పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 538 - 654

ద్వివిదుని వధించుట

(538) “బలభద్రుఁ డప్రమేయుం ¯ డలఘుఁ డనంతుండు నతని యద్భుతకర్మం ¯ బులు వినియు, దనియ దింకనుఁ¯ దెలియఁగ నా కానతిమ్ము దివ్యమునీంద్రా!” (539) అనిన రాజునకు శుకుం డిట్లనియె. (540) “జననాయక! విను సుగ్రీ ¯ వుని సచివుఁడు మైందునకు సహోదరుఁ డనఁగా ¯ వినుతికి నెక్కిన ద్వివిదుం ¯ డను ప్లవగుఁడు నరకసఖ్యుఁ డతిదర్పితుఁడై. (541) చెలికానిపగఁ దీర్పఁ దలఁచి కృష్ణుం డేలు¯ పురములు జనపదంబులు దహించి ¯ సరి దుపవన సరోవరములు గోరాడి¯ మందలఁ గొందలమందఁ జేసి ¯ ప్రాసాదములు ద్రొబ్బి పరిఖలు మాయించి¯ చతురంగబలముల సమయఁ జేసి ¯ పురుషుల సతులను భూధరగుహలలోఁ¯ బెట్టి వాకిలి గట్టి బిట్టు నొంచి (541.1) ఫలిత తరువులఁ ద్రుంచి సాధుల నలంచి ¯ కోట లగలించి పడుచుల నీట ముంచి ¯ ధరణి నిబ్భంగిఁ బెక్కుబాధలఁ జలంబు ¯ పరఁగఁజేయుచు నొకనాఁడు ప్లవగవరుఁడు. (542) చతుర మృదు గీతరవ ము¯ న్నతి వీతెంచినఁ జెలంగి నగచరుఁ డా రై ¯ వతగిరి కందరమున కా ¯ యతిగతిఁ జని యందు నెత్తమాడెడు వానిన్. (543) లలితవినీలవస్త్రుని విలాసవతీయుతుఁ జంద్రచంద్రికా ¯ కలితమహోన్నతాంగు మణికాంచనదివ్యవిభూషణోన్నతున్¯ విలసితవారుణీసమదవిహ్వలలోచనుఁ గాంచె సీరని¯ ర్దళితరిపుక్షితీశనిజధాముని రాముని కామపాలునిన్. (544) కనుఁగొని తత్పురోగమభూమిరుహశాఖ; ¯ లెక్కి యూఁచుచుఁ జాల వెక్కిరించుఁ; ¯ గికురించుచును బం డ్లిగిల్చి చూపుచు వెసఁ¯ గొమ్మకొమ్మకు నుఱుకుచు నదల్చుఁ; ¯ దోఁక నూరక మేను సోఁకఁగ నులివెట్టు¯ వెడవెడ నాలుక వెడలఁబెట్టుఁ; ¯ బరుల నఖంబుల గిరగిర గోఁకుచుఁ¯ బొరిఁబొరి ఫలములు గఱచి వైచు; (544.1) గోళ్ళు తెగ గొర్కి యుమియును; గుదము సూపు; ¯ బలసి మర్కటజాతి యిప్పగిదిఁ జేయఁ ¯ గోపమున హలధరుఁ డొక గుండు వైవ ¯ దానిఁ దప్పించుకొని ప్రల్లదమున నతని. (545) నగి యాసవకలశముఁ గొని ¯ జగతీరుహశాఖ యెక్కి చాపలమున న¯ జ్జగతిపయి వైచెఁ దద్ఘట ¯ మగలగఁ; నది చూచి కోప మగ్గల మొదవన్. (546) మఱియును. (547) సీరినిఁ దన మనమున నొక ¯ చీరికిఁ గైకొనక కదిసి చీరలు చింపన్ ¯ వారకతఁడు భువిజనములఁ ¯ గారించుట మాన్పఁ దలఁచి ఘనకుపితుం డై. (548) ఇట్లు కోపోద్దీపితమానసుండై కనుంగొని హలాయుధుం డప్పుడు (549) ముసలముఁ దీవ్రశాతహలమున్ ధరియించి సమస్తచేతన¯ గ్రసనమునాఁడు పొంగు లయకాలునిభంగి నదల్చి నిల్వ; వా ¯ డసదృశవిక్రమక్రమవిహార మెలర్ప సమీపభూజమున్ ¯ వెసఁ బెకలించి మస్తకము వ్రేసెఁ జలంబు బలంబు చొప్పడన్. (550) ఇట్లు వ్రేయ బలుం డప్పుడు. (551) ఉరవడి దండతాడితమహోరగుభంగిఁ గడంగి వీర సా ¯ గరమున నేఁచి హేమకటకంబుల నొప్పు సునందనామ భీ ¯ కర ముసలంబునన్ ద్వివిదుకంఠము వ్రేసినఁ బొల్చె వాఁడు జే¯ గురుగల కొండచందమునఁ గోయని యార్చి సురల్‌ నుతింపఁగన్ (552) అంత వాఁ డొక యింత మూర్ఛిలి యంతలోఁ దెలివొంది దు¯ ర్దాంతభూరిభుజావిజృంభణుఁడై మహీజము పూన్చి దై ¯ త్యాంతకాగ్రజు వ్రేసె; వ్రేసిన నాగ్రహంబున దాని నిం ¯ తింతలై ధర రాలఁ జేసె నహీనవిక్రమశాలియై. (553) మఱియునుఁ జల ముడుగక వెసఁ ¯ దరుచరుఁ డొకతరువు వ్రేయఁ దాలాంకుఁ డనా ¯ దరమునఁ దునిమిన వెండియుఁ ¯ దొరఁగించెఁ గుజంబు లతఁడు దోడ్తోఁ దునుమన్. (554) ఆ చందంబున వనచరుఁ ¯ డేచి మహీరుహచయంబు లెల్లను హలిపై ¯ వైచి యవి శూన్య మగుటయుఁ ¯ జూచి శిలావృష్టిఁ గురిసె సుర లగ్గింపన్. (555) బలుఁ డపుడు ఱాలు తుమురై ¯ యిల రాలఁగఁ జేసి యార్వ నే నుడుగక యా ¯ వలిముఖుఁడు తాలసన్నిభ ¯ ము లయిన నిజబాహుదండముల నుగ్రుండై. (556) వడిఁ బిడుగుఁ బోని పిడికిటఁ ¯ బొడిచిన వడి సెడక బలుఁడు ముసలము హలమున్ ¯ విడిచి ప్లవంగుని మెడఁ గడు ¯ వెడవెడ బిగియించె గ్రుడ్లు వెలి కుఱుకంగన్. (557) వదనమునఁ జెవుల రుధిరము ¯ మెదడును దొరఁగంగ వాఁడు మేదినిమీఁదం ¯ జదికిలఁబడి యొక యింతయు ¯ మెదలక మిడుకంగ లేక మృతిఁ బొందె నృపా! (558) వానిపాటున కప్పుడు వనసమేత ¯ మగుచు నా శైలరాజ మల్లల్ల నాడె; ¯ సురగణంబులు రాముపై సురభి కుసుమ ¯ వృష్టి గురియించి రతుల సంతుష్టి మెఱసి. (559) ఇవ్విధంబున భువనకంటకుండైన దుష్టశాఖామృగేంద్రుని వసుంధరకుం బలిచేసి సకల జనంబులుఁ బరమానందకందళిత హృదయారవిందులై తన్ను నందింప నయ్యదునందనుండు నిజ నగరంబున కరుదెంచె"నని శుకుండు వెండియు నమ్మనుజ పతి కిట్లనియె.

