పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : అష్టమ 438 - 547

బలి యుద్ధ యాత్ర

(438) అనిన శుకుం డిట్లనియె. (439) "పురుహూతుచే నొచ్చి పోయి భార్గవులచే¯ బలి యెట్టకేలకు బ్రతికి వారి¯ చిత్తంబురాఁ గొల్చి శిష్యుఁడై వర్తింప¯ వారు నాతని భక్తి వలన మెచ్చి¯ విశ్వజిద్యాగంబు విధితోడఁ జేయింప¯ భవ్యకాంచనపట్ట బద్ధ రథము¯ నర్కువాజులఁ బోలు హరులుఁ గంఠీరవ¯ ధ్వజము మహాదివ్యధనువుఁ బూర్ణ (439.1) తూణయుగళంబుఁ గవచంబుఁ దొలుత హోమ¯ పావకుం డిచ్చె; నమ్లాన పద్మమాలఁ¯ గలుష హరుఁడగు తన తాత కరుణ నొసఁగె; ¯ సోమ సంకాశ శంఖంబు శుక్రుఁ డిచ్చె. (440) ఇవ్విధంబున (441) పాణియు, రథియుఁ, గృపాణియుఁ, ¯ దూణియు, ధన్వియును, స్రగ్వి తురగియు, దేహ¯ త్రాణియు, ధిక్కృత విమత¯ ప్రాణియు, మణి కనక వలయ పాణియు నగుచున్. (442) పలుదానంబుల విప్రులం దనిపి తద్భద్రోక్తులం బొంది పె¯ ద్దలకున్ మ్రొక్కి విశిష్టదేవతల నంతర్భక్తిఁ బూజించి ని¯ ర్మలుఁ బ్రహ్లాదునిఁ జీరి నమ్రశిరుఁడై రాజద్రథారూఢుఁడై¯ వెలిఁగెన్ దానవ భర్త శైల శిఖ రోద్వేల్ల ద్దవాగ్ని ప్రభన్. (443) దండిత మృత్యు కృతాంతులు¯ ఖండిత సుర సిద్ధ సాధ్య గంధర్వాదుల్¯ పిండిత దిశు లమరాహిత¯ దండాధీశ్వరులు సములు దన్నుం గొలువన్. (444) చూపుల గగనము మ్రింగుచు¯ నేపున దివి భువియు నాత లీతల చేయన్¯ రూపించుచు దనుజేంద్రుఁడు ¯ ప్రాపించెను దివిజనగర పథము నరేంద్రా!

స్వర్గ వర్ణనము

(445) ఇట్లు బలవంతుఁడగు బలి సురేంద్రుని సాధింప సమకట్టి దండ గమనంబులు జేసి, నిడుద పయనంబులం జనిచని. (446) కనియెం బుణ్యజనౌకమున్ విగతరోగస్వప్న పీడాన్న ఖా¯ దన సంశోకముఁ బుష్ప పల్లవ ఫలోద్దామద్రుమానీకమున్¯ స్వనితోద్ధూత పతాకముం బ్రవిచరద్వైమానికానీకమున్¯ ఘన గంగాసలి లైకమున్ మఘవయుక్తశ్రీకమున్ నాకమున్. (447) కని రక్కసులఱేఁడు వెక్కసంబై చాల్పుగల వేల్పుల నెలవు దఱియం జొచ్చి, చెచ్చెర ముందటికిం జనిచని, ముందట నెడపడక మొన మోపి, యిగురుచు చిగురు తలిరాకు జొంపంబు ననమొగుడు మొగ్గ యరవిరి నెఱవిరి గుత్తి పిందె పూఁప దోరకాయ పండు గెలలతండంబుల వ్రేగు లాఁగలేక మూఁగి వీఁగి వ్రేఁకలగు మ్రాకుల ప్రోక లకుఁ బేఁట లగు పెందోఁటలును; దోఁటల గాటంబులై నివ్వటిల్లు మవ్వంపుఁ గ్రొవ్విరులకుఁ గవలువివ్వక కసిమసలు కలిగి ముసిరి కొసరి పూనిపోని తేనియ లాని విసరు గలిగి మసరు కవిసి క్రొవ్వి రిమ్మ గొని జుమ్ము జుమ్మనుచు జంజాటించు తేఁటి దాటులును; దాఁటు పడక నాఁటుకొని పూవిడుచు కూడి జోడువీడక క్రోమ్మావుల కమ్మని కొమ్మల నిమ్ముల ముసరి పసిమి గల కిసలయమ్ములు పొసగంగ మెసంగి కిసరుపడక కసరుచెడి బిట్టు రట్టడితనంబు లలమి మించి కరాళించు కోయిలల మొత్తంబులును; మొత్తంబులయి చిత్తంబుల మత్తంబులుగఁ దత్తఱంబున దియ్యని పండ్లకుఁ గయ్యంబులు చేసి చయ్యన నేసరేఁగి బేసంబులు గాసంబులుగొని వాసికెక్కి పలుబాస లాడుచు బహుప్రకారంబులగు కీరంబులునుఁ; గీరంబులకు సరిఁగడచి మింటనంట నెగసి పెట్టలం బట్టి చీరి యిట్టట్టు చనక నెట్టుకొని నెలవుల వ్రాలుచు నింపుగల రవమ్ములుఁ గలుఁగు కలరవమ్ములును గలరవమ్ము లలరం దొలంకుల కొలంకుల కెలంకులఁ గడంకల బ్రియల నిడుకొని క్రమ్మిదొమ్మిచేసి యెలదమ్మి తూఁడులవాఁడు లగు చంచువులం జించి మెక్కి చొక్కి మిక్కిలి కలఁకలం బడుచు నలబలంబులు చేయు కలహంసంబులును; హంసరుచి జనిత వికసనముల వికవిక నగుచుం బసఁగలిగి మిసమిస మెఱచు పసిఁడి కెందమ్ము లిందిరా మందిరమ్ముల చందమ్ములుగ నందమ్ములగు కొలంకులును; కొలంకుల కరళ్ళఁ దడిసి వడవడ వడంకుచు నల్లిబిల్లులుగొని సాఁగిన తీగెయిండ్ల గండ్ల యీఱములం దోరములుచెడి పలువిరుల కమ్మ వలపుల వ్రేఁగునం దూఱలేక యీడిగలంబడు గాడ్పులును, గాడ్పుల వలన నెగసి గగనమున విరిసి పలువన్నెలం జెనగు మేలుకట్టుఁ బుట్టంబుల తెఱంగున దట్టంబులయిన కుసుమ పరాగంబులును; బరాగంబుల సరాంగంబులగు వాఁగు వ్రంతల చెంతల గుంపులుగొని గఱికి జొంపంబుల లంపులు దిని మంపులుగొని పెల్లు నెమర్లుపెట్టుచు నొదుఁగుల పొదుగులు గదల వాడల వాడల జాడలం బరుగులిడు దూడల క్రీడల వేడుకలం గూడుకొని యిండ్ల వాకిండ్లకుం జేరి పౌరుల కోరికల కనుసారికలగుచు నమృతంబుఁ గురియు కామధేనువులునుఁ; గామధేనువులకు నిలువ నీడ లగుచు నడిగిన జనమ్ములకు ధనమ్ములు ఘనమ్ముగఁ బుడుకు కల్పతరువులును; కల్పతరువుల పల్లవ మంజరులఁ గుంజరులకు విఱిచి యిచ్చుచు మచ్చికల కలిమి నిచ్చ మెచ్చుచు గృతక గిరుల చఱుల సిరుల నడరు పడఁతుల నడలకు గురువులగుచు మెఱయు మురువుల నొత్తరించు మత్తేభంబులును, నిభంబుల సరస నొరసికొని వరుసఁ బరుసఁదనములెడలి సుకరములగు మకరతోరణ స్తంభంబులును; తోరణస్తంభంబుల చేరువ నిలిచి చెఱకువిలుతుం డొఱపెఱికిన బెడిదము లగు నవకంపు మెఱుఁగుం జిగురు టడి దముల తెఱంగున నిలుకడ సంపదలు గలుగు శంపల సొంపునం గరచరణాది శాఖలుగల చంద్రరేఖల పోఁడిమిని వాహిని గల మోహినీ విద్యల గ్రద్దనఁ జూపులకుం దీపు లొదవించుచు మర్మకర్మంబు వశంబు లరయు యశంబులు గలిగి యనూనంబులగు విమానంబు లెక్కి చచ్చివచ్చిన సచ్చరిత్రులకుం జెచ్చెర నెదురు చని తూకొని తోడ్కొని పోవు రంభాది కుంభికుంభకుచల కలకలంబులును; గల హంస కారండవ కోక సారసబృంద సుందర సుందరియు; నిందీవరార విందనందదిందిందిరయు; నభంగయు సభంగయునగు గంగ నింగి కిం బొంగెనో యని మిగుల దిగులుపడఁ బొగడ్తల కెక్కిన యగడ్తలును నగడ్తల మిన్నేటి తేటనీట నీటులీను పాటి సూటిచల్లులాటల మేటి కూటువలు గొనుచు నేచిన ఖేచర కన్యకావారంబులును; వారవనితా సుపూజిత విరాజిత దేహళీ పాటవంబు లగు గోపుర కనక కవాటంబులును; గవాట వేదికాఘటిత మణిగణ కిరణోదారంబులగు నింద్రనీల స్తంభ గంభీరతలును; గంభీర విమల కమలరాగ పాలికా వారంబులగు చతుర్ద్వారంబులును; ద్వారదేశంబుల చావిళ్ళం గావళ్ళుండి ప్రొద్దు పోక పెద్ద రక్కసుల వేల్పుల కయ్యంబులు నెయ్యంబులం జెప్పికొనుచున్న యస్త్ర శస్త్ర ధారులు శూరులు నయిన మహాద్వార పాలక వీరులును; వీర రస జలధి వేలోదారంబులయి శుద్ధస్ఫటిక బద్ధ మహోత్తానంబులగు సోపాన సుభగాకారంబులును; సుభగాకార ప్రదీపంబు లగు వజ్ర మహారజిత వప్రంబులును; వ ప్రోపరి