పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : నవమ 642 - 714

రంతిదేవుని చరిత్రము

(642) రాజవంశోత్తమ! రంతిదేవుని కీర్తి¯ యేల చెప్పఁగ? విను మిందు నందు¯ నా రాజు దన సంచితార్థంబు లన్నియు¯ నెడపక దీనుల కిచ్చియిచ్చి¯ సకుటుంబుఁడై ధైర్యసంయుతుండై పేద¯ యై కూడు నీరులే కధమవృత్తి¯ నెందేని నలువదియెనిమిది దివసముల్¯ చరియింప నొకదివసంబు రేపు (642.1) నెయ్యి పాయసంబు నీరును గలిగిన¯ బహుకుటుంబభారభయముతోడ¯ నలసి నీరుపట్టు నాకలియును మిక్కి¯ లొదవఁ జూచి కుడువ నుత్సహించె. (643) అయ్యవసరంబున. (644) అతిథి భూసురుఁ డొక్కఁ డాహార మడిగినఁ¯ గడపక ప్రియముతో గారవించి¯ హరిసమర్పణ మంచు నన్నంబులో సగ¯ మిచ్చిన భుజియించి యేఁగె నాతఁ; ¯ డంతలో నొక శూద్రుఁ డశనార్థి యై వచ్చి¯ పొడసూప లేదనఁ బోక తనకు¯ నున్న యన్నములోన నొక భాగమిచ్చిన¯ సంతుష్టుఁడై వాఁడు చనిన వెనుక (644.1) కుక్కగమియుఁ దాను నొక్కఁ డేతేర నా¯ యన్న శేష మిచ్చి సన్నయంబు¯ లాడి మ్రొక్కి పంప నోడక చండాలుఁ¯ డొక్క డరుగుదెంచి చక్క నిలిచి. (645) "హీనుఁడఁ జండాలుండను¯ మానవకులనాథ! దప్పి మానదు; నవలం¯ బోనేర; నీకుఁ జిక్కిన¯ పానీయము నాకుఁ బోసి బ్రతికింపఁగదే." (646) అనిన వాని దీనాలాపంబులకుఁ గరుణించి రా జిట్లనియె. (647) "అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రా¯ వన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్¯ గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మే¯ లున్నదె? నాకు దిక్కు పురుషోత్తముఁ డొక్కఁడ చుమ్ము పుల్కసా!" (648) అని పలికి (649) "బలవంతంబగు నీరుపట్టున నిజప్రాణాంతమై యున్నచో¯ నలయం డేమియు; వీని హృజ్వరము నాయాసంబు ఖేదంబు నా¯ జలదానంబున నేఁడు మాను" ననుచున్ సర్వేశ్వరాధీనుఁడై¯ జలముం బోసెను రంతిదేవుఁడు దయం జండాలపాత్రంబునన్. (650) తదనంతరంబ; బ్రహ్మాది దేవతలు సంతోషించి, రంతిదేవునికి మేలుచేయం దలఁచి, నిజాకారంబులతో ముందట నిలువంబడి యా రాజు ధైర్యపరీక్షార్థంబు దమ చేసిన వృషలాది రూపంబులగు విష్ణుమాయ నెఱింగించిన, నా నరేంద్రుం డందఱకు నమస్కరించి. (651) వారల నేమియు నడుగక¯ నారాయణభక్తి దన మనంబున వెలుఁగన్¯ ధీరుం డాతఁడు మాయా¯ పారజ్ఞుం డగుచు బరమపదముం బొందెన్. (652) ఆ రాజర్షిని గొలిచిన¯ వారెల్లఁ దదీయ యోగవైభవమున శ్రీ¯ నారాయణ చింతనులై¯ చేరిరి యోగీశులగుచు సిద్దపదంబున్. (653) ఇట్లు రంతిదేవుండు విజ్ఞానగర్భిణి యగు భక్తివలనఁ బరమపదంబునకుం జనియె; నంత గర్గునకు శిని జన్మించె. శినికి గార్గ్యుండు గలిగె; నాతనినుండి బ్రాహ్మణకులంబయ్యె; మహావీర్యునికి నురుక్షయుండును, నురుక్షయునకుఁ ద్రయారుణియుఁ గవియుఁ బుష్కరారుణియు నను మువ్వురు సంభవించిరి; వారును బ్రాహ్మణులయి చనిరి; బ్రహ్మక్షత్రునికి సుహోత్రుండు, సుహోత్రునకు హస్తియు జనించి రా హస్తి దన పేర హస్తినాపురంబు నిర్మించె నా హస్తికి నజమీఢుండును ద్విమీఢుండును బురుమీఢుండును నన మువ్వురు జనియించి; రం దజమీఢుని వంశంబునం బ్రియమేధాదులు గొందరు పుట్టి బ్రాహ్మణులయి చని; రయ్యజమీఢునికి బృహదిషుడు నతని పుత్రుండు బృహద్దనువు, నతనికి బృహత్కాయుండు, నతనికి జయద్రథుండు, నతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు సేనజిత్తు, సేనజిత్తునకు రుచిరాశ్వుండు, దృఢహనువుఁ గాశ్యుండు వత్సుండునన నలువురు జనించి; రందు రుచిరాశ్వునకుఁ బ్రాజ్ఞుండును, నతనికిఁ బృథుసేనుండును, బృథుసేనునికిఁ బారుండును, వానికి నీపుండు, నీపునికి నూర్వురు గొడుకులును బుట్టిరి; మఱియును. (654) శుకుని కూఁతురైన సుందరి సత్కృతిఁ¯ బొంది వేడ్క నీపభూవిభుండు¯ విమల యోగవిత్తు విజ్ఞానదీపితో¯ దారచిత్తు బ్రహ్మదత్తుఁ గనియె. (655) ఆ బ్రహ్మదత్తుండు జైగిషవ్యోపదేశంబున, యోగతంత్రంబునం జేసి గోదేవియను భార్యవలన విష్వక్సేనుండను కుమారునిం గనియె; విష్వక్సేనునకు నుదక్సేనుండును, దక్యేనునకు భల్లాదుండు గల్గి, వీరలు బార్హదిషవులను రాజులైరి; ద్విమీఢునకు యమీనరుండు, యమీనరునికిఁ గృతిమంతుండు, గృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండును, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుండు, సన్నతిమంతుని కొడుకు కృతి యనువాఁడు హిరణ్యనాభునివలన యోగమార్గం బెఱింగి, శోకమోహంబులు విడిచి తూర్పుదేశంబున సామసంహిత పఠియించె; నతనికి నుగ్రాయుధుండును, నుగ్రాయుధునకు క్షేమ్యుండు. క్షేమ్యునకు సువీరుండు, సువీరునకుఁ బురంజయుండుఁ, బురంజయునకు బహురథుండు జన్మించిరి; హస్తి కొడుకు పురుమీఢునికి సంతతి లేదయ్యె; నయ్యజమీఢునికి నళిని యను భార్య యందు నీలుండు నీలునికి శాంతియు, శాంతికి సుశాంతియు, సుశాంతికిఁ బురుజుండు, బురుజునికి నర్కుండు, నర్కునికి భర్మ్యాశ్వుండు, భర్మ్యాశ్వునకు ముద్గల యవీనర బృహదిషు కాంపిల్య సృంజయులను వారేరువురుం బుట్టిరి. (656) మించిన భర్మ్యాశ్వుఁడు సుత¯ పంచకమును జూచి విషయపంచకమును వ¯ ర్జించితిఁ దల మని పల్కినఁ¯ బాంచాలురు నాఁగ సుతులు పరఁగిరి ధరణిన్. (657) అంత ముద్గలునినుండి బ్రాహ్మణకులంబై, ముద్గల గోత్రంబు నా నెగడె; భర్మ్యాశ్వపుత్రుండైన యా ముద్గలునికి దివోదాసుండు, నహల్యయను కన్యకయునుం బుట్టి; రా యహల్య యందు గౌతమునికి శతానందుండు పుట్టె; శతానందునికి ధనుర్వేద విశారదుండయిన సత్యధృతి పుట్టె; నతం డొకనాఁడు వనంబున నూర్వశిం గనిన నతనికి రేతఃపాతంబై, తద్వీర్యంబు శరస్తంబంబునం బడి మిథునం బయ్యె; నా సమయంబున. (658) చపలరతి శంతనుం డను¯ నృపవరుఁ డడవికిని వేఁట నెపమునఁ జనుచుం¯ గృపతో శిశుయుగముం గని¯ కృపియుఁ గృపుం డనుచుఁ దెచ్చి గృహమునఁ బెంచెన్.

