పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : అష్టమ 219 - 334

శివుని గరళ భక్షణకై వేడుట

(219) చని కైలాసముఁ జొచ్చి శంకరుని వాసద్వారముం జేరి యీ¯ శుని దౌవారికు లడ్డపడ్డఁ దల మంచుం జొచ్చి "కుయ్యో! మొఱో!¯ విను; మాలింపుము; చిత్తగింపుము; దయన్ వీక్షింపు" మం చంబుజా¯ సనముఖ్యుల్ గని రార్తరక్షణ కళాసంరంభునిన్ శంభునిన్. (220) వారలు దీనత వచ్చుటఁ¯ గూరిమితో నెఱిఁగి దక్షుకూఁతురుఁ దానుం¯ బేరోలగమున నుండి ద¯ యారతుఁడై చంద్రచూడుఁ డవసర మిచ్చెన్. (221) అప్పుడు భోగిభూషణునకు సాష్టాంగ దండప్రణామంబులు గావించి ప్రజాపతి ముఖ్యు లిట్లని స్తుతించిరి. (222) "భూతాత్మ! భూతేశ! భూత భావనరూప!¯ దేవ! మహాదేవ! దేవవంద్య! ¯ యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ¯ బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; ¯ యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ¯ గోరి భజింతురు కుశలమతులు; ¯ సకల సృష్టిస్థితిసంహారకర్తవై¯ బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ; (222.1) పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త¯ మంబు నీవ శక్తిమయుఁడ వీవ; ¯ శబ్దయోని వీవ; జగదంతరాత్మవు¯ నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు. (223) నీ యంద సంభవించును¯ నీ యంద వసించి యుండు నిఖిల జగములున్¯ నీ యంద లయముఁ బొందును¯ నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా! (224) అగ్నిముఖంబు; పరాపరాత్మక మాత్మ¯ కాలంబు గతి; రత్నగర్భ పదము; ¯ శ్వసనంబు నీ యూర్పు; రసన జలేశుండు¯ దిశలుఁ గర్ణంబులు; దివము నాభి; ¯ సూర్యుండు గన్నులు; శుక్లంబు సలిలంబు¯ జఠరంబు జలధులు; చదలు శిరము; ¯ సర్వౌషధులు రోమచయములు; శల్యంబు¯ లద్రులు; మానస మమృతకరుఁడు; (224.1) ఛందములు ధాతువులు; ధర్మసమితి హృదయ; ¯ మాస్య పంచక ముపనిష దాహ్వయంబు; ¯ నయిన నీ రూపు పరతత్త్వమై శివాఖ్య¯ మై స్వయంజ్యోతి యై యొప్పునాద్య మగుచు. (225) కొందఱు గలఁ డందురు నినుఁ; ¯ గొందఱు లేఁ డందు; రతఁడు గుణి గాఁ డనుచుం¯ గొందఱు; గలఁ డని లేఁ డని¯ కొందల మందుదురు నిన్నుఁ గూర్చి మహేశా! (226) తలఁపఁ బ్రాణేంద్రియ ద్రవ్యగుణస్వభా¯ వుఁడవు; కాలక్రతువులును నీవ; ¯ సత్యంబు ధర్మ మక్షరము ఋతంబును¯ నీవ ముఖ్యుండవు నిఖిలమునకు; ¯ ఛందోమయుండవు సత్త్వరజస్తమ¯ శ్చక్షుండవై యుందు; సర్వరూప¯ కామ పురాధ్వర కాలగరాది భూ¯ తద్రోహభయము చోద్యంబు గాదు; (226.1) లీలలోచనవహ్ని స్ఫులింగ శిఖల¯ నంతకాదులఁ గాల్చిన యట్టి నీకు¯ రాజఖండావతంస! పురాణ పురుష! ¯ దీన రక్షక! కరుణాత్మ! దేవ దేవ! (227) మూఁడు మూర్తులకును మూఁడు లోకములకు¯ మూఁడు కాలములకు మూల మగుచు¯ భేద మగుచుఁ దుది నభేదమై యొప్పారు ¯ బ్రహ్మ మనఁగ నీవ ఫాలనయన! (228) సదసత్తత్త్వ చరాచర¯ సదనం బగు నిన్నుఁ బొగడ జలజభవాదుల్¯ పెదవులుఁ గదలుప వెఱతురు¯ వదలక నినుఁ బొగడ నెంతవారము రుద్రా! (229) బాహుశక్తి సురాసురుల్ చని పాలవెల్లి మథింప హా¯ లాహలంబు జనించె నేరి కలంఘ్య మై భువనంబు గో¯ లాహలంబుగఁ జేసి చిచ్చును లాగముం గొని ప్రాణిసం¯ దోహమున్ బ్రతికింపవే దయ దొంగలింపఁగ నీశ్వరా! (230) లంపటము నివారింపను¯ సంపదఁ గృపజేయ జయము సంపాదింపం¯ జంపెడివారి వధింపను¯ సొంపారఁగ నీక చెల్లు సోమార్ధధరా! (231) నీకంటె నొండెఱుంగము; ¯ నీకంటెం బరులు గావ నేరరు జగముల్; ¯ నీకంటె నొడయఁ డెవ్వఁడు¯ లోకంబుల కెల్ల నిఖిలలోకస్తుత్యా!"

