పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : ఏకాదశ 63 - 114

నారయణఋషి భాషణ

(63) ధర్ముండు దక్షపుత్త్రిక¯ నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స¯ త్కర్ముని నారాయణ ఋషి¯ నర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమ మందున్‌. (64) అట్టి నారాయణాహ్వయుం డైన మౌని¯ బదరికాశ్రమమందు నపార నిష్ఠఁ¯ దపముఁ గావింప బలభేది దలఁకి మదిని¯ మీనకేతను దివిజకామినులఁ బనిచె. (65) వారు నారాయణాశ్రమంబునకు నతని తపోవిఘ్నంబు సేయ వచ్చునప్పు డవ్వనంబు సాల రసాల బిల్వ కదళీ ఖర్జూర జంబు జంబీర చందన వున్నాగ మందారాది వివిధ వృక్ష నిబిడంబును, పుష్ప ఫల భరిత శాఖావనమ్ర తరులతా బృందంబును, మాధవీ కుంజమంజరీ పుంజ మకరందపాన మత్తమధుకర నికర ఝంకారరవ ముఖరిత హరి దంతరంబును, గనక కమల కహ్లార విలసత్సరోవిహరమాణ చక్రవాక బక క్రౌంచ మరాళదంపతీ మండల మండితంబును, మృణాళ భోజనాసక్త సారసచయ చంచూపుట విపాటిత కమలముకుళకేసర విసర వితత ప్రశస్త సరోవరంబును నై వెలయు నవ్వనంబున నిందువదన లందంద మందగమనంబులం జెందు ఘర్మజలబిందుబృందంబులు నఖాంతంబుల నోసరింపుచు డాయంజను నప్పుడు. (66) మదనుని బాణజాలముల మగ్నతఁ బొందక ధైర్యవంతుఁ డై, ¯ ముదితల వాఁడిచూపులకు మోహము నొందక నిశ్చలాత్ముఁడై, ¯ హృదయమునందు నచ్యుతు రమేశు ననంతు జగన్నివాసునిన్‌¯ వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనె మౌని పెంపునన్, (67) "జంభారిపంపునను మీ¯ రంభోరుహవదనలార! యరుదెంచితి; రా¯ శుంభద్విహారవాంఛా¯ రంభంబునఁ దిరుగుఁ"డనిన లజ్జించి వెసన్‌. (68) "దేవమునీంద్ర! నీ దివ్యచారిత్రంబు¯ నెఱిఁగి సన్నుతిసేయ నెవ్వఁడోపుఁ? ¯ బుత్త్ర మిత్ర కళత్ర భోగాదులను మాని¯ తపము గావించు సద్ధర్ములకును¯ విఘ్నముల్‌ సెందునే? విశ్వేశుఁ గొల్చిన¯ యతనికి నంతరాయంబు గలదె? ¯ కామంబుఁ గ్రోధంబుఁ గల తపస్వితపంబు¯ పల్వలోదకములభంగిఁ గాదె? (68.1) నిన్ను వర్ణింప నలవియే? నిర్మలాత్మ! ¯ రమణ లోఁగొను మా యపరాధ" మనుచు¯ సన్నుతించిన నతఁడు ప్రసన్నుఁ డగుచుఁ¯ దనదు సామర్థ్య మెఱిఁగింపఁ దలఁచి యపుడు. (69) అమ్మునీశ్వరుండు పరమాశ్చర్యవిధానంబుగా నిజతనూరుహంబుల వలనం ద్రికోటి కన్యకానివహంబుల నుద్భవింపం జేసిన, గంధర్వవిబుధకామినీ సముదయంబులు పరమాద్భుత భయంబులు మనంబులం బొడమ సన్నుతించి, యవ్విలాసినీసమూహంబులో నూర్వశియను దానిం గొనిచని, పాకశాసను సభాసదనంబునం బెట్టి తద్వృత్తాంతం బంతయు విన్నవించిన నాశ్చర్య యుక్త హృదయుండయి సునాసీరుం డూరకుండె; నట్టి నారాయణ మునీశ్వరుచరిత్రంబు వినువారలు పరమ కల్యాణగుణవంతు లగుదు"రని చెప్పిన. (70) ఋషభునకు నాత్మయోగ మీ రీతిఁ జెప్పె; ¯ నచ్యుతుఁడు భూమిభారము నడఁప నంత¯ సొరిది నవతారములు దాల్చి సొంపు మీఱ¯ రాత్రిచరులను జంపె నీరసముతోడ. (71) అట్టి పరమేశ్వరుని లీలాగృహీతంబులగు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ రఘురామ రామ బుద్ధ కల్క్యాద్యవతారంబు లనేకంబులు గలవు; వాని నెఱిఁగి నుతియింప శేషభాషాపతులకైన నలవి గాదు; మఱియును. (72) నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ¯ గగనచరనది జనిత! నిగమవినుత! ¯జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర¯ పరిమళిత నిజహృదయ! ధరణిభరణ! ¯ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!¯ కటిఘటిత రుచిరతర కనకవసన! ¯భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత!¯ సతతజపరత! నియమసరణి చరిత! (72.1) తిమి, కమఠ, కిటి, నృహరి, ముదిత బలి నిహి¯ త పద, పరశుధర, దశవదన విదళన, ¯ మురదమన, కలికలుష సుముదపహరణ! ¯ కరివరద! ముని నర సుర గరుడ వినుత! (73) ఇవ్విధంబునం బ్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసంబు లనంతంబులు గలవు; మనోవాక్కాయకర్మంబుల హరిపూజనంబు సేయక, విపరీత గతులం దిరుగుచుండు జడుల కెవ్విధం బగు గతిగలుగు?” ననిన నప్పు డప్పుడమిఱేఁ డప్పరమపురుషుం జూచి “యట్టి జడులు ముక్తి నొందు నుపాయం బెట్టు లంతయు నెఱింగింపుఁ” డనినఁ జమసుం డిట్లనియె (74) "హరిముఖ బాహూరు వరపదాబ్జములందు¯ వరుసఁ జతుర్వర్ణ వర్గసమితి¯ జనియించె; నందులో సతులును శూద్రులు¯ హరిఁ దలంతురు; కలిహాయనముల¯ వేదశాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ¯ కర్తలై విప్రులు గర్వ మెసఁగి¯ హరిభక్తపరులను హాస్యంబు సేయుచు ¯ నిరయంబు నొందుట నిజము గాదె? (74.1) మృదుల పక్వాన్న భోజనములను మాని¯ జీవహింసకుఁ జనువానిఁ జెందు నఘము; ¯ హరి నుతింపక స్త్రీలోలుఁ డైనఁవాడు¯ నరకవాసుండు నగుచుండు ననవరతము. (75) అట్లు గావున గృహ క్షేత్ర పుత్త్ర కళత్ర ధనధాన్యాదులందు మోహితుండయి ‘ముక్తిమార్గంబు లప్రత్యక్షంబు’ లని నిందించువాఁడును, హరి భక్తివిరహితుండును, దుర్గతిం గూలుదు” రని మునివరుం డానతిచ్చిన విదేహుం డిట్లనియె. (76) "ఏ యుగంబునందు నే రీతి వర్తించు? ¯ నెట్టి రూపువాఁడు? నెవ్విధమున¯ మును నుతింపఁబడెను మునిదేవగణముచే¯ విష్ణుఁ డవ్యయుండు విశ్వవిభుఁడు? (77) అనిన విని యందుఁ గరభాజనుం డిట్లనియె; “ననేకావతారంబులు నానా రూపంబులును బహువిధ వర్ణంబులునుం గలిగి, రాక్షసులను సంహరించి, దుష్టజన నిగ్రహంబును శిష్టజన పరిపాలనంబునుం జేయుచుఁ గృతయుగంబున శుక్లవర్ణుండై చతుర్బాహుండై జటావల్కల కృష్ణాజినోత్తరీయ జపమాలికా దండ కమండలు ధరుండయి హరి నిర్మలతపోధ్యానానుష్ఠానగరిష్ఠు లైన పురుష శ్రేష్ఠులచేత హంసుండు, సువర్ణుండు, వైకుంఠుండు, ధర్ముం, డమలుండు, యోగేశ్వరుం, డీశ్వరుండు, పురుషుం, డవ్యక్తుండు, పరమాత్ముం డను దివ్యనామంబులం బ్రసిద్ధి వహించి గణుతింపంబడుఁ; ద్రేతాయుగంబున రక్తవర్ణుం డయి బాహుచతుష్క మేఖలాత్రయ విశిష్టుం డయి హిరణ్యకేశుండును, వేదత్రయస్వరూపుండును, స్రుక్‌ స్రువాద్యుపలక్షణ శోభితుండునయి విష్ణు, యజ్ఞ, పృశ్నిగర్భ, సర్వదేవోరుక్రమ, వృషాకపి, జయంతోరుగాయాఖ్యల బ్రహ్మవాదుల చేత నుతియింపంబడు; ద్వాపరంబున శ్యామలదేహుండును, పీతాంబరధరుండును, బాహుద్వయోపశోభితుండును, దివ్యాయుధధరుండును, శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజమానుండును, మహారాజోపలక్షణుండు నై జనార్దన, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్నానిరుద్ధ, నారాయణ, విశ్వరూప, సర్వభూతాత్మ కాది నామంబుల వెలసి, మూర్ధాభిషిక్తులచేత సన్నుతింపంబడు; కలియుగంబునఁ గృష్ణవర్ణుండును గృష్ణనామకుండునునై భక్తసంరక్షణార్థంబు పుండరీకాక్షుండు యజ్ఞ సంకీర్తనంబుల చేతం బ్రస్తుతింపబడు; హరి, రామ, నారాయణ, నృసింహ, కంసారి, నలినోదరాది బహువిధ నామంబులచే బ్రహ్మవాదులైన మునీంద్రులు నుతియింపుదురు; మఱియును.