పాంచాలాదుల వంశము

(659) ఆ కృపి ద్రోణునకు భార్య యయ్యె; దివోదాసునకు మిత్రాయువు, మిత్రాయువునకుఁ జ్యవనుఁడుఁ, జ్యవనునకు సుదాసుండు, సుదాసునకు సహదేవుండు, సహదేవునకు సోమకుండు, సోమకునకు సుజన్మకృత్తు సుజన్మకృత్తునకు నూర్వురు కొడుకులుం గలిగిరి; వారిలో జంతు వనువాఁడు జ్యేష్ఠుండు కడచూలు పృషతుండు పృషతునకు ద్రుపదుండు, ద్రుపదునకు ధృష్టద్యుమ్నాదులయిన కొడుకులును ద్రౌపది యను కూఁతురుం గలిగిరి; ధృష్టద్యుమ్నునకు ధృష్టకేతువు పుట్టె; వీరలు పాంచాలరాజులని యెఱుంగుము; మఱియు నయ్యజమీఢుని కొడుకు ఋక్షుండు, ఋక్షునకు సంవరణుండా సంవరణుండు తపతి యనియెడి సూర్యకన్య యందుఁ గురువుం గనియె; నా కురువు పేరం గురుక్షేత్రంబయ్యె; నా కురువునకుఁ బరీక్షిత్తు సుధనువు జహ్నవు నిషధుండు ననువారు నలువురు పుట్టి; రందుఁ బరీక్షిత్తు కొడుకులులేక చనియె; సుధనువునకు సుహోత్రుం, డతనికిఁ జ్యవనుండు, చ్యవనునకుఁ గృతి, గృతికి ఉపరిచరవసువు, వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర, చేదిషాదులు పుట్టి; రందు బృహద్రథునకుఁ గుశాగ్రుండు, గుశాగ్రునికి ఋషభుండు, ఋషభునికి సత్యహితుండు, సత్యహితునికిఁ పుష్పవంతుండు పుష్పవంతునకు జహ్ను వనువాఁడు మఱియును.

