పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 655 - 764

ధర్మజు రాజసూ యారంభంబు

(655) శారదచంద్రికా సారంగరుచితోడ¯ జడముడికెంపు చేఁ జఱచి నవ్వ ¯ శరదంబుదావృత సౌదామనీలతా¯ శోభఁ గాంచనకటిసూత్ర మలర ¯ లలితపూర్ణేందుమండల కలంకముగతి¯ మృదుమృగాజినరుచి మించుఁ జూపఁ ¯ గల్పశాఖాగ్రసంగతపుష్పగుచ్ఛంబు¯ లీలఁ గేలను నక్షమాల యమర (655.1) భూరిపుణ్యనదీతోయపూరణమునఁ ¯ దగు కమండలు వొక్క హస్తమునఁ దనర ¯ వెల్ల జన్నిద మఱుత శోభిల్ల వచ్చె ¯ నారదుండు వివేకవిశారదుండు. (656) చనుదెంచె నట్లు ముని నిజ ¯ తనుకాంతుల నఖిలదిగ్వితానము వెలుఁగన్ ¯ వనజాప్తుఁ బోలి యయ్యదు ¯ జనములుఁ గృష్ణుండు లేచి సంప్రీతిమెయిన్. (657) వినయమున మ్రొక్కి కనకా ¯ సనమునఁ గూర్చుండఁ బెట్టి సముచిత వివిధా ¯ ర్చనములఁ దనిపి మురాంతకుఁ ¯ డనియెన్ వినయంబు దోఁప నమ్మునితోడన్. (658) "ఇప్పు డెందుండి వచ్చితి విందులకును? ¯ నఖిలలోకైకసంచారి వగుటఁ జేసి ¯ నీ యెఱుంగని యర్థంబు నిఖిలమందు ¯ నరయ లేదండ్రు; మిమ్మొకఁ టడుగవలయు. (659) పాండునందను లిప్పు డే పగిది నెచట ¯ నున్నవారలొ యెఱిఁగింపు"మన్న మౌని ¯ కరసరోజాతములు మోడ్చి కడఁకతోడఁ ¯ బలికెఁ గమలాక్షుఁ జూచి సద్భక్తి మెఱసి. (660) “దేవా! విశ్వనిర్మాణకర్తవై మాయివై సకల కార్యోత్పాదనాదిశక్తి యుక్తుండవై పావకుండు దారువులందు నంతర్హితప్రకాశుండై యున్న చందంబున వర్తించుచున్న నీదు దురత్యయంబయిన మాయాశతంబులఁ బెక్కుమాఱులు పొడగంటి నిదియు నాకు నద్భుతంబుగా; దదియునుంగాక నీ సంకల్పంబున జగంబుద్భవంబై భవత్పరతంత్రంబు నగు; నట్టి నీ కిష్టంబైన వస్తువు సాధుతరంబుగాఁ దెలియ నెవ్వండు సమర్థుం? డే పదార్థంబు ప్రమాణమూలంబునం దోఁచు నదియును లోకవిచక్షణుండ వైన నీదు రూపంబు; మఱియును ముక్తి మార్గంబు నెఱుంగక సంసార పరవశులైన జీవుల మాయాంధకారంబు నివర్తింపఁజేయ సమర్థంబగు; నీ దివ్యలీలావతారంబులం గలుగు కీర్తియను ప్రదీపంబు ప్రజ్వలింపఁజేసి కృపసేయుదట్టి నీకు నమస్కరించెద; నదిగావున నీ ప్రపంచంబున నీ యెఱుంగని యర్థంబు గలదె?” యని కృష్ణునకు నారదుం డిట్లనియె. (661) "అయినను వినిపింతు నవధరింపుము దేవ!¯ పాండుతనూజుండు పారమేష్ఠ్య ¯ కామానుమోదియై కావింప నున్నాఁడు¯ రాజసూయమహాధ్వరంబు నిష్ఠ ¯ ఠవణింప లోకవిడంబనార్థము గాక¯ పరికింపఁ దన కాత్మబంధువుఁడవు, ¯ భక్తవత్సలుఁడవు, పరమపూరుషుఁడవు¯ యజ్ఞరక్షకుఁడవు, యజ్ఞభోక్త (661.1) వగు భవత్సేవ చాలదే సుగతి వడయ? ¯ నైన నీ మేనబావ ధర్మాత్మజుండు ¯ అతని యజ్ఞంబు రక్షింప నంబుజాక్ష! ¯ వలయు విచ్చేయు మచటికి వలను మెఱసి. (662) నీ పేరు వినిన నొడివినఁ ¯ బాపంబులు దూలిపోవు పద్మాక్ష! జగ¯ ద్దీపక! నీ దర్శనమున ¯ నేపారవె భక్తజనుల కిహపరసుఖముల్‌. (663) భవదీయోజ్జ్వలకీర్తి దిగ్వితతులన్ భాసిల్లు యుష్మత్పదో ¯ ద్భవనైర్మల్యజలంబు లుత్కలికఁ బాతాళంబునం బాఱు భో ¯ గవతీ నామమునం దనర్చి ధరణిం గంగానదీరూపమై ¯ దివి మందాకినియై జగత్త్రయమునం దీపించుఁ గాదే? హరీ! (664) ఆ మఖవేళ సమస్త ధ ¯ రామండలిఁ గల్గు మేటిరాజులు మౌని¯ స్తోమంబును భవదీయ మ ¯ హామహిమముఁ జూచి సత్కృతార్థతఁ బొందన్." (665) కల" రని చెప్పిన నమ్ముని ¯ పలుకులకు ముదంబు నొంది పంకజనాభుం ¯ డెలనవ్వు మొగమునకుఁ జెలు ¯ వొలయఁగఁ బాటించి యుద్ధవున కిట్లనియెన్. (666) "ఉద్ధవ! మహిత వివేక స ¯ మిద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్ ¯ వృద్ధవరానుమతంబుగ ¯ బోద్ధవ్యము గాఁగఁ జెప్పు పురుషనిధానా! (667) అనఘచారిత్ర! నీవు మా యక్షియుగము ¯ వంటివాఁడవు మనకు నవశ్య మగుచుఁ ¯ జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు నీవు ¯ ఏమి పంచినఁ గావింతు నిద్ధచరిత! " (668) అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండ పోలెఁ దన్ను నడిగినఁ బురుషోత్తముని భాషణంబులకు మనంబున సంతసిల్లి, యతని పాదంబులు దన మనంబున నిడికొని, “వృద్ధానుమతంబుగా నా యెఱింగిన తెఱంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయ భక్తుండైన