పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : అష్టమ 335 - 437

బలి ప్రతాపము

(335) నాకాధీశుఁ బదింట, మూఁట గజమున్, నాల్గింట గుఱ్ఱంబులన్, ¯ ఏకాస్త్రంబున సారథిం జొనిపె, దైత్యేంద్రుండు దా నాకస¯ ల్లోకాధీశుఁడు ద్రుంచి యన్నిటిని దోడ్తో నన్ని భల్లంబులన్¯ రాకుండన్ రిపువర్గముం దునిమె గీర్వాణారి యగ్గింపఁగన్. (336) తన తూపులన్నియుఁ దరమిడి శక్రుండు¯ నఱికిన జోదు విన్ననువు మెఱసి¯ బలి మహాశక్తిచేఁ బట్టిన నదియును¯ నతఁడు ఖండించె నత్యద్భుతముగ; ¯ మఱి ప్రాస శూల తోమరములు గైకొన్న¯ దోడ్తోడ నవియును దునిమివైచె; ¯ నంతటఁ బోక యెయ్యది వాఁడు సాగించెఁ¯ దొడరి తా నదియును దురుము జేసె; (336.1) నసురభర్త విరథుఁడై తన పగఱకుఁ¯ గానఁబడక వివిధ కపట వృత్తి¯ నేర్పు మెఱసి మాయ నిర్మించె మింటను¯ వేల్పుగములు చూచి వెఱఁగు పడఁగ. (337) ఇట్లు దానవేంద్రుని మాయావిశేషవిధానంబున సురానీకంబులపైఁ బర్వతంబులు పడియె; దావాగ్ని దందహ్యమాన తరువర్షంబులు గురిసె సటంక శిఖర నికర శిలాసారంబులు గప్పె; మహోరగ దందశూకంబులు గఱచె; వృశ్చికంబులు మీటె; వరాహ వ్యాఘ్ర సింహంబులు గదిసి విదళింపన్ దొరఁకొనియె; వనగజంబులు మట్టిమల్లాడం జొచ్చె; శూలహస్తులు దిగంబరులునై రండు రండని బలురక్కసులు శతసహస్రసంఖ్యులు భేదనచ్ఛేదన భాషణంబులు చేయం దొడంగిరి; వికృత వదనులు గదాదండధారులు నాలంబిత కేశభారులునై యనేక రాక్షస వీరులు "పోనీకు పోనీకుఁడు; తునుము తునుముం"డని వెనుతగిలిరి; పరుష గంభీర నిర్ఘాత సమేతంబులయిన జీమూత సంఘాతంబులు వాతాహతంబు లై యుప్పతిల్లి నిప్పుల కుప్పలు మంటల ప్రోవులుం గురిసె; మహాపవన విజృంభితంబైన కార్చిచ్చు ప్రళయానలంబు చందంబునం దరికొనియె; ప్రచండ ఝంఝానిల ప్రేరిత సముత్తుంగ తరంగావర్త భీషణంబయిన మహార్ణవంబు చెలియలి కట్ట దాఁటి వెల్లివిరిసిన ట్లమేయంబయి యుండె; నా సమయంబునం బ్రళయకాలంబునుం బోలె మిన్ను మన్నును రేయింబగలు నెఱుంగ రాదయ్యె; నయ్యవసరంబున. (338) ఆ యసురేంద్రుని బహుతర¯ మాయాజాలంబులకును మా ఱెఱుఁగక వ¯ జ్రాయుధ ముఖరాదిత్యుల¯ పాయంబును బొంది చిక్కుపడిరి నరేంద్రా! (339) అప్పుడు (340) "ఇయ్యసురుల చేఁ జిక్కితి¯ మెయ్యది దెరు? వెందుఁ జొత్తుఁ? మిటు పొలయఁ గదే¯ యయ్యా! దేవ! జనార్దన! ¯ కుయ్యో! మొఱ్ఱో!" యటంచుఁ గూయిడి రమరుల్

