పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 765 - 886

రాజసూయంబు నెఱవేర్చుట

(765) అని గోవిందునిం బొగడి, యద్దేవు ననుమతంబునం గుంతీసుతాగ్రజుండు పరతత్త్వవిజ్ఞాను లైన ధరిణీసురులను ఋత్విజులంగా వరియించి. (766) సాత్యవతేయ, కశ్యప, భరద్వాజోప¯ హూతి, విశ్వామిత్ర, వీతిహోత్ర, ¯ మైత్రేయ, పైల, సుమంతు, మధుచ్ఛంద, ¯ గౌతమ, సుమతి, భార్గవ, వసిష్ఠ, ¯ వామదేవాకృతవ్రణ, కణ్వ, జైమిని, ¯ ధౌమ్య, పరాశరాధర్వ, కవషు, ¯ లసిత, వైశంపాయ, నాసురి, దుర్వాస, ¯ క్రతు, వీరసేన, గర్గ, త్రికవ్య, (766.1) ముఖ్యులైన పరమమునులను, గృపుని, గాం ¯ గేయ, కుంభజాంబికేయ, విదుర, ¯ కురుకుమార, బంధు, కులవృద్ధ, ధారుణీ ¯ సుర, నరేంద్ర, వైశ్య, శూద్రవరుల. (767) రప్పింప వారు హర్షము ¯ లుప్పతిలఁగ నేఁగుదెంచి, యుచితక్రియలం ¯ దప్పక కనుఁగొనుచుండఁగ ¯ నప్పుడు విధ్యుక్త నియతులై భూమిసురుల్‌. (768) కడఁగి సవనభూమిఁ గనకలాంగలముల ¯ నర్థి దున్ని పాండవాగ్రజునకు ¯ నచట దీక్షచేసి యంచితస్వర్ణ మ ¯ యోపకరణముల నలోపముగను, (769) ఇట్లు నియమంబున సముచిత క్రియాకలాపంబులు నడపుచుండి రప్పుడు. (770) సకలావనీశు లిచ్చిన ¯ యకలంక సువర్ణరత్న హయ ధన వస్త్ర¯ ప్రకరంబులు మొదలగు కా ¯ నుక లందుకొనన్ సుయోధనుని నియమించెన్. (771) అర్థిజాతము గోరినట్టి వస్తువు లెల్లఁ¯ దగఁ బంచియిడఁగఁ రాధాతనూజు, ¯ సరసాన్న పానాది సకలపదార్థముల్‌¯ పాకముల్‌ సేయింపఁ బవనతనయుఁ, ¯ బంకజోదరు నొద్దఁ బాయక పరిచర్య¯ దవిలి కావింప వాసవతనూజు, ¯ సవన నిమిత్తంబు సంచితద్రవ్యంబు¯ పెంపుతో వేగఁ దెప్పింప నకులు, (771.1) దేవగురు వృద్ధధాత్రీసురావలులను ¯ నరసి పూజింప సహదేవు నఖిలజనులఁ ¯ బొలుచు మృష్టాన్న తతులఁ దృప్తులను జేయ ¯ ద్రౌపదిని నియమించెను ధర్మసుతుఁడు. (772) అయ్యవసరంబున. (773) హరి శిఖి దండపాణి నికషాత్మజ పాశి సమీర గుహ్యకే¯ శ్వర శశిమౌళి పంకరుహసంభవ చారణ సిద్ధ సాధ్య కి¯ న్నర గరుడోరగామరగణంబులు వచ్చి మఖంబుఁ జూచి య¯ చ్చెరువడి "తొల్లి యెవ్వరునుఁ జేయుమఖంబులునింత యొప్పునే (774) అదిగాక యిందిరావిభు ¯ పదములు సేవించునట్టి భాగ్యము గలుగం ¯ దుదిఁ బడయరాని బహు సం ¯ పద లెవ్వియుఁ గలవె?"యనుచుఁ బ్రస్తుతి సేయన్. (775) అప్పుడు. (776) అమరసమానులై తనరు యాజకవర్గములోలి రాజసూ ¯ యమఖవిధానమంత్రముల నగ్నిముఖంబుగఁ జేసి ధర్మజుం ¯ గ్రమమున వేలిపింపఁ గ్రతురాజసమాప్తిదినంబునన్ నృపో ¯ త్తముఁడు గడంగి యాజకసదస్య గురుద్విజకోటిఁ బెంపునన్. (777) పూజించునప్పు డందగ్రపూజార్హు లెవ్వరని యడిగిన సదస్యులు దమకుఁ దోఁచిన విధంబులం బలుక వారి భాషణంబులు వారించి వివేకశీలుండును, జతురవచనకోవిదుండును నగు సహదేవుండు భగవంతుండును, యదుకులసంభవుండును నైన శ్రీకృష్ణునిం జూపి “యిమ్మహాత్ముని సంతుష్టుంజేసిన భువనంబు లన్నియుం బరితుష్టిం బొందు” నని చెప్పి ధర్మజుం జూచి యిట్లనియె. (778) "కాలము దేశమున్ గ్రతువుఁ గర్మముఁ గర్తయు భోక్తయున్ జగ¯ జ్జాలముదైవమున్గురువుసాంఖ్యముమంత్రమునగ్నియాహుతుల్‌¯ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్‌ ¯ లీలలఁ దాన యై తగ వెలింగెడు నెక్కటితేజ మీశుఁడున్. (779) ఇతఁడె యితండు గన్ను లొకయించుక మోడ్చిన నీ చరాచర¯ స్థితభువనంబు లన్నియు నశించు నితం డవి విచ్చిచూచినన్ ¯ వితతములై జనించుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు నైన యట్టి యీ ¯ క్రతుఫలదుండుగా కొరుఁ డొకం డెటు లర్హుఁడు శిష్టపూజకున్? (780) ఈ పురుషోత్తమున్, జగదధీశు, ననంతుని, సర్వశక్తుఁ, జి¯ ద్రూపకు నగ్రపూజఁ బరితోషితుఁ జేయ సమస్త లోకముల్‌ ¯ వే పరితుష్టిఁ బొందుఁ బృథివీవర! కావున నీవు కృష్ణునిన్, ¯ శ్రీపతిఁ బూజసేయు మెడసేయక మాటలు వేయు నేటికిన్?" (781) అని సహదేవుఁడు పలికిన ¯ విని యచ్చటి జనులు మనుజవిభులును ఋషులున్ ¯ మునుకొని మనములు మోదము ¯ దనుకఁగ నిది లెస్స యనిరి ధర్మజుఁ డంతన్. (782) మునిజనమానసమధుకర ¯ వనజాతములైన యట్టి వారిజదళలో ¯ చను పదయుగళప్రక్షా ¯ ళన మొగిఁ గావించి తజ్జలంబులు