యుధిష్ఠిరు యాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుంగాక నిఖిల దిగ్విజయ మూలంబగు రాజసూయ కృత్యంబునందు జరాసంధ మర్దనంబును, నతనిచే బద్ధులైన రాజులం గారాగృహ విముక్తులం గావించుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుతసత్త్వుండును, శతాక్షౌహిణీ బలాన్వితుండును నగు మాగధుని వధియింప మన ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థలుగా; రట్లగుట నతండు భూసురు లేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గావున గపటవిప్రవేషంబునం జని యా జరాసంధుని నాహవ భిక్షవేఁడి, భవత్సన్నిధానంబున నప్పవమానతనయుం డతని వధియించునట్టి కార్యంబుసేఁత బహుళార్థసాధనంబగు” నని పలికిన నారదుండును యాదవ జనంబులును సభ్యులునుం బొగడి; రంత. (669) తరల విచిత్రక స్థగిత ప్రభావలిఁ¯ దనరారు గరుడకేతనము వెలుఁగఁ ¯ గాంచన చక్ర సంఘటిత ఘంటా ఘణ¯ ఘణ నినాదముల దిక్కరులు బెదర ¯ సలలిత మేఘ పుష్పక వలాహక శైబ్య¯ సుగ్రీవ తురగవిస్ఫురణ దనర ¯ బాలసూర్యప్రభా భాసమానద్యుతి¯ దిగ్వితానం బెల్ల దీటుకొనఁగఁ (669.1) బ్రకటరుచి నొప్పు తేరు దారుకుఁడు దేర ¯ నెక్కి వెడలెడు నపుడు పెంపెనయఁ జెలఁగె ¯ శంఖ కాహళ పటహ నిస్సాణ డిండి ¯ మాది రవములు భరితదిగంతములుగ. (670) మనుజేశ్వరునకుఁ దాలాం ¯ కునకును గురువృద్ధజనులకునుఁ జెప్పి ప్రియం ¯ బున ననుపఁ గాంచనస్యం ¯ దన సామజ వాజి భటకదంబము గొలువన్. (671) వంది మాగధ సూత కైవారరవము ¯ వసుమతీసురకోటి దీవనల మ్రోఁత ¯ లనుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర ¯ జాలములనుండి ముత్యాలశాస లొలుక. (672) లీలం జని కృష్ణుఁడు వా ¯ హ్యాలిన్ నవకుసుమ ఫలభరానత శాఖా ¯ లోల ఘనసారసాల ర ¯ సాలవనస్థలములందుఁ జతురత విడిసెన్. (673) అట్టి యెడ సరోజనాభు శుద్ధాంతంబున. (674) వికచమరంద నవీన సౌరభ లస¯ న్మందార కుసుమదామములు దుఱిమి ¯ చారు సుగంధ కస్తూరికా ఘనసార¯ మిళిత చందనపంక మెలిమి నలఁది ¯ కనక కుండల రణత్కంకణ నూపుర¯ ముద్రికాభూషణములు ధరించి ¯ యంచిత ముక్తాఫలాంచల మృదుల ది¯ వ్యాంబరములు సెలువారఁ గట్టి (674.1) యర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి ¯ యలికఫలకలఁ దిలకము లలరఁ దీర్చి ¯ పెంపు దీపింప నుడురాజబింబముఖులు ¯ నవచతుర్విధ శృంగార మవధరించి. (675) జలజలోచను కడకు నుత్కలికతోడఁ ¯ దనరు శిబికల నెక్కి నందనులుఁ దాముఁ ¯ గనఁగ నేతేరఁ బ్రతిహారజనులు వేత్ర ¯ కలితులై పౌరులను నెడగలుగ జడియ. (676) అసమాస్త్రుఁడు పులు గడిగిన ¯ కుసుమాస్త్రములను హసించు కోమలతనువుల్‌ ¯ మిసమిస మెఱవఁగ వేశ్యా ¯ విసరము దాసీజనంబు విభవ మెలర్పన్. (677) హరుల వేసడములఁ గరులను నెక్కి తో ¯ నరుగుదేర బహువిధాయుధములు ¯ దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు ¯ రాంగనలు సితాంబుజాక్షు కడకు. (678) వచ్చి రంత. (679) నారదుని మాధవుఁడు స¯ త్కారంబున వీడుకొలుప నతఁడును హృదయాం ¯ భోరుహమునఁ గృష్ణునకును ¯ వారక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్. (680) నరవరుల దూతయును ముర ¯ హరుచే నభయప్రదాన మంది ధరిత్రీ ¯ వరులకడ కేగి పద్మో ¯ దరు వచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్. (681) అంతఁ గృష్ణుండు నిజకాంతాతనయ బంధు సుహృజ్జన సమేతుండై కదలి చనునెడ. (682) కటపటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను¯ త్కటపటుచామరధ్వజ పతాక కిరీట సితాతపత్త్ర వి¯ స్ఫుట ఘనహేతిదీధితి నభోమణిఁ గప్పఁగఁ దూర్యఘోషముల్‌ ¯ చటులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపఁగన్. (683) కరి హరి రథ సుభట సము¯ త్కరములు సేవింప మురవిదారుఁడు గడచెన్ ¯ సరి దుపవన దుర్గ సరో ¯ వర జనపద పుర పుళింద వన గోష్ఠములన్. (684) ఇట్లు గడచి చనుచు నానర్తక సౌవీర మరుదేశంబులు దాటి యిందుమతిని దర్శించి, దృషద్వతి నుత్తరించి, సరస్వతీనది దాఁటి పాంచాల మత్స్యవిషయంబులు లోనుగాఁ గడచి యింద్ర ప్రస్థనగరంబు డాయం జని, తత్పురోపకంఠవనంబున విడిసిన.

పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొనుట

(685) హరిరాక యెఱిఁగి ధర్మజు ¯ డఱలేని ముదంబుతోడ ననుజులు బంధుల్‌ ¯ గురుజన సచివ పురోహిత ¯ పరిచారక కరి రథాశ్వ భటయుతుఁ డగుచున్. (686) చిందములు మొరయ గాయక ¯ బృందంబుల నుతులు సెవుల బెరయఁగ భక్తిన్ ¯ డెందము దగులఁగఁ బరమా ¯ నందంబున హరి నెదుర్కొనం జనుదెంచెన్. (687) ఇట్లు చనుదెంచి ధర్మనందనుండు సమాగతుండైన సరోజనాభునిం బెద్దతడవు గాఢాలింగనంబుచేసి రోమాంచకంచుకిత శరీరుండై యానందబాష్పధారాసిక్తకపోలుండై నిర్భరానంద కందళిత హృదయుండై బాహ్యంబు మఱచియుండె; నప్పుడు హరిని వాయునందన వాసవతనూభవులు గౌఁగిటం జేర్చి సమ్మదంబు నొందిరి; మాద్రేయులు దండప్రణామంబు లాచరించి; రంతఁ బుండరీకాక్షుఁడు విప్ర వృద్ధజనంబులకు నమస్కారంబులుచేసి, వారలు గావించు వివిధార్చనలం బరితుష్టుం డై కేకయ సృంజ యాది భూవిభుల మన్నించి సూత మాగధాదుల కనేక పదార్థంబు లొసంగి, చతురంగబలసమేతుండై వివిధ మణితోరణాది విచిత్రాలంకృతంబు నతివైభవోపేతంబునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబునం జనుచుండఁ బౌరకామిను లట్టియెడ. (688) కొఱనెలపైఁ దోచు నిరులు నాఁ జెలువొంది¯ నొసలిపైఁ గురులు తుంపెసలు గునియ ¯ హాటకమణిమయ తాటంకరోచులు¯ గండభాగంబుల గంతులిడఁగ ¯ స్ఫురిత విద్రుమనిభాధరబింబరుచితోడ¯ దరహాసచంద్రిక సరసమాడ ¯ నొండొంటితో రాయు నుత్తంగ కుచకుంభ¯ ములు మొగంబులకును బుటము లెగయ (688.1) బడుగునడుములు వడఁకంగ నడుగు లిడఁగ ¯ రవళిమట్టెలు మణినూపురములు మొరయఁ ¯ బొలుచు కచబంధములు భుజంబుల నటింపఁ ¯ బయ్యెదలు వీడి యాడ సంభ్రమముతోడ. (689) ఇట్లు కృష్ణసందర్శన కుతూహల పరస్పరాహూయమానలై గురు పతి సుత బంధు జనంబులు వారింప నతిక్రమించి సమున్నత భర్మహర్మ్య శిఖాగ్రంబు లెక్కి కృష్ణుం జూచి తమలో నిట్లనిరి. (690) "విశ్వగర్భుండు నా వెలయు వే ల్పిల యశో¯ దానందులకుఁ బ్రియసూనుఁ డయ్యె; ¯ బ్రహ్మాది సురులకు భావింపఁగా రాని¯ బ్రహ్మంబు గోపాలబాలుఁ డయ్యె; ¯ వేదశాస్త్రంబులు వెదకి కానఁగలేని¯ గట్టి వ్రేతల ఱోలఁ గట్టుపడియె; ¯ దివిజుల కమృతంబు దవిలి యిచ్చిన భక్త¯ సులభుండు నవనీత చోరుఁ డయ్యె (690.1) నెనయఁ గమలాసతికిఁ జిత్త మీని వేల్పు ¯ గొల్లయిల్లాండ్ర యుల్లముల్‌ పల్లవింపఁ ¯ జేసె"నని కామినులు సౌధశిఖరములను ¯ గూడి తమలోన ముచ్చట లాడి రధిప! (691) మఱియును. (692) "గోపాలబాలురఁ గూడి యాడెడి నాఁడు¯ వ్రేపల్లె లోపల నేపు రేఁగి ¯ చల్ల లమ్మగఁ బోవు సతుల కొంగులు పట్టి¯ మెఱుఁగుఁ జెక్కిళ్ళను మీటిమీటి ¯ కలికియై ముద్దాడఁ గౌఁగిటఁ జేర్చిన¯ పూఁబోఁడి కుచములు పుణికిపుణికి ¯ పాయని యనురక్తి డాయఁ జీరిన యింతి¯ యధరసుధారసం బానియాని (692.1) యురుసమాధిపరాష్టాంగయోగ యుక్తు ¯ లైన యోగీశ్వరులు గాననట్టి జెట్టి ¯ వల్లవీజన వన కల్పవల్లి యయ్యె"¯ ననుచుఁ బొగడిరి కృష్ణు నయ్యబ్జముఖులు. (693) అని యిబ్భంగి సరోజలోచనలు సౌధాగ్రంబు లందుండి య¯ వ్వనజాతాక్షుని దివ్యమూర్తిఁ దమభావం బందుఁ గీలించి సం ¯ జనితానంద రసాబ్ధిమగ్న లగుచున్ సంప్రీతిఁ దద్భవ్య కీ ¯ ర్తనలై చల్లిరి నవ్యలాజములు మందారప్రసూనావలుల్‌. (694) తదనంతరంబ శోభనపదార్థంబులు కొనివచ్చి ధరామర ధరావర వణిక్పుంగవులు దామోదరునకు కానుక లిచ్చిరి; పుణ్యాంగనా జనంబులు పసిండిపళ్లెరంబులఁ గర్పూరనీరాజనంబులు నివాళింప నంతఃపురంబు సొత్తెంచె; నంతం గుంతిభోజనందనయుం గృష్ణునిం గని పర్యంకంబు డిగ్గి కౌఁగిలింప నా యదువల్లభుఁడు మేనత్తకుం బ్రణామం బాచరించెఁ; బాంచాలియు ముకుందునకు నభివందనం బొనరించి కుంతిపంపున గోవిందు భామినులగు రుక్మిణి మొదలగువారికి గంధాక్షత కుసుమ తాంబూలంబులిడి లలిత దుకూల మణి భూషణంబులం బూజించె; యుధిష్ఠిరుండును గమలనయనుని వధూజనుల ననుగత బంధుమిత్ర పుత్త్ర సచివ పురోహిత పరిచారక సముదయంబుల నుచితంబు లగు స్థలంబుల విడియింప నియమించి దినదినంబును నభినవంబు లగు వివిధోపచారంబులు గావించుచుండె. (695) హరియు యుధిష్ఠిరు సముచిత ¯ పరిచర్యల కాత్మ నలరి పార్థుఁడు దానున్ ¯ సరస విహారక్రియలను ¯ సురుచిరగతిఁ గొన్ని నెలలు సుఖముండె నృపా! (696) అంత.