వజ్ర కుడ్య శిరోభాగ చంద్రకాంత తరుణ హిమకరకిరణ ముఖరంబులగు సాలశిఖరంబులును, శిఖర స్తోమధామ నికృత్త తారకంబులును, దార తార మణి శిలా కఠోరంబులగుచు మిగుల గరిత యగు నగరిసిరి మీఱ నమరు మొగులు పొడగని నిలుకడలకు నలువ నడిగికొని పడసిన పసిఁడి తెరల వలువల బెడంగునం దోరంబులగు ప్రాకారంబులునుఁ; బ్రాకార కాంచనాంచిత యుద్ధసన్నద్ధ మహాఖర్వ గంధర్వ వాహినీ పాలకంబులగు మరక తాట్టాలకంబులును; నట్టాలకోత్తుంగ వజ్రమయ స్తంభోదంచనంబులునుఁ; బరభట ప్రాణ వంచనంబులు సముదంచనంబులు నగు దంచనంబులును; దంచనంబుల తుదలు రథంబుల యిరుసులు నొరసికొనం, గోట యీవలి యావలి తివియని దివియల కరణి రుచిరము లగుచుఁ బచరించు నహిమకర హిమ కర మండలంబులును; హిమకర మండలంబు నిద్దంపు టద్దంబని మూఁగి తొంగి చూచుచు నలిక ఫలకంబులఁ గులకములుఁగొను నలకములం దరపి తిలకములం దెఱంగు పఱచుకొను సమయముల వెనుక నొదిఁగి కదిసి ముకురంబులం బ్రతిఫలితులైన పతు లితర సతుల రతుల కనుమతులని కనుకనిన్ మరలి నీడ తలంగినఁ గలంగి చని కాంతులు పొలయ నలయు ముగుదలకు నేకాంతంబులై గగన సముత్సేధంబు లైన రాజసౌధంబులును; సౌధంబుల సీమల ముత్తియంపు సరుల తోడి నిబ్బరపు గుబ్బచన్నులకు చెన్నులం బ్రక్కలం జుక్కలపదవులుండ మండిత సౌధశిఖరంబులకు శృంగారంబులయిన భృంగారంబులును; భృంగారశయన జాలక డోలికా నిశ్రేణికాది విశేష రమ్యంబులయిన హర్మ్యంబులును; హర్మ్య కనక గవాక్షరంధ్ర నిర్గత కర్పూర కుంకుమాగరు ధూపధూమంబులును; ధూమంబులు జీమూత స్తోమంబులని ప్రేమంబు లుబ్బ గొబ్బునం డబ్బాటు పబ్బంబు లబ్బె నని మరులుఁగొని పురుల వన్నియల సిరులు సరులుగొనం గుటవిటపములఁ దటపెట నటించుచుఁ బలుకులు విరిసి కికురుపొడుచు వలఱేని మఱుపుఁ జదువుల టీక లనం గేకలిడు నెమిళ్ళును; నెమిళ్ళ పురుల నారలు నారులగు రతనంపు విండ్ల నినదములను తలంపులం దోఁకలు జడిసి వీఁకలు మెఱసి మూఁకలుఁగొని దివికెగిరి రవికిం గవిసిన రాహువు క్రియం దివిఁ దడంబడు పడగలును; బడగలును గొడుగులును దమకునాలంబులకు నడియాలంబులుగఁ దోరంబులైన సారంబుల బీరంబులు మెఱసి బెబ్బులుల గబ్బునం గరుల సిరుల సింగంబుల భంగుల శరభంబుల రభసంబుల ధూమ కేతువుల రీతుల వైరిం జీరికిం గొనక శంకలుడిగి ఱంకె లిడుచు లంకెలై లెక్కకు మిక్కిలి యగుచు రక్కసుల చక్కటి యెక్కటి కయ్యముల డయ్యము లెఱుంగం దిరుగు వీరభటకదంబులును; గదంబ కరవాల శూలాదుల మెఱుంగులు మెఱపుల తెఱంగులం దిశల చెఱంగులం దుఱంగలింప నేమి నినదంబులు దరములగు నుఱుములుగ నడమొగిళ్ళ పెల్లునం బ్రవర్షిత రథిక మనోరథంబు లగు రథంబుల గములును; గములుఁగొని గమన వేగంబు వలన హరిహరుల నగి గాలిం జాలింబడం గేలికొని ఘనంబులగు మనంబులం దెగడి నెగడు సురంగంబు లగు తురంగంబులును; రంగదుత్తంగ విశద మదకల కరటి కటతట జనిత మదసలిల కణగణ విగళిత దశశతనయన భుజ సరళ మిళిత లలిత నిఖిలదిగధిపతి శుభకర కరకనక కటకఘటిత మణి సముదయ సముదిత రేణువర్గదుర్గమంబు లయిన నిర్వక్ర మార్గంబులును; మార్గస్థలోపరిగతాగత శతశతాయుతానేక గణనాతీత రోహణాచలతట విరాజమానంబులగు విమానంబులును; విమాన విహరమాణ సుందర సుందరీ సందోహ సంవాదిత భూరిభేరీ వీణా పణవ మృదంగ కాహళ శంఖాది వాదనానూన గాన సాహిత్య నృత్య విశేషంబులును; విశేషరత్నసంఘటిత శృంగార శృంగాటక వాటికా దేహ దేహళీ ప్రదీపంబులును, దీపాయమాన మానిత సభామండప ఖచిత రుచిరచింతారత్నంబులునుం, గలిగి రత్నాకరంబునుం బోలె ననిమిష కౌశిక వాహినీ విశ్రుతంబయి, శ్రుతివాక్యంబునుంబోలె నకల్మష సువర్ణ ప్రభూతంబయి భూతపతి కంఠంబునుం బోలె భోగిరాజకాంతంబయి, కాంతాకుచంబునుం బోలె సువృత్తం బయి, వృత్తజాతంబునుంబోలె సదా గురులఘు నియమాభిరామం బయి, రామచంద్రుని తేజంబునుం బోలె ఖరదూషణాది దోషాచరా నుపలబ్ధంబయి, లబ్ధవర్ణుచరిత్రంబునుం బోలె విమలాంతరంగ ద్యోత మానం బయి మానధనుని నడవడియునుం బోలె సన్మార్గ భాతి సుందరం బయి సుందరోద్యానంబునుం బోలె రంభాంచితాశోక పున్నాగంబయి, పున్నాగంబునుం బోలె సురభిసుమనోవిశేషం బయి, శేషాహి మస్తకంబునుంబోలె నున్నత క్షమా విశారదంబయి, శారద సముదయంబునుంబోలె ధవళ జీమూత ప్రకాశితంబయి, సితేత రాజిన దానంబునుం బోలె సరస తిలోత్తమంబయి, యుత్తమ పురుష వచనంబునుం బోలె ననేక సుధారస ప్రవర్షంబై, వర్షాదియు నుంబోలె నుల్లసదింద్ర గోపంబయి, గోపతి మూఁపురంబునుంబోలె విచక్షురార్యాలంకృతంబై, కృతార్థం బయిన యమరావతీ నామ నగరంబు చేరం జని కోటచుట్టునుం బట్టు గలుగ బలంబులఁ జలంబున విడియం బంచి పొంచి మార్గంబు లెల్ల నరికట్టుకొని యేమఱక యుండె; నంత. (448) మాయరు నగవులకును గను¯ మూయరు కాలంబు కతన ముదియరు ఖలులన్¯ డాయరు పుణ్యజనంబుల¯ బాయరు సురరాజ వీటి ప్రమదాజనముల్.

