పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 346 - 441

చిత్రరేఖ పటంబున చూపుట

(346) అని యొడంబఱిచి మిలమిలని మంచుతోడం బురుడించు ధళధళ మను మెఱుంగులు దుఱంగలిగొను పటంబు నావటంబు సేసి, వజ్రంబున మేదించి, పంచవన్నియలు వేఱువేఱ కనక రజత పాత్రంబుల నించి కేలం దూలిక ధరించి యొక్క విజనస్థలంబునకుం జని ముల్లోకంబులం బేరు గలిగి వయో రూప సంపన్నులైన పురుషముఖ్యుల నన్వయ గోత్ర నామధేయంబులతోడ వ్రాసి, యాయితంబయిన యప్పటంబు దన ముందటఁ దెచ్చి పెట్టి, “యిప్పటంబునం దగులని వారు లేరు; వారిం జెప్పెద, సావధానంబుగ నాకర్ణింపు” మని యిట్లనియె. (347) "కమనీయ సంగీత కలిత కోవిదులు కిం¯ పురుష గంధర్వ కిన్నరులు వీరె ¯ సతత యౌవన యదృచ్ఛావిహారులు సిద్ధ¯ సాధ్య చారణ నభశ్చరులు వీరె ¯ ప్రవిమల సౌఖ్య సంపద్వైభవులు సుధా¯ శన మరు ద్యక్ష రాక్షసులు వీరె ¯ నిరుపమ రుచి కళాన్విత కామరూపులై¯ పొగడొందునట్టి పన్నగులు వీరె (347.1) చూడు"మని నేర్పుఁ దీపింపఁ జూపుటయునుఁ ¯ జిత్తము నిజమనోరథసిద్ధి వడయఁ ¯ జాలకుండిన మధ్యమ క్ష్మాతలాధి ¯ పతులఁ జూపుచు వచ్చె న ప్పద్మనయన. (348) "మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పుళింద కళింగ భోజ నే ¯ పాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధ రాంధ్ర బం ¯ గాళ కరూశ టేంకణ త్రిగర్త సుధేష్ణ మరాట లాట పాం ¯ చాల నిషాద ఘూర్జరక సాళ్వ మహీశులు వీరె కోమలీ! (349) సింధురవైరివిక్రముఁడు, శీతమయూఖ మరాళికా పయ¯ స్సింధుపటీర నిర్మలవిశేష యశోవిభవుండు, శౌర్య ద¯ ర్పాంధ రిపుక్షితీశ నికరాంధతమః పటలార్కుఁ డీ జరా¯ సంధునిఁ జూడు మాగధుని సద్బృహదశ్వసుతుం గృశోదరీ! (350) సకలోర్వీతలనాథ సన్నుతుఁడు, శశ్వద్భూరి బాహాబలా ¯ ధికుఁ, డుగ్రాహవకోవిదుండు, త్రిజగద్విఖ్యాతచారిత్రకుం, ¯ డకలంకోజ్జ్వల దివ్యభూషుఁడు విదర్భాధీశ్వరుండైన భీ ¯ ష్మక భూపాలకుమారుఁ జూడు మితనిన్ మత్తద్విరేఫాలకా! (351) సంగరరంగ నిర్దళిత చండవిరోధి వరూధినీశ మా ¯ తంగ తురంగ సద్భట రథప్రకరైక భుజావిజృంభణా ¯ భంగ పరాక్రమప్రకట భవ్యయశోమహనీయమూర్తి కా ¯ ళింగుఁడు వీఁడె చూడు తరళీకృత చారుకురంగలోచనా! (352) సుగుణాంభోనిధి, ఫాలలోచను నుమేశున్నాత్మ మెప్పించి శ¯ క్తి గరిష్ఠంబగు శూలముం బడసె నక్షీణప్రతాపోన్నతిన్, ¯ జగతిన్ మిక్కిలి మేటివీరుఁడు, రణోత్సాహుండు, భూపౌత్త్రుఁ డీ ¯ భగదత్తుం గనుఁగొంటె! పంకజముఖీ! ప్రాగ్జ్యోతిషాధీశ్వరున్. (353) వికచాంభోరుహపత్రనేత్రుఁ డగు గోవిందుండు దాఁ బూను నం ¯ దక చక్రాబ్జ గదాది చిహ్నములచేతన్ వాసుదేవాఖ్య ను¯ త్సుకుఁడై యెప్పుడు మచ్చరించు మదిఁ గృష్ణుండన్ననేమేటి పౌం¯ డ్రకుఁ గాశీశసఖుం గనుంగొనుము వేడ్కం జంద్రబింబాననా! (354) ద్విజ శుశ్రూషయు, సూనృతవ్రతము, నుద్వృత్తిన్ భుజాగర్వమున్, ¯ విజయాటోపముఁ, జాప నైపుణియు, ధీవిస్ఫూర్తియుం గల్గు నీ ¯ రజనీనాథకులప్రదీపకులఁ బాఱంజూడు పద్మాక్షి! ధ¯ ర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైకపారీణులన్. (355) బలిమిన్ సర్వనృపాలురన్నదిమి కప్పంబుల్‌ దగం గొంచు ను¯ జ్జ్వల తేజో విభవాతిరేకమున భాస్వత్కీర్తి శోభిల్లఁగాఁ ¯ బొలుపొందం దను రాజరా జన మహా భూరిప్రతాపంబులుం ¯ గల దుర్యోధనుఁ జూడు సోదరయుతుం గంజాతపత్త్రేక్షణా! " (356) అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజవరుల నెల్లఁ జూపుచు యదువంశసంభవులైన శూరసేన వసుదేవోద్ధవాదులం జూపి మఱియును. (357) "శారద నీరదాబ్జ ఘనసార సుధాకర కాశ చంద్రికా ¯ సార పటీరవర్ణు, యదుసత్తము, నుత్తమనాయకుం, బ్రమ¯ త్తారి నృపాల కానన హుతాశనమూర్తిఁ, బ్రలంబదైత్య సం ¯ హారునిఁ, గామపాలుని, హలాయుధుఁ జూడుము దైత్యనందనా! (358) కమనీయశుభగాత్రుఁ, గంజాతదళనేత్రు¯ వసుధాకళత్రుఁ, బావనచరిత్రు, ¯ సత్యసంకల్పు, నిశాచరోగ్రవికల్పు¯ నతపన్నగాకల్పు నాగతల్పుఁ, ¯ గౌస్తుభమణిభూషు, గంభీరమృదుభాషు¯ శ్రితజనపోషు, నంచితవిశేషు, ¯ నీలనీరదకాయు, నిర్జితదైతేయు¯ ధృతపీతకౌశేయు, నతవిధేయు, (358.1) నఘమహాగదవైద్యు, వేదాంతవేద్యు, ¯ దివ్యమునిసన్నుతామోదుఁ, దీర్థపాదు, ¯ జిష్ణు, వర సద్గుణాలంకరిష్ణుఁ, గృష్ణుఁ ¯ జూడు దైతేయకులబాల! సుభగ లీల! (359) స్ఫుర దళి శింజినీ రవ విభూషితపుష్పధనుర్విముక్త భా ¯ స్వర నవచూత కోరక నిశాత శిలీముఖ పాతభీత పం ¯ కరుహభవాది చేతన నికాయు, మనోజనిజాంశు, రుక్మిణీ ¯ వరసుతు, రాజకీరపరివారుని మారునిఁ జూడు కోమలీ! " (360) ఇవ్విధంబునం జూపిన. (361) వనితారత్నము కృష్ణనందనుని భావప్రౌఢిఁ దాఁ జూచి గ్ర¯ ద్దనఁ దన్నర్థి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో ¯ ననుమానించి యనంతరంబ యనిరుద్ధాఖ్యున్ సరోజాక్షు నూ¯ తన చేతోభవమూర్తిఁ జూచి మది సంతాపించుచున్నిట్లనున్. (362) "ఇంతి! మదీయ మానధనమెల్ల హరించిన మ్రుచ్చు నిమ్మెయిం¯ బంత మెలర్ప వ్రాసి పటభాగనిరూపితుఁ జేసినట్టి నీ ¯ యంతటి పుణ్యమూర్తిఁ గొనియాడఁగ నేర్తునె? నీ చరిత్రముల్‌ ¯ వింతలె నాకు? నీ మహిత వీరుకులంబు బలంబుఁ జెప్పుమా! " (363) అనవుడుఁ జిత్రరేఖ జలజాక్షికి నిట్లను "నీ కుమారకుం ¯ డనఘుఁడు, యాదవాన్వయ సుధాంబుధి పూర్ణసుధాకరుండునాఁ¯ దనరిన కృష్ణపౌత్త్రకుఁ, డుదారచరిత్రుఁడు, భూరిసింహ సం ¯ హననుఁ, డరాతి సైన్య తిమిరార్కుఁడు, పే రనిరుద్ధుఁ డంగనా! "

చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట

(364) అని చెప్పి “యే నతిత్వరితగతిం జని యక్కుమారరత్నంబుఁ దొడ్కొనివచ్చు నంతకు సంతాపింపకుండు” మని యా క్షణంబ వియద్గమనంబునం జని ముందట. (365) సరసిజముఖి గనుఁగొనె శుభ ¯ భరిత విలోకన విధూత భవ వేదనముం ¯ బరసాధనమును సుకృత¯ స్ఫురణాపాదనముఁ గృష్ణు పుటభేదనమున్. (366) కని డాయం జని, తదీయ సుషమావిశేషంబులకుం బరితోషంబు నొందుచుం, గామినీచరణ రణితమణినూపుర ఝణంఝణధ్వనిత మణిగోపురంబును, నతి విభవ విజితగోపురంబునునగు ద్వారకాపురంబు నిశాసమయంబునం బ్రచ్ఛన్నవేషంబునం జొచ్చి; కనకకుంభకలితసౌధాగ్రంబున మణిదీపనిచయంబు ప్రకాశింపఁ, జంద్ర కాంత శిలాభవనంబున సుధాధామ రుచిరరుచి నిచయంబు నపహసించు హంసతూలికాతల్పంబున నిజాంగనా రతిశ్రమంబున నిద్రాసక్తుండై యున్న యనిరుద్ధుం జేరి, తన యోగవిద్యా మహత్త్త్వంబున నతని నెత్తుకొని, మనోవేగంబున శోణపురంబునకుం జని, బాణాసురనందనయగు నుషాసుందరి తల్పంబునం దునిచి యిట్లనియె. (367) "వనజాక్షి! చూడు నీ విభు, ¯ ననిమిషనగధీరు, శూరు, నభినవమారున్, ¯ వనధి గభీరు, నుదారుని, ¯ ననిరుద్ధకుమారు, విదళితాహితవీరున్. " (368) అనిన నుషాసతి దన మన ¯ మున ననురాగిల్లి మేనఁ బులకాంకురముల్‌ ¯ మొనయఁగ నానందాశ్రులు ¯ గనుఁగవ జడి గురియ ముఖవికాస మెలర్పన్. (369) ఇట్లు మనంబున నుత్సహించి చిత్రరేఖం గనుంగొని యయ్యింతి యిట్లనియె. (370) "అతివ! నీ సాంగత్య మను భానురుచి నాకుఁ¯ గలుగుటఁ గామాంధకార మడఁగెఁ ¯ దరలాక్షి! నీ సఖిత్వం బను నావచేఁ¯ గడిఁది వియోగాబ్ధిఁ గడవఁ గంటి ¯ నబల! నీ యనుబంధ మను సుధావృష్టిచే¯ నంగజ సంతాప మార్పఁ గంటి ¯ వనిత! నీ చెలితనం బను రసాంజనముచే¯ నా మనోహర నిధానంబుఁ గంటిఁ (370.1) గలలఁ దోఁచిన రూపు గ్రక్కన లిఖించు ¯ వారు, నౌ నన్నఁ దోడ్తెచ్చు వారు గలరె? ¯ నీటిలో జాడఁ బుట్టించు నేర్పు నీక ¯ కాక గల్గునె మూఁడు లోకములయందు? " (371) అని వినుతించి చిత్రరేఖను నిజమందిరమునకుఁబోవం బనిచినం జనియె; ననంతరంబ వింతజనులకెవ్వరికింబ్రవేశింపరాని యంతఃపుర సౌధాంతరంబున ననిరుద్ధుండు మేల్కని యయ్యింతిం గనుంగొని, యప్పుడు. (372) సురుచిర మృదుతల్పంబునఁ ¯ బరిరంభణ సరసవచన భావకళా చా ¯ తురి మెఱయ రాకుమారుఁడు ¯ తరుణీమణిఁ బొందె మదనతంత్రజ్ఞుండై. (373) ఇవ్విధంబున నతిమనోహర విభవాభిరామంబులగు దివ్యాంబరాభరణ మల్యానులేపనంబులను, గర్పూర తాంబూలంబులను, వివిధాన్నపానంబులను, సురుచిర మణిదీప నీరాజనంబులను, సుగంధబంధురాగరుధూపంబులను, నాటపాటల వీణావినోదంబులను, బరితుష్టిం బొంది కన్యాకుమారకు లానంద సాగరాంత ర్నిమగ్నమానసులై యుదయాస్తమయ నిరూపణంబుసేయనేరక, ప్రాణంబు లొక్కటియైన తలంపులం గదిసి యిష్టోపభోగంబుల సుఖియించుచుండి; రంత. (374) ఆలోనన నతిచిర మగు ¯ కాలము సుఖలీల జరుగఁగా వరుస నుషా ¯ బాలాలలామ కొయ్యనఁ ¯ జూ లేర్పడి గర్భ మొదవె సురుచిరభంగిన్. (375) ఆ చిన్నె లంగజాలలు ¯ సూచి భయాకులత నొంది స్రుక్కుచుఁ దమలో ¯ "నో చెల్ల! యెట్టులో? యీ ¯ రా చూలికిఁ జూలు నిలిచెరా! యిబ్భంగిన్" (376) అని గుజగుజ వోవుచు ని¯ ప్పని దప్పక దనుజలోక పాలునితోడన్ ¯ వినిపింపవలయు నని వే ¯ చని బాణునిఁ జేరి మ్రొక్కి సద్వినయమునన్. (377) మంతనమున "దేవర! క¯ న్యాంతఃపుర మేము గాచి యరయుచు నుండన్ ¯ వింతజనములకుఁ జొరఁగ దు ¯ రంతము విను పోతుటీఁగకైన సురారీ! (378) ఇట్టిచోఁ గావలున్న మే మెవ్వరమును ¯ నేమి కనుమాయయో కాని యెఱుఁగ మధిప! ¯ నీ కుమారిక గర్భంబు నివ్వటిల్ల ¯ యున్న” దన్నను విని రోషయుక్తుఁ డగుచు. (379) అట్టియెడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై, కటము లదర, బొమలుముడివడం, గనుంగవల ననలకణంబు లుప్పతిల్ల, సటలు వెఱికినం జటులగతి నెగయు సింగంబు విధంబున లంఘించుచు, భీకర కరవాలంబు గేలందాల్చి సముద్దండగతిం గన్యాసౌధాంతరంబునకుం జని.

అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు

(380) కనియె శుభోపేతుఁ, గందర్పసంజాతు¯ మానితదేహు, నాజానుబాహు, ¯ మకరకుండలకర్ణు, మహితప్రభాపూర్ణుఁ¯ జిరయశోల్లాసుఁ, గౌశేయవాసుఁ, ¯ గస్తూరికాలిప్తు, ఘనకాంతికుముదాప్తు¯ హారశోభితవక్షు, నంబుజాక్షు, ¯ యదువంశతిలకు మత్తాలినీలాలకు¯ నవపుష్పచాపుఁ, బూర్ణప్రతాపు, (380.1) నభినవాకారు, నక్షవిద్యావిహారు, ¯ మహితగుణవృద్ధు, మన్మథమంత్రసిద్ధుఁ, ¯ గలితపరిశుద్ధు, నఖిలలోకప్రసిద్ధుఁ, ¯ జతురు, ననిరుద్ధు, నంగనాజననిరుద్ధు. (381) కని కన లగ్గలింప సురకంటకుఁ డుద్ధతి సద్భటావళిం ¯ గనుఁగొని "యీనరాధమునిఁ గట్టుఁడు; పట్టుఁడు; కొట్టుఁ"డన్న వా¯ రనుపమ హేతిదీధితు లహర్పతి తేజము మాయఁజేయ డా ¯ సిన నృపశేఖరుండు మదిఁ జేవయు లావును నేర్పు దర్పమున్. (382) కలిగి మహోగ్రవృత్తిఁ బరిఘంబు గరంబున లీలఁ దాల్చి దో ¯ ర్బల ఘనవిక్రమప్రళయభైరవు భంగి విజృంభణక్రియా ¯ కలన నెదిర్చె దానవ నికాయముతోఁ దలపాటుఁబోటునుం ¯ జలముబలంబు ధైర్యమునుశౌర్యము వ్రేటునువాటుఁజూపుచున్ (383) పదములుబాహులుందలలు ప్రక్కలుచెక్కులుజానుయుగ్మముల్‌ ¯ రదములుగర్ణముల్‌ మెడలురంబులుమూఁపులువీఁపులూరువుల్‌ ¯ చిదురుపలై ధరం దొఱఁగఁ జిందఱవందఱ సేయ సైనికుల్‌ ¯ కదన పరాఙ్ముఖక్రమముఁ గైకొని పాఱిరి కాందిశీకులై. (384) ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది వెఱచియుం, బఱచియు, విచ్చియుం, జచ్చియుఁ, గలంగియు, నలంగియు, విఱిగియు, సురిఁగియుఁ, జెదరియు