పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 746 - 847

కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

(746) "విను; మనఘ! కృతయుగంబున¯ మునినాథుం డయిన కర్దముఁడు ప్రజల సృజిం¯ పను వనజసంభవునిచే¯ త నియుక్తుం డగుచు మది ముదము సంధిల్లన్. (747) ధీరగుణుఁడు సరస్వతీతీర మందుఁ¯ దవిలి పదివేల దివ్యవత్సరము లోలిఁ¯ దపముసేయుచు నొకనాఁడు జపసమాధి¯ నుండి యేకాగ్రచిత్తుఁడై నిండు వేడ్క. (748) వరదుఁ బ్రసన్ను మనోరథ¯ వరదానసుశీలు నమరవంద్యు రమేశున్¯ దురితవిదూరు సుదర్శన¯ కరుఁ బూజించిన నతండు కరుణాకరుఁడై. (749) అంతరిక్షంబునం బ్రత్యక్షం బైన. (750) తరణి సుధాకర కిరణ సమంచిత¯ సరసీరుహోత్పల స్రగ్విలాసు¯ కంకణ నూపురగ్రైవేయ ముద్రికా¯ హారకుండల కిరీటాభిరాము¯ కమనీయ సాగరకన్యకా కౌస్తుభ¯ మణి భూషణోద్భాసమాన వక్షు¯ సలలిత దరహాస చంద్రికా ధవళిత¯ చారు దర్పణ విరాజత్కపోలు (750.1) శంఖ చక్ర గదాపద్మ చారు హస్తు¯ నలికులాలక రుచిభాస్వదలికఫలకు¯ పీతకౌశేయవాసుఁ గృపాతరంగి¯ తస్మితేక్షణుఁ బంకజోదరుని హరిని. (751) మఱియు; శబ్దబ్రహ్మశరీరవంతుండును, సదాత్మకుండును, జ్ఞానైక వేద్యుండును, వైనతేయాంస విన్యస్త చరణారవిందుండును నయిన గోవిందుని గనుంగొని సంజాత హర్ష లహరీ పరవశుండును లబ్ధ మనోరథుండును నగుచు సాష్టాంగదండప్రణామంబు లాచరించి; తదనంతరంబ. (752) ముకుళిత కరకమలుండయి¯ యకుటిల సద్భక్తి పరవశాత్మకుఁ డగుచున్¯ వికచాంభోరుహలోచను¯ నకు నిట్లనియెం దదాననముఁ గనుఁ గొనుచున్. (753) "అబ్జాక్ష! సకల భూతాంతరాత్ముఁడ వనఁ¯ దనరుచుండెడి నీదు దర్శనంబుఁ¯ దలకొని సుకృతసత్ఫలభరితంబు లై¯ నట్టి యనేక జన్మానుసరణ ¯ ప్రకటయోగక్రియాభ్యాసనిరూఢు లై¯ నట్టి యోగీశ్వరు లాత్మఁ గోరి¯ యెంతురు యోగీశ్వరేశ్వర యే భవ¯ త్పాదారవింద సందర్శనంబు (753.1) గంటి భవవార్థిఁ గడవంగఁ గంటి మంటిఁ¯ గడఁగి నా లోచనంబుల కలిమి నేఁడు¯ తవిలి సఫలత నొందె; మాధవ! ముకుంద! ¯ చిరదయాకర! నిత్యలక్ష్మీవిహార! (754) అదియునుం గాక; దేవా! భవదీయ మాయావిమోహితులై హత మేధస్కులై సంసారపారావారోత్తారకంబులైన భవదీయ పాదారవిందంబులు దుచ్ఛవృత్తి కాము లయి సేవించి నిరయగతులైన వారికిం దత్కాయ యోగ్యంబు లగు మనోరథంబుల నిత్తు; వట్టి సకాము లైన వారిఁ నిందించు నేనును గృహమేధ ధేనువు నశేషమూలయుం, ద్రివర్గ కారణయుం, సమానశీలయు నయిన భార్యం బరిణయంబుగా నపేక్షించి కల్పతరుమూల సదృశంబు లైన భవదీయ పాదారవిందంబులు సేవించితి; నయిన నొక్క విశేషంబు గలదు; విన్నవించెద నవధరింపుము; బ్రహ్మాత్మకుండ వయిన నీదు వచస్తంతు నిబద్ధు లై లోకులు కామహతు లైరఁట; ఏనును వారల ననుసరించినవాఁడ నై కాలాత్మకుండ వైన నీకు నభిమతం బగునట్లుగాఁ గర్మమయం బైన భవదాజ్ఞాచక్రంబు ననుసరించుటకుఁ గాని మదీయ కామంబు కొఱకుఁ గాదు; భవదీయ మాయావినిర్మితంబును; గాలాత్మక భూరి వేగసమాయుక్తంబును; నధిమానస సమేత త్రయోదశ మాసారంబును; షష్ట్యుత్తరశతత్ర యాహోరాత్ర మయ పర్వంబును; ఋతుషట్క సమాకలిత నేమియుం; జాతుర్మాస్యత్రయ విరాజిత