దుర్భర దానవ ప్రతాపము

(449) అప్పుడు (450) దుర్భర దానవ శంఖా¯ విర్భూతధ్వనులు నిండి విబుధేంద్రవధూ¯ గర్భములు పగిలి లోపలి¯ యర్భకతతు లావు రనుచు నాక్రోశించెన్. (451) అంత (452) బలి వచ్చి విడియుట బలభేది వీక్షించి¯ గట్టిగాఁ గోటకుఁ గాపు పెట్టి¯ దేవవీరులుఁ దాను దేవతామంత్రిని¯ రప్పించి సురవైరి రాకఁ జెప్పి ¯ "ప్రళయానలుని భంగి భాసిల్లుచున్నాఁడు¯ ఘోరరాక్షసులను గూడినాఁడు¯ మన కోడి చని నేఁడు మరల వీఁ డేతెంచె¯ నే తపంబున వీని కింత వచ్చె? (452.1) నీ దురాత్ముకునకు నెవ్వఁడు దోడయ్యె? ¯ నింక వీని గెల్వ నేది త్రోవ? ¯ యేమి చేయువార? మెక్కడి మగఁటిమి? ¯ నెదురు మోహరింప నెవ్వఁ డోపు? (453) మ్రింగెడు నాకాశంబునుఁ¯ బొంగెడు నమరాద్రి కంటెఁ బొడవై వీఁడున్¯ మ్రింగెడుఁ గాలాంతకు క్రియ¯ భంగించును మరలఁ బడ్డ బంకజగర్భున్. (454) ఈరాదు రాజ్య మెల్లనుఁ¯ బోరాదు రణంబు చేయఁ బోయితి మేనిన్¯ రారాదు దనుజుచేతను¯ జారా దిట మీఁద నేమిజాడ మహాత్మా!"

బృహస్పతి మంత్రాంగము

(455) అనిన సురరాజునకు సురాచార్యుం డిట్లనియె. (456) "వినవయ్య దేవేంద్ర! వీనికి సంపద¯ బ్రహ్మవాదులు భృగుప్రవరు లర్థి¯ నిచ్చిరి; రాక్షసు నెదురను నిలువంగ¯ హరి యీశ్వరుఁడుఁ దక్క నన్యజనులు¯ నీవును నీ సముల్ నీకంటె నధికులుఁ¯ జాలరు; రాజ్యంబు చాలు; నీకు¯ విడిచి పోవుట నీతి విబుధనివాసంబు¯ విమతులు నలఁగెడువేళ చూచి (456.1) మరలి మఱునాఁడు వచ్చుట మా మతంబు; ¯ విప్రబలమున వీనికి వృద్ధివచ్చె¯ వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును; ¯ దలఁగు మందాక రిపుఁ బేరు దలఁపరాదు. (457) పరు గెలువ వలయు నొండెను¯ సరిపోరగ వలయు నొండెఁ జా వలె నొండెన్¯ సరి గెలుపు మృతియు దొరకమి¯ సరసంబుగ మున్న తొలఁగి చనవలె నొండెన్. (458) అనినఁ గార్యకాల ప్రదర్శి యగు బృహస్పతి వచనంబులు విని కామరూపులై దివిజులు త్రివిష్టపంబు విడిచి తమతమ పొందుపట్లకుం జనిరి; బలియునుం బ్రతిభట వివర్జిత యగు దేవధాని నధిష్ఠించి జగత్రయంబునుం దన వశంబు జేసికొని విశ్వవిజయుండై పెద్ద కాలంబు రాజ్యంబు జేయుచుండె, శిష్యవత్సలులగు భృగ్వాదు లతని చేత శతాశ్వమేధంబులు చేయించిరి; తత్కాలంబున. (459) అర్థుల్ వేఁడరు; దాతలుంజెడరు; సర్వారంభముల్ పండుఁ; బ్ర¯ త్యర్థుల్ లేరు; మహోత్సవంబులను దేవాగారముల్ పొల్చుఁ బూ¯ ర్ణార్థుల్ విప్రులు; వర్షముల్ గురియుఁ గాలార్హంబులై; ధాత్రికిన్¯ సార్థంబయ్యె వసుంధరాత్వ మసురేంద్రాధీశు రాజ్యంబునన్.

