పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : ఏకాదశ 115 - సంపూర్ణం

(115) అని యుద్ధవుం డడిగిన నారాయణుం డిట్లనియె; “నేను సర్వవర్ణంబులకు సమంబైన పూజాప్రకారం బెఱింగించెద; నాచారంబునంజేసి యొకటిఁ బాషాణమృణ్మయదారువులం గల్పించి, నా రూపంబుగా నిల్పికొని కొందఱు పూజింతురు; కాంస్య త్రపు రజత కాంచన ప్రతిమావిశేషంబు లుత్తమంబు; లిట్లు నా ప్రతిమారూపంబు లందు మద్భావంబుంచి కొల్చినవారికి నేఁ బ్రసన్నుండనగుదు; నీ లోకంబున మనుష్యులకు ధ్యానంబు నిలువనేరదు; గావునం బ్రతిమా విశేషంబు లనేకంబులు గలవు; వానియందు సౌందర్యసారంబులు మనోహరంబులునైన రూపంబుల మనఃప్రసన్నుండనై నే నుండుదుఁ; గావున దుగ్ధార్ణవశాయిఁగా భావించి ధౌతాంబరాభరణ మాల్యానులేపనంబులను, దివ్యాన్న పానంబులను, షోడశోక్త ప్రకారంబుల రాజోపచారంబులను, బాహ్యపూజా విధానంబుల నాచరించి మత్సంకల్పితంబు లైన పదార్థంబులు సమర్పించి, నిత్యంబును నాభ్యంతరపూజావిధానంబులం బరితుష్టునిం జేసి; దివ్యాంబరాభరణ మాల్యశోభితుండును, శంఖ చక్ర కిరీటాద్యలంకార భూషితుండును, దివ్యమంగళవిగ్రహుండునుగాఁ దలంచి ధ్యానపరవశుండైన యతండు నాయందుఁ గలయు; నుద్ధవా! నీ వీ ప్రకారంబు గరిష్ఠనిష్ఠాతిశయంబున యోగనిష్ఠుండవై, బదరికాశ్రమంబు సేరి మత్కథితం బైన సాంఖ్యయోగం బంతరంగంబున నిల్పుకొని, కలియుగావసాన పర్యంతంబు వర్తింపు” మని యప్పమేశ్వరుండానతిచ్చిన నుద్ధవుండు నానందభరితాంతరంగుం డై తత్పాదారవిందంబులు హృదయంబునం జేర్చుకొని, పావనంబైన బదరికాశ్రమంబునకు నరిగె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పుటయు. (116) చెప్పిన విని రాజేంద్రుఁడు¯ సొప్పడ శ్రీకృష్ణుకథలు చోద్యము గాఁగం¯ జెప్పినఁ దనియదు చిత్తం¯ బొప్పఁగ మునిచంద్ర! నాకు యోగులు మెచ్చన్‌. (117) అంతటను గృష్ణుఁ డేమయ్యె? నరసిచూడ¯ యదువు లెట్టులు వర్తించి రేర్పడంగ, ¯ ద్వారకాపట్టణం బెవ్విధమున నుండె¯ మునివరశ్రేష్ఠ! యానతీ ముదముతోడ.