గరళ భక్షణము

(232) అని మఱియు నభినందించుచున్న ప్రజాపతి ముఖ్యులం గని సకల భూత సముండగు నద్దేవదేవుండుఁ దన ప్రియసతి కిట్లనియె. (233) "కంటే జగముల దుఃఖము; ¯ వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై¯ యుంటకు నార్తుల యాపద¯ గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ! (234) ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన ¯ ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం¯ బ్రాణుల కిత్తురు సాధులు ¯ బ్రాణంబులు నిమిష భంగురము లని మగువా! (235) పరహితము జేయు నెవ్వఁడు¯ పరమ హితుం డగును భూత పంచకమునకుం¯ బరహితమె పరమ ధర్మము¯ పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ! (236) హరి మది నానందించిన¯ హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్¯ హరియును జగములు మెచ్చఁగ¯ గరళము వారించు టొప్పుఁ గమలదళాక్షీ! (237) శిక్షింతు హాలహలమును¯ భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్¯ రక్షింతుఁ బ్రాణి కోట్లను¯ వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!" (238) అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ "దేవా! దేవర చిత్తంబు కొలంది నవధరింతురు గాక!"యని పలికె"నని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. (239) "అమరన్ లోకహితార్థమంచు నభవుం "డౌఁ గాక"యం చాడెఁ బో¯ యమరుల్ భీతిని "మ్రింగవే"యనిరి వో యంభోజగర్భాదులుం¯ దముఁ గావన్ హర! "లెమ్ము లెమ్మనిరి"వో తాఁ జూచి కన్గంట న¯ య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్." (240) అనిన శుకుం డిట్లనియె. (241) "మ్రింగెడి వాఁడు విభుం డని ¯ మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్¯ మ్రింగు మనె సర్వమంగళ¯ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! (242) తనచుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్¯ ఘన గంభీర రవంబుతో శివుఁడు "లోకద్రోహి! హుం! పోకు ర"¯ మ్మని కెంగేలఁ దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం¯ బని సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్. (243) అయ్యవిరళ మహాగరళదహన పాన సమయంబున. (244) కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు¯ ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్; ¯ వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ¯ బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్. (245) ఉదరము లోకంబులకును¯ సదనం బగు టెఱిఁగి శివుఁడు చటుల విషాగ్నిం¯ గుదురుకొనఁ గంఠబిలమున¯ బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్. (246) మెచ్చిన మచ్చిక గలిగిన¯ నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం¯ జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె¯ చిచ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్. (247) హరుఁడు గళమునందు హాలహలము బెట్టఁ¯ గప్పుఁ గలిగి తొడవు కరణి నొప్పె; ¯ సాధురక్షణంబు సజ్జనులకు నెన్న¯ భూషణంబు గాదె భూవరేంద్ర! (248) తదనంతరంబ (249) గరళంబుఁ గంఠబిలమున¯ హరుఁడు ధరించుటకు మెచ్చి యౌ నౌ ననుచున్¯ హరియు విరించియు నుమయును¯ సురనాథుఁడుఁ బొగడి రంత సుస్థిరమతితోన్. (250) హాలాహల భక్షణ కథ¯ హేలాగతి విన్న వ్రాయ నెలమిఁ బఠింపన్¯ వ్యాళానల వృశ్చికముల¯ పాలై చెడ రెట్టిజనులు భయవిరహితులై.

సురభి ఆవిర్భావము

(251) మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ. (252) తెల్లని మేనును నమృతము¯ జిల్లున జల్లించు పొదుఁగు శితశృంగములుం¯ బెల్లుగ నర్థుల కోర్కులు¯ వెల్లిగొలుపు మొదవు పాలవెల్లిం బుట్టెన్. (253) అగ్నిహోత్రి యనుచు నా సురభిని దేవ¯ మునులు పుచ్చికొనిరి మున్నెఱింగి¯ విబుధ సంఘములకు వెరవుతో నధ్వర¯ హవులు పెట్టుకొఱకు నవనినాథ! (254) మఱియు నా జలరాశి యందు.

ఉచ్చైశ్రవ ఆవిర్భవము

(255) సచ్చంద్రపాండురంబై¯ యుచ్చైశ్రవ మనఁగఁ దురగ మొగి జనియించెం¯ బుచ్చి కొనియె బలి దైత్యుం¯ డిచ్చ గొనం డయ్యె నింద్రుఁ డీశ్వరశిక్షన్. (256) ఒఱ పగు నురమును బిఱుఁదును¯ నెఱిఁ దోఁకయు ముఖముసిరియు నిర్మలఖురముల్¯ కుఱచచెవులుఁ దెలిఁగన్నులు¯ దఱచగు కందంబుఁ జూడఁ దగు నా హరికిన్. (257) అంత నా పాలకుప్ప యందు.

ఐరావత ఆవిర్భావము

(258) దంతచతుష్టాహతి శై¯ లాంతంబులు విఱిగి పడఁగ నవదాత కుభృ¯ త్కాంతంబగు నైరావణ¯ దంతావళ ముద్భవించె ధరణీనాథా! (259) తడ లేని నడపు వడి గల¯ యొడలును బెను నిడుదకరము నురుకుంభములున్¯ బెడఁగై యువతుల మురిపపు¯ నడకలకున్ మూలగురు వనన్ గజ మొప్పెన్. (260) మఱియు నత్తరంగిణీవల్లభు మథించు నయ్యెడ.

కల్పవృక్ష ఆవిర్భావము

(261) ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై¯ యింద్రువిరులతోఁట కేపు దెచ్చి¯ కోరి వచ్చు వారి కోర్కుల నీనెడు¯ వేల్పు మ్రాను పాలవెల్లిఁ బుట్టె.