హరి అసురుల శిక్షించుట

(341) అట్లు మొఱయిడు నవసరంబున. (342) విహగేంద్రాశ్వ నిరూఢుఁడై మణిరమా విభ్రాజితోరస్కుఁడై¯ బహుశస్త్రాస్త్ర రథాంగ సంకలితుఁడై భాస్వత్కిరీటాది దు¯ స్సహుఁడై నవ్యపిశంగచేల ధరుఁడై సంఫుల్లపద్మాక్షుఁడై¯ విహితాలంకృతితోడ మాధవుఁడు దా వేంచేసె నచ్చోటికిన్. (343) అసురుల మాయ లన్నియును నబ్జదళాక్షుఁడు వచ్చినంతటన్¯ గసిబిసియై నిరర్థమయి గ్రక్కునఁ బోయెను; నిద్రబొంది సం¯ తసమున మేలుకొన్నగతిఁ దాల్చి చెలంగిరి వేల్పు లందఱుం; ¯ బస చెడ కేలయుండు హరిపాద పరిష్కృతిచేయ నాపదల్? (344) అయ్యెడ (345) కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి¯ తార్క్ష్యు శిరము శూలధారఁ బొడువ¯ నతని పోటుముట్టు హరి గేల నంకించి¯ దానఁ జావఁ బొడిచె దైత్యవరుని. (346) పదపడి మాలి సుమాలులు¯ బెదరించినఁ దలలుఁ ద్రుంచెఁ బృథు చక్రహతిన్; ¯ గదఁగొని గరుడుని ఱెక్కలు¯ చెదరించిన మాల్యవంతు శిరమున్ వ్రేసెన్. (347) ఇట్లు పరమపురుషుండగు హరి కరుణాపరత్వంబునం బ్రత్యుపలబ్ధ మనస్కులయిన వరుణ వాయు వాసవ ప్రముఖులు పూర్వంబున నెవ్వరెవ్వరితోఁ గయ్యంబు జేయుదురు, వారు వారలం దలపడి నొప్పించి; రయ్యవసరంబున. (348) బాహుబలంబున నింద్రుఁడు¯ సాహసమున బలిని గెలువ సమకట్టి సము¯ త్సాహమున వజ్ర మెత్తిన¯ హాహానినదంబు జేసి రఖిల జనములున్. (349) ఇట్లు సముద్యత భిదుర హస్తుండై యింద్రుండుఁ దన పురోభాగంబునం బరాక్రమించుచున్న విరోచననందను నుపలక్షించి యిట్లనియె. (350) "జగతిన్ వైరి మొఱంగి గెల్చుటదియున్ శౌర్యంబె ధైర్యంబె? తా¯ మగవాఁడయ్యును దన్నుఁ దా నెఱిఁగి సామర్థ్యంబునుం గల్గియున్¯ బగవానిం గని డాఁగెనేని మెయి చూపం జాలఁడేనిం గటా! ¯ నగరే బంధులు? దిట్టరే బుధులుఁ? గన్యల్ గూర్తురే? దానవా! (351) మాయల్ చేయఁగ రాదు పో; నగవులే మాతోడి పోరాటముల్? ¯ దాయా! చిక్కితి; వ్రక్కలించెదఁ గనద్దంభోళి ధారాహతిన్; ¯ నీ యిష్టార్థము లెల్లఁ జూడుము వెసన్ నీ వారలం గూడుకో¯ నీ యాటోపము నిర్జరేంద్రుఁ డడఁచున్ నేఁ డాజిలో దుర్మతీ!" (352) అని యుపాలంభించిన విని విరోచననందనుం డిట్లనియె. (353) "నీవే పోటరివే? సురేంద్ర! తెగడన్ నీకేల? గెల్పోటముల్¯ లేవే? యెవ్వరి పాలఁ బోయినవి? మేల్గీడుల్ విరించాదులుం¯ ద్రోవం జాలుదు రెవ్విధానమున సంతోషింప శోకింప నా¯ దైవం బేమి? కరస్థలామలకమే? దర్పోక్తులుం బాడియే? (354) జయము లపజయములు సంపద లాపద¯ లనిల చలిత దీపికాంచలములు¯ చంద్రకళలు మేఘచయములు దరఁగలు¯ మెఱుఁగు లమరవర్య! మిట్టిపడకు." (355) అని యి ట్లాక్షేపించి. (356) వీరుఁడు దానవ నాథుఁడు¯ నారసముల నింద్రు మేన నాటించి మహా¯ ఘోరాయుధ కల్పములగు¯ శూరాలాపములు చెవులఁ జొనిపెన్ మరలన్. (357) ఇట్లు తథ్యవాది యైన బలిచే నిరాకృతుండై (358) శత్రువు నాక్షేపంబునఁ¯ దోత్రాహత గజము భంగిఁ ద్రుళ్ళుచు బలి నా¯ వృత్రారి వీచి వైచిన¯ గోత్రాకృతి నతఁడు నేలఁగూలె నరేంద్రా!

జంభాసురుని వృత్తాంతము

(359) చెలికాని పాటుఁ గనుఁగొని¯ బలి సఖుఁడగు జంభుఁ డతుల బాహాశక్తిం¯ జెలితనము చాల నెఱపుచు¯ "నిలునిలు" మని వీఁకఁ దాఁకె నిర్జర నాథున్. (360) పంచానన వాహనుఁడై¯ చంచద్గద జంభుఁ డెత్తి శైలారిని దాఁ¯ కించి సురేభంబును నొ¯ ప్పించి విజృంభించి యార్చిపేర్చెం గడిమిన్. (361) వీఁక చెడి ఘనగదాహతిఁ¯ దోఁకయు గదలింపలేక దుస్సహపీడన్¯ మోఁకరిలఁ బడియె నేలను¯ సోఁ కోర్వక దిగ్గజంబు సుడిసుడి గొంచున్. (362) అయ్యెడ (363) సారథి వేయు హయంబుల¯ తే రాయిత పఱచి తేర దేవేంద్రుఁడు దా¯ నారోహించెను దైత్యుఁడు¯ దారత మాతలిని శూలధారం బొడిచెన్. (364) శూల నిహతి నొంది స్రుక్కక యార్చిన¯ సూతు వెఱకు మంచు సురవిభుండు¯ వాని శిరముఁ దునిమె వజ్రఘాతంబున¯ దైత్య సేన లెల్ల దల్ల డిల్ల. (365) చని సురనాథుచేఁ గలన జంభుఁడు చచ్చుట నారదుండు చె¯ ప్పిన విని వాని భ్రాతలు గభీర బలాధికుఁ లా బలుండు పా¯ కనముచు లా పురందరునిఁ గాంచి ఖరోక్తులఁ దూలనాడుచున్¯ ఘనజలధారలన్ నగముఁ గప్పిన చాడ్పునఁ గప్పి రమ్ములన్. (366) విబుధలోకేంద్రుని వేయుగుఱ్ఱంబుల¯ నన్ని కోలల బలుఁ డదర నేసె¯ నిన్నూట మాతలి నిన్నూట రథమును¯ నా రీతి నింద్రు ప్రత్యంగకమును¯ వేధించెఁ; బాకుండు వింట వాఁ డస్త్రంబు¯ లేయుటఁ దొడుగుట యెఱుఁగరాదు; ¯ కనక పుంఖంబుల కాండంబు లొక పది¯ యేనింట నముచియు నేసి యార్చె; (366.1) బలిమి నిట్లు ముగురు పగవాని రథ సూత¯ సహితు ముంచి రస్త్ర జాలములను¯ వనజలోక సఖుని వాన కాలంబున¯ మొగిలు గములు మునుఁగ మూఁగినట్లు. (367) అయ్యవసరంబున. (368) "అమరారాతుల బాణజాలముల పాలై పోయితే చెల్లరే! ¯ యమరాధీశ్వర!" యంచు ఖిన్నతరులై యంభోధిలోఁ జంచల¯ త్వమునం గ్రుంకు వణిగ్జనంబుల క్రియన్ దైత్యాధిపవ్యూహ మ¯ ధ్యమునం జిక్కిరి వేల్పు లందఱు విపద్ధ్వానంబులం జేయుచున్. (369) "ఓహో! దేవతలార! కుయ్యిడకుఁ; డే నున్నాఁడ "నం చంబుభృ¯ ద్వాహుం డా శరబద్ధ పంజరము నంతం జించి తేజంబునన్¯ వాహోపేత రథంబుతోడ వెలికిన్ వచ్చెన్ నిశాంతోల్ల స¯ న్మాహాత్మ్యంబునఁ దూర్పునం బొడుచు నా మార్తాండు చందంబునన్. (370) ఇట్లు వెలువడి. (371) విఱిగిన సేనఁ గాంచి సురవీరుఁ "డొహో" యని బిట్టు చీరి క్ర¯ మ్మఱఁ బురికొల్పి పాకబల మస్తకముల్ నిశితాస్త్రధారలన్¯ నెఱసిన తీక్ష్ణవజ్రమున నేలకు వ్రాల్చెను వాని చుట్టముల్¯ వెఱచిరి; తచ్చమూపతులు విహ్వలులై చెడి పాఱి రార్తితోన్.

