పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : ద్వాదశ స్కంధము 1 - 30


పోతన తెలుగు భాగవతం
ద్వాదశ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీ మరుదశనపతిశయన! కామితమునిరాజయోగికల్పద్రుమ! యు ద్దామ! ఘనజనకవరనృప జామాతృవరేశ! రామచంద్రమహీశా! (2) మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె "నట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుండు వాసుదేవ నిర్యాణ పర్యంతంబుఁ దజ్జన్మ కర్మంబులు సెప్పిన విని సంతసంబంది యన్నరపాలపుంగవుండు “మహాత్మా! నారాయణ కథా ప్రపంచంబును, దద్గుణంబులును, నాచారవిధియును, జీవాత్మభేదంబును, హరిపూజావిధానంబును, జ్ఞానయోగప్రకారంబు ననునవి మొదలైనవి యెఱింగించి విజ్ఞానవంతుగాఁ జేసి మన్నించితి; వింక భావి కార్యంబు లన్నియు నెఱింగింపు” మనిన శుకుండు రాజున కిట్లనియె. (3) "నరవర! యీ ప్రశ్నమునకు సరి సెప్పఁగ రాదు; నేను సామర్థ్యముచేఁ బరికించి నీకుఁ జెప్పదఁ గర మొప్పఁగ భావికాలగతులన్ వరుసన్.