భక్తిన్. (783) తానును గుంతియు ననుజులు ¯ మానుగ ద్రుపదాత్మజయును మస్తకములఁ బెం ¯ పూనిన నియతి ధరించి మ ¯ హానందము బొంది రతిశయప్రీతిమెయిన్. (784) చంచత్కాంచన రుచిరో ¯ దంచితవస్త్రముల నూతనార్కప్రభలన్ ¯ మించిన రత్నములం బూ ¯ జించెన్ ధర్మజుఁడు కృష్ణు జిష్ణు సహిష్ణున్. (785) ఇట్లు పూజించి యానందబాష్పజల బిందుసందోహకందళిత నయనారవిందంబులం గోవిందుని సుందరాకారంబు దర్శింపఁ జాలకుండె; నట్లు పూజితుండై తేజరిల్లు పుండరీకాక్షు నిరీక్షించి హస్తంబులు నిజమస్తకంబుల ధరించి వినుతుల సేయుచు, నఖిలజనంబులు జయజయ శబ్దంబు లిచ్చిరి; దేవతలు వివిధ తూర్యఘోషంబులతోడం బుష్పవర్షంబులు గురియించి; రయ్యవసరంబున. (786) దమఘోషసుతుఁడు దద్విభ ¯ వము సూచి సహింప కలుక వట్రిలఁగా బీ ¯ ఠము డిగ్గి నిలిచి నిజ హ¯ స్తము లెత్తి మనోభయంబు దక్కినవాఁడై. (787) అప్పు డప్పుండరీకాక్షుండు వినుచుండ సభాసదులం జూచి యిట్లనియె.

శిశుపాలుని వధించుట

(788) "చాలుఁ బురే యహహా! యీ ¯ కాలము గడపంగ దురవగాహం బగు నీ ¯ తేలా తప్పెను నేఁ డీ ¯ బాలకు వచనములచేతఁ బ్రాజ్ఞుల బుద్ధుల్‌? (789) ఇట్లు దప్పిన తెఱం గెట్టనినఁ బాత్రాపాత్ర వివేకంబు సేయనేర్చిన విజ్ఞాననిపుణులు, నున్నతసత్త్వ గరిష్ఠులు, బహువిధ తపోవ్రత నియమశీలురు, ననల్పతేజులు, మహైశ్వర్యశక్తిధరులుఁ, బరతత్త్వవేదులు, నఖిలలోకపాలపూజితులు, విగతపాపులుఁ, బరమయోగీంద్రులు నుండ వీరిం గైకొనక వివేకరహితులై గోపాలబాలునిం బూజసేయుటకు నెట్లు సమ్మతించిరి; పురోడాశంబు సృగాలంబున కర్హంబగునే? యదియునుంగాక. (790) గురుదేవశూన్యుండు, కులగోత్రరహితుండు, ¯ దలిదండ్రు లెవ్వరో తడవఁ గాన, ¯ మప్పులఁ బొరలెడు, నాదిమధ్యావసా¯ నంబులం దరయ మానంబు లేదు, ¯ బహురూపియై పెక్కుభంగుల వర్తించు, ¯ వావి వర్తనములు వరుస లేవు ¯ పరికింప విగతసంబంధుండు, తలపోయ¯ మా నిమిత్తంబున మాని సయ్యెఁ (790.1) బరఁగ మున్ను యయాతిశాపమునఁ జేసి ¯ వాసి కెక్కదు యీ యదువంశమెల్ల, ¯ బ్రహ్మతేజంబు నెల్లఁ గోల్పడిన యితఁడు ¯ బ్రహ్మఋషి సేవ్యుఁ డగునె గోపాలకుండు? (791) జారుఁడు, జన్మావధియునుఁ¯ జోరుఁడు, ముప్పోకలాఁడు సుమహితపూజా ¯ చారక్రియలకు నర్హుఁడె? ¯ వారక యితఁ"డనుచు నశుభవాక్యస్ఫూర్తిన్. (792) అని తను దూఱనాడిన మురాంతకుఁడా శిశుపాలు వాక్యముల్‌¯ విని మదిఁ జీరికిం గొనఁడు విశ్రుతఫేరవ రావ మాత్మఁ గై ¯ కొనని మృగేంద్రురీతి మునికోటియు రాజులుఁ బద్మనాభు నా ¯ డిన యవినీతి భాషలకు డెందమునం గడు వంత నొందుచున్. (793) వీనులుమూసికొంచు వినవిస్మయ మంచు "ముకుంద! మాధవా! ¯ శ్రీనిధి! వీని నేగతికిఁ జేర్చెదొ"యంచు దురాత్ముఁ దిట్టుచు¯ న్నా నరనాథులున్ మునులు నచ్చట నిల్వక పోవఁ బాండు సం ¯ తానము లప్రమేయ బలదర్ప మహోద్ధత రోషచిత్తులై. (794) అప్పుడు కేకయ సృంజయభూపతులుం దామును వివిధాయుధ పాణులై యదల్చి నిల్చిన వాఁడునుం బిఱుతివక యదల్చి పలకయు వాలునుం గైకొని, భుజాగర్వదుర్వారుండై గోవిందునిఁ దదనువర్తులైన వారలం గుపితుండై నిందింప నమ్ముకుందుం డాగ్రహంబున లేచి తన కట్టెదుర నెదిర్చియున్న శిశుపాలుని రూక్షేక్షణంబుల వీక్షించుచు, నా క్షణంబ తన్మస్తకంబు నిశితధారా కరాళంబైన చక్రంబున నవక్రపరాక్రముండై రుధిరంబు దొరఁగం దునుమ, నమ్మహాకలకలం బాకర్ణించి చైద్యబలంబులు దదీయపక్షచరులైన భూపతులును గనుకనిం బఱచి; రయ్యవసరంబున. (795) మునివరులును జనపతులునుఁ¯ గనుఁగొని వెఱఁగంద జైద్యుగాత్రమునందుం ¯ డనుపమ తేజము వెలువడి ¯ వనజోదరు దేహమందు వడిఁ జొచ్చె నృపా! " (796) అనిన మునివరునకు భూవరుం డిట్లనియె. (797) "కమలాక్షుని నిందించిన ¯ దమఘోషతనూభవుండు దారుణ మల కూ ¯ పమునుం బొందక యే క్రియ ¯ సుమహితమతిఁ గృష్ణునందుఁ జొచ్చె మునీంద్రా! " (798) అనిన శుకయోగి రాజయోగి కిట్లనియె. (799) "మధుదైత్యాంతకుమీఁది మత్సరమునన్ మత్తిల్లి జన్మత్రయా ¯ వధి యే ప్రొద్దుఁ దదీయ రూప గుణ దివ్యధ్యాన పారీణ ధీ ¯ నిధి యౌటన్ శిశుపాలభూవిభుఁడు తా నిర్ధూత సర్వాఘుఁడై ¯ విధి రుద్రాదుల కందరాని పదవిన్ వే పొందె నుర్వీశ్వరా!