బృహద్రథుని వృత్తాంతము

(660) ఆ బృహద్రథునకు నన్య భార్యాగర్భ¯ మున రెండు తనుఖండములు జనించె¯ దునుకలుగని తల్లి తొలఁగంగ వైచిన¯ సంధించె నొకటిగా జర యనంగ¯ నొక దైత్యకాంత; వాఁడొప్పె జరాసంధుఁ¯ డన; గిరివ్రజపుర మాతఁ డేలె; ¯ నతనికి సహదేవుఁ; డతనికి సోమాపి¯ తనయుఁ; డాతనికి శ్రుతశ్రవుండు (660.1) జహ్నుపుత్రుండు సురథుండు జనవరేణ్య! ¯ యతని కొడుకు విదూరథుఁ; డతని పట్టి¯ సార్వభౌముండు; వానికి సంభవుండు¯ విను జయత్సేనుఁ డనువాఁడు విమలకీర్తి! (661) ఆ జయత్సేనునికి రథికుండు, రథికునకు నయుతాయువు, నయుతాయువునకుఁ గ్రోధనుండు, గ్రోధనునకు దేవాతిథియు, దేవాతిథికి ఋక్షుండు, ఋక్షునికి భీమసేనుండు, వానికిఁ బ్రతీపుండుఁ, బ్రతీపునకు దేవాపి శంతను బాహ్లికు లన మువ్వురు గొడుకులు పుట్టి; రందు.

శంతనుని వృత్తాంతము

(662) దేవాపి రాజ్యంబు దీర్పనొల్లక వనం¯ బునకేఁగెఁ దమ్ముండు పూర్వజన్మ¯ మందు మహాభిషుఁ డనియెడు వాఁడు శం¯ తనుఁ డయ్యె వాఁడె యీ ధాత్రినెల్ల¯ నేలుచుఁ గరముల నే వృద్ధు ముట్టిన¯ వాఁడెల్ల నిండు జవ్వనము నొందు; ¯ నతఁడు శాంతిప్రాప్తుఁడై యున్నదానఁ బం¯ డ్రెండేండ్లు వజ్రి వర్షింపకున్న (662.1) వృష్టి లేని చొప్పు విప్రుల నడిగిన¯ నన్న యుండఁ దమ్ముఁ డగ్నిహోత్ర¯ దార సంగ్రహంబు దాల్చినఁ బరివేత్త¯ యండ్రు గాన నీవ యతఁడ వైతి. (663) అది కారణంబుగా నన్న యుండఁ దమ్ముండుఁ రాజ్యార్హుండుగాఁడు; నీవు పరివేత్తవు; మీ యన్నకు రాజ్యంబిచ్చిన, ననావృష్టిదోషంబు చెడు” నని బ్రాహ్మణులు పల్కిన, శంతనుండు వనంబునకుం జని, దేవాపికిఁ బ్రియంబు జెప్పి, రాజ్యంబు చేకొమ్మని పల్కె; నంతకు మున్న వానిమంత్రి దేవాపిని రాజ్యంబున కర్హుంజేయందలంచి విప్రులం బిలిచిన నా విప్రులు పాషాండమత వాక్యంబులు దేవాపికి నుపదేశించిన, దేవాపి వేదంబుల నిందించిన పాషాండుండును దేవదూషకుండును నయ్యెం గావున దేవాపికి రాజ్యంబు లేదని బ్రాహ్మ ణులు జెప్పిన శంతనుండు మగిడి వచ్చి రాజ్యంబుఁ జేకొనియె; నంత వర్షంబును గురిసె; నివ్విధంబున. (664) దేవాపి కలాపపురం¯ బావాసము గాఁగ యోగి యై యున్నాఁ డు¯ ర్వీవర! కలి నష్టంబగు¯ జై వాతృకకులముమీఁద సంస్థాపించున్. (665) బాహ్లీకుం డనువానికి సోమదత్తుండు పుట్టె; సోమదత్తునకు భూరియు భూరిశ్రవసుఁడును శలుండు ననువారు మువ్వురు పుట్టిరి.

భీష్ముని వృత్తాంతము

(666) భాతిగ శంతనునకు గం¯ గాతటికిని వైష్ణవాగ్రగణ్యుఁడు ఘోరా¯ రాతినయననీలోత్పల¯ భీతికరగ్రీష్ముఁడైన భీష్ముఁడు పుట్టెన్. (667) పరశురాముతోడఁ బ్రతిఘటించి జయింప¯ నన్యు నొకనిఁ గాన మతనిఁ దక్క¯ వీరయూథపతి వివేకధర్మజ్ఞుండు¯ దివిజనది సుతుండు దేవసముఁడు. (668) ఆ శంతనునకు దాశకన్యక యైన సత్యవతి యందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టి; రందుఁ జిత్రాంగదుండు గంధర్వులచే నిహతుండయ్యె మఱియును. (669) సత్యవతీవధూటి మును శంతనుపెండ్లముగాని నాఁడు సాం¯ గత్యమునం బరాశరుఁడు గర్భముజేసిన బాదరాయణుం¯ డత్యధికుండు శ్రీహరికళాంశజుఁడై ప్రభవించె నిత్యముల్¯ సత్యములైన వేదముల సాంగములన్ విభజింపఁ దక్షుఁడై. (670) బాదరాయణుండు భగవంతుఁ డనఘుండు¯ పరమగుహ్యమైన భాగవతము¯ నందనుండ నయిన నాకుఁ జెప్పెను శిష్య¯ జనుల మొఱఁగి యేను జదువుకొంటి.