రాజుల యుత్పత్తి

(4) అందు రాజులప్రకారం బెఱింగించెద; బృహద్రథునకుఁ బురంజయుండు పుట్టు; వానికి శునకుం డనెడివాఁడు మంత్రి యై పురంజయునిం జంపి తా రాజ్యం బేలుచుండు; నంతఁ గొంతకాలంబున కతనికిం గుమారుండు దయించిన వానికిఁ బ్రద్యోతననామం బిడి పట్టంబుగట్టు; నా భూభుజునకు విశాఖరూపుం డుదయింపంగలం; డాతనికి నందివర్ధనుండు జన్మించు; నీ యేవురు నూటముప్పది యెనిమిది సంవత్సరములు వసుంధరా పరిపాలనంబునం బెంపు వడయుదురు; తదనంతరంబ శిశునాగుం డను పార్థివుం డుదయించు; నా మూర్ధాభిషిక్తునకుఁ గాకవర్ణుండు, నా రాజన్యునకు క్షేమవర్ముఁ డుదయింపఁగలం; డా పృథ్వీపతికి క్షేత్రజ్ఞుం, డతనికి విధిసారుఁడును, విధిసారున కజాతశత్రుండు, నా భూపాలునకు దర్భకుండును, దర్భకునికి నజయుండు, నతనికి నందివర్ధనుండు, నతనికి మహానందియు ననంగల శైశునాగులు పదుండ్రు నరపాలకు లుద్భవించి షష్ట్యుత్తరత్రిశతి హాయనంబులు గలికాలంబున ధరాతలం బేలుదు; రంతట మహానందికి శూద్రస్త్రీ గర్బంబున నతి బలశాలి యయిన మహాపద్మవతి యను నందనుం డుదయించు; నతనితో క్షత్రియవంశం బడంగిపోఁ గల దా సమయంబున నరపతులు శూద్రప్రాయులై ధర్మవిరహితులై తిరుగుచుండ మహాపద్మునకు సుమాల్యుం డాదిగాఁ గల యెనమండ్రు కుమారు లుదయించెదరు; వారు నూఱు సంవత్సరంబులు క్షోణితలం బేలెద; రంతటఁ గార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనియించు; నా నవనందులనొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు; నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం బీ జగతీతలంబు నేలుదు; రత్తఱి నా భూదేవుండు చంద్రగుప్తుండనువానిం దన రాజ్యం బందు నభిషిక్తుంగాఁ జేయంగలం; డంత నా చంద్రగుప్తునకు వారిసారుండును, వానికి నశోకవర్ధనుండు, నతనికి సుయశస్సును, వానికి సంయుతుఁ డమ్మహనీయునకు శాలిశూకుం, డతనికి సోమశర్ముండు, వానికి శతధన్వుండు, నవ్వీరునకు బృహద్రథుండు నుదయించెదరు; మౌర్యులతోఁజేరిన యీ పదుగురును సప్తత్రింశదుత్తర శతాబ్దంబులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు సేసెద; రా సమయంబున బృహద్రథుని సేనాపతి యగు పుష్యమిత్రుఁడు, శుంగాన్వయుఁ డతని వధించి రాజ్యంబు గైకొను; నతనికి నగ్నిమిత్రుండను నరపతి బుట్టఁగలవాఁ; డాతనికి సుజ్యేష్ఠుండు, సుజ్యేష్ఠునకు వసుమిత్రుండు, నతనికి భద్రకుండును, భద్రకునకుఁ బుళిందుండు, నా శూరునకు ఘోషుండును, వాని కి వజ్రమిత్రుండును, నతనికి భాగవతుండును, వానికి దేవభూతియు నుద్భవించెద; రీ శుంగులు పదుండ్రును ద్వాదశోత్తరశత హాయనంబు లుర్వీపతు లయ్యెద; రంతమీదఁట శుంగకుల సంజాతుండైన దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుండనువాఁడు వధియించి, రాజ్యం బేలు; వానికి భూమిత్రుండు, నమ్మహానుభావునకు నారాయణుండునుఁ గలిగెదరు; కణ్వవంశజులైన వీరలు మున్నూటనలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు; మఱియును. (5) చతురత నీ క్షితి నేలియు మతిమోహము విడువలేక మానవనాథుల్ సతతముఁ దమ కీ కాలం బతిచంచల మగుట నెఱుఁగరయ్య మహాత్మా! (6) నరపతులమహిమ నంతయు నురగాధిపుఁ డైన నొడువ నోపఁడు; ధాత్రిం జిరకాల మేలి యిందే పరువడి నడఁగుదురు వారు భ్రాంతులు నగుచున్. (7) గజ తురగాదిశ్రీలను నిజ మని నమ్మంగరాదు; నిత్యమును హరిన్ గజిబిజి లేక తలంచిన సుజనులకును నతనియందుఁ జొరఁగా వచ్చున్. (8) మఱియుఁ గణ్వవంశజుండగు సుశర్ముండను రా జుదయించిన వాని హింసించి తద్భృత్యుం డంధ్ర జాతీయుం డయిన వృషలుం, డధర్మమార్గవర్తి యై, వసుమతీచక్రం బవక్రుండై యేలు నంత వాని యనుజుండు కృష్ణుం డనువాఁడు రాజై నిలుచు; నా మహామూర్తికి శాంతకర్ణుండును, వానికి బౌర్ణమాసుండును, వానికి లంబోదరుండును, వానికి శిబిలకుండు, నతనికి మేఘస్వాతియు, వానికి దండమానుండును, వానికి హాలేయుం డగు నరిష్టకర్మయు, వానికి దిలకుండు, నతనికిఁ బురీషసేతుండును, వానికి సునందనుండును, నా రాజశేఖరునకు వృకుండును, వృకునకు జటాపుండును, జటాపునకు శివస్వాతియు, వానికిఁ నరిందముండు, నా భూమీశునకు గోమతియును, వానికిఁ బురీమంతుండును, నతనికి దేవశీర్షుండును, వానికి శివస్కందుండును, నతని కి యజ్ఞశీలుండు, నా భవ్యునకు శ్రుతస్కందుండు, వానికి యజ్ఞశత్రుండు, వానికి విజయుం, డ వ్విజయునికిఁ జంద్రబీజుం డతనికి సులోమధియు నిట్లు పెక్కం డ్రుదయించి నన్నూటయేఁబదియాఱు హాయనంబులు ధాత్రిం బాలించెద; రంత నాభీరులేడ్వురు, గర్దభులు పదుండ్రు, గంక వంశజులు పదాఱుగురు, మేదినీభరంబు దాల్చి యుండెద; రటమీఁద యవను లెనమండ్రు, బర్బరులు పదునల్గురు, దేశాధీశులై యేలెదరు; మఱియుం బదుమువ్వురు గురుండులును, బదునొకండ్రు మౌనులును, వేయుందొమ్మన్నూటతొమ్మిది హాయనంబులు గర్వాంధులయి యేలెద; రటమీఁద నా మౌనవంశజు లగు పదునొకండ్రు త్రిశతయుతం బైన వత్సరంబులు మత్సరంబున నేలెద ; రా సమయంబునఁ, గైలికిలు లను యవనులు భూపతు లగుదు; రంత భూతనందుండు నవభంగిరుండు శిశునందుండుఁ దద్భ్రాతయగు యశోనందుండుఁ బ్రవీరకుండు వీరలు వీరులై షడుత్తరశత హాయనంబు లేలెద; రంత నా రాజులకుఁ బదుమువ్వురు కుమారు లుదయించి యందు నార్గురు బాహ్లికదేశాధిపతు లయ్యెదరు; కడమ యేడ్వురును గోసలాధిపతు లయ్యెద; రంత వైఢూర్య పతులు నిషధాధిపతులై యుండెదరు; పురంజయుండు మగధదేశాధిపతియై పుట్టి, పుళింద యదు మద్రదేశవాసు లగు హీనజాతి జనులు బ్రహ్మజ్ఞానహీనులై హరిభక్తి విరహితులై యుండ, వారికి ధర్మోపదేశంబు సేసి, నారాయణభక్తి నిత్యంబు నుండునట్లుగాఁ జేసి, బలపరాక్రమవంతు లైన క్షత్రియవంశంబు లడంచి, పద్మావతీనగర పరిపాలకుండై యాగంగా ప్రయాగ పర్యంతం బగు భూమినేలఁ గలండు; శూద్రప్రాయు లగు రాజులును, వ్రాత్యులును, బాషండులు నగు విప్రులును గలిగి సౌరాష్ట్రావంత్యాభీరార్భుద మాళవ దేశాధిపతు లయ్యెదరు, సింధుతీరంబులఁ జంద్రభాగా ప్రాంతంబులఁ గాశ్మీరమండలంబున మేధావిహీనులై మ్లేచ్ఛాకారు లగు రాజులు భూభాగం బేలుచు, ధర్మసత్యదయాహీనులై, క్రోధమాత్సర్యంబుల, స్త్రీ బాల గో ద్విజాతులఁ వధియింప రోయక, పరధన పరస్త్రీపరు లై, రజస్తమోగుణరతు లై, యల్పజీవు లై, యల్పబలు లై హరి చరణారవిందమకరంద రసాస్వాదులు గాక తమలో నన్నోన్య వైరానుబంధులై సంగ్రామరంగంబుల హతు లయ్యెద; రా సమయంబునఁ బ్రజలు తచ్చీల వేష భాషాదుల ననుసరించి యుండెదరు; కావున.