దిగ్విజయంబు

(697) ధరణీశ! యొకనాఁడు ధర్మతనూజుండు¯ ప్రవిమల నిజసభాభవన మందు ¯ హితులు, మంత్రులు, పురోహితులును, సుతులును¯ మిత్రులు, బంధువుల్‌, క్షత్రవరులుఁ, ¯ బరిచారకులు, సూత, పాఠక, కవి, బుధ¯ వరులును, మునులును వరుసఁ గొలువఁ ¯ జిరలీల నవరత్న సింహాసనస్థుఁడై¯ గొలువుండి వినతుఁడై నలిననాభు, (697.1) భువనరక్షణదక్షు, నద్భుతచరిత్రు, ¯ యదుకులేశ్వరు, మురదైత్యమదవిభేది, ¯ నాప్తు, నయవేదిఁ, జతురుపాయప్రవీణుఁ¯ జూచి యిట్లని పలికె నస్తోకచరిత! (698) "అనఘచారిత్ర! రాజసూయాధ్వరంబుఁ ¯ నెమ్మిఁ గావించు వేడుక నెమ్మనమున ¯ నెనయుచున్నది యది నిర్వహింప నీవ ¯ కాక నా కాత్మబంధువుల్‌ గలరె యొరులు? (699) ఎవ్వరు నీ పదాంబుజము లెప్పుడుఁ గొల్తురు భక్తి నిష్ఠులై, ¯ యెవ్వరు నిన్నుఁ బ్రేమ నుతియింతురు భూరివివేకశాలురై, ¯ యవ్విమలాత్ము లందుదు రుదంచితశోభన నిత్యసౌఖ్యముల్‌ ¯ నివ్వటిలంగఁ గృష్ణ! నిను నేర్చి భజించిన రిత్తవోవునే! " (700) అనినఁ గృష్ణుండు ధర్మనందనున కిట్లనియె. (701) "నయగుణశాలి! పాండునృపనందన! నీ తలఁ పొప్పు నీక్రతు¯ క్రియ మునిదేవతాపితృ సుకృత్యమునై నిఖిలోగ్రశాత్రవ¯ క్షయమును బాంధవప్రియము సంచితపుణ్యము నిత్యకీర్తియున్¯ జయము నొసంగు దీనిఁ గురుసత్తమ! వేగ యుపక్రమింపవే! (702) మనుచరిత! నీ సహోదరు¯ లనుపమ దివ్యాస్త్రవేదు లాహవభూమిం ¯ జెనకిన వైరినృపాలురఁ¯ దునుమఁగఁ జాలుదురు శౌర్యదుర్దమ భంగిన్. (703) గెలువుము విమతనృపాలుర ¯ వెలయుము బుధవినుతమైన విశ్రుతకీర్తిన్ ¯ నిలుపుము నిఖిలధరా మం ¯ డలిని భవచ్ఛాసనము దృఢంబుగఁ జెల్లన్. (704) నీ పంచుకార్య మొరులం ¯ జూపక యేఁ జేయ నిన్ను జుట్టన వ్రేలం ¯ జూపఁగ వచ్చునె! సకల ధ ¯ రాపతులకు నీకుఁ జేయరానిది గలదే! . (705) కావున. (706) విమలమతి నిట్టి మఖ రా ¯ జమునకుఁ దెప్పింపవలయు సంభారంబుల్‌ ¯ సమకూర్పుము; నీ యనుజుల ¯ సమదగతిం బంపు నిఖిలశత్రుల గెల్వన్." (707) అను మాటలు విని కుంతీ ¯ తనయుఁడు మోదమునఁ బొంగి తామరసాక్షున్ ¯ వినుతించి శౌర్యకలితుల ¯ ననుజుల దెసఁ జూచి పలికె హర్షముతోడన్. (708) "సృంజయభూపాలకులునుఁ¯ గుంజర రథ వాజి సుభట కోటులు నినుఁ గొ¯ ల్వం జను"మని సహదేవుని ¯ నంజక పొమ్మనియె దక్షిణాశ జయింపన్. (709) ప్రకటచతుర్విధ సేనా ¯ ప్రకరంబులు గొలువఁ బంచెఁ బడమటిదిశకున్ ¯ నకులున్ విదళిత రిపు భూ ¯ పకులున్ శౌర్యంబు మెఱసి పార్థివముఖ్యా! (710) దుర్జనభంజను శౌర్యో ¯ పార్జితవిజయప్రకాండు నాహవనిపుణు¯ న్నర్జునమహితయశోనిధి ¯ నర్జును నుత్తరపు దిశకు ననిచె నరేంద్రా! (711) మహితశౌర్యనిధులు మత్స్య కేకయ మద్ర ¯ భూతలేంద్రబలసమేతముగను ¯ దర్పమొప్ప బంచెఁదూర్పుదిక్కునకు ను ¯ ద్దామనిహిత వైరిధాము భీము. (712) పనిచిన వార లేగి ఘనబాహుపరాక్రమ విక్రమంబుల¯ న్ననుపమశౌర్యులైన చతురంతమహీశుల నోర్చి కప్పముల్‌ ¯ కనక వినూత్న రత్న తురగప్రముఖాఖిల వస్తుజాతముల్‌ ¯ గొని చనుదెంచి ధర్మజునకుం బ్రణమిల్లి యుదాత్త చిత్తులై. , (713) తమతమ పోయివచ్చిన విధంబుల భూపతులన్ జయించుటల్‌¯ క్రమముగఁ జెప్ప నందుల జరాతనయుం డరివెట్టఁ డయ్యె నం ¯ చమరవరేణ్యనందనుఁ డహంకృతి దక్కఁగ విన్నవించినన్ ¯ యమసుతుఁడూరకుండెవికలాత్మకుఁడై విని యంతఁ గృష్ణుఁడున్ (714) ధర్మనందనుఁ జూచి యుత్కలికతోడఁ ¯ బలికె "మాగధుఁ బోరఁ జంపఁగ నుపాయ ¯ మొకటి గల దది సెప్పెద నుద్ధవుండు ¯ నాకుఁ జెప్పిన చందంబు నయచరిత్ర! (715) విను మగధేశ్వరుం డెపుడు విప్రజనావళియందు భక్తియున్ ¯ వినయముఁ గల్గి యెద్దియును వేఁడినచో వృథసేయ కిచ్చుఁగా ¯ వున విజయుండునుం బవనపుత్రుఁడు నేనును బ్రాహ్మణాకృతిం¯ జని రణభిక్ష వేఁడిన వశంవదుఁడై యతఁ డిచ్చుఁ గోరికల్‌. (716) అట్టియెడ. (717) తవిలి యప్పుడు మల్లయుద్ధమున వానిఁ ¯ బిలుకుమార్పింప వచ్చును భీముచేత!"¯ ననిన ధర్మజుఁ "డదిలెస్స"యనిన విప్ర ¯ వేషములు దాల్చి యరిగిరి విశదయశులు.

