పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : అష్టమ 109 - 218

గజేంద్ర రక్షణము

(109) కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్ ఖండింపఁగాఁ బంపె స¯ త్త్వరితాకంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్ఛటా¯ పరిభూతాంబర శుక్రమున్, బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం¯ తరనిర్వక్రముఁ, బాలితాఖిల సుధాంధశ్చక్రముం, జక్రమున్. (110) ఇట్లు పంచిన. (111) అంభోజాకరమధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నా¯ రంభుం డైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి, నీటన్ గుభుల్¯ గుంభద్ధ్వానముతోఁ గొలంకును కలంకం బొందఁగా జొచ్చి, దు¯ ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై. (112) భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్, ¯ హేమక్ష్మాధర దేహముం, జకితవన్యేభేంద్ర సందోహముం, ¯ గామక్రోధన గేహమున్, గరటి రక్తస్రావ గాహంబు, ని¯ స్సీమోత్సాహము, వీత దాహము, జయశ్రీ మోహమున్, గ్రాహమున్. (113) ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరితలఁ ద్రుంచు నవసరంబున. (114) మకర మొకటి రవిఁ జొచ్చెను; ¯ మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్; ¯ మకరాలయమునఁ దిరిగెఁడు¯ మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్. (115) తమముం బాసిన రోహిణీవిభు క్రియన్ దర్పించి సంసారదుః¯ ఖము వీడ్కొన్న విరక్తచిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా¯ దము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌందర్యంబుతో నొప్పె సం¯ భ్రమదాశాకరిణీ కరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుఁడై. (116) పూరించెన్ హరి పాంచజన్యముఁ, గృపాంభోరాశి సౌజన్యమున్, ¯ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్, ¯ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్, ¯ దూరీభూత విపన్నదైన్యమును, నిర్ధూతద్విషత్సైన్యమున్. (117) మొరసెన్ నిర్జరదుందుభుల్; జలరుహామోదంబులై వాయువుల్¯ దిరిగెం; బువ్వులవానజల్లుఁ గురిసెన్; దేవాంగనాలాస్యముల్¯ పరఁగెన్; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె; సా¯ గర ముప్పొంగెఁ దరంగ చుంబిత నభోగంగాముఖాంభోజమై. (118) నిడుద యగు కేల గజమును¯ మడువున వెడలంగఁ దిగిచి మదజల రేఖల్¯ దుడుచుచు మెల్లన పుడుకుచు¯ నుడిపెన్ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా! (119) శ్రీహరి కర సంస్పర్శను¯ దేహము దాహంబు మాని ధృతిఁ గరిణీసం¯ దోహంబుఁ దాను గజపతి¯ మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్. (120) కరమున మెల్లన నివురుచుఁ¯ గర మనురాగమున మెఱసి కలయం బడుచుం¯ గరి హరికతమున బ్రతికినఁ¯ గరపీడన మాచరించెఁ గరిణుల మరలన్.

గజేంద్రుని పూర్వజన్మ కథ

(121) జననాథ! దేవలశాప విముక్తుఁడై¯ పటుతర గ్రాహరూపంబు మాని¯ ఘనుఁడు హూహూ నామ గంధర్వుఁ డప్పుడు¯ తన తొంటి నిర్మల తనువుఁ దాల్చి¯ హరికి నవ్యయునకు నతిభక్తితో మ్రొక్కి¯ తవిలి కీర్తించి గీతములు పాడి¯ యా దేవు కృప నొంది యందంద మఱియును¯ వినత శిరస్కుఁడై వేడ్కతోడ (121.1) దళిత పాపుఁ డగుచు దనలోకమున కేగె¯ నపుడు శౌరి కేల నంటి తడవ¯ హస్తి లోకనాథుఁ డజ్ఞాన రహితుఁడై¯ విష్ణురూపుఁ డగుచు వెలుఁగుచుండె. (122) అవనీనాథ! గజేంద్రుఁ డా మకరితో నాలంబుఁ గావించె మున్¯ ద్రవిళాధీశుఁ డతండు పుణ్యతముఁ డింద్రద్యుమ్న నాముండు వై¯ ష్ణవ ముఖ్యుండు గృహీతమౌననియతిన్ సర్వాత్ము నారాయణున్¯ సవిశేషంబుగఁ బూజ చేసెను మహాశైలాగ్రభాగంబునన్. (123) ఒకనాఁ డా నృపుఁ డచ్యుతున్ మనసులో నూహించుచున్ మౌనియై¯ యకలంకస్థితి నున్నచోఁ గలశజుం డచ్చోటికిన్ వచ్చి లే¯ వక పూజింపక యున్న మౌనిఁ గని నవ్యక్రోధుఁడై "మూఢ! లు¯ బ్ధ! కరీంద్రోత్తమ యోనిఁ బుట్టు" మని శాపం బిచ్చె భూవల్లభా! (124) మునిపతి నవమానించిన¯ ఘనుఁ డింద్రద్యుమ్న విభుఁడుఁ గౌంజరయోనిం¯ జననం బందెను విప్రులఁ¯ గని యవమానింపఁ దగదు ఘన పుణ్యులకున్. (125) కరినాథుఁ డయ్యె నాతఁడు¯ కరులైరి భటాదులెల్ల; గజముగ నయ్యున్¯ హరిచరణ సేవ కతమునఁ¯ గరి వరునకు నధికముక్తిఁ గలిగె మహాత్మా! (126) కర్మతంత్రుఁ డగుచుఁ గమలాక్షుఁ గొల్చుచు¯ నుభయ నియతవృత్తి నుండెనేనిఁ¯ జెడును గర్మమెల్ల శిథిలమై మెల్లన¯ ప్రబలమైన విష్ణుభక్తి చెడదు. (127) చెడుఁ గరులు హరులు ధనములుఁ¯ జెడుదురు నిజసతులు సుతులుఁ జెడు చెనఁటులకుం; ¯ జెడక మనునట్టి గుణులకుఁ¯ జెడని పదార్థములు విష్ణుసేవా నిరతుల్.

