పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : ద్వాదశ 31 - సంపూర్ణం

మార్కండేయోపాఖ్యానంబు

(31) "తొల్లిటి యుగమునఁ దపములఁ బల్లిదులగు ఋషుల మహిమ భాషింపఁగ రం జిల్లెడు మార్కండేయుం డుల్లంబున హరిని నిలిపి యుడుగక బ్రదికెన్. (32) లోకంబులు గల్పాంతసమయంబునం గబంధమయంబులయి, యంధ కార బంధురంబులయి యున్నయెడ నేకాకి యయి చరించుచు బాలార్కకోటి తేజుం డయిన బాలుని హృదయంబునం బ్రవేశించి యనేక సహస్ర వత్సరంబులు దిరిగి వటపత్రశాయి యయిన యబ్బాలునిఁ గ్రమ్మఱఁ గనియె” నని చెప్పిన శౌనకాదులు సూతునిం గనుగొని, “యా మునీంద్రునకు నీ ప్రభావం బెట్లుగలిగె?”నని యడిగిన నతం డిట్లనియె. (33) "భూవినుత! బ్రహ్మచర్యము దా వదలక నిష్ఠచేతఁ దథ్యము గాఁగన్ భావించి హరిఁదలంచుచుఁ గోవిదనుతుఁడై మృకండు గుణముల వెలసెన్. (34) ఇట్లుదపంబు సేయు నతనికి హరిహరులు ప్రత్యక్షంబయి “వరం బడుగు” మనిన గుణగణాఢ్యుం డయిన కుమారు నడిగిన ”నట్ల కాక” యని యతండు గోరిన వరంబిచ్చి యంతర్ధానంబు నొంది; రనంతరంబ యమ్మునికి మార్కండేయుం డుదయించి నియమ నిష్ఠా గరిష్ఠు డయి యుండ; మృత్యువు వానిం బాశబద్ధుం జేసిన నెదిర్చి మిత్తిని ధిక్కరించి, పదివేల హాయనంబులు తపంబు సలుప, నింద్రుండు భయంపడి యమ్ముని వరుని యుగ్రతపంబు భంగపఱచుటకు దేవతాంగనలం బంప, వారే తెంచునెడఁ బుష్పఫలభరితంబును; మత్తమధుకర శుక పికాది శకుం తలారవ నిరంతర దిగంతరంబును; జాతివైర రహిత మృగ పక్షికుల సంకులంబును, సారస చక్రవాక బక క్రౌంచ కారండవ కోయష్టి కాది జలవిహంగమాకులిత సరోవర సహస్ర సందర్శనీయంబును నగు నా తపోవనంబున జటావల్కలధారి యై హవ్యవాహనుండునుంబోలెఁ దపంబు సేయు మునీంద్రునిం గని యయ్యంగనలు వీణావేణు వినోద గానంబుల నలవరింప మెచ్చక ధీరోదాత్తుం డగు నమ్మునీంద్రుని గెల్వనోపక యింద్రుని కడకుం జని; రంత హరి యతని తపంబునకుఁ బ్రసన్నుండై యావిర్భవించినం గనుగొని ”దేవా! నీ దివ్యనామస్మరణంబునంజేసి యీ శరీరంబుతోడన యనేక యుగంబులు బ్రదుకు నట్లు గాఁజేయవే” యనినం గరుణించి యిచ్చుటయును. (35) "జగము రక్షింప జీవులఁ జంప మనుపఁ గర్తవై సర్వమయుఁడవై కానిపింతు వెచట నీ మాయఁ దెలియంగ నెవ్వఁ డోపు? విశ్వసన్నుత! విశ్వేశ! వేదరూప! (36) బలభిన్ముఖ్య దిశాధినాథవరులున్ ఫాలాక్ష బ్రహ్మాదులున్ జలజాతాక్ష! పురంద రాది సురులుం జర్చించి నీ మాయలం దెలియన్ లేరఁట! నా వశంబె తెలియన్? దీనార్తినిర్మూల! యు జ్జ్వలపంకేరుహపత్రలోచన! గదాచక్రాంబుజాద్యంకితా!" (37) అని వినుతించి, “దేవా! నీ మాయం జేసి జగంబు భ్రాంతం బై యున్నయది; యిది దెలియ నానతీవలయు” నని యడిగిన నతండు నెఱింగించి