవాకంబు లడలంగ¯ కలుషజనానురాగంబు పర్వ¯ భూరిదోషాగమస్పూర్తి వాటిల్లంగ¯ నుదిత ధర్మక్రియ లుడిగిమడఁగ (83.1) మానుషాకారరుచికోటి మందపఱచి¯ యనఘ యేమన నేర్తుఁ గృష్ణాభిదాన¯ లోకబాంధవుఁ డుత్తమశ్లోకమూర్తి¯ మించుతేజంబుతో నస్తమించెనయ్య. (84) మఱియును. (85) హల కులిశ జలజ రేఖా¯ లలితశ్రీకృష్ణపాదలక్షితయై ని¯ ర్మలగతి నొప్పెడు ధరణీ¯ లలనామణి నేఁ డభాగ్య లక్షణ యయ్యెన్. (86) యాదవులవలన రాజ్య¯ శ్రీదొలఁగెను ధర్మగతి నశించెను భువి మ¯ ర్యాదలు దప్పె నధర్మో¯ త్పాదనమున దైత్యభేదిదప్పినపిదపన్. (87) మఱియు లలితనికషణవిరాజమాన మణిగణకిరణ సుషమావిశేష విడంబిత విమలసలిలంబు లందుఁ బ్రతిఫలిత సంపూర్ణచంద్రమండల రుచి నిరీక్షించి జలచరబుద్ధింజేసి తజ్జలవిలోలమీనంబు లనూన స్నేహంబునం దలంచు చందంబునఁ, గృష్ణానుచరులైన యదు వృష్ణి కుమారు లమ్మహనీయమూర్తిం దమకు నగ్రేసరుండని కాని లీలా మానుషవిగ్రహుండైన పరమాత్ముండని యెఱుంగక, హరిమాయా జనితంబగు నసద్భావంబునంజేసి భోజన శయనాసనానుగమనంబులం జేరి సహోదరాదిభావంబులం గూడి చరియింతురు; అద్దేవుని మాయాపయోనిధినిమగ్నులు గాకుండ నబ్జభవాదులకైనం దీఱదు సర్వగుణగరిష్ఠులును సత్పురుష శ్రేష్ఠులును నగు పరమభాగవతులకుం దక్కఁ దక్కినవారలకుం జెప్పనేల; అదియునుంగాక, యభిజన విద్యా ధన బల గర్వమదాంధీభూతచేతస్కులైన శిశుపాలాది భూపాలకు లమ్మహాత్మునిం బరతత్త్వంబని యెఱుంగక నిందించు దుర్భాషలు దలంచి మనస్తాపంబు నొందుచుండుదు"నని, వెండియు. (88) "అవితృప్తేక్షణధీసమాహిత తపోవ్యాసంగులైనట్టి భా¯ గవతశ్రేష్ఠుల కాత్మమూర్తి నిఖిలైకజ్యోతిమైఁజూపి శో¯ కవిశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మా¯ నవరూపంబగు దేహమున్ వదలి యంతర్ధానుఁ డయ్యెం జుమీ. (89) మానవైకవికాసమానమై తనకును¯ విస్మయజనకమై వెలయునట్టి¯ యాత్మీయయోగమాయాశక్తిఁ జేపట్టి¯ చూపుచు నత్యంతసుభగుఁ డగుచు¯ భూషణంబులకును భూషణంబై వివే¯ కములకెల్లనుఁ బరకాష్ఠ యగుచు¯ సకలకల్యాణసంస్థానమై సత్యమై¯ తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి (89.1) తాన తనమూర్తి నిజశక్తిఁ దగ ధరించె¯ యమతనూభవు రాజసూయాధ్వరంబు¯ నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ¯ నిండువేడుకఁ జూచి వర్ణించుచుండు. (90) ప్రకటముగఁ గమలభవసృ¯ ష్టికిఁ గారణ మిమ్మహాత్ముఁడే యనుచును ను¯ త్సుకులై తన్మూర్తిని ద¯ ప్పకచూచిరిగాదె తత్సభాజనులెల్లన్. (91) మఱియు శాంతోగ్రరూపధరుఁడైన సర్వేశ్వరుండు శాంతరూపుండు గావునఁ, బరకృతాపరాధ నిపీడ్యమానసుండయ్యు ననుకంపాయత్త చిత్తుండై వర్తించు పరాపరుండునుఁ బ్రకృతికార్యంబైన మహతత్త్వరూపుండును జననవిరహితుం డయ్యును దారువులువలన ననలంబు దోఁచు చందంబున జననంబు నొందుచుండు; అట్టి సరోజనాభుని హాసరాసలీలానురాగ విలోకన ప్రతిలబ్ధమానలైన గోపకామినులు దన్మూర్తి దర్శనానుషక్త మనీషలం గలిగి వర్తించి; రదియునుం గాక. (92) దివిజులకోర్కెఁ దీర్ప వసుదేవుని యింట జనించి కంసదా¯ నవుఁడు వధించునన్భయమునంజని నందుని యింట నుంటకున్¯ యవనజరాసుతాదులకు నాజినెదుర్పడలేక సజ్జన¯ స్తవమథురాపురిన్ విడిచి దాగుటకున్ మదిఁ జింతనొందుదున్. (93) అదియునుం గాక. (94) కడఁగి