లక్ష్మీ నారాయణ సంభాషణ

(128) అప్పుడు జగజ్జనకుండగు న ప్పరమేశ్వరుండు దరహసిత ముఖకమల యగు నక్కమల కిట్లనియె. (129) “బాలా! నా వెనువెంటను¯ హేలన్ వినువీథినుండి యేతెంచుచు నీ¯ చేలాంచలంబుఁ బట్టుట¯ కాలో నేమంటి నన్ను నంభోజముఖీ! (130) ఎఱుఁగుదు తెఱవా! యెప్పుడు¯ మఱవను సకలంబు నన్ను మఱచిన యెడలన్¯ మఱతు నని యెఱిఁగి మొఱఁగక¯ మఱవక మొఱ యిడిర యేని మఱి యన్యములన్.” (131) అని పలికిన నరవిందమందిర యగు నయ్యిందిరాదేవి మందస్మితచంద్రికా సుందరవదనారవింద యగుచు ముకుందున కిట్లనియె. (132) ”దేవా! దేవర యడుగులు¯ భావంబున నిలిపి కొలచు పని నా పని గా¯ కో వల్లభ! యే మనియెద¯ నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ! (133) దీనుల కుయ్యాలింపను¯ దీనుల రక్షింప మేలు దీవనఁ బొందన్¯ దీనావన! నీ కొప్పును. ¯ దీనపరాధీన! దేవదేవ! మహేశా!" (134) అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్న యప్పరమ వైష్ణవీరత్నంబును సాదర సరససల్లాప మందహాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ జేగీయమానుండై గరుడారూఢుం డగుచు హరి నిజసదనంబునకుం జనియె"నని చెప్పి శుకయోగీంద్రుం డిట్లనియె.

గజేంద్రమోక్షణ కథా ఫలసృతి

(135) ”నరనాథ! నీకును నాచేత వివరింపఁ¯ బడిన యీ కృష్ణానుభావమైన¯ గజరాజమోక్షణకథ వినువారికి¯ యశము లిచ్చును గల్మషాపహంబు; ¯ దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ¯ బ్రొద్దున మేల్కాంచి పూతవృత్తి¯ నిత్యంబుఁ బఠియించు నిర్మలాత్ముకులైన¯ విప్రులకును బహువిభవ మమరు; (135.1) సంపదలు గల్గుఁ; బీడలు శాంతిఁ బొందు; ¯ సుఖము సిద్ధించు; వర్థిల్లు శోభనములు; ¯ మోక్ష మఱచేతిదై యుండు; ముదము చేరు”¯ ననుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె. (136) అని మఱియు నప్పరమేశ్వరుం డిట్లని యానతిచ్చె "ఎవ్వరేని నపర రాత్రాంతంబున మేల్కాంచి సమాహిత మనస్కులయి నన్నును; నిన్నును; నీ సరోవరంబును; శ్వేతద్వీపంబును; నాకుం బ్రియంబైన సుధాసాగరంబును; హేమనగంబును; నిగ్గిరి కందర కాననంబులను; వేత్ర కీచక వేణు లతాగుల్మ సురపాదపంబులను; నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును నివసించి యుండు నక్కొండ శిఖరంబులను; గౌమోదకీ కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను; శ్రీదేవిని; శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదులను; మత్స్య కూర్మ వరాహాద్యవతారంబులను; దదవతారకృత కార్యంబులను; సూర్య సోమ పావకులను; బ్రణవంబును; ధర్మతపస్సత్యంబులను; వేదంబును; వేదాంగంబులను శాస్త్రంబులను; గో భూసుర సాధు పతివ్రతా జనంబులను; జంద్ర కాశ్యపజాయా సముదయంబును; గౌరీ గంగా సరస్వతీ కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిచయంబును; నమరులను; నమరతరువులను; నైరావతంబును; నమృతంబును; ధ్రువుని; బ్రహ్మర్షి నివహంబును; బుణ్యశ్లోకులైన మానవులను; సమాహితచిత్తులై తలంచువారలకుఁ బ్రాణావసానకాలంబున మదీయంబగు విమలగతి నిత్తు"నని హృషీకేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర వందితచరణారవిందుఁడై విహగపరివృఢ వాహనుండై వేంచేసె; విబుధానీకంబు సంతోషించె"నని చెప్పి శుకుండు రాజున కిట్లనియె. (137) “గజరాజమోక్షణంబును¯ నిజముగఁ బఠియించునట్టి నియతాత్ములకున్¯ గజరాజ వరదుఁ డిచ్చును¯ గజ తురగస్యందనములుఁ గైవల్యంబున్.

5రైవతమనువు చరిత్ర

(138) తామసు తమ్ముఁడు రైవత¯ నామకుఁడై వెలసె మనువు; నలువురమీదన్¯ భూమికిఁ బ్రతివింధ్యార్జున¯ నామాదులు నృపులు మనువు నందనులు నృపా! (139) మునులు హిరణ్యరోముఁడు నూర్ధ్వబాహుండు¯ వేదశీర్షుండను వీరు మొదలు¯ నమరులు భూతరయాదులు శుభ్రుని¯ పత్ని వికుంఠాఖ్య పరమసాధ్వి; ¯ యా యిద్దఱకుఁ బుత్రుఁడై తన కళలతో¯ వైకుంఠుఁ డనఁ బుట్టి వారిజాక్షు¯ డవనిపై వైకుంఠ మనియెడి లోకంబుఁ¯ గల్పించె నెల్లలోకములు మ్రొక్క; (139.1) రమ యెదుర్కోలు చేకొనె రాజముఖ్య! ¯ తదనుభావంబు గుణములుఁ దలఁపఁ దరమె? ¯ యీ ధరారేణు పటలంబు నెఱుఁగవచ్చుఁ¯ గాని రాదయ్య హరిగుణగణము సంఖ్య. (140) తదనంతరంబ.