నముచి వృత్తాంతము

(372) అప్పుడు నముచి నిలువంబడి. (373) తన చుట్టంబులఁ జంపె వీఁడనుచు నుద్యత్క్రోధ శోకాత్ముఁడై¯ కనకాంతంబును నశ్మసారమయమున్ ఘంటాసమేతంబునై¯ జనదృగ్దుస్సహమైన శూలము నొగిన్ సారించి వైచెన్ సురేం¯ ద్రునిపై దీన హతుండవౌ దని మృగేంద్రుంబోలి గర్జించుచున్. (374) ఆకాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నా¯ నా కాండంబుల వాని కంఠము దెగన్ దంభోళియున్ వైచె న¯ స్తోకేంద్రాయుధమున్ సురారిగళముంద్రుంపంగ లేదయ్యె; వా¯ డాకంపింపక నిల్చె దేవవిభుఁ డత్యాశ్చర్యముం బొందఁగన్. (375) ఇట్లు నిలిచి యున్న నముచిం గనుంగొని వజ్రంబు ప్రతిహతంబగుటకు శంకించి బలభేది దన మనంబున. (376) "కొండల ఱెక్కలు ఖండించి వైచుచో¯ వజ్ర మెన్నఁడు నింత వాఁడి చెడదు; ¯ వృత్రాసురాదుల విదళించుచో నిది¯ దిరుగ దెన్నఁడు పనిఁ దీర్చికాని; ¯ యింద్రుండఁ గానొకో యేను దంభోళియుఁ¯ గాదొకో యిది ప్రయోగంబు చెడెనొ¯ దనుజాధముఁడు మొనతాఁకుఁ దప్పించెనో¯ భిదురంబు నేఁ డేల బెండుపడియె;" (376.1) ననుచు వజ్రి వగవ "నార్ద్ర శుష్కంబులఁ¯ జావకుండఁ దపము సలిపె నీతఁ¯ డితర మెద్ది యైన నింద్ర! ప్రయోగింపు¯ వైళ" మనుచు దివ్యవాణి పలికె. (377) ఇట్లాదేశించిన దివ్యవాణి పలుకు లాకర్ణించి పురందరుండు. (378) ఆత్మబుద్ధిఁ దలఁచి యార్ద్రంబు శుష్కంబు¯ గాని సాధనంబు ఫేన మనుచు¯ నది యమర్చి దాన నమరులు మెచ్చంగ¯ నముచి శిరముఁ ద్రుంచె నాకవిభుఁడు. (379) అయ్యవసరంబున. (380) పురుహూతు నగ్గించి పుష్పాంజలులు చేసి¯ మునులు దీవించిరి ముదము తోడ; ¯ గంధర్వముఖ్యులు ఘనులు విశ్వావసుఁ¯ డును బరావసుఁడు నింపెనయఁ బాడి; ¯ రమరాంగనాజను లాడిరి; దేవతా¯ దుందుభులును మ్రోసె దురములోన; ¯ వాయు వహ్ని కృతాంత వరుణాదులును బ్రతి¯ ద్వంద్వుల గెల్చి రుద్దండ వృత్తి; (380.1) నల్ప మృగముల సింహంబు లట్ల తోలి¯ రమరవర్యులు దనుజుల నదటు వాయ¯ నజుఁడు పుత్తేర నారదుఁ డరుగుఁ దెంచె¯ దైత్యహరణంబు వారింప ధరణినాథ! (381) వచ్చి సురలకు నారదుం డిట్లనియె. (382) "సిద్ధించెన్ సురలార! మీ కమృతమున్; శ్రీనాథ సంప్రాప్తులై¯ వృద్ధిం బొందితి రెల్ల వారలును; విద్వేషుల్ మృతిం బొంది; రీ¯ యుద్ధం బేటికి? నింకఁ జాలుఁ; బనిలే దోహో పురే"యంచు సం¯ బద్ధాలాపము లాడి మాన్చె సురలం బాండవ్యవంశాగ్రణీ!" (383) ఇట్లు నారద వచన నియుక్తులై రాక్షసులతోడి సంగ్రామంబు చాలించి సకల దేవ ముఖ్యులును ద్రివిష్టపంబునకుం జనిరి"హతశేషు లైన దైత్యదానవులు విషణ్ణుండైన బలిం దోడ్కొని పశ్చిమ శిఖిశిఖరంబుఁ జేరిరి; విధ్వంసమానకంధరులై వినష్టదేహులగు యామినీచరుల నెల్లను శుక్రుండు మృతసంజీవని యైన తన విద్య పెంపునం జేసి బ్రతికించె; బలియును భార్గవానుగ్రహంబున విగత శరీర వేదనుండై పరాజితుండయ్యును లోకతత్త్వ విచక్షణుం డగుటం జేసి దుఃఖింపక యుండె"నని చెప్పి రాజునకు శుకుం డిట్లనియె.