(78) ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి¯ సహ్యజా కృతమాలాది సకలనదుల¯ కెవ్వఁ డేనిని భక్తితో నేఁగి యచటఁ¯ బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు. (79) ఇవ్విధంబునఁ బ్రశంసింపఁదగిన కావేర్యాది మహానదీపావనజల స్నాన పాన దానంబులను, విష్ణుధ్యానకథాసుధార సానుభవంబుల నిరూఢులగు భాగవతోత్తములు గలిగిరేనిం జెడని పదంబునుం బొందుదు” రని ఋషభకుమారులు భగవత్ప్రతిబింబంబు లయిన పరమపురుషులుం బోలె విదేహజనపాలునకు నిశ్శ్రేయః పదప్రాప్తికరంబు లైన భగవద్భక్తి ధర్మంబు లుపదేశించి యంతర్ధానంబు నొందిరి; మిథిలేశ్వరుండును జ్ఞానయోగం బంగీకరించి నిర్వాణపదంబు నొందె; నీ యుపాఖ్యానంబు వ్రాసినఁ బఠించిన వినిన నాయురారోగ్యైశ్వర్యములు గలిగి పుత్త్ర పౌత్త్ర వంతులై సకల కలికల్మష రహితులై విష్ణులోక నివాసు లగుదు” రని నారదుండు వసుదేవునకుం జెప్పి మఱియును. (80) కమలాక్షపదభక్తి కథనముల్‌ వసుదేవ!¯ విని యఘంబులఁ బాసి వెలసి తీవు¯ భువనప్రసిద్ధిగాఁ బొలుపొందు సత్కీర్తి¯ కైవల్యలక్ష్మియుఁ గలుగు మీఁద¯ నారాయణుండు నీ నందనుం డను మోహ¯ మెడలించి విష్ణుగాఁనెఱిఁగి కొలువు¯ మతఁడు నీ తనయుఁడై యవతరించుటఁజేసి¯ సిద్ధించె దేహసంశుద్ధి నీకు (80.1) సరససల్లాప సౌహార్ధ సౌష్ఠవమునఁ¯ బావనంబైతి; శిశుపాల, పౌండ్ర, నరక, ¯ ముర, జరాసంధ, యవనులు, ముదముతోడ¯ వాసుదేవునిఁ జెందిరి వైరు లయ్యి. (81) దుష్టజన నిగ్రహంబును¯ శిష్టప్రతిపాలనంబు సేయన్‌ హరి దా¯ సృష్టి నవతార మొందెను ¯ స్రష్టృముఖానేక దివిజసంఘము వొగడన్‌. (82) అట్లుగావున లోకరక్షణార్థంబు గృష్ణుండవతారంబునొందె” నని హరి భక్తిపరంబు లగు నుపాఖ్యానంబులు నారదుం డుపన్యసించిన విని విస్మితచిత్తులై దేవకీవసుదేవులుగృష్ణుని పరమాత్మునిగా విచారించి” రని శుకుండు రాజునకుం జెప్పిన నతండు “మునీంద్రా! యదువుల నే ప్రకారంబున హరి హరియించె? సపరివారు లగు బ్రహ్మరుద్రేంద్రదిక్పాలకమునీంద్రులు ద్వారకానగర ప్రవేశం బెట్లు సేసిరి? యేమయ్యె? మఱియుఁ బరమేశ్వర కథామృతంబు వీనులలరం జవిగొనియు, నింకం దనివి సనదు; భక్తరక్షకుండగు హరి చారిత్రం బేరీతిఁ జాగెఁ? దర్వాతి వృత్తాంతం బంతయు నెఱింగింపు" మనిన శుకుం డిట్లనియె.

వైకుంఠం మరలఁ గోరుట

(83) సుర గరుడ ఖచర విద్యా¯ ధర హర పరమేష్ఠి ముఖ సుధాశనులు మునుల్‌¯ సరసిజనయనునిఁ గనుఁగొన¯ నరుదెంచిరి ద్వారవతికి నతిమోదమునన్‌. (84) కని పరమేశుని యాదవ¯ వనశోభిత పారిజాతు వనరుహనేత్రున్‌¯ జనకామిత ఫలదాయకు¯ వినుతించిరి దివిజు లపుడు వేదోక్తములన్‌. (85) అఖిలలోకేశ! సర్వేశ! యభవ! నీవు¯ నుదయ మందుట భూభార ముడుపుకొఱకుఁ¯ బంచవింశోత్తర శతాబ్దపరిమితంబు¯ నయ్యె విచ్చేయు వైకుంఠ హర్మ్యమునకు. (86) అనినఁ గమలభవ భవ ముఖ నిఖిల సురగణంబుల వచనంబు లియ్యకొని కృష్ణుండు వారితోడ “యాదవుల కన్యోన్య వైరానుబంధంబులు గల్పించి వారల హతంబు గావించి భూభారం బడంచి యిదె వచ్చెదం బొం” డని చెప్పి వీడ్కొలిపినఁ గమలాసనాదిబృందారకులు నిజస్థానంబులకుం జని రంత.

ప్రభాసంకు బంపుట

(87) కాక ఘూకంబులు గనకసౌధములలోఁ¯ బగలు వాపోయెడి బహువిధముల¯ నశ్వవాలములందు ననల ముద్భవ మయ్యె¯ నన్నంబు మొలిచె మహాద్భుతముగ¯ శుకశారికలు రాత్రి సొగసె విస్వరముల¯ జంతువు వేఱొక్క జంతువుఁ గనె¯ నొగిఁ బౌరగృహముల నుల్కలు నుదయించె¯ బెరసెఁ గావిరి రవిబింబ మపుడు. (87.1) గాన నుత్పాతములు సాలఁ గానఁబడియె¯ నరయ నిందుండ వలవదు యదువులార! ¯ తడయ కిపుడ ప్రభాసతీర్థమున కరుగుఁ¯ డనుచు శ్రీకృష్ణుఁ డెంతయు నానతిచ్చె. (88) నారాయణు వచనముల క¯ పారంబగు సమ్మదమున బలములతోడన్‌¯ దార సుత మిత్ర యుతులై¯ వారణ హయ సమితితోడ వడి నేఁగి రొగిన్‌. (89) అంత. (90) జ్ఞానమున నుద్ధవుఁడు దన¯ మానసమున నెఱిఁగి శ్రీరమాధిప! హరి! యో¯ దీనజనకల్పభూజ! సు¯ ధీనాయక! మాకు నీవె దిక్కని పొగడెన్‌.