6చాక్షుసమనువు చరిత్ర

(141) చక్షుస్తనూజుండు చాక్షుషుం డను వీరుఁ¯ డాఱవ మనువయ్యె నవనినాథ! ¯ భూమీశ్వరులు పురుః పురుష సుద్యుమ్నాదు¯ లాతని నందను; లమరవిభుఁడు¯ మంత్రద్యుమాఖ్యుఁ; డమర్త్యు లాప్యాదికు¯ లాహవిష్మద్వీరకాది ఘనులు¯ మునులందు విభుఁడు సంభూతికి వైరాజు¯ నకుఁ బుట్టి యజితుండు నాఁగ నొప్పె; (141.1) నతఁడు కాఁడె కూర్మమై మందరాద్రిని¯ నుదధి జలములోన నుండి మోచె; ¯ నతఁడు చువ్వె దివిజు లర్థింప నమృతాబ్ధిఁ ¯ ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు."

సముద్రమథన కథా ప్రారంభం

(142) అని పలికినం బరీక్షిన్నరేంద్రుండు మునీంద్రున కిట్లనియె. (143) "విను ము న్నేటికిఁ ద్రచ్చె పాలకడలిన్ విష్ణుండు? కూర్మాకృతిన్¯ వనధిం జొచ్చి య దెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు? దే¯ వ నికాయం బమృతంబు నెట్లు పడసెన్? వారాశి నేమేమి సం¯ జనితం బయ్యె? మునీంద్ర! చోద్యము గదా సర్వంబుఁ జెప్పంగదే. (144) అప్పటినుండి బుధోత్తమ! ¯ చెప్పెడు భగవత్కథా విశేషంబులు నా¯ కెప్పుడుఁ దనవి జనింపదు¯ చెప్పఁగదే చెవులు నిండ శ్రీహరికథలున్." (145) అని మఱియు నడుగం బడినవాఁడై యతని నభినందించి హరి ప్రసంగంబు జెప్ప నుపక్రమించె"నని సూతుండు ద్విజుల కిట్లనియె "నట్లు శుకుండు రాజుం జూచి.

సురలు బ్రహ్మ శరణు జొచ్చుట

(146) "కసిమఁసగి యసుర విసరము¯ లసి లతికల సురల నెగవ నసువులు వెడలం¯ బసఁ జెడిరి; పడిరి; కెడసిరి¯ యసమ సమర విలసనముల నసమెడలి నృపా! (147) సురపతి వరుణాదులతో¯ సురముఖ్యులు గొంద ఱరిగి సురశైలముపై¯ సురనుతుఁడగు నజుఁ గని యా¯ సుర దుష్కృతిఁ జెప్పి రపుడు సొలయుచు నతులై. (148) దుర్వాసు శాపవశమున¯ నిర్వీర్యత జగము లెల్ల నిశ్శ్రీకములై¯ పర్వతరిపుతోఁ గూడ న¯ పర్వము లయి యుండె హతసుపర్వావళులై. (149) నెలవు వెడలి వచ్చి నిస్తేజులై నట్టి¯ వేల్పుగములఁ జూచి వేల్పుఁ బెద్ద¯ పరమపురుషుఁ దలఁచి ప్రణతుఁడై సంఫుల్ల¯ పద్మవదనుఁ డగుచుఁ బలికెఁ దెలియ. (150) "ఏనును మీరును గాలము¯ మానవ తిర్యగ్లతా ద్రుమ స్వేదజముల్¯ మానుగ నెవ్వని కళలము¯ వానికి మ్రొక్కెదముగాక వగవఁగ నేలా? (151) వధ్యుండు రక్షణీయుఁడు¯ సాధ్యుఁడు మాన్యుఁడని లేక సర్గత్రాణా¯ వధ్యాదు లొనర్చు నతం¯ డాధ్యంత విధానమునకు నర్హుఁడు మనకున్. (152) వరదునిఁ బరము జగద్గురు¯ కరుణాపరతంత్రు మనము గనుఁగొన దుఃఖ¯ జ్వరములు చెడు"నని సురలకు¯ సరసిజజని చెప్పి, యజితు సదనంబునకున్.