హరి హర సల్లాపాది

(384) "కైలాసగిరి మీఁద ఖండేందు భూషణుం¯ డొకనాఁడు గొలువున నున్న వేళ¯ నంగన యై విష్ణుఁ డసురుల వంచించి¯ సురలకు నమృతంబు సూఱ లిడుట¯ విని దేవియును దాను వృషభేంద్ర గమనుఁడై¯ కడు వేడ్క భూత సంఘములు గొలువ¯ మధుసూదనుం డున్న మందిరంబున కేగి¯ పురుషోత్తమునిచేతఁ బూజ పడసి (384.1) తానుఁ గూర్చుండి పూజించె దనుజ వైరిఁ¯ గుశలమే మీకు మాకునుఁ గుశల మనుచు¯ మధురభాషల హరిమీఁద మైత్రి నెఱపి¯ హరుఁడు పద్మాక్షుఁజూచి యిట్లనియెఁ బ్రీతి. (385) "దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! ;¯ కాలజగద్వ్యాపకస్వరూప! ¯ యఖిల భావములకు నాత్మయు హేతువు¯ నైన యీశ్వరుఁడ వాద్యంతములకు¯ మధ్యంబు బహియును మఱి లోపలయు లేక¯ పూర్ణమై యమృతమై భూరిసత్య¯ మానంద చిన్మాత్ర మవికార మాద్య మ¯ నన్య మశోకంబు నగుణ మఖిల (385.1) సంభవస్థితిలయముల దంభకంబు¯ నైన బ్రహ్మంబు నీవ; నీ యంఘ్రియుగము¯ నుభయ సంగ విసృష్టులై యున్నమునులు¯ గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు. (386) భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని¯ తలపోసి కొందఱు ధర్మ మనియుఁ¯ జర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని¯ సరవిఁ గొందఱు శక్తి సహితుఁ డనియుఁ¯ జింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ¯ డాత్మతంత్రుఁడు పరుం డధికుఁ డనియు¯ దొడరి యూహింతురు తుది నద్వయద్వయ¯ సదసద్విశిష్ట సంశ్రయుఁడ వీవు; (386.1) తలఁప నొక్కింత వస్తుభేదంబుఁ గలదె¯ కంకణాదులు బసిఁడి యొక్కటియ కాదె? ¯ కడలు పెక్కైన వార్థి యొక్కటియ కాదె? ¯ భేద మంచును నిను వికల్పింప వలదు. (387) యద్విలాసము మరీచ్యాదు లెఱుంగరు¯ నిత్యుఁడ నై యున్న నేను నెఱుఁగ¯ యన్మాయ నంధులై యమరాసురాదులు¯ వనరెద రఁట! యున్నవారలెంత? ¯ యే రూపమునఁ బొంద కేపారుదువు నీవు¯ రూపివై సకలంబు రూపుచేయ¯ రక్షింపఁ జెఱుపఁ గారణమైన సచరాచ¯ రాఖ్యమై విలసిల్లు దంబరమున (387.1) ననిలుఁ డే రీతి విహరించు నట్ల నీవు¯ గలసి వర్తింతు సర్వాత్మకత్వ మొప్ప; ¯ జగములకు నెల్ల బంధమోక్షములు నీవ¯ నీవ సర్వంబుఁ దలపోయ నీరజాక్ష! (388) ఘనతన్ నీ మగపోఁడుముల్ పలుమఱుం గన్నారఁ గన్నార; మే¯ నిను విన్నారము చూడమెన్నఁడును మున్ నీయాఁడుఁజందంబు మో¯ హినివై దైత్యులఁ గన్నుఁ బ్రామి యమృతం బింద్రాది దేవాళి కి¯ చ్చిన నీ రూపముఁ జూపుమా! కుతుకముం జిత్తంబునం బుట్టెడిన్. (389) మగవాఁడ వై జగంబులఁ¯ దగిలిఁచి చిక్కులను బెట్టు దంటకు నీకున్¯ మగువ తనంబున జగములఁ¯ దగులము బొందింప నెంతదడవు ముకుందా! " (390) అని పలుకుచున్న శూలపాణిచే నపేక్షితుండై విష్ణుండు భావ గంభీరంబగు నవ్వు నివ్వటిల్ల న వ్వామదేవున కిట్లనియె. (391) "శ్రీకంఠా! నిను నీవ యేమఱకు మీ చిత్తంబు రంజించెదన్; ¯ నాకద్వేషుల డాఁగురించుటకునై నాఁ డేను గైకొన్న కాం¯ తాకారంబు జగద్విమోహనము నీకై చూచెదేఁ జూపెదం; ¯ గైకో నర్హము లండ్రు కాముకులు సంకల్పప్రభావంబులన్. " (392) అని పలికి కమలలోచనుం డంతర్హితుండయ్యె; అ య్యుమాసహితుండైన భవుండు విష్ణుఁ డెటు పోయెనో యెందుఁ జొచ్చెనో యని దశదిశలం గలయ నవలోకించుచుండం దన పురోభాగంబున.