సాంబుడు లక్షణ నెత్తకు వచ్చుట

(560) "కోరి సుయోధనుకూఁతురు సర్వల¯ క్షణములు గల్గి లక్షణ యనంగ ¯ మహి నొప్పు కన్యకామణి వివాహంబునఁ¯ జక్రహస్తుని తనూజాతుఁడైన ¯ సాంబుఁడు బలసాహసమున నెత్తుకపోవఁ¯ గౌరవు లీక్షించి "కడఁగి క్రొవ్వి ¯ పడచువాఁ డొకఁ డదె బాలికఁ గొనిపోవు¯ చున్నాఁడు గైకొన కుక్కుమిగిలి (560.1) యిట్టి దుర్మదుఁ గయిముట్టి పట్టి తెచ్చి ¯ జనులు వెఱఁగందఁ జెఱపట్టి యునుతుమేని ¯ యదువులు మనల నేమి సేయంగఁ గలరొ"¯ యనుచుఁ గురువృద్ధజనముల యనుమతమున. (561) ఇట్లు గడంగి యుద్ధసన్నద్ధులై బలశౌర్యోపేతులగు కర్ణ శల్య భూరిశ్రవో యజ్ఞకేతు సుయోధనాదులు సమున్నత రథారూఢులై కూడ నరిగిన వారలఁ గనుంగొని జాంబవతీనందనుండు మందస్మిత వదనారవిందుం డగుచు సింగంబు భంగి గర్జించుచు మణిదీప్తం బైన చాపంబుఁబూని నిల్చిన వారును సాంబు నదల్చి “నిలునిలు” మని పలికి. (562) చండ కోదండ ముక్త నిశాత విశిఖ ¯ జాల మందంద వఱపి యాభీలముగను ¯ నందనందన నందన స్యందనంబు ¯ ముంచి రచలేంద్రమును ముంచు మంచు పగిది. (563) మఱియును. (564) శౌర్యాటోప విజృంభణంబుల సరోజాతాక్షుసూనున్ సురా ¯ హార్యస్థైర్యుని మీఁద నేయ నతఁ డుద్యద్భూరిబాహాబలా ¯ వార్యుండై శితసాయకాలి నవి మాయం జేసినన్ దేవతా ¯ తూర్యంబుల్‌ దివి మ్రోసె; నంత నతఁ డస్తోకప్రతాపోన్నతిన్. (565) ఇట్లు గడంగి బాణజాలంబులు పరఁగించి యందఱ కన్నిరూపులై రథ రథ్య సూతధ్వజ పతాకాతపత్రంబులు చూర్ణంబులుగావించి విరథులం జేసి వారల మెయిమఱవులఱువుళ్ళు గావించి యొక్కొక్కనిఁ బెక్కు బాణంబుల నుచ్చిపోనేసిన వారలు శోణిత దిగ్ధాంగులై కుసుమిత కింశుకంబులం బోలి యుండి; రంత. (566) వార లనేకు లయ్యు బలవంతులునయ్యు మహోగ్రసంగ రో ¯ దారపరాక్రమప్రకటదక్షులునయ్యుఁ గుమారకున్ జగ¯ ద్వీరుని నొక్కనిం జెనకి వ్రేలును వంపఁగలేక సిగ్గునం ¯ గూరినచింత నొండొరులఁ గూడుచు విచ్చుచు వెచ్చనూర్పుచున్. (567) మగిడి సమరసన్నద్ధులై సంరంభించి. (568) అందఱు నొక్కపెట్ట దనుజాంతకనందనుఁ జుట్టుముట్టి యం ¯ దంద నిశాతసాయకచయంబుల ముంచి రథంబు నుగ్ర లీ ¯ లం దునుమాడి చాపము చలంబునఁ ద్రుంచి హయాలిఁజంపి సూ¯ తుం దెగటార్చి యంత విరథుం డగుడున్ వెసఁ జొచ్చి పట్టినన్. (569) బాలకుఁడు చేయునది లేక పట్టువడియెఁ ¯ గౌరవులు దమ మనములఁ గౌతుకంబు ¯ లొలయ సాంబునిఁ గన్యకాయుక్తముగనుఁ¯ బురమునకుఁ దెచ్చి రతులవిభూతి మెఱసి. (570) అంత ద్వారకానగరంబున. (571) జాంబవతేయు వార్త యదుజాతులు నారదయోగిచే సమ¯ స్తంబును విన్నవా రగుచు సంగరకౌతుక ముప్పతిల్లఁ జి¯ త్తంబులఁ గౌరవాన్వయకదంబము నొక్కట నుక్కడంచు కో¯ పంబున నుగ్రసేనజనపాలు ననుజ్ఞ ననూనసైన్యముల్‌. (572) కూడి నడవంగఁ గని వారితోడ బలుఁడు ¯ "ధార్తరాష్ట్రులు మనకు నెంతయును డాసి ¯ నట్టి బంధులు; వారిపై నిట్టి యలుక ¯ నెత్తి చనుచుంట యిది నీతియే తలంప?"