బ్రహ్మాదుల హరిస్తుతి

(153) అంత దానును దేవతాసమూహంబును నతిరయంబునం జని వినయంబునఁ గానంబడని యవ్విభు నుద్దేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుండై యిట్లని స్తుతియించె. (154) "ఎవ్వని మాయకు నింతయు మోహించుఁ¯ దఱమి యెవ్వని మాయ దాఁట రాదు; ¯ తన మాయ నెవ్వఁ డింతయు గెల్చినట్టివాఁ¯ డెవ్వనిఁ బొడగాన రెట్టి మునులు; ¯ సర్వభూతములకు సమవృత్తి నెవ్వఁడు¯ చరియించుఁ దనచేత జనితమయిన; ¯ ధరణి పాదములు చిత్తము సోముఁ డగ్ని ము¯ ఖంబు గన్నులు సోమకమలహితులు; (154.1) చెవులు దిక్కులు; రేతంబు సిద్ధజలము; ¯ మూఁడు మూర్తులపుట్టిల్లు; మొదలి నెలవు¯ గర్భమఖిలంబు; మూర్థంబు గగన మగుచు; ¯ మలయు నెవ్వఁడు వాని నమస్కరింతు. (155) మఱియు నెవ్వని బలంబున మహేంద్రుండును; బ్రసాదంబున దేవతలును; గోపంబున రుద్రుండును; బౌరుషంబున విరించియు; నింద్రియంబులవలన వేదంబులును మునులును; మేఢ్రంబునఁ బ్రజాపతియును; వక్షంబున లక్ష్మియు; ఛాయవలనఁ బితృదేవతలును; స్తనంబులవలన ధర్మంబును; బృష్ఠంబువలన నధర్మంబును; శిరంబువలన నాకంబును; విహాసంబువలన నప్సరోజనంబులును; ముఖంబువలన విప్రులును; గుహ్యంబున బ్రహ్మంబును; భుజంబులవలన రాజులును బలంబును; నూరువులవలన వైశ్యులును నైపుణ్యంబును; బదంబులవలన శూద్రులును నవేదంబును; నధరంబున లోభంబును; పరిరదచ్ఛదనంబువలన బ్రీతియు; నాసాపుటంబువలన ద్యుతియు; స్పర్శంబునఁ గామంబును; భ్రూయుగళంబున యమంబును; బక్షంబునఁ గాలంబును సంభవించె; నెవ్వని యోగ మాయావిహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధ సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వనివలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రతుకుచుందురు పెరుగుచుందురు; దివిజులకు నాయువు నంధంబు బలంబునై జగంబులకు నీశుండై ప్రజలకుఁ బ్రజనుండై ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుం డై; యంతస్సముద్రంబున ధాతుసంఘాతంబులం బ్రపచించుచు బ్రహ్మమయుండై; ముక్తికి ద్వారంబై; యమృత మృత్యు స్వరూపుండై; చరాచరప్రాణులకుఁ బ్రాణంబై; యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రి యాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు నప్పరమేశ్వరుండు మాకుం బ్రసన్నుండగుం గాక"యని మఱియును. (156) మొదల జల మిడిన భూజము¯ దుది నడుమను జల్లదనము దొరకొను మాడ్కిన్¯ మొదలను హరికిని మ్రొక్కిన¯ ముద మొందుదు మెల్ల వేల్పుమూకలు నేమున్. (157) ఆపన్నులగు దిదృక్షుల¯ కో! పుణ్య! భవన్ముఖాబ్జ మొయ్యన తఱితోఁ¯ బ్రాపింపఁ జేయు సంపద¯ నో! పరమదయానివాస! యుజ్జ్వలతేజా!"

విశ్వగర్భుని ఆవిర్భావము

(158) అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులం గీర్తించుచు నున్న పరమేష్ఠి యందుఁ గరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుం డావిర్భవించె. (159) ఒకవేయర్కులు గూడిగట్టి కదుపై యుద్యత్ప్రభాభూతితో¯ నొకరూపై చనుదెంచుమాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్¯ వికలాలోకనులై; విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁ గా¯ నక శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁ గానం బోలునే వారికిన్. (160) అప్పుడు. (161) హార కిరీట కేయూర కుండల పాద¯ కటక కాంచీలతా కంకణాది¯ కౌస్తుభోపేతంబుఁ గౌమోదకీ శంఖ¯ చక్ర శరాసన సంయుతంబు¯ మరకతశ్యామంబు సరసిజ నేత్రంబుఁ¯ గర్ణాభరణ కాంతి గండ యుగముఁ¯ గలిత కాంచనవర్ణ కౌశేయవస్త్రంబు¯ శ్రీ వనమాలికా సేవితంబు (161.1) నై మనోహరంబునై దివ్యసౌభాగ్య¯ మైన యతని రూపు హర్ష మెసఁగ¯ జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును¯ బొంగి నమ్రుఁ డగుచుఁ బొగడఁ దొడఁగె. (162) "జననస్థితిలయ దూరుని¯ మునినుతు నిర్వాణసుఖసముద్రుని సుగుణుం¯ దనుతనునిఁ బృథుల పృథులుని¯ ననఘాత్ము మహానుభావు నభినందింతున్. (163) పురుషోత్తమ! నీ రూపము¯ పరమశ్రేయంబు భువన పంక్తుల కెల్లన్¯ స్థిరవైదిక యోగంబున¯ వరుసను మీ యంద కానవచ్చెను మాకున్. (164) మొదలును నీలోఁ దోఁచెను; ¯ దుదియును నటఁ దోఁచె; నడుమ దోఁచెను; నీవే¯ మొదలు నడుమ దుది సృష్టికిఁ¯ గదియఁగ ఘటమునకు మన్ను గతి యగు మాడ్కిన్. (165) నీ మాయ చేత విశ్వము¯ వేమాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్¯ ధీమంతులు గుణపద విని¯ నేమంబున సగుణుఁడైన నినుఁ గాంతు రొగిన్. (166) అన్న మవని యందు నమృతంబు గోవుల¯ యందు వహ్ని సమిధలందు నమర¯ యోగవశతఁ బొందు నోజను బుద్ధిచే¯ నగుణు నిన్నుఁ గాంతు రాత్మవిదులు. (167) పట్టులేక బహుప్రకార విపన్న చిత్తులమైతి; మే¯ మెట్టకేలకు నిన్నుఁ గంటి మభీప్సితార్థము వచ్చుఁ; బె¯ న్వెట్టయైన దవానలంబున వేఁగు నేనుఁగు మొత్తముల్¯ నిట్టవేర్చిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్. (168) నీకు నే మని విన్నవింతుము నీవు సర్వమయుండవై¯ లోకమెల్లను నిండి యుండగ లోకలోచన! నీ పదా¯ లోకనంబు శుభంబు మాకును లోకపాలకు లేను నీ¯ నాకవాసులు నీవ వహ్నిఁ దనర్చు కేతుతతిక్రియన్." (169) అని కమలసంభవ ప్రముఖులు వినుతి చేసి రని"చెప్పి నరేంద్రునకు శుకుం డిట్లనియె.