పాండవ కౌరవుల కథ

(671) ఆ విచిత్రవీర్యునికిఁ గాశిరాజుకూఁతుల, నంబికాంబాలికల భీష్ముండు బలాత్కారంబున దెచ్చి వివాహంబు చేసిన విచిత్రవీర్యుండు వారలం దగిలి మనోజరాగమత్తుండై, చిరకాలంబు నానావిధక్రీడల విహరించుచు, రాజయక్ష్మ పీడితుండై, మృతుం డయ్యె; నంత. (672) "అతని సతులవలన సుతుల¯ సుత! కను' మని తల్లి పనుప సొరిదిం గనియెన్¯ ధృతరాష్ట్ర పాండు విదురుల¯ నుతచరితుఁడు బాదరాయణుండు నరేంద్రా! (673) అంత, ధృతరాష్ట్రునికి గాంధారి యందు దుర్యోధనాదులగు కొడుకులు నూర్వురును, దుశ్శలయను కన్యకయును జన్మించిరి; మృగశాప భయంబునం జేసి, భార్యలం బొంద వెఱచిన పాండునకుఁ గుంతీదేవియందు ధర్మానిలేంద్రుల ప్రసాదంబున యుధిష్ఠిర భీమార్జునులను మువ్వురును, మాద్రిదేవివలన నాసత్యప్రసాదంబున నకుల సహదేవులను వారిద్ధఱునుగా నేవురు పుట్టి; రయ్యేవురకును ద్రుపదరాజపుత్రి యైన ద్రౌపది యందుఁ గ్రమంబునం బ్రతివింధ్యుండును, శ్రుతసేనుండును, శ్రుతకీర్తియు, శతానీకుండును, శ్రుతకర్ముండును నన నేవురు పుట్టిరి; మఱియు యుధిష్ఠిరునకుఁ బౌరవతి యందు దేవకుండును, భీమసేనునికి హిడింబయందు ఘటోత్కచుండును, గాళి యందు సర్వగతుండును, సహదేవునికి విజయ యందు సుహ్రోత్రుండును, నకులునకు రేణుమతి యందు నిరమిత్రుండును, నర్జునునకు నులూపి యను నాగకన్యక యందు నిలావంతుండును, మణలూరుపతిపుత్రి యయిన చిత్రాంగద యందు బబ్రువాహనుండును, సుభద్రయందు శౌర్యధైర్య తేజోవిభవంబుల నఖిలరాజనికరంబునం బ్రఖ్యాతుండైన యభిమన్యుండును జన్మించి; రందు బబ్రువాహనుం డర్జునునియోగంబున మాతామహుని గోత్రంబునకు వంశకర్త యయ్యె. (674) అన్యసుపూజ్య! నీ జనకుఁడై యభిమన్యుఁడు; భూవరేంద్రమూ¯ ర్ధన్యుఁడు; ధన్యమార్గణ కదంబవిదారితవైరివీర రా¯ జన్యుఁడు; జన్యభీత గురుసైన్యుఁడు; సైన్యసమూహనాథదృ¯ ఙ్మాన్యుఁడు; మాన్యకీర్తి; మహిమం దనరెం గురువంశకర్త యై. (675) ఆ అభిమన్యునకు నుత్తర యందు నీవు జన్మించితివి. (676) ద్రోణసుతు తూపువేఁడిమి ¯ బ్రాణంబులఁ బాసి హరికృపాదర్శన సం¯ త్రాణంబున బ్రతికితికా¯ క్షోణీశ్వర! మున్ను నీ శిశుత్వమువేళన్. (677) నీ కుమారులు జనమేజయ, శ్రుతసేన, భీమసే, నోగ్రసేను లను నల్వురు వీరల యందు. (678) నీవు తక్షకాహి నిహతుండ వని విని¯ సకలసర్పలోక సంహృతముగ¯ సర్పయాగ మింక జనమేజయుఁడు చేయఁ¯ గలఁడు పూర్వరోషకలితుఁ డగుచు. (679) మఱియు నతండు సర్వధరణీమండలంబును జయించి, కావషేయుండు పురోహితుండుగా నశ్వమేధంబు చేయంగలవాఁడు. వానికి శతానీకుండు జనియించి, యాజ్ఞవల్క్యునితోడ వేదంబులు పఠించి, కృపాచార్యునివలన విలువిద్యనేర్చి, శౌనకునివలన నాత్మజ్ఞానంబు బడయఁగలవాఁ; డా శతానీకునికి సహస్రానీకుండు వానికి నశ్వమేధజుం, డశ్వమేధజునికి నాసీమకృష్ణుం; డాసీమకృష్ణునకు నిచకుం; డా నిచకుండు గజాహ్వయంబు నదిచే హృతంబుగాఁ, గౌశంబి యందు వసియించు; నాతనికి నుప్తుం; డుప్తునికిఁ జిత్రరథుండు, చిత్రరథునకు శుచిరథుండు, శుచిరథునికి వృష్టిమంతుండు, వృష్టిమంతునికి సుషేణుండు, సుషేణునికి సుపీతుండు, సుపీతునికి నృచక్షువు, నృచక్షువునకు సుఖానిలుండు, సుఖానిలునికిఁ బరిప్లవుండు, బరిప్లవునకు మేధావి, మేధావికి సునయుండు, సునయునికి నృపంజయుండు, నృపంజయునికి దూర్వుండు, దూర్వునికి నిమి, నిమికి బృహద్రథుండు, బృహద్రథునకు సుదాసుండు, సుదాసునికి శతానీకుండు, శతానీకునకు దుర్దమనుండు, దుర్దమనునికి విహీనరుండు, విహీనరునికి దండపాణి, దండపాణికి మితుండు, మితునకు క్షేమకుండు, క్షేమకునకు బ్రహ్మక్షత్రుండు; వాఁడు నిర్వంశుండై, దేవర్షి సత్కృతుండై, కలియుగంబు నందు జనంగలవాఁడు. (680) జగతి నిటమీఁదఁ బుట్టెడు¯ మగధాధీశ్వరుల నిఖిలమనుజేశ్వరులన్¯ నిగమాంతవిదులఁ జెప్పెద¯ సుగుణాలంకార! ధీర! సుభగవిచారా! (681) జరాసంధపుత్రుండయిన సహదేవునికి మార్జాలి, మార్జాలికి శ్రుతశ్రవుండు, శ్రుతశ్రవునకు నయుతాయువు, నయుతాయువునకు నిరమిత్రుండు, నిరమిత్రునకు సునక్షత్రుండు, సునక్షత్రునికి బృహత్సేనుండు, బృహత్సేనునికిఁ గర్మజిత్తు, గర్మజిత్తునకు శ్రుతంజయుండు, శ్రుతంజయునకు విప్రుండు, విప్రునకు శుచి, శుచికి క్షేముండు, క్షేమునికి సువ్రతుండు, సువ్రతునకు ధర్మనేత్రుండు, ధర్మనేత్రునకు శ్రుతుండు, శ్రుతునకు దృఢసేనుండు, దృఢసేనునికి సుమతి, సుమతికి సుబలుండు, సుబలునకు సునీతుండు, సునీతునకు సత్యజిత్తు, సత్యజిత్తునకు విశ్వజిత్తు, విశ్వజిత్తునకుఁ బురంజయుండును జన్మించెద” రని చెప్పి మఱియు నిట్లనియె. (682) "వినుము; మగధదేశవిభులు జరాసంధ ¯ ప్రముఖ ధరణిపతులు ప్రబలయశులు¯ వీరు కలియుగమున వేయేండ్ల లోపలఁ¯ బుట్టి గిట్టఁగలరు భూవరేంద్ర! (683) యయాతికొడు కనువునకు సభానరుండుఁ, జక్షువుఁ, బరోక్షుండు నను వారు మువ్వురు పుట్టి; రందు సభానరునికిఁ గాలనాథుండు, గాలనాథునకు సృంజయుండు, సృంజయనకుఁ బురంజయుండు, పురంజయునకు జనమేజయుండు, జనమేజయునకు మహాశాలుండు, మహాశాలునికి మహామనసుండు, మహామనసునకు సుశీనరుండు తితిక్షువన నిరువురు జన్మించి; రందు సుశీనరునకు శిబి వన క్రిమి దర్పు లన నలువురు జన్మించి; రందు శిబికి వృషదర్ప సువీర మద్ర కేకయులు నలువురు పుట్టిరి; తితిక్షునకు రుశద్రథుండు, రుశద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలియుఁ, బుట్టి; రా బలివలన నంగ వంగ కళింగ సింహ పుండ్రాంధ్రులను పేర్లుగలవా రార్వురు కుమారులు పుట్టిరి; వారలు దూర్పు దేశంబులకు రాజులయి దేశంబులకుఁ దమ తమ నామ ధేయంబు లిడి, యేలిరి; సువీరునకు సత్యరథుండు సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుఁడు, ధర్మరథునకుఁ జిత్రరథుండుఁ బుట్టి; రా చిత్రరథుండు రోమపాదుండు నాఁ బరఁగె.