బలుడు నాగనగరం బేగుట

(573) అని వారల వారించి తత్‌క్షణంబ బంధుప్రియుం డైన బలరాముండ నలార్కసంకాశంబగు కాంచనరథం బెక్కి యనురక్తులైన భూసురులును, నుద్ధవాదులగు కులవృద్ధులును సేవింపం గరిపురంబునకుం జని తత్పురోపకంఠవనంబున సురభికుసుమ ఫలభరితతరుచ్ఛాయావిరచిత చంద్రకాంత శిలాతలంబునందు వసియించి, మహితగ్రహమధ్యగతుండైన పూర్ణచంద్రు ననుకరించి యుండె; నంతఁ గార్యబోధనంబు సేయుటకై కౌరవులకడకుఁ బ్రబుద్ధుండైన యుద్ధవునిం బనిచినం జని; యతం డాంబికేయునకు ధనురాచార్యాపగాతనూభవ సుయోధనులకుం బ్రణమిల్లి వారి చేత నభినందితుండై యిట్లనియె. (574) "భూరియశోధనులార! తాలాంకుండు¯ చనుదెంచి నగరోపవనము నందు ¯ నున్నవాఁ"డనిన వా రుత్సాహమున బలుఁ¯ బొడగను వేడుక బుద్ధిఁ దోఁపఁ ¯ నరారు కానికల్‌ గొని చని యర్ఘ్యపా¯ ద్యాదిసత్కృతులు నెయ్యమునఁ జేసి ¯ ధేనువు నిచ్చి సమ్మానించి యందఱు¯ నందంద వందనం బాచరించి (574.1) యుచితభంగిని నచటఁ గూర్చున్న యెడను ¯ "గుశలమే మీకు? మాకును గుశల" మనుచుఁ ¯ బలికి రాముఁడు కురునరపాలుఁ జూచి ¯ యచటి జనములు వినఁగ నిట్లనియెఁ దెలియ. (575) "మా నరనాథునాజ్ఞ నిజమస్తములన్ ధరియించి కౌరవుల్‌ ¯ మానుగఁజేయు టొప్పగుఁ; గుమారకునొక్కనిఁ బెక్కుయూథపుల్‌¯ పూనిన లావుమై నెదిరి పోర జయించుట మీఁదితప్పు; త¯ ప్పైనను గాచె బాంధవహితాత్మకుఁడై మనుజాధినాథుఁడున్." (576) అను మాటలు విని కౌరవ ¯ జననాయకుఁ డాత్మ నలిగి "చాలుఁ బురే? యే ¯ మనఁ గలదు కాలగతి? చ¯ క్కనఁ గాలం దొడుగు పాదుకలు దల కెక్కెన్. (577) మనము బంధువరుస మన్నించు మన్ననఁ ¯ గాదె రాజ్యభోగగరిమఁ బొదలి ¯ వసుధఁ బేరు గలిగి వాసికి నెక్కుటఁ ¯ దమకు ననుభవింపఁ దగని యట్టి. (578) సితచ్ఛత్ర చామర శంఖ కిరీట చిత్రశయ్యా సౌధ సింహాసనంబులు గైకొనుట మన మందెమేలంబునం గాదె? యిట్టిచో సరివారునుం బోలె నూరక గర్వించు యదుకులులతోడి సంబంధ సఖ్యంబులు సాలుఁ; బాములకుఁ బాలు వోసి పెంచిన విషంబు దప్పునే? మమ్ముం దమ పంపుసేయ మనుట సిగ్గులేకుంటఁ గాదె! యదియునుంగాక దివ్యాస్త్రకోవిదులైన గంగానందన గురు కృపాశ్వత్థామ కర్ణాది యోధవీరులకున్ లోఁబడ్డవానిని మహేంద్రునకైనను విడిపింపఁవచ్చునే? యహహ! వృథాజల్పంబుల కేమిపని?” యని దుర్భాషలాడుచు దిగ్గున లేచి నిజమందిరంబునకుం జనియె; నప్పుడు హలాయుధుం డమ్మాటల కదిరిపడి. (579) కౌరవుఁ డాడి పోయిన యగౌరవభాషల కాత్మఁ గిన్క దై ¯ వాఱఁగ నుల్లసత్ప్రళయభానుని కైవడి మండి చండ రో ¯ షారుణితాంబకుం డగుచు యాదవవృద్ధులఁ జూచి పల్కెఁ "బెం ¯ పారిన రాజ్యవైభవమదాంధుల మాటలు మీరు వింటిరే? (580) శ్రీమదాంధులు సామంబుచేతఁ జక్కఁ ¯ బడుదురే యెందు? బోయఁడు బసులఁ దోలు ¯ పగిది నుగ్రభుజావిజృంభణ సమగ్ర ¯ సుమహితాటోప మనిలోనఁ జూపకున్న. (581) కౌరవుల సమయఁజేయ ను ¯ దారత యదువీరవరుల దామోదరుఁడున్ ¯ రా; రావలదని యచ్చట ¯ వారించితిఁ గాదె బంధువత్సలయుక్తిన్. (582) అదియునుం గాక. (583) ఏ దేవు భృత్యులై యింద్రాది దిక్పాల¯ వరులు భజింతురు వరుసతోడ ¯ నే దేవుమందిరం బేపారు దేవతా¯ తరుసభావిభవసుందరతఁ జెంది ¯ యే దేవుపదయుగం బేప్రొద్దు సేవించు¯ నఖిల జగన్మాతయైన లక్ష్మి ¯ యే దేవు చారు సమిద్ధకళాంశ సం¯ భవులము పద్మజభవులు నేను (583.1) నట్టిదేవుండు, దుష్టసంహారకుండు, ¯ హరి, ముకుందుండు పంపుసేయంగ నొప్పు ¯ నుగ్రసేనుని రాజ్యసమగ్రగరిమ ¯ యంతయునుఁ దార యిచ్చిన దంట! తలఁప. (584) అదియునుఁ గాక యెవ్వని పదాంబుజచారురజోవితాన మా ¯ త్రిదివవరాది దిక్పతి కిరీటములందు నలంకరించు; భూ ¯ విదితపుఁ దీర్థముం గడుఁ బవిత్రము సేయును; నట్టి కృష్ణుచేఁ ¯ బొదలిన రాజ్యచిహ్నములఁ బొందఁగ రాదఁట యేమిచోద్యమో! (585) తామఁట తలఁపం దల లఁట ¯ యేమఁట పాదుకల మఁటఁ గణింపఁగ రాజ్య¯ శ్రీమదమున నిట్లాడిన ¯ యీ మనుజాధముని మాట కే మన వచ్చున్?" (586) అని సక్రోధమానుసుండై యప్పుడు. (587) "ధారుణి నిటమీఁదట ని¯ ష్కౌరవముగఁ జేయకున్నఁ గా"దని యుగ్రా ¯ కారుండై బలభద్రుఁడు ¯ సీరము వెసఁ బూన్చి లావుఁ జేవయు నెసఁగన్.