జగనమోహిని కథ

(393) ఒక యెలదోటఁలోనొకవీథి నొకనీడఁ¯ గుచకుంభముల మీఁదఁ గొంగు దలఁగఁ¯ గబరికాబంధంబుఁ గంపింప నుదుటిపైఁ¯ జికురజాలంబులు చిక్కుపడఁగ¯ ననుమానమై మధ్య మల్లాడఁ జెక్కులఁ¯ గర్ణకుండల కాంతి గంతు లిడఁగ¯ నారోహభరమున నడుగులుఁ దడఁబడ¯ దృగ్దీప్తి సంఘంబు దిశలఁ గప్ప (393.1) వామకరమున జాఱిన వలువఁ బట్టి¯ కనక నూపుర యుగళంబు గల్లనంగఁ¯ గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ¯ బంతిచే నాడు ప్రాయంపుటింతిఁ గనియె. (394) కని మున్ను మగువ మరగి సగమయిన మగవాఁ డమ్మగువ వయో రూప గుణ విలాసంబులు దన్ను నూరింపం గనుఱెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున. (395) "ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాడురూపంబు ము¯ న్నే కల్పంబుల యందుఁ గాన; మజుఁ డీ యింతిన్ సృజింపంగఁ దా¯ లేకుం టెల్ల నిజంబు; వల్లభత నీ లీలావతిం జేరఁగా¯ నే కాంతుండుఁ గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?" (396) అని మఱియుం జెఱకువిలుతుని మెఱవడిఁ దరపిన నెఱబిరుదు వెఱంగుపడం దెఱవ దుఱిమికొనిన తుఱుము బిగిముడి వదలి కదలి భుజముల మెడల నొడల నదరి చెదరిన కురులు నొసలి మృగమద తిలకంపుటసలు మసల, విసవిస నగుమొగము మెఱుంగులు దశదిశలం బసలు కొలుపఁ, జిఱునగవు మెఱయ, నునుఁ జెమటం దడంబడి పులకరములు గులకరములు గొన, హృదయానందకందం బగు కందుకంబు గరారవిందంబునం దమర్చి, యక్కునం జేర్చి, చెక్కున హత్తించి, చుబుకంబు మోపి, చూచుకంబులం గదియించి, నఖంబుల మీటుచు, మెల్లమెల్లన గెల్లాడు కరకమలంబులం గనక మణి వలయంబులు ఝణఝణ యనం గుచకలశంబు లొండొంటి నొరయ, నెడమఁ గుడిం దడంబడఁ గ్రమ్మన నెగురఁ జిమ్ముచు, నెగురఁ జిమ్మి తనకుఁదానె కొన్ని చిన్నపన్నిదంబులు చేసికొని బడుగు నడుము బెడఁకి వడవడ వడంక నఱితి సరులుఁ గలయంబడఁ దిరుగుచు, తిరుఁగు నెడఁ బెనఁకువలుగొనఁ జెవుల తొడవుల రుచులు గటముల నటనములు సలుపఁ బవిరి తిరిగి యొడియుచు, నొడిచి కెలంకులన్ జడియుచు, జడిసి జడను పడక వలువ నెలవు వదలి దిగంబడం, గటిస్థలంబునఁ గాంచీ కనకమణి కింకిణులు మొరయఁ జరణకటకమ్ములు గల్లుగల్లుమనం, గరకంకణమణి గణములు మెఱయ మితితప్పిన మోహాతిరేకం బుప్పొంగ వెనుకొని యుఱుకి పట్టుచుఁ, బట్టి పుడమిం బడవైచి, పాటు వెంటన మింటికెగసి గెంటక కరంబునం గరంబు దిరంబయి పలుమఱు నెగయ నడుచుచు, నెగయు నెడం దిగంబడు తఱిని నీలంపు మెఱుంగు నిగ్గుసోగ పగ్గంబుల వలలువైచి రాఁ దిగిచిన పగిది వెనుకొనంగ, విలోకన జాలంబులు నిగిడించుచు, మగిడించుచుఁ గరలాఘవంబున నొకటి, పది, నూఱు, వేయి చేసి నేర్పులు వాటించుచు, నరుణ చరణకమల రుచుల నుదయ శిఖరి శిఖర తరణి కరణి చేయుచు, ముఖచంద్ర చంద్రికలఁ జంద్రమండలంబులు గావించుచు, నెడనెడ నురోజ దుర్గ నిర్గత చేలాంచలంబు జక్క నొత్తుచుం, గపోలఫల కాలోల ఘర్మ జలబిందు బృందంబుల నఖాంకురంబుల నోసరించుచు, అరుణాధరబింబఫల భ్రాంత సమాగత రాజకీరంబులం జోపుచు, ముఖసరోజ పరిమళాసక్త మత్తమధుపంబుల నివారించుచు, మందగమనాభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబులకుం దలంగుచు, విలాస వీక్షణా నందిత మయూర మిథునంబులకు నెడగలుగుచుఁ, బొదరిండ్ల యీఱములకుం బోక మలంగుచు, కరకిసలయాస్వాద కాముక కలకంఠ దంపతులకు దూరమగుచు, దీఁగ యుయ్యెలల నూగుఁచు, మాధవీ మండపంబు లెక్కుచుఁ, గుసుమరేణు పటలంబుల గుబ్బళ్ళు ప్రాకుచు మకరందస్యంద బిందుబృందంబు నుత్తరించుచుఁ, గృతక శైలంబుల నారోహించుచుఁ, బల్లవ పీఠంబులం బథిశ్రమంబు పుచ్చుచు, లతాసౌధభాగంబులఁ బొడచూపుచు, నున్నత కేతకీ స్తంభంబుల నొరగుచుఁ, బుష్పదళఖచిత వాతాయనంబులం దొంగిచూచుచుఁ, గమలకాండపాలికల నాలంబించుచుఁ, జంపక గేహళీ మధ్యంబుల నిలువంబడుచుఁ, గదళికాపత్ర కవాటంబుల నుద్ఘాటించుచుఁ, బరాగ నిర్మిత సాలభంజికా నివహంబుల నాదరించుచు, మణికుట్టిమంబుల మురియుచుఁ, జంద్రకాంత వేదికల నొలయుచు, రత్నపంజర శారికానివహంబులకుం జదువులు చెప్పుచుఁ, గోరిన క్రియంజూచుచు చూచిన క్రియ మెచ్చుచు, మెచ్చిన క్రియ వెఱఁగుపడుచు, వెఱఁగుపడిన క్రియ మఱచుచు, మఱవక యేకాంతం బగు నవ్వనాంతంబున ననంత విభ్రమంబుల జగన్మోహినియై విహరించుచు నున్న సమయంబున. (397) వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల¯ శూలి ధైర్యమెల్లఁ గోలుపోయి¯ తఱలి యెఱుకలేక మఱచె గుణంబుల¯ నాలి మఱచె నిజగణాలి మఱచె. (398) అప్పుడు (399) ఎగురవైచి పట్ట నెడలేమి చే దప్పి ¯ వ్రాలు బంతి గొనఁగ వచ్చునెడను¯ బడతి వలువ వీడి పడియె మారుతహతిఁ¯ జంద్రధరుని మనము సంచలింప. (400) రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్ రోమాంచ విభ్రాజితం¯ గుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతాంగిం జల¯ త్కచ బంధం గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల¯ జ్జ చలింపం దనకాంత చూడఁ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికిన్. (401) పదము చేరవచ్చు ఫాలక్షుఁ బొడగని¯ చీర వీడిపడిన సిగ్గుతోడ¯ మగువ నగుచుఁ దరుల మాటున డాఁగెను¯ వేల్పుఱేఁడు నబల వెంటఁ బడియె. (402) ప్రబలోద్యత్కరిణిం గరీంద్రుఁడు రమింపన్ వచ్చు లీలన్ శివుం¯ "డబలా పోకుము పోకుమీ" యనుచు డాయం బాఱి కెంగేలఁ ద¯ త్కబరీ బంధము పట్టి సంభ్రమముతోఁ గౌగిళ్ళ నోలార్చె నం¯ త బహిః ప్రక్రియ నెట్టకేనిఁ గదియం దద్బాహునిర్ముక్త యై. (403) వీడి వెన్నున నాడు వేణీభరంబుతో¯ జఘన భారాగత శ్రాంతితోడ¯ మాయావధూటి యై మఱలిచూచుచుఁ బాఱు¯ విష్ణు నద్భుతకర్ము వెంటఁదగిలి¯ యీశాను మరల జయించె మరుం డనఁ¯ గరిణి వెన్కను కరి కరణిఁ దాల్చి¯ కొండలు నేఱులుఁ గొలఁకులు వనములు¯ దాఁటి శంభుఁడు చనం దన్మహాత్ము (403.1) నిర్మలామోఘ వీర్యంబు నేలమీఁదఁ¯ బడిన చోటెల్ల వెండియుఁ బైడి యయ్యె¯ ధరణి వీర్యంబు పడఁ దన్నుఁదా నెఱింగి¯ దేవ మాయా జడత్వంబు దెలిసె హరుఁడు. (404) జగదాత్మకుఁడగు శంభుఁడు¯ మగిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమునన్¯ విగతత్రపుఁడై నిలిచెను¯ మగువతనం బుడిగి హరియు మగవాఁ డయ్యెన్. (405) కాము గెలువవచ్చుఁ గాలారి గావచ్చు¯ మృత్యుజయముఁ గలిగి మెఱయవచ్చు¯ నాఁడువారి చూపుటంపఱ గెలువంగ¯ వశము గాదు త్రిపురవైరి కైన. (406) ఇట్లు పురుషాకారంబు వహించిన హరి హరున కిట్లనియె. (407) "నిఖిలదేవోత్తమ! నీ వొక్కరుఁడు దక్క¯ నెవ్వఁడు నా మాయ నెఱుఁగ నేర్చు? ¯ మానిని యైన నా మాయచే మునుఁగక¯ ధృతి మోహితుండవై తెలిసి తీవు¯ కాలరూపంబునఁ గాలంబుతోడ నా¯ యందును నీ మాయ యధివసించు¯ నీ మాయ నన్ను జయింప నేరదు నిజ¯ మకృతాత్ములకు నెల్ల ననుపలభ్య (407.1) మిపుడు నీ నిష్ఠ పెంపున నెఱిఁగి' తనుచు¯ సత్కరించిన సఖ్యంబు చాల నెఱిపి¯ దక్షతనయ గణంబులుఁ దన్నుఁ గొలువ¯ భవుఁడు విచ్చేసెఁ దగ నిజ భవనమునకు. (408) పారావారము ద్రచ్చుచో గిరి సముద్యద్భారమై కచ్ఛ పా¯ కారుండైన రమేశువర్తనము నాకర్ణింపఁ గీర్తింప సం¯ సారాంభోనిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయముం బొంది వి¯ స్తారోదార సుఖంబుఁ జెందుదురు తథ్యం బెంతయున్ భూవరా! (409) ఎలమిన్ దైత్యుల నాఁడురూపమున మోహింపించి పీయూషముం¯ జలితాపన్నులకున్ సురోత్తములకుం జక్కన్ విభాగించి ని¯ ర్మల రేఖన్ విలసిల్లు శ్రీవిభునిఁ దన్మాయావధూరూపముం¯ దలఁతున్ మ్రొక్కుదు నాత్మలోన దురితధ్వాంతార్క రూపంబుగన్." (410) అని చెప్పి శుకుం డిట్లనియె.