ఉద్ధవున కుపదేశం

(91) ఇట్లు నుతియించి “దేవా! నీవు యదుక్షయంబు గావించి చనిన నేమే విధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరిపిన మజ్జన భోజన శయ నాసనాది కృత్యంబులు మఱవవచ్చునే?” యని యుద్ధవుం డాడిన వాసుదేవుం డిట్లనియె; “బ్రహ్మాదిదేవతా ప్రార్థనంబునం జేసి ధాత్రీ భారంబు నివారించితి; నింక ద్వారకానగరంబు నేఁటికి సప్తమ దివసంబున సముద్రుండు ముంపంగలవాఁడు; యదుక్షయంబునుం గాఁగల యది; యంతటం గలియుగంబునుం బ్రాప్తంబయ్యెడి, నందు మానవులు ధర్మవిరహితులు, నాచారహీనులు, నన్యాయపరులును, నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగపీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులునై యొండొరుల మెచ్చక యుందురు; గావున నీవు సుహృద్బాంధవస్నేహంబు వర్జించి, యింద్రియసౌఖ్యంబులం బొరయక క్షోణితలంబునం గల పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేయుచు, మానస వాగక్షి శ్రోత్ర ఘ్రాణేంద్రియ గృహ్యమాణం బగు వస్తుజాతంబెల్ల నశ్వరంబుగా నెఱుంగుము; పురుషుండు నానార్థ కామంబుల నంగీకరించి నిజగుణదోషంబుల మోహితుండై యుండుం; గావున హస్తిపకుండు గంధనాగంబుల బంధించు చందంబున నింద్రియంబులను, మనోవికారంబులను నిగ్రహించి యీషణత్రయంబును వర్జించి, మోద ఖేదంబుల సముండవుగా వర్తించుచు, నీ జగంబంతయు నాత్మాధిష్ఠితంబుగా నెఱింగి, మాయాదు లాత్మతత్త్వాధీనంబులుగాఁ దెలియుచు, జ్ఞానవిజ్ఞానయుక్తుండవై యాత్మానుభవ సంతుష్టుండవై, విశ్వంబును నన్నుఁగా భావించి, వర్తింపవలయు” నని వాసుదేవుం డానతిచ్చిన నుద్ధవుండు భక్తి భయ వినయంబులం గరంబులు మొగిడ్చి “మహాత్మా! సన్న్యస్త లక్షణంబు దుష్కరంబు; పామరులగు వార లాచరింపలేరు; నీ మాయచేత భ్రాంతులైన సాంసారికులు భవాబ్ధిం గడచి యెట్లు ముక్తి వడయుదురు? భృత్యుండనైన నా మీఁది యనుగ్రహంబునం జేసి యానతిమ్ము; బ్రహ్మాది దేవతా సముదయంబును, బాహ్యవస్తువుల భ్రాంతులై పర్యటనంబు సేయుదురు; నీ భక్తు లైన పరమభాగవతు లమ్మాయా నిరసనంబును సేయుదురు; గృహిణీ గృహస్థుల కైన, యతుల కైన నిత్యంబును నీ నామస్మరణంబు మోక్షసామ్రాజ్యపదంబు; గావునఁ బరమేశ్వరా! నీదు చరణంబుల శరణంబు నొందెద; గృపారసంబు నాపై నిగిడింపు” మని ప్రియసేవకుం డైన యుద్ధవుండు పలికిన నతనికిఁ గంసమర్దనుం డిట్లనియెఁ; “బురుషున కాత్మకు నాత్మయె గురువని యెఱుంగుము; కుపథంబులం జనక, సన్మార్గవర్తి వై పరమంబైన మన్నివాసంబునకుం జనుము; సర్వమూలశక్తిసంపన్నుండనైన నన్ను సాంఖ్యయోగపరులు నిరంతరభావంబులందుఁ బురుషభావంబు గావించి తలంచుచుందురు; మఱియు నేక ద్వి త్రి చతుష్పాద బహుపాదాపాదంబులు నై యుండు జీవజాలంబుల లోన ద్వి పాదంబులు గల మనుష్యులు మేలు; వారలలోన నిరంతరధ్యాన గరిష్ఠులైన యోగీంద్రులుత్తములు; వారలలో సందేహపరులచే నగ్రాహ్యుండగు నన్ను సత్త్వగుణగ్రాహ్యునిఁగా నెఱింగి నిజచేతఃపంకజంబు నందు జీవాత్మ పరమాత్మల నేకంబుగాఁ జేసి శంఖ చక్ర గదా ఖడ్గ శార్‌ఙ్గ కౌమోదకీ కౌస్తుభాభరణయుక్తుంగా నెఱుంగుచు నుండువారలు పరమయోగీంద్రు లనియు, బరమజ్ఞాను” లనియునుం జెప్పి మఱియు“నవధూత యదు సంవాదం” బను పురాతనేతిహాసంబు గలదుఁ సెప్పెద నాకర్ణింపుము.