అదితి కశ్యపుల సంభాషణ

(460) అంత (461) తన తనూజుప్రోలు దనుజులు గొనుటయు¯ వేల్పు లెల్లను డాఁగ వెడలుటయును¯ భావించి సురమాత పరితాపమునఁ బొంది¯ వగ ననాథాకృతి వనరుచుండ¯ నా యమ్మ పెనిమిటి యగు కశ్యపబ్రహ్మ¯ మఱి యొకనాఁడు సమాధి మాని¯ తన కుటుంబిని యున్న ధామమునకు నేగి¯ నాతిచే విహితార్చనములు పడసి (461.1) వంది వ్రాలి కుంది వాడిన యిల్లాలి¯ వదనవారిజంబు వడువుఁ జూచి¯ చేరఁ దిగిచి మగువ చిబుకంబు పుడుకుచు¯ "వారిజాక్షి! యేల వగచె"దనుచు. (462) ఆ మహాత్ముం డిట్లనియె. (463) “తెఱవా! విప్రులు పూర్ణులే? చెలగునే దేవార్చనాచారముల్? ¯ తఱితో వేలుతురే గృహస్థులు? సుతుల్ ధర్మానుసంధానులే? ¯ నెఱినభ్యాగత కోటి కన్న మిడుదే? నీరంబునుం బోయుదే? ¯ మఱలే కర్థుల దాసులన్ సుజనులన్ మన్నింపుదే? పైదలీ! (464) అన్నమైనఁ దక్రమైనఁ దోయంబైన¯ శాకమైన దనకుఁ జరుగు కొలఁది¯ నతిథి జనుల కడ్డ మాడక యిడరేని¯ లేమ! వారు కలిగి లేనివారు. (465) మఱియు. (466) నెలఁత! విష్ణునకును నిఖిలదేవాత్మున¯ కాననంబు శిఖియు నవనిసురులు; ¯ వారు దనియఁ దనియు వనజాతలోచనుం¯ డతఁడుఁ దనియ జగము లన్నిఁ దనియు. (467) బిడ్డలు వెఱతురె నీకఱ¯ గొడ్డంబులు జేయ కెల్ల కోడండ్రును మా¯ ఱొడ్డారింపక నడతురె¯ యెడ్డము గాకున్నదే మృగేక్షణ! యింటన్." (468) అని పలికినం బతికి సతి యి ట్లనియె. (469) ”ప్రేమయొకింత లేక దితి బిడ్డలు బిడ్డలబిడ్డలున్ మహా¯ భీమబలాఢ్యులై తనదుబిడ్డల నందఱఁ దోలి సాహసా¯ క్రామిత వైరులయ్యు నమరావతి నేలుచు నున్నవారు; నీ¯ కే మని విన్నవింతు? హృదయేశ్వర! మేలుఁ దలంచి చూడవే? (470) అక్కాచెల్లెండ్రయ్యును¯ దక్కరు నాతోడి పోరుఁ; దానున్ దితియున్¯ రక్కసులు సురల మొత్తఁగ¯ నక్కట! వల దనదు చూచు నౌనౌ ననుచున్. (471) ఎండకన్నెఱుగని యింద్రుని యిల్లాలు¯ పలుపంచలను జాలిఁ బడియె నేఁడు ¯ త్రిభువన సామ్రాజ్య విభవంబుఁ గోల్పోయి¯ దేవేంద్రుఁ డడవులఁ దిరిఁగె నేఁడు¯ కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు¯ శబరార్భకుల వెంటఁ జనిరి నేఁడు¯ నమరుల కాధారమగు నమరావతి¯ యసురుల కాటపట్టయ్యె నేఁడు (471.1) బలి జగముల నెల్ల బలియుచు నున్నాఁడు¯ వాని గెలువరాదు వాసవునకు¯ యాగభాగమెల్ల నతఁ డాహరించుచుఁ¯ గడఁగి సురల కొక్క కడియుఁ నీఁడు. (472) ప్రజలకు నెల్లను సముఁడవు ¯ ప్రజలను గడుపారఁ గన్న బ్రహ్మవు నయ్యుం¯ బ్రజలందు దుష్టమతులను¯ నిజముగ శిక్షింప వలదె నీవు? మహాత్మా! (473) సురలన్ సభ్యుల నార్తులన్ విరథులన్ శోకంబు వారించి ని¯ ర్జరధానిన్ నిలుపంగ రాత్రిచరులన్ శాసింప సత్కార్య మే¯ వెరవేరీతి ఘటిల్లు నట్టి క్రమమున్ వేగంబ చింతింపవే? ¯ కరుణాలోక సుధాఝరిం దనుపవే? కళ్యాణ సంధాయకా!” (474) అనిన మనోవల్లభ పలుకు లాకర్ణించి ముహూర్తమాత్రంబు చింతించి విజ్ఞానదృష్టి నవలంబించి భావికాల కార్యంబు విచారించి కశ్యప బ్రహ్మ యిట్లనియె. (475) "జనకుం డెవ్వడు? జాతుఁ డెవ్వఁడు? జనిస్థానంబు లెచ్చోటు? సం¯ జననం బెయ్యది? మేను లేకొలఁదిఁ? సంసారంబు లేరూపముల్? ¯ వినుమా యింతయు విష్ణుమాయ దలఁపన్వేఱేమియున్ లేదు; మో ¯ హ నిబంధంబు నిదాన మింతటికి జాయా! విన్నఁబో నేటికిన్?