నాభియు; నపరిమిత క్షణలవాది పరికల్పిత పత్రశోభితంబునుం; గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును నైన కాలచక్రంబు సకల జీవనికరాయుర్గ్రసన తత్పరం బగుం; గాని కామాభిభూత జనానుగత పశుప్రాయు లగు లోకుల విడిచి భవ పరితాప నివారణ కారణం బయిన భవదీయ చరణాతపత్ర చ్ఛాయాసమాశ్రయులై తావకీన గుణకథన సుధాస్వాదన రుచిర లహరీ నిరసిత సకల దేహధర్ము లైన భగవద్భక్త జనాయుర్హరణ సమర్థంబు గాకుండు"నని వెండియు. (755) "అనఘా! యొక్కఁడ వయ్యు నాత్మకృత మాయాజాత సత్త్వాది శ¯ క్తినికాయస్థితి నీ జగజ్జనన వృద్ధిక్షోభ హేతుప్రభా¯ వని రూఢిం దగు దూర్ణనాభిగతి విశ్వస్తుత్య! సర్వేశ! నీ¯ ఘనలీలా మహిమార్ణవంబుఁ గడవంగా వచ్చునే? యేరికిన్. (756) దేవ! శబ్దాది విషయ సుఖకరం బగు రూపంబు విస్తరింపఁ జేయు టెల్ల నస్మదనుగ్రహార్థంబు గాని నీ కొఱకుం గా దాత్మీయమాయా పరివర్తిత లోకతంత్రంబు గలిగి మదీయ మనోరథ సుధాప్రవర్షి వైన నీకు నమస్కరించెద." (757) అని యిబ్భంగి నుతించినన్ విని సరోజాక్షుండు మోదంబునన్¯ వినతానందన కంధరోపరిచరద్విభ్రాజమానాంగుఁడున్¯ యనురాగస్మితచంద్రికాకలితశోభాలోకుఁడై యమ్మునీం¯ ద్రునిఁగారుణ్యమెలర్పఁజూచి పలికెన్ రోచిష్ణుఁడై వ్రేల్మిడిన్ (758) "మునివర! యే కోరిక నీ¯ మనమునఁ గామించి నను సమంచిత భక్తిన్¯ నెనరునఁ బూజించితి నీ¯ కనయము నా కోర్కి సఫల మయ్యెడుఁ జుమ్మీ." (759) అని యానతిచ్చి;ప్రజాపతిపుత్రుండును సమ్రాట్టును నైన స్వాయంభువమనువు బ్రహ్మావర్తదేశంబు నందు సప్తార్ణవమేఖలా మండిత మహీమండలంబుఁ బరిపాలించుచున్నవాఁ; డమ్మహాత్ముం డపరదివసంబున నిందులకు శతరూప యను భార్యాసమేతుండై భర్తృ కామ యగు కూఁతుం దోడ్కొని భవదీయ సన్నిధికిం జనుదెంచి; నీకు ననురూప వయశ్శీల సంకల్ప గుణాకర యైన తన పుత్రిం బరిణయంబు గావించు; భవదీయ మనోరథంబు సిద్ధించు; ననుం జిత్తంబున సంస్మరించు చుండు; నమ్మనుకన్య నిను వరించి భవద్వీర్యంబు వలన నతి సౌందర్యవతు లయిన కన్యలం దొమ్మండ్రం గను; నా కన్యకానవకంబు నందు మునీంద్రులు పుత్రోద్పాదనంబులు సేయంగలరు; నీవు మదీయ శాసనంబును ధరియించి మదర్పితాశేషకర్ముండ వగుచు; నైకాంతిక స్వాంతంబున భూతాభయదానదయాచరిత జ్ఞానివై నా యందు జగంబులు గలవనియు; నీ యందు నేఁ గల ననియు; నెఱింగి సేవింపుము. చరమకాలంబున ననుం బొందగలవు. భవదీయ వీర్యంబువలన నేను నీ భార్యాగర్భంబుఁ బ్రవేశించి మత్కళాంశంబునఁ బుత్రుండనై సంభవించి నీకుం దత్త్వసంహిత నుపన్యసింతు;"నని జనార్దనుండు గర్దమున కెఱింగించి; యతండు గనుగొనుచుండ నంతర్హితుండై. (760) అతుల సరస్వతీసరిదుదంచిత బాలరసాలసాల శో¯ భిత తట తుంగరంగ మగు బిందుసరంబు వినిర్గమించి యం¯ చిత గరుడాధిరోహణముసేసి తదీయ గరుత్ప్రభూత ఋ¯ క్ప్రతతివిలక్షణక్రమవిరాజితనాదము వించు మోదియై. (761) అరిగె వికుంఠధామమున కంత సకామనుఁ డైన కర్దముం¯ డరయ విమోహియై మనము నందును ముందట వచ్చు కోరికల్¯ పిరిగొనుచుండఁ దత్క్షణమ బిందుసరంబున కేగి యిందిరా¯ వరుఁ దలపోయుచుండె జనవంద్యుఁడు భక్తినితాంతచిత్తుఁ డై.