జరాసంధుని వధింపఁ బోవుట

(718) ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు యతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి. (719) "ధరణీశ! యతిథిపూజా ¯ పరుఁడవు నీ వనుచు దిశలఁ బలుకఁగ విని మే ¯ మరుదెంచితిమి మదీప్సిత ¯ మఱ సేయక యిమ్ము సువ్రతాచారనిధీ! (720) అతిథిజనంబుల భక్తిన్ ¯ సతతముఁ బూజించి యుచితసత్కారము లు¯ న్నతి నడపు సజ్జనులు శా ¯ శ్వతకీర్తులు ధరణిఁబడయఁజాలుదు రనఘా! (721) పరికింపఁగ దేహం బ¯ స్థిరమని నిజబుద్ధిఁ దలఁచి చిరతరకీర్తి¯ స్ఫురణం బ్రస్తుతి కెక్కని ¯ పురుషుఁడు జీవన్మృతుండు భూరివివేకా! (722) ధారుణిలోన వదాన్యుల ¯ కీ రాని పదార్థ మొక్కటేనిం గలదే ¯ కోరినఁ దన మే యెముకలు ¯ ధీరుండై యిచ్చె నని దధీచిని వినమే? (723) అడిగిన వృథసేయక తన ¯ యొడ లాఁకలిగొన్న యెఱుకు కోగిరముగ నే ¯ ర్పడ నిచ్చి కీర్తిఁ గనె నని ¯ పుడమిన్ మును వినమె యల కపోతము ననఘా! (724) ఆ యింద్రాగ్నులు శ్యేనక ¯ వాయస రూపములఁ దన్ను వలఁతిగ వేఁడన్ ¯ ధీయుతుఁడై మును శిబి తన ¯ కాయము గోసిచ్చె నన జగంబుల వినమే! (725) ధీరమతులు రంతిదేవ హరిశ్చంద్ర ¯ బలులు నుంఛవృత్తి బ్రాహ్మణునిని ¯ మున్ను సెప్ప వినమె? సన్నుతచరితులు ¯ సన్న నైన నేఁడు నున్నవారు. " (726) అనిన విని జరాసంధుండు వారల రూపంబులును, మేఘగంభీర భాషణంబులును, గుణకిణాంకంబులును మహాప్రభావంబులునుం జూచి తన మనంబున “వీరలు బ్రాహ్మణవేషధారులైన రాజేంద్రులు గానోపుదు” రని తలంచి “యిమ్మహాత్ములు గోరిన పదార్థంబ కాదు; ప్రాణంబులేనియు నిత్తు; నదియునుం గాక తొల్లి బలీంద్రుండు విప్రవ్యాజంబున నడిగిన విష్ణుదేవునకు నాత్మపదభ్రష్టత్వం బెఱింగియు విచారింపక జగత్త్రయంబు నిచ్చి కీర్తిపరుండయ్యె; క్షత్రబంధుం డనువాఁడు బ్రాహ్మణార్థంబు నిజప్రాణపరిత్యాగంబు సేసి నిర్మలంబగు యశంబు వడసె; నది గావున ననిత్యంబైన కాయంబు విచారణీయంబు గాదు; కీర్తి వడయుట లెస్స” యని తలంచి యుదారుండై కృష్ణార్జునభీములం గని యిట్లనియె. (727) "భూరిగుణులార! మీ మదిఁ¯ కోరిక యెఱిఁగింపుఁ డేమి కోరిననైనన్ ¯ ధీరత నొసఁగుటయే కా ¯ దారయ నా శిరము ద్రుంచి యైనను నిత్తున్. " (728) నావుడుఁ గృష్ణుఁ డమ్మగధనాథున కిట్లను "భూవరేణ్య! నీ ¯ భావము సూనృతవ్రతశుభస్థితిఁ జెందు టెఱుంగవచ్చె; మా ¯ కీవలె నాజిభిక్ష; యితఁ డింద్రతనూభవుఁ; డే నుపేంద్రుఁడం; ¯ బావని యీతఁ; డిం దొకనిఁ బైకొని యెక్కటి పోరఁగాఁ దగున్." (729) అన విని వాఁడు నవ్వి "యహహా! విన వింతలుపుట్టె మున్ను న¯ న్ననిమొన నోర్వఁజాలక భయంబునఁ బాఱితి పెక్కుమార్లు; వం¯ చన మథురాపురిన్ విడిచి సాగరమధ్యమునందు డాఁగవే? ¯ వనరుహనాభ! నీ బిరుదు వాఁడితనంబును నాకు వింతయే? (730) ఇన్నేల సెప్ప? మాయలఁ ¯ బన్నినఁ బో విడువ గోపబాలక! బల సం ¯ పన్నుని మాగధభూవరు ¯ నన్నెఱుఁగవె తొల్లి నందనందన! పోరన్? (731) కాన రణోర్వి నన్నెదురఁ గష్టము గాన తలంగు; గోత్రభి¯ త్సూనుఁడుభూరిబాహుబలదుర్దముఁడయ్యునుఁ బిన్న; యీమరు¯ త్సూనుఁడు మామకప్రకటదోర్బలశక్తికిఁ జూడఁ దుల్యుఁడౌ; ¯ వీనినెదుర్తు"నంచుఁ జెయివీచె జరాసుతుఁ డుగ్రమూర్తియై. (732) కరువలిసుతునకు నొక భీ ¯ కరగద నిప్పించి యొక్కగదఁ దనకేలన్ ¯ ధరియించి నలువురును గ్ర¯ చ్చఱఁ బురి వెలి కేగి యచట సమతలభూమిన్.