పెక్కిడుమలఁ గుడుచుచుఁ జిత్తముల్¯ కలఁగఁగ బంధనాగారములను¯ వనరిన దేవకీవసుదేవులను డాయఁ¯ జనుదెంచి భక్తివందన మొనర్చి¯ "తలిదండ్రులార! యేఁ గలుగంగ మీరలు¯ కంసుచే నలజడిఁ గ్రాగుచుండఁ¯ గడగి శత్రునిఁ జంపఁగాలేక చూచుచు¯ నున్న నాతప్పుఁ బ్రసన్ను లగుచుఁ (94.1) గావుఁ"డని యానతిచ్చిన దేవదేవు¯ నద్భుతావహ మధురవాక్యములఁ దలఁచి¯ తలఁచి నాచిత్తమునఁ బెద్దగలుగుచుందుఁ¯ బృథులపాతకభూమిభృద్భిదుర విదుర! (95) విమలమతిఁదలఁప నెవ్వని¯ బొమముడి మాత్రమున నిఖిలభూదేవీభా¯ రము వాయునట్టి హరిపద¯ కమలమరందంబు గ్రోలు ఘనుఁడెవ్వాడో? (96) మందప్రజ్ఞుఁడనై గో¯ విందుని మురదైత్యహరుని విష్ణునిఁ బరమా¯ నందుని నందతనూజుని¯ మందరధరుఁ జిత్తమందు మఱతునె యెందున్. (97) అదియునుఁ గాక, మీరు నృపులందఱుఁ జూఁడగ ధర్మసూతి పెం¯ పొదవిన రాజసూయసవనోత్సవమందును జన్మమాదిగాఁ¯ బదపడి యెగ్గొనర్చు శిశుపాలుఁడు యోగిజనంబు లిట్టిద¯ ట్టిదని యెఱుంగనోపని కడిందిపదంబునునొందెనే కదా. (98) కురునృప పాండు నందను లకుంఠితకేళిఁ జమూసమేతులై¯ యరిగి రణోర్వి నెవ్వని ముఖాంబురుహామృత మాత్మలోచనో¯ త్కరములఁ గ్రోలి పార్థవిశిఖప్రకరక్షతపూతగాత్రులై¯ గురుతర మోక్షధామమునకుం జని సౌఖ్యము నొందిరో తుదిన్. (99) అట్టి సరోజాక్షుఁ డాద్యంతశూన్యుండు¯ సుభగుండు త్రైలోక్యసుందరుండు¯ గమనీయ సాగరకన్యకాకుచకుంకు¯ మాంకిత విపులబాహాంతరుండు¯ సకలదిక్పాలభాస్వత్కిరీటన్యస్త¯ పద్మరాగారుణపాదపీఠుఁ¯ డజుఁ డనంతుఁడు సమానాధికవిరహితుం¯ డిద్ధమూర్తిత్రయాధీశ్వరుండు (99.1) నైన హరి యుగ్రసేనుని నఖిలరాజ్య¯ రుచిరసింహాసనమునఁ గూర్చుండఁబెట్టి¯ భృత్యుభావంబునొంది సంప్రీతి నతని¯ పనుపుసేయుట కెపుడు నామనముగుందు." (100) అని వెండియు నిట్లనియె "అనఘా! పరాత్పరుండును యోగీశ్వరుండును నగు కృష్ణుండు భగవద్భక్తుండునుఁ బరమ భాగవతోత్తముండును నైన యుగ్రసేనుని సేవించుట యాశ్చర్యంబు గాదు; తన్ను హరియింపం దలంచి కుచంబుల విషంబు ధరియించి స్తన్యపానంబు సేయించిన దుష్టచేతన యైన పూతనకుం జన్నిచ్చిపెంచిన యశోదాదేవికి నైన నందరాని నిజపదంబుఁ గారుణ్యచిత్తుండై యొసెంగె ననిన, నిజపాదధ్యానపరాయణు లగువారల ననుసరించి సేవించుట సెప్పనేల"యనిన నుద్ధవునికి విదురుం డిట్లనియె "భక్తవత్సలుండునుఁ గారుణ్యనిధియు నై భాగవతజనుల ననుగ్రహించు పుండరీకాక్షుండు నిజదాసలోకంబున కొసంగు పరమపదంబు నుగ్రకరులైన రాక్షసుల కెట్లొసంగె అత్తెఱం గెఱింపు"మనిన విదురునకు నుద్ధవుం డిట్లనియె. (101) "దనుజానీక మనేక వారములు దోర్దర్పంబు సంధిల్లఁగా¯ వినుతాసూను భుజావరోహుఁ డగు నవ్విష్ణున్ సునాభాస్త్రుఁ దా¯ రనిలో మార్కొని పోకు పోకు హరి దైత్యారాతి! యంచుం దదా¯ ననముం జూచుచుఁ గూలి మోక్షపదముం ప్రాపింతు రత్యున్నతిన్. (102) ధీరజనోత్తమ! నవసిత¯ సారసలోచనుఁడు గృష్ణుజననంబునుఁ ద¯ చ్చారిత్రము నెఱిఁగింతును¯ దారత నీ విపుడు వినుము తద్విధమెల్లన్. (103) ధరణిభరంబు వాపుటకుఁ దామరసాసను ప్రార్థనన్ రమా¯ వరుఁ డల కంస బంధననివాసమునన్ వసుదేవదేవకీ¯ వరులకు నుద్భవింప బలవంతుఁడు గంసుఁడు హింససేయు న¯ న్వెరపున నర్థరాత్రి సుతునిం గొని యవ్వసుదేవుఁ డిమ్ములన్. (104) నందుని