పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 124 - 229

కాళింది మిత్రవిందల పెండ్లి

(124) అంతం గృష్ణుండు ధర్మరాజప్రముఖుల వీడుకొని, సాత్యకిప్రముఖ సహచరులు గొలువ, మరలి తనపురంబునకుం జని బంధుజనంబులకుఁ బరమానందంబు సేయుచు నొక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునం గాళిందిం బెండ్లి యయ్యె; మఱియు నవంతి దేశాధీశ్వరులయిన విందానువిందులు దుర్యోధనునకు వశులై హరికి మేనత్తయైన రాజాధిదేవి కూఁతురైన తమ చెలియలిని వివాహంబు సేయనుద్యోగించి స్వయంవరంబుఁ జాటించిన. (125) భూ రమణులు సూడఁగ హరి¯ వీరతఁ జేకొనియె మిత్రవిందను నిత్యా¯ పూరిత సుజనానందం¯ జారు చికురకాంతి విజిత షట్పదబృందన్.

నాగ్నజితి పరిణయంబు

(126) జననాథ! వినుము కోసలదేశ మేలెడి;¯ నగ్నజిత్తను నరనాథుఁ డొకడు¯ సుమతి ధార్మికుఁడు దత్సుత నాగ్నజితి యను;¯ కన్యక గుణవతి గలదు దానిఁ¯ బెండ్లియాడుటకునై పృథివీశు లేతెంచి;¯ వాఁడికొమ్ములు గల వాని, వీర¯ గంధంబు సోఁకినఁ గాలు ద్రవ్వెడివాని, ¯ నతిమదమత్తంబు లయిన వాని (126.1) గోవృషంబుల నేడింటిఁ గూర్చి తిగిచి¯ బాహుబలమున నెవ్వఁడు పట్టి కట్టు¯ నతఁడు కన్యకుఁ దగు వరుం డనిన వానిఁ¯ బట్టఁజాలక పోదురు ప్రజలు బెగడి. (127) ఇట్లు గోవృషంబుల జయించినవాఁడ క్కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్కొని యర్ఘ్యపాద్యాది విధులం బూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై యున్న యెడ. (128) ఆ రాజకన్య ప్రియమున¯ నా రాజీవాక్షు మోహనాకారుఁ ద్రిలో¯ కారాధితు మాధవుఁ దన¯ కారాధ్యుండైన నాథుఁ డని కోరె నృపా! (129) మఱియు న క్కన్యకారత్నంబు తన మనంబున. (130) "విష్ణుఁ డవ్యయుండు విభుఁడు గావలె నని¯ నోఁచినట్టి తొంటి నోముఫలము¯ సిద్ధ మయ్యెనేనిఁ జేకొనుఁ బో నన్నుఁ¯ జక్రధరుఁడు వైరిచక్రహరుఁడు. (131) సిరియుం బద్మభవేశ దిక్పతులు మున్ సేవించి యెవ్వాని శ్రీ¯ చరణాంభోజపరాగముల్‌ శిరములన్ సమ్యగ్గతిం దాల్తుఁ; రీ¯ ధరణీచక్రభరంబు వాపుటకు నుద్యత్కేళిమూర్తుల్‌ దయా¯ పరుఁడై యెవ్వఁడు దాల్చు నట్టి హరి యెబ్భంగిం బ్రవర్తించునో! " (132) అని యిట్లు నాగ్నజితి విచారించు నెడఁ గృష్ణుం డా రాజుం జూచి మేఘగంభీర నినదంబున నిట్లనియె. (133) "అన్యుల యాచింపరు రా¯ జన్యులు సౌజన్యకాంక్షఁ జనుదెంచితి నీ¯ కన్యన్ వేఁడెద నిమ్మా! ¯ కన్యాశుల్కదుల మేము గాము నరేంద్రా!" (134) అనిన రాజిట్లనియె. (135) "కన్యం జేకొన నిన్నిలోకముల నీ కన్నన్ ఘనుండైన రా¯ జన్యుం డెవ్వఁడు? నీ గుణంబులకు నాశ్చర్యంబునుం బొంది తా¯ నన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్యయై¯ ధన్యత్వంబునుఁ జెంది యున్నది గదా తాత్పర్యసంయుక్తయై. (136) చంచద్గోవృషసప్తకంబుఁ గడిమిన్ సైరించి యెవ్వాఁడు భం¯ జించున్ వానికిఁ గూఁతు నిత్తు నని యేఁ జీరించినన్ వైభవో¯ దంచద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ తత్పాద శృంగాహతిం¯ గించిత్కాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులై. (137) ఉష్ణాంశుండు తమంబుఁ దోలు క్రియ నీ వుగ్రాహవక్షోణిలోఁ¯ గృష్ణా! వైరులఁ దోలినాఁడవు, రణక్రీడావిశేషంబులన్¯ నిష్ణాతుండవు, సప్తగోవృషములన్ నేఁ డాజి భంజించి రో¯ చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశుబింబాననన్. " (138) అని నగ్నజిత్తు తన కూఁతు వివాహంబునకుం జేసిన సమయంబు సెప్పిన విని. (139) కనియె నఘారివత్సబకకంసవిదారి ఖలప్రహారి దా¯ ఘనతర కిల్పిషంబుల నగణ్య భయంకర పౌరుషంబులన్¯ సునిశిత శృంగ నిర్దళితశూరసమూహ ముఖామిషంబులన్¯ హనన గుణోన్మిషంబుల మహా పరుషంబుల గోవృషంబులన్. (140) చేలము చక్కఁ గట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై¯ బాలుఁడు దారురూపములఁ బట్టెడు కైవడిఁ బట్టి వీర శా¯ ర్దూలుఁడు గ్రుద్ది నేలఁ బడఁ ద్రోచి మహోద్ధతిఁ గట్టి యీడ్చె భూ¯ పాలకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్. (141) ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్ప్రకారంబునం బెండ్లి యయ్యె; నా రాజసుందరు లానందంబును బొంది; రా సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె; నంతనా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు మూఁడువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును నిచ్చి పుత్తెంచిన; వచ్చునప్పుడు. (142) భూతి యెలర్పఁ గోసలుని పుత్త్రికకై చనుదెంచి తొల్లి యాఁ¯ బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధువుం¯ డా తరుణిన్ వరించుట చరావలిచే విని త్రోవ సైన్య సం¯ ఘాతముతోడఁ దాఁకి రరిగర్వవిమోచనుఁ బద్మలోచనున్. (143) దండి నరాతు లెల్ల హరిఁ దాఁకిన నడ్డము వచ్చి వీఁకతో¯ భండన భూమియందుఁ దన బాంధవులెల్లను సన్నుతింపఁగా¯ గాండివచాపముక్త విశిఖంబుల వైరుల నెల్లఁ జంపె నా¯ ఖండలనందనుండు శశకంబుల సింహము చంపుకైవడిన్. (144) ఇట్లు హరి నాగ్నజితిం బెండ్లియై, యరణంబులు పుచ్చుకొని, ద్వారకానగరంబునకు వచ్చి సత్యభామతోడం గ్రీడించుచుండె; మఱియును.