కల్క్యవతారంబు

(9) దినదినమును ధర్మంబులు, ననయము ధర నడఁగిపోవు నాశ్చర్యముగా విను వర్ణ చతుష్కములో; నెనయఁగ ధనవంతుఁ డైన నేలు ధరిత్రిన్. (10) బలవంతుఁ డైన వాడే కులహీనుం డైన దొడ్డగుణవంతుఁ డగుం గలిమియుఁ బలిమియుఁ గలిగిన నిలలోపల రాజ తండె; యే మన వచ్చున్. (11) అట్లుగాన జనంబులు లోభులై, జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీనులై వన్యశాక మూల ఫలంబులు భుజించుచు, వన గిరి దుర్గంబులం గృశీభూతులై దుర్భిక్ష, శీత, వాతాతప, క్షుధా, తాపంబులచేత భయంపడి, ధనహీనులై యల్పాయుష్కులు, నల్పతరశరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు, నధర్మప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి, శూద్రప్రాయులై యుండెద; రంత నోషధు లల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు నిస్సారంబులు నగు; నిట్లు ధర్మమార్గంబు దక్కి యున్నయెడ ముకుందుండు దుష్టనిగ్రహ శిష్టపరిపాలనంబుల కొఱకు శంబల గ్రామంబున విష్ణుయశుం డను విప్రునకుఁ గల్క్యవతారుండై దేవతా బృందంబులు నిరీక్షింప, దేవదత్త ఘోటకారూఢుండై దుష్టమ్లేచ్ఛజనంబులం దన మండలాగ్రంబున ఖండీభూతులం జేయు; నప్పుడు ధాత్రీమండలంబు విగతక్రూరజన మండలంబై తేజరిల్లు; నంత నరులు విష్ణుధ్యాన వందన పూజాది విధానాసక్తులై నారాయణపరాయణు లయి వర్తిల్లెద; రిట్లు కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యు లయ్యెద; రంతటఁ గృతయుగ ధర్మంబయి నడచుచుచుండు; జంద్ర భాస్కర శుక్ర గురువులేక రాశి గతులయినం, గృతయుం బయి తోఁచు; రాజేంద్రా! గత వర్తమాన భావికాలంబులు; భవజ్జన్మంబు మొదలు నందాభిషేక పర్యంతంబుఁ పంచదశాధికశతోత్తర సహస్ర హాయనంబులయి యుండు; నంతట నారాయణుం డఖిల దుష్ట రాజద్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠనిలయం డగు;”నని చెప్పిన. (12) "మునినాథ! యే విధంబున ఘనతరముగఁ జంద్ర సూర్య గ్రహముల జాడల్ సనుఁ? గాలవర్తనక్రమ మొనరఁగ నెఱిఁగింపవయ్య ముదము దలిర్పన్." (13) అనిన నట్లగాక, యని చెప్పఁ దొడంగె; “వినుము; సప్తర్షి మండలాంతర్గతంబు లయిన పూర్వ ఋక్షద్వయి సమమధ్యంబు నందు నిశాసమయంబున నొక్క నక్షత్రంబు గానిపించిన కాలంబు మనుష్య మానంబున శతవత్సరపరిమితంబయ్యె నే నా సమయంబున జనార్దనుండు నిజపదంబునఁ బొదలె; నా వేళనె ధాత్రీమండలంబు కలి సమాక్రాంతం బయ్యెఁ; గృష్ణుం డెంతకాలంబు భూమి యందుఁ బ్రవర్తించె, నంత కాలంబునుగలి సమాక్రాంతంబు గాదు; మఘానక్షత్రం బందు సప్తర్షులు నే ఘస్రంబునఁ జరియింతు రా ఘస్రంబునఁ గలి ప్రవేశించి వేయునిన్నూఱు వర్షంబు లయి యుండు; నా ఋషిసంఘంబు పూర్వాషాడ కరిగినం గలి ప్రవృద్ధంబు నొందు; నే దివసంబున హరి పరమపదప్రాప్తుం డయ్యె; నా దివసంబు నంద కలి ప్రవేశించి దివ్యాబ్జసహస్రంబు సనిన యనంతరంబు నాలవ పాదంబునఁ గృతయుగ ధర్మంబు ప్రాప్తం బగు. (14) నరవర! తొంటి భూపతుల నామ గుణంబులు, వృత్తచిహ్నముల్, సిరియును, రూప సంపదలుఁ, జెన్నగురాజ్యము, లాత్మవిత్తముల్ వరుస నడంగెఁ గాని, యట వారల కీర్తులు నిర్మలంబులై యురవడి భూమిలో నిలిచి యున్నవి నేఁడును రాజశేఖరా! (15) శంతనుని యనుజండగు దేవాపియు, నిక్ష్వాకువంశజుండగు మరుత్తును, యోగయుక్తులై కలాపగ్రామనిలయులై కలియుగాంతంబున వాసుదేవప్రేరితులై, ప్రజల నాశ్రమాచారంబులు దప్పకుండ నడపుచు, నారాయణస్మరణంబు నిత్యం బొనర్చి, కైవల్యపదప్రాప్తులగుదు; రిక్కరణి నాలుగుయుగంబుల రాజులును నే నెఱింగించిన పూర్వరాజన్యులును, వీరందఱును సమస్తవస్తు సందోహంబుల యందు మమత నొంది యుత్సాహవంతులై యుండి పిదప నీ భూతలంబువదలి నిధనంబు నొందిరి; కావునఁ గాలంబుజాడ యెవ్వరికిం గానరాదు; మత్పూర్వులు హరిధ్యాన పరవశులై దయాసత్యశౌచశమదమాది ప్రశస్తగుణంబులం బ్రసిద్ధు లై నడచి; రట్లు గావున. (16) ధర్మము సత్యముఁ గీర్తియు నిర్మలదయ విష్ణుభక్తి నిరుపమ ఘన స త్కర్మ మహింసావ్రతమును నర్మిలి గలవారె పుణ్యు లవనీనాథా! (17) ఈ జగంబేలు తొల్లిటి రాజవరులు కాలవశమున నాయువు ల్గోలుపోయి నామమాత్రావశిష్ఠు లైనారు; గాన సలుపవలవదు మమత నెచ్చట నృపాల! (18) గర్వాంధులయిన నరపతులం జూచి భూదేవి హాస్యంబు సేయు; “శత్రు క్షయంబు సేసి యెవ్వరికి నీక తామ యేలుచుండెద” మనియెడి మోహంబునం బితృపుత్రభ్రాతలకు భ్రాంతి గల్పించి, యన్యోన్య వైరానుబంధంబులం గలహంబు సేసి, రణరంగంబులఁ దృణప్రాయంబులుగా దేహాదులు వర్జించి, నిర్జరలోకప్రాప్తులైన పృథు యయాతి గాధి నహుష భరతార్జున మాంధాతృ సగర రామ ఖట్వాంగ దుందుమార రఘు తృణబిందు పురూరవ శంతను గయ భగీరథ కువలయాశ్వ కకుత్థ్స నిషధ హిరణ్యకశిపు వృత్ర రావణ నముచి శంబర భౌమ హిరణ్యాక్ష తారకాదులైన రాజులును, దైత్యులును ధరణికి మమత్వంబునం జేసి కదా కాలవశంబున నాశంబు నొంది? రది యంతయు మిథ్యగాన సర్వంబునుం బరిత్యజించి “జనార్దన, వైకుంఠ, వాసుదేవ, నృసింహ” యని నిరంతర హరి కథామృతపానంబు సేసి, జరా రోగ వికృతులం బాసి హరిపదంబు నొందు" మని చెప్పి. (19) "ఉత్తమశ్లోకుఁ డననెవ్వఁ డున్నవాడు; సన్నుతుండగు నెవ్వఁడు సకల దిశల; నట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ! "