జరాసంధ వధ

(733) పర్వతద్వంద్వంబు పాథోధియుగళంబు¯ మృగపతిద్వితయంబు వృషభయుగము ¯ పావకద్వయము దంతావళయుగళంబు¯ దలపడు వీఁక నుద్దండలీలఁ ¯ గదిసి యన్యోన్యభీకరగదాహతులను¯ గ్రంబుగ విస్ఫులింగములు సెదరఁ ¯ గెరలుచు సవ్యదక్షిణమండలభ్రమ¯ ణములను సింహచంక్రమణములను (733.1) గదిసి పాయుచు డాసి డగ్గఱచు మింటి ¯ కెగసి క్రుంగుచుఁ గ్రుంగి వే యెగసి భూమి ¯ పగుల నార్చి ఛటచ్ఛటోద్భటమహోగ్ర ¯ ఘనగదాఘట్టనధ్వని గగనమగల. (734) పోరునంత. (735) గద సారించి జరాతనూభవుఁడు హుంకారప్రఘోషంబులం ¯ జద లల్లాడఁగఁ బాదఘట్టనములన్ సర్వంసహాభాగముం ¯ గదలన్ వాయుజు వ్రేసె; వ్రేయ నతఁ డుగ్రక్రోధదీప్తాస్యుఁడై ¯ యది తప్పించి విరోధిమస్తకము వ్రేయన్ వాఁడు వోఁ దట్టుచున్. (736) మడవక భీమసేనుఁడును మాగధరాజు గడంగి బెబ్బులుల్‌ ¯ విడివడు లీల నొండొరుల వీఁపులు మూఁపులునుం బ్రకోష్ఠముల్‌¯ నడితల లూరు జాను జఘనప్రకరంబులు బిట్టు వ్రయ్యఁగాఁ ¯ బిడుగులఁబోలు పెన్గదల బెట్టుగ వ్రేయుచుఁ బాయుచున్ వెసన్. (737) బెడ గడరు పెన్గదలు పొడిపొడిగఁ దాఁకఁ, బెను;¯ పిడుగు లవనిం దొరఁగ, నుడుగణము రాలన్, ¯ మిడుఁగుఱులు చెద్ర, నభ మడల, హరిదంతములు; ¯ వడఁక, జడధుల్‌ గలఁగఁ, బుడమి చలియింపన్, ¯ వెడచఱువ మొత్తియునుఁ, దడఁబడఁగ నొత్తియును;¯ నెడమగుడు లాఁచి తిరుగుడు పడఁగ వ్రేయన్, ¯ వడవడ వడంకుచును, సుడివడక డాసి, చల;¯ ముడుగ కపు డొండొరుల వడిచెడక పోరన్. (738) ఇవ్విధంబునం బోరుచుండ నొండొరుల గదా దండంబులు దుమురులైనం బెండువడక సమద దిగ్వేదండశుండాదండమండిత ప్రచండంబు లగు బాహుదండంబు లప్పగించి ముష్టియుద్ధంబునకు డగ్గఱి. (739) కాల వెస దాచియును, గీ లెడలఁ ద్రోచియునుఁ, ¯ దాలుములు దూలఁ బెడకేల వడి వ్రేయన్, ¯ ఫాలములు గక్షములుఁ దాలువులు వక్షములు;¯ వ్రీల, నెముకల్‌ మెదడు నేలఁ దుమురై వే ¯ రాల, విపులక్షతవిలోలమగు నెత్తురులు;¯ జాలుగొని యోలిఁ బెనుఁ గాలువలుగం, బే ¯ తాలమదభూతములు ఖేలనలఁ జేతులనుఁ;¯ దాళములు తట్టుచు సలీలగతి నాడన్. (740) ప్రక్కలుఁ జెక్కులున్ మెడలుఁ బాణితలంబులచేఁ బగుల్చుచున్ ¯ ముక్కులు నక్కులుంజెవులు ముష్టిహతిన్ నలియంగ గ్రుద్దుచున్ ¯ డొక్కలుఁ బిక్కలున్ ఘనకఠోరపదాహతి నొంచుచున్ నెఱుల్‌¯ దక్కక స్రుక్క కొండొరులఁ దార్కొని పేర్కొని పోరి రుగ్రతన్. (741) హుమ్మని మ్రోఁగుచుం, బెలుచ హుంకృతు లిచ్చుచుఁ, బాసి డాసి కో ¯ కొమ్మనుచున్నొడళ్ళగల గుల్లల తిత్తులుగాఁ బదంబులం ¯ గ్రుమ్ముచు, ముష్ఠి ఘట్టనల స్రుక్కుచు, నూర్పులు సందఁడింపఁగా¯ సొమ్మలు వోవుచుం, దెలియుచున్, మదిఁ జేవయు లావుఁ జూపుచున్ (742) ఇవ్విధంబున వజ్రివజ్రసన్నిభంబగు నితరేతర ముష్టిఘట్టనంబుల భిన్నాంగులై, రక్తసిక్తశరీరంబులతోడం బుష్పితాశోకంబుల వీఁకను, జేగుఱుఁ గొండల చందంబునను జూపట్టి పోరుచుండఁ, గృష్ణుండు జరాసంధుని జన్మమరణప్రకారంబు లాత్మ నెఱుంగుటం జేసి, వాయుతనూభవున కలయికలేక లావును జేవయుఁ గలుగునట్లుగాఁ దద్గాత్రంబునందు దనదివ్యతేజంబు నిలిపి, యరినిరసనోపాయం బూహించి సమీరనందనుండు సూచుచుండ నొక్క శాఖాగ్రంబు రెండుగాఁ జీరివైచి వాని నట్ల చీరి చంపు మని సంజ్ఞగాఁ జూపిన, నతండు నా కీలుదెలిసి, యవక్రపరాక్రముండై మాగధుం బడఁద్రోచి, వాని పదంబు పదంబునం ద్రొక్కి, బాహుయుగళంబున రెండవ పదంబుఁ గదలకుండంబట్టి, మస్తకపర్యంతంబుఁ బెళబెళమని చప్పుళ్ళుప్పతిల్ల మత్తదంతావళంబు దాళవృక్షంబు సీరు చందంబునఁ బాద జాను జంఘోరు కటి మధ్యోదరాంస కర్ణ నయనంబులు వేఱువేఱు భాగంబులుగా వ్రయ్యలు వాపి యార్చినఁ, బౌరజనంబులు గనుంగొని భయాకులులై హాహాకారంబులు సేసి;రంత.