ఋశ్యశృంగుని వృత్తాంతము

(684) సంతతిలేనితనంబునఁ¯ జింతించుచునుండ నతని చెలికాఁ డగు ధీ¯ మంతుఁడు దశరథుఁ డతనికి¯ సంతతిగా నిచ్చె నాత్మజను శాంతాఖ్యన్. (685) అంత రోమపాదుండు, దన కూఁతురు శాంత యని కైకొని మెలంగుచుండ, నా రాజు రాజ్యంబునఁ గొంతకాలంబు వర్షంబు లేమికిం జింతించి, విభాండకసుతుండైన ఋశ్యశృంగుండు వచ్చిన వర్షంబు గురియు నని పెద్దలవలన నెఱింగి. (686) ఆ రాజు ఋశ్యశృంగుని¯ ఘోరతపోనియముఁ దెచ్చుకొఱకై పనిచెన్¯ వారసతుల నేర్పరుల ను¯ దారస్తనభారభీరుతరమధ్యగలన్. (687) వారలుఁ జని. (688) "కాంతలార! మెకము గన్నది మొదలుగా¯ నాఁడువారి నెఱుఁగఁ డడవిలోన¯ గోఁచి బిగియఁగట్టుకొనిన యా వడుగని¯ మత్తికాని రతికి మరపవలయు." (689) అని పలుకుచు. (690) ఆడుచుఁ జెవులకు నింపుగఁ¯ బాడుచు నాలోక నిశితబాణౌఘములన్¯ వీడుచు డగ్గఱ నోడుచుఁ¯ జేడియ లా తపసికడకుఁ జేరిరి కలఁపన్. (691) అయ్యవసరంబున వారలం జూచి. (692) మిళితాళినీల ధమ్మిల్లభారంబులు¯ చారుజటావిశేషంబు లనియు, ¯ భర్మాంచ లోజ్వలప్రభ దుకూలంబులు¯ తతచర్మవస్త్రభేదంబు లనియు, ¯ బహు రత్నకీలిత భాసురహారంబు¯ లధికరుద్రాక్షమాలాదు లనియు, ¯ మలయజ మృగనాభి మహిత లేపంబులు¯ బహువిధ భూతి లేపంబు లనియు, (692.1) మధురగానంబు శ్రుతియుక్తమంత్రజాతు¯ లనియు, వీణెలు దండంబు లనియు, సతుల¯ మూర్తు లెన్నఁడు నెఱుఁగని ముగుద తపసి¯ వారిఁ దాపసులని డాయవచ్చి మ్రొక్కె. (693) ఇట్లు వచ్చి మ్రొక్కిన ఋశ్యశృంగుం జూచి, నగుచు డగ్గఱి. (694) "క్షేమమే" యని సతుల్ చేతుల గ్రుచ్చి క¯ ర్కశకుచంబులు మోవఁ గౌఁగలించి¯ "చిరతపోనియతి డస్సితిగదా" యని మోముఁ¯ గంఠంబు నాభియుఁ గలయఁ బుడికి ¯ "క్రొత్తదీవన లివి గొను"మని వీనుల¯ పొంత నాలుకలఁ జప్పుళ్ళు చేసి¯ "మా వనంబుల పండ్లు మంచివి తిను"మని¯ పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసఁగి (694.1) "నూతనాజినంబు నునుపిది మే"లని¯ గోఁచి విడిచి మృదు దుకూలమిచ్చి¯ మౌని మరగఁజేసి "మా పర్ణశాలకుఁ¯ బోద" మనుచుఁ గొంచుఁబోయి రతని. (695) ఇట్లు హరిణీసుతుండు కాంతాకటాక్షపాశబద్దుండై, వారల వెంటం జని, రోమపాదుకడకుం బోయిన, నతండు దన ప్రియనందన యైన శాంతనిచ్చి పురంబు ననునిచికొనియె; నమ్మునీశ్వరుండు వచ్చిన వర్షప్రతిబంధదోషంబు చెడి వర్షంబు గురిసె; నంత. (696) ఆ నృపాలచంద్రుఁ డనపత్యుఁడై యుండ¯ నెఱిగి మునికులేంద్రుఁ డింద్రుఁగూర్చి¯ యిష్టి చేసి సుతుల నిచ్చె నాతని కృపఁ¯ బంక్తిరథుఁడు పిదపఁ బడసె సుతుల. (697) ఆ రోమపాదునకుఁ జతురంగుఁడును, జతురంగునకుఁ బృథులాక్షుండును, బృథులాక్షునికి బృహద్రథుండు, బృహత్కర్ముండు బృహద్భానుండు ననువారు మువ్వురు పుట్టి; రందు బృహద్రథునకు బృహన్మనసుఁడు, బృహన్మనసునకు జయద్రథుండు, జయద్రథునకు విజయుండు, విజయునకు సంభూతి యను భార్యయందు ధృతియు, నా ధృతికి ధృతవ్రతుండు, ధృతవ్రతునకు సత్యకర్ముండు, సత్యకర్మునకు నతిరథుండును జన్మించిరి. (698) కుంతి పిన్ననాఁడు గోరి సూర్యునిఁ బొంద¯ బిడ్డఁ డుదితుఁడైనఁ బెట్టెఁ బెట్టి¯ గంగ నీట విడువఁ గని యతిరథుఁ డంత¯ గర్ణుఁ డనుచుఁ గొడుకు గారవించె.