కలియుగ ధర్మ ప్రకారంబు

(20) అనిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె; “కలియుగం బతిపాప సమ్మిళితంబు; గాన దురితంబు లేలాగున రాకుండఁ జేయుదురు? కాలం బే క్రమంబున నడచుఁ? గాలస్వరూపకుం డైన హరి ప్రభావం బేలాగునం గానఁబడు? నీ జగజ్జాలం బెవ్విధంబున నిలుచు?” నని యడిగిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియెఁ;“ గృత త్రేతా ద్వాపర కలి యుగంబులను యుగ చతుష్టయంబును గ్రమంబుగాఁ బ్రవర్తించు, ధర్మంబునకు సత్య దయా తపో దానంబులు నాలుగు పాదంబులై నడచు; శాంతిదాంత్యత్మజ్ఞాన వర్ణాశ్రమాచారంబులు మొదలగునవి గలిగి ధర్మంబు మొదటి యుగంబున నాలుగు పాదంబులం బరిపూర్ణం బై ప్రవర్తిల్లు; శాంతిదాంతికర్మాచరణాది రూపం బగు ధర్మంబు మూఁడు పాదంబుల రెండవ యుగంబునం బ్రవర్తిల్లు; విప్రార్చనాహింసావ్రత జపానుష్టానాది లక్షణంబులు గలిగి ధర్మంబు రెండు పాదంబుల మూడవ యుగంబునం దేజరిల్లు; మఱియు జనులు గలియుగంబున దర్మరహితులు, నన్యాయకారులు, క్రోధమాత్సర్యలోభమోహాది దుర్గుణ విశిష్టులు, వర్ణాశ్రమాచారరహితులు, దురాచారులు, దురన్నభక్షకులు, శూద్రసేవారతులు, నిర్దయులు, నిష్కారణవైరులు, దయాసత్యశౌచాది విహీనులు, ననృతవాదులు, మాయోపాయులు, ధనవిహీనులు, దోషైక దృక్కులునై పాపచరితులగు రాజుల సేవించి, జననీజనక సుత సోదర బంధు దాయాద సుహృజ్జనులం బరిత్యజించి, సురతాపేక్షులై కులంబులం జెఱచుచుండెదరు; మఱియు క్షామ డామరంబులం బ్రజా క్షయం బగు; బ్రాహ్మణులు దుష్ప్రతిగ్రహవిహారులై యజ్ఞాదికర్మంబులు పదార్థపరులై చేయుచు హీనులై నశించెద; రట్లుగాన యీ కలియుగంబున నొక్క ముహూర్తమాత్రం బయిన నారాయణస్మరణ పరాయణులై మనంబున ‘శ్రీనృసింహ వాసుదేవ సంకర్ష’ణాది నామంబుల నచంచల భక్తిం దలంచు వారలకుఁ గ్రతుశత ఫలంబు గలుగు; నట్లు గావున రాజశేఖరా! నీ మది ననవరతంబు హరిం దలంపుము; కలి యనేక దురితా లయంబు గాన, యొక్క నిమేషమాత్రంబు ధ్యానంబు సేసినం బరమ పావనత్వంబు నొంది కృతార్థుండ వగుదు” వని పలికి మఱియును. (21) "మూడవ యుగమున నెంతయు వేడుక హరికీర్తనంబు వెలయఁగ ధృతిచేఁ బాడుచుఁ గృష్ణా! యనుచుం గ్రీడింతురు కలిని దలఁచి కృతమతు లగుచున్. "