విష్ణుని అనుగ్రహవచనము

(170) "ఈ రీతిం జతురాననాది నుతుఁడై యేపార జీమూత గం¯ భీరంబైన రవంబునం బలికె సంప్రీతాత్ముఁడై యీశ్వరుం¯ డా రోమాంచిత కాయులన్ నవవిముక్తాపాయులం బ్రేయులం¯ బ్రారబ్ధోగ్ర మహార్ణవోన్మథన వాంఛానల్పులన్ వేల్పులన్. (171) "ఓ! నలువ! యో! సురేశ్వర! ¯ యో! నిటలతటాక్ష! యో! సురోత్తములారా! ¯ దానవులతోడ నిప్పుడు¯ మానుగ బోరామి గలిగి మనుటే యొప్పున్. (172) అది యెట్లంటి రేని. (173) ఎప్పుడు దనకును సత్త్వము¯ చొప్పడు నందాఁక రిపులఁ జూచియుఁ దనమైఁ¯ గప్పికొని యుండవలయును¯ నొప్పుగ నహి మూషకమున కొదిఁగిన భంగిన్. (174) అమృతోత్పాదన యత్నము¯ విమల మతిం జేయు టొప్పు; వేల్పులు! వినుఁడీ¯ యమృతంబుఁ ద్రావి జంతువు¯ లమృతగతిన్ బ్రతుకుచుండు నాయుర్వృద్ధిన్. (175) పాలమున్నీటి లోపల సర్వతృణలతౌ¯ షధములు దెప్పించి చాల వైచి¯ మందరశైలంబు మంథానముగఁ జేసి¯ తనర వాసుకిఁ దరిత్రాడు జేసి¯ నా సహాయతచేత నలి నందఱును మీరు¯ తరువుఁడు వేగ మతంద్రు లగుచు; ¯ ఫలము మీఁదయ్యెడు; బహుళ దుఃఖంబులఁ¯ బడుదురు దైత్యులు పాపమతులు; (175.1) అలసటేమి లేక యఖిలార్థములుఁగల్గు; ¯ విషధిలోన నొక్క విషము పుట్టుఁ; ¯ గలఁగి వెఱవ వలదు కామరోషంబులు¯ వస్తుచయము నందు వలదు చేయ." (176) అని యాదేశించి. (177) అంతాది రహితుఁ డచ్యుతుఁ¯ డంతర్ధానంబు నొందె; నజ ఫాలాక్షుల్¯ సంతోషంబునఁ దమతమ¯ కాంతాలయములకుఁ జనిరి గౌరవ మొప్పన్.

సురాసురలు స్నేహము

(178) కయ్యంబు జేయ నొల్లక¯ నెయ్యంబున నతులు పెట్టి నిర్జర నికరం¯ బియ్యప్పనములు పెట్టుచుఁ¯ దియ్యంబునఁ గొల్చె బలిని దేవద్వేషిన్. (179) పస చెడి తనకును వశమై¯ సుసరముతో గొల్చుచున్న సురసంఘములన్¯ గసిమసిఁగి చంపఁ బూనిన¯ నసురుల వారించె బలియు నతినయయుక్తిన్. (180) అటు వారించి వైరోచని రాక్షస సముదయంబున కిట్లనియె. (181) "పగవారు శరణు చొచ్చిన¯ మగతనములు నెఱపఁ దగునె మగవారలకున్¯ తగు సమయ మెఱుఁగ వలదే¯ మగటిమిఁ బాటింప వల దమర్త్యులతోడన్." (182) అని పలికి కొలువు కూటంబున నసుర నికర పరివృతుండై నిఖిల లోకరాజ్యలక్ష్మీ సహితుండై యఖిల విబుధ వీర విజయాహంకార నిజాలంకారుండై సుఖంబునం గొలువున్న విరోచన నందనుంగని శచీవిభుం డుత్తమ సచివుండునుం బోలె స్వాంత వచనంబుల శాంతిం బొందించి పురుషోత్తమ శిక్షితంబైన నీతిమార్గంబున శంబరునికిం బ్రియంబు చెప్పి; యరిష్టనేమి ననునయించి త్రిపురవాసులగు దానవుల నొడంబఱచి; జంభుని సమ్మతంబు చేకొని; హయగ్రీవుని విగ్రహంబు మాన్చి; నముచి తారక బాణాదులతో సఖ్యంబు నెఱపి; విప్రచిత్తికిం బొత్తు హత్తించి; శకుని విరోచన ప్రహేతులకుఁ బోరామి చూపి మయ మాలి సుమాలి ప్రముఖులకు మైత్రి యెఱింగించి; కుంభ నికుంభులకు సౌజన్యంబుఁ గైకొలిపి; పౌలోమ కాలకేయ నివాతకవచాదుల యెడ బాంధవంబు ప్రకటించి; వజ్రదంష్ట్రి కి వశుండై; యితర దానవ దైత్య సమూహంబువలన నతిస్నేహంబు సంపాదించి; మనకు నక్క చెలియండ్ర బిడ్డలకు నొడ్డారంబు లేమిటికి? నేక కార్యపరత్వంబున నడ్డంబు లేక బ్రదుకుద; మన్యోన్య విరోధంబు లేల? తొల్లి యన్యోన్య విరోధంబున నలంగితి; మిది మొదలు దనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచననందనుండ; మన మందఱ మతని పంపు చేయంగలవార; ముభయ కులంబును వర్ధిల్లు నట్టి యుపాయం బెఱింగింతు నని యమృతజలధిమథన ప్రారంభ కథనంబు దెలియం జెప్పె; నట్లు సురాసుర యూథంబులు బలారాతి బలిప్రముఖంబులై పరమోద్యోగంబున సుధాసంపాదనాయత్త చిత్తులై యైకమత్యంబు నొంది యమందగమనంబున మందరనగంబునకుం జని.