హస్తిన గంగం ద్రోయబోవుట

(588) ఇట్లు పూని కౌరవరాజధాని యైన కరినగరంబు కడతల హలాగ్రంబును జొనిపి యప్పుటభేదనవిస్తారంబగు గడ్డ భుజాగర్వ దుర్వారుండై పెకలించి తిగిచి గంగాప్రవాహంబునం బడఁద్రోయ గమకించిన నప్పుడు, మహాజలమధ్య విలోలంబగు నావ చందంబున నన్నగరంబు వడవడ వడంకుచు గోపుర వప్ర ప్రాకార సౌధా ట్టాలక తోరణ ధ్వజ ద్వార కవాట కుడ్య వీథీ యుతంబుగా నొడ్డ గెడవైనఁ బౌరజనంబులు పుడమి నడుగులిడంగరాక తడంబడుచు, నార్తులై కుయ్యిడుచుండి; రట్టియెడ నమ్మహోత్పాతంబులు గనుంగొని; తాలాంకుండు గినుక వొడమి కావించిన యుపద్రవంబుగా నెఱింగి; దానికిఁ బ్రతీకారంబు లేమిని; గళవళంబున భయాకులమానసు లై పుత్ర మిత్ర కళత్ర బంధు భృత్య పౌరజన సమేతంబుగా భీష్మ దుర్యోధనాది కౌరవులు వేగంబున నతని చరణంబుల శరణంబులుగాఁ దలంచి, సాంబునిఁ గన్యకాయుక్తంబుగా ననేక మణిమయ భూషణాంబర జాలంబుతోఁ గొనివచ్చి; దండప్రణామంబు లాచరించి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి. (589) ”రామ! సమంచితముక్తా ¯ దామ! యశఃకామ! ఘనసుధాధామ! రుచి¯ స్తోమ! జయసీమ! జగదభి ¯ రామ! గుణోద్దామ! నిఖిలరాజలలామా! (590) నీ మహిమ యెఱిఁగి పొగడఁగ ¯ నే మెంతటివార? మఖిలనేతవు; త్రిజగత్‌ ¯ క్షేమంకరుఁడవు; సుమతివి ¯ తామసులము మమ్ముఁ గావఁ దగు హలపాణీ! (591) భూచక్ర మెల్లఁ దాల్చిన ¯ యా చక్రీశ్వరుఁడు దావకాంశుఁడు బలదే ¯ వా! చక్రికి నగ్రజుఁడవు ¯ నీచక్రియ లుడుపఁ జెల్లు నీకు జితారీ! (592) రక్షింపుము రక్షింపు ము ¯ పేక్షింపక నమితనిఖిలబృందారక! ఘో ¯ రక్షణదాచరవిషనిట ¯ లాక్ష! భయాతురుల మమ్ము నరయు మనంతా! (593) మఱియును దేవా! యీ సచరాచరంబు నయిన జగంబుల నీ లీలావినోదంబులం జేసి దుష్టజనమర్దనంబును, శిష్టజనరక్షణంబునుం జేయుచు, జగదుత్పత్తి స్థితి లయహేతువైన నీకు నమస్కరింతు” మని వెండియు నిట్లనిరి. (594) "అవ్యయుండువు; సర్వభూతాత్మకుఁడవు; ¯ సర్వశక్తి ధరుండవు; శాశ్వతుఁడవు; ¯ విశ్వకరుఁడవు; గురుఁడవు; విమలమూర్తి ¯ వైన నిన్ను నుతింప బ్రహ్మకునుఁ దరమె?” (595) అని వినుతించినం బ్రముదితాత్మకుఁడై హలపాణి వారలం ¯ గనుఁగొని "యోడ కోడకుఁడు కార్యగతిం దగి లిట్లు మీరు సే ¯ సిన యవినీతిచేత నిటు చేసితి; నింక భయంబుఁ దక్కి పొం"¯ డనిన సుయోధనుండు వినయంబున నల్లునిఁ గూఁతునుం దగన్. (596) అనుపుచు నరణము దాసీ ¯ జనముల వేయింటి లక్ష సైంధవములఁ దా ¯ నినుమడి యేనుంగులఁ గాం ¯ చన రథముల నాఱువేల సమ్మతి నిచ్చెన్. (597) ఇట్లిచ్చి యనిచిన బలభద్రుండు గొడుకునుంగోడలిం దోడ్కొనుచుఁ బరమానందంబు నొందుచు, నక్కడక్కడి జనంబులు పదివేల విధంబులం బొగడ, నిజపురంబున కరిగి యచ్చట యాదవుల తోడఁ దాఁ గరిపురంబునకుం బోయిన విధంబును, వారలాడిన దురాలాపంబులును, దానందులకై యొనర్చిన ప్రతీకారంబును నెఱింగించి సుఖంబుండె; వారణపురంబు నేఁడును దక్షిణం బెగసి యుత్తరభాగం బొకించుక గంగకై క్రుంగి బలభద్రుని మాహాత్మ్యంబుఁ దెలుపుచున్న” దని ”యమ్మహాతుని భుజవీర్యం బవార్యం” బనిచెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

నారదుని ద్వార కాగమనంబు