బెదరియుఁ, జేవదఱిఁగి నుఱుములై తన మఱుఁగు సొచ్చిన, బాణుండు శౌర్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియుఁ, బొడిచియు, నడిచియుఁ, బెనంగి (385) క్రుద్ధుండై యహిపాశ ని ¯ బద్ధుం గావించె నసురపాలుఁడు రణ స¯ న్నద్ధున్, శరవిద్ధు, న్నని ¯ రుద్ధున్, మహితప్రబుద్ధు, రూపసమృద్ధున్. (386) ఇట్లు కట్టిత్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తయై యుండె నంత. (387) నీలపటాంచితమై సువి ¯ శాలంబై వాయునిహతిఁ జండధ్వని నా ¯ భీలమగు నతని కేతన ¯ మాలోన నకారణంబ యవనిం గూలెన్. (388) అది చూచి దనుజపాలుఁడు ¯ మదనాంతకుఁ డాడినట్టి మాట నిజముగాఁ ¯ గదనంబు గలుగు ననుచును ¯ నెదురెదురే చూచుచుండె నెంతయుఁ బ్రీతిన్. (389) అంత నక్కడ. (390) ద్వారకలో ననిరుద్ధకు ¯ మారుని పోకకును యదుసమాజము వగలం ¯ గూరుచు నొకవార్తయు విన ¯ నేరక చింతింప నాల్గునెల లరిగె నృపా!

బాణాసురునితో యుద్ధంబు

(391) అయ్యవసరంబున. (392) శారద నిర్మల నీరద ¯ పారద రుచి దేహుఁ డతుల భాగ్యోదయుఁ డా ¯ నారదముని యేతెంచె న ¯ పార దయామతి మురారిభజనప్రీతిన్. (393) ఇట్లు సనుదెంచిన యద్దివ్యమునికి నిర్మల మణివినిర్మిత సుధర్మాభ్యంతరంబున యదువృష్టిభోజాంధక వీరులు గొలువం గొలువున్న గమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి, యర్ఘ్యపాద్యాది విధులం బూజించి, సముచిత కనకాసనాసీనుంజేసిన నత్తాపసోత్తముండు పురుషోత్తము నుదాత్తతేజోనిధిం బొగడి, యనిరుద్ధు వృత్తాంతం బంతయుఁ దేటపడ నెఱింగించి, యప్పుండరీకాక్షుని చేత నామంత్రణంబు వడసి, యంతర్ధానంబు నొందెఁ; దదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వ్రేయించి, బలంబుల వెడలింప బ్రద్దలవారిం బనిచి; తానును గట్టాయితంబయ్యె; నంత. (394) హార కిరీట కేయూర కంకణ కట¯ కాంగుళీయక నూపురాది వివిధ ¯ భూషణప్రతతిచేఁ బొలుపారు కరముల¯ ఘనగదా శంఖ చక్రములు దనర ¯ సురభి చందన లిప్త సురుచి రోరస్థ్సలిఁ¯ బ్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడఁ ¯ జెలువారు పీత కౌశేయచేలము కాసె¯ వలనుగా రింగులువాఱఁ గట్టి (394.1) శైబ్య సుగ్రీవ మేఘ పుష్పక వలాహ ¯ కములఁ బూన్చిన తే రాయితముగఁ జేసి ¯ దారుకుఁడు దేర నెక్కె మోదం బెలర్ప ¯ భానుఁ డుదయాచలం బెక్కు పగిది మెఱసి. (395) ఇట్లు రథారోహణంబు సేసి, భూసురాశీర్వచన పూతుండును, మహితదుర్వాంకు రాలంకృతుండును, లలితపుణ్యాంగనా కరకిసలయకలిత శుభాక్షత విన్యాస భాసురమస్తకుండును, మాగధ మంజుల గానానుమోదితుండును, వందిజనసంకీర్తనా నందితుండును, బాఠక పఠనరవ వికాసిత హృదయుండును నయి వెడలు నవసరంబున. (396) బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖ యదు¯ వృష్ణి భోజాంధక వీరవరులు ¯ దుర్వార పరిపంథి గర్వ భేదన కళా¯ చతురబాహాబలోత్సాహలీల ¯ వారణ స్యందన వాజి సందోహంబు¯ సవరణ సేయించి సంభ్రమమున ¯ సముచిత ప్రస్థాన చటుల భేరీ భూరి¯ ఘోష మంభోనిధి ఘోష మఁడఁప (396.1) ద్వాదశాక్షౌహిణీ బలోత్కరము లోలి ¯ నడచెఁ గృష్ణునిరథము వెన్నంటి చెలఁగి ¯ పృథులగతి మున్ భగీరథు రథము వెనుక ¯ ననుగమించు వియన్నది ననుకరించి. (397) ఇవ్విధంబునం గదలి కతిపయప్రయాణంబుల శోణపురంబు సేరంజని వేలాలంఘనంబు సేసి యదువీరు లంత. (398) సరిదారామ సరోవరోపవన యజ్ఞస్థానముల్‌ మాపి వే ¯ పరిఖల్‌ పూడిచి యంత్రముల్‌ దునిమి వప్రవ్రాతముల్‌ ద్రొబ్బి గో¯ పురముల్‌ గూలఁగఁ ద్రోచి సౌధ భవనంబుల్‌ నూకి ప్రాకారముల్‌¯ ధరణిం గూల్చి కవాటముల్‌ విఱిచి రుద్దండక్రియాలోలురై. (399) ఇట్లనేక ప్రకారంబులు గాసిచేసి, పురంబు