రాజ బంధ మోక్షంబు

(743) అనిలజుని దేవపతి నం ¯ దనుఁడునుఁ బద్మాక్షుఁడును నుదారత నాలిం ¯ గనములు సేసి పరాక్రమ ¯ మున కద్భుతమంది మోదమునఁ బొగడి రొగిన్. (744) వనజాక్షుఁ డంతఁ గరుణా ¯ వననిధియును భక్తలోకవత్సలుఁడునుఁ గా ¯ వున మాగధసుతు సహదే ¯ వునిఁ బట్టముగట్టెఁ దన్నవోన్నతపదవిన్. (745) మగధాధినాథునకు ము¯ న్నగపడి చెఱసాలలను మహాదుఃఖములన్ ¯ నొగులుచుఁ దన పాదాంబుజ ¯ యుగళము చింతించుచున్న యుర్వీశ్వరులన్. (746) అయ్యవసరంబునఁ గృష్ణుండు దన దివ్యచిత్తంబున మఱవ నవధరింపక చెఱలు విడిపించిన, వారలు పెద్దకాలంబు కారాగృహంబులఁ బెక్కు బాధలం బడి కృశీభూతశరీరు లగుటంజేసి, రక్తమాంస శూన్యంబులై త్వగస్థిమాత్రావశిష్టంబులును, ధూళిధూసరంబులు నైన దేహంబులు గలిగి, కేశపాశంబులు మాసి, జటాబంధంబు లైన శిరంబులతో మలినవస్త్రులై చనుదెంచి; యప్పుడు. (747) నవపద్మలోచను, భవబంధమోచను¯ భరితశుభాకారు, దురితదూరుఁ, ¯ గంగణకేయూరుఁ, గాంచనమంజీరు¯ వివిధశోభితభూషు, విగతదోషుఁ, ¯ బన్నగాంతకవాహు, భక్తమహోత్సాహు¯ నతచంద్రజూటు, నున్నతకిరీటు, ¯ హరినీలనిభకాయు, వరపీతకౌశేయుఁ¯ గటిసూత్రధారు, జగద్విహారు (747.1) హార వనమాలికా మహితోరువక్షు, ¯ శంఖచక్రగదాపద్మశార్‌ఙ్గహస్తు, ¯ లలిత శ్రీవత్సశోభితలక్షణాంగు, ¯ సుభగచారిత్రు, దేవకీసుతునిఁ గాంచి. (748) భరితముదాత్ములై, విగతబంధనులై, నిజమస్తముల్‌ మురా ¯ సురరిపు పాదపద్మములు సోఁకఁగఁ జాఁగిలి మ్రొక్కి నమ్రులై, ¯ కరములు మోడ్చి "యో! పరమకారుణికోత్తమ! సజ్జనార్తి సం¯ హరణ వివేకశీల! మహితాశ్రితపోషణ! పాపశోషణా! (749) వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద! ¯ దాసదుఃఖనాశ! వాసుదేవ! ¯ యవ్యయాప్రమేయ! యనిశంబుఁ గావింతు ¯ మిందిరేశ! నీకు వందనములు (750) ధీరవిచార! మమ్ము భవదీయ పదాశ్రయులన్ జరాసుతో ¯ దారనిబంధనోగ్ర పరితాపము నీ కరుణావలోకనా ¯ సారముచేత నార్చితివి; సజ్జనరక్షయు దుష్టశిక్షయు¯ న్నారయ నీకుఁ గార్యములు యాదవవంశపయోధిచంద్రమా! (751) అవధరింపుము మాగధాధీశ్వరుఁడు మాకు¯ బరమబంధుఁడు గాని పగయకాఁడు ¯ ప్రకటిత రాజ్యవైభవ మదాంధీభూత¯ చేతస్కులము మమ్ముఁ జెప్ప నేల? ¯ కమనీయ జలతరంగముల కైవడి దీప¯ శిఖవోలెఁ జూడ నస్థిరములైన ¯ గురుసంపదలు నమ్మి పరసాధనక్రియా¯ గమ మేది తద్బాధకంబు లగుచుఁ (751.1) బరగు నన్యోన్య వైరానుబంధములను ¯ బ్రజలఁ గారించుచును దుష్టభావచిత్తు ¯ లగుచు నాసన్న మృత్యుభయంబు దక్కి ¯ మత్తులై తిరుగుదురు దుర్మనుజు లంత. (752) కడపటిచేఁత నైహికసుఖంబులఁ గోల్పడి రిత్త కోర్కి వెం ¯ బడిఁ బడి యెండమావులఁ బిపాసువులై సలిలాశ డాయుచుం ¯ జెడు మనుజుల్‌ భవాబ్ధిదరిఁ జేరఁగలేక నశింతు; రట్టి యా ¯ యిడుమలఁ బొందఁజాలము రమేశ! త్రిలోకశరణ్య! మాధవా! (753) వేదవధూశిరోమహితవీథులఁ జాల నలంకరించు మీ ¯ పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని¯ త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెఱుంగఁబల్కు దా ¯ మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా!" (754) అని తను శరణము వేఁడిన ¯ జననాథుల వలను సూచి సదమలభక్తా ¯ వనచరితుఁడు పంకజలో ¯ చనుఁ డిట్లను వారితోడ సదయామతియై. (755) "జనపతులార! మీ పలుకు సత్యము; రాజ్యమదాంధచిత్తులై ¯ ఘనముగ విప్రులం బ్రజలఁ గాఱియఁ బెట్టుటఁ జేసి కాదె వే ¯ న నహుష రావణార్జునులు నాశము నొందిరి; కాన ధర్మ పా ¯ లనమునఁగాక నిల్చునె? కులంబుబలంబుఁ జిరాయురున్నతుల్‌. (756) అది గావున మీ మనంబుల దేహం బనిత్యంబుగాఁ దెలిసి. (757) మీరలు ధర్మముం దగవు మేరయుఁ దప్పక, భూజనాళిఁ బెం ¯ పారుచు, సౌఖ్యసంపదల నందఁగఁ బ్రోచుచు, భూరియజ్ఞముల్‌ ¯ గౌరవవృత్తి మత్పరముగా నొనరింపుచు, మామకాంఘ్రి పం ¯ కేరుహముల్‌ భజించుచు నకిల్బిషులై చరియింపుఁ డిమ్ములన్. (758) అట్లయిన మీరలు బ్రహ్మసాయుజ్య ప్రాప్తులయ్యెదురు; మదీయ పాదారవిందంబులందుఁ జలింపని భక్తియుఁ గలుగు"నని యానతిచ్చి యా రాజవరుల మంగళస్నానంబులు సేయించి, వివిధ మణి భూషణ మృదులాంబర మాల్యానులేపనంబు లొసంగి, భోజన తాంబూలాదులం బరితృప్తులం జేసి, యున్నత రథాశ్వ సామజాధిరూఢులం గావించి, నిజరాజ్యంబులకుఁ బూజ్యులంచేసి, యనిచిన. (759) నరవరు లీ చందంబున ¯ మురసంహరుచేత బంధమోక్షణులై సు¯ స్థిరహర్షంబులతో నిజ ¯ పురములకుం జనిరి శుభవిభూతి తలిర్పన్. (760) హరిమంగళగుణకీర్తన ¯ నిరతముఁ గావించుచును వినిర్మలమతులై ¯ గురుబంధుపుత్త్రజాయా ¯ పరిజన మలరంగఁ గృష్ణుఁ బద్మదళాక్షున్. (761) బహుప్రకారంబులం బొగడుచుఁ దమతమ దేశంబులకుం జని. (762) నళినదళలోచనుఁడు దముఁ ¯ దెలిపిన సద్ధర్మపద్ధతినిఁ దగవరులై ¯ యిలఁ బరిపాలించుచు సుఖ ¯ ముల నుండిరి మహితనిజవిభుత్వము లలరన్. (763) ఇట్లు కృష్ణుండు జరాసంధవధంబును, రాజలోకంబునకు బంధమోక్షణంబును గావించి, వాయునందన వాసవనందనులుం దానును జరాసంధతనయుం డగు సహదేవుండు సేయు వివిధంబు లగు పూజలు గైకొని, యతని నుండ నియమించి, యచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల నింద్రప్రస్థపురంబునకుం జనుదెంచి, తద్ద్వార ప్రదేశంబున విజయశంఖంబులు పూరించినఁ, బ్రతిపక్ష భయదంబును, బాంధవ ప్రమోదంబును నగు నమ్మహాఘోషంబు విని, పౌరజనంబులు జరాతనయు మరణంబు నిశ్చయించి సంతసిల్లిరి; వారిజాక్షుండును భీమసేన పార్థులతోఁ బురంబు ప్రవేశించి, ధర్మనందనునకు వందనం బాచరించి, తమ పోయిన తెఱంగును నచ్చట జరాసంధుని వధియించిన ప్రకారంబును సవిస్తరంబుగా నెఱింగించిన నతండు విస్మయవికచలోచనంబుల నానందబాష్పంబులు గురియ, నమ్మాధవు మాహాత్మ్యంబునకుఁ దమ యందలి భక్తి స్నేహ దయాది గుణంబులకుం బరితోషంబు నొందుచుఁ గృష్ణునిం జూచి యిట్లనియె. (764) "కమలాక్ష! సర్వలోకములకు గురుఁడవై¯ తేజరిల్లెడు భవదీయమూర్తి ¯ యంశాంశసంభవు లగు లోకపాలురు¯ నీ యాజ్ఞఁ దలమోచి నిఖిలభువన ¯ పరిపాల నిపుణులై భాసిల్లుచున్న వా¯ రట్టి నీ కొక నృపునాజ్ఞ సేయు ¯ టరయ నీమాయ గాకది నిక్కమే? యేక¯ మై యద్వితీయమై యవ్యయంబు (764.1) నైన నీ తేజమున కొక హాని గలదె? ¯ చిన్మయాకార! నీ పాదసేవకులకు ¯ నాత్మపరభేదబుద్ధి యెందైనఁ గలదె? ¯ పుండరీకాక్ష! గోవింద! భువనరక్ష! "