(598) "నరవర! యొక్కనాఁడు విను నారదసంయమి మాధవుండు దా¯ నరకునిఁ ద్రుంచి వాని భవనంబున నున్న పదాఱువేల సుం ¯ దరులను నొక్కమాటు ప్రమదంబున నందఱ కన్నిరూపులై ¯ పరిణయ మయ్యె నా విని శుభస్థితిఁ దద్విభవంబుఁ జూడఁగన్. (599) ఇట్లు దలంచి కృష్ణపాలితంబయిన ద్వారకానగరంబు డాయంజని ముందట. (600) శుక శారికా శిఖి పిక కూజిత ప్రస¯ వాంచితోద్యానవనౌఘములనుఁ¯ గలహంస సారస కైరవ కమల క¯ హ్లార శోభిత కమలాకరములఁ ¯ గలమాది సస్య సంకుల వరేక్షుక్షేత్ర¯ భూరి లసన్నదీ తీరములను ¯ గిరిసాను పతిత నిర్ఝరకణ సందోహ¯ సంతత హేమంతసమయములనుఁ (600.1) గమలసంభవ కాంచనకార రచిత ¯ చిరతరైశ్వర్య నగరలక్ష్మీకరాబ్జ ¯ ఘటిత నవరత్నమయ హేమకటక మనఁగ ¯ సొబగుమీఱిన కోటయుఁ జూచె మౌని. (601) మఱియును, సముత్తుంగమణిసౌధగవాక్షరంధ్ర నిర్గత నీరంధ్ర ఘనసార చందనాగరు ధూపధూమపటల విలోకన సంజనిత పయోధరాభిశంకాంగీకృత తాండవకేళీవిలోల పురకామినీజనోప లాలిత నీలకంఠ సముదయంబును, జంద్రకాంతమణిస్ఫటికస్తంభ సంభృత మరకత పద్మరాగఘటిత నవరత్న కాంచనప్రాసాదశిఖరాగ్ర విన్యస్త బహుసూర్య విభ్రమకృదంచిత శాతకుంభకుంభ నిచయంబును, సమస్తవస్తువిస్తార సమర్పిత వైశ్యాగారవీథీవేదికా కలితంబును, మహితాతపనివారణ తరళవిచిత్రకేతనాబద్ధ మయూరశింజినీ నినదపూరితాశాంతరిక్షంబును, సరోజనాభ పూతనాచేతనాపహారాది నూతనవిజయసందేశలిఖిత స్వర్ణ వర్ణావళీవిభాసిత గోపురమణివిటంకప్రదేశంబును, యాదవేంద్ర దర్శనోత్సవాహూయమాన సమాగతనానాదేశాధీశభూరివారణ దానజల ప్రభూతపంకనిరసనైక గతాగత జనసమ్మర్ద కరకంకణ కర్షణ వికీర్యమాణ రజఃపుంజంబును; వినూత్న రత్నమయ మంగళరంగవల్లీ విరాజిత ప్రతిగృహప్రాంగణంబును, గుంకుమ సలిలసిక్త విపణిమార్గంబును, వందిమాగధసంగీతమంగళారావ విలసితంబును, భేరీ మృదంగ కాహళ శంఖ తూర్యరవాధరీకృత సాగరఘోషంబునునై, యమరావతీపురంబునుం బోలె వసుదేవ నందననివాసంబై, యనల పుటభేదనంబునుం బోలెఁ గృష్ణమార్గ సంచారభూతంబై, సంయమనీనామ నగరంబునుం బోలె హరి తనూభవాభిరామంబై, నైరృతినిలయంబునుం బోలెఁ బుణ్యజనాకీర్ణంబై, వరుణనివాసంబునుఁ బోలె గోత్రరక్షణభువనప్రశస్తంబై, ప్రభంజనపట్టణంబునుం బోలె మహాబలసమృద్ధంబై, యలకాపురంబునుం బోలె ముకుంద వర శంఖ మకరాంక కలితంబయి, రజతాచలంబునుం బోలె నుగ్రసేనాధిపార్యాలంకృతంబయి, నిగమంబునుం బోలె వివిధవర్ణక్రమవిధ్యుక్త సంచారంబయి, గ్రహమండలంబునుం బోలె గురుబుధకవిరాజమిత్ర విరాజితంబయి, సంతతకల్యాణవేదియుం బోలె వైవాహికోపేతంబయి, బలిదానవ కరతలంబునుం బోలె సంతతదానవారియుక్తంబయి, యొప్పు నప్పురంబు ప్రవేశించి, యందు విశ్వకర్మనిర్మితంబైన యంతఃపురంబున నుండు షోడశసహస్ర హర్మ్యంబులందు. (602) పటికంపుఁ గంబముల్‌ పవడంపుఁ బట్టెలు¯ మరకత రచితముల్‌ మదురు లమర ¯ వైడూర్యమణిగణవలభులఁ బద్మరా¯ గంబుల మొగడుల కాంతు లొలయ ¯ సజ్ఞాతివజ్ర లసజ్జాల రుచులతో¯ భాసిల్లు నీలసోపానములును ¯ గరుడపచ్చల విటంకములును ఘనరుచి¯ వెలసిన శశికాంత వేదికలును (602.1) వఱలు మౌక్తికఘటిత కవాటములును ¯ బ్రవిమలస్వర్ణమయ సాలభంజికలును ¯ మించు కలరవ మెసఁగఁ గ్రీడించు మిథున ¯ లీలనొప్పు కపోతపాలికలుఁ గలిగి. (603) చేటికానీకపద తులాకోటిమధుర ¯ నినదభరితమై రుచిరమాణిక్య దీప ¯ మాలికయుఁ గల్గి చూపట్టఁ గ్రాలు నొక్క ¯ జలజలోచన నిజసౌధతలము నందు. (604) కనక కంకణ ఝణఝణత్కార కలిత ¯ చంద్రబింబాననా హస్తజలజ ఘటిత ¯ చామరోద్ధూత మారుత చలిత చికుర ¯ పల్లవునిఁ గృష్ణు వల్లవీ వల్లవునిని. (605) మఱియు హాటకనిష్కంబు లఱ్ఱులందు వెలుగొందఁ గంచుకంబులు శిరోవేష్టనంబులుఁ గనకకుండలంబులు ధరించి, సంచరించు కంచుకులును, సమాన వయోరూపగుణవిలాసవిభ్రమ కలితలయిన విలాసినీ సహస్రంబులును గొలువం గొలువున్న యప్పద్మలోచనుం గాంచన సింహాసనాసీనుం గాంచె; నప్పుండరీకాక్షుండును నారదుం జూచి ప్రత్యుత్థానంబు సేసి యప్పుడు. (606) మునివరు