నిరోధించి పేర్చి యార్చినంజూచి యాగ్రహసమగ్రోగ్రమూర్తియై బాణుండు సమరసన్నాహసంరంభ విజృంభమాణుండై సంగరభేరి వ్రేయించిన. (400) ఆ చక్రవాళాచలాచక్ర మంతయు¯ బలసి కుమ్మరిసారె పగిదిఁ దిరిగె ¯ ఘన ఘోణి ఖుర కోటిఘట్టిత నదముల¯ కరణి నంభోనిధుల్‌ గలఁగి పొరలెఁ ¯ గాలరుద్రాభీల కర శూలహతి రాలు¯ పిడుగుల గతి రాలె నుడుగణంబు ¯ చటులానిలోద్ధూత శాల్మలీతూలంబు¯ చాడ్పున మేఘముల్‌ చదలఁ దూలె (400.1) గిరులు వడఁకాడె దివి పెల్లగిల్లె సురల ¯ గుండె లవిసె రసాతలక్షోభ మొదవె ¯ దిక్కు లదరె విమానముల్‌ తెరలి చెదరెఁ ¯ గలఁగి గ్రహరాజ చంద్రుల గతులు దప్పె. (401) అట్టి సమర సన్నాహంబునకుఁ గట్టాయితంబై, మణిఖచితభర్మ వర్మ నిర్మలాంశు జాలంబులును, శిరస్త్రాణ కిరీట కోటిఘటిత వినూత్న రత్నప్రభాపటలంబులును, గనకకుండల గ్రైవేయ హార కంకణ తులాకోటి వివిధభూషణవ్రాత రుచి నిచయంబులును, బ్రచండబాహుదండ సహస్రంబున వెలుంగుచు శర శరాసన శక్తి ప్రాస తోమర గదా కుంత ముసల ముద్గర భిందిపాల కరవాల పట్టిస శూల క్షురికా పరశు పరిఘాది నిశాత హేతివ్రాత దీధితులును, వియచ్చరకోటి నేత్రంబులకు మిఱుమిట్లు గొలుపం గనకాచలశృంగ సముత్తుంగం బగు రథంబెక్కి యరాతివాహినీ సందోహంబునకుం దుల్యంబైన నిజసేనాసమూహంబు లిరుగడల నడవ బాణుం డక్షీణప్రతాపంబు దీపింప ననికివెడలె; నయ్యవసరంబున.

శివ కృష్ణులకు యుద్ధ మగుట

(402) వరదుఁ డుదార భక్తజనవత్సలుఁడైన హరుండు బాణునిం ¯ గర మనురక్తి నాత్మజులకంటె దయామతిఁ జూచుఁ గానఁ దా ¯ దురమొనరించువేడ్క బ్రమథుల్‌ గుహుఁడున్ నిజభూతకోటియున్¯ సరస భజింప నుజ్జ్వల నిశాతభయంకరశూలహస్తుఁ డై. (403) ఖరపుటాహతి రేఁగు ధరణీపరాగంబు¯ పంకేరుహాప్తబింబంబుఁ బొదువ ¯ విపులవాలాటోప విక్షేపజాత వా¯ తాహతి వారివాహములు విరయఁ ¯ గుఱుచ తిన్నని వాఁడికొమ్ములఁ జిమ్మిన¯ బ్రహ్మాండభాండ కర్పరము వగుల ¯ నలవోక ఖణి ఖణిల్లని ఱంకె వైచిన¯ రోదసీకుహరంబు భేదిలంగ (403.1) గళ చలద్భర్మఘంటికా ఘణఘణప్ర ¯ ఘోషమున దిక్తటంబు లాకులత నొంద ¯ లీల నడతెంచు కలధౌతశైల మనఁగ ¯ నుక్కు మిగిలిన వృషభేంద్రు నెక్కి వెడలె. (404) ఇట్లు వెడలి సమరసన్నాహ సముల్లాసంబు మొగంబులకు వికాసంబు సంపాదింపం బ్రతిపక్షబలంబులతోడం దలపడిన ద్వంద్వయుద్ధం బయ్యె; నప్పుడ ప్పురాతన యోధుల యా యోధనంబుఁ జూచు వేడ్కం జనుదెంచిన, సరసిజసంభవ శక్ర సుర యక్ష సిద్ధ సాధ్య చారణ గంధర్వ కిన్నర కింపురుష గరుడోర గాదులు నిజ విమానారూఢులై వియత్తలంబున నిలిచి; రట్టియెడం గృష్ణుండును హరుండును, మారుండును గుమారుండును, గూపకర్ణ కుంభాండులును, గామపాలుండును బాణుపుత్త్రుండగు బలుండును, సాంబుండును; సాత్యకియును బాణుండును, రథికులు రథికులును, నాశ్వికులు నాశ్వికులును, గజారోహకులు గజారోహకులును, బదాతులు పదాతులునుం దలపడి యితరేతర హేతిసం ఘట్టనంబుల మిణుఁగుఱులు సెదరం బరస్పరాహ్వాన బిరుదాం కిత సింహనాద హుంకార శింజినీటంకార వారణ ఘీంకార వాజి హేషారవంబులను, బటహ కాహళ భేరీ మృదంగ శంఖ తూర్య ఘోషంబులను బ్రహ్మాండకోటరంబు పరిస్ఫోటితంబయ్యె; నయ్యవసరంబున. (405) జలరుహనాభుఁ డార్చి నిజ శార్‌ఙ్గ శరాసన ముక్త సాయకా ¯ వలి నిగుడించి నొంచెఁ బురవైరి పురోగములన్ రణక్రియా ¯ కలితుల గుహ్యకప్రమథ కర్బుర భూతపిశాచ డాకినీ ¯ బలవ దరాతియోధులను బ్రమ్మెరపోయి కలంగి పాఱఁగన్. (406) ఇట్లేసి యార్చిన కుంభినీధరు భూజావిజృంభణ సంరంభంబునకు సహింపక, నిటలాంబకుం డనలకణంబు లుమియు నిశితాంబకంబులం బీతాంబరునినేసిన, వానినన్నింటి నడుమన ప్రతిబాణంబు లేసి చూర్ణంబు సేసినం గనుంగొని మఱియును. (407) అనలాక్షుండు