చనియె, మునియును శివపూజ సేయుచు హరిస్మరణంబు సేయ మఱచి శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్షంబుచే ధరాతలంబు నింప, జలమయంబై యంధకారబంధురబైన, నంత నా తిమిరంబునం గన్నుగానక భయంపడి యున్నయెడ నా జలమధ్యంబున నొక వటపత్రంబునం బద్మరాగ కిరణపుంజంబుల, రంజిల్లు పాదపద్మంబులుగల బాలునిం గని, మ్రొక్కి యతని శరీరంబు ప్రవేశించి, యనేక కాలం బనంతం బగు జఠరాంతరంబునం దిరిగి; యతని చరణారావింద సంస్మరణంబు సేసి; వెలువడి కౌఁగలింపంబోయిన మాయఁ గైకొని యంతర్ధానంబునొంద; మునియు నెప్పటియట్ల స్వాశ్రమంబు సేరి తపంబు సేయుచున్న సమయంబున. (38) నిలిచిన శంకరుం గనియు, నిత్యసుఖంబుల నిచ్చు గౌరి యి మ్ముల "హర! భూతిభూషణసముజ్జ్వలగాత్రునిఁ గంటె, యెంతయున్ వలనుగ వానితోడ నొక వాటపుమాటను బల్కఁగాఁ దగున్ సలలితమైన యీ తపసి జాడ వినంగడు వేడ్క యయ్యెడిన్." (39) అనిన శంకరుండును శాంకరీసమేతుం డయి నభంబుననుండి ధరణీ తలంబునకు నేతెంచి యితరంబు గానక యేకాగ్రచిత్తుండగు నమ్మునిం గని తన దివ్యయోగమాయా ప్రభావంబుచేత నతని హృదయంబునం బ్రవేశించి చతుర్బాహుండును, విభూతి రుద్రాక్షమాలికాధరుండును, ద్రిశూల డమరుకాది దివ్యసాధన సమేతుండును, వృషభవాహ నారూఢుండును, నుమాసమేతుండునై తన స్వరూపంబు గనంబఱచిన విస్మయంబునొంది యమ్ముని యా పరమేశ్వరుని ననేక ప్రకారంబుల స్తుతియించిన, నప్పు డమ్ముని తపఃప్రభావంబునకు మెచ్చి “మహాత్మా! పరమశైవుండ” వని పరమేశ్వరుం డానతిచ్చిన మార్కండేయుండును శంకరు నిరీక్షించి, “దేవా! హరిమాయాప్రభావంబు దుర్లభం; బయ్యది భవత్సందర్శనంబునం గంటి; నింతియచాలు; నైన నొక్కవరంబు గోరెద; నారాయణచరణాంబుజ ధ్యానంబును, మృత్యుంజయంబునుం గలుగు నట్లు గాఁగృప సేయవే” యని ప్రార్థించినఁ గృపాసముద్రుండై “యట్లగాక” యని “జరారోగవికృతులు లేక కల్పకోటి పర్యంతంబు నాయువుం, బురుషోత్తముని యనుగ్రహంబుఁ గలుగు” నని యానతిచ్చి యమ్మహాదేవుం డతర్ధానంబు నొందె” నని చెప్పి యీ మార్కండేయోపాఖ్యానంబు వ్రాసిన వినినం జదివినను మృత్యువు దొలంగు నని మఱియు నిట్లనియె; హరి పరాయణుం డగు భాగవతుండు దేవతాతంర మంత్రాంతర సాధనాంతరంబులు వర్జించి, దుర్జనులం గూడక నిరంతరంబు నారాయణ గోవిందాది నామస్మరణంబు సేయుచునుండె నేని నట్టి పుణ్యపురుషుండు వైకుంఠంబున వసియించు; మఱియు హరి విశ్వరూపంబును జతుర్విధ వ్యూహభేదంబును, జతుర్మూర్తులును, లీలావతారంబులును జెప్ప నగోచరంబు" లనిన శౌనకుం డిట్లనియె. (40) "హరికథలు, హరిచరిత్రము, హరిలీలావర్తనములు నంచిత రీతిం బరువడి నెఱిఁగితి మంతయుఁ సురనుత! యనుమాన మొకటి సొప్పడెడి మదిన్.