అప్సరల ఆవిర్భావము

(262) మఱియునుం గొండకవ్వంబునం గడలి మథింప నప్సరోజనంబు జనించె నంత. (263) క్రొక్కారు మెఱుఁగు మేనులు ¯ గ్రిక్కిరిసిన చన్నుఁగవలుఁ గ్రిస్సిన నడుముల్¯ పిక్కటిలి యున్న తుఱుములుఁ¯ జక్కని చూపులును దివిజసతులకు నొప్పెన్. (264) వెండియు నా రత్నాకరంబు నందు సుధాకరుం డుద్భవించి; విరించి యనుమతంబునఁ దన యథాస్థానంబునం బ్రవర్తించుచుండె; నంత.

లక్ష్మీదేవి పుట్టుట

(265) తొలుకారు మెఱుఁగు కైవడి¯ తళతళ మని మేను మెఱవ ధగధగ మనుచున్¯ గలుముల నీనెడు చూపులఁ¯ జెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టె నృపా! (266) "పాలమున్నీటి లోపలి మీఁది మీఁగడ¯ మిసిమి జిడ్డునఁ జేసి మేను పడసి ¯ క్రొక్కారు మెఱుఁగుల కొనల క్రొత్తళుకుల¯ మేనిచే గలనిగ్గు మెఱుఁగు జేసి¯ నాఁటి నాఁటికిఁ బ్రోది నవకంపుఁదీవల¯ నునుఁ బోద నెయ్యంబు నూలుకొలిపి ¯ క్రొవ్వారు కెందమ్మి కొలఁకునఁ బ్రొద్దునఁ¯ బొలసిన వలపులఁ బ్రోది పెట్టి (266.1) పసిడి చంపక దామంబు బాగుఁగూర్చి¯ వాలు క్రొన్నెల చెలువున వాడిఁ దీర్చి¯ జాణతనమునఁ జేతుల జడ్డు విడిచి¯ నలువ యీ కొమ్మ నొగిఁ జేసినాఁడు నేఁడు. (267) కెంపారెడు నధరంబును¯ జంపారెడి నడుము సతికి శంపారుచులన్¯ సొం పారు మోముఁ గన్నులుఁ¯ బెంపారుచు నొప్పుగొప్పు పిఱుఁదును గుచముల్." (268) అని జనులు పొగడుచుండ (269) తరుణికి మంగళస్నానంబు చేయింత¯ మని పెట్టె నింద్రుఁ డనర్ఘమైన¯ మణిమయ పీఠంబు; మంగళవతులైన¯ వేలుపు గరితలు విమల తోయ¯ పూర్ణంబులై యున్న పుణ్యాహ కలశంబు¯ లిడిరి; పల్లవముల నిచ్చె భూమిఁ; ¯ గడిమి గోవులు పంచగవ్యంబులను నిచ్చె¯ మలసి వసంతుండు మధు వొసంగె; (269.1) మునులు గల్పంబుఁ జెప్పిరి; మొగిలుగములు¯ పణవ గోముఖ కాహళ పటహ మురజ¯ శంఖ వల్లకీ వేణు నిస్వనము లిచ్చెఁ; ¯ బాడి రాడిరి గంధర్వ పతులు సతులు. (270) పండిత సూక్తుల తోడుతఁ¯ దుండంబులు చాఁచి తీర్థ తోయములెల్లం¯ దుండముల ముంచి దిగ్వే¯ దండంబులు జలక మార్చెఁ దరుణీ మణికిన్. (271) కట్టంగఁ బచ్చని పట్టుఁబుట్టపు దోయి¯ ముదితకుఁ దెచ్చి సముద్రుఁ డిచ్చె; ¯ మత్తాళి నికరంబు మధ్వాశ మూఁగిన¯ వైజయంతీమాల వరుణుఁ డిచ్చెఁ; ¯ గాంచన కేయూర కంకణ కింకిణీ¯ కటకాదులను విశ్వకర్మ యిచ్చె; ¯ భారతి యొక మంచి తారహారము నిచ్చె¯ బాణిపద్మము నిచ్చెఁ బద్మభవుఁడు; (271.1) కుండలివ్రజంబు గుండలముల నిచ్చె; ¯ శ్రుతులు భద్రమైన నుతులు జేసె; ¯ "నెల్ల లోకములకు నేలిక సానివై¯ బ్రతికె" దనుచు దిశలు పలికె నధిప! (272) మఱియును (273) పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో¯ భాషించె వాఁడెపో బ్రహ్మ యనఁగ¯ నెలయించి కెంగేల నెవ్వని వరియించె¯ వాఁడె లోకములకు వల్లభుండు¯ మెయిదీఁగ నెవ్వని మేనితోఁ గదియించె¯ వాఁడెపో పరమ సర్వజ్ఞమూర్తి¯ నెలతుక యెప్పుడు నివసించు నేయింట¯ నాయిల్లు పరమగు నమృత పదము (273.1) నింతి చూపు వాఱె నెచ్చోటి కచ్చోటు¯ జిష్ణుధనద ధర్మ జీవితంబు¯ గొమ్మ చిన్న నగవు గురుతర దుఃఖ ని¯ వారణంబు సృష్టి కారణంబు. (274) మఱియు నక్కొమ్మ నెమ్మనంబున. (275) భావించి యొకమాటు బ్రహ్మాండ మంతయు¯ నాటల బొమ్మరిల్లని తలంచుఁ¯ బోలించి యొకమాటు భువనంబు లన్నియుఁ¯ దన యింటిలో దొంతులని తలంచుఁ¯ బాటించి యొకమాటు బ్రహ్మాది సురలను¯ దన యింటిలో బొమ్మలని తలంచు¯ గొనకొని యొకమాటు కుంభినీచక్రంబు¯ నలవడ బొమ్మపీఁటని తలంచు (275.1) సొలసి యొక్కమాటు సూర్యేందురోచుల¯ నచటి దీపకళిక లని తలంచు¯ భామ యొక్క మాటు భారతీదుర్గల¯ నాత్మసఖు లటంచు నాదరించు. (276) తదనంతరంబ. (277) చంచరీకనికర ఝంకార నినదంబు¯ దనరు నుత్పలముల దండ పెట్టి¯ మేఘకోటి నడిమి మెఱుఁగుఁ బుత్తడి మాడ్కి¯ సురల నడుమ నిల్చె సుందరాంగి. (278) ఆ కన్నులు నా చన్నులు¯ నా కురు లా పిఱుఁదు నడుము నా ముఖమా న¯ వ్యాకారముఁ గని వేల్పులు¯ చీకాకునఁ బడిరి కలఁగి శ్రీహరి దక్కన్.