అవధూత సంభాషణ

(92) పంకజనాభుఁ డుద్ధవునిపైఁ గల కూర్మిని జెప్పె నొప్ప నెం¯ దంకిలి లేక యన్నిదిశలందుఁ జరించుచు నిత్యతృప్తుఁడై¯ శంకరవేషధారి యొక సంయమి యా యదురాజుఁ జేర నే¯ వంకనునుండి వచ్చి తన వానికి నిట్లనె నర్థి నేర్పడన్‌. (93) అవధూత వల్కె నంతటఁ ¯ "బ్రవిమల విజ్ఞాన నిపుణ భవ్యులు గురువుల్‌¯ తవిలిన నిరువదినలువురు¯ నవనిన్‌ విజ్ఞాని నైతి"నని పల్కుటయున్‌. (94) అంత యదుప్రవరుండు “దేహి లోభమోహాదులవర్జించి జనార్దనుని నే విధంబునం జేరవచ్చు? నెఱింగింపు” మనిన నతం డిట్లనియె. (95) "పరధన పరదార పరదూషణాదులఁ¯ బరవస్తుచింతదాఁ బరిహరించి¯ ముదిమిచే రోగము లుదయింప కటమున్న¯ తనువు చంచలతను దగులకుండ ¯ బుద్ధిసంచలతచేఁ బొదలక యట మున్న¯ శ్లేష్మంబు గళమునఁ జేరకుండ¯ శక్తియుక్తుల మది సన్నగిల్లక మున్న¯ భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు (95.1) దైత్యభంజను దివ్యపాదారవింద¯ భజన నిజభక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు¯ నవ్యయానందమును బొందు ననుదినంబు¯ నతఁడు కర్మవిముక్తుఁడౌ ననఘచరిత! (96) దారలయందుఁ, బుత్త్ర ధన ధాన్యము లందు ననేక భంగులం¯ గూరిమి సేయు మర్త్యుఁ డతి ఘోర వియోగజ దుఃఖమగ్నుఁడై¯ నేరుపు దక్కి, చిక్కువడి నీతి వివేక విహీనుడై మనో¯ భారముతోఁ గపోతపతి భంగి నిజంబుగ బోవు నష్టమై. (97) ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్క కపోతంబు దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్య మోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు సంతానసమృద్ధిగలదియై యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండఁ గొన్ని మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండఁ గాలవశంబున నొక్క లుబ్ధకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం గపోతంబు కళత్ర పుత్త్ర స్నేహంబునం దాను నందుఁజొచ్చి యధికచింతాభరంబునం గృశీభూతంబయ్యెఁ; గావున నతితీవ్రంబయిన మోహంబు గొఱగా దట్లు గాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధు మక్షికా హరిణ పాఠీన పింగళా కురర డింభక కుమారికా శరకృ త్సర్ప లూతా సుపేశకృత్సముదయంబులు మొదలుగాఁ గలవాని గుణగణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలంగుదు; ”రనిన. (98) ఇవి తెలియవలయు నాకును ¯ బ్రవిమలమతి వీనిఁ దెలియఁ బలుకు మనంగాఁ¯ వివరము వినుమని కృష్ణుఁడు¯ సవినయుఁడగు నుద్ధవునికిఁ జయ్యనఁ జెప్పెన్‌. (99) ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసితపథునివలన నిర్మలత్వంబును, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్పసమత్వజీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబులవలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛా విహారసమాగతాహారంబును, వననిధివలన నుత్సాహ రోషంబులును, శలభంబువలన శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణ విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయుననంగల వీని గుణంబు లెఱింగి మఱియుఁ గామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మ నిరతుండయి, పుర నగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుం డయి నన్నె కాని యొండెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున. (100) మోహితుఁడై వసుకాంక్షా¯ వాహినిలోఁ జిక్కి క్రూరవశుఁడౌ మనుజుం¯ డూహాపోహ లెఱుంగక¯ దేహము నలఁగంగఁ జేయు దీనత నెపుడున్‌. (101) ఇందులకుఁ బురాతన వృత్తాంతంబు గలదు; సావధానచిత్తుండవై వినుము; మిథిలా నగరంబునఁ బింగళ యను గణికారత్నంబు గలదు; దానివలనం గొంత పరిజ్ఞానంబుఁ గంటి? నదెట్లనిన నమ్మానిని ధనకాంక్ష జేసి యాత్మసఖుని మొఱంగి ధనం బిచ్చువానిం జేకొని నిజనికేతనాభ్యంతరంబునకుం