7వైవశ్వతమనువు చరిత్ర

(411) "నరవరాధీశ! యిప్పుడు నడచుచున్న¯ వాఁడు సప్తమ మనువు వైవస్వతుండు; ¯ శ్రాద్ధదేవుం డనందగు జనవరేణ్య! ¯ పదురు నందను లతనికిఁ బ్రకట బలులు. (412) వారలిక్ష్వాకుండును, నభంగుండును, ధృష్టుండును, శర్యాతియు, నరిష్యంతుండును, నాభాగుండును, దిష్టుండును, గరూశకుండును, బృషద్ధ్రుం డును, వసుమంతుండును ననువారు పదుగురు రాజులు; పురందరుండను వా డింద్రుం; డాదిత్య మరుదశ్వి వసు రుద్ర సంజ్ఞలుఁ గలవారు దేవతలు; గౌతమ కశ్య పాత్రి విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ వసిష్ఠు లనువారు సప్తర్షులయి యున్నవారు; అందుఁ గశ్యపున కదితి గర్భంబున విష్ణుండు వామనరూపుండై జనియించి యింద్రావరజుం డయ్యె; ఇప్పు డేడు మన్వంతరంబులు చెప్పంబడియె; రాఁగల మన్వంతరంబులును శ్రీహరి పరాక్రమంబునుం జెప్పెద దత్తావధానుండవై విను"మని శుకుం డిట్లనియె.