లక్ష్మీదేవి హరిని వరించుట

(279) అట్లు నిలిచి దశదిశలం బరివేష్టించి యున్న యక్ష రక్షస్సిద్ధ సాద్ధ్య దివిజ గరుడ గంధర్వ చారణ ప్రముఖ నిఖిల యూథంబులం గనుం గొని య ప్పురాణ ప్రౌఢకన్యకారత్నంబుఁ దన మనంబున నిట్లని వితర్కించె. (280) "ఐదువనై యుండ నలవడ దొక చోట¯ నొకచోట సవితితో నోర్వ రాదు¯ తగ నొకచోట సంతత వైభవంబుఁ గా¯ దొకచోట వేఁడిమి నుండఁ బోల¯ దొకచోటఁ గరుణ లే దొక్కింత వెదకిన¯ నొకచోట డగ్గఱి యుండఁ బెట్ట¯ నెఱయంగ నొకచోట నిలుకడ చాలదు¯ చర్చింప నొకచోట జడత గలదు (280.1) కొన్నిచోట్ల కామగుణ గరిష్ఠంబులు¯ క్రోధ సంయుతములుఁ గొన్ని యెడలు¯ గొన్ని మోహలోభకుంఠితంబులుఁ గొన్ని ¯ ప్రమద మత్సరాను భావకములు." (281) అని సకల సత్పురుష జనన వర్తనంబులు మానసించి పరిహరించి. (282) "అమర ముత్తైదువనై యుండ వచ్చును¯ వరుసకు సవతు లెవ్వరును లేరు¯ వెలయంగ నశ్రాంత విభవ మీతని యిల్లు¯ శృంగార చందన శీతలుండు¯ గలఁగఁ డెన్నఁడు శుద్ధకారుణ్యమయమూర్తి¯ విమలుండు గదిసి సేవింప వచ్చు¯ నెఱి నాడి తిరుగఁడు నిలుకడఁ గలవాఁడు¯ సకల కార్యములందు జడత లేదు; (282.1) సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు¯ నాథుఁ డయ్యె నేని నడప నోపు¯ నితఁడె భర్త" యనుచు నింతి సరోజాక్షుఁ¯ బుష్ప దామకమునఁ బూజచేసె. (283) ఇందీవర దామమున ము¯ కుందునిఁ బూజించి తనకుఁ గూడి వసింపన్¯ మందిరముగఁ దద్వక్షము¯ నందంద సలజ్జదృష్టి నాలోకించెన్. (284) మోహరుచుల వలన ముద్దియ దల యెత్తు¯ సిగ్గువలన బాల శిరము వంచు¯ నింతి వెఱపు వలన నెత్తదు వంపదు¯ తనదు ముఖము ప్రాణదయితుఁ జూచి. (285) హరి చూచిన సిరి చూడదు¯ సిరి చూచిన హరియుఁ జూఁడ సిగ్గును బొందున్¯ హరియును సిరియునుఁ దమలో¯ సరిఁజూపులఁజూడ మరుఁడు సందడి పెట్టెన్. (286) జగముల తండ్రియై తనరు శౌరి జగంబుల తల్లి నిందిరం¯ దగ నురమందుఁ దాల్చె; నటఁ దత్కరుణారసదృష్టిచేఁ బ్రజల్¯ మగుడఁగఁ దొంటి భంగి నతిమంగళసాధ్వి పతిత్వసంపదన్¯ నెగడిన లోకముల్ గని; రనేక శుభంబులఁ బొంది రత్తఱిన్. (287) అటమున్న యబ్ధిరాజు దనయందు నున్న యమూల్యంబైన కౌస్తుభంబు పేరిటి యనర్ఘ మణిరాజంబు నయ్యంబుజాక్షునకు సమర్పించిన దానిం దన వక్షస్థలంబున ధరియించె; నప్పు డయ్యాదిలక్ష్మియు శ్రీవత్స కౌస్తుభ వైజయంతీవనమాలికా తారహారాద్యలంకృతంబైన పుండరీకాక్షు వక్షంస్థలంబున వసియించె నయ్యవసరంబున. (288) మ్రోసెన్ శంఖ మృదంగ వేణురవముల్ మున్నాడి; పెంజీఁకటుల్¯ వాసెన్; నర్తన గాన లీలల సురల్ భాసిల్లి; రార్యుల్ జగ¯ ద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ తల్లింగమంత్రంబులం¯ బ్రాసక్తిన్ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షించుచున్. (289) ఆ పాలవెల్లి కూఁతురు¯ దీపుల చూపులను దోఁగి తిలకింపఁ బ్రజల్¯ చేపట్టిరి సంపదలనుఁ; ¯ బ్రాపించెను మేలు; జగము బ్రతికె నరేంద్రా! (290) పాలేటి రాచకన్నియ¯ మే లారెడు చూపులేక మిడు మిడు కంచున్¯ జాలిం బురపురఁ బొక్కుచుఁ¯ దూలిరి రక్కసులు కీడు దోఁచిన నధిపా!