గొనిచని రాత్రి నిద్రలేకుండుచుఁ బుటభేదన విపణిమార్గంబులఁ బర్యటనంబు సలుపుచు నిద్రాలస్య భావంబున జడనుపడి, యర్థాపేక్షం దగిలి తిరిగి యలసి, యాత్మ సుఖంబు సేయునతండె భర్త యని చింతించి నారాయణు నిట్లు చింతింప నతని కైవల్యంబు సేరవచ్చు నని విచారించి, నిజశయనస్థానాదికంబు వర్జించి వేగిరంబ వాసుదేవ చరణారవింద వందనాభిలాషిణియై దేహంబు విద్యుత్ప్రకారం బని చింతించి పరమతత్త్వంబు నందుఁ జిత్తంబు గీలుకొలిసి ముక్తురాలయ్యె నని యెఱింగించి. (102) దేహము నిత్యము గా దని¯ మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై¯ గేహము వెలువడి నరుఁడు¯ త్సాహమునుం జెందు ముక్తిసంపద ననఘా! (103) మఱియు నొక్క విశేషం బయిన పురాతనపుణ్యకథ వినుము; కనకావతీపురంబున నొక్క ధరామరుని కన్యకారత్నంబు గల; దవ్వ ధూతిలకంబు రత్నసమేతంబు లగు కంకణంబులు ధరియించి బంధుజనంబులకుఁ బరమాహ్లాదంబుగా నన్నంబు గావించుట కొఱకు శాలితండులంబులు దంచునప్పుడు ముసలగ్రహణభారంబునఁ గంకణంబు లతిరావంబుగా మ్రోయుచుండ నప్పరమపతివ్రత యందులకు నసహ్యపడి యన్నియు డులిచి యొక్కటి నిలిపె; నట్లుగావునఁ దత్తఱపడక భగవదాయత్తంబైన యేకచిత్తంబునం బ్రసన్నచిత్తులై నరులు ముక్తులగుదురు; గావున నవిద్యావిద్యలు నా మాయగా విచారించి, కేవల పశుమార్గులు కాక షడ్గుణైశ్వర్య సంసన్నులైన యోగీశ్వరుల పగిది సుఖంబు గోరక యుండు వారలు ముక్తులగుదురు; సర్వంబును విష్ణుమాయగాఁ దెలియు” మని యుద్ధవునికిం జెప్పిన నతండు “దేవా! నీరూపం బేలాగునం గానవచ్చు”ననిన నతం డిట్లనియె; “భక్తిభావనపరాయణుండై కృపారస తత్పరుండై మితభాషణుండై బొంకక కర్మంబులు మదర్పణంబుగాఁ జేసిన యతండు భాగవతుఁడనం బరఁగు; మత్కథలును మజ్జన్మకర్మంబులును వినుచు మత్సేవకులైన భాగవతులం జూచి తన గృహంబునకుం గొనిపోయి, మజ్జన పూజన భోజన శయనా సనాదికంబులఁ బరితుష్టులం జేసిన యతండైనను భాగవతుండనఁ బడు; నిట్లెంతకాలంబు జీవించు, నంతకాలంబును నడపునతండు మద్రూపంబున వైకుంఠనిలయంబు నొందు; నదియునుం గాక గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీసమేతుండనై, శంఖ చక్ర గదాశార్‌ఙ్గాది యుక్తుఁడ నైన నన్ను శుక సనకాది యోగీంద్రులును, నంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలు గాఁగల భాగవతులును, శాస్త్రాచారచోదితులు గాక భక్తి భావనావిశేషంబున నేమఱక నిత్యంబును జింతనాయత్తులై యెఱింగిరి; మధురాపురంబునకు హలాయుధ సమేతుండనై యే నరుగుచో, గోపిక లోపికలు లేక భక్తియోగంబునఁ జింతించి ముక్తలై; రిది భక్తియోగప్రకా రం” బని యుద్ధవునికిం జెప్పిన. (104) "ధ్యానం బేక్రియ నిలుచును? ¯ ధ్యానం బే రీతిఁ దగు? నుదాత్తచరిత్రా! ¯ ధ్యానప్రకార మంత య¯ నూనంబుగఁ జెప్పు మయ్య యుర్వీరమణా!"(105) అని యడిగిన నయ్యాదవేంద్రుం డిట్లని పలుకం దొడంగె; “దారు మధ్యభాగంబున ననలంబు సూక్ష్మరూపంబున వర్తించు చందంబున నందంబై సకలశరీరుల యందు నచ్ఛేద్యుండు నదాహ్యుండు నశోష్యుండునైన జీవుండు వసించి యుండు” ననిన హరికి నుద్ధవుం డిట్లనియె; “సనక సనందనాది యోగీంద్రులకు యోగమార్గం బేరీతి నానతిచ్చితి, వది యేవిధం? బానతీయవే” యని యభ్యర్థించిన నతం డిట్లనియె; “వారలు చతుర్ముఖు నడిగిన నతండు, “నేనును దెలియనేర” ననిన వారలు విస్మయం బందుచుండ నేనా సమయంబున హంసస్వరూపుండ నై వారల కెఱింగించిన తెఱుంగు వినుము; పంచేంద్రియంబులకు దృష్టం బయిన పదార్థం బనిత్యంబు; నిత్యదృష్టి బ్రహ్మం బని తెలియవలయు; దేహి కర్మార్జిత దేహుండై సంసారమమతలు నిరసించి, నిశ్చలజ్ఞాన యుక్తుండై మత్పదప్రాప్తుండగు; స్వప్నలబ్ధ పదార్థంబు నిజంబు గాని క్రియఁ గర్మానుభవపర్యంతంబు కళేబరంబు వర్తించు నని సాంఖ్యయోగంబున సనకాదుల కెఱింగించిన విని, బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి; వారివలన