త్రిలోకపూజ్యమగు బ్రహ్మాస్త్రం బరింబోసి యా ¯ వనజాతేక్షణు మీఁదఁ గ్రోధమహిమవ్యాకీర్ణుఁ డై యేసె; నే ¯ సినఁ దద్దివ్యశరంబుచేతనె మఱల్చెం గృష్ణుఁ డత్యుద్ధతిన్ ¯ జనితాశ్చర్య రసాబ్ధిమగ్ను లగుచున్ శక్రాదు లగ్గింపఁగన్. (408) వాయవ్యాస్త్ర ముపేంద్రుపై నలిగి దుర్వారోద్ధతిన్నేయ దై ¯ తేయధ్వంసియుఁ బార్వతాశుగముచేఁ ద్రెంచెం; గ్రతుధ్వంసి యా¯ గ్నేయాస్త్రం బడరించె నుగ్రగతి లక్ష్మీనాథుపై; దాని వే ¯ మాయం జేసెను నైంద్రబాణమునఁ బద్మాక్షుండు లీలాగతిన్. (409) మఱియును. (410) పాయని కిన్కతో హరుఁడు పాశుపతాస్త్రము నారిఁ బోసినన్; ¯ దోయరుహాయతాక్షుఁడునుఁ దోడన లోకభయంకరోగ్ర నా ¯ రాయణబాణరాజము రయంబున నేసి మరల్చె దానిఁ జ¯ క్రాయుధుఁ డిత్తెఱంగునఁ బురారి శరావలి రూపుమాపినన్. (411) ఊహ కలంగియు విగతో¯ త్సాహుండగు హరునిమీఁద జలజాక్షుడు స¯ మ్మోహన శిలీముఖం బ¯ వ్యాహత జయశాలి యగుచు నడరించె నృపా! (412) అట్లేసిన. (413) జృంభణశరపాతముచే ¯ శంభుఁడు నిజతనువు పరవశం బయి సోలన్ ¯ జృంభితుఁడై ఘననిద్రా ¯ రంభత వృషభేంద్రు మూఁపురముపై వ్రాలెన్. (414) ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణ పరంపరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు నివ్విధంబునఁ బీనుంగుపెంటలఁ గావించె; నంత. (415) తఱిమి మురాంతకాత్మజుఁ డుదాత్తబలంబున బాహులేయుపైఁ¯ గఱకరిఁ దాఁకి తీవ్రశితకాండ పరంపరలేసి నొంపఁగా ¯ నెఱఁకులు గాఁడిపైఁ దొరఁగు నెత్తుటఁ జొత్తిలి వైరు లార్వఁగాఁ ¯ బఱచె మయూరవాహనముఁ బైకొని తోలుచు నాజిభీతుఁడై. (416) పంబి రణక్షితిన్ శరవిపాటిత శాత్రవవీరుఁ డైన యా ¯ సాంబుఁడు హేమపుంఖశిత సాయకజాలము లేర్చి భూరి కో ¯ పంబున నేసినన్ బెదరి బాణతనూభవుఁ డోడి పాఱె శౌ ¯ ర్యంబును బీరముం దగవు నాఱడివోవ బలంబు లార్వఁగన్. (417) వరబాహాబలశాలి యా హలి రణావష్టంభ సంరంభ వి¯ స్ఫురదుగ్రాశనితుల్యమైన ముసలంబుం బూన్చి వ్రేసెన్ బొరిం¯ బొరిఁ గుంభాండక కూపకర్ణులు శిరంబుల్‌ వ్రస్సి మేదంబు నె¯ త్తురుఁ గర్ణంబుల వాతనుం దొరఁగ సంధుల్‌ వ్రీలి వే చావఁగన్. (418) అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడి, విఱిగి పాఱినం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియుం బోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురిగొల్పి తానును ముంగలి యై నడచె; నప్పు డుభయసైన్యంబు లన్యోన్య జయకాంక్షం దలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీఁకం దాఁకినం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ గదల నడిచియుఁ, గుఠారంబులఁ బొడిచియు; సురియలం గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుఁ, జక్రంబులం ద్రుంచియు, ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియుఁ; గుంతంబుల గ్రుచ్చియుఁ, బంతంబు లిచ్చియుఁ; బరిఘంబుల నొంచియుఁ, బట్టిసంబులం ద్రుంచియు శరంబుల నేసియుఁ, గరవాలంబుల వ్రేసియు, సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియుఁ బెనఁగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును, నులిసిన మేనులును, నలిసిన జానువులును, నొగిలిన వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబు లయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన కర్ణంబులును, విచ్ఛిన్నంబులైన నయనంబులును, వెడలు రుధిరంబులును, బడలుపడు బలంబులును, గొండల వడువునంబడు మాంసఖండంబులును, వాచఱచు కొఱప్రాణంబులును, వ్రాలిన తేరులును,గూలిన కరులును, నొఱగిన