ధర్మరాజాదుల అవబృథంబు

(800) అంత ధర్మనందనుండు ఋత్విగ్గణంబులను సదస్యులను బహుదక్షిణలం దనిపి వివిధార్చనలం బూజించి యవభృథస్నానక్రియా పరితోషంబున. (801) మురజ, మృదంగ, గోముఖ, శంఖ, డిండిమ, ¯ పణవాది రవము లంబరము నిండఁ, ¯ గవి, సూత, మాగధ, గాయక, వంది, వై¯ తాళిక వినుతు లందంద బెరయ, ¯ వితతమర్దళ వేణు వీణారవంబుల¯ గతులకు నర్తకీగతులు సెలఁగఁ, ¯ దరళ విచిత్రక ధ్వజపతాకాంకిత¯ స్యందన గజ వాజిచయములెక్కి (801.1) సుత, సహోదర, హిత, పురోహితజనంబు ¯ గటక, కేయూర, హార, కంకణ కిరీట ¯ వస్త్ర మాల్యానులేపనవ్రాతములను ¯ విభవ మొప్పారఁ గైసేసి వెడల నంత. (802) మఱియు యదు, సృంజయ, కాంభోజ, కురు, కేకయ, కోసల, భూపాల ముఖ్యులు చతుర్విధ సేనాసమేతులై ధరణి గంపింప వెన్నడి నడతేర, ఋత్విఙ్నికాయంబును సదస్యులను బ్రహ్మ ఘోషంబు లొలయ మున్నిడికొని, శోభమానానూన ప్రభాభాసమాన సువర్ణమయమాలికా దివ్యమణిహారంబులు గంఠంబునం దేజరిల్ల, నున్నత జవాశ్వంబులం బూన్చిన పుష్పరథంబుఁ గళత్ర సమేతుండై యెక్కి, యతిమనోహర విభవాభిరాముండై చనుదెంచు చుండె; నప్పుడు వారాంగనా జనంబులు దమ తమ వారలం గూడికొని. (803) కనకాద్రిసానుసంగత కేకినుల భాతిఁ¯ గ్రొమ్ముళ్ళు వీఁపుల గునిసి యాడఁ, ¯ దరళ తాటంక ముక్తాఫలాంశుద్యుతుల్‌¯ చెక్కుటద్దములతోఁ జెలిమిసేయఁ, ¯ బొలసి యదృశ్యమై పోని క్రొమ్మెఱుఁగుల¯ గతులఁ గటాక్షదీధితులు దనర, ¯ మంచుపై నెగయ నుంకించు జక్కవ లనఁ¯ జన్నులు జిలుఁగు కంచలల నఱుమ, (803.1) మహితకుచభారకంపితమధ్య లగుచు, ¯ నర్థి మొలనూళ్ళు మెఱయఁ, బయ్యదలు జారఁ ¯ గరసరోజాతకంకణక్వణనములునుఁ¯ జరణనూపురఘోషముల్‌ సందడింప. (804) మఱియు నయ్యిందువదన లందంద మందగమనంబునం జెందు ఘర్మజల బిందుసందోహ కందళిత మందహాసచంద్రికాసుందర వదనారవిందంబుల నిందిందిర రుచిర చికురబృందంబులు చిందఱవందఱలై సందడిగొన, నమందానందహృదయలై, సువర్ణశృంగ సంగతంబులైన సంకుమద మలయజ ముఖ సురభితోయంబులు సముదాయంబులై తమ తోయంబులవారి పయిం జల్లుచుఁ జెందొవలఁ గెందలిరుల రచియించిన చిమ్మనగ్రోవులఁ దావులు గల పూఁదేనియలు నించి, వావులు దెలిపి, ఠేవలు మీఱఁ, గ్రేవల నుండి యిమ్ములం గని చిమ్ముచు, మృగమద కుంకుమ పంకంబునుం గొంకక బింకములం జంకెన లొలయం బంకజ సన్నిభంబు లగు మొగంబుల నేమఱించి చరుముచు నుల్లంబులు పల్లవింపఁ బెల్లడరి యందియలు గల్లుగల్లని మొరయఁ, గ్రేళ్లుదాఁటుచుం జారు చంద్రికాసార ఘనసారధూళి మిళిత రజనీపరాగంబు రాగంబు రంజిల్లం, గరంబులం బుచ్చికొని శిరంబులం జల్లుచుఁ జిత్తంబుల నమ్మత్తకాశినుల వృత్తంబులగు కుచంబుల కెత్తువత్తుమని బిత్తరించు పువ్వుగుత్తులం దత్తఱంబున వ్రేయుచుఁ, బరిహసించుచు, నన్యోన్యకర కిసలయ కనకకరండభరితంబగు పన్నీటం జెంగావి జిలుఁగుఁ బుట్టంబులు దట్టంబుగాఁ దోఁగి మర్మంబులు బయలు పడిన నగ్గలంబు లగు సిగ్గులకు నొప్పిదంబులగు తమ కనుఱెప్ప లడ్డంబు సేయుచుఁ, బురుషులుం దాము నారామ లభిరామలీలా రసోక్తు లెనయ, నంతరంగంబుల సంతసంబునం బంతంబులిచ్చుచు వసంతంబు లాడి రవ్వేళ, నతుల విమానారూఢులైన యింద్రపురంధ్రీజనంబులుంబోలె హాటకశిబిక లెక్కి, నిజచేటికాజనంబులు సేవింపఁ జనుదెంచు భూకాంతకాంతాజనంబులం దమ సరసంబులకు నర్హంబులైన ధరణీపాల వధూలలామంబు లాదరించు చెలులపైఁ దమ సఖీజనంబులం బురికొల్పి చల్లించుచు, భావగర్భితంబులగువారి చతురసరసోక్తుల మందహాసచంద్రికలు ముఖకమల లీలావిలాసలక్ష్మిం బ్రోదిసేయం జని రవ్విధంబున, నిజసామ్రాజ్య విభవంబు పూజ్యంబుగా నజాతశత్రుండు గంగాప్రవాహంబున కరిగి యందు నిజవధూయుక్తుండై శాస్త్రోక్తప్రకారంబున నవభృథస్నానం బాచరించె; నా