ద్వాదశాదిత్య ప్రకారంబు

(41) అది యెయ్యది యనిన లోకచక్షువు చైత్రమాసంబు మొదలుగా నేయే మాసంబున నేయే నామంబునం బ్రవర్తించుం; జెప్పవే” యని యడిగినఁ “జైత్రంబుననుండి చైత్రాది ద్వాదశమాసంబుల సౌరగణ సప్తకం బీశ్వర నియుక్తంబై నానాప్రకారంబుల సంచరించు; నా క్రమంబు దొల్లి శుకుండు విష్ణురాతునికిఁ దెలిపిన చందంబునం జెప్పెద” నని సూతుం డిట్లనియె “శ్రీమన్నారాయణ స్వరూపుం డగు మార్తాండుం డేకస్వరూపుం డైన, నతనిం గాల దేశ క్రియాది గుణములం బట్టి ఋషు లనేక క్రమంబులఁ నభివర్ణించి భావించుచున్నవా; రా ప్రకారం బెట్లనినఁ జైత్రంబున సూర్యుండు ధాత యను నామంబు దాల్చి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుండు, తుంబురుండు ననెడు పరిజనులతోఁ జేరికొని సంచరించు; వైశాఖంబున నర్యముండను పేరు వహించి పులహుం, డోజుండు, ప్రహేతి, పుంజికస్థలి, నారదుండు, కంజనీరుం డను ననుచరసహితుండై కాలంబు గడుపుచుండు; జ్యేష్ఠంబున మిత్రాభిదానంబున నత్రి, పౌరుషేయుండు, తక్షకుండు, మేనక, హాహా, రథస్వనుండను పరిజనులతోడం జేరి వర్తించుచుండు; నాషాఢంబున వరుణుండను నాహ్వయంబు నొంది వసిష్టుండు, రంభ, సహజన్యుండు, హూహువు, శుక్రుండు, చిత్రస్వనుండను సహచర సహితుండై కాలక్షేపంబు సేయుచుండు; శ్రావణంబున నింద్రుండను నామంబుచే వ్యవహృతుండై విశ్వవసువు, శ్రోత, యేలాపుత్రుం, డంగిరసుండు, ప్రమ్లోచ, చర్యుండను సభ్యులతోఁ జేరి కాలంబు గడుపుచుండు; భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాల్చి యుగ్రసేనుండు, వ్యాఘ్రుం, డాసారుణుండు, భృగు, వనుమ్లోచ, శంఖపాలుండు లోనుగాఁ గల పరిజనులతో నావృతుండై కాలయాపనంబు సేయుచు నుండు. (42) ధరలోఁద్వష్ట్రాహ్వయమును నిరవుగ ధరియించి ధాత్రికింపుదలిర్పం జరియించుచు నభమందున్ సరసిజహితుఁడాశ్వయుజము సయ్యనఁగడుపున్ (43) ఈ మాసంబున ఋచీకతనయుండు, కంబళాశ్వుండు, తిలోత్తమ, బ్రహ్మోపేతుండు, శతజిత్తు, ధృతరాష్ట్రుం, డిషంభరులను సభ్యులతోడఁ గూడి కాలంబు గడుపుచుండుఁ; గార్తికమాసంబున విష్ణువని వ్యవహరింపఁ బడి యశ్వతరుండు, రంభ, సూర్యవర్చసుఁడు, సత్యజిత్తు, విశ్వామిత్రుండు, మఘాపేతుఁ డను పరిజనవర్గంబుతోఁ గూడి కాలంబు నడపుచుండు; మార్గశిరంబునం దర్యమ నామ వ్యవహృతుండై