పాదాంబుజములు ¯ దన చారుకిరీటమణి వితానము సోఁకన్ ¯ వినమితుఁడై నిజసింహా ¯ సనమునఁ గూర్చుండఁ బెట్టి సద్వినయమునన్. (607) తన పాదకమలతీర్థం ¯ బున లోకములం బవిత్రముగఁ జేయు పురా ¯ తనమౌని లోకగురుఁ డ¯ మ్ముని పదతీర్థంబు మస్తమున ధరియించెన్. (608) ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండునైన నారాయణుం డశేష తీర్థోపమానంబయిన మునీంద్రపాద తీర్థంబు ధరించినవాఁడయి, సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె. (609) "ఏ పని పంచినఁ జేయుదుఁ¯ దాపసవర!"యనుడు నతఁడు "దామోదర! చి¯ ద్రూపక! భవదవతార¯ వ్యాపారము దుష్టనిగ్రహార్థము గాదే! (610) అఖిలలోకైకపతివి, దయార్ద్రమతివి, ¯ విశ్వసంరక్షకుండవు, శాశ్వతుఁడవు ¯ వెలయ నే పనియైనఁ గావింతు ననుట ¯ యార్త బంధుండ విది నీకు నద్భుతంబె! (611) అబ్జసంభవ హర దేవతార్చనీయ, ¯ భూరిసంసారసాగరోత్తారణంబు, ¯ నవ్యయానందమోక్షదాయకము నైన ¯ నీ పదధ్యాన మాత్మలో నిలువనీవె "

షోడశసహస్ర స్త్రీ సంగతంబు

(612) అని యభ్యర్థించి యద్దేవునివలనం బ్రసన్నత వడసి, తన్మందిరంబు వెడలి మునివరుం డమ్మహాత్ముని యోగమాయాప్రభావంబు దెలియంగోరి, వేఱొక చంద్రబింబాననాగేహంబునకుం జని యందు నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధవ యుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కృతుండై యచ్చోట వాసి చని. (613) మునివరుఁడు కాంచె నొండొక ¯ వనజాయతనేత్ర నిజనివాసంబున నం ¯ దనయుతు జిష్ణు సహిష్ణున్ ¯ వినుతగుణాలంకరిష్ణు విష్ణుం గృష్ణున్. (614) నారదుఁ డట చని కనె నొక ¯ వారిజముఖియింట నున్నవాని మురారిన్ ¯ హారిన్ దానవకుల సం ¯ హారిం గమలామనోవిహారిన్ శౌరిన్. (615) ఇట్లు కనుంగొనుచుం జనుచుండ నొక్కయెడ నమ్మునీంద్రునకు ముకుందుండు ప్రత్యుత్థానంబు చేసి “మునీంద్రా! సంపూర్ణకాము లయిన మిమ్ము నపూర్ణకాములమైన మేమేమిటఁ బరితృప్తి నొందఁ జేయంగలవారము? భవదీయదర్శనంబున నిఖిలశోభనంబుల నందెద” మని ప్రియపూర్వకంబుగాఁ బలికిన నా నందనందను మాటలకు నానంద కందళిత హృదయారవిందుండును, మందస్మిత సుందర వదనారవిందుండును నగుచు నారదుండు వెండియుఁ జనిచని. (616) అనఘాత్ముఁడు గనుఁగొనె నొక ¯ వనితామణిమందిరమున వనకేళీ సం ¯ జనితానందుని ననిమిష ¯ వినమితచరణారుణారవిందు ముకుందున్. (617) పరమేష్ఠిసుతుఁడు గనె నొక ¯ తరుణీభవనంబు నందుఁ దను దాన మనోం ¯ బురుహమునఁ దలఁచుచుండెడి ¯ నరకాసురదమనశూరు నందకుమారున్. (618) మఱియుం జనిచని. (619) ఒకచోట నుచితసంధ్యోపాపనాసక్తు¯ నొకచోటఁ బౌరాణికోక్తికలితు ¯ నొకచోటఁ బంచయజ్ఞోచితకర్ముని¯ నొకచోట నమృతోపయోగలోలు ¯ నొకచోట మజ్జనోద్యోగానుషక్తుని¯ నొకచోట దివ్యభూషోజ్జ్వలాంగు ¯ నొకచోట ధేనుదానోత్కలితాత్ముని¯ నొకచోట నిజసుతప్రకరయుక్తు (619.1) నొక్క చోటను సంగీతయుక్త చిత్తు ¯ నొక్కచోటను జలకేళియుతవిహారు ¯ నొక్కచోటను సన్మంచకోపయుక్తు ¯ నొక్కచోటను బలభద్రయుక్తచరితు. (620) మఱియును. (621) సకలార్థసంవేది యొ యింటిలోపలఁ¯ జెలితోడ ముచ్చటల్‌ సెప్పుచుండు ¯ విపులయశోనిధి వేఱొక యింటిలో¯ సరసిజాననఁ గూడి సరస మాడుఁ ¯ బుండరీకదళాక్షుఁ డొండొక యింటిలోఁ¯ దరుణికి హారవల్లరులు గ్రుచ్చుఁ ¯ గరుణాపయోనిధి మఱియొక యింటిలోఁ¯ జెలిఁ గూడి విడియము సేయుచుండు (621.1) వికచకమలనయనుఁ డొకయింటిలో నవ్వు ¯ బ్రవిమలాత్ముఁ డొకటఁ బాడుచుండు ¯ యోగిజనవిధేయుఁ డొకయింట సుఖగోష్ఠి ¯ సలుపు ననఘుఁ డొకటఁ జెలఁగుచుండు. (622) ఇట్లు సూచుచుం