సమయంబున. (805) అనిమిషదుందుభి ఘన ని¯ స్వనములు వీతెంచెఁ, బుష్పవర్షము గురిసెన్, ¯ మునిదేవపితృమహీసుర ¯ వినుతుల రవ మెసఁగె నపుడు విమలచరిత్రా! (806) నరులెట్టి పాపు లైననుఁ¯ గర మర్థిని నెద్ది సేసి గతకల్మషులై ¯ చరియింతు రట్టి యవభృథ ¯ మరుదుగఁ గావించి రెలమి నఖిలజనంబుల్‌. (807) అంత ధర్మతనయుఁడభినవమృదుల దు ¯ కూల సురభికుసుమమాలికాను ¯ లేపనములు రత్నదీపితభూషణా ¯ వళులు దాల్చి వైభవమున నొప్పె. (808) అంత నవభృథస్నానానంతరంబున మరలి చనుదెంచి, (809) పాండుతనూభవాగ్రజుఁడు, పాండుయశోనిధి, భాసమాన మా ¯ ర్తాండనిభుండు యాజక, సదస్య, మహీసుర, మిత్ర, బంధు, రా ¯ ణ్మండలిఁ బూజ సేసి బుధమాన్యచరిత్రుడు వారి కిచ్చెనొం ¯ డొండ దుకూలరత్న కనకోజ్జ్వలభూషణముఖ్యవస్తువుల్‌. (810) అట్లు నారాయణపరాయణులై దేవసమాన ప్రకాశప్రభావంబుల సకలనరనారీలోకంబు లనర్ఘ్యరత్నమయభూషణ మాల్యానులేపనంబులు ధరించి పరమానంద భరితాత్ములై యెప్పియుండి; రంత. (811) సునిశితభక్తిఁ దన్మఖముఁ జూడఁగ వచ్చిన యట్టి దేవతా, ¯ ముని, ధరణీసురప్రకర, భూవర, విడ్జన, శూద్రకోటి య¯ జ్జనవరచంద్రుచే నుచిత సత్కృతులం బరితోషచిత్తులై ¯ వినయముతోడ ధర్మజుని వీడ్కొని పోవుచుఁ బెక్కుభంగులన్. (812) హరిచరణాంబుజాతయుగళార్చకుఁడై పెనుపొందు పాండుభూ¯ వరసుత రాజసూయమఖ వైభవమున్ నుతియించుచున్, సమా¯ దరమున నాత్మభూముల కుదారత నేఁగిరి; ధర్మసూనుఁడున్ ¯ సరసిజనేత్రుఁ దా ననుపఁజాలక యుండు మటంచు వేఁడినన్. (813) ఇట్లు పాండవాగ్రజుప్రార్థనం గైకొని దామోదరుండు సమస్త యాదవులనుఁ గుశస్థలికిఁ బోవంబనిచి కతిపయ పరిజనంబులుం దానును నతనికిఁ బ్రియంబుగాఁ దన్నగరంబునఁ బ్రమోదంబున నుండె” నని చెప్పి మఱియు నిట్లనియె. (814) "జనవర! పాండుభూపతనుజాతుఁడు దుస్తరమౌ మనోరథా ¯ బ్ధిని సరసీరుహాక్షుఁ డను తెప్ప కతంబున దాఁటి భూరి శో ¯ భనయుతుఁడై మనోరుజయుఁ బాసి ముదాత్మకుఁడై వెలింగె, న¯ వ్వనరుహనాభుదాసజనవర్యులకుం గలవే యసాధ్యముల్‌? (815) అట్టి యెడ. (816) రాజసూయమఖ వరప్రభావమునకు ¯ నఖిలజనులు మోదమంది రపుడు ¯ కలుషమానసుండు కులపాంసనుఁడు సుయో ¯ ధనుఁ డొకండు దక్క ధరణినాథ! " (817) అనిన విని శుకయోగీంద్రునకుఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. (818) "అఖిల జనుల కెల్ల నానందజనకమై ¯ యెనయు మఖము కురుకులేశ్వరునకుఁ ¯ గర మసహ్యమైన కారణ మెయ్యది ¯ యెఱుఁగఁ బలుకు నాకు నిద్ధచరిత! " (819) అనిన మునీంద్రుఁ డిట్లను ధరాధిపుతోఁ "గురురాజు పాండు నం ¯ దనులదెసన్ననేక దురితంబులు నిచ్చలుఁ జేయుచుండు నై ¯ నను, నొకనాఁడు పంకరుహనాభ దయాపరిలబ్ధభూరి శో ¯ భనజిత దేవదైత్యనరపాలకరాజ్యరమామహత్త్వమై. (820) వెలయు ననూనసంపదల విశ్రుతకీర్తులు మిన్ను ముట్టఁ బెం ¯ పలరిన పాండుభూవరసుతాగ్రజుఁ డంతిపురంబులోన ను¯ జ్జ్వలమణిభూషణాంశురుచిజాలము బర్వఁ బయోజనాభు ను¯ త్కలిక భజించుచున్ ఘనసుఖస్థితి భూరిమనోహరాకృతిన్. (821) ఉండం గనుంగొని; యదియునుంగాక, యొక్కనాఁడు లలితాష్టమీ శశాంకబింబంబులం విడంబించుచు నింద్రనీలరుచినిచయంబు నపహసించు కుటిలకుంతలంబులు నటనంబు సలుపం దనరు నిటలఫలకంబులును, బుష్పచాపుచాపంబు రూపునేపుమాపు భ్రూయుగోపాంతంబులై సౌదామనీదామ రుచిస్తోమంబులై, కర్ణాంతసీమంబులై యంజనంబులతోడ రంజిల్లు నేత్రకంజంబులును, నవమల్లికాముకుళ విభాసిత దంతమరీచికా నిచయోద్దీపిత మందహాసచంద్రికాధవళితంబులును, ముకురోపమితంబులై కర్ణకుండలమణిమరీచి జాలంబులు బెరసి బహుప్రకారంబులఁ బర్వంబొలుచు కపోలపాలికలును, విలసిత గ్రైవేయక ముక్తాఫలహార నిచయంబుల కిమ్ముచూపక మిసమిసని