మందకుఁ జని త¯ త్సుందరితల్పమునఁ బరులు సూడకయుండన్¯ నందను నినునిచి యానక¯ దుందుభి మరలంగ నేగెఁ దొల్లిటి పురికిన్. (105) హరి యేకాదశ సంవ¯ త్సరములు నందవ్రజమునఁ దను హరి యని యె¯ వ్వరు నెఱుఁగకుండ నా హల¯ ధరుతోఁ గ్రీడించుచుండె దద్దయు బ్రీతిన్. (106) గోపాలవరులకైనను¯ నాపోవఁగఁ దన సమంచితాకార మొగిం¯ జూపని శ్రీపతి వేడుక¯ గోపాలురఁ గూడి కాచె గోవత్సములన్. (107) అయ్యవసరంబునం గృష్ణుండు లీలావినోదంబులు తోడిగోపాలబాలురకుం జూపం దలంచి. (108) వర యమునానదీ సలిల వర్ధిత సౌరభ యుక్త పుష్ప మే¯ దుర మకరంద పానపరితుష్ట మధువ్రతయూధ మాధవీ¯ కురవక కుంద చందన నికుంజము లందు మయూర శారికా¯ పరభృత రాజకీర మృదుభాషల భంగిఁ జెలంగి పల్కుచున్. (109) శ్రీరమణీమనోవిభుఁడు సింహకిశోరముఁబోలి లీలఁ గౌ¯ మారదశన్ రమావిమలమందిరముం బురుడించు గోతతిన్¯ వారక మేపుచుండెఁ దన వంశరవస్ఫుటమాధురీసుధా¯ సారముచేత గోపజనసంఘములన్ ముదమందఁజేయుచున్. (110) మఱియును. (111) చిరకేళీరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులం¯ గరమొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునం¯ గరుణాతీతులఁ గామరూపు లగు నక్కంసప్రయుక్తక్షపా¯ చరులం గృష్ణుఁడు సంగరస్థలములం జక్కాడె లీలాగతిన్. (112) వరయమునానదీజల నివాస మహోరగ విస్తృతాస్య వి¯ స్ఫురిత విషానలప్రభల సోకునఁ గ్రాగిన గోప గోధనో¯ త్కరముల నెల్లఁ గాచి భుజగప్రవరున్ వెడలంగఁదోలి త¯ త్సరిదమలాంబు పానమున సంతసమందగఁ జేసె గోతతిన్. (113) దివిజాధీశుగుఱించి వానకొఱకై దీపింప నందాది వ¯ ల్లవు లేటేఁట ననూనసంపదల నుల్లాసంబునం జేయు ను¯ త్సవముం గృష్ణుఁడు మాన్పి గోపగణముల్ సంప్రీతినొందన్ శచీ¯ ధవు గర్వం బడఁపంగ నవ్యయముగాఁ దాఁ జేసె గోయాగమున్. (114) హరిహయుఁ డంత రోషవివశావిలమానసుఁడై సరోరుహో¯ దరు మహిమం బెఱుంగక మదం బడరంగ వలాహకాది భీ¯ కర ఘనపంక్తిఁ బంపిన నఖండశిలామయ భూరి వర్షముల్ ¯ కురిసె ననూన గర్జనల గోకుల మాకుల మౌచుఁ గుందఁగన్. (115) ఆతఱి మంద గొందలము నందఁగ వల్లవు లెల్లఁ "గృష్ణ! యీ¯ చేతనులెల్ల నిట్టి జడిఁ జిందఱవందఱలై కలంగుచుం¯ గాతరు లైరి నీవు గృపఁ గావుము; కావు మనాథనాథ! ని¯ ర్థూతకళంక! భక్తిపరితోషణభూషణ! పాపశోషణా!" (116) అని యిబ్భంగి విపన్నులై పలుకఁ గుయ్యాలించి కృష్ణుండు స¯ జ్జనవర్ధిష్ణుఁడు గోపగోనివహరక్షాదక్షుడై దేవతా¯ జను లగ్గింపఁ గరాంబుజాతమున సచ్ఛత్రంబుగాఁ దాల్చె బో¯ రన గోవర్థన శైలముం దటచరద్రమ్యామరీజాలమున్. (117) వెండియు. (118) శరదాగమారంభ సంపూర్ణపూర్ణిమా¯ చంద్ర సాంద్రాతపోజ్జ్వలిత మగుచు¯ వెలయు బృందాటవీవీథి యందొకనాడు¯ రాసకేళీ మహోల్లాసుఁ డగుచు¯ రుచిర సౌభాగ్యతారుణ్యమనోరమ¯ స్ఫూర్తిఁ జెన్నొందిన మూర్తి దనర¯ సలలితముఖచంద్రచంద్రికల్ గోపికా¯ నయనోత్పలముల కానంద మొసగ (118.1) భవ్యచాతుర్యభంగిఁ ద్రిభంగి యగుచు¯ నబ్జనాభుండు సమ్మోద మతిశయిల్ల¯ లీలఁ బూరించు వరమురళీ నినాద¯ మర్థి వీతేర విని మోహితాత్ము లగుచు. (119) పతులు మఱుందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సము¯ న్నతి వలదన్న మానక మనంబునఁ గృష్ణపదాబ్జసేవనా¯ న్వితరతి గోపకామినులు వేచనుదేర