ద్రుహ్యానుతుర్వసులవంశము

(699) ఇట్లతిరథునకుఁ గానీనుండైన కర్ణుండు కొడుకయ్యె; కర్ణునకు వృషసేనుండు పుట్టెను; అయ్యయాతి కొడుకైన ద్రుహ్యునకు బభ్రుసేతువు, బభ్రుసేతువునకు నారబ్దుండు, నారబ్ధునకు గాంధారుండు, గాంధారునకు ఘర్ముండు, ఘర్మునకు ఘృతుండు, ఘృతునకు దుర్మదుండు, దుర్మదునకుఁ బ్రచేతసుండు, బ్రచేతసునకు నూర్గురు పుట్టి, మ్లేచ్ఛాధిపతులయి, యుదగ్దిశ నాశ్రయించిరి; తుర్వసునకు వహ్ని, వహ్నికి భర్గుండు, భర్గునకు భానుమంతుండు, భానుమంతునకుఁ ద్రిసానువు, ద్రిసానువునకుఁ గరంధముండును, గరంధమునకు మరుత్తుండు, నతనికి యయాతిశాపంబున సంతతి లేదయ్యె; వినుము.

యదువంశ చరిత్రము

(700) అనఘ! యయాతి పెద్దకొడుకైన యదుక్షితిపాలు వంశమున్¯ వినినఁ బఠించినన్ నరుఁడు వెండియుఁ బుట్టఁడు ముక్తిఁ బొందు న¯ య్యనుపమమూర్తి విష్ణుఁడు నరాకృతిఁ బొంది జనించెఁ గావునన్¯ వినుము; నరేంద్ర! నా పలుకు వీనుల పండువుగాఁగఁ జెప్పెదన్. (701) యదువునకు సహస్రజిత్తుఁ గ్రోష్టువు నలుండు రిపుండు ననువారు నలువురు సంభవించి; రందుఁ బెద్దకొడుకయిన సహస్రజిత్తునకు శతజిత్తు గలిగె; నా శతజిత్తునకు మహాహయ వేణుహయ హేహయు లనువారు మువ్వురు జనించి;రందు హేహయునకు ధర్ముండు ధర్మునకు నేత్రుండు నేత్రునకుఁ గుంతి గుంతికి మహిష్మంతుండు మహిష్మంతునికి భద్రసేనుండు, భద్రసేనునకు దుర్మదుండు, దుర్మదునికి ధనికుండు, ధనికునికిఁ గృతవీర్య కృతాగ్ని కృతవర్మ కృతౌజులను నలువురు సంభవించి; రందు గృతవీర్యునికి నర్జునుండు జనియించె; అతండు మహాబుద్ధిబలంబున.