పసగల మెఱుంగులు గిఱికొన మీటినంబగులు ననం బొగడందగి మొగంబులకుం బుటంబులెగయు నుత్తుంగపీనకుచభారంబుల వ్రేఁగు లాఁగలేక తూఁగాడుచుం గరతల పరిమేయంబులగు మధ్యభాగంబులును, ఘనజఘనమండ లావతీర్ణకాంచన కాంచీకలాప కింకిణీకలకల నినాదోల్లసితంబులగు కటిప్రదేశంబులును, సల్లలిత హల్లక పల్లవకాంతుల మొల్లంబులఁ గొల్లలుగొని యభిరామంబులై శోభిల్లు పదపాణితలంబులును, నలసగతులం బదంబులం దనరు మణినూపురంబులు గోపురంబులం బ్రతిస్వనంబు లొలయ మొరయ నలరు చరణారవిందంబులును, రత్నవలయ కంక ణాంగుళీయకాది వివిధ భూషణద్యుతినిచయంబు లుష్ణమరీచి కరనిచయంబుల ధిక్కరింప వెలుంగు కరకంజంబులును, మృగ మద ఘనసార హరిచందనాగరు కుంకుమపంకంబుల భాసురంబులగు వాసనలు నాసారంధ్రంబులకు వెక్కసంబులై పొలయు సౌభాగ్యంబులు గలిగి చైతన్యంబు నొందిన మాణిక్యపుబొమ్మల విధంబున గగన మండలంబు నిర్గమించి, వసుధాతలంబున సంచరించు చంద్రరేఖల చెలువున శృంగారరసంబు మూర్తీభవించిన జగంబుల మోహపఱచు మోహినీదేవతలచందంబున, విల సించు మాధవ వధూసహస్రంబుల సంగతిని సౌదామనీలతయునుం బోలె నొప్పుచుండెడు ద్రుపదరాజనందన విభవంబును రాజసూయ మహాధ్వరోత్సవంబునం జూచి చిత్తంబుత్తలపడ సుయోధనుండు సంతాపానలంబునం గ్రాఁగుచుండె; నంత నొక్కనాఁడు ధర్మనందనుఁడు నిర్మలంబగు సభాభవనంబునకుం జని. (822) సుత సహోదర పురోహిత బాంధవామాత్య¯ పరిచార భటకోటి బలసి కొలువఁ ¯ గలిత మాగధ మంజు గానంబుఁ బాఠక¯ పఠన రవంబునుఁ బ్రమద మొసఁగఁ ¯ గంకణ ఝణఝణత్కారంబు శోభిల్ల¯ సరసిజాననలు చామరములిడఁగ ¯ మయ వినిర్మిత సభామధ్యంబునను భాస¯ మాన సింహాసనాసీనుఁ డగుచు (822.1) నమర గణములు గొలువఁ బెంపారు ననిమి ¯ షేంద్రుకైవడి మెఱసి యుపేంద్రుఁ డలర ¯ సరసఁ గొలువున్న యత్తఱి దురభిమాని ¯ క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు. (823) కాంచనరత్నభూషణ నికాయముఁ దాల్చి సముజ్జ్వలప్రభో ¯ దంచితమూర్తి నొప్పి ఫణిహారులు ముందటఁ గ్రందువాయ వా¯ రించ సహోదరుల్‌ నృపవరేణ్యులు పార్శ్వములన్ భజింప నే ¯ తెంచెను రాజసంబున యుధిష్ఠిరుపాలికి వైభవోన్నతిన్.

సుయోధనుడు ద్రెళ్ళుట

(824) అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబు నందు. (825) సలిలములు లేని ఠావున ¯ వలువలు వెస నెగయఁ దిగిచి వారక తోయం ¯ బులు గల చోటనుం జేలం ¯ బులు దడియఁగఁ బడియె నిజవిభుత్వము దఱుఁగన్ (826) ఆ విధమంతయుఁ గనుఁగొని ¯ పావని నవ్వుటయు నచటి పార్థివులునుఁ గాం ¯ తావలియును యమతనయుఁడు ¯ వావిరిఁ జేసన్నఁ దమ్ము వారింపంగన్. (827) దామోదరానుమోదితులయి మహారవంబుగాఁ బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనతవదనుండై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబునకరిగె; నయ్యవసరంబున ధీవిశాలు రైన సభాసదులగు నచ్చటి జనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున విన్ననై యుండె; నప్పుండరీకాక్షుండు భూభార నివారణకారణుం డగుటంజేసి దుర్యోధను నపహాసంబునకుం గాదనండయ్యె; నంత. (828) హరి ధర్మసుతుని వీడ్కొని ¯ తరుణీ హిత బంధుజన కదంబము గొలువం ¯ బరితోషమునఁ గుశస్థల ¯ పురమునకుం జనియె మోదమున నరనాథా! (829) జనవరబంధమోక్షణముఁ జైద్యవధంబును బాండురాజ నం ¯ దన మఖరక్షణంబును నుదారతఁ జేసిన యట్టి దేవకీ ¯ తనయుచరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతు రిష్ట శో ¯ భన బహుపుత్త్ర కీర్తులును భవ్యవివేకము విష్ణులోకమున్." (830) అని శుకయోగీంద్రుండ¯ మ్మనుజేంద్రునిఁజూచి పలికె మఱియును “శ్రీకృ¯ ష్ణుని యద్భుత కర్మంబులు¯ వినిపింతుం జిత్తగింపు విమలచరిత్రా!