దేవహూతి పరిణయంబు

(762) అంత స్వాయంభువుండు గనకరథారూఢుం డగుచు నిజభార్యా సమేతుం డై భర్తృవాంఛాపరయైన పుత్రికం దోడ్కొనుచు నిజ తనూజకుం దగిన వరు నన్వేషించుచు భువనంబునం గలయం గ్రుమ్మరి; యెందునుం గానక వచ్చివచ్చి. (763) ముందటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు విష్ణుఁడు గర్దమున్ మహా¯ నంద మెలర్పఁ జూచి నయనంబుల రాలిన బాష్పముల్ ధరన్¯ బిందువులై వెసం దొరఁగి పేర్చి సరస్వతిఁ జుట్టి పాఱుటన్¯ బిందుసరోవరం బనెడి పేరఁ దనర్చిన పుణ్యతీర్థమున్. (764) అందుఁ దమాల సాల వకుళార్జున నింబ కదంబ పాటలీ¯ చందన నారికేళ ఘనసార శిరీష లవంగ లుంగ మా¯ కంద కుచందనక్రముక కాంచన బిల్వ కపిత్థ మల్లికా¯ కుంద మధూక మంజులనికుంజములం దనరారి వెండియున్ (765) పరిపక్వఫలభరానత¯ తరుశాఖానికర నివసితస్ఫుట విహగో¯ త్కర బహుకోలాహలరవ¯ భరితదిగంతములు గలిగి భవ్యం బగుచున్. (766) అతి నిశిత చంచు దళన¯ క్షత నిర్గత పక్వఫలరసాస్వాదన మో¯ దిత రాజశుక వచోర్థ¯ శ్రుతఘోషము సెలఁగ శ్రవణసుఖదం బగుచున్. (767) లలితసహకారపల్లవ¯ కలితాస్వాదన కషాయకంఠ విరాజ¯ త్కలకంఠ పంచమస్వర¯ కలనాదము లుల్లసిల్లఁ గడురమ్యములై. (768) అతుల తమాల మహీజ¯ ప్రతతిక్షణజాత జలదపరిశంకాంగీ¯ కృత తాండవఖేలన విల¯ సితపింఛవిభాసమాన శిఖి సేవ్యంబై. (769) కారండవ జలకుక్కుట¯ సారస బక చక్రవాక షట్పద హంసాం¯ భోరుహ కైరవ నవక¯ ల్హార విరాజిత సరోరుహాకర యుతమై. (770) కరి పుండరీక వృక కా¯ సర శశ భల్లూక హరిణ చమరీ హరి సూ¯ కర ఖడ్గ గవయ వలిముఖ¯ శరభప్రముఖోగ్ర వన్యసత్త్వాశ్రయ మై. (771) ఒప్పు నప్పరమ తాపసోత్తముని యాశ్రమంబుఁ గనుంగొని మిత పరిజనంబులతోడం జొచ్చి; యందు. (772) అంచితబ్రహ్మచర్యవ్రతయోగ్యమై¯ విలసిల్లు ఘనతపోవృత్తిచేత¯ దేహంబు రుచిర సందీప్తమై చెలువొందఁ¯ గడుఁ గృశీభూతాత్మ కాయుఁ డయ్యు¯ నలినోదరాలాపనవసుధాపూరంబు¯ శ్రోత్రాంజలులఁ ద్రావి చొక్కి యున్న¯ కతనఁ గృశీభూతకాయుండు గాక జ¯ టావల్కలాజిన శ్రీ వెలుంగఁ (772.1) గమలపత్ర విశాలనేత్రములు దనర¯ నలిన సంస్కార సంచితానర్ఘ నూత్న¯ రత్నమును బోలి యున్న కర్దమునిఁ జూచి¯ భక్తి నమ్మను వెఱఁగెఁ దత్పాదములకు. (773) ఇట్లు వందనంబు గావించినం గర్దముండు దన గృహంబునకు విందై చనుదెంచిన యమ్మనువు నాదరించి; యర్ఘ్యపాద్యాది విధులం బరితుష్టునిం గావించి; పూర్వోక్తంబైన భగవదాదేశంబు సంస్మరించి స్వాయంభువున కిట్లనియె. (774) వరగుణాకర! భగవద్భక్తి యుక్తుఁడ¯ వైన త్వదీయ పర్యటన మెల్ల¯ శిష్టపరిగ్రహదుష్టనిగ్రహముల¯ కొఱకుఁ గదా పుణ్యపురుష! మఱియు¯ వనజహితాహిత వహ్నిసమీర వై¯ వస్వత వార్దిప వాసవాత్మ¯ కుఁడవు హరిస్వరూపుఁడ వైన నీకును¯ మానితభక్తి నమస్కరింతు (774.1) ననఘ! నీ వెప్పుడేనేమి యఖిలలోక¯ జైత్ర మగు హేమమణిమయ స్యందనంబు¯ నెక్కి కోదండపాణివై యిద్ధ సైన్య¯ పదవిఘట్టనచే భూమిభాగ మగల. (775) తరణిం బోలెఁ జరింపకున్న ఘననిద్రం బొంది యెందేని భూ¯ వర! పద్మోదరకల్పితంబు లగు నీ వర్ణాశ్రమోదార వి¯ స్తర పాథోనిధిసేతుభూతమహిమాచారక్రియల్ తప్పి సం¯ కరమై చోరభయంబునన్ నిఖిల లోకంబుల్ నశించుం జుమీ." (776) అని పలికి "భవదాగమనంబునకు నిమిత్తం బెయ్యది"యనవుడు సమాహిత సకలనిత్యకర్మానుష్ఠానుండైన మునీంద్రునకు స్వాయంభువుం డిట్లనియె. (777) "సరసిజగర్భుఁడు దనచే¯ విరచిత మైనట్టి వేదవితతుల నెల్లన్¯ ధర వెలయించుటకై బుధ¯ వర మిమ్ముం దన ముఖంబువలన సృజించెన్. (778) దురితస్వరూప పాట¯ చ్చరపీడం బొందకుండ సకలక్షోణిం¯ బరిపాలించుటకై మము¯ నరవిందభవుండు భుజము లందు సృజించెన్. (779) నెఱి నట్టి జలజభవునకుఁ¯ గర మంతఃకరణ గాత్రకములై