పయోభక్షణ వ్రతము

(476) అగు నయిననుం గాలోచిత కార్యంబు చెప్పెద. (477) భగవంతుం బరముం జనార్దనుఁ గృపాపారీణు సర్వాత్మకున్¯ జగదీశున్ హరి సేవజేయు మతఁడున్ సంతుష్టినిం బొంది నీ¯ కగునిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థావాప్తి చేకూరెడిన్¯ భగవత్సేవలఁ బొందరాదె బహుసౌభాగ్యంబులం బ్రేయసీ! " (478) అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె. (479) "నారాయణుఁ బరమేశ్వరు¯ నేరీతిఁ దలంతు? మంత్ర మెయ్యది? విహితా¯ చారంబు లే ప్రకారము? ¯ లారాధన కాల మెద్ది? యానతి యీవే. " (480) అనినఁ గశ్యప ప్రజాపతి సతికిఁ బయోభక్షణంబను వ్రతంబుపదేశించి తాత్కాలంబునుఁ, దన్మంత్రంబును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులును నెఱింగించెను. అదితియును ఫాల్గుణ మాసంబున శుక్లపక్షంబునఁ బ్రథమదివసంబునన్ దొరకొని పండ్రెండు దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు జేసి వ్రతాంతంబున నియత యై యున్న యెడఁ జతుర్బాహుండునుఁ బీతవాసుండును శంఖ చక్ర గదాధరుండునునై, నేత్రంబుల కగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనం గనుంగొని. (481) కన్నుల సంతోషాశ్రులు¯ చన్నులపైఁ బఱవఁ బులక జాలము లెసగన్¯ సన్నతులును సన్నుతులును¯ నున్నత రుచిఁ జేసి నిటల యుక్తాంజలియై. (482) చూపుల శ్రీపతి రూపము¯ నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై¯ వాపుచ్చి మంద మధురా¯ లాపంబులఁ బొగడె నదితి లక్ష్మీనాథున్. (483) యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మం¯ గళనామధేయ! లోకస్వరూప! ¯ యాపన్న భక్త జనార్తి విఖండన!¯ దీనలోకాధార! తీర్థపాద! ¯ విశ్వోద్భవస్థితి విలయకారణభూత!¯ సంతతానంద! శశ్వద్విలాస! ¯ యాయువు దేహంబు ననుపమ లక్ష్మియు¯ వసుధయు దివముఁ ద్రివర్గములును (483.1) వైదికజ్ఞాన యుక్తియు వైరిజయము¯ నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె¯ వినుతమందార! గుణహార! వేదసార! ¯ ప్రణత వత్సల! పద్మాక్ష! పరమపురుష! (484) అసురవరులు సురల నదలించి బెదరించి¯ నాక మేలుచున్న నాఁట నుండి¯ కన్న కడుపుఁ గాన కంటఁ గూరుకు రాదు¯ కడుపుఁబొక్కు మాన్పి కావవయ్య." (485) అనిన విని దరహసితవదనుండయి యాశ్రితకామధేనువైన యప్పరమేశ్వరుం డిట్లనియె. (486) "నీ కోడండ్రును, నీ కుమారవరులున్, నీ నాథుఁడున్, నీవు సం¯ శ్లోకింపన్ సతులుం బతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్¯ శోకింపన్, భవదీయ గర్భమునఁ దేజోమూర్తి జన్మించెదన్¯ నాకున్ వేడుక పుట్టు నీ సుతుఁడనై నర్తించి వర్తింపఁగాన్. (487) బలిమిన్ దైత్యులఁ జంపరాదు వినయోపాయంబునం గాని; సం¯ చలనం బొందకు; నేను నీ నియతికిన్ సద్భక్తికిన్ మెచ్చితిన్; ¯ బలివిద్వేషియు నా నిలింపగణముం బౌలోమియున్ మెచ్చ దై¯ త్యులరాజ్యంబు హరింతు; నింద్రునికి నిత్తున్; దుఃఖమింకేటికిన్? (488) నీ రమణుని సేవింపుము¯ నా రూపము మానసించి నళినీ! గర్భా¯ గారంబు వచ్చి చొచ్చెద¯ గారామునఁ బెంపవమ్మ కరుణన్ నన్నున్.

వామనుడు గర్భస్తు డగుట

(489) ఏలింతు దివము సురలనుఁ¯ బాలింతు మహేంద్రయువతి భాగ్యశ్రీలం¯ దూలింతు దానవుల ని¯ ర్మూలింతు రిపుప్రియాంగముల భూషణముల్. " (490) అని యిట్లు భక్తజనపరతంత్రుండగు పురాణపురుషుం డానతిచ్చి తిరోహితుడయ్యె; అ య్యదితియుఁ గృతకృత్య యై సంతోషంబునఁ దన మనోవల్లభుండగు కశ్యపు నాశ్రయించి సేవించుచుండె; నంత నొక్క దివసంబున. (491) ఘన సమాధినుండి కశ్యపుఁ డచ్యుతు¯ నంశ మాత్మనొలయ నదితి యందుఁ¯ దనదు వీర్య మధికతరము సేర్చెను గాలి¯ శిఖిని దారువందుఁజేర్చినట్లు. (492) ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్యప్రతిష్ఠిత గర్భయై సురల తల్లి యుల్లంబున నుల్లసిల్లుచు నుండె; నంత. (493) చలచలనై పిదపిదనై¯ గలలంబై కరుడు గట్టి గళనాళముతోఁ¯ దలయేర్పడి గర్భంబై¯ నెలమసలం జీరచిక్కె నెలఁతకు నధిపా! (494) నెలతకుఁ జూలై నెల రె¯ న్నెలలై మఱి మూఁడు నాల్గు నెలలై వరుసన్¯ నెలలంతకంత కెక్కఁగ¯ నెలలును డగ్గఱియె నసుర నిర్మూలతకున్. (495) మహితతర మేఘమాలా¯ పిహితాయుత చండభాను బింబప్రభతో¯ విహితాంగంబులఁ గశ్యపు¯ గృహిణీగర్భమున శిశువుఁ గ్రీడించె నృపా! (496) తనకడుపున నొక యిరువునఁ¯ వనరుహగర్భాండభాండ వనధిచయంబుల్¯ గొనకొని జగములు నిడుకొని¯ తనుగతిఁ గడు నడఁగి మడిఁగి తనరెన్ బెడఁగై. (497) అంత న క్కాంతాతిలకంబు క్రమక్రమంబున. (498) నిలిపెన్ ఱెప్పల బృందిమన్, విశదిమన్ నేత్రంబులం, జూచుకం¯ బులనాకాళిమ, మేఖలం ద్రఢిమ, నెమ్మోమారఁగాఁ బాండిమన్¯ బలిమిం జన్నుల, శ్రోణిపాళిగరిమన్, మధ్యంబునన్ బృంహిమ¯ న్లలితాత్మన్ లఘిమన్, మహామహిమ మేనన్ గర్భదుర్వారమై. (499) పెట్టుదురు నుదుట భూతిని¯ బొట్టిడుదురు మేఁన బట్టుఁ బుట్టపుదోయిం¯ బెట్టుదురు వేల్పు లమ్మకుఁ¯ గట్టుదురు సురక్ష పడఁతిగర్భంబునకున్. (500) ఇవ్విధంబున. (501) విశ్వగర్భుఁడు దన గర్భ వివరమందుఁ¯ బూటపూటకుఁ బూర్ణుఁడై పొటకరింప ¯ వ్రేఁక జూలాలితనమున వేల్పుఁ బెద్ద¯ పొలఁతి కంతట నీళ్ళాడు ప్రొద్దులయ్యె.