శ్రీకృష్ణ నిర్యాణంబు

(118) అనిన రాజునకు శుకుం డిట్లనియె “నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁ బరిపాలనంబు సేసి, బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁ దాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి తురగ రథ పదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబు లయిన తుంగ సమూహంబుల బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకు నప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొఱగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జనిచని; యంత నీలాంబరుం డొక్క త్రోవంబోయి యోగమార్గంబు నననంతునిం గలసె; నప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేఱొక చరణంబు మీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరిణకర్ణంబు గాఁబోలునని దానిం గని శరంబు శరాసనంబునందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున “మహాపరాధుండను; బాపచిత్తుం డను; గుటిలప్రచారుండ” నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్తవదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె; “నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరక పోవనేరవు; నీవు నిమిత్తమాతృండ; వింతియ కాని” యని వానికిం దెలిపిన వాఁడును “మహాపరాధులైన వారూరక పోవరు; దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు” నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠపదప్రాప్తుండయ్యె నప్పుడు. (119) దారుకుఁడు గనియె నంతటఁ¯ జారు నిరూఢావధాను సర్వజ్ఞు హరిన్‌¯ మేరునగధీరు దనుజవి¯ దారుని నేకాంతపరునిఁ దద్దయు నెమ్మిన్‌. (120) కని యత్యంతభయభక్తితాత్పర్యంబుల ముకుళిత కరకమలుండై యిట్లనియె. (121) నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు¯ నిన్ను నొడువని జిహ్వదా నీరసంబు¯ నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ¯ గన్నులను జూచి మమ్మును గారవింపు. (122) అనుచు నా దారుకుండు నిర్వేదనపరుండై యిట్లని విన్నవించె; “యాదవసముద్రం బడంగె; బంధు గురు మిత్ర జనంబు లక్కడక్కడం బోయిరి; ద్వారకకుం బోయి సుహృజ్జనంబులతోడ నేమందు?” నని పలుకునవసరంబున దివ్యాయుధంబులును, దివ్య రథరథ్యంబులు నంతర్ధానంబు నొందె; నారాయణుండు వానితో“ నక్రూరవిదురులకు నీవృత్తాంతం బంతయుఁ జెప్పుము; సవ్యసాచిం గని స్త్రీ బాల గురు వృద్ధ జనంబులఁ గరిపురంబునకుం గొనిచను మనుము; పొ” మ్మనిన వాఁడును మరలి చని కృష్ణుని వాక్యంబులు సవిస్తరంబుగాఁ జెప్పె; నట్లు సేయు నాలోన ద్వారకానగరంబు పరిపూర్ణజలంబై మునింగె; నంత నెవ్వరికిం జనరాకయుండె నప్పరమేశ్వరుండును శతకోటి సూర్యదివ్యతేజో విభాసితుండై వెడలి నారదాది మునిగణంబులును, బ్రహ్మరుద్రాదిదేవతలును, జయజయశబ్దంబులతోడం గదలిరా నిజపదంబున కరిగె; నన్నారాయణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపంబై యుండె” నని శుకుండు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పె"నని చెప్పి. (123) ఈ కథ విన్నను వ్రాసిన ¯ బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం¯ జేకొని యాయువు ఘనుఁడై¯ లోకములో నుండు నరుఁడు లోకులు వొగడన్‌. (124) నగుమొగమున్‌ సుమధ్యమును నల్లని మేనును లచ్చికాటప¯ ట్టగు నురమున్‌ మహాభుజము లంచితకుండలకర్ణముల్‌ మదే¯ భగతియు నీలవేణియుఁ గృపారసదృష్టియుఁ గల్గు వెన్నుఁ డి¯ మ్ముగఁబొడసూపుఁగాతఁ గనుమూసినయప్పుడు విచ్చినప్పుడున్‌.

పూర్ణి

(125) రాజీవసదృశనయన! వి¯ రాజితసుగుణా! విదేహరాజవినుత! వి¯ భ్రాజితకీర్తి సుధావృత¯ రాజీవభవాండభాండ! రఘుకులతిలకా! (126) ధరణిదుహితృరంతా! ధర్మమార్గానుగంతా! ¯ నిరుపమనయవంతా! నిర్జరారాతిహంతా! ¯ గురుబుధసుఖకర్తా! కోసలక్షోణిభర్తా! ¯ సురభయపరిహర్తా! సూరిచేతోవిహర్తా! (127) ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్త్ర సహజపాండిత్య పోతనామాత్యప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబు నందుఁ గృష్ణుండు భూభారంబు వాపి యాదవుల కన్యోన్య వైరానుబంధంబుఁ గల్పించి, వారల హతంబు గావించుటయు, విదేహర్షభ సంవాదంబును, నారాయణ ముని చరిత్రంబును, నాలుగు యుగంబుల హరి నాలుగువర్ణంబులై వర్తించుటయు, బ్రహ్మాది దేవతలు ద్వారకానగరంబునకుం జని కృష్ణుం బ్రార్థించి నిజపదంబునకు రమ్మనుటయు, నవధూత యదు సంవాదంబును, నుద్ధవునకుఁ గృష్ణుం డనేకవిధంబు లైన యుపాఖ్యానంబు లెఱింగించుటయు, నారాయణప్రకారం బంతయు దారకుం డెఱింగివచ్చి ద్వారకానివాసులకుం జెప్పుటయుఁ, గృష్ణుండు దన దివ్యతేజంబుతోఁ బరమాత్మం గూడుటయు నను కథలు గల యేకాదశ స్కంధము.