సాల్వుండు ద్వారక న్నిరోధించుట

(831) వసుధేశ! విను; మును వైదర్భి పరిణయ¯ వేళ దుర్మద శిశుపాలభూమి ¯ వరునకుఁ దోడ్పడ నరుదెంచి సైనికా¯ వలితోడఁ దొడరి దోర్బలము దూలి ¯ హరిచేత నిర్జితులైన రాజులలోనఁ¯ జైద్యుని చెలికాఁడు సాల్వభూమి ¯ పతి జరాసంధాది పార్థివప్రకరంబు¯ విన మత్సరానల విపులశిఖల (831.1) "ధాత్రి నిటమీఁద వీతయాదవము గాఁగఁ ¯ గడఁగి సేయుదు"నని దురాగ్రహముతోడఁ ¯ బంతములు పల్కి యటఁ జని భరితనిష్ఠఁ ¯ దపము కావింపఁ బూని సుస్థలమునందు. (832) ధృతి వదలక యుగ్రస్థితిఁ ¯ బ్రతిదినమునుఁ బిడికెఁ డవనిరజ మశనముగా ¯ నతినియమముతో నా పశు ¯ పతి, శంకరు, ఫాలనయను, భర్గు, నుమేశున్. (833) చెదరని నిజభక్తినిఁ ద¯ త్పదపద్మము లాత్మ నిలిపి పాయక యొక యేఁ ¯ డుదితక్రియ భజియించిన ¯ మదనారియు వాని భక్తి మహిమకు వశుఁడై. (834) బోరనఁ బ్రత్యక్షంబై ¯ కోరినవర మేమి యైనఁ గొసరక యిత్తున్ ¯ వారక వేఁడు మటన్నను ¯ నా రాజతపోధనుండు హరునకుఁ బ్రీతిన్. (835) వందనం బాచరించి యానంద వికచ ¯ వదనుఁడై నొస లంజలిఁ గదియఁ జేర్చి ¯ "శ్రితదయాకార! నన్ను రక్షించెదేని ¯ నెఱుఁగ వినిపింతు వినుము మదీప్సితంబు. (836) గరుడ గంధర్వ యక్ష రాక్షస సురేంద్ర ¯ వరులచే సాధ్యపడక నా వలయు నెడల ¯ నభ్రపథమునఁ దిరిగెడు నట్టి మహిత ¯ వాహనము నాకు దయసేయు వరద! యీశ! " (837) అని అభ్యర్థించినం బ్రసన్నండై హరుండు వాని కోర్కి కనురూపం బైన పురంబు నిర్మింప మయుని నియోగించిన నతండును “నట్ల చేసెద” నని కామగమనంబును నతివిస్తృతంబునుగా లోహంబున నిర్మించి సౌభకంబను నామంబిడి సాల్వున కిచ్చిన వాఁడును బరమానందంబునం బొంది తద్విమానారూఢుండై యాదవుల వలని పూర్వవైరంబుఁ దలంచి దర్పాంధచేతస్కుండై ద్వారకానగరంబుపైఁజని నిజసేనాసమేతంబుగాఁ దత్పురంబు నిరోధించి. (838) సరిదుపవన సరోవరములు మాయించి¯ బావులు గలఁచి కూపములు సెఱిచి ¯ కోటలు వెస వీటతాటముల్‌ గావించి¯ పరిఖలు పూడ్చి వప్రములు ద్రొబ్బి ¯ యట్టళ్లు ధరఁ గూల్చి యంత్రముల్‌ దునుమాడి¯ కాంచనధ్వజపతాకములు నఱకి ¯ భాసుర గోపుర ప్రాసాదహర్మ్యేందు¯ శాలాంగణములు భస్మములు చేసి (838.1) విమల కాంచనరత్నాది వివిధవస్తు ¯ కోటి నెల్లను నందంద కొల్లపుచ్చి ¯ ప్రజలఁ జెఱపట్టి దొరలను భంగపెట్టి ¯ తఱిమి యిబ్భంగిఁ బెక్కుబాధల నలంచి. (839) మదమున నంతఁ బోవక విమానయుతంబుగ నభ్రవీథికిన్ ¯ గొదకొని యేపుమై నెగసి కొంకక శక్తి శిలా మహీరుహ¯ ప్రదరము లోలిమైఁ గురిసి బంధురభూమిపరాగ శర్కరల్‌ ¯ వదలక చల్లుచున్ వలయవాయువుచే దిశ లావరించుచున్. (840) అట్టియెడ. (841) చటులపురత్రయదనుజో¯ త్కటదుస్తర బాధ్యమానధారుణిగతి న¯ ప్పుటభేదన మెంతయు వి¯ స్ఫుటపీడం జెంది వగల సుడివడుచుండన్. (842) కని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు రౌక్మిణేయుఁ డ¯ జ్జనముల నోడకుండుఁ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా ¯ ధనములఁ బూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కే ¯ తన రుచి గ్రాల నున్నతరథస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్. (843) అయ్యవసరంబున. (844) సమధిక బాహుశౌర్యజితచండవిరోధులు వెళ్లి రున్నత¯ క్షమ గద భానువింద శుక సాత్యకి సారణ చారుదేష్ణ సాం ¯ బ మకరకేతనాత్మజ శ్వఫల్కతనూభవ తత్సహోదర¯ ప్రముఖ యదూత్తముల్‌ విమతభంజనులై కృతవర్మమున్నుగన్ (845) వారణ వాజిస్యందన ¯ వీరభటావలులు సనిరి విశ్వము వడఁకన్ ¯ ఘోరాకృతి వివిధాయుధ ¯ భూరిద్యుతు లర్కబింబముం గబళింపన్.