వరుసం¯ బరఁగిన బ్రహ్మక్షత్రము¯ లరయ రమాధీశ్వరునకు నవనీయంబుల్. (780) కావున; హరిస్వరూపుండవై దుర్జనదుర్దర్శనుండ వయిన నినుం గనుట మదీయ భాగ్యంబున సిద్దించె; భవత్పాదకంజ కింజల్కపుంజరంజితం బైన మదీయ మస్తకంబును దావక వచనసుధాపూరితంబు లైన శ్రవణంబులును మంగళకరత్వంబున సాఫల్యంబునుం బొందె; నేను కృతార్థుండ నైతి; దుహితృస్నేహదుఃఖ పరిక్లిన్నాంతఃకరణుండ నై సకలదేశ భ్రమణ ఖిన్నుండ నైన నా విన్నపం బవధరింపు;"మని యిట్లనియె. (781) "వరయోగీశ్వర! దేవహూతి యను నీ వామాక్షి మత్పుత్రి దా¯ వర లావణ్య గుణాఢ్యులన్ వినియు నెవ్వారిన్ మదిం గోర కా¯ తురయై నారదు పంపునన్ మిము వరింతున్నంచు నేతెంచె నీ¯ తరుణీభిక్షఁ బరిగ్రహింపుము శుభోదాత్తక్రియాలోలతన్. (782) అమలినగృహమేధిక క¯ ర్మములకు ననురూపగుణ విరాజితశీల¯ క్రమములఁ దనరిన తరుణిం¯ బ్రమదమున వరింపు మయ్య భవ్యచరిత్రా! (783) అనఘ! విరక్తుల కైనం¯ దనయంత లభించు సౌఖ్యతతి వర్జింపం¯ జనదఁట కాముకులకు న¯ బ్బిన మానుదురే? లభించు ప్రియసౌఖ్యంబుల్. (784) వినుము ఫలారంభుఁడు గృప¯ ణుని నడిగినఁ దన యశంబునుం దగు మానం¯ బును జెడుఁ గావునఁ దగ నీ¯ వెనయ వివాహేచ్ఛఁ దగులు టెఱిఁగి యిచటికిన్. (785) చనుదెంచితి మస్మత్ప్రా¯ ర్థనఁ గైకొని మత్తనూజఁ దగ వరియింపుం"¯ డన ముని స్వాయంభువునిం¯ గనుఁగొని మరలంగ బలికెఁ గడు మోదమునన్. (786) "అనఘ! నీచేత ననన్యదత్తముగఁ బ్ర¯ తిష్ఠితంబైన యీ తీవబోఁడి¯ కమనీయరూపరేఖావిలాసంబుల¯ మానితలక్ష్మీసమాన యగుచు¯ నొకనాఁటి రాత్రి యం దుడురాజచంద్రికా¯ ధవళిత నిజ సౌధతలము నందు¯ మహిత హిరణ్మయ మంజీర శోభిత¯ చరణ యై నిజ సఖీ సహిత యగుచుఁ (786.1) గందుకక్రీడఁ జరియింప గగన మందు¯ వరవిమానస్థుఁ డగుచు విశ్వావసుండు¯ నాఁగఁ దనరిన గంధర్వనాయకుండు¯ తరుణిఁ జూచి విమోహియై ధరణిఁ బడియె. (787) పుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు¯ లీ తలోదరిఁ బొడగాన రేమిసెప్ప¯ నట్టి కొమరాలు భాగ్యోదయమునఁ దాన¯ వచ్చి కామింప నొల్లనివాఁడు గలఁడె. (788) ఈ కన్యారత్నమునకు¯ నాకును గుణరూపవర్తనంబుల యెడ నా¯ లోకింప సమమ కావునఁ¯ గైకొని వరియింతు విగతకల్మషవృత్తిన్. (789) విమలాత్మ! దీని కొక సమ¯ యము గల దెఱిఁగింతు విను గుణాకర యగు నీ¯ రమణికి నపత్యపర్యం¯ తము వర్తింపుదు గృహస్థధర్మక్రియలన్. (790) అంతమీఁద విష్ణు నాజ్ఞ యౌఁదలఁ దాల్చి¯ శమదమాదియోగసరణిఁ బొంది¯ సన్యసించువాఁడ జలజనేత్రుని వాక్య¯ కారణమునఁ జేసి ధీరచరిత! (791) శ్రీవిభునివలన నీ లో¯ కావళి యుదయించుఁ బెరుఁగు నడఁగును విను రా¯ జీవ భవాదుల కతడే¯ భూవర! నిర్మాణహేతుభూతుం డరయన్. (792) అదిగావున; నమ్మహాత్ముని యాజ్ఞోల్లంఘనంబు సేయరా"దని కర్దముండు పలికిన విని స్వాయంభువుండు నిజ భార్య యైన శతరూప తలంపును, బుత్రియైన దేవహూతి చిత్తంబును నెఱింగిన వాఁడై, ముని సమయంబున కియ్యకొని ప్రహృష్ట హృదయుం డగుచు సమంచిత గుణాఢ్యుం డయిన కర్దమునకు దేవహూతిని విధ్యుక్త ప్రకారంబున వివాహంబు సేయించె; తదనంతరంబ; శతరూపయును బారిబర్హసంజ్ఞికంబు లైన వివాహోచిత దివ్యాంబరాభరణంబులు దేవహూతి కర్దముల కొసంగె; నివ్విధంబున నిజ కులాచార సరణిం బరిణయంబు గావించి విగతచింతాభరుం డై స్వాయంభువుండు దుహితృ వియోగ వ్యాకులిత స్వాంతు డై; కూఁతుం గౌఁగలించుకొని, చుబుకంబుఁలు బుడుకుచుఁ, జెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్కొని ప్రేమాతిరేకంబున బాష్పధారాసిక్తమస్తకం జేసి "తల్లీ! పోయివచ్చెద"నని చెప్పి, కర్దమునిచేత నామంత్రితుం డై నిజ భార్యా సమేతంబుగ రథం బెక్కి స పరివారుం డై. (793) తరళతరంగవీచి