కల్ప ప్రళయ ప్రకారంబు

(22) అనినఁ గల్పప్రళయ ప్రకారం బెట్లనిన నతం డిట్లనియెఁ; “జతుర్యుగ సహస్రంబులు సనిన నది బ్రహ్మకు నొక్క పవలగు; నా క్రమంబున రాత్రియు వర్ధిల్లు; నంత బ్రహ్మకు నొక్కదినం బగుటవలన నది నైమిత్తిక ప్రళయం బనంబడు; నందు విధాత సమస్త లోకంబులం దన యాత్మ యందు నిలిపి శయనింప ప్రకృతి వినష్టంబయిన నది ప్రాకృత ప్రళయం బని చెప్పంబడు; నా ప్రళయ ప్రకారంబు విను; మిట్లు పవలు నైమిత్తిక ప్రళయంబును, రాత్రి ప్రాకృత ప్రళయంబు నగుట గలిగిన, నది యజునకు దినప్రమాణం; బిట్టి దినప్రమాణంబున మున్నూటయఱువది దినంబు లయిన నలువకు నొక్క సంవత్సరంబు పరిపూర్ణం బగుఁ; దద్వత్సరంబులు శతపరిమితంబు లయిన. (23) అంత లోకేశున కవసానకాలంబు వచ్చిన నూఱేండ్లు వసుధలోన వర్షంబు లుడిగిన వడిఁ దప్పి, మానవుల్ దప్పి నాఁకటఁ జిక్కి, నొప్పి నొంది, యన్యోన్యభక్షులై, యా కాలవశమున నాశ మొందెద ; రంత నలినసఖుఁడు సాముద్ర దైహిక క్ష్మాజాత రసములఁ జాతురిఁ గిరణాళిచేతఁ గాల్ప, (23.1) నంతఁ గాలాగ్ని సంకర్షణాఖ్య మగుచు, నఖిల దిక్కులు గలయంగ నాక్రమించు; నట్టియెడ నూఱువర్షంబు లాదుకొనఁగ వీఁకతోడుత వాయువుల్ వీచు నపుడు.

ప్రళయ విశేషంబులును

(24) శత హాయనంబులు ధారాధరంబులు మహాఘోషంబుతోడం గరికరోపమానంబు లయిన నీరధారల నిఖిలజగంబును శంబరమయంబు చేసిన బ్రహ్మాండంబెల్ల జలమయం బగుటంజేసి, భూమి హృతగంధ గుణంబయి కబంధంబున లీనంబగు; నన్నీరంబు జీర్ణరసగుణంబై తేజంబున నడంగు; నా తేజంబు వాయువందు నష్టరూపంబయి కలయు; నా పవనుండు గతస్పర్శగుణుండై నభంబున సంక్రమించు; నా యాకాశంబు విగతశబ్దంబయి భూతాదిం బ్రవేశించుఁ; దైజసంబైన మహద్రూపం బనహంకారంబై వైకారికగుణసమేతంబై, యింద్రియంబుల లయించు; నహంకారంబును సత్త్వాదిగుణంబులు గ్రసియించు; నవి కాలచోదితం బైన ప్రకృతి యందడంగు; నా ప్రకృతి యనాదియు నిత్యంబు నవ్యయంబు నవాఙ్మానసగోచరంబునై సత్త్వరజస్తమోగుణ రహితంబయి, మహదాది సన్నివేశంబు లేక స్వప్నాద్యవస్థారహితంబయి, పృథివ్యాదిహీనంబై యప్రతర్క్యంబగు; దానిని మూలభూతంబయిన పదంబని చెప్పుచుందురు, కాలవిపర్యయం బయి, పురుషావ్యక్తులు విలీనం బగునది ప్రాకృత ప్రళయం బనంబడు” నని చెప్పి “మఱియు నొక విశేషంబు వినుము; బుద్ధీంద్రియార్థరూపంబులచే జ్ఞానంబు తదాశ్రయం బయి వెలుంగు; దృశ్యత్వాద్వ్యతిరేకంబులచే నది యాద్యంతంబులు గలదై యుండుఁ; దేజంబునకు దీపచక్షూరూపంబులు వేఱు గానియట్లు బుద్ధీంద్రియార్థంబులు పరార్థమూర్తికి నన్యంబులు గానేరవు; బుద్ధిసంభవంబు ప్రధానంబు; జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థాబేధం బాత్మమయంబై, బుద్ధియుక్తంబైన యోగంబునం బరిణమించుఁ; బ్రాణిజాతం బీశ్వరునందు లయోదయంబులు వొందుచుండు; సర్వంబు నన్యోన్యాపాశ్రయంబై యాద్యంతవంతంబగుట, నవస్తువై వర్తించు; నొక్క తేజంబు బహురంధ్రంబులం గానంబడు వడువున నొక్క పరమాత్మ పెక్కువిధంబుల భావింపంబడు; హాటకంబు పెక్కురూపంబులం గలదైన, నేకంబయిన తెఱంగునఁ బరమాత్మ నేకంబుగా భావింపవలయు; నేత్రంబులకు మేఘావరణంబు దలంగి నప్పుడు భాస్కరమండలంబు గనిపించు కరణి బంధహేతువైన యహంకారం బాత్మజ్ఞానంబునం దిరస్కృతంబైన యప్పుడే పరమాత్మ నిర్మలంబయి తోఁచు; నా పరమాత్మను నిరంతరంబును దలంచుచు, యోగులు తదేకాయత్తచిత్తులై యుందురు; కాలవేగంబున సర్వప్రపంచంబునకు నవస్థాంతరంబులు గల్గుచుండుఁ; బరమేశ్వర మూర్తి యైన కాలంబున నభంబునం బగలు తారకంబులు గానరాని కరణిం గానంబడక, కల్పావస్థలు చరించు; నిత్య నైమిత్తిక ప్రాకృతికాత్యంతికంబు లని ప్రళయంబు చతుర్విధంబులై పరఁగు; నందులంగలుగు నారాయణుని లీలావతారంబులఁ గమలభవ భవాదులయిన వచింపనోపరు; నే నెఱింగినయంతయుం జెప్పితి; సంసారసాగరంబు దాఁట హరి కథ యనెడు నావయ సహాయంబు గాని వేఱొకటి లే” దని చెప్పి. (25) "ఏను మృతుండ నౌదు నని యింత భయంబు మనంబులోపలన్ మానుము; సంభవంబు గల మానవకోట్లకుఁ జావు నిత్యమౌఁ; గాన హరిం దలంపు; మికఁ గల్గదు జన్మము నీకు ధాత్రిపై; మానవనాథ! పొందెదవు మాధవలోకనివాససౌఖ్యముల్.