యదు సాల్వ యుద్ధంబు

(846) చని యా గోవిందనందన స్యందనంబుం బలసందోహంబునుం దలకడచి, యదు సైన్యంబులు సాల్వబలంబులతోడం దార్కొని బెరయునప్పుడు దేవదానవ సంకులసమర విధంబునం దుములం బయ్యె; నయ్యెడ. (847) వితతజ్యాచయ టంకృతుల్‌, మదజలావిర్భూతశుండాల ఘీం ¯ కృతు, లుద్యద్భటహుంకృతుల్‌, మహితభేరీభాంకృతుల్‌, భీషణో¯ ద్ధతనిస్సాణధణంకృతుల్‌, ప్రకటయోధవ్రాతసాహంకృతుల్‌, ¯ కుతలంబున్ దివి నిండ మ్రోసె రిపుసంక్షోభంబుగా భూవరా! (848) హరిరింఖారథనేమి సద్భటపదవ్యాఘట్టనోద్ధూత దు¯ స్తరధూళీపటలప్రభూత నిబిడధ్వాంతప్రవిధ్వంస కృ¯ త్కర శాతాసి గదాది హేతిరుచు లాకాశంబు నిండన్ వియ¯ చ్చర దృక్కుల్‌ మిఱుమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లఁగన్. (849) తలకొని సైనికుల్‌ గవిసి తార్కొని పేర్కొని పాసి డాసి యం ¯ కిలి గొనకెమ్ములమ్ములఁ బగిల్చి నొగిల్చితరేతరుల్‌ తలల్‌ ¯ నలియఁగ మొత్తి యొత్తి నయనంబులు నిప్పులు రాల లీల నౌఁ¯ దలలు లలాటముల్‌ ఘనగదాహతి నొంచి కలంచి పోరఁగన్. (850) అయ్యవసరంబునం బ్రద్ముమ్నుండు గనుంగొని. (851) అనయంబుం గలుషించి సౌభపతి మాయాకోట్లు చంచచ్ఛరా ¯ సన నిర్ముక్త నిశాత దివ్యమహితాస్త్రశ్రేణిచేఁ దత్‌క్షణం ¯ బున లీలాగతి నభ్రగుల్‌ మనములన్ భూషింప మాయించె న¯ వ్వనజాతాప్తుఁడు భూరి సంతమసమున్ వారించు చందంబునన్ (852) మఱియును. (853) అతిరథికోత్తముం డన నుదంచితకాంచనపుంఖ పంచ విం ¯ శతివిశిఖంబులన్నతని సైనికపాలుని నొంచి యుగ్రుఁడై ¯ శత శతకోటికోటినిభసాయకముల్‌ పరఁగించి సాల్వభూ ¯ పతి కకుదంబు నొంచి లయభైరవుకైవడిఁ బేర్చి వెండియున్. (854) పదిపది యమ్ములన్ మనుజపాలవరేణ్యుల నొంచి రోషముం¯ గదురఁగ మూఁడుమూఁడు శితకాండములన్ రథదంతివాజులం¯ జదియఁగ నేసి యొక్కొక నిశాతశరంబున సైనికావలిన్ ¯ మదము లడించి యిట్లతఁ డమానుషలీలఁ బరాక్రమించినన్. (855) దుర్మానవహరు నద్భుత ¯ కర్మమునకు నుభయ సైనికప్రకరంబుల్‌ ¯ నిర్మలమతి నుతియించిరి ¯ భర్మాచలధైర్యు విగతభయుఁ బ్రద్యుమ్నున్. (856) అయ్యవసరంబున. (857) సాంబుని సాల్వభూవిభుఁడు సాయకజాలము లేసి నొంచినన్ ¯ జాంబవతీతనూభవుఁడు చాపము సజ్యము సేసి డాసి సా¯ ల్వుం బదియేను తూపుల నవోన్నతవక్షము గాఁడనేసి శా ¯ తాంబకవింశతిన్నతని సౌభక మల్లలనాడ నేసినన్. (858) గదుఁడు మహోగ్రవృత్తి నిజకార్ముక నిర్గతవిస్ఫురద్విధుం ¯ తుదవదనాభబాణవితతుల్‌ పరఁగించి విరోధిమస్తముల్‌ ¯ గుదులుగ గ్రుచ్చియెత్తుచు నకుంఠిత విక్రమకేళిలోలుఁడై ¯ చదల సురల్‌ నుతింప రథిసత్తముఁ డొప్పె నరేంద్రచంద్రమా! (859) సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసౌభ సాం ¯ గత్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భాసురా ¯ దిత్యమయూఖపుంజరుచితీవ్రశరంబులఁ జూపి సైనిక¯ స్తుత్యపరాక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లె భూవరా! (860) భానువిందుఁ డుద్ధతిన్ విపక్షపక్షసైన్య దు¯ ర్మాన కాననానలోపమాన చండ కాండ సం¯ తాన మూన నేసి చూర్ణితంబు చేసెఁ జాప వి¯ ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చఁగాన్. (861) చారుదేష్ణుఁ డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో¯ స్సారదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే ¯ దారుణప్రతాప సాల్వదండనాథమండలిన్ ¯ మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్. (862) శుకుఁ డా యోధన విజయో ¯ త్సుకమతి బాహాబలంబు సొప్పడ విశిఖ¯ ప్రకరంబులఁ దను శౌర్యా ¯ ధికుఁ డన విద్వేషిబలతతిం బరిమార్చెన్. (863) సారణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో ¯ స్సార మెలర్పఁ గుంత శర శక్తి గదా క్షురికాది హేతులన్ ¯ వారక వాజి దంతి రథవర్గములం దునుమాడి కాల్వురన్ ¯ వీరముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై. (864) అక్రూరుఁడుఁ దదనుజులు న ¯ వక్రపరాక్రమము మెఱసి వైరుల బాహా ¯ విక్రమమున వధియించిరి ¯ చక్రప్రాసాది వివిధ సాధనములచేన్. (865) కృతవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి¯ శ్రితవర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న¯ ద్భుతకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర¯ క్షితిధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా! (866) అయ్యవసరంబున