సముదంచిత బిందు సరస్సరస్వతీ¯ స రిదరవింద తుందిల లసత్తరు తీరనివాస సన్మునీ¯ శ్వర నికరాశ్రమా కలిత సంపదలం గనుఁగొంచు వేడ్క ము¯ ప్పిరిగొన నేగె నాత్మ పుటభేదన విస్ఫుటమార్గవర్తి యై. (794) ఇట్లు చనిచని బ్రహ్మావర్తదేశంబు నందు. (795) ఎందేనిఁ దొల్లి లక్ష్మీశుండు యజ్ఞసూ¯ కరమూర్తిఁ గైకొని సరభసముగ¯ నొడలు జాడించినఁ బుడమిపై రాలిన¯ రోమజాలంబులు రుచిర హరిత¯ వర్ణమై పొలుపార వరకు శకాశమ¯ యంబును యజ్ఞక్రియాకలాప¯ యోగ్యంబు నై చాల నొప్పారి బర్హిస్సు¯ సంభవించిన దాన సకలఋషులుఁ (795.1) గ్రతువు లొనరించి తద్విఘ్నకారు లైన¯ యసురులం ద్రుంచి రట్ల స్వాయంభువుండు¯ విష్ణుపరముగ మఖము గావించి రుచిర¯ మేధ సెలువొంద వచ్చి యాత్మీయపురము. (796) డాయంజనఁ బురజనము లు¯ పాయనములు దెచ్చియిచ్చి బహుగతుల నుతుల్¯ సేయఁగ మంగళతూర్యము¯ లాయతగతి మ్రోయఁ జొచ్చె నంతఃపురమున్. (797) ఇట్లు ప్రవేశించి; తాపత్రయోపశమనం బగు భగవద్భక్తి వృద్ధిఁ బొందించుచుఁ బుత్ర మిత్ర కళత్ర సుహృద్భాంధవ సహితుం డై పరమానందంబున (798) అతి భక్తిం బ్రతివాసరంబును హరివ్యాసంగుఁ డై మాధవాం¯ కిత గంధర్వ విపంచికా కలిత సంగీతప్రబంధానుమో¯ దితుఁ డై యిష్ట విభూతు లందు ననురక్తిం బొంద కేప్రొద్దు న¯ చ్యుత సేవైకపరాయణుం డగుచు నస్తోకప్రభావోన్నతిన్ (799) హరి పాదాంబురుహద్వయార్పిత తులస్యామోదముం గొంచుఁ ద¯ చ్ఛరితంబుల్ దలపోయుచుం బొగడుచుం జర్చించుచున్ వించుఁ ద¯ త్పరిచర్యావ్యతిరిక్త సంసరణ సద్దర్మార్థకామంబులం¯ బరిభూతంబులు సేసి మోక్షపద సంప్రాప్తిక్రియారంభుఁ డై. (800) నిగమార్థగోచరుం డనఁ¯ దగు హరిచరితప్రసంగతత్పర చిత్తుం¯ డగు నతనికి స్వాంతరంగము¯ లగు యామము లొగి నయాతయామము లయ్యెన్. (801) వెండియు నమ్మేటి విష్ణుమంగళకథా¯ కర్ణన ధ్యానానుగాన నుతులు¯ సలుపుచు స్వస్వప్న జాగ్రత్సుషుప్తులఁ¯ దలఁగించి యా పుణ్యతముఁడు దాను¯ జక్రిదాసుఁడు గాన శారీర మానస¯ దివ్యమానుష భౌతికవ్యధలను¯ దగులక సన్మునీంద్రశ్రేణికిం దగఁ¯ దనరు వర్ణాశ్రమధర్మగతులు (801.1) దప్పకుండంగ నడపుచుఁ దగిలి సర్వ¯ భూతహితవృత్తి నతుల విఖ్యాతలీల¯ నేకసప్తతియుగము లస్తోకచరితుఁ¯ డగుచు వర్తించె సమ్మోద మతిశయిల్ల." (802) అని యమ్మనుచరితము విదు¯ రున కమ్మైత్రేయమునివరుఁడు దయతోడన్¯ వినిపించి కర్దమునికథ¯ దనరఁగ నెఱిఁగింతు నని ముదంబునఁ బలికెన్.

కర్దముని విమానయానంబు

(803) "ఇట్లు స్వాయంభువుండు దేవహూతిం గర్దమునికి వివాహంబుసేసి మరలిచనినం దదనంతరంబ; దేవహూతియుఁ బతిభక్తి గలిగి భవునికి భవాని పరిచర్యసేయు తెఱంగునఁ బతియ తనకు నేఁడుగడయుంగా నెఱింగి; యమ్మునీంద్రుని చిత్తవృత్తికొలఁది దినదినంబునకు భక్తితాత్పర్యస్నేహంబులు రెట్టింపం; బ్రియశుశ్రూషణంబులు గావించుచు ననూనతేజోవిరాజిత యగుచుఁ గామక్రోధ దంభలోభాది గుణవిరహిత యై; శరీరశుద్ధి వహించి మృదుమధుర వచనరచన యై; పతిభక్తి యేమఱక వర్తింప దైవయోగంబు నైననుం దప్పింప సమర్థుం డైన కర్దముండు నిజ సేవాయాసకృశీభూతదేహ యై యున్న దేవహూతిం గరుణా తరంగితాపాంగుం డై కనుంగొని మంజుభాషణంబుల నిట్లనియె. (804) "మానిత ధర్మమార్గమహిమస్ఫుట భూరి తపస్సమాధి వి¯ ద్యానిభృతాత్మయోగ సముపార్జిత విష్ణుకటాక్షలబ్ధ శో¯ భానఘ దివ్యభోగ బహుభద్ర వితానము లస్మదీయ సే¯ వా నిరతిన్ లభించు ననివారణ నిత్తును దివ్యదృష్టియున్. (805) నెలఁత! తద్దివ్యదృష్టి నన్నియును నీకుఁ¯ గానవచ్చు విలోకింపు కమలపత్ర¯ నయను బొమముడి మాత్రన నాశ మందు¯ నితర మగు తుచ్ఛభోగంబు లేమిసెప్ప. (806) అనుపమ రాజ్యదర్పాంధచేతస్కు లై¯ పాపవర్తను లైన పార్థివులకు¯ ధృతిఁ బొందరాని యీ దివ్యభోగంబులు¯ నీదు పాతివ్రత్యనిష్ఠఁ జేసి¯ సంప్రాప్తములు నయ్యె సమత భోగింపుము¯ కార్యసిద్ధియు నగుగాక నీకు"¯ ననుటయు నతివయు ననుపమ యోగమా¯ యా విచక్షణవిభుండైన కర్ద (806.1) మునిఁ గనుంగొని విగతాధియును నపాంగ¯ కలిత లజ్జానతాస్యపంకజయు నగుచు¯ వినయ సౌహార్దములఁజేసి విహ్వలంబు¯ లయిన పలుకులఁ బతికి నిట్లనియెఁ బ్రీతి. (807) "అనఘా! యమోఘయోగమాయావిభుండవు సమర్థుండవు నయిన నీయందు నీ యనుపమ దివ్యభోగంబులు గలుగుట నిక్కం బని యెఱుంగుదు; భవత్సంగతి నన్నియు నాకుం గలుగు; నయినను దేవా! నీ వానతిచ్చిన సంతానపర్యంతం బైన శరీరసంగమ సమయంబు చిత్తంబునం దలంచి భవదంగసంగమంబుఁ గృపసేసి మన్నింపుము; భవదీయ సంయోగవాంఛాపరతం గృశీభూతం బయిన యీ దేహం బే విధంబున మజ్జన భోజన పాన సుఖంబులం బరితుష్టింబొందు నట్టి మన్మనోరథంబుఁ దీర్ప రతిరహస్య ప్రకాశంబగు కామశాస్త్ర ప్రకారం బుపశిక్షించి యందులకు నుచితంబు లయిన వివిధాంబరాభరణ మాల్యానులేపన మందిరారామ ప్రముఖ నిఖిల వస్తువిస్తారంబు గావించి నన్నుం గరుణింపు"మనిన నమ్మహాత్ముండు నిజ యోగమాయా బలంబునం దత్క్షణంబ. (808) దివ్యమణిస్తంభదీప్తిఁ జెన్నొందుచు¯ మరకతస్థలముల మహిమ దనర¯ వర వజ్రకుడ్యకవాట శోభితము లై¯ విద్రుమ దేహళీవీథు లమరఁ¯ గొమరొప్ప నవశాతకుంభ కుంభములపై¯ హరినీలశకల విస్ఫురణ మెఱయఁ¯ దగఁ బద్మరాగంపు మొగడలఁ జెలువొందు¯ వైడూర్యవలభులు వన్నెఁ జూపఁ (808.1) దరళతర ధూతకేతుపతాక లొలయ¯ మంజుశింజత్సమంచిత మధుప కలిత¯ సురుచిరాలంబమాన ప్రసూనరాజి¯ మాలికల నొప్పు వివిధ గృహాళిఁ దనరి. (809) మఱియును దుకూలచీనాం¯ బర కౌశేయాది వివిధ పటపరివృత మం¯ దిర సుభగాకారంబై¯ యరుదార విచిత్ర పట్టికాలంకృత మై. (810) లలితోద్యానవనాంత సంచరణలీలాలోల హంసాళి కో¯ కిల పారావత చక్రవాక శుక కేకీవ్యూహ మంచత్సము¯ త్కలికం గృత్రిమపక్షులన్ నిజవిహంగశ్రేణి యంచుం గుతూ¯ హలి యై పల్కుచు నాడుచుండుఁ బ్రతిశాఖారోహణవ్యాప్తులన్. (811) వెండియు. (812) ఘన సౌధాంతర శయ్యా¯ సన కేళీగేహ కృతక జగతీధర శో¯ భన చంద్రకాంత చారు భ¯ వన ఫలభరితావనీజవంతము లగుచున్. (813) సకలర్తు శోభితంబును¯ సకల శుభావహము సకల సంపత్కరమున్¯ సకలోపభోగయోగ్యము¯ సకలేప్సితకామదంబు సదలంకృతమున్. (814) అగుచు నొప్పు దివ్యవిమానంబుఁ గల్పించి తదీయ సుషమావిశేష విచిత్రంబులు నిర్మించిన తానునుఁ దెలియంజాలని యద్భుతకర్మంబు లైన విమానంబు దేవహూతికిం జూపినం జూచి యమ్ముద్దియ సంతసింపకుండుట యెఱింగి సర్వభూతాంతరాశ యాభిజ్ఞుండును సంతుష్టాంతరంగుండును నైన గర్దముం డిట్లనియె. (815) "అతివ! భగవత్కృతంబును నఖిలమంగ¯ ళాకరంబును నగు నీ జలాశయమునఁ¯ దవిలి గ్రుంకిన జంతువితానములకుఁ¯ గామ్యఫలసిద్ధి సేకుఱుఁ గాన నీవు. (816) ఇజ్జలముల నతి భక్తిని¯ మజ్జన మొనరించి యీ విమానము వేడ్కన్¯ లజ్జావతి యెక్కవె"యని¯ బుజ్జన మొనరంగఁ గర్దముఁడు పల్కుటయున్.

దేవహూతితో గ్రుమ్మరుట

(817) విని యాకువలయాక్షి పతిసేవాయాస మలినాంబరయు, వేణీభూత శిరోజయు, ధూళిధూసరితాతికృశీభూతాంగయు, శబలస్తనయు నై బిందుసరోవరంబుఁ బ్రవేశించి తజ్జలంబులఁ గ్రుంకులిడు సమయంబునఁ దద్వాఃపూర మధ్యంబున రుచిర సూక్ష్మాంశుకధారిణులుఁ, గిశోర వయఃపరిపాక శోభితలు, నుత్ఫలగంధులు నగు కన్యాసహస్రంబులు దేవహూతిం గనుంగొని యిట్లనిరి. (818) "తరుణీ! సంచిత ధర్మా¯ చరణల మగు మేము నీకు సదమలభక్తిం¯ బరిచర్యసేయనేర్తుము¯ కరుణాకలితేక్షణములఁ గనుగొను మమ్మున్." (819) అని పల్కి; డాసి యయ్యతివకు నభ్యంజ¯ నోద్వర్తనములు పెంపొనరఁ జేసి¯ మలయజకర్పూర మహిత వాసిత హేమ¯ కలశోదకంబుల జలక మార్చి¯ ధవళవస్త్రంబులఁ దడి యొత్తి సర్వాంగ¯ ధూపంబు లొసఁగి కస్తూరి యలది¯ మంజు శింజన్మణి మంజీర కింకిణీ¯ కలరావకలిత మేఖలలు రత్న (819.1) ఖచిత తాటంకముద్రికా కంకణాది¯ సముచితానర్ఘ్య హేమభూషణము లొసఁగి¯ భవ్య మాల్యానులేపనాంబరము లిచ్చి¯ షడ్రసోపేత వివిధాన్న సమితిఁ దనిసి. (820) మఱియుం, గనకపాత్ర రచితంబు లయిన కర్పూరనీరాజనంబు లిచ్చి; రుచిరాసనంబునఁ గూర్చుండఁ బెట్టి దర్పణంబు సేతి కిచ్చినం దత్ప్రతిఫలిత నిజ దేహంబు గనుంగొని; కర్దముని మనంబునం దలంచిన నతండునుం గన్యకాసహస్రంబును దత్క్షణంబునఁ దన సన్నిధి నుండుటం జూచి; నిజభర్తృయోగమాయా ప్రభావంబునకు నద్భుతంబు నొందె; నంతఁ గర్దముండునుం గృతస్నాన యైన దేవహూతిం గనుంగొని వివాహంబునకు ముందట నే చందంబునం దనరుచుండె నా చందంబునం జెన్నొందుచుండుటకు నానందభరితుం డై భార్యా సహితంబుగఁ దత్కన్యకాసహస్రంబు గొలువ నిజ విమానారూఢుం డై తారాగణ పరివృత రోహిణీ యుక్తుం డగు సుధాకరుండునుం బోలె నొప్పుచుఁ దదనంతరంబ. (821) చిర శుభమూర్తి యమ్ముని యశేష దిగీశ విహార యోగ్యమున్¯ సురుచిరమందగంధవహశోభితమున్ నికటప్రధాతు ని¯ ర్ఝరసరిదంబు శీతలతుషారమునై తనరారు మేరుకం¯ దరమునకేగి దేవవనితాయుతుఁడైన కుబేరుచాడ్పునన్ (822) మఱియును. (823) అమరోద్యానవనప్రదేశములు నవ్యారామభూముల్ దళ¯ త్కుముదాంభోజ విభాసిమానస సరఃకూలంబులున్ మంజుకుం¯ జములుం జైత్రరథంబు విస్ఫురిత విస్రంభంబునం జూచె నె¯ య్యమునం గర్దమయోగి కామగవిమానారూఢుఁ డై చెచ్చెరన్. (824) ఇవ్విధంబున, సమస్త భూభాగంబును వాయువేగంబునం గలయం గ్రుమ్మరి నిఖిల వైమానికలోకంబు నతిశయించి లోకంబులం జరించె; మోక్షదాయకుండుఁ దీర్థపాదుండు నగు పుండరీకాక్షుని సన్నుతించి సేవించు పుణ్యాత్ములకుం బొందరాని పదార్థములు గలవే; యిట్లు కర్దముండు దేవహూతికి నిఖిల ధరాచక్రం బంతయుఁ జూపి; మరల నిజ నివాసంబునకుం జనుదెంచి; కామకేళీవినోదాత్మిక యైయున్న భార్య నుపలక్షించి రతిప్రసంగంబు గైకొని బహు వత్సరంబు లొక్క ముహూర్తంబుగా జరుపుచు నన్యోన్య సరసావలోకనంబుల సముచి తాలింగన సంభాషణంబులం గాల నిరూపణంబు సేయనేరక శత వత్సరంబులు గడపి; తదనంతంరంబ.

కపిలుని జన్మంబు

(825) మునివరుఁ డొకనాఁ డిమ్ములఁ¯ దన నిజదేహంబు నవవిధంబులు గావిం¯ చి నయంబునఁ దద్వీర్యముఁ¯ దన సతిగర్భమున నవవిధంబుగ నిలిపెన్. (826) అది కారణంబుగాఁ బెం¯ పొదవిన మునివలన దేవహూతియుఁ గూఁతుల్¯ ముదమునఁ గనెఁ దొమ్మండ్రన్¯ ముదితయు మది సంతసించె మునివరుఁ డంతన్. (827) సన్యసింపగగోరిన సతి యెఱింగి¯ యాత్మఁ బొడమిన సంతాప మగ్గలింపఁ¯ జింత వాటిల్లఁ జెక్కిటఁ జేయిసేర్చి¯ పదములను నేల వ్రాయుచుఁ బలికెఁ బతికి. (828) "అనఘ! సంతాన పర్యంతంబు ననుఁ గూడి¯ వర్తింతు ననుచుఁ బూర్వమునఁ బలికి¯ కూఁతుల నిచ్చితి కొమరార నిప్పు డీ¯ తరుణులు పతులును దమకుఁ దార¯ యరసి వర్తింతురో యని భీతినొందెదఁ¯ గావున నీ పుత్రికలకుఁ దగిన¯ వరుల సంపాదించి పరిణయంబులు సేసి¯ తత్త్వసంహిత నాకుఁ దవిలి తెలుపు (828.1) సుతునిఁ గృపసేసి ననుఁ గావు సుజనవినుత! ¯ యర్థి సంసార దుఃఖంబు నపనయింప¯ నర్హుఁడవు నీవ కావె మోహమున నింత¯ కాల మూరకపోయె నే గతియు లేక. (829) ఉపరతి పుట్టె నైహిక సుఖోపగతానుభవంబు లందు మున్¯ జపలతఁ గామభోగరతిసంగముఁ గోరి మహాత్మ! నిన్ను న¯ చ్చఁపుఁ దలపొప్పగాఁ దెలియఁజాలక యేవరియించుటన్ భవ¯ త్కృప ఫలియించె ముక్తి నినుఁ గేవలభక్తి భజింపఁ గల్గదే. (830) అదియునుంగాక. (831) సమమతినొప్పు సత్పురుషసఖ్యము సద్గతి కారణంబు నీ¯ చమతి విలోలదుష్పురుష సఖ్యము దుర్గతిహేతు వంచుఁ జి¯ త్తమునఁ దలంచి యోగిజనతానుత! మిమ్ము భజింతుఁ బ్రాణిసం¯ గమమునఁ బుణ్యపాపములు