గుఱ్ఱంబులును, దెరలిన కాలుబలంబులును గలిగి; పలలఖాదన కుతూహల జనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకలదిశావకాశం బయి సంగరాంగణంబు భీషణంబయ్యె; నయ్యవసరంబున. (419) శరకుముదంబు లుల్లసితచామర ఫేనము లాతపత్ర భా ¯ సుర నవపుండరీకములు శోణితతోయము లస్థి సైకతో ¯ త్కరము భుజాభుజంగమనికాయము కేశకలాప శైవల¯ స్ఫురణ రణాంగణం బమరెఁ బూరిత శోణనదంబు పోలికన్. (420) అట్టియెడ బాణుండు గట్టలుకం గృష్ణునిపైఁ దనరథంబుఁ బఱపించి, యఖర్వబాహాసహస్ర దుర్వారగర్వాటోప ప్రదీప్తుండై కదిసి. (421) ఒక యేనూఱు కరంబులన్ ధనువు లత్యుగ్రాకృతిం దాల్చి త¯ క్కక యొక్కొక్కట సాయకద్వయము వీఁకంబూన్చు నాలోన నం¯ దకహస్తుండు తదుగ్రచాపచయ విధ్వంసంబు గావించి కొం ¯ జక తత్సారథిఁ గూలనేసి రథముం జక్కాడి శౌర్యోద్ధతిన్. (422) ప్రళయ జీమూత సంఘాత భయద భూరి ¯ భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య ¯ మఖిలజనులు భయభ్రాంతులయి చలింపఁ ¯ గడఁగి నిర్భిన్న రాక్షసీగర్భముగను. (423) అట్టి యవక్ర విక్రమ పరాక్రమంబునకు నెగడుపడి బాణుండు లేటమొగంబు వడి చేయునదిలేక విన్ననయి యున్నయెడ. (424) అత్తఱిఁ గోటర యను బాణ జనయిత్రి¯ సుతుఁ గాచు మతము సన్మతిఁ దలంచి ¯ వీడి శిరోజముల్‌ వ్రేలంగ నిర్ముక్త¯ పరిధానయై మురాసురవిభేది ¯ యెదుర నిల్చినఁ జూడ మదిఁ జాల రోసి ప¯ రాఙ్ముఖుఁడై యున్న ననువు వేచి ¯ తల్లడించుచు బాణుఁడుల్లంబు గలగంగఁ¯ దలచీర వీడ యాదవులు నవ్వ (424.1) నవ్యకాంచనమణిభూషణములు రాలఁ ¯ బాదహతి నేలఁ గంపింపఁ బాఱి యాత్మ ¯ పురము వడిఁజొచ్చె నప్పుడు భూతగణము ¯ లాకులతతోడ నెక్కడే నరుగుటయును.

మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు

(425) శిరములు మూఁడును ఘన భీ ¯ కరపదములు మూఁడుఁ గలిగి కనలి మహేశ¯ జ్వర మురు ఘోరాకృతితో ¯ నరుదేరఁగఁ జూచి కృష్ణుఁ డల్లన నగుచున్. (426) పరువడి వైష్ణవజ్వరముఁ బంచిన నయ్యుభయజ్వరంబులున్ ¯ వెరవును లావుఁ జేవయును వీరము బీరము గల్గి ఘోర సం¯ గర మొనరింప నందు గరకంఠకృతజ్వర ముగ్రవైష్ణవ¯ జ్వరమున కోడి పాఱె ననివారణ వైష్ణవివెంట నంటఁగన్. (427) పాఱి యే దిక్కుఁ గానక ప్రాణభీతి ¯ నెనసి యేడ్చుచు నా హృషీకేశు పాద ¯ కంజములఁ బడి ననుఁ గావు కావు మనుచు ¯ నిటలతట ఘటితాంజలిపుటయు నగుచు. (428) ఇట్లు వినుతించె. (429) "అవ్యయు, ననఘు, ననంతశక్తిని, బరు¯ లయినట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర ¯ వరుల కీశ్వరుఁ డైనవాని, సర్వాత్మకు¯ జ్ఞానస్వరూపు, సమానరహితు, ¯ వరదుని, జగదుద్భవస్థితి సంహార¯ హేతుభూతుని, హృషీకేశు, నభవు, ¯ బ్రహ్మచిహ్నంబులై పరఁగు సుజ్ఞాన శ¯ క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు, నీశు, (429.1) నజు, షడూర్మిరహితు, నిజయోగమాయా వి ¯ మోహితాఖిలాత్ము, ముఖ్యచరితు, ¯ మహితతేజు, నాదిమధ్యాంతహీనునిఁ, ¯ జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ! (430) అదియునుం గాక లోకంబున దైవం బనేక ప్రకారంబులై యుండు; నది యెట్టిదనినం గళాకాష్ఠాముహూర్తంబులనంగల కాలంబును, సుకృత దుష్కృతానుభవ రూపంబు లైన జీవకర్మంబులును స్వభావంబును, సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును, సకలపదార్థ పరిజ్ఞాన కారణం బైన యంతఃకరణంబును, మహదహంకార శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవ నానల సలిల ధరాది పంచభూతంబు లాదిగాఁ గల ప్రకృతి వికారంబులును, నన్నింటి సంఘాతంబును, బీజాంకుర న్యాయంబునం గార్యకారణరూప ప్రవాహంబును నై, జగత్కారణ శంకితం బై యుండు; నది