వారుణి ఆవిర్భావము

(291) వారిధిఁ దరువఁగ నంతట¯ వారుణి యన నొక్క కన్య వచ్చిన నసురుల్¯ వారిజలోచను సమ్మతి¯ వారై కైకొనిరి దాని వారిజనేత్రన్.

ధన్వంతర్యామృత జననము

(292) మఱియుం దరువం దరువ న ప్పయోరాశి యందు. (293) తరుణుండు దీర్ఘ దోర్దండుండు గంబుకం¯ ధరుఁడు పీతాంబరధారి స్రగ్వి¯ లాసిత భూషణాలంకృతుం డరుణాక్షుఁ¯ డున్నతోరస్కుఁ డత్యుత్తముండు¯ నీలకుంచిత కేశ నివహుండు జలధర¯ శ్యాముండు మృగరాజ సత్త్వశాలి¯ మణికుండలుఁడు రత్నమంజీరుఁ డచ్యుతు¯ నంశాంశ సంభవుం డమలమూర్తి (293.1) భూరియాగభాగ భోక్త ధన్వంతరి¯ యనఁగ నమృత కలశ హస్తుఁ డగుచు¯ నిఖిలవైద్యశాస్త్ర నిపుణుఁ డాయుర్వేది¯ వేల్పు వెజ్జుఁ గడలి వెడలి వచ్చె. (294) తదనంతరంబ (295) అతనిచేత నున్న యమృత కుంభము చూచి¯ కెరలు పొడిచి సురలఁ గికురుపెట్టి¯ పుచ్చికొనిరి యసుర పుంగవు లెల్లను¯ మాఱులేని బలిమి మానవేంద్ర! (296) వెండియు. (297) చావులేని మందు చక్కఁగ మన కబ్బె¯ ననుచుఁ గడవ నసుర లాఁచి కొనిన¯ వెఱచి సురలు హరికి మొఱలు పెట్టిరి సుధా¯ పూర్ణఘటము పోయెఁ బోయె ననుచు. (298) ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు పొడగని భృత్యుజన కామదుండగు నప్పరమేశ్వరుండు "మీరలు దుఃఖింప వలవ దేను నా మాయాబలంబునంజేసి మీ యర్థంబు మరల సాధించెద"నని పలికె; దత్సమయంబున న య్యమృతపూరంబు నేమ త్రావుదు మని తమకించు దైత్యదానవ జనంబుల లోపల నమంగళంబగు కలి సంభవించిన కతంబునఁ బ్రబలులగు రక్కసులు విలోకించి సత్త్రయాగంబు నందు నడచు చందంబునఁ దుల్యప్రయాస హేతువులగు సురలును సుధా భాగంబున కర్హు లగుదురు గావునఁ బంచి కుడుచుట కర్తవ్యం; బిది సనాతనంబగు ధర్మంబగుటంజేసి య య్యమృత కుంభంబు విడువుండని దుర్భలులగు నిశాచరులు జాతమత్సరులై ప్రబలు లైన తమవారల వారించుచున్న సమయంబున. (299) ఒకని చేత నుండ నొకఁడు బలిష్ఠుఁడై¯ పుచ్చికొనిన వానిఁ బొదుగఁ బట్టి¯ యంతకంటె నధికుఁ డమృత కుంభము నెత్తి¯ కొంచుఁ బాఱెఁ బరులుఁ గుయ్యిడంగ.