దయాపయోధి శో¯ భితగతి రాసకేళి సలిపెం దరుణీనవపుష్పచాపుడై. (120) రాముఁడు దానుఁగూడి మధురాపురికిం జని యందు వైభవో¯ ద్దామ నృపాసనంబున ముదంబున నున్న దురాత్ముఁ గంసు దు¯ ష్టామరశత్రుఁ ద్రుంచి ముదమారఁగఁ దల్లిని దండ్రి నంచిత¯ శ్రీమహితాత్ములై తనరఁజేసె సరోరుహనాభుఁ డున్నతిన్. (121) నలువొప్పంగ షడంగ యుక్త మహితామ్నాయంబు చౌషష్టివి¯ ద్యలు సాందీపనిచే నెఱింగెఁ జెలువొందన్ విన్నమాత్రంబులో¯ పలనే లోకగురుండు దాన తనకున్ భావింప నన్యుల్ గురు¯ ల్గలరే లోకవిడంబనార్థ మగు లీలల్ గావె యమ్మేటికిన్. (122) మించి ప్రభాసతీర్థమున మృత్యువశంబునఁ బొంది పోయి యా¯ పంచజనోదరస్థుఁ డగు బాలకు దేశికునందనుం బ్రభో¯ దంచితలీలఁ దెచ్చి గురుదక్షిణగా నతిభక్తియుక్తి న¯ ర్పించె గురుండు చిత్తమునఁ బెంపెసలార మురారి వెండియున్. (123) ఘనుఁడు విదర్భేశుఁడన నొప్పు భీష్మకు¯ వరసుతామణి నవవారిజాక్షి¯ పద్మాసమానరూపశ్రీవిభాసిత¯ కమనీయభూషణఁగంబుకంఠి¯ చతురస్వయంవరోత్సవ సమాగత చైద్య¯ సాల్వ మాగధ ముఖ్య జనవరేణ్య¯ నికరసమావృతఁ బ్రకట సచ్చారిత్ర¯ రుక్మిణి నసమానరుక్మకాంతి (123.1) నమర గుప్తామృతంబు విహంగవిభుఁడు¯ కొనినకైవడి మనుజేంద్రకోటిఁ దోలి¯ కమలనాభుండు నిజభుజాగర్వ మలరఁ¯ దెచ్చి వరియించె; నతని నుతింప వశమె? (124) పరువడిఁ బట్టి సప్తవృషభంబుల ముక్కులు గుట్టఁ దద్బల¯ స్ఫురణ సహింపఁజాలక నృపుల్ తలపడ్డ జయించి నగ్నజి¯ ద్ధరణిపునందనన్ వికచతామరసాక్షిఁ బ్రమోదియై స్వయం¯ వరమునఁ బెండ్లియాడె గుణవంతుఁ డనంతుఁ డనంత శక్తితోన్. (125) ప్రతివీరక్షయకారి నాబరఁగి సత్రాజిత్తనూజాహృదీ¯ ప్సితముం దీర్పఁ దలంచి నాకమునకుం బెంపారఁగా నేగి వ¯ ర్ణితశౌర్యోన్నతిఁ బారిజాత మిలకున్ లీలాగతిం దెచ్చె ను¯ ద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుఁ డన నేతన్మాతృఁడే చూడగన్. (126) మానితాఖిల జగన్మయ దేహమునఁ బొల్చు¯ ధరణిదేవికిఁ బ్రియతనయుఁ డైన¯ నరకదానవుని సునాభాఖ్యఁ జెన్నొందు¯ ఘన చక్రధారా విఖండితోత్త¯ మాంగునిఁ జేయ నయ్యవనీలలామంబు¯ వేఁడినఁ దత్పుత్రు విపులరాజ్య¯ పదమున నిల్పి లోపలి మందిరంబులఁ¯ జిరముగ నరకుండు సెఱలఁ బెట్టి (126.1) నట్టి కన్యలు నూఱుఁబదాఱువేలు¯ నార్తభాంధవుఁడైన పద్మాక్షుఁ జూచి¯ హర్షభాష్పాంబుధారా ప్రవర్ష మొదవఁ¯ బంచశరబాణ నిర్భిన్నభావ లగుచు. (127) లలితఁ దదీయ సుందర విలాస విమోహితలైన వారినిం¯ బొలసిన గోర్కిఁదీర్చుటకు నొక్కముహూర్తమునన్ వరించి క¯ న్యల లలితావరోధభవనంబుల నందఱ కన్నిరూపులై¯ కలసి సుఖస్థితిం దనిపెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్. (128) చతురతతో నందొక్కొక¯ యతివకుఁ బదురేసి సుతుల నాత్మసముల ను¯ న్నతభుజశక్తులఁ గాంచెను¯ వితతంబై కీర్తి దిశల వినుతుకి నెక్కన్. (129) మధురాపురముఁ జతుర్విధ బలౌఘములతో¯ నావరించిన కాలయవన సాల్వ¯ మగధభూపాలాది మనుజేంద్ర లోకంబు¯ సైన్యయుక్తముగాఁగ సంహరించి¯ తన బాహుశక్తిఁ జిత్తముల నర్థించిన¯ భీమపార్థులకు నుద్దామ విజయ¯ మొసఁగి తద్వైరులనుక్కడంగఁగఁ ద్రుంచి¯ బాణ శంబర ముర పల్వలాది (129.1) దనుజనాయక సేనావితానములను¯ హలధరాది సమేతుఁడై హతులఁ జేసె¯ దంతవక్త్రాది దైత్యులు