యంతయు భవదీయ మాయా విడంబనంబు గాని యున్నయది కాదు; తదీయ మాయానివర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గ గతులం గ్రూరాత్ముల హింసించుచుందువు; విశ్వ! విశ్వంభరాభార నివారణంబు సేయుటకుఁ గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు; గావున నిన్ను శరణంబు వేఁడెద. (431) శాంతమై మహితతీక్ష్ణ సుదుస్సహంబై యు¯ దారమై వెలుగొందు తావకీన ¯ భూరిభాస్వత్తేజమునఁ దాప మొందితిఁ¯ గడుఁ గృశించితి, నన్ను గరుణఁజూడు ¯ మితరదేవోపాస్తిరతి మాని మీ పాద¯ కమలముల్‌ సేవించు విమలబుద్ధి ¯ యెందాక మది దోఁప దందాఁకనే కదా¯ ప్రాణులు నిఖిలతాపములఁ బడుట? (431.1) యవిరళానన్యగతికుల నరసి ప్రోచు ¯ బిరుదుగల నీకు ననుఁ గాచు టరుదె? దేవ! ¯ ప్రవిమలాకార! సంసారభయవిదూర! ¯ భక్తజనపోషపరితోష! పరమపురుష!" (432) అనినఁ బ్రసన్నుఁడై హరి, యనంతుఁడు, దైత్యవిభేది దాని కి¯ ట్లనియె "మదీయ సాధన మనన్యనివారణమౌట నీ మదిం ¯ గని నను నార్తిఁ జొచ్చితివి గావున మజ్జ్వర తీవ్ర దాహ వే ¯ దన నినుఁ బొంద దింకఁ బరితాపము దక్కుము నీ మనంబునన్." (433) అని మఱియు నప్పుండరీకాక్షుండిట్లను “నెవ్వరేనియు నీ యుభయజ్వర వివాదంబును, నీవు మత్ప్రపత్తిం జొచ్చుటయునుఁ జిత్తంబులం దలంతు రట్టి పుణ్యాత్ములు శీతోష్ణజ్వరాది తాపంబులఁ బొర య” రని యానతిచ్చిన నమ్మహేశ్వరజ్వరంబు పరమానందభరిత హృదయంబై యారథాంగపాణికి సాష్టాంగదండప్రణామం బాచరించి నిజేచ్ఛం జనియె; నంత బాణాసురుండు నక్కడ. (434) కమనీయ కింకిణీఘంటికా సాహస్ర¯ ఘణఘణధ్వనిచేత గగన మగల ¯ నన్యజనాలోకనాభీలతరళోగ్ర¯ కాంచనధ్వజపతాకలు వెలుంగఁ ¯ బృథునేమి ఘట్టనఁ బృథివి కంపింపంగ¯ వలనొప్పు పటుజవాశ్వములఁ బూన్చి ¯ నట్టి యున్నతరథం బత్యుగ్రగతి నెక్కి¯ కరసహస్రమున భీకరతరాసి (434.1) శర శరాసనముఖ దివ్యసాధనములు ¯ దనరఁ జలమును బలము నుత్కటము గాఁగ ¯ హర్ష మిగురొత్తఁ గయ్యంపుటాయితమునఁ ¯ బురము వెలువడె బలిపుత్త్రుఁ డురుజవమున. (435) చని రణభూమిని మధ్యం ¯ దిన మార్తాండప్రచండ దీప్తాకృతితోఁ ¯ దనరుచుఁ బరిపంథిబలేం ¯ ధనదవశిఖియైన కృష్ణుఁ దాఁకెం బెలుచన్. (436) తాఁకి భుజావిజృంభణము దర్పము నేర్పును నేర్పడంగ నొ¯ క్కూఁకున వేయిచేతుల మహోగ్రశరావళి పింజ పింజతోఁ ¯ దాఁకఁగ నేసినన్ మురవిదారుఁడు తోడన తచ్ఛరావళి¯ న్నాఁక గొనాకఁ ద్రుంచె నిశితార్ధశశాంక శిలీముఖంబులన్. (437) అంత. (438) నుత నవపుండరీకనయనుం డన నొప్పు మురారి రోష ఘూ ¯ ర్ణిత మహితారుణాబ్జదళనేత్రుఁడు దా నటు పంచె దైత్యుపై ¯ దితిసుత కాననప్రకరదీపితశుక్రము రక్షితాంచితా ¯ శ్రితజన చక్రమున్ సతతసేవితశక్రము దివ్యచక్రమున్. (439) అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభావిడంబితంబును, భీషణ శతసహస్రకోటి దంభోళినిష్ఠురనిబిడనిశితధారాసహస్ర ప్రభూతజ్వలన జ్వాలికాపాస్త సమస్తకుటిల పరిపంథి దుర్వార బాహాఖర్వ గర్వాంధకారంబును, సకల దిక్పాల దేవతాగణ జేగీయమానంబును, సమదదానవజన శోకకారణ భయంకర దర్శనంబును, సమంచిత సజ్జనలోకప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనం బసురాంతక ప్రేరితంబై చని, యారామకారుండు కదళికా కాండంబుల నేర్చు చందంబునం బేర్చి సమద వేదండ శుండాదండంబుల విడంబించుచుఁ గనకమణివలయ కేయూర కంకణాలంకృతంబు నగు తదీయ బాహా సహస్రంబుఁ గరచతుష్ట యావశిష్టంబుగాఁ దునుము నవసరంబున. (440) కాలకంఠుఁడు బాణుపైఁ గరుణ గలఁడు ¯ గాన నఖిలాండపతిఁ గృష్ణుఁ గదియవచ్చి ¯ పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్జుఁ ¯ డగుచుఁ బద్మాయతాక్షు నిట్లని స్తుతించె.