కార్తవీర్యుని చరిత్ర

(702) హరికళాసంజాతుఁడైన దత్తాత్రేయు¯ సేవించి సద్యోగసిద్ధిఁ బొంది¯ బహు యజ్ఞ దాన తపంబులు గావించి¯ సకలదిక్కులు గెల్చి జయముతోడ¯ సతతంబు హరినామ సంకీర్తనము చేసి¯ ధనముల నొంది యుదారవృత్తి¯ యెనుబదియైదువే లేండ్లు భూచక్రంబు¯ ఘనకీర్తిఁ దనపేరుగాఁగ నేలె; (702.1) ముదిమిలేక తరుణమూర్తి యై యురుకీర్తి¯ నమరెఁ గార్తవీర్యుఁ డనఁగ విభుఁడు ¯ నిజము వానిభంగి నేల యేలినయట్టి¯ రాజు నెఱుఁగ మెందు రాజముఖ్య! (703) అయ్యర్జునునకుం గల పుత్రసహస్రంబునం బరశురామునిబారికిం దప్పి జయధ్వజుండు, శూరసేనుండు, వృషణుండు, మధువు, నూర్జితుండు నను వారేవురు బ్రతికిరి; జయధ్వజునకుఁ దాళజంఘుండును, దాళజంఘునకు నౌర్వముని తేజంబున నూర్వురు గొడుకులును గలిగి; రందుఁ బ్రథముండు వీతిహోత్రుండు మధువునకు వృక్ణుండు, వృక్ణునకుఁ బుత్రశతంబు పుట్టె; నందుఁ బ్రథముఁడు వృష్ణి; మఱియు మధు వృష్ణి యదువుల యా వంశంబులవారు మాధవులు వృష్ణులు యాదవులు ననం బరఁగిరి; యదుపుత్రుం డైన క్రోష్ణువునకు వృజినవంతుండు, వృజినవంతునకు శ్వాహితుండు, శ్వాహితునకు భేరుశేకుండు, భేరుశేకునకుఁ జిత్రరథుండు, చిత్రరథునకు శశిబిందుండుం బుట్టిరి.