భూలోకంబునఁ బ్రసిద్ధం బయ్యె; నదిగావున నీవును నెఱింగికొని, పుణ్యాశ్రమంబులకుం జను; మస్మదీయ భక్తియుక్తుండును, హరిపరాయణుండునైన యతని చరణరజఃపుంజంబు తన శరీరంబు సోఁకజేయు నతండును, ముద్రాధారణపరులకును హరి దివ్యనామంబులు ధరియించు వారలకు నన్నోదకంబుల నిడు నతండును, వాసుదేవభక్తులం గని హర్షించు నతండును, భాగవతు” డని చెప్పి మఱియు “సర్వసంగపరిత్యాగంబు సేసి, యొండెఱుంగక నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకుండనై యుండుదు” నని యానతిచ్చిన నుద్ధవుండు “ధ్యాన మార్గంబే రీతి? యానతీయవలయు” ననిన హరి యిట్లనియె; ఏకాంత మానసులై హస్తాబ్జంబు లూరుద్వయంబున సంధించి, నాసాగ్రంబున నీక్షణంబు నిలిపి, ప్రాణాయామంబున నన్ను హృదయగతుంగాఁ దలంచి, యష్టాదశ ధారణాయోగసిద్ధు లెఱింగి, యందణిమాదులు ప్రధాన సిద్ధులుగాఁ దెలిసి, యింద్రియంబుల బంధించి, మనం బాత్మయందుఁ జేర్చి, యాత్మనాత్మతోఁ గీలించిన బ్రహ్మపదంబుఁ బొందు; భాగవతశ్రేష్ఠు లితరధర్మంబులు మాని నన్నుం గాంతురు; తొల్లి పాండునందనుఁడగు నర్జునుండు యుద్ధరంగంబున విషాదంబు నొంది యిట్ల యడిగిన నతనికి నేఁ జెప్పిన తెఱం గెఱింగించెదఁ; జరాచరభూతంబయిన జగంబంతయు మదాకారంబుగా భావించి, భూతంబులందు నాధారభూతంబును, సూక్ష్మంబులందు జీవుండును, దుర్జయంబులందు మనంబును, దేవతలందుఁ బద్మగర్భుండును, వసువులందు హవ్యవాహుండును, నాదిత్యులందు విష్ణువును, రుద్రులందు నీలలోహితుండును, బ్రహ్మలందు భృగువును, ఋషులందు నారదుండును, ధేనువులందుఁ గామధేనువును, సిద్ధులయందుఁ గపిలుండును, దైత్యులయందుఁ బ్రహ్లాదుండును గ్రహంబులందుఁ గళానిధియును, గజంబులయం దైరావతంబును, హయంబులయం దుచ్చైశ్శ్రవంబును, నాగంబులందు వాసుకియును, మృగంబులందుఁ గేసరియు, నాశ్రమంబులందు గృహస్థాశ్రమంబును, వర్ణంబులయం దోంకారంబును, నదులందు గంగయు, సాగరంబుల యందు దుగ్ధసాగరంబును, నాయుధంబులందుఁ గార్ముకంబును, గిరు లందు మేరువును, వృక్షంబుల యందశ్వత్థంబును, నోషధుల యందు యవలును, యజ్ఞంబుల యందు బ్రహ్మయజ్ఞంబును, వ్రతంబులం దహింసయు, యోగంబులం దాత్మయోగంబును, స్త్రీల యందు శతరూపయు భాషణంబులయందు సత్యభాషణంబును, ఋతువులందు వసంతాగమంబును, మాసంబులలో మార్గశీర్షంబును, నక్షత్రంబులలో నభిజిత్తును, యుగంబులందుఁ గృతయుగంబును, భగవదాకారంబులందు వాసుదేవుండును, యక్షుల లోఁ గుబేరుండును, వానరులం దాంజనేయుండును, రత్నంబు లందుఁ బద్మరాగంబును, దానంబులలోనన్నదానంబును, దిథు లయం దేకాదశియు, నరులయందు వైష్ణవుండై భాగవతప్రవర్తనం బ్రవర్తించువాఁడును, నివియన్నియు మద్విభూతులుగా నెఱుంగు"మని కృష్ణుం డుద్ధవునకు నుపన్యసించిన వెండియు నతం డిట్లనియె. (106) వర్ణాశ్రమధర్మంబులు¯ నిర్ణయముగ నాన తిమ్ము నీరజనాభా! ¯ కర్ణరసాయనముగ నవి¯ వర్ణింపుము, వినెద నేఁడు వనరుహనేత్రా! (107) అనినం గృష్ణుండు నాలుగు వర్ణంబుల యుత్పత్తియు నాలుగాశ్రమంబుల కిట్టిట్టి వర్హంబు లనియును, నాలుగు వేదంబులం జెప్పిన ధర్మంబులును, బ్రవృత్తి నివృత్తి హేతువు లగు పురాణేతిహాస శాస్త్రంబులును, వైరాగ్యవిజ్ఞానంబులును నివి మొదలుగాఁ గలవన్నియు నెఱిగించి, “సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” యను నుపనిషత్తుల్యంబగు గీతావచన ప్రకారంబున నెవ్వఁడేని నా యందు మతి గలిగి వర్తించు వాఁడు నేనని పలుకంబడుఁ; బెక్కు విధంబుల వాదంబు లేల? యని యెందును దగులువడక నామీఁదఁ దలంపు గలిగి వర్తింపు” మనిన నుద్ధవుం డిట్లనియె. (108) తెలియనివి కొన్ని సెప్పితి; ¯ తెలియంగల వెల్ల నింకఁ దెలుపుము కృష్ణా! ¯ వల నెఱిఁగి మెలఁగవలయును¯ నలినాసనజనక! భక్తనతపదయుగళా! (109) అని యుద్ధవుం డడగినం బ్రబుద్ధమనస్కుం డయిన పుండరీకాక్షుండు “నీ ప్రశ్నంబులు దుర్లభంబు లయినను వినుము; నియమ శమ దమాదులు దపంబును సుఖదుఃఖంబులు