పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : నవమ 715 - సంపూర్ణం

వసుదేవుని వంశము

(715) ధీనయశాలి యైన వసుదేవుఁడు పుట్టినవెంట మింటిపై¯ నానక దుందుభుల్ మొరసె నచ్యుతుఁ డీతనికిం దనూజుఁడై¯ మానుగఁ బుట్టునంచు గరిమంబున దేవత లుబ్బ రాజపం¯ చానన! తన్నిమిత్తమున నానకదుందుభి యయ్యె వాఁడిలన్. (716) తన చెలికాఁడగు కుంతికిఁ¯ దనయులు లేకున్నఁ జూచి తన తనయఁ బృథం¯ దనయఁగ నిమ్మన శూఁరుడు¯ దన యందలి మైత్రి నిచ్చె ధరణీనాథా! (717) అయ్యింతి కుంతిభోజునింటం బెరుగుచుండ, నొకనాఁడు దుర్వాసుం డరుగుదెంచిన, నమ్మహాత్మునకుఁ గొన్ని దినంబులు పరిచర్యలు చేసి వేల్పులం జేరంజీరు విద్యం బడసి, యా విద్య లావెఱుంగ నొక్కనా డేకాంతంబున వెలుంగుఱేని నాకర్షించిన నా దేవుండు వచ్చినం జూచి వెఱఁగుపడి, యిట్లనియె. (718) "మంత్ర పరీక్షార్థం బభి¯ మంత్రించితిఁ గాని దేవ! మదనక్రీడా¯ తంత్రంబుఁ గోరి చీరను¯ మంత్రించిన తప్పు సైఁచి మరలు దినేశా!" (719) అనిన నయ్యువిదకుఁ బద్మినీవల్లభుం డిట్లనియె. (720) "తెఱవా! నీ పలుకట్లయౌ నసదులే దేవోత్తమాహ్వానముల్¯ మొఱుఁగంబోలునె? వేల్పులం బడయుటల్ మోఘంబులే నీకు నీ¯ తఱి గర్భం బగుఁ బుత్రుఁడుం గలుగు; నీ తారుణ్యముం బూజ్యమౌ¯ వెఱవం గార్యములేదు; సిగ్గుదగునే? వ్రీడావినమ్రాననా!" (721) అని తగ నియ్యకొల్పి లలితాంగికి గర్భము చేసి మింటికిం¯ జనియె దినేశ్వరుం డపుడు చక్కని రెండవసూర్యుడో యనం¯ దనరెడు పుత్రుఁ గాంచి కృప దప్పి జగజ్జనవాదభీతయై¯ తనయుని నీటఁ బోవిడిచి తా నరిగెం బృథ దండ్రి యింటికిన్. (722) అ య్యువిదను నీ ప్రపితామహుండైన పాండురాజు వివాహంబయ్యె; నయ్యంగనకుఁ బాండురాజువలన ధర్మజ, భీమార్జునులు పుట్టి; రమ్మగువ చెల్లెలగు శ్రుతదేవయనుదానిం గారూషకుం డైన వృద్ధ శర్మ పెండ్లియాడె; నయ్యిద్దఱకు మునిశాపంబున దంతవక్త్రుండను దానవుండు జన్మించె; దాని తోడంబుట్టువగు శ్రుతకీర్తిని గేకయరాజైన ధృష్టకేతుండు పెండ్లియాడె; నా దంపతులకుఁ బ్రతర్దనాదులేవురు పుట్టరి; దాని భగిని యైన రాజాధిదేవిని జయత్సేనుండు పరిణయంబయ్యె; నా మిథునంబునకు విందానువిందులు సంభవించిరి; చేదిదేశాధిపతి యైన దమఘోషుండు శ్రుతశ్రవసను బరిగ్రహించె; వారలకు శిశుపాలుం డుదయించె. వసుదేవుని తమ్ముఁడైన దేవభాగునికిఁ గంసయందుఁ జిత్రకేతుబృహద్బలు లిరువురు జనించిరి; వాని భ్రాతయగు దేవశ్రవుండనువానికిఁ గంసవతి యందు వీరుండును నిషుమంతుండును నుప్పతిల్లిరి; వాని సోదరుండయిన కంకునికిఁ గంక యనుదానికి బకుండు, సత్యజిత్తు, పురుజిత్తు, ననువారుద్భవిల్లిరి; వాని సహజుండయిన సృంజయునికి రాష్ట్రపాలి యందు వృషదుర్మర్షణాదు లావిర్భవించిరి; వాని యనుజాతుం డయిన శ్యామకునకు సురభూమి యందు హరికేశ హిరణ్యాక్షులు ప్రభవించిరి; వాని తమ్ముండైన వత్సుండు మిశ్రకేశియను నప్సరస యందు వృకాది సుతులం గనియె; వాని యనుజుండైన వృకుండు దూర్వాక్షి యందుఁ దక్ష పుష్కర సాళ్వాదుల నుత్పాదించె; వాని జఘన్యజుండయిన యనీకుండు సుదామని యనుదాని యందు సుమిత్రానీక బాణాదులయిన గొడుకులం బడసె; వాని యనుజుం డైన యానకుండు గర్ణికయందు ఋతుధామ జయులం గాంచె; వసుదేవునివలన రోహిణి యందు బలుండును గదుండును సారణుండును దుర్మదుండును విపులుండును ధ్రువుండును గృతాదులును, బౌరవి యందు సుభద్రుండును భద్రబాహుండును దుర్మదుండును భద్రుండును భూతాదులుం గూడ బన్నిద్దఱును, మదిర యందు నందోపనంద కృతక శ్రుత శూరాదులును గౌసల్య యందుఁ గేశియు, రోచన యందు హస్త హేమాంగాదులును, నిళ యందు యదు ముఖ్యులయిన యురువల్కలాదులును, ధృతదేవ యందుఁ ద్రిపృష్ఠుండును, శాంతిదేవ యందుఁ బ్రశ్రమ ప్రశ్రితాదులును, నుపదేవ యందుఁ గల్పవృష్ట్యాదులు పదుండ్రును, శ్రీదేవ యందు వసుహంస సుధన్వాదు లార్గురును, దేవరక్షిత యందు గదాదులు దొమ్మండ్రును, సహదేవయందుఁ బురూఢ శ్రుతముఖ్యు లెనమండ్రును, దేవకి యందుఁ గీర్తిమంతుండును సుషేణుండును భద్రసేనుండును ఋజువును సమదనుండును భద్రుండును సంకర్షణుండును నను వా రేడ్వురును బుట్టిరి; మఱియును.

శ్రీకృష్ణావతార కథా సూచన

(723) దుష్టజన నిగ్రహంబును¯ శిష్టజనానుగ్రహంబు చేయుట కొఱకై¯ యష్టమగర్భమున గుణో¯ త్కృష్టుఁడు దేవకికి విష్ణుదేవుఁడు పుట్టెన్. (724) విష్ణుఁ డుదితుఁడైన వెనుక నా దేవకి¯ భద్రమూర్తి యగు సుభద్రఁ గనియె; ¯ నా గుణాఢ్య ముత్తవగు నీకు నర్జును¯ దయిత యగుటఁ జేసి ధరణినాథ! (725) ఎప్పుడు ధర్మక్షయ మగు¯ నెప్పుడు పాపంబుపొడము నీ లోకములో¯ నప్పుడు విశ్వేశుఁడు హరి¯ దప్పక విభఁ డయ్యుఁ దన్నుఁ దా సృజియించున్. (726) తనమాయ లేక పరునకు¯ ఘనునకుఁ నీశ్వరున కాత్మకర్తకు హరికిన్¯ జననములకుఁ గర్మములకు¯ మనుజేశ్వర! కారణంబు మఱియును గలదే? (727) తలఁపఁగ నెవ్వని మాయా¯ విలసనములు జననవృద్ధి విలయంబులకుం¯ గలిమి కనుగ్రహ మోక్షం¯ బులకును జీవునికి మూలములు నా నెగడున్. (728) అట్టి సర్వేశ్వుని కరయంగ జన్మాది¯ పరతంత్రభావ మెప్పాటఁ గలదు¯ రాజలాంఛనముల రాక్షసవల్లభు¯ లక్షౌహిణీశులై యవనిఁ బుట్టి¯ జనులను బాధింప శాసించు కొఱకునై¯ సంకర్షణునితోడ జననమంది¯ యమరుల మనముల కైన లెక్కింపంగ¯ రాకుండు నట్టి కర్మములఁ జేసి (728.1) కలియుగంబున జన్మింపఁ గలుగు నరుల¯ దుఃఖజాలంబు లన్నిటిఁ దొలఁగ నడచి¯ నేల వ్రేఁగెల్ల వారించి నిఖిలదిశల¯ విమలకీర్తులు వెదచల్లి వెలసె శౌరి. (729) మంగళహరికీర్తి మహా¯ గంగామృత మించుకైనఁ గర్ణాంజలులన్¯ సంగతము జేసి ద్రావఁ దొ¯ లంగును గర్మంబు లావిలం బగుచు నృపా! (730) వనజాక్షుని మందస్మిత¯ ఘనకుండలదీప్తిగండ కలితాననమున్¯ వనితలుఁ బురుషులుఁ జూచుచు¯ ననిమిషభావంబు లేమి కలయుదు రధిపా! (731) జనకుని గృహమున జన్మించి మందలోఁ¯ బెరిఁగి శత్రులనెల్లఁ బీఁచ మడఁచి¯ పెక్కండ్రు భార్యలఁ బెండ్లియై సుతశతం¯ బులఁ గాంచి తను నాదిపురుషుఁ గూర్చి ¯ క్రతువులు పెక్కులు గావించి పాండవ¯ కౌరవులకు నంతఁ గలహ మయిన¯ నందఱ సమయించి యర్జును గెలిపించి¯ యుద్ధవునకుఁ దత్త్వ మొప్పఁ జెప్పి (731.1) మగధ పాండవ సృంజయ మధు దశార్హ¯ భోజ వృష్ణ్యంధకాది సంపూజ్యుఁ డగుచు¯ నుర్విభరము నివారించి, యుండ నొల్ల¯ కా మహామూర్తి నిజమూర్తి యందుఁ బొందె. (732) నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాటప¯ ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే¯ భగతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి¯ మ్ముగఁ బొడసూపుఁగాత గనుమూసిన యప్పుడు విచ్చునప్పుడున్." (733) అని చెప్పి.

పూర్ణి

(734) జనకసుతాహృచ్చోరా! ¯ జనకవచోలబ్ధవిపిన శైలవిహారా! ¯ జనకామితమందారా! ¯ జనకాది మహీశ్వరాతిశయసంచారా! (735) జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ! ¯ సుగుణవనవిహారీ! సుందరీమానహారీ! ¯ విగతకలుషపోషీ! వీరవిద్యాభిలాషీ! ¯ స్వగురుహృదయతోషీ! సర్వదా సత్యభాషీ! (736) ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతం బను మహాపురాణంబు నందు సూర్యవంశారంభంబును, వైవస్వతమనువు జన్మంబును, హైమచంద్రకథనంబును, సుద్యుమ్నాదిమను సూనుల చరిత్రంబును, మరుత్తు, తృణబిందు, శర్యాతి, కకుద్మి, సగర, నాభాగ ప్రముఖుల చరిత్రంబులును, నంబరీషుని యందుఁ బ్రయోగింపబడిన దుర్వాసుని కృత్యనిరర్థక యగుటయు, నిక్ష్వాకు వికుక్షి మాంధాతృ పురుకుత్స హరిశ్చంద్ర సగర భగీరథ ప్రముఖుల చరిత్రంబులును, భాగీరథీప్రవాహ వర్ణనంబును, గల్మాషపాద ఖట్వాంగ ప్రముఖుల వృత్తాంతంబును, శ్రీరామచంద్ర కథనంబును, దదీయ వంశపరంపరా గణనంబును, నిమికథయును, జంద్రవంశారంభంబును, బుధ పురూరవుల కథయును, జమదగ్ని పరశురాముల వృత్తాంతంబును, విశ్వామిత్ర నహుష యయాతి పూరు దుష్యంత భరత రంతిదేవ పాంచాల బృహద్రథ శంతను భీష్మ పాండవ కౌరవ ప్రముఖుల వృత్తాంతంబును, ఋశ్యశృంగ వ్రతభంగంబును, ద్రుహ్యానుతుర్వసుల వంశంబును, యదు కార్తవీర్య శశిబిందు జామదగ్న్యాదుల చరిత్రంబును, శ్రీకృష్ణావతార కథాసూచనంబును నను కథలుగల నవమ స్కంధము సంపూర్ణము.