8సూర్యసావర్ణిమనువు చరిత్ర

(413) "జననాథ! సంజ్ఞయు ఛాయయు ననువారు¯ గల రర్కునకు విశ్వకర్మతనయ¯ లిరువురు వల్లభ లిటమున్న చెప్పితిఁ¯ బరఁగు దృతీయము బడబ యనఁగ¯ సంజ్ఞకు యముఁడును శ్రాద్ధదేవుండును¯ యమునయుఁ బుట్టిరి హర్ష మెసఁగ; ¯ ఛాయకుఁ దపతియు సావర్ణియును శనీ¯ శ్వరుఁడునుఁ గలిగిరి; సంవరణుఁడు (413.1) దపతి నాలిఁగఁ గైకొనెఁ దా వరించె; ¯ యశ్వి యుగళంబు బడబకు నవతరించె; ¯ వచ్చు నష్టమ వసువు సావర్ణి; వాఁడు¯ తపము చేయుచునున్నాఁడు ధరణినాథ! (414) ఒకపరి చూచిన వెండియు¯ నొకపరి చూడంగ లేకయుండు సిరులకై¯ యొక నొకని చేటు వేళకు¯ నొకఁ డొక్కఁడు మనువుఁ గాచి యుండు నరేంద్రా! (415) సూర్యసావర్ణి మన్వంతరంబున నతని తనయులు నిర్మోహ విరజస్కాద్యులు రాజులును; సుతపోవిరజోమృత ప్రభు లనువారు దేవతలును గాఁగలరు; గాలవుండును, దీప్తిమంతుండును, బరశురాముండును, ద్రోణపుత్రుఁడగు నశ్వత్థామయుఁ, గృపుండును, మజ్జనకుం డగు బాదరాయణుండును, ఋష్యశృంగుండును సప్తర్షు లయ్యెదరు; వార లిప్పుడుఁ దమతమ యోగబలంబుల నిజాశ్రమ మండలంబులఁ జరియించుచున్నవారు; విరోచన నందనుం డగు బలి యింద్రుం డయ్యెడు"నని చెప్పి శుకుం డిట్లనియె. (416) "బలిమున్ను నాకంబు బలిమిమైఁ జేకొన్న¯ వామనుండై హరి వచ్చి వేఁడఁ¯ బాదత్రయం బిచ్చి భగవన్నిబద్ధుఁడై¯ సురమందిరము కంటె సుభగమైన¯ సుతల లోకంబున సుస్థితి నున్నాఁడు¯ వెతలేక యట మీఁద వేదగుహికి¯ నా సరస్వతికిఁ దా నట సార్వభౌముండు¯ నాఁ బ్రభువయి హరి నాకవిభునిఁ (416.1) బదవిహీనుఁ జేసి బలిఁదెచ్చి నిలుపును; ¯ బలియు నిర్జరేంద్రు పదము నొందు; ¯ నింద్రపదము హరికి నిచ్చిన కతమున¯ దానఫలము చెడదు ధరణినాథ!

9దక్షసావర్ణిమనువు చరిత్ర

(417) అట మీఁదటి కాలంబున వరుణ నందనుండగు దక్షసావర్ణి తొమ్మిదవ మను వయ్యెడు; నతని కొడుకులు ధృతకేతు, దీప్తకేతు, ప్రముఖులు రాజులును; బరమరీచి గర్గాదులు నిర్జరులును; నద్భుతుం డను వాఁడింద్రుండును; ద్యుతిమత్ప్రభృతులగు వారలు ఋషులును నయ్యెదరు; అందు. (418) దనుజహరణుఁ డంబుధార కాయుష్మంతు¯ నకు జనించి రక్షణంబు చేయ¯ మూఁడు లోకములను మోదంబుతో నేలు¯ నద్భుతాఖ్య నొప్పు నమర విభుఁడు.

10బ్రహ్మసావర్ణిమనువు చరిత్ర

(419) మఱియు నుపశ్లోక సుతుం డగు బ్రహ్మసావర్ణి దశమ మనువయ్యెడి; తత్పుత్రులు భూరిషేణాదులు భూపతులును; హవిష్మత్ప్రముఖులు మునులును; శంభుం డను వాఁ డింద్రుండును; విబుద్ధ్యాదులు నిర్జరులును నయ్యెద; రందు. (420) విశ్వసృజుని యింట విభుఁడు విషూచికి¯ సంభవించు నంశ సహితుఁ డగుచుఁ¯ జెలిమి శంభుతోడఁ జేయు విష్వక్సేనుఁ¯ డనఁగ జగముఁ గాచు నవనినాథ!

11ధర్మసావర్ణిమనువు చరిత్ర

(421) మఱియుం దదాగమ్యిష్యత్కాలంబున ధర్మసావర్ణి పదునొకండవ మనువయ్యెడి; మనుతనూజులు సత్యధర్మాదులు పదుండ్రు; ధరణీపతులును; విహంగమ కామగమన నిర్వాణరుచు లనువారు సురులును; వైధృతుఁడను వాఁ డింద్రుండును; నరుణాదులు ఋషులును నయ్యెదరు; అందు. (422) అంబుజాత నేత్రుఁడా సూర్య సూనుఁడై¯ ధర్మసేతు వనఁగఁ దగ జనించి¯ వైభవాఢ్యుఁ డగుచు వైధృతుఁ డలరంగఁ¯ గరుణఁ ద్రిజగములనుఁ గావఁ గలఁడు.