స్వర్గ నరకంబులుననం బరఁగినవి యెవ్వి, దరిద్రుం డెట్టివాఁ డీశ్వరుండెవ్వం, డని నీవు నన్నడిగిన యర్థంబు లెల్ల వేఱువేఱ వివరించెద; మౌనవ్రత బ్రహ్మచర్య క్షమా జప తపంబులును, నతిథిసత్కారంబును, బరహితంబును, జౌర్యాదిరహితత్వంబును ననునివి మొదలైనవి నియమంబు లనందగు; నింద్రియనిగ్రహంబును, శత్రుమిత్ర సమత్వంబును, శమం బనం బరఁగు; మూఢజనులకు జ్ఞానోపదేశంబును, గామ్యత్యాగంబును, సమదర్శనంబును, వైష్ణవ సమూహంబులతోడి భక్తియుఁ, బ్రాణాయామంబును, జిత్తశుద్ధియు నను నివి కలిమివిద్య యనంబడు; శమదమాది గుణరహితుండును, మద్భక్తి విరహితుండును నగుట యవిద్య యనందగుఁ; జిత్తశుద్ధి గలిగి నిత్యతృప్తుండౌట దమం; బిట్టి నియమాది గుణ సహితత్వంబును మద్భక్తియుక్తియు ననునదియే సుఖంబు; నన్నెఱుంగలేక తమోగుణంబునం బరఁగుటయె దుఃఖం బనంబడు; బంధు గురు జనంబుల యెడ భేదబుద్ధి నొంది, శరీరంబు నిజగృహంబుగా భావించినవాఁడె దరిద్రుం; డింద్రియ నిరసనుండును, గుణ సంగ విరక్తుండు నైనవాఁడె యీశ్వరుండు; నాయందుఁ దలంపు నిలిపి, కర్మయోగంబునందును, భక్తి యోగంబునందును వాత్సల్యంబు గలిగి జనకాదులు కైవల్యంబుఁ జెందిరి; భక్తియోగంబునం జేసి బలి ప్రహ్లాద ముచుకుందాదులు పరమ పదప్రాప్తులై; రది గావున నిది యెఱింగి నిరంతర భక్తియోగం బధికంబుగా నీ మనంబున నిలుపుము; మృణ్మయంబైన ఘటంబున జలంబులు జాలుగొను తెఱంగున దినదినంబునకు నాయువు క్షయం బై మృత్యువు సన్నిహితం బై వచ్చుఁ గావున నిది యెఱింగి నిరంతంరంబును నన్నేమఱక తలంచుచుండు నతండు నాకుం బ్రియుండు. (110) గర్భమునఁ బరిజ్ఞానము¯ నిర్భరమై యుండు జీవునికిఁ దుది నతఁ డా¯ విర్భూతుఁ డైనఁ జెడు నం¯ తర్భావంబైన బోధ మంతయు ననఘా! (111) అట్లు గావున జనుండు బాల్య కైశోర కౌమార వయోవిశేషంబుల వెనుకనైననుం, బెద్దయైన వెనుకనైనను, నన్నెఱింగెనేనిఁ గృతకృత్యుండగుఁ; సంపద్గర్వాంధుం డైన నంధకారకూపంబునం బడు; వానిం దరిద్రునింగాఁ జేసిన జ్ఞానియై యస్మత్పాదారవింద వందనాభిలాషియై ముక్తుండగు; నట్లుగావున దేహాభిమానంబు వర్జించి యైహికాముష్మిక సుఖంబులఁ గోరక మనంబు గుదియించి యే ప్రొద్దు నన్నుఁ దలంచువాఁడు వైకుంఠపద ప్రాప్తుండగు; నేను నతని విడువంజాలక వెనువెంట నరుగుదు; నారదాది మునులు భక్తి భావంబునం జేసి నా రూపం బై” రని యుద్ధవునకుం జెప్పిన, నతండు మఱియు నిట్లనియె. (112) అయ్యా! దేవ! జనార్దన! ¯ నెయ్యంబున సృష్టికర్త నేర్పరియై తా¯ నొయ్యన నడపును నెవ్వఁడు¯ సయ్యన నెఱిఁగింపవయ్య! సర్వజ్ఞనిధీ! (113) అనుటయు హరి యుద్ధవునకుం జెప్పె; “నట్లు మత్ప్రేరితంబులై మహదాది గుణంబులు గూడి యండం బై యుద్భవించె; నా యండంబువలన నేనుద్భవించితి; నంత నా నాభివివరంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్య నదీ నద సంఘంబులు మొదలుగాఁ గల జగన్నిర్మాణంబు లతనివలనం గల్పించితి; నంత శతానందునకు శతాబ్దంబులు పరిపూర్ణం బైన ధాత్రి గంధంబునందడంగు; నా గంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రసంబున లీనంబగు; నా రసంబు తేజోరూపంబగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శగుణసంగ్రాహ్యం బైన స్పర్శగుణం బాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపఁబడిన నింద్రియంబులు మనోవైకారిక గుణంబులం గూడి యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబు దాల్చు; నేను రజస్సత్త్వతమోగుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి, జగదుత్పత్తి స్థితి లయ కారణుండనై వర్తిల్లుదుఁ; గావున నీ రహస్యంబు నీకు నుపదేశించితిఁ, బరమపావనుండవుఁ బరమభక్తి యుక్తుండవుఁ గ”మ్మని చెప్పె; నంత. (114) రూపు లేని నీకు రూఢిగా యోగులు¯ రూపు నిల్పి నిన్ను రుచిరభక్తిఁ¯ గొల్చి యుండ్రు; వారికోర్కుల నిచ్చెద¯ వేమిలాగు? నాకు నెఱుఁగఁ బలుకు.