మంధరగిరిని తెచ్చుట

(183) వాసవ వర్ధకి వాఁడిగాఁ జఱచిన¯ కుద్దాలముఖములఁ గొంత ద్రవ్వి¯ ముసలాగ్రముల జొన్పి మొదలి పాఁ తగలించి¯ దీర్ఘ పాశంబులఁ ద్రిండు చుట్టి¯ పెకలించి బాహుల బీడించి కదలించి¯ పెల్లార్చి తమతమ పేరు వాడి¯ పెఱికి మీఁదికి నెత్తి పృథుల హస్తంబులఁ¯ దలల భుజంబులఁ దరలకుండ (183.1) నాని మెల్లన కుఱుతప్పుటడుగు లిడుచు¯ భార మధికంబు మఱవక పట్టుఁ డనుచు¯ మందరనగంబుఁ దెచ్చి రమందగతిని. ¯ దేవ దైత్యులు జలరాశి తెరువు పట్టి. (184) మందరము మోవ నోపమి¯ నందఱపైఁబడియె నదియు నతిచోద్యముగాఁ; ¯ గొందఱు నేలం గలిసిరి¯ కొందఱు నుగ్గయిరి; చనిరి కొందఱు భీతిన్. (185) "ఏలా హరికడ కేఁగితి? ¯ మేలా దొరఁకొంటి మధిక హేలన శైలో¯ న్మూలనము జేసి తెచ్చితి? ¯ మేలా పెక్కండ్రు మడిసి రేలా నడుమన్? (186) ఏటికి మముఁ బని బంచెను? ¯ నేటికి మనఁ బోఁటివారి కింతలు పను? లిం¯ కేటికి రాఁడు రమేశ్వరుఁ? ¯ డేటి కుపేక్షించె? మఱవ నేటికి మనలన్?" (187) అని కులకుధర పతనజన్యం బగు దైన్యంబు సహింప నోపక పలవించుచున్న దివిజ దితిజుల భయంబు మనంబున నెఱింగి సకల వ్యాపకుండగు హరి దత్సమీపంబున. (188) గరుడారోహకుఁడై గదాదిధరుఁడై కారుణ్యసంయుక్తుఁడై¯ హరికోటిప్రభతో "నొహో వెఱవకుం" డంచుం బ్రదీపించి త¯ ద్గిరిఁ గేలన్ నలువొంద గందుకము మాడ్కింబట్టి క్రీడించుచు¯ న్గరుణాలోకసుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. (189) వారలు గొలువఁగ హరియును¯ వారాన్నిధి కరుగు మనఁగ వసుధాధరమున్¯ వారిజనయనునిఁ గొంచు న¯ వారితగతిఁ జనియె విహగవల్లభుఁ డఱుతన్. (190) చని జలరాశి తటంబున¯ వనజాక్షుని గిరిని డించి వందనములు స¯ ద్వినుతులు జేసి ఖగేంద్రుఁడు¯ పనివినియెను భక్తి నాత్మభవనంబునకున్. (191) అప్పుడు.

సముద్ర మథన యత్నము

(192) భూనాథ! వినవయ్య భోగీంద్రు వాసుకిఁ¯ బిలిపించి యతనికిఁ బ్రియము జెప్పి¯ ఫలభాగ మీ నొడఁబడి సమ్మతునిఁ జేసి¯ మెల్లన చేతుల మేను నివిరి¯ నీవ కా కెవ్వరు నేర్తు? రీ పని కియ్య¯ కొమ్మని యతని కైకోలు పడసి¯ కవ్వంపుఁ గొండ నిష్కంటకంబుగఁ జేసి¯ ఘర్షించి యతని భోగంబుఁ జుట్టి (192.1) కడఁగి యమృతజలధిఁ గలశంబుఁ గావించి ¯ త్రచ్చు నవసరమునఁ దలఁపు లమర¯ బద్ధవస్త్రకేశభారులై యా రెండు¯ గములవారు తరువఁ గదిసి రచట. (193) తదనంతరంబ. (194) హరియును దేవానీకము¯ నురగేంద్రుని తలలు పట్టనుద్యోగింపన్¯ హరిమాయా పరవశులై¯ సురవిమతులు కూడి పలుకఁ జొచ్చిరి కడిమిన్. (195) "స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కఁబట్టి మథింపఁగాఁ¯ బుచ్ఛ మేటికి మాకుఁ బట్టఁగఁ? బూరుషత్వము గల్గి మే¯ మచ్ఛమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై¯ యిచ్ఛయింతుమె తుచ్ఛవృత్తికి? నిండు మాకు ఫణాగ్రముల్." (196) అని పలుకు దనుజులం జూచి. (197) విస్మయముఁ బొంది దానవ¯ ఘస్మరుఁ డహిఫణము విడువఁ గైకొని యసురుల్¯ విస్మితముఖులై యార్చి ర¯ విస్మితముగఁ గొనిరి సురలు వీఁకం దోఁకన్. (198) ఇట్లు సమాకర్షణస్థానభాగనిర్ణయంబు లేర్పఱచుకొని దేవతలు పుచ్ఛంబును; బూర్వదేవతలు ఫణంబులుం బట్టి పయోరాశి మధ్యంబునం బర్వతంబు పెట్టి; పరమాయత్తచిత్తులై యమృతార్థంబు త్రచ్చుచున్న సమయంబున. (199) విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ¯ గడుభరమున మొదలఁ గుదురు గలుగమి గెడఁవై¯ బుడబుడ రవమున నఖిలము¯ వడవడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్. (200) గౌరవమైన భారమునఁ గవ్వపుఁగొండ ధరింప లేక దో¯ స్సార విహీనులై యుభయ సైనికులుం గడు సిగ్గుతో నకూ¯ పారతటంబునం బడిరి పౌరుషముం జెడి పాండవేయ! యె¯ వ్వారికి నేరఁబోలు బలవంతపు దైవము నాక్రమింపగన్?