దన్ను నెదుర¯ భండనములోనఁ ద్రుంచె దోర్బలము మెఱసి. (130) వెండియుం, గృష్ణుండు గౌరవపాండవ భండనంబునకుం దోడ్పడి రాజన్యు లన్యోన్య మాత్సర్యోత్సహ సమేతులై సైనికపాదఘట్టనంబుల ధరాచక్రంబు గంపింప నసమాన్యంబు లయిన శంఖభేరీ ప్రముఖ తూర్యఘోషంబులు నింగి మ్రింగఁ దురంగమరింఖాసముద్ధూత ధూళిపటల పరిచ్ఛన్న భానుమండలంబునుంగాఁ జనుదెంచి కురుక్షేత్రంబున మొహరించిన నుభయపక్షంబులం దునుమాడి; నిఖిలరాజ్యవైభవ మదోన్మత్తుం డైన సుయోధనుండు నిఖిల రాజసమక్షంబునఁ గర్ణ శకుని దుశ్శాసనాదుల దుర్మంత్రంబున నిరంతరంబుఁ గుంతీనందనుల కెగ్గుసేసిన దోషంబునంజేసి సంగరరంగంబున భీముగదాఘాతంబునం దొడలు విరిగి పుడమింబడి గతాయుశ్శ్రీవిభవుండై యుండఁ జూచినం గదా పరితుష్టచిత్తుండ నగుదు; నని యపరిమిత బాహుబలోత్సాహు లైన భీష్మ ద్రోణ భీమార్జునులచేత నఖిల ధరాధిపతుల నష్టాదశాక్షౌహిణీ బలంబులతోడం దునిమించె; మఱియు స్వసమాన బలులయిన యదువీరుల జయింప నెంతవారలకైనం దీరదని మధుపానమద విఘూర్ణిత తామ్రలోచనులై వర్తించు యాదవుల కన్యోన్యవైరంబులు గల్పించి పోరించి యితరేతర కరాఘాతంబుల హతులై తన్నుఁ గలసినం గాని భూభారంబుడగ దని చిత్తంబునఁ దలంచి; అంత ధర్మనందనునిచే నిస్సపత్నం బగు రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయించుచు మర్త్యులకుం గర్తవ్యంబులైన ధర్మపథంబులు సూపుచు బంధుమిత్రుల కెల్లఁ బరితోషంబు నొందించుచుం దత్పరోక్షంబున వారివంశం బుద్ధరింపఁ దలంచి యభిమన్యువలని నుత్తరయందు గర్భంబు నిలిపి గురుతనయప్రయుక్త మహిత బ్రహ్మాస్త్రపాతంబునం దద్గర్భదళనంబు గాకుండ నర్భకుని రక్షించి నిజపదారవింద సేవారతుం డై న ధర్మసుతుచేఁ గీర్తి ప్రతాపంబులు నివ్వటిల్లం దురంగమేధంబులు మూఁడు సేయించి; వెండియు. (131) వలనొప్ప లౌకికవైదికమార్గముల్¯ నడపుచు ద్వారకానగర మందు¯ నవిదితాత్మీయమాయా ప్రభావమున ని¯ స్సంగుఁడై యుండి సంసారిపగిదిఁ¯ జెంది కామంబులచేత విమోహితుం¯ డై సుఖించుచు ముదితాత్ముఁ డగుచు¯ నంచిత స్నిగ్ధస్మితావలోకముల సు¯ ధాపరిపూర్ణసల్లాపములను (131.1) శ్రీనికేతనమైన శరీరముననుఁ¯ బాండునందన యదుకుల ప్రకరములను¯ లీలఁ గారుణ్య మొలయఁ బాలించుచుండె¯ నార్తరక్షాచణుండు నారాయణుండు. (132) సంపూర్ణపూర్ణిమా చంద్రచంద్రిక నొప్పు¯ రమణీయశారదరాత్రు లందు¯ సలలితకాంచనస్తంభ సౌధోపరి¯ చంద్రకాంతోపలస్థలము లందు ¯ మహిత కరేణుకా మధ్య దిగ్గజముల¯ గతిని సౌదామినీలతల నడిమి¯ నీలమేఘంబులలీల ముక్తాఫల¯ లలిత మధ్యస్థ నీలముల భాతి (132.1) సతత యౌవనసుందరీయుత విహారుఁ¯ డగుచు సతు లెంద ఱందఱ కన్నిరూప¯ ములనుఁ గ్రీడించె బెక్కబ్దములు సెలంగి¯ నందనందనుఁ డభినవానందలీల. (133) అంతనొక్కనాఁడు. (134) మునివరు లేగుదేర యదుముఖ్యులు గొందఱు గూడి ముట్టఁబ¯ ల్కినఁ గనలొంది వారు దమకించి శపించినఁ గొన్నిమాసముల్¯ చనునెడ దైవయోగమున జాతరఁబో సమకట్టి వేడుకల్¯ మనములఁ దొంగిలింప గరిమన్ నిజయానము లెక్కి యాదవుల్. (135) కోరి ప్రభాసతీర్థమునకుం జని తన్నదిఁ గ్రుంకి నిర్మలో¯ దారత నందు దేవ ముని తర్పణముల్ పితృతర్పణంబులున్¯ వారని భక్తిఁ జేసి నవవత్సలతోఁ బొలుపారు గోవులన్¯ భూరిసదక్షిణాకముగ భూసురకోటికి నిచ్చి