గైకొని పొందవె యెట్టివారలన్." (832) అని యిట్లు వేదనాభర¯ మున మునుకుచుఁ బలుకఁ గర్దముఁడు మనుపుత్రిం¯ గనుఁగొని సరసిజనయను వ¯ చనములు మది సంస్మరించి సతి కిట్లనియెన్. (833) "మనుసుత! నీ మది దుఃఖం¯ బును బొందకు మచిరకాలమున భగవంతుం¯ డనఘుం డక్షరుఁడు జనా¯ ర్దనుఁడు భవద్గర్భమందు దగ వసియించున్. (834) వర నియమవ్రత నిష్ఠా¯ చరణ నియుక్తాంతరంగ సమధిక వై సం¯ భరిత తపోధన దాన¯ స్ఫురితశ్రద్ధాను భక్తిపూర్వము గాఁగన్. (835) హరి నారాయణు పాదపద్మములు సమ్యగ్భక్తిఁ బూజింపు త¯ త్పురుషశ్రేష్ఠుఁడు మానసంబున భవత్పూజా సుసంప్రీతుడై¯ కరమర్థిం దరుణీశిరోమణి! భవద్గర్భస్థుఁడై యుండి తాఁ¯ గరుణం జేయు భవన్మనోజనిత శంకాగ్రంథి విచ్ఛేదమున్." (836) అనవుడు దేవహూతి హృదయంబున సంతస మంది యమ్మునీం¯ ద్రుని వచనక్రమంబునఁ బరున్ భగవంతు ననంతుఁ బద్మలో¯ చను హరి విష్ణు నర్చనము సల్పుచు నుండగఁ గొన్ని యబ్దముల్¯ చనునెడ దానవాంతకుఁడు సమ్మతిఁ గార్దమ మైన తేజమున్. (837) ధరియించి యమ్మునీంద్రుని¯ తరుణీగర్భంబువలన దనుజారి శమీ¯ తరుకోటరమున వైశ్వా¯ నరుఁ డుదయించిన విధంబునన్ జనియించెన్. (838) అయ్యవసరమున నాకాశమున దేవ¯ తూర్యఘోషంబులు దుముల మయ్యె¯ నందిత దేవతాబృందంబు లందంద¯ కురిసిరి మందారకుసుమ వృష్టి¯ గంధర్వ కిన్నర గానంబు వీతెంచె¯ నప్సరోగణముల యాటలొప్పె¯ వావిరి దిక్కులఁ గావిరి విరిసెను¯ దవిలి వార్ధుల కలంతలును మానె (838.1) సాధుజనముల మనములు సంతసిల్లె¯ హోమవహ్నులు ప్రభలఁజెన్నొంది వెలిఁగెఁ¯ గుసుమఫలభరములనొప్పెఁగుజములెల్ల¯ సర్వసస్యాళి చెన్నొందె జగతిలోన (839) ఇట్టి మహోత్సవంబున దేవహూతికిం దత్త్వబోధంబుఁ గావించు కొఱకుఁ దదీయ గర్భంబున నుదయించిన పరబ్రహ్మస్వరూపుం డైన నారాయణుని దర్శించుకొఱకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుం డై చతుర్ముఖుఁడు సనుదెంచి యమ్మహాత్ముని దర్శించి కర్దమ దేవహూతులం గనుంగొని యిట్లనియె. (840) "నుతచరితులార! మీరలు¯ కృతకృత్యులు విష్ణుపూజఁ గేవలభక్తిన్¯ మతి నిష్కపటులరై చే¯ సితిరి తదర్చన ఫలంబు సేకుఱె మీకున్. (841) శ్రితభయహరణుఁడు మునిజన¯ నుతచరితుఁడు పరుఁడు మీ మనోరథసిద్ధిన్¯ వితతంబుగఁ గావించుటఁ¯ జతురత మీ జన్మ మింక సఫలతఁ బొందెన్. (842) వినుడు సకాములునై హరి¯ ననుపమభక్తిన్ భజించు నదె ముక్తికిఁ జా¯ లును మీ పుణ్యం బే మని¯ కొనియాడఁగ వచ్చు నీతికోవిదులారా!" (843) అని వెండియుం గర్దముని గనుంగొని యిట్లను "భవదీయ తనూభవలం బ్రకటశీలవ్రతాచారసంపన్ను లైన మునివరేణ్యులకుం బెండ్లిసేయుము; నట్లయిన వారి వలన బ్రజాసృష్టి బహువిధంబుల వృద్ధిం బొందు"నని చెప్పి మఱియు నిట్లనియె. (844) "అనఘ! భవత్సుతుండు సముదంచిత తేజుఁడు నైన యిమ్మహా¯ త్మునిఁ బరమేశు నీశు నజితున్ నలినాక్షు నమేయు నచ్యుతున్¯ ఘనుని ననంతు నాద్యు నవికారుని నక్షరుఁగాఁ దలంపుమీ¯ ఘనుఁడు సమస్త చేతన నికాయ హృదీప్సితదాయి గావునన్. (845) మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు¯ నను నుపాయంబుల నొనరఁజేసి¯ యలవుమైఁ గర్మజీవుల నుద్ధరించుట¯ కొఱకు నమ్మహితాత్మకుఁడు సమగ్ర¯ హాటకరుచిజటాజూటుండు సత్ఫుల్ల¯ పంకజనేత్రుండు పద్మ వజ్ర¯ హల కులిశాంకుశ లలిత రేఖాంకిత¯ చరణ తలుండును సత్త్వగుణుఁడు (845.1) నగుచు నిప్పుడు సరసీరుహాక్షి నీదు¯ గర్భ మం దుదయించెను ఘనుఁడు నీకుఁ¯ దత్త్వబోధంబుఁ గావించుఁ దావకీన¯ హృదయ సంగత సంశయ మెల్లఁ బాపు. (846) మఱియును. (847) నుతికెక్కి సిద్ధగణ సే¯ వితుఁడై ఘనసాంఖ్యయోగవిలసిత తత్త్వ¯ స్థితినిరతుఁ డగుచుఁ గపిలా¯ ఖ్యతఁ దనరి చరించు నీ జగత్రయ మెల్లన్."