జగన్మోహిని వర్ణన

(300) అంత. (301) మెత్తని యడుగుల మెఱుఁగారు జానువు¯ లరఁటి కంబములదో యైన తొడలు¯ ఘనమగు జఘనంబుఁ గడు లేత నడుమును¯ బల్లవారుణకాంతి పాణియుగము¯ గడు దొడ్డ పాలిండ్లుఁ గంబుకంఠంబును¯ బింబాధరముఁ జంద్రబింబముఖముఁ¯ దెలిగన్నుఁ గవయును నలికుంతలంబును¯ బాలేందు సన్నిభ ఫాలతలము (301.1) నమరఁ గుండల కేయూర హార కంక¯ ణాదు లేపార మంజీర నాద మొప్ప¯ నల్ల నవ్వులఁ బద్మదళాక్షుఁ డసుర¯ పతుల నడగింప నాఁడు రూపంబుఁ దాల్చి. (302) అయ్యవసరంబున జగన్మోహనాకారంబున. (303) పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు¯ జాఱించి మెల్లన చక్క నొత్తు¯ దళ్కు దళ్కను గండఫలకంబు లొలయించు¯ నొలయించి కెంగేల నుజ్జగించుఁ¯ గటు మెఱుంగులు వాఱు కడకన్ను లల్లార్చు¯ నల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు¯ సవరని దరహాస చంద్రికఁ జిలికించుఁ¯ జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు (303.1) దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెఱపుఁ¯ గంకణాది ఝణంకృతుల్ గడలు కొలుపు¯ నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు¯ సన్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప. (304) ఇవ్విధంబున న క్కపట యువతీరత్నంబు జగన్మోహన దేవతయునుంబోలె నెమ్మొగంబు తావికి మత్తిల్లిన తేఁటి మొత్తంబులన్ గెలిచి చిగురు జొంపంబుల నెడగలుగ జడియుచు ముఱియుచుండ రాక్షసవరులు గనుంగొని. (305) "అవుఁగదే లావణ్య; మవుఁగదే మాధుర్య¯ మవుఁగదే సతి! నవయౌవనాంగి! ¯ యెటనుండి వచ్చితి? వేమి యిచ్చించెదు?¯ నీ నామమెయ్యది? నీరజాక్షి! ¯ యమర గంధర్వ సిద్ధాసుర చారణ¯ మనుజకన్యలకు నీ మహిమ గలదె? ¯ ప్రాణ చిత్తేంద్రియ పరిణామ దాయియై¯ నిర్మించెఁ బో విధి నిన్ను గరుణ; (305.1) వనిత! గశ్యపు సంతతి వార మేము ¯ భ్రాతలము సురలకు నిద్ధపౌరుషులము ¯ జ్ఞాతులకు మాకు నేకార్థసంగతులకుఁ¯ బాలు దీరని యర్థంబు బంచి యిమ్ము. (306) సభ యై యుండెద మిందఱ¯ మభయంబున వచ్చు కొలఁది నమృతంబును నీ¯ విభరాజగమన! తప్పక¯ విభజింపు విపక్షపక్ష విరహితమతి వై." (307) అని మందలించిన దైత్యులం గని మాయాయువతి రూపుం డగు హరి తన వాఁడి వాలు జూపుటంపఱలవలన వారల తాలుముల నగలించి చిఱునగవు లెగయ మొగమెత్తి యిట్లనియె. (308) "సుందరులగు పురుషులఁగని¯ పొందెడు నాయందు నిజము పుట్టునె మీకున్? ¯ బృందారకరిపులారా! ¯ చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్. (309) పలుకులు మధురసధారలు¯ దలఁపులు నానా ప్రకార దావానలముల్¯ చెలుములు సాలావృకములు¯ చెలువల నమ్ముటలు వేదసిద్ధాంతములే?

అమృతము పంచుట

(310) నా నేర్చుకొలది మీకును¯ మానుగ విభజించి యిత్తు; మానుఁడు శంకన్¯ కానిం" డనవుడు నిచ్చిరి¯ దానవు లమృతంపుఁ గడవఁ దరుణీమణికిన్. (311) ఆ శాంతా లోకనములు¯ నా శీతల భాషణములు నా లాలితముల్¯ రాశి పరంపర లగుచుం¯ బాశములై వారి నోళ్ళు బంధించె నృపా! (312) ఇట్లు సుధాకలశంబు కేల నందుకొని మందస్మిత భాషణంబుల సుందరీ రూపుఁ డగు ముకుందుండు "మేలుఁ గీ డనక నేనుఁ బంచియిచ్చిన తెఱంగున నంగీకరించుట కర్తవ్యం"బనవుడు "నగుంగాక"యని సురాసుర దైత్యదానవ సమూహం బుపవసించి కృతస్నానులై హోమంబు లాచరించి విప్రులకు గోభూహిరణ్యాది దానంబులు చేసి తదాశీః ప్రవచనంబులు గైకొని ధవళపరిధాను లై గంధమాల్య ధూపదీపాలంకృతం బగు కనకరత్నశాలా మధ్యంబునఁ బ్రాగగ్రకుశ పీఠంబులం బూర్వదిశాభిముఖులై పంక్తులుఁ గొని యున్న సమయంబున. (313) శ్రోణీభర కుచయుగ భర¯ వేణీభరములను డస్సి వివిధాభరణ¯ క్వాణ యయి యువిద వచ్చెను¯ బాణి సరోజమున నమృతభాండముఁ గొంచున్. (314) భాసుర కుండల భాసిత¯ నాసాముఖ కర్ణ గండ నయనాంచల యై¯ శ్రీసతి యగు సతిఁ గని దే¯ వాసుర యూథంబు మోహ మందె నరేంద్రా! (315) అప్పుడు (316) "అసురుల కమృతము పోయుట¯ పొసగదు పాములకుఁ బాలు పోసిన మాడ్కిన్¯ దొసఁగగు" నంచును వేఱొక¯ దెసఁ గూర్చుండంగఁ బెట్టె దేవాహితులన్. (317) ఇట్లు రెండు పంక్తులుగా నేర్పరచి. (318) వేగిర పడకుడీ వినుఁడు దానవులార!¯ తడవు చేయక వత్తు దైత్యులార! ¯ యటు ప్రక్కఁ గూర్చుండుఁ డని కన్ను లల్లార్చి¯ చనుగవ పయ్యెద జాఱఁ దిగిచి¯ వదినె మఱందుల వావులు కల్పించి¯ మర్మంబు లెడలించి మఱుఁగు జేసి¯ మెల్లని నగవుల మేనులు మఱపించి¯ కడు జాణ మాటలఁ గాకు పఱచి (318.1) యసుర వరుల నెల్ల నడకించి సురలను¯ "దడవు జేయ వలదు; ద్రావుఁ" డనుచు¯ వచ్చు కొలఁది నమృతవారి విభాగించెఁ¯ దరుణి దివిజు లెల్లఁ దనిసి పొగడ. (319) అయ్యవసరంబున. (320) "మనకు వేల్పులకును మందట లేకుండఁ¯ బంచి పెట్టెద నని పడఁతి పూనెఁ¯ దానేల తప్పును? తప్పదు తరళాక్షి¯ గాక రమ్మనుచును గడకఁ బిల్వ¯ మఱుమాట లాడదో మఱి చూడకుండునో¯ చను గవఁ గప్పునో చాలు" ననుచు¯ నొండాడఁ గలుగుచు నొక్కింత సొలయునో¯ మనయెడఁ గందునో మగువ యనుచు (320.1) నెలతఁ చూడ్కి గముల నీరై కరంగుచుఁ¯ బ్రణయ భంగ భీతి బద్ధు లగుచు¯ నూరకుండ్రు గాని యువిద తే తెమ్మని¯ యడుఁగ జాలరైరి యసుర వరులు.