వెండియున్. (136) అజిన పట రత్నకంబళ¯ రజత మహారజత తిల ధరావరకన్యా¯ గజతురగ రథములను స¯ ద్విజకోటికి నిచ్చిఁ బెంపు దీపింపంగన్. (137) ఇట్లు సఫలంబులైన భూదానంబు మొదలుగాఁగల దానంబు లనూనంబులుగా భగవదర్పణబుద్ధిం జేసి యనంతరంబ. (138) ఎసగు మోదంబు సంధిల్ల నిష్టమైన¯ రసిక మృదులాన్న మర్థిఁ బారణలుసేసి¯ మంజులాసవరసపానమత్తు లగుచుఁ¯ గడగి యన్యోన్నహాస్యవాక్యములఁ గలఁగి. (139) ఇట్లు దమలోన మదిరాపాన మద విఘూర్ణిత తామ్రలోచను లయి మత్సరంబుల నొండొరులం బొడిచి సమస్త యాదవులును వేణూజాతానలంబునఁ దద్వంశ పరంపరలు దహనంబు నొందు చందంబునం బొలిసి రది యంతయుం గనుంగొని శ్రీకృష్ణుం డప్పుడు. (140) చతురతతో నిజమాయా¯ గతిఁ జూచి లసద్విలోలకల్లోల సమం¯ చిత విమల కమల సార¯ స్వతజలముల విహితవిధులు సలిపినవాఁడై. (141) ఒక వృక్ష మూలతలమున¯ నకలంక గుణాభిరాముఁ డాసీనుండై¯ యకుటిలమతి బదరీవని¯ కిఁక నీ వరుగు మని మొఱఁగి యేగిన నేనున్. (142) క్రమమున నిజకులసంహా¯ రము సేయఁ గడంగు టెఱిగి రమణీయశ్రీ¯ రమణు చరణాబ్జయుగ విర¯ హమునకు మది నోర్వలేక యనుగమనుఁడనై. (143) హరి నరయుచుఁ జనిచని యొక¯ తరుమూలతలంబు నందుఁ దన దేహరుచుల్¯ పరగఁగ నున్న మహాత్మునిఁ¯ బరునిఁ బ్రపన్నార్తిహరుని భక్తవిధేయున్. (144) మఱియును. (145) అస్మత్ప్రియస్వామి నచ్యుతుఁ బరు సత్త్వ¯ గుణగరిష్ఠుని రజోగుణవిహీను¯ సురుచిరద్వారకాపురసమాశ్రయు ననా¯ శ్రయు నీలనీరదశ్యామవర్ణు¯ దళదరవిందసుందరపత్రనేత్రు ల¯ క్ష్మీయుతుఁ బీతకౌశేయవాసు¯ విలసితవామాంకవిన్యస్త దక్షిణ¯ చరణారవిందు శశ్వత్ప్రకాశు (145.1) ఘనచతుర్భాహు సుందరాకారు ధీరుఁ¯ జెన్నుగల లేతరావిపై వెన్నుమోపి¯ యున్న వీరాసనాసీను నన్నుఁగన్న¯ తండ్రి నానంద పరిపూర్ణు దనుజహరుని. (146) కంటిఁగంటి భవాబ్ధి దాటఁగఁ గంటి నాశ్రితరక్షకుం¯ గంటి యోగిజనంబుడెందముఁ గంటిఁ జుట్టముఁ గంటి ము¯ క్కంటికింగనరాని యొక్కటిఁ గంటిఁ దామరకంటిఁ జే¯ కొంటి ముక్తివిధానముం దలకొంటి సౌఖ్యము లందగన్. (147) అయ్యవసరంబునం బరమ భాగవతోత్తముండును, మునిజన సత్తముండును, ద్వైపాయన సఖుండునుఁ, బరమ తపోధనుండును, నఘశూన్యుండును, యఖిలజన మాన్యుండును, బుధజనవిధేయుండును నగు మైత్రేయుండు తీర్థాచరణంబు సేయుచుం జనిచని. (148) కనియెం దాపసపుంగవుం డఖిలలోకఖ్యాతవర్ధిష్ణు శో¯ భనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు యోగీంద్రహృ¯ ద్వనజాతైకచరిష్ణుఁ గౌస్తుభముఖోద్యద్భూషణాలంకరి¯ ష్ణు నిలింపాహితజిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్. (149) తదనంతరంబ హరి దన¯ హృదయాబ్జము నందు ముకుళితేక్షణముల స¯ మ్మదమునఁ జూచుచు నానత¯ వదనుండై యుండె ముదము వఱలఁగ ననఘా! (150) అంత దగ్గఱ నేతెంచి యున్న మైత్రేయుండు వినుచుండ దరహాస చంద్రికా సుందర వదనారవిందుండును, నానందసుధానిష్యంద కందళిత హృదయుండును, భక్తానురక్త దయాసక్త విలోకనుండును నగు పుండరీకాక్షుండు నన్ను నిరీక్షించి యిట్లని యానతిచ్చె "పూర్వ భవంబున వసుబ్రహ్మలుసేయు సత్రయాగంబున వసువై భవదీయ హృదయంబున నితర పదార్థంబులు గోరక మదీయ పాదారవిందసేవం గాంక్షించితివి గావునఁ దన్నిమిత్తంబున నేను నీ హృదయంబున వసియించి