జనిచని. (623) చతురానననందనుఁ డం ¯ చితమతిఁ జని కాంచె నొక్క చెలిగేహమునం ¯ గ్రతుకర్మాచరణుని నా ¯ శ్రితభయహరణున్ సురేంద్రసేవితచరణున్. (624) వృత్రారినుతునిఁ బరమ ప ¯ విత్రుని నారదుఁడు గాంచె వేఱొక యింటం ¯ బుత్రక పౌత్త్రక దుహితృ క ¯ ళత్రసమేతుని ననంతు లక్షణవంతున్. (625) సుందరమగు నొక సుందరి ¯ మందిరమునఁ బద్మభవకుమారుఁడు గాంచెన్ ¯ నందితనందున్ సుజనా ¯ నందున్ గోవిందు నతసనందు ముకుందున్. (626) జలజభవసుతుఁడు గనె నొక ¯ నలినాక్షినివాసమందు నతభద్రేభున్ ¯ జలదాభున్ గతలోభు¯ న్నలకాళిజితద్విరేఫు నంబుజనాభున్. (627) ఒకయింటం గజవాజిరోహకుఁడునై యొక్కింట భుంజానుఁడై ¯ సకలాత్ముండు పరుండు షోడశసహస్రస్త్రీనివాసంబులం ¯ దొక బోటింటను దప్పకుండ నిజమాయోత్సాహుఁడై యుండ న¯ య్యకలంకున్వరదున్, మహాపురుషు, బ్రహ్మణ్యున్నతాబ్జాసనున్, (628) అస్తోకచరితు, నమిత స ¯ మస్త సుధాహారు వేద,మస్తకతల వి¯ న్యస్త పదాంబుజయుగళు, న ¯ పాస్తశ్రితనిఖిలపాపుఁ, బరము, ననంతున్. (629) పరమభాగవతుఁడు పరమేష్ఠితనయుండు ¯ మనుజలీలఁ జెంది మహితసౌఖ్య ¯ చిత్తుఁడైన యా హృషీకేశు యోగమా ¯ యాప్రభావమునకు నాత్మ నలరి. (630) "మాయురె? హరిహరి! వరద! య ¯ మేయగుణా!"యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుం ¯ డా యదునాయకు సుజన వి ¯ ధేయుని కిట్లనియె దేవ! త్రిజగములందున్. (631) "నీ మాయఁ దెలియువారలె ¯ తామరసాసన సురేంద్ర తాపసు లైనన్ ¯ ధీమంతులు నీ భక్తిసు ¯ ధామాధుర్యమునఁ బొదలు ధన్యులు దక్కన్. " (632) అని హర్షించుచు "నిఁక నేఁ ¯ బనివినియెద నిఖిలలోకపావనమును స¯ జ్జనహితము నైన నీ కీ ¯ ర్తన మఖిలజగంబులందుఁ దగ నెఱిఁగింతున్. " (633) అని తద్వచనసుధాసే ¯ చనమున ముది తాత్ముఁ డగుచు సంయమి చిత్తం ¯ బునఁ దన్మూర్తిం దగ నిడు ¯ కొని చనియెను హరినుతైకకోవిదుఁ డగుచున్. (634) ఈ పగిది లోకహితమతి ¯ నా పరమేశ్వరుఁడు మానవాకృతిఁ ద్రిజగ¯ ద్దీపితచారిత్రుఁడు బహు ¯ రూపములం బొందె సుందరుల నరనాథా! (635) అని హరి యిట్లు షోడశసహస్రవధూమణులం బ్రియంబునన్ ¯ మనసిజకేళిఁ దేల్చిన యమానుషలీల సమగ్రభక్తితో ¯ వినినఁ బఠించినం గలుగు విష్ణుపదాంబుజభక్తియున్ మహా ¯ ధన పశు పుత్త్ర మిత్ర వనితాముఖ సౌఖ్యములున్ నరేశ్వరా! " (636) అని చెప్పి యప్పారాశర్యనందనుం డభిమన్యునందను కిట్లనియె; “నా నిశావసానంబునఁ బద్మబాంధవాగమనంబును గమలినీ లోకంబునకు మునుకలుగ నెఱింగించు చందంబునం గలహంస సారస రథాంగ ముఖ జలవిహంగంబుల రవంబులు సెలంగ నరుణోదయంబున మంగళపాఠకసంగీత మృదుమధుర గాన నినదంబును లలితమృదంగ వీణా వేణు నినాదంబును, యేతేర మేలుకని తనచిత్తంబునఁ జిదానందమయుం బరమాత్ము నవ్యయు నవికారు నద్వితీయు నజితు ననంతు నచ్యుతు నమేయు నాఢ్యు నాద్యంతవిహీనుఁ బరమబ్రహ్మంబునైన తన్నుందా నొక్కింత చింతించి యనంతరంబ విరోధి రాజన్య నయన కల్హారంబులు ముకుళింప భక్తజననయనకమలంబులు వికసింప నిరస్త నిఖిల దోషాంధకారుం డైన గోవిందుండు మొగిచిన లోచనసరోజంబులు వికసింపఁ జేయుచుఁ దల్పంబు డిగ్గి చనుదెంచి యంత. (637) మలయజకర్పూరమహితవాసితహేమ¯ కలశోదకంబుల జలకమాడి ¯ నవ్యలసన్మృదు దివ్యవస్త్రంబులు¯ వలనొప్ప రింగులువాఱఁ గట్టి ¯ మకరకుండల హార మంజీర కేయూర¯ వలయాది భూషణావలులు దాల్చి ¯ ఘనసార కస్తూరికా హరిచందన¯ మిళితపంకము మేన నలర నలఁది (637.1) మహితసౌరభ నవకుసుమములు దుఱిమి ¯ పొసఁగ రూపైన శృంగారరస మనంగ ¯ మూర్తిఁ గైకొన్న కరుణాసముద్ర మనఁగ ¯ రమణ నొప్పుచు