తక్షక దష్ఠుడైన పరీక్షిన్మృతి

(26) రాజేంద్రా! జరామరణ హేతుకంబయిన శరీరంబున నుండు జీవుండు ఘటంబులలోఁ గనంబడు నాకాశంబు ఘటనాశంబయిన మహాకాశంబునం జేరు తెఱంగున, శరీరపతనంబగుడు నీశ్వరుం గలయుఁ, దైలనాశ పర్యంతంబు వర్తి తేజంబుతోడ వర్తించు కరణి దేహకృతం బగు భవంబు రజస్సత్త్వతమోగుణంబులచేతం బ్రవర్తించు; నాత్మ నభంబు మాడ్కి ధ్రువంబై యనంతంబై వ్యక్తావ్యక్తంబులకుఁ బరంబై యుండు; నిట్లాత్మ నాత్మస్థునిఁ గా జేసి, హరి నిజాకారంబు భావించుచుండుట విశేషంబు; నిన్నుఁ దక్షకుండు గఱవ సమర్థుండు గాఁడు; హరిం దలంపుము; ధన గృహదారాపత్యక్షేత్రపశుప్రకరంబుల వర్జించి, సమస్తంబు నారాయణార్పణంబు సేసి, విగతశోకుండవై నిత్యంబును హరిధ్యానంబు సేయు” మని వినిపించిన రాజేంద్రుండును గుశాసనాసీనుండై జనార్దనుం జింతించుచుండె; నంత శుకుండును యథేచ్ఛావిహారుండయి చనియె; నిటఁ గ్రుద్ధుండైన బ్రాహ్మణోత్తమునిచేఁ బ్రేరితుండైన తక్షకుండు ద్విజరూపంబుఁ దాల్చి, పరీక్షిద్వధార్థంబుగా నేతెంచుచుండి మార్గమధ్యంబునఁ గాశ్యపుం డను సర్పవిషహరణసమర్థుం డగు నొక్క విప్రునిం గని యతని నపరిమిత ధనప్రదానంబునఁ ద్రుప్తుం గావించి, పరీక్షిన్నికటంబునకు రాకుండు నట్లొనర్చి, యంతటఁ బరీక్షిన్మహారాజు చెంతనున్నవారల చేతి కొక్క ఫలం బిచ్చి చనిన, వారా ఫలంబు రాజున కిచ్చిన నతండా ఫలంబు నాస్వాదించినం గ్రిమిరూపంబున నందుండి వెడలి మహాభయంకర రూపంబునం గాకోదరంబై రాజుం గఱచిన నతండు నా క్షణంబ విషాగ్నిచే భస్మీభూతుం డయ్యె; నట్టి యవసరంబున భూమ్యంతరిక్షంబుల నుండు నిఖిలప్రాణు లాశ్యర్యకరం బగు తన్మరణంబు గని హాహారవంబులు సేసి; రంత నీ యర్థంబు నతని తనయుం డైన జనమేజయుండు విని క్రోధావేశంబున సర్పప్రళయం బగు నట్లు యజ్ఞంబు సేయుచుండ సహస్ర సంఖ్యలు గల సర్పంబులు హతంబు లయ్యె; నా సమయంబునఁ దక్షకుండు రాక వాసవాలయంబున నుండుట యెఱింగి “సహేంద్రతక్షకా యానుబ్రూహి” యను ప్రేషవాక్యంబు నొడువు నంతఁ; దక్షక సహితుం డయి విమానముతో నింద్రుండు స్థానభ్రంశంబు నొంది పడుచుండ, నత్తఱి నాంగీరసుం డేతెంచి పరీక్షిత్తనయుని బహుభంగులం గీర్తించి.