సమస్తంబునుఁ గనుచుండుదు; యాత్మారాముండునైన నన్ను నెవ్వరేనియు సదసద్వివేకులై యెఱుంగం జాలరు వారలకు నేను నగోచరుండనై యుండుదు; మత్పరిగ్రహంబు గల నీకు నీజన్మంబ కాని పునర్భవంబు నొందకుండుటకు భవదీయ పూర్వజన్మ కృతసుకృత విశేష ఫలంబు కతంబున నియ్యాశ్రమంబున మత్పాదారవింద సందర్శనంబు కలిగె; నదియునుంగాక పద్మకల్పంబు నందు మన్నాభిపద్మమధ్య నిషణ్ణుం డగు పద్మసంభవునకు జన్మమరణాది సంసృతి నివర్తకంబును యవిరతా నశ్వరసౌఖ్య ప్రవర్తకంబును నగు మన్మహత్త్వంబుఁ దెలియ జేయు నద్దివ్యజ్ఞానంబు నీకునెఱింగింతు." నని యమ్మహనీయ తేజోనిధి యానతిచ్చిన సుధాసమాన సరసాలాపంబులు కర్ణకలాంపంబులై మనస్తాపంబులం బాపిన రోమాంచ కంచుకిత శరీరుండను, నానందభాష్పధారాసిక్త కపోలుండనుఁ, బరితోష సాగరాంతర్నిమగ్న మానసుండను నయి యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి యిట్లంటి. (151) "పురుషోత్తమ! నీ పదసర¯ సీరుహ ధ్యానామృతాభిషేకస్ఫురణం¯ గరమొప్పిన నా చిత్తమి¯ తర వస్తువు లందు వాంఛఁ దగులునె యెందున్. (152) జననములేని నీవు భవసంగతి నొందుట కేమి కారణం¯ బనియునుఁ, గాలసంహరుఁడవై జగముల్ వెలయించు నీవు పా¯ యని రిపుభీతికై సరిదుదంచిత దుర్గము నాశ్రయించు టె¯ ట్లనియును దేవ నామనము నందుఁ దలంతు సరోజలోచనా! (153) అదియునుంగాక. (154) శ్రీరమణీశ్వర నీ వా¯ త్మారాముఁడ వయ్యు లీలఁ దరుణీకోటిం¯ గోరి రమించితి వనియును¯ వారక యేఁ దలఁతు భక్తవత్సల! కృష్ణా! (155) పరతత్త్వజ్ఞులు గరుణా¯ కర! నిను సంసారరహితుగాఁ దలపోయ¯ న్నరసి నినుఁ గాంచు టెల్లనుఁ¯ గరమరుదు తలంచి చూడఁ గమలాధీశా! (156) దేవా! నీ వఖండిత విజ్ఞాన రూపాంతఃకరణుండ వయ్యును ముగ్ధభావంబునఁ బ్రమత్తుని చందంబున విమోహికైవడిం బ్రవర్తించుచు నెందేని నొదిఁగి యుండుటం దలంచి నా డెందంబు గుందుచుండు; అరవిందలోచన! సురవందిత! ముకుంద! ఇందిరాసుందరీరమణ! సరస్వతీరమణునకుం గరుణించిన సుజ్ఞానంబు ధరించు శక్తి నాకుం గలదేనిఁ గృపసేయుము భవదీయ శాసనంబు ధరియించి భూరి సంసారపారావారోత్తరణంబు సేయుదు"అని విన్నవించి బహుభంగులం బ్రస్తుతించిన భగవంతుడునుఁ బ్రపన్నపారిజాతంబును నైన కృష్ణుండు పరతత్త్వనిర్ణయంబు నెఱింగించిన. (157) సరసిజలోచన కరుణా¯ పరిలబ్ధజ్ఞానకలిత భావుఁడ నగుటన్¯ హరితత్త్వవేదినై త¯ చ్ఛరణసరోజముల కెరఁగి సమ్మతితోడన్. (158) హరి పదజలరుహ విరహా¯ తురతన్ దుర్దాంత దుఃఖతోయధిఁ గడవన్¯ వెరవేది తిరుగవలసెను¯ సరసిజభవకల్పవిలయ సమయము దాఁకన్. (159) ఇట్లు దిరుగుచు. (160) నరనారాయణ దాపసాశ్రమ పదౌన్నత్యంబునం బొల్చు భా¯ సుర మందార రసాల సాల వకుళాశోకామ్ల పున్నాగకే¯ సర జంబీర కదంబ నింబ కుటజాశ్వత్థస్ఫురన్మల్లికా¯ కరవీరక్షితిజాభిరామ బదరీకాంతార సేవారతిన్. (161) చనుచున్నవాఁడ"నని ప¯ ల్కిన పలుకుల కులికి కళవళించుచు విదురుం¯ డనుపమశోకార్ణవమున¯ మునిఁగియు నిజయోగ సత్త్వమునఁ దరియించెన్. (162) ఇట్లు విదురుండు శోకపావకునిం దన వివేకజలంబుల నార్చి యుద్ధవున కిట్లనియె. (163) "అనఘా! యుద్ధవ! నీకుఁ గృష్ణుఁ డసురేంద్రారాతి మన్నించి చె¯ ప్పిన యధ్యాత్మ రహస్యతత్త్వ విమలాభిజ్ఞానసారంబు బో¯ రన నన్నుం గరుణించి చెప్పినఁ గృతార్థత్వంబునం బొందెదన్¯ విను పుణ్యాత్ములు శిష్యసంఘముల నుర్విం బ్రోవరే? వెండియున్. (164) భగవద్భక్తులు సుజనులుఁ¯ దగవెఱిఁగి పరోపకారతాత్పర్యవివే¯ కగరిష్ఠులై చరింతురు¯ జగతిం బొగడొంది వృష్ణిసత్తమ యెందున్."