కూర్మావతారము

(201) వననిధి జలముల లోపల¯ మునిఁగెడి గిరిఁ జూచి దుఃఖమునఁ జింతాబ్ధిన్¯ మునిఁగెడి వేల్పులఁ గనుఁగొని¯ వనజాక్షుఁడు వార్ధినడుమ వారలు చూడన్. (202) సవరనై లక్ష యోజనముల వెడలుపై¯ కడుఁ గఠోరమునైన కర్పరమును¯ నదనైన బ్రహ్మాండమైన నాహారించు¯ ఘనతరంబగు ముఖగహ్వరంబు¯ సకల చరాచర జంతురాసుల నెల్ల¯ మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు¯ విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ¯ నాఁగినఁ గదలని యట్టి కాళ్ళు (202.1) వెలికి లోనికిఁ జనుదెంచు విపుల తుండ¯ మంబుజంబులఁ బోలెడు నక్షి యుగము¯ సుందరంబుగ విష్ణుండు సురలతోడి¯ కూర్మి చెలువొంద నొక మహా కూర్మ మయ్యె. (203) కమఠంబై జలరాశిఁ జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్¯ నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో¯ నమరేంద్రాదులు మౌళికంపములతో "నౌనౌఁగదే! బాపురే! ¯ కమలాక్షా! శర"ణంచు భూదిశలు నాకాశంబునున్ మ్రోయఁగన్. (204) ఇవ్విధంబున. (205) తరిగాండ్రలోన నొకఁడట¯ తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్; ¯ దరి గవ్వంబును దా నఁట¯ హరిహరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్. (206) జలధిఁ గడవ చేయ శైలంబుఁ గవ్వంబు¯ చేయ భోగిఁ ద్రాడు చేయఁ దరువ¯ సిరియు సుధయుఁ బడయ శ్రీవల్లభుఁడుఁ దక్క¯ నొరుఁడు శక్తిమంతుఁ డొకఁడు గలఁడె? (207) గొల్లవారి బ్రతుకు గొఱఁతన వచ్చునె¯ గొల్లరీతిఁ బాలకుప్ప ద్రచ్చి¯ గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు¯ చేటు లేని మందు సిరియుఁ గనిరి.

సముద్రమథన వర్ణన

(208) ఇట్లు సురాసురయూథంబులు హరిసనాథంబులయి కవచంబులు నెట్టంబులు పెట్టికొని; పుట్టంబులు పిరిచుట్లు చుట్టుకొని; కరంబులుఁ గరంబుల నప్పళించుచు; భుజంబులు భుజంబుల నొరయుచు; లెండు లెండు దరువఁ దొడంగుఁడు రండని యమందగతిం బెరుగుఁ ద్రచ్చు మందగొల్లల చందంబున మహార్ణవమధ్యంబున మంథాయమాన మందరమహీధర విలగ్నభోగి భోగాద్యంతంబులం గరంబులం దెమల్చుచుఁ; బెనుబొబ్బలం బ్రహ్మాండ కటాహంబు నిర్భరంబయి గుబ్బుగుబ్బని యురులు కొండకవ్వంబుగుత్తి జిఱజిఱందిరుఁగు వేగంబున ఛటచ్ఛటాయ మానంబులయి బుగులుబుగుళ్ళను చప్పుళ్ళుప్పరం బెగసి లెక్కుకు మిక్కిలి చుక్కల కొమ్మల చెక్కుల నిక్కలుపడు మిసిమిగల మీఁది మీఁగడ పాలతేట నిగ్గుఁ దుంపరల పరంపరలవలన నిజకరక్రమ క్రమాకర్షణపరిభ్రాంత ఫణిఫణాగర్భ సముద్భూత నిర్భర విష కీలి కీలాజాలంబుల నప్పటప్పటికి నుప్పతిల్లిన దప్పిం గొండొక మందగతిం జెందక యక్కూపార వేలా తట కుటజ కుసుమగుచ్ఛ పిచ్ఛిల స్వచ్ఛ మకరంద సుగంధి గంధవహంబులం గ్రొంజెమట నీటి పెను వఱదగము లొడళ్ళ నిగుర నొండొరులం బరిహసించుచుఁ బేరువాడి విలసించుచు; మేలు మేలని యుగ్గడించుచుఁ; గాదు కాదని భంగించుచు; నిచ్ఛ మెచ్చని మచ్చరంబుల వలన వనధి వలమాన వైశాఖ వసుంధరాధర పరివర్తన సముజ్జనిత ఘమఘమారావంబును; మథన గుణాయమాన మహాహీంద్రప్రముఖ ముహుర్ముహురుచ్చలిత భూరి ఘోర ఫూత్కార ఘోషంబును; గులకుధర పరిక్షేపణ క్షోభిత సముల్లంఘన సమాకులితంబులై వెఱచఱచి గుబురుగుబురులై యొరలు కమఠ కర్కట కాకోదర మకర తిమి తిమింగిల మరాళ చక్రవాక బలాహక భేక సారసానీకంబుల మొఱలునుం గూడికొని ముప్పిరిగొని; దనుజ దివిజ భటాట్టహాస తర్జనగర్జనధ్వనులు నలుపురియై మొత్తినట్లైన దిశదిగంత భిత్తులును; బేఁటెత్తి పెల్లగిలం ద్రుళ్ళుచుఁ గికురు పొడుచుచు నొక్కఁడొకనికంటె వడియునుం గడపునుం గలుగఁ ద్రచ్చుచుఁ బంతంబు లిచ్చుచు సుధాజననంబుఁ జింతించుచు నూతనపదార్థంబులకు నెదుళ్ళు చూచుచు నెంతదడవు ద్రత్తుమని హరి నడుగుచు నెడపడని తమకంబుల నంతకంతకు మురువుడింపక త్రచ్చు సమయంబున. (209) అప్పాలవెల్లి లోపల¯ నప్పటికప్పటికి మందరాగము దిరుగం¯ జప్పుడు నిండె నజాండము¯ చెప్పెడి దే మజుని చెవులు చిందఱగొనియెన్. (210) అంత నప్పయోరాశి మధ్యంబున. (211) ఎడమఁ గుడి మునుపు దిరుగుచు¯ గుడి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం¯ గడ లెడల సురలు నసురులుఁ¯ దొడితొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్. (212) వడిగొని కులగిరిఁ దరువఁగ¯ జడనిధి ఖగ మకర కమఠ ఝష ఫణి గణముల్¯ సుడివడుఁ దడఁబడుఁ గెలఁకులఁ¯ బడు భయపడి నెగసి బయలఁ బడు నురలిపడున్. (213) అమరాసుర కర విపరి¯ భ్రమణ ధరాధరవరేంద్ర భ్రమణంబును దాఁ¯ గమఠేంద్రు వీపు తీఁటను¯ శమియింపఁగఁ జాలదయ్యె జగతీనాథా! (214) తదనంతరంబ