కశ్యపుండు, తార్క్ష్యుండు, ఋతసేనుం, డూర్వశి, విద్యుచ్ఛత్రుఁడు, మహాశంఖుం డనెడు ననుచరులం గూడి చరించుచుండుఁ; బుష్యమాసంబున భగుండను నామంబు దాల్చి స్ఫూర్జుం, డరిష్టనేమి, యూర్ణుం, డాయువు, కర్కోటకుండు, పూర్వచిత్తి యనెడు సభ్యజన పరివృతుండై కాలక్షేపంబు సేయుచు నుండు; మాఘమాసంబునఁ బూషాహ్వయంబు వహించి ధనంజయుండు, వాతుండు, సుషేణుండు, సురుచి, ఘృతాచి, గౌతముండను పరిజన పరివృతుండై చరియించుచు నుండు. (44) క్రతు నామంబు ధరించియుఁ జతురతఁ బాలించుచుండుఁ జాతుర్యకళా రతుఁడై సహస్రకిరణుఁడు మతియుతు లౌననఁ దపస్యమాసము లీలన్. (45) అందు వర్చసుండు, భరద్వాజుండు, పర్జన్యుండు, సేనజిత్తు, విశ్వుం, డైరావతుం డనువారలతో నెనసి కాలయాపనంబు సేయుచుండు; నిట్లు ద్వాదశమాసంబుల నపరిమేయ విభూతులచేఁ దేజరిల్లుచు నుభయ సంధ్యల నుపాసించు జనుల పాపసంఘంబుల నున్మూలనంబు సేయుచుఁ, బ్రతిమాసంబును బూర్వోక్త పరిజన షట్కంబు వెంటనంట నుభయలోక నివాసులగు జనంబుల కైహికాముష్మికఫలంబుల నొసంగుచు ఋగ్యజు స్సామాధర్వణ మంత్రంబులఁ బఠియించుచు, ఋషి సంఘంబులు స్తుతియింపఁ బురోభాగంబున నప్సరస లాడ, గంధర్వులు పాడ, బ్రహ్మ వేత్తలగు నఱువదివేవురు వాలఖిల్యమహర్షు లభిముఖులై నుతించుచు నరుగ, నధిక బలవేగ విరాజమానంబులగు నాగరాజంబులు రథోన్నయనంబు సలుప, బాహాబల ప్రతిష్ఠాగరిష్ఠులగు నైరృత శ్రేష్ఠులు రథ పృష్టభాగంబు మోచి త్రోయుచుండ ననాది నిధనుండగు నాదిత్యుండు ప్రతికల్పంబున నిట్లు కాలయాపనంబు సేయుచుఁ దేజరిల్లచుండు; నట్లు గావున నివి యన్నియు వాసుదేవమయంబులుగాఁ దెలియు” మని పౌరాణికోత్తముం డగు సూతుండు శుకయోగీంద్రుండు ప్రాయోపవిష్టుం డగు పరీక్షిన్నరపాలున కుపదేశించిన తెఱంగున నైమిశారణ్య వాసు లగు శౌనకాది ఋషిశ్రేష్ఠులకుఁ దెలిపె; నిట్టి పురాణరత్నం బగు భాగవతంబు వినువారును బఠియించువారును లిఖియించు వారును నాయురారోగ్యైశ్వర్యంబులు గలిగి విష్ణుసాయుజ్యంబు నొందుదు; రది యునుంగాక. (46) పుష్కరం బందు, ద్వారకాపురము నందు, మథుర యందును, రవిదిన మందు నెవఁడు పఠన సేయును రమణతో భాగవతము వాఁడు తరియించు సంసారవార్ధి నపుడ. (47) శ్రీరమణీరమణ కథా పారాయణచిత్తునకును బతికిఁ బరీక్షి ద్భూరమణున కెఱిఁగించెను సారమతిన్ శుకుఁడు ద్వాదశస్కంధములన్.