12భద్రసావర్ణిమనువు చరిత్ర

(423) మఱియుఁ దద్భవిష్యత్సమయంబున భద్రసావర్ణి పండ్రెండవ మను వయ్యెడి; నతని నందనులు దేవవం దుపదేవ దేవజ్యేష్ఠాదులు వసుధాధిపతులును; ఋతుధాముం డను వాఁ డింద్రుండును హరితాదులు వేల్పులునుఁ; దపోమూర్తి తపాగ్నీధ్ర కాదులు ఋషులును నయ్యెదరు; అందు. (424) జలజలోచనుండు సత్యతపస్సూనృ¯ తలకు సంభవించుఁ దనయుఁ డగుచు¯ ధరణిఁ గాచు నంచితస్వధామాఖ్యుఁడై¯ మనువు సంతసింప మానవేంద్ర!

13దేవసావర్ణిమనువు చరిత్ర

(425) మఱియుం దదేష్యత్కాలంబున నాత్మవంతుండగు దేవసావర్ణి పదుమూఁడవ మనువయ్యెడి; మనుకుమారులు చిత్రసేన విచిత్రాదులు జగతీనాయకులును; సుకర్మ సుత్రామ సంజ్ఞలు గలవారు బృందారకులును; దివస్పతి యను వా డింద్రుండును; నిర్మోహ తత్త్వదర్శా ద్యులు ఋషులును నయ్యెదరు; అందు. (426) ధరణి దేవహోత్ర దయితకు బృహతికి¯ యోగవిభుఁడు నాఁగ నుద్భవించి¯ వనజనేత్రుఁ డా దివస్పతి కెంతయు¯ సౌఖ్య మాచరించు జగతినాథ!

14ఇంద్రసావర్ణిమనువు చరిత్ర

(427) మఱియు నట వచ్చు కాలంబున నింద్రసావర్ణి పదునాలవ మను వయ్యెడి; మను నందనులు గభీరవస్వాదులు రాజులును; బవిత్ర చాక్షుషు లనువారు దేవగణంబులును; శుచి యనువాఁ డింద్రుండును; నగ్ని బాహు శుచి శుక్ర మాగధాదులు ఋషులును నయ్యెదరు; అందు. (428) తనర సత్రాయణునకు వితాన యందు¯ భవము నొందెడి హరి బృహద్భానుఁ డనఁగ¯ విస్తరించుం గ్రియాతంతు విసరములను¯ నాకవాసులు ముదమంద నరవరేణ్య! (429) జగతీశ! త్రికాలములనుఁ¯ బొగడొందు మనుప్రకారములు చెప్పఁబడెం; ¯ దగఁ బదునలువురు మనువులుఁ¯ దెగ యుగములు వేయు నడవ దివ మజున కగున్." (430) అనినఁ బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. (431) "ఈ పదంబులందు నీ మను ప్రముఖుల¯ నెవ్వఁ డునుచు? వార లేమి కతన¯ నధిక విభవులైరి? హరి యేల జనియించె? ¯ నెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత!" (432) అనినం బారాశర్య కుమారుం డిట్లనియె. (433) "మనువులు మునులును మనుసుతు లింద్రులు¯ నమరులు హరి యాజ్ఞ నడఁగువారు¯ యాజ్ఞాదు లందఱు హరిపౌరుషాకృతు¯ లా మనువులు దత్సహాయశక్తి¯ జగముల నడుపుదు రొగి నాల్గుయుగముల¯ కడపటఁ గాల సంగ్రస్తమైన¯ నిగమచయంబును నిజతపోబలముల¯ మరలఁ గాంతురు ఋషివరులు; దొంటి (433.1) పగిది ధర్మంబు నాలుగు పాదములను¯ గలిగి వర్తిల్లు; మనువులు గమల నేత్రు¯ నాజ్ఞఁ దిరుగుదు; రేలుదు రవని పతులు¯ జగతి భాగించి తమతమ సమయములను. (434) మఱియుం బ్రాప్తులయిన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహిత కర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండు. (435) యోగీశరూపుఁడై యోగంబుఁ జూపుచు¯ మౌని రూపమునఁ గర్మంబుఁ దాల్చు¯ సర్గంబు చేయుఁ బ్రజాపతి రూపుఁడై¯ యింద్రుఁడై దైత్యుల నేపడంచు ¯ జ్ఞానంబు నెఱిఁగించుఁ జతుర సిద్ధాకృతిఁ¯ గాలరూపమునఁ బాకంబు చేయు¯ నానావిధములైన నామరూపంబులఁ¯ గర్మలోచనులకుఁ గానఁబడఁడు (435.1) చనిన రూపములనుఁ జనురూపముల నింక¯ జనఁగనున్న రూపచయము నతఁడు¯ వివిధుఁడై యనేక వృత్తుల వెలిఁగించు¯ విష్ణుఁ డవ్యయుండు విమలచరిత! " (436) అనిన భూవరుం డిట్లనియె. (437) "బలి నంభోరుహ నేత్రుఁ డేమిటికినై పాదత్రయిన్ వేఁడె? ని¯ శ్చలుఁడున్ బూర్ణుఁడు లబ్ధకాముఁడు రమా సంపన్నుఁడై తాఁ బర¯ స్థలికిన్ దీనునిమాడ్కి నేల చనియెం? దప్పేమియున్ లేక ని¯ ష్కలుషున్ బంధన మేల చేసెను? వినం గౌతూహలం బయ్యెడిన్."