రాహువు వృత్తాంతము

(321) అప్పుడు (322) అమరవ్రాతములోన జొచ్చి దివిజుండై రాహు పీయూష పా¯ నము జేయం గని చంద్రభాస్కరులు సన్నల్ చేయ నారాయణుం¯ డమరారాతిశిరంబు చక్రహతిఁ దున్మాడెన్ సుధాసిక్త మై¯ యమరత్వంబును జెందె మూర్ధముఁ దదన్యాంగంబు నేలం బడెన్. (323) అజుఁడు వాని శిరము నంబరవీథిని¯ గ్రహము జేసి పెట్టి గారవించె; ¯ వాఁడు పర్వములను వైరంబు దప్పక¯ భానుచంద్రములను బట్టు చుండు. (324) ఒకబొట్టుఁ జిక్క కుండఁగ¯ సకల సుధారసము నమర సంఘంబులకుం¯ బ్రకటించి పోసి హరి దన¯ సుకరాకృతిఁ దాల్చె నసుర శూరులు బెగడన్. (325) అమరుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థా భిమానంబులన్¯ సములై లబ్ధవికల్పు లైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర¯ య్యమరారుల్; బహుదుఃఖముల్ గనిరి తా మత్యంత దోర్గర్వులై; ¯ కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ కల్యాణ సంయుక్తులే. (326) దానవు లమృతము ద్రావం¯ బూని పయోరాశిఁ ద్రచ్చి పొగిలిన మాడ్కిన్¯ శ్రీనాథ పరాఙ్ముఖులగు¯ హీనులు పొందంగఁజాల రిష్టార్థంబుల్. (327) శోధించి జలధి నమృతము¯ సాధించి నిలింపవైరి చక్షుర్గతులన్¯ రోధించి సురల కిడి హరి¯ బోధించి ఖగేంద్రు నెక్కి పోయె నరేంద్రా!