పురాణ గ్రంథ సంఖ్యలు

(48) మఱియు నష్టాదశపురాణంబు లందలి గ్రంథసంఖ్య లెట్లనిన బ్రహ్మపురాణంబు దశసహస్రగ్రంథంబు; పాద్మంబేఁ బదియైదువేలు; విష్ణుపురాణం బిరువదిమూఁడుసహస్రంబులు; శైవంబు చతుర్వింశతిసహస్రంబులు; శ్రీభాగవతం బష్టాదశసహస్రంబులు; నారదంబు పంచవింశతిసహస్రంబులు; మార్కండేయంబు నవసహస్రంబు; లాగ్నేయంబు పదియేనువేలనన్నూఱు; భవిష్యోత్తరంబు పంచశతాధికచతుర్దశసహస్రంబులు; బ్రహ్మకైవర్తం బష్టాదశసహస్రంబులు; లైగం బేకాదశసహస్రంబులు; వారాహంబు చతుర్వింశతిసహస్రంబులు; స్కాదం బెనుబదియొక్కవేల నూఱు; వామనంబు దశసహస్రంబులు; కౌర్మంబు సప్తదశసహస్రంబులు; మాత్స్యంబు చతుర్దశసహస్రంబులు; గారుడంబు పందొమ్మిది సహస్రంబులు; బ్రహ్మాండంబు ద్వాదశసహస్రంబు లిట్లు చతుర్లక్షగ్రంథ సంఖ్యాప్రమాణంబులం బ్రవర్తిల్లు నీ పదునెనిమిది పురాణంబుల మధ్యంబున నదుల యందు భాగీరథి విధంబున, దేవతల యందుఁ బద్మగర్భుని మాడ్కిఁ, దారకలందుఁ గళానిధి గరిమ, సాగరంబులందు దుగ్దార్ణవంబు చందంబున, నగంబులను హేమనగంబు భాతి, గ్రహంబుల విభావసుకరణి, దైత్యులందుఁ బ్రహ్లాదుని భంగి, మణులందుఁ బద్మరాగంబు రేఖ, వృక్షంబులందు హరిచందనతరువు రీతి, ఋషులందు నారదు మాడ్కి, ధేనువులందు గామధేనువు పోల్కి, సూక్ష్మంబులందు జీవుని తెఱంగున, దుర్జయంబు లందు మనంబు చొప్పున, వసువు లందు హవ్యవాహనుని పోఁడిమి, నాదిత్యులందు విష్ణువు కరణి, రుద్రుల యందు నీలలోహితుని రీతిని, బ్రహ్మలందు భ్రుగువు సొబగున, సిద్ధుల యందుఁ గపిలుని లీల, నశ్వంబులందుఁ నుచ్ఛైశ్శ్రవంబులాగున, దర్వీకరంబులందు వాసుకి రూపంబున, మృగములందుఁ గేసరి చెలువున, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబు క్రియ, వర్ణంబులలో నోంకారంబు నిరువున, నాయుధంబులఁ గార్ముకంబు సోయగంబున, యజ్ఞంబుల జపయజ్ఞంబు చాడ్పున, వ్రతంబులం దహింస కరణి, యోగంబు లందాత్మయోగంబు రమణ, నోషధుల యందు యవల సొబగున, భాషణంబులందు సత్యంబు ఠేవ, ఋతువులందు వసంతంబు ప్రౌఢి, మాసంబులందు మార్గశీర్షంబు మహిమ, యుగంబులందుఁ గృతయుగంబు నోజఁ దేజరిల్లు; నిట్టి భాగవతపురాణంబు పఠియించి విష్ణుసాయుజ్యంబుఁ జెందుదు" రని మఱియు నిట్లనియె. (49) "సకలాగమార్థ పారగుఁ, డకలంక గుణాభిరాముఁ, డంచిత బృందా రక వంద్య పాదయుగుఁ, డగు శుకయోగికి వందనంబు సొరిది నొనర్తున్. (50) సకలగుణాతీతు, సర్వజ్ఞు, సర్వేశు, నఖిలలోకాధారు, నాదిదేవుఁ, బరమదయారసోద్భాసితుఁ, ద్రిదశాభి, వందిత పాదాబ్జు, వనధిశయను, నాశ్రితమందారు, నాద్యంతశూన్యుని, వేదాంతవేద్యుని, విశ్వమయునిఁ, గౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుని, శంఖ చక్ర గదాసి శార్ఙ్గధరుని, (50.1) శోభనాకారుఁ, బీతాంబరాభిరాము, రత్నరాజితమకుటవిభ్రాజమానుఁ, బుండరీకాక్షు, మహనీయ పుణ్యదేహుఁ, దలతు నుతియింతు దేవకీతనయు నెపుడు." (51) అని యీ రీతి నుతించి భాగవత మాద్యంతంబు సూతుండు సె ప్పిన సంతుష్టమనస్కు లై విని మునుల్ ప్రేమంబునం బద్మనా భునిఁ జిత్తంబున నిల్పి తద్గుణములన్ భూషించుచున్ ధన్యులై చని రాత్మీయ నికేతనంబులకు నుత్సాహంబు వర్ధిల్లఁగన్.

పూర్ణి

(52) జనకసుతాహృచ్చోరా! జనకవచోలబ్ధవిపినశైలవిహారా! జనకామితమందారా! జననాదికనిత్యదుఃఖచయసంహారా! (53) జగదవనవిహారీ! శత్రులోకప్రహారీ! సుగుణవనవిహారీ! సుందరీమానహారీ! విగతకలుషపోషీ! వీరవర్యాభిలాషీ! స్వగురుహృదయతోషీ! సర్వదాసత్యభాషీ! (54) ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబు నందు రాజుల యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకారంబును, గలియుగధర్మ ప్రకారంబును, బ్రహ్మప్రళయ ప్రకారంబును, బ్రళయ విశేషంబులును, దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహారాజు మృతినొందుటయు, సర్పయాగంబును, వేదవిభాగక్రమంబును, బురాణానుక్రమణికయు, మార్కండేయోపాఖ్యానంబును, సూర్యుండు ప్రతిమాసంబును వేర్వేఱు నామంబుల వేర్వేఱు పరిజనంబులతో జేరుకొని సంచరించు క్రమంబును, తత్తత్పు రాణగ్రంథసంఖ్యలు నను కథలుగల ద్వాదశస్కంధము, శ్రీమహాభాగవత గ్రంథము సమాప్తము.

ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వేజనాః సుఖినో భవంతు!