గర్భస్థ వామనుని స్తుతించుట

(502) తదనంతరంబునం జతురాననుం డరుగుదెంచి యదితిగర్భపరిభ్రమ విభ్రముం డగు నప్పరమేశ్వరు నుద్దేశించి యిట్లని స్తుతియించె. (503) "త్రిభువన జయరూఢ! దేవ! త్రివిక్రమ!¯ పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ!; ¯ ప్రీత! త్రినాభ! త్రిపృష్ఠ! జగంబుల¯ కాద్యంత మధ్యంబు లరయ నీవ; ¯ జంగమ స్థావర జననాది హేతువు¯ నీవ; కాలంబవై నిఖిల మాత్మ¯ లోపల ధరియింతు లోని జంతుల నెల్ల¯ స్రోతంబులోఁ గొను చొప్పు దోఁప; (503.1) బ్రహ్మలకు నెల్ల సంభవ భవన మీవ; ¯ దివమునకుఁ బాసి దుర్దశ దిక్కులేక¯ శోకవార్ధి మునింగిన సురలకెల్లఁ¯ దేల నాధార మగుచున్న తెప్ప నీవ. (504) విచ్చేయు మదితి గర్భము¯ చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్¯ విచ్చలవిడి లే కమరులు¯ ముచ్చటపడి యున్నవారు ముద మందింపన్. " (505) అని యిట్లు కమలసంభవుండు వినుతిచేయు నయ్యవసరంబున.

వామను డవతరించుట

(506) రవిమధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్¯ శ్రవణద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజ్ఞాత లగ్నంబునన్¯ భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్¯ దివిజాధీశ్వరు మాతకుం బరమపాతివ్రత్య విఖ్యాతకున్. (507) మఱియు నద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండునుఁ బిశంగవర్ణవస్త్రుండును. మకరకుండల మండిత గండభాగుండును, శ్రీవత్సవక్షుండును, నళినచక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనకాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, గమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున. (508) చింతంబాసిరి యక్ష తార్క్ష్య సుమనస్సిద్ధోరగాధీశ్వరుల్¯ సంతోషించిరి సాధ్య చారణ మునీశబ్రహ్మ విద్యాధరుల్¯ గాంతింజెందిరి భానుచంద్రములు; రంగద్గీత వాద్యంబులన్¯ గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్. (509) దిక్కులకావిరి వాసెను¯ నెక్కువ నిర్మలత నొందె నేఁడు పయోధుల్¯ నిక్కమెయి నిలిచె ధరణియుఁ¯ జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై. (510) ముంపుఁగొని విరుల వానల¯ జొంపంబులుఁ గురియు సురలు, సుమనోమధువుల్¯ తుంపర లెగయఁ బరాగపు¯ రొంపుల భూభాగమతి నిరూషిత మయ్యెన్. (511) తదనంతరంబ. (512) "ఈ మహానుభావుఁ డెట్లింత కాలంబు¯ నుదర మందు నిలిచి యుండె"ననుచు¯ నదితి వెఱఁగుపడియె నానంద జయశబ్ద¯ ములను గశ్యపుండు మొగి నుతించె. (513) అంత నవ్విభుండు సాయుధసాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి రూపాంతరం బంగీకరించి కపటవటు చందంబున నుపనయనవయస్కుండైన వామన బాలకుండై తల్లి ముంగటఁ గుమార సముచితాలాపంబు లాడుఁచు గ్రీడించు సమయంబున నదితియుం దనయ విలోకన పరిణామ పారవశ్యంబున. (514) "నన్నుఁ గన్న తండ్రి! నా పాలి దైవమ! ¯ నా తపఃఫలంబ! నా కుమార! ¯ నాదు చిన్ని వడుగ! నా కులదీపిక! ¯ రాఁగదయ్య; భాగ్య రాశి వగుచు. (515) అన్నా! ర"మ్మని డగ్గఱి¯ చన్నుల పాలేఱువాఱ సంశ్లేషిణి యై¯ చిన్నారి మొగము నివురుచుఁ¯ గన్నారం జూచెఁ గన్నకడుపై యుంటన్. (516) "పురుడీ బోటికి నిందిర¯ పురుడంబిక గాక యొరులు పురుడే?" యనుచున్¯ బురుటాలికిఁ బది దినములు¯ పురుడు ప్రవర్తించి రెలమిఁ బుణ్యపు గరితల్. (517) అంత నబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యపప్రజాపతిం బురస్కరించుకొని సముచితోపనయనకర్మ కలాపంబులు చేయించిరి; సవిత సావిత్రి నుపదేశించె, బృహస్పతి యజ్ఞోపవీతధారణంబునుఁ, గశ్యపుండు ముంజియుఁ, గౌపీనం బదితియు, ధరణి కృష్ణాజినంబును, దండంబు వనస్పతి యగు సోముండును, గగనాధిష్ఠానదేవత ఛత్రంబునుఁ, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, సప్తర్షులు కుశపవిత్రంబులు నిచ్చిరి; మఱియును. (518) భిక్షాపాత్రిక నిచ్చెను¯ యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్¯ సాక్షాత్కరించి పెట్టెను¯ భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా! (519) శుద్ధబ్రహ్మర్షి సమా¯ రాద్ధుండై విహితమంత్రరాజిఁ జదువుచుం¯ బ్రోద్ధంబగు ననలంబున¯ వృద్ధాచారమున వటుఁడు వేల్చెన్ గడకన్!

వామనుని విప్రుల సంభాషణ

(520) ఇట్లు కృతకృత్యుండైన మాయామాణవకుండు దేశాంతర సమాగతు లగు బ్రాహ్మణులం గొందఱ నవలోకించి యిట్లనియె. (521) ”వత్తురె విప్రులు? వేఁడఁగ¯ నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం? ¯ దెత్తురె మీరును సంపద? ¯ లిత్తెఱఁగున దాన వీరుఁ డెవ్వఁడొ చెపుడా”. (522) అనిన నఖిల దేశీయు లగు భూసురు లిట్లనిరి. (523) "కలరున్ దాతలు; నిత్తురున్ ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి¯ ప్రులు నేతెంతురు; గాని యీవిని బలిం బోలన్ వదాన్యుండు లేఁ¯ డలఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే; ¯ బలివేఁడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా! " (524) అని తెలియంజెప్పిన బ్రాహ్మణులవచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై లాభవచనంబులుఁ గైకొని తల్లిఁదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదిలి.