సురాసుర యుద్ధము

(328) శుద్ధముగ సురల కమృతము¯ సిద్ధించిన నసుర వరులు సిడిముడిపడుచున్¯ క్రుద్ధులు నానాయుధ స¯ న్నద్ధులు నయి యుద్ధమునకు నడచిరి బలిమిన్. (329) ధన్యులు వైరోచని శత¯ మన్యుప్రముఖులు మదాభిమానులు దమలో¯ నన్యోన్యరణము బాహా¯ సిన్యాసంబులను బేర్చి చేసిరి కడిమిన్. (330) అరుదై కామగమై మయాసురకృతంబై లోకితాలోక్యమై¯ వరశస్త్రాస్త్ర సమేతమై తరళమై వైహాయసంబై మహా¯ సురయోధాన్వితమైన యానమున సంశోభిల్లెఁ బూర్ణేందు సు¯ స్థిరకాంతిన్ బలి చామరధ్వజ చమూదీప్తస్థితిన్ ముందటన్. (331) మఱియు నముచి శంబర బాణ ద్విమూర్ధ కాలనాభ శకుని జంభాయోముఖ ప్రహేతి హేతి భూతసంత్రాస హయగ్రీవ కపిలేల్వలోత్కళ మేఘదుందుభి మయత్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజ్ర దంష్ట్ర తారకారిష్టారిష్టనేమి శుంభ నిశుంభ శంకుశిరః ప్రముఖులును బౌలేయ కాలకేయులును, నివాతకవచ ప్రభృతులును, దక్కిన దండయోధులునుం గూడికొని యరదంబులం దురగంబుల మాతంగంబుల హరిణంబుల హరి కిరి శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీ జంబుక శార్దూల గో వృషాది మృగంబులను, గంక గృధ్ర కాక కుక్కుట బక శ్యేన హంసాది విహంగంబులను, దిమి తిమింగ లాది జలచరంబులను, నరులను, నసుర సుర నికర వికృత విగ్రహ రూపంబులగు జంతువులను నారోహించి తమకు నడియాలంబులగు గొడుగులు పడగలు జోడుఁగైదువలు పక్కెరలు బొమిడికంబులు మొదలగు పోటుము ట్లాయితంబుగఁ గైకొని వేఱు వేఱ మొనలై విరోచననందనుం డగు బలిముందట నిలువంబడిరి; దేవేంద్రుండును నైరావతారూఢుండై వైశ్వానర వరుణ వాయు దండధరాద్యనేక నిర్జర వాహినీ సందోహంబునుం, దాను నెదురుపడి పిఱుతివియక మోహరించె; నట్లు సంరంభసన్నాహ సముత్సాహంబుల రెండుదెఱంగుల వారునుం బోరాడు వేడుకల మీఁటగు మాటల సందడించుచున్న సమయంబున. (332) వజ్రదంష్ట్రాంచిత వ్యజనంబులును బర్హ¯ చామరంబులు సితచ్ఛత్త్రములును¯ జిత్రవర్ణధ్వజచేలంబులును వాత¯ చలితోత్తరోష్ణీష జాలములును¯ జప్పుళ్ళ నెసఁగు భూషణ కంకణంబులుఁ¯ జండాంశురోచుల శస్త్రములును¯ వివిధ ఖేటకములు వీరమాలికలును¯ బాణపూర్ణములైన తూణములును (332.1) నిండి పెచ్చురేఁగి నిర్జరాసురవీర¯ సైన్యయుగ్మకంబు చాల నొప్పె ¯ గ్రాహతతుల తోడఁ గలహంబునకు వచ్చు¯ సాగరములభంగి జనవరేణ్య! (333) భేరీ భాంకారంబులు¯ వారణ ఘీంకారములును వరహరి హేషల్¯ భూరి రథనేమి రవములు¯ ఘోరములై పెల్లగించెఁ గులశైలములన్. (334) ఇవ్విధంబున నుభయబలంబులును మోహరించి బలితో నింద్రుండును, దారకునితో గుహుండును, హేతితో వరుణుండును, బ్రహేతితో మిత్రుండును, గాలనాభునితో యముండును, మయునితో విశ్వకర్మయు, శంబరునితోఁ ద్వష్టయు, విరోచనితో సవితయు, నముచితోఁ బరాజితుండును, వృషపర్వునితో నశ్విదేవతలును, బలిసుతబాణాది పుత్రశతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, బులోమునితో ననిలుండును, శుంభ నిశుంభులతో భద్రకాళీదేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుండును, నిల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులును, దుర్మర్షణునితోఁ గామదేవుండును, నుత్కలునితో మాతృకాగణంబును, శుక్రునితో బృహస్పతియు, నరకునితో శనైశ్చరుండును, నివాతకవచులతో మరుత్తులును, గాలేయులతో వసువులు, నమరులును, బౌలోములతో విశ్వేదేవగణంబును, గ్రోధవశులతో రుద్రులును, నివ్విధంబునం గలిసి పెనంగి ద్వంద్వయుద్ధంబు చేయుచు మఱియు రథికులు రథికులను, పదాతులు పదాతులను, వాహనారూఢులు వాహనారూఢులనుం, దాఁకి సింహనాదంబులు చేయుచు, నట్టహాసంబు లిచ్చుచు, నాహ్వానంబు లొసంగుచు, నన్యోన్యతిరస్కారంబులు చేయుచు, బాహునాదంబుల విజృంభించుచుఁ, బెనుబొబ్బల నుబ్భిరేగుచు, హుంకరించుచు, నహంకరించుచు, ధనుర్గుణంబులఁ డంకరించుచు, శరంబుల నాటించుచుఁ, బరశువుల నఱకుచుం, జక్రంబులం జెక్కుచు, శక్తులం దునుముచుఁ, గశలంబెట్టుచుఁ, గుఠారంబులఁ బొడుచుచు, గదల నడచుచుఁ, గరంబులఁ బొడుచుచుఁ, గరవాలంబుల వ్రేయుచుఁ, బట్టిసంబుల నొంచుచుఁ, బ్రాసంబులం ద్రెంచుచుఁ, బాశంబులం గట్టుచుఁ, బరిఘంబుల మొత్తుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబుల జదుపుచు, ముష్టివలయంబుల ఘట్టించుచుఁ, దోమరంబుల నుఱుముచు శూలంబులఁ జిమ్ముచు, నఖంబులం జీరుచుఁ, దరు శైలంబుల ఱువ్వుచు, నుల్ముకంబులం జూఁడుచు నిట్లు బహువిధంబులం గలహ విహారంబులు సలుపు నవసరంబున భిన్నంబు లయిన శిరంబులును, విచ్ఛిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, జిక్కుపడిన కేశబంధంబులును, భగ్నంబులైన దంతంబులును, గృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన కరంబులును, విదళితంబు లైన మధ్యంబులును, వికృతంబులైన వదనబింబంబులును, వికలంబు లైన నయనంబులును, వికీర్ణంబు లయిన కర్ణంబులును, విశీర్ణంబు లైన నాసికలును, విఱిగిపడిన యూరుదేశంబులును, విసంధులయిన పదంబులునుఁ, జిరిగిన కంకటంబులును, రాలిన భూషణంబులును, వ్రాలిన కేతనంబులును, గూలిన ఛత్రంబులును, మ్రగ్గిన గజంబులును, నుగ్గయిన రథంబులును, నుఱుమైన హయంబులునుఁ, జిందఱవందఱలైన భటసమూహంబులును, నొఱలెడు కొఱప్రాణంబులును, బొఱలెడు మేనులును, నుబ్బి యాడెడు భూతంబులును, బాఱెడు రక్త ప్రవాహంబులును, గుట్టలుగొన్న మాంసంబులును, నెగసి తిరిగెడి కబంధంబులునుఁ, గలకలంబులు జేయు కంక గృధ్రాది విహంగంబులు, నయి యొప్పు నప్పోరతిఘోరంబయ్యె నప్పుడు.