సాల్వుండు గోపోద్దీపితమానసుండై యుండ మాయావిడంబకంబైన సౌభకం బప్పుడు. (867) ఒకమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు¯ నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు ¯ నొకమాటు శైలమస్తకమున వర్తించు¯ నొకపరిఁ జరియించు నుదధినడుమ ¯ నొక్క తోయంబున నొక్కటియై యుండు¯ నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును ¯ నొకమాటు సాల్వసంయుక్తమై పొడసూపు¯ నొక తోయ మన్నియు నుడిగి తోఁచు (867.1) నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన ¯ గతి మహోగ్రవృత్తిఁ గానవచ్చు ¯ మఱియుఁ బెక్కుగతుల నరివరుల్‌ గలఁగంగఁ ¯ దిరిగె సౌభకంబు ధీవరేణ్య! (868) ఇవ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు. (869) స్ఫురదనలాభశరంబులు ¯ పొరిఁబొరి బుంఖానుపుంఖములుగా నేయం ¯ దెరలియు మరలియు మురిసియు ¯ విరిసియుఁ బిఱుతివక పోరె వెస యదుబలముల్‌. (870) అయ్యెడ మానము వదలక ¯ డయ్యక మగపాడితో దృఢంబుగఁ బోరన్ ¯ దయ్య మెఱుంగును? నెక్కటి ¯ కయ్యం బపుడయ్యెఁ బేరుగల యోధులకున్. (871) మును ప్రద్యుమ్నకుమారుని ¯ ఘననిశితాస్త్రములచేతఁ గడు నొచ్చిన సా¯ ల్వుని మంతిరి ద్యుమనాముఁడు ¯ సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్. (872) వెరవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా ¯ సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్ ¯ విరవిరవోయి మేను నిడువెండ్రుక వెట్టఁగఁ జేతిఁ సాధనో ¯ త్కరములు దేరిపై వదలి కన్నులుమూయుచు మూర్ఛనొందినన్ (873) సమరధర్మ వేది సమధిక నయవాది ¯ దారుకుని సుతుండు ధైర్యయుతుఁడు ¯ రథముఁ దోలికొనుచు రణభూమి వెడలి వే ¯ చనియె మూర్ఛదేఱి శంబరారి. (874) సారిథిఁ జూచి యిట్లనియె "శాత్రవవీరులు సూచి నవ్వఁగాఁ ¯ దేరు రణక్షితిన్ వెడలఁ దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం ¯ కేరుహనాభుఁడున్ హలియు గేలికొనన్ యదువంశసంభవుల్‌¯ బీరము దప్పి యిప్పగిదిఁ బెల్కుఱి పోవుదురే రణంబునన్. " (875) అనిన నతం డతని కిట్లనియె. (876) "రథి రిపుచే నొచ్చిన సా ¯ రథియును, సారథియు నొవ్వ రథియును గావం ¯ బృథుసమర ధర్మ; మిఁక న¯ వ్యధచిత్తుఁ డవగుచుఁ గడఁగు వైరుల గెలువన్." (877) అనిన విని. (878) సంచితభూరిబాహుబల శౌర్యుఁడు సారథిమాట కాత్మ మో ¯ దించి యుదాత్తకాండ రుచిదీపితచాపముఁ దాల్చి మౌర్వి సా ¯ రించి గుణధ్వనిన్ బృహదరిప్రకరంబుల భీతి ముంచి తో ¯ లించె రథంబు మేదిని చలింపఁగ నా ద్యుముమీఁద నేర్పునన్. (879) అట్లు డగ్గఱి. (880) అరితను వష్ట బాణముల నాగ్రహవృత్తిఁ బగిల్చి నాల్గిటం ¯ దురగములన్ వధించి యొక తూపున సారథిఁ ద్రుంచి రెంటని¯ ష్ఠురతర కేతుచాపములు చూర్ణముచేసి యొకమ్మునన్ భయం¯ కరముగఁ ద్రుంచె నా ద్యుమునికంఠ మకుంఠిత విక్రమోద్ధతిన్. (881) కని సాంబప్రముఖాది యోధవరు లుత్కంఠాత్ములై మీన కే ¯ తను నగ్గించి సువర్ణపుంఖ నిశితాస్త్రశ్రేణి సంధించి సా¯ ల్వుని సైన్యావలి మస్తముల్‌ వెరవు లావున్ మీఱఁగా నొక్క యె¯ త్తున వేత్రుంచిరి తాటిపండ్లు ధరఁ దోడ్తో రాల్చు చందంబునన్. (882) అట్టి యెడ. (883) కూలున్ గుఱ్ఱంబులేనుంగులు ధరఁగె; డయుంగుప్పలై; నుగ్గునూచై¯ వ్రాలున్దేరుల్‌; హతంబై వడిఁబడుసు; భటవ్రాతముల్‌; శోణితంబుల్‌¯ గ్రోలున్, మాంసంబునంజుంగొఱకు, నెము; కలన్గుంపులైసోలుచున్బే¯ తాలక్రవ్యాదభూతోత్కరములు, జ; తలై తాళముల్‌ దట్టి యాడున్. (884) మఱియు నొక్కయెడ. (885) ఖండిత శుండాల గండముల్‌ నక్రముల్‌¯ భూరితుండంబులు భుజగ సమితి; ¯ పదతలంబులు గచ్ఛపంబులు; దంతముల్‌¯ శుక్తులు; గుంభనిర్ముక్త మౌక్తి ¯ కములు రత్నములు; వాలములు జలూకముల్‌¯ మెడలు భేకంబులు; మెదడు రొంపి; ¯ ప్రేవులు పవడంపుఁ దీవెలు; నరములు¯ నాఁచు; మజ్జంబు ఫేనంబు; లస్థి (885.1) సైకతములు; రక్తచయము తోయంబులు; ¯ నొరగు నెడల నొరలు మొఱలు ఘన త ¯ రంగరవముగా మతంగజాయోధన ¯ స్థలము జలధిఁ బోల్పఁ దగె నరేంద్ర! (886) ఇవ్విధంబున యదుసాల్వబలంబులు చలంబునఁ బరస్పర జయకాంక్షలం దలపడి పోరు పూర్వపశ్చిమ సముద్రంబుల వడువున నిరువదియేడు దినంబు లతిఘోరంబుగాఁ బోరునెడ నింద్రప్రస్థపురంబు నుండి ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంకొని కృష్ణుండు దారుకునిం జూచి యిట్లనియె.