సర్పయాగ విరమణ

(27) మృతియును జీవనంబు నివి మేదినిలోపల జీవకోటికిన్ సతతము సంభవించు; సహజం బిది; చోర హుతాశ సర్ప సం హతులను దప్పి నాఁకటను బంచత నొందెడు నట్టి జీవుఁడున్ వెతలను బూర్వకర్మ భవవేదన లొందుచుఁ గుందు నెప్పుడున్. (28) అట్లుగావున నసంఖ్యంబులైన దందశూకంబులు హతం బయ్యె; శాంతమానసుండవై, క్రోధంబు వర్జింపు మనిన గురూపదిష్ట ప్రకారంబున సర్పయాగంబు మానియుండె; నంత దేవతలు గుసుమవృష్టిఁ గురియించి; రా రాజన్యుండు మంత్రిసమేతుండై నగరప్రవేశంబు సేసె; బాధ్య బాధకలక్షణంబులు గల విష్ణుమాయా చోదిత గుణవ్యాపారంబుల నాత్మ మోహపడుం గావున, నట్టి మాయావికారంబులం బరిత్యజించి, తదాశ్రయీకృతమానసుండై వర్తించుచు, పరనిందసేయక, వైరంబు వర్జించి, భగవత్పదాంభోజభక్తి సంయుక్తుండై తిరుగునతండు హరిపదంబుఁ జేరు" నని చెప్పి వెండియు సూతుండు పరమ హర్ష సమేతుండై శౌనకున కిట్లనియె.