వామనుని భిక్షాగమనము

(525) ప్రక్షీణ దివిజ వల్లభ¯ రక్షాపరతంత్రుఁ డగుచు రాజీవాక్షుం¯ డా క్షణమున బలి యింటికి¯ భిక్షాగమనంబు జేసెఁ బేదఱికముతోన్. (526) హరిహరి; సిరి యురమునఁ గల¯ హరిహరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్; ¯ బరహితరత మతియుతులగు¯ దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్. (527) సర్వప్రపంచ గురుభర¯ నిర్వాహకుఁ డగుటఁజేసి నెఱిఁ జనుదేరన్¯ ఖర్వుని వ్రేఁగు సహింపక¯ యుర్వీస్థలి గ్రుంగె; మ్రొగ్గె నురగేంద్రుండున్. (528) ఇట్లు చనిచని. (529) శర్మద, యమదండక్షత¯ వర్మద, నతి కఠిన ముక్తి వనితాచేతో¯ మర్మద, నంబునివారిత¯ దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్. (530) దాటి తత్ప్రవాహంబున కుత్తరతటంబు నందు. (531) చండస్ఫూర్తి వటుండుఁ గాంచె బహుధాజల్పన్నిశాటంబు, ను¯ ద్దండాహూత మునీభ్యబిభ్యదమృతాంధస్సిద్ధకూటంబు, వే¯ దండాశ్వధ్వజనీ కవాటము, మహోద్యద్ధూమ సంఛన్న మా¯ ర్తాండస్యందన ఘోటమున్, బలిమఖాంత ర్వేదికావాటమున్.

వామనుడు యజ్ఞవాటిక చేరుట

(532) కని దానవేంద్రుని హయమేధ వాటి దఱియం జొచ్చు నయ్యవసరంబున. (533) ”శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో¯ దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ¯ శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ” డంచున్ విస్మయభ్రాంతులై¯ సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్. (534) గుజగుజలు పోవువారును¯ గజిబిజిఁ బడువారు చాలఁ గలకల పడుచున్¯ గజిబిజి యైరి సభాస్థలిఁ ¯ బ్రజలెల్లను బొట్టివడుగు పాపని రాకన్. (535) ఆ సమయంబున బలిసభామండపంబుఁ దఱియం జొచ్చి. (536) చవులుగాఁ జెవులకు సామగానంబులు¯ చదువు నుద్గాతల చదువు వినుచు¯ మంత్ర తంత్రార్థ సంబంధభావములు పే¯ ర్కొనెడి హోతలతోడఁ గూడికొనుచు¯ హోమకుండంబులం దున్న త్రేతాగ్నుల¯ వెలిఁగించు యాజక వితతిఁ గనుచు¯ దక్షులై బహువిధాధ్వర విధానంబులు¯ చెప్పెడు సభ్యులఁ జేరఁ జనుచుఁ (536.1) బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుచు¯ నదితి పుట్టువు లచ్చికి నాటపట్టు¯ కోరి చరియించె సభలోనఁ గొంతఁదడవు¯ పుట్టు వెన్నఁడు నెఱుగని పొట్టివడుఁగు. (537) మఱియును. (538) వెఱచుచు వంగుచు వ్రాలుచు¯ నఱిముఱిఁ గబురులకుఁ జనుచు హరిహరి యనుచున్¯ మఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ¯ గుఱుమట్టపుఁ బడుచు వడుగుఁ గొంత నటించెన్. (539) కొందఱతోఁజర్చించును¯ గొందఱతో జటలు చెప్పు గోష్ఠిం జేయుం¯ గొందఱతోఁ దర్కించును¯ గొందఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్. (540) మఱియు ననేక విధంబుల నందఱకు నన్ని రూపులై వినోదించుచు. (541) వెడవెడ నడకలు నడచుచు¯ నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా¯ బుడిబుడి నొడువులు నొడువుచుఁ¯ జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్. (542) ఇట్లు డగ్గఱి మాయాభిక్షుకుండు రక్షోవల్లభుం జూచి యిట్లనియె. (543) ”ఇతఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది ది¯ క్పతిగర్వాపనయప్రవర్తి, గతలోభస్ఫూర్తి, నానా మఖ¯ వ్రతదానప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనో¯ ద్ధతచంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి దాన్.” (544) అని కుశ పవిత్రాక్షత సంయుతం బయిన దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె. (545) ”స్వస్తిజగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి¯ ధ్వస్తనిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం¯ ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ¯ న్యస్తసువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.” (546) అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుం బోలె ముందట నకుటిలుండును, జటిలుండును, సదండఛత్రుండునుఁ, గక్షలంబిత భిక్షాపాత్రుండునుఁ, గరకలిత జల కమండలుండును, మనోహరవదన చంద్రమండలుండును, మాయావాదన నటుండును నగు వటునిం గని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునఁ దిరోహితులై భృగువులుఁ గూర్చున్న యెడల లేచి క్షేమం బడిగి తియ్యని మాటల నాదరించిరి; బలియును నమస్కరించి తగిన గద్దియ నునిచి, పాదంబులుఁ దుడిచి తన ప్రాణవల్లభ పసిండి గిండియల నుదకంబు పోయ వడుగు కొమరుని చరణంబులఁ గడిగి తడి యొత్తి తత్సమయంబున. (547) వటుని పాద శౌచవారి శిరంబునఁ¯ బరమ భద్ర మనుచు బలి వహించె¯ నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ¯ దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.