లలితదర్పణము చూచి. (638) కడఁగి సారథి తెచ్చిన కనకరథము ¯ సాత్యకి హిత ప్రియోద్ధవ సహితుఁ డగుచు ¯ నెక్కి నిజకాంతి దిక్కులఁ బిక్కటిల్లఁ ¯ బూర్వగిరిఁ దోఁచు భానునిఁ బోలి వెలిఁగె. (639) అభినవ నిజమూర్తి యంతఃపురాంగనా¯ నయనాబ్జములకు నానంద మొసఁగ ¯ సలలిత ముఖచంద్ర చంద్రికాతతి పౌర¯ జనచకోరముల కుత్సవము సేయ ¯ మహనీయకాంచనమణిమయ భూషణ¯ దీప్తులు దిక్కులఁ దేజరిల్ల ¯ నల్ల నల్లన వచ్చి యరదంబు వెస డిగ్గి;¯ హల కులిశాంకుశ జలజ కలశ (639.1) లలితరేఖలు ధరణి నలంకరింప ¯ నుద్ధవుని కరతల మూని యొయ్య నడచి ¯ మహితగతి దేవతాసభామధ్యమునను ¯ రుచిర సింహాసనమునఁ గూర్చుండె నెలమి. (640) అతి విభవంబునం దనరి యాత్మతనుద్యుతి తేజరిల్లఁగా ¯ హితులుపురోహితుల్వసుమతీశులుమిత్రులుబాంధవుల్‌బుధుల్‌¯ సుతులునుమాగధుల్కవులుసూతులు మంత్రులుభృత్యులున్శుభ¯ స్థితిఁ గొలువంగఁ నొప్పె నుడుసేవితుఁ డైన సుధాంశుఁడో యనన్. (641) కరుణార్ద్రదృష్టిఁ బ్రజలం ¯ బరిరక్షించుచు వివేకభావకళా చా ¯ తురి మెఱసి యిష్టగోష్ఠిం ¯ బరమానందమున రాజ్యభారకుఁ డగుచున్.

భూసురుని దౌత్యంబు

(642) ఇవ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్కనా డపూర్వదర్శనుం డైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభా మధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునఁ గరములు మొగిచి యిట్లనియె. (643) "కంజవిలోచన! దానవ ¯ భంజన! యోగీంద్రవిమలభావలసద్బో ¯ ధాంజన! దీప్తినిదర్శన! ¯ రంజితశుభమూర్తి! కృష్ణ! రాజీవాక్షా! (644) అవధరింపు; జరాసంధుఁ డతుల బలుఁడు ¯ దనకు మ్రొక్కని ధారుణీధవుల నెల్ల ¯ వెదకి తెప్పించి యిరువదివేల నాఁకఁ ¯ బెట్టినాఁడు గిరివ్రజపట్టణమున. (645) వారు పుత్తేర వచ్చినవాఁడ నేను ¯ నరవరోత్తమ! నృపుల విన్నపము గాఁగ ¯ విన్నవించెద నామాట వినినమీఁద ¯ ననఘ! నీ దయ! వారి భాగ్యంబు కొలఁది. " (646) అని ధరాధిపుల విన్నపంబుగా నిట్లనియె. (647) "వారిజనాభ! భక్త జనవత్సల! దుష్టమదాసురేంద్ర సం ¯ హార! సరోరుహాసన పురారి ముఖామరవంద్య పాదపం ¯ కేరుహ! సర్వలోకపరికీర్తిత దివ్యమహాప్రభావ! సం ¯ సారవిదూర! నందతనుజాత! రమాహృదయేశ! మాధవా! (648) ఆర్త జనుల మమ్ము నరసి రక్షింపు మ ¯ హాత్మ! భక్తజనభయాపహరణ! ¯ నిన్ను మది నుతించి నీకు మ్రొక్కెదము నీ ¯ చరణయుగము మాకు శరణ మనఘ! (649) బలియుర దండింపఁగ దు¯ ర్బలులను రక్షింప జగతిపై నిజలీలా ¯ కలితుఁడవై యుగయుగమున ¯ నలవడ నుదయింతు కాదె? యభవ! యనంతా! (650) నీమదిఁ దోఁపని యర్థం¯ బీ మేదిని యందుఁ గలదె యీశ్వర! భక్త¯ స్తోమసురభూజ! త్రిజగ¯ త్క్షేమంకర! దీనరక్ష సేయు మురారీ! (651) నీ పంపు సేయకుండఁగ¯ నా పద్మభవాదిసురులకైనను వశమే? ¯ శ్రీపతి! శరణాగతులం ¯ జేపట్టి నిరోధ ముడుగఁ జేయుము కృష్ణా! (652) అభవుఁ డవయ్యును జగతిం ¯ బ్రభవించుట లీల గాక భవమందుటయే ¯ ప్రభువులకుం బ్రభుఁడవు మము ¯ సభయాత్ముల నరసి కావఁ జను నార్తిహరా! (653) కదనమున నీ భుజావలి ¯ కెదిరింపఁగ లేక పాఱఁడే విక్రమ సం ¯ పద సెడఁగ జరాసంధుఁడు ¯ పదునెనిమిదిసార్లు ధరణిపాలురు నవ్వన్. (654) ఇట్లు తనపడిన బన్నములం దలంపక సింహంబు సమదదంతావళంబుల నరికట్టి కావరించు చందంబున మమ్ముం జెఱపట్టి బాధించుచున్న యప్పాపాత్ముని మర్దించి కారాగృహబద్ధుల మగు మా నిర్బంధంబులు వాపి, సుత దార మిత్ర వర్గంబులం గూర్చి యనన్యశరణ్యులమైన మమ్ము రక్షింపు”మని విన్నవించి" రని బ్రాహ్మణుండు విన్నపంబు సేయు సమయంబున.