పురాణానుక్రమణిక

(29) "ధారుణిఁ బారాశర్యున కార్యులు పైలుఁడు సుమంతు జైమిని మునులున్ ధీరుఁడు వైశంపాయనుఁ డారయ నలువురును శిష్యులై యుండిరొగిన్. (30) వారలు ఋగ్యజు స్సామాధర్వంబు లనియెడు నాలుగు వేదంబుల వ్యాసోపదిష్టక్రమంబున లోకంబులం బ్రవర్తింపఁ జేసి” రని చెప్పిన, నా క్రమం బెట్లని శౌనకుం డడిగిన సూతుండు సెప్పందొడంగె;” నాదియందుఁ జతుర్ముఖుని హృదయంబున నొక నాదం బుద్భవించె; నది వృత్తి నిరోధంబువలన మూర్తీభవించి వ్యక్తంబుగాఁ గనుపట్టె; నట్టి నాదోపాసన వలన యోగిజనంబులు నిష్పాపులై ముక్తినొందుదు; రందు నోంకారంబు జనియించె; నదియె సర్వమంత్రోపనిషన్మూలభూత యగు వేదమాత యని చెప్పంబడు; నా యోంకారంబు త్రిగుణాత్మకంబై యకారోకార మకారంబు లనెడు త్రివర్ణరూపం బై ప్రకాశించుచుండె; నంత భగవంతుం డగు నజుండా ప్రణవంబువలన స్వరస్పర్శాంతస్థోష్మాది లక్షణ లక్షితం బగు నక్షర సమమ్నాయంబు గల్పించి, తత్సహాయ్యంబునం దన వదన చతుష్టయంబువలన వేదచతుష్టయంబు గలుగంజేసె; నంత నతని పుత్రు లగు బ్రహ్మవాదులా వేదంబులం దదుపదిష్ట ప్రకారంబుగా నభ్యసించి, యాక్రమంబున వారలు దమ శిష్యపరంపరలకు నుపదేశించి; రట్లు వేదంబులు సమగ్రంబుగాఁ బ్రతియుగంబున మహర్షులచే నభ్యసింపంబడియె; నట్టి వేదంబులు సమగ్రంబుగఁ బఠియింప నశక్తులగు వారలకు సాహాయ్యంబు సేయుటకై ద్వాపరయుగాది యందు భగవంతుండు సత్యవతీ దేవి యందుఁ బరాశర మహర్షికి సుతుండై యవతరించి, యా వేదరాశిం గ్రమమ్మున ఋగ్యజు స్సామాధర్వంబు లన నాలుగు విధంబులుగ విభజించి, పైల వైశంపాయన జైమిని సుమంతు లనియెడు శిష్యవరులకుఁ గ్రమంబుగనా వేదంబుల నుపదేశించె; నందు బైలమహర్షి సేకొన్న ఋగ్వేదం బనంతంబు లగు ఋక్కులతోఁ జేరి యుండుటం జేసి బహ్వృచశాఖ యని చెప్పంబడు; నంత నా పైలుం డింద్రప్రమితికి భాష్కలునకు నుపదేశించె; బాష్కలుం డా సంహితం జతుర్విధంబులుఁ గావించి శిష్యులగు బోధ్యుండు యాజ్ఞవల్క్యుండుఁ బరాశరుండు నగ్నిమిత్రుండు నను వారికి నుపదేశించె; నింద్రప్రమితి దనసంహిత మాండూకేయున కుపదేశించె; మాండూకేయుండు దేవమిత్రుం డనువానికిం జెప్పె; నతనికి సౌభర్యాది శిష్యులనేకులై ప్రవర్తిల్లి; రందు సౌభరిసుతుండు శాకల్యుండు దా నభ్యసించిన శాఖ నైదు విధంబులుగ విభజించి; వాత్స్యుండు మౌద్గల్యుండు శాలీయుండు గోముఖుండు శిశిరుం డనెడు శిష్యుల కుపదేశించె; నంత జాతుకర్ణి యనువానికి వా రుపదేశింప నతండు బలాకుండు పైంగుండు వైతాళుండు విరజుం డనువారి కుపదేశించె; నదియునుంగాక మున్ను వినిపించిన బాష్కలుని కుమారుండైన బాష్కలి వాలఖిల్యాఖ్యసంహితను బాలాయని గార్గ్యుండు కాసారుం డనువారలకుం జెప్పె; ని త్తెఱంగున బహ్వృచసంహిత లనేక ప్రకారంబులం బూర్వోక్త బ్రహ్మర్షులచే ధరియింపంబడె; యజుర్వేదధరుం డగు వైశంపాయనుని శిష్యసంఘంబు నిఖిల క్రతువుల నాధ్వర్యకృత్యంబుచేఁ దేజరిల్లరి; మఱియు నతని శిష్యుఁడగు యాజ్ఞవల్క్యుండు గుర్వపరాధంబు సేసిన, నా గురువు కుపితుం డై యధీతవేదంబుల మరలం దనకిచ్చి పొమ్మనిన నతండు దాను జదివిన యజుర్గణంబును దదుక్తక్రమంబునఁ గ్రక్క, నవి రుధిరాక్తంబగు రూపంబు దాల్చిన యజుర్గణాధిష్ఠిత శాఖాధిదేవతలు తిత్తిరిపక్షులై వానిని భుజియించిరి; దానంజేసి యా శాఖలు తైత్తిరీయంబు లయ్యె; నంత నిర్వేది యగునా యాజ్ఞవల్క్యుం డపరిమిత నిర్వేదంబు నొంది, యుగ్రతపంబున సూర్యుని సంతుష్టుం గావింప, నతండు సంతసిల్లి హయ రూపంబుఁ దాల్చి యజుర్గణంబు నతని కుపదేశించె; గావున నది వాజసనేయశాఖ యని వాక్రువ్వంబడె; నంత నా యజుర్గణంబు కాణ్వ మాధ్యందినాదులచే నభ్యసింపంబడె; నిట్లు యజుర్వేదంబు లోకంబునఁ బ్రవర్తిల్లె; సామ వేదాధ్వేత యగు జైమినిమహర్షి దన సుతుండగు సుమంతునికి నుపదేశించె; నతఁడు సుకర్ముండను తన సుతునకుఁ దెలిపె; నతం డా వేదమును సహస్రశాఖలుగా విభజించి, కోసలుని కుమారుండైన హిరణ్యనాభునికిని, దన కుమారుండగు పౌష్పంజి యనువానికి నుపదేశించె; నంత వారిరువురును బ్రహ్మవేత్తలగు నావంత్యులు నుదీచ్యులను నేనూర్గురికి నుపదేశించి, వారిని సామవేదపారగులంగాఁ జేసి; రిట్లు సామవేదంబు లోకంబున వినుతి నొందె; మఱియు నధర్వవేత్త యగు సుమంతు మహర్షి దానిం దన శిష్యున కుపదేశింప నతండు వేదదర్శుండు పథ్యుండను శిష్యుల కుపదేశించె; నందు వేదదర్శుఁడనువాఁడు శౌల్కాయని బ్రహ్మబలి నిర్దోషుండు పిప్పలాయనుండను వారలకును, బథ్యుం డనువాఁడు కుముదుండు శునకుండు జాబాలి బభ్రు వంగిరసుండు సైంధవాయనుం డనువారలకు నుపదేశించి ప్రకాశంబు నొందించె; నిత్తెఱంగున నధర్వవేదంబు వృద్ధినొందె నిట్లఖిల వేదంబుల యుత్పత్తి ప్రచార క్రమంబులెఱింగించితి; నింకం బురాణక్రమం బెట్టులనిన వినిపింతు, వినుము; లోకంబునఁ బురాణప్రవర్తకు లనం బ్రసిద్ధులగు త్రయ్యారుణి కశ్యపుండు సావర్ణి యకృతవ్రణుండు వైశంపాయనుండు హారితుం డను నార్గురు మజ్జనకుండును వ్యాసశిష్యుండును నగు రోమహర్షణునివలన గ్రహించి; రట్టి పురాణంబు సర్గాది దశలక్షణలక్షితంబుగా నుండు; మఱియు గొందఱా పురాణంబు పంచలక్షణ లక్షితం బనియుఁ బలుకుదు; రట్టి పురాణ నామానుక్రమంబుఁ బురాణవిదులగు ఋషులు సెప్పెడు తెఱంగున నెఱింగింతు; వినుము, బ్రాహ్మంబు, పాద్మంబు, వైష్ణవంబు, శైవంబు, భాగవతంబు, భవిష్యోత్తరంబు, నారదీయంబు, మార్కండేయం, బాగ్నేయంబు, బ్రహ్మకైవర్తంబు, లైంగంబు, వారాహంబు, స్కాందంబు, వామనంబు, కౌర్మంబు, మాత్స్యంబు, బ్రహ్మాండంబు, గారుడంబు, నని పదునెనిమిది మహాపురాణంబులు, మఱియు నుపపురాణంబులుం గలవు; వీనిం లిఖించినం జదివిన వినిన దురింతంబు లడంగు” నని సూతుండు శౌనకాదులకుం జెప్పిన వారు “నారాయణగుణ వర్ణనంబును దత్కథలును జెప్పితి; వింక దోషకారులుఁ బాపమతులు నెవ్విధంబున భవాబ్ధిం దరింతు, రా క్రమంబు వక్కాణింపవే” యని యడిగిన నెఱింగింపం దలంచి యిట్లనియె.