శశిబిందుని చరిత్ర

(704) కృశమధ్యల్ పదివేవు రంగనలతోఁ గ్రీడం బ్రమోదింప స¯ త్కుశలుండై పదివేలలక్షలు సుపుత్రుల్ భక్తిజేయం జతు¯ ర్దశ రత్నుండును యోగినాఁ బరఁగి సప్తద్వీపరాజేంద్రుఁడై¯ శశిబిందుం డురునీతిమంతుఁ డమరన్ సత్కాంతిపూర్ణేందుఁడై. (705) అతని కొడుకుల మొత్తంబునకు ముఖరులయిన యార్వురలోఁ బృథుశ్రవుండను వానికి ధర్ముండు పుట్టె; ధర్మునకు నుశనుండు పుట్టి, నూఱశ్వమేథంబులుజేసె; నయ్యశనునకు రుచికుండు పుట్టె; నా రుచికునకుఁ బురుజిత్తు, రుక్ముండు, రుక్మేషువుఁ, బృథువు, జ్యాముఖుండు నను వారేవురు పుట్టి; రందు జ్యాముఖుండు. (706) తొట్రుకొల్పెడు శైబ్యతోడి ప్రేమంబున¯ ననపత్యుఁ డయ్యును నన్యభార్యఁ¯ గైకొన కొక కొంతకాలంబునకుఁ బోయి¯ పగవారి యింటను బలిమిఁ బట్టి¯ యొకకన్యఁ దేరిపై నునిచి తోడ్తేరంగ¯ జననాథుఁగన్యను శైబ్య చూచి¯ కోపించి "మానవకుహక! యీ పడుచును¯ దెచ్చియు నేనుండఁ దేరిమీఁద (706.1) బెట్టినాఁడ" వనుచు బిఱుసులు పలుకంగ¯ నతడు పలికె నంత నతివతోడ¯ "నాకుఁ గోడ లింత నమ్ము మీ లలితాంగి¯ సవతిగాదు నీకు సత్య" మనుచు. (707) అయ్యవసరంబున శైబ్య కొడుకుం గాంచు నని యెఱింగి విశ్వేదేవతలును బితృదేవతలును సంతసించిరి; వారల ప్రసాదంబున. (708) తన సవతి మొఱఁగి పెనిమిటి¯ తనుఁ బొందిన శైబ్య మఱి విదర్భునిఁ గనియెం¯ దనయుఁ గని జ్యాముఖుండును¯ దనతెచ్చిన కన్యఁ దెచ్చి తనయున కిచ్చెన్. (709) ఆ కన్యక యందు విదర్భునకుఁ గుశుండును గ్రుథుండును రోమపాదుండునుం బుట్టి; రా రోమపాదునకు బభ్రువు బభ్రువునకు విభువు విభువునకుఁ గృతి గృతికి నుశికుండు నుశికునకుం జేది చేది కిఁ జైద్యాదులు పుట్టరి; కృథునకుఁ గుంతి, గుంతికి ధృష్టి, ధృష్టికి నిర్వృతి, నిర్వృతికి దశార్హుండు, దశార్హునకు వ్యోముండు, వ్యోమునకు జీమూతుండు, జీమూతునకు వికృతి, వికృతికి భీమరథుండు, భీమరథునకు నవరథుండు, నవరథునకు దశరథుండు, దశరథునకు శకుని, శకునికిఁ గుంతి, గుంతికి దేవరాతుండు, దేవరాతునకు దేవక్షత్రుండు దేవక్షత్రునకు మధువు మధువునకుఁ గురువశుండు, కురువశునకు ననువు, అనువునకుఁ బురుహోత్రుం, డతనికి నంశు, వతనికి సాత్వతుండు సాత్వతునకు భజమానుండును భజియును దివ్యుండును వృష్ణియు దేవాపృథుండును నంధకుండును మహాభోజుండును నన నేడ్వురు పుట్టి; రందు భజమానునకుఁ బ్రథమభార్య యందు నిమ్రోచి కంకణ వృష్ణులు మువ్వురును, రెండవ భార్య యందు శతజిత్తు సహస్రజిత్తు నయుతజిత్తునన మువ్వురు బుట్టి; రందు దేవాపృథునికి బభ్రువు పుట్టె; వీర లిరువుర ప్రభావంబులఁ బెద్దలు శ్లోకరూపంబునఁ బఠియింతు; రట్టి శ్లోకార్థం బెట్టిదనిన. (710) వినుము దూరంబునం దేమి వినుచు నుందు¯ మదియ చూతుము డగ్గఱ నరుగుదేర¯ నరులలో బభ్రుకంటె నున్నతుఁడు లేడు¯ యోజ దేవాపృథున కెన యొరుఁడు గలఁడె? (711) పదునాలుగు వేవురు నఱు¯ వదియేవురు నరులు ముక్తి పడసిరి బభ్రుం¯ డుదితుఁడు దేవాపృథుఁడును¯ బదపడి యోగంబుఁ దెలియఁబలికినకతనన్. (712) మహాభోజుం డతిధార్మికుండు; వాని వంశంబువారు భోజులని పలుకంబడిరి; వృష్ణికి సుమిత్రుండు, యుధాజిత్తును జన్మించి; రందు యుథాజిత్తునకు శినియు, ననమిత్రుండును జనించిరి; అనమిత్రునికి నిమ్నుండు, నిమ్నునికి సత్రాజితుండు, బ్రసేనుండు నన నిరువురు పుట్టిరి; మఱియు ననమిత్రునికి శిని యనువాఁడు వేఱొకండు గలం; డతనికి పుత్రుండు సత్యకుండును; నతనికి యుయుధానుం డనంబరఁగిన సాత్యకియు, నా సాత్యకికి జయుండును, జయునకుఁ గుణియు, నా కుణికి యుగంధరుండునుం బుట్టరి; మఱియు ననమిత్రునకుఁ బృశ్ని యను వేఱొక కొడుకు గలఁడు; వానికి శ్వఫల్క చిత్రకులు గలిగి; రందు శ్వఫల్కునకు గాందినియం దక్రూరుండును, నసంగుండును, సారమేయుండును, మృదుకుండును, మృదుపచ్ఛివుండును, వర్మదృక్కును, ధృష్టవర్ముండును, క్షత్రోపేక్షుండును, నరిమర్దనుండును, శత్రుఘ్నుండును, గంధమాదనుండును, బ్రతిబాహువును నను వారు పన్నిద్ధఱు గొడుకులును సుచారు వను కన్యకయు జనించిరి; వారియం దక్రూరునికి దేవలుండును, ననుపదేవుండునుం బుట్టరి; మఱియుఁ జిత్రునకుఁ బృథుండును విడూరథుండును మొదలుగాఁ గలవారు పెక్కండ్రు వృష్ణివంశజాతు లైరి; భజమానుండు, కుకురుఁడు, శుచి, కంబళబర్హిషుండు నన నలువు రంధకునకుఁ బుట్టిరి; కుకురునికి వృష్ణి వృష్ణికి విలోమతనయుండు, విలోమతనయునుకిఁ గపోతరోముండు గపోతరోమునికి దుంబురు సఖుండైన యనువును, ననువునకు దుందుభి దుందుభికి దవిద్యోతుండు, దవిద్యోతునకుఁ బునర్వసువు, నతనికి నాహుకుండను కుమారుండు, నాహుకి యనుకన్యయుం గలిగి; రా యాహుకునికి దేవకుం, డుగ్రసేనుండు నన నిరువురు జనించి; రందు దేవకునికి దేవలుండు, నుపదేవుండును, సుదేవుండు, దేవవర్ధనుం డన నలుగురు గలిగరి; వారలకు ధృతదేవయు, శాంతిదేవయు, నుపదేవయు, శ్రీదేవయు, దేవరక్షితయు, సహదేవయు, దేవకియు ననఁ దోబుట్టవు లేడ్వురు గలిగిరి; వినుము. (713) అసదృశ లలితాకారలఁ¯ గిసలయ కరతలల దేవకీముఖ్యల నా¯ బిసరుహనయనల నందఱ¯ వసుదేవుఁడు పెండ్లియాడె వసుధాధీశా! (714) ఉగ్రసేనునకుఁ గంసుండును, న్యగ్రోధుండును, సునామకుండును, కహ్వుండును, శంకుండును, సుభువును, రాష్ట్రపాలుండును, విసృష్టుండును, దుష్టిమంతుండును ననువారు దొమ్మండ్రు కొడుకులును, కంసయుఁ, గంసవతియు, సురాభువును, రాష్ట్రపాలికయు నను కూఁతులుం బుట్టరి; వారు వసుదేవానుజభార్యలైరి; భజమానునికి విడూరథుండును, విడూరథునికి శినియు, నతనికి భోజుండు భోజునికి హృదికుండును గలిగి; రందు హృదికునికి దేవమీఢుండు, శతధనువు కృతవర్మయు నను కొడుకులు గలిగి; రా దేవమీఢుండు శూరుండు ననంబడు శూరునికి మారిష యను భార్య యందు వసుదేవుండును దేవభాగుండును దేవశ్రవుండును నానకుండును సృంజయుండును శ్యామకుండును గంకుండును ననీకుండును వత్సకుండును వృకుండును ననువారు పదుగురు గొడుకులును బృథయు శ్రుతదేవయు శ్రుతకీర్తియు శ్రుతశ్రవసయు రాజాధిదేవియు నను కూఁతు లేవురును బుట్టిరి; అందు.