కాలకూట విషము పుట్టుట

(215) ఆలోల జలధి లోపల¯ నాలో నహి విడిచి సురలు నసురులుఁ బఱవం¯ గీలా కోలాహలమై¯ హాలాహల విషము పుట్టె నవనీనాథా! (216) అదియునుం బ్రళయకాలాభీల ఫాలలోచన లోచనానలశతంబు చందంబున నమందంబై; విలయ దహన సహస్రంబు కైవడి వడియై; కడపటి పట్టపగలింటి వెలుంగుల లక్ష తెఱంగున దుర్లక్షితంబై; తుదిరేయి వెలింగిన మొగిలుగముల వలనం బడు బలు పిడుగుల వడువున బెడిదంబై; పంచభూతంబులుం దేజోరూపంబులైన చాడ్పున దుస్సహంబై; భుగభుగాయమానంబులైన పొగలును; జిటచిటాయమానంబులైన విస్ఫులింగంబులును; ధగధగాయమానంబు లైన నెఱమంటలును; గలిగి మహార్ణవ మధ్యంబున మందరనగం బమంథరంబుగం దిరుగునెడ జనియించి పటపటాయమానంబై నింగికిం బొంగి దిశలకుం గేలు చాఁచి బయళ్ళు ప్రబ్బికొని తరిగవ్వంపుఁ గొండ నండ గొనక; నిగిడి కడలి నలుగడలకుం బఱచి; దరుల కుఱికి; సురాసుర సముదయంబులం దరిగొని; గిరివర గుహాగహ్వరంబుల సుడిపడక కులశిఖరి శిఖరంబుల నెరగలివడి; గహనంబుల దహించి కుంజమంజరీ పుంజంబుల భస్మంబుజేసి; జనపదంబు లేర్చి; నదీ నదంబు లెరియించి; దిక్కుంభి కుంభంబులు నిక్కలుపడ నిక్కి; తరణి తారామండలంబులపై మిట్టించి; మహర్లోకంబు దరికొని; యుపరిలోకంబునకు మాఱుగొనలిడి సుడిపడి ముసురుకొని; బ్రహ్మాండ గోళంబు చిటిలి పడన్ దాఁటి; పాతాళాది లోకంబులకు వేళ్ళుబాఱి; సర్వలోకాధికంబై శక్యంబుగాక యెక్కడఁ జూచినం దానయై; కురంగంబు క్రియం గ్రేళ్ళుఱుకుచు; భుజంగంబు విధంబున నొడియుచు; సింగంబు భంగి లంఘించుచు; విహంగంబు పగిది నెగయుచు; మాతంగంబు పోలికి నిలువంబడుచు నిట్లు హాలాహల దహనంబు జగంబులం గోలాహలంబు చేయుచున్న సమయంబున; మెలకు సెగల మిడుకం జాలక నీఱైన దేవతలును; నేలంగూలిన రక్కసులును; డుల్లిన తారకలును; గీటడంగిన కిన్నర మిథునంబులును; గమరిన గంధర్వవిమానంబులును; జీకాకుపడిన సిద్ధచయంబులును; జిక్కుపడిన గ్రహంబులును జిందఱవందఱ లయిన వర్ణాశ్రమంబులును; నిగిరిపోయిన నదులును; నింకిన సముద్రంబులును; గాలిన కాననంబులును బొగిలిన పురంబులును; బొనుఁగుపడిన పురుషులును; బొక్కిపడిన పుణ్యాంగనా జనంబులును; బగిలిపడిన పర్వతంబులును భస్మంబులైన ప్రాణి సంఘంబులును; వేఁగిన లోకంబులును; వివశలైన దిశలును; నొడ్డగెడవులైన భూజచయంబులును; నఱవఱలైన భూములునునై యకాల విలయకాలంబై తోచుచున్న సమయంబున. (217) ఒడ్డారించి విషంబున¯ కడ్డము చనుదెంచి కావ నధికులు లేమిన్¯ గొడ్డేఱి మ్రంది రా లన¯ బిడ్డన నెడలేక జనులు పృథ్వీనాథా! (218) అప్పుడు