మైత్రేయునిఁ గనుగొనుట

(165) అనవుడు నుద్ధవుఁ డవ్విదు¯ రున కిట్లను "ననఘ! మునివరుఁడు సాక్షాద్వి¯ ష్ణునిభుండగు మైత్రేయుఁడు¯ దన మనమున మనుజగతి వదలఁ దలఁచి తగన్. (166) హరి మురభేది పరాపరుఁ¯ గరుణాకరుఁ దలఁచు నట్టి ఘనుఁ డమ్మునికుం¯ జరు కడకేఁగిన నాతడు¯ గరమర్థిం దెలుపు సాత్వికజ్ఞానంబున్." (167) అని యుద్ధవుండు విదురుం గూడి చనిచని. (168) ముందటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు హల్లకఫుల్లపద్మ ని¯ ష్యంద మరందపాన విలసన్మద భృంగ జలత్తరంగ మా¯ కంద లవంగ లుంగ లతికాచయ సంగ సురాంగనాశ్రితా¯ నందితపుణ్యసంగ యమునన్ భవభంగ శుభాంగ నర్మిలిన్. (169) కని డాయనేఁగి మోదం¯ బునఁ దత్సరిదమల పులిన భూములఁ దగ నా¯ దినశేషము నివసించెను¯ వనజోదరపాదపద్మవశమానసుఁడై (170) మఱునాఁడు రేపకడ భా¯ సురపుణ్యుఁడు ఘనుడు మధునిషూదనచరణ¯ స్మరణక్రీడాకలితుఁడు¯ దరియించెం గలుషగహనదహనన్ యమునన్. (171) ఇట్లుద్ధవుండు యమునానది నుత్తరించి బదరికాశ్రమంబునకుం జనియె"అనిన విని రాజేంద్రుండు యోగీంద్రున కిట్లనియె. (172) "శౌరియు నతిరథవరులు మ¯ హారథ సమరథులు యదుబలాధిపు లెల్లం¯ బోరిఁ మృతిఁబొంద నుద్ధవుఁ¯ డేరీతిన్ బ్రతికె నాకు నెఱిగింపు తగన్." (173) నావుడు రాజేంద్రునకు శుకయోగీంద్రుఁ¯ డిట్లను "మున్ను లోకేశుచేత¯ సంప్రార్థితుండైన జలరుహనాభుండు¯ వసుమతిపై యదువంశమందు¯ నుదయించి తనుఁదాన మదిలోనఁ జింతించి¯ తెలివొంది యాత్మీయకులవినాశ¯ మొనరించి తానుఁ బంచోపనిషణ్మయ¯ మగు దివ్యదేహంబునందుఁ జెందఁ (173.1) దలఁచి విజ్ఞానతత్త్వంబు ధరణిమీఁదఁ¯ దాల్చి జనకోటి కెఱిఁగింపఁ దగిన ధీరుఁ¯ డుద్ధవుఁడు దక్క నితరులేనోప రితఁడు¯ నిర్జితేంద్రియుఁ డాత్మసన్నిభుఁ డటంచు (174) క్షితిపై నిలిపిన కతమున¯ నతనికి మృతి దొరకదయ్యె నవనీశ! రమా¯ పతి యభిమానము గలిగిన¯ యతిపుణ్యుఁడు చనియె బదరికాశ్రమమునకున్. (175) అంత. (176) ఉద్ధవుఁ డరిగిన పిదప స¯ మిద్ధపరిజ్ఞాను సుజనహితు మైత్రేయున్¯ వృద్ధజనసేవ్యుఁ దాపస¯ వృద్ధశ్రవుఁ జూఁడగోరి విదురుఁడు గడఁకన్. (177) యమునానది దాఁటి కతిపయప్రయాణంబులం బుణ్యనదులును హరిక్షేత్రంబులును దర్శించుచు నతి త్వరిత గమనంబున. (178) చనిచని ముందటఁ గనుగొనె¯ ఘనపాపతమఃపతంగఁ గరుణాపాంగం¯ గనదుత్తంగతరంగన్¯ జనవరనుతబహుళపుణ్యసంగన్ గంగన్. (179) అందు నరవింద సౌరభ¯ నందిత పవమాన ధూత నటదూర్మి పరి¯ స్పందిత కందళశీకర¯ సందోహ లసత్ప్రవాహ జలమజ్జనుఁడై. (180) ఘనసార రుచి వాలుకా సముదంచిత¯ సైకతవేదికాస్థలము నందు¯ యమనియమాది యోగాంగ క్రియానిష్ఠఁ¯ బూని పద్మాసనాసీనుఁ డగుచు¯ హరిపాదసరసీరుహన్యస్త చిత్తుఁడై¯ బాహ్యేంద్రియవ్యాప్తిఁ బాఱఁదోలి¯ సకలవిద్వజ్జన స్తవనీయ సముచితా¯ చార వ్రతోపవాసములఁ గ్రుస్సి (180.1) యున్న పుణ్యాత్ము విగతవయోవికారు¯ వినుతసంచారు భువనపావనవిహారు¯ యోగిజనగేయు సత్తతిభాగధేయు¯ నాశ్రితవిధేయు మైత్రేయు నచటఁ గాంచె.