భద్ర లక్షణల పరిణయంబు

(145) జనవంద్యన్ శ్రుతకీర్తినంద్యఁ దరుణిన్ సందర్శనక్షోణి పా¯ ద్యనుజన్ మేనమఱందలిన్ విమలలోలాపాంగఁ గైకేయి ని¯ ద్ధనయోన్నిద్రఁ బ్రపూర్ణసద్గుణసముద్రన్ భద్ర నక్షుద్ర నా¯ వనజాతాక్షుఁడు పెండ్లియాడె నహితవ్రాతంబు భీతిల్లఁగన్. (146) మఱియును. (147) అమరులఁ బాఱఁదోలి భుజ గాంతకుఁడైన ఖగేశ్వరుండు ము¯ న్నమృతముఁ దెచ్చుకైవడి మదాంధుల రాజుల నుక్కడంచి యా¯ కమలదళాయతేక్షణుఁడు గైకొని తెచ్చెను మద్రకన్యకన్¯ సమదమృగేక్షణన్ నయవిచక్షణ లక్షణఁ బుణ్యలక్షణన్. (148) ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయుఁ, గాళిందియు, మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, మద్ర రాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి; మఱియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్ర కన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె” నన విని. (149) "ధరకుం బ్రియనందనుఁ డగు¯ నరకుని హరి యేల చంపె? నరకాసురుఁ డా¯ వరకుంతల లగు చామీ¯ కర కుంభస్తనుల నేల కారం బెట్టెన్? "

నరకాసుర వధ కేగుట

(150) అనిన నరేంద్రునకు మునీంద్రుం డిట్లనియె "నరకాసురునిచేత నదితి కర్ణకుండలంబులును, వరుణచ్ఛత్త్రంబును, మణిపర్వత మనియెడు నమరాద్రి స్థానంబును గోలుపడుటయు; నింద్రుండు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడవాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ యిట్లనియె. (151) "దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెండాడ నీ¯ ప్రావీణ్యంబులు సూడఁ గోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి న¯ న్నీ వెంటం గొనిపొమ్ము నేఁడు కరుణన్; నేఁ జూచి యేతెంచి నీ¯ దేవీ సంహతికెల్లఁ జెప్పుదు భవద్దీప్తప్రతాపోన్నతుల్‌, " (152) అనినఁ బ్రాణవల్లభకు వల్లభుం డిట్లనియె. (153) "సమద పుష్పంధయ ఝంకారములు గావు¯ భీషణకుంభీంద్ర బృంహితములు¯ వాయునిర్గత పద్మవనరేణువులు గావు¯ తురగ రింఖాముఖోద్ధూతరజము¯ లాకీర్ణజలతరం గాసారములు గావు¯ శత్రుధనుర్ముక్త సాయకములు¯ గలహంస సారస కాసారములు గావు¯ దనుజేంద్రసైన్య కదంబకములు (153.1) కమల కహ్లార కుసుమ సంఘములు గావు; ¯ చటుల రిపు శూల ఖడ్గాది సాధనములు¯ కన్య! నీ వేడ? రణరంగ గమన మేడ? ¯ వత్తు వేగమ; నిలువుము; వలదు వలదు. " (154) అనినఁ బ్రియునకుం బ్రియంబు జనియింప డగ్గఱి. (155) "దానవులైన నేమి? మఱి దైత్యసమూహములైన నేమి? నీ¯ మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక? నీ¯ తో నరుదెంతు"నంచుఁ గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కె న¯ మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్టిఁ జూడఁగన్. (156) ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబులఁగ్రుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగన మార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన ప్రాగ్జ్యోతిషపురంబు డగ్గఱి. (157) గదచేఁ బర్వతదుర్గముల్‌ శకలముల్‌ గావించి సత్తేజిత¯ ప్రదరశ్రేణుల శస్త్రదుర్గచయమున్ భంజించి చక్రాహతిం¯ జెదరన్ వాయుజలాగ్ని దుర్గముల నిశ్శేషంబులం జేసి భీ¯ ప్రదుఁడై వాలునఁ ద్రుంచెఁ గృష్ణుఁడు మురప్రచ్ఛన్నపాశంబులన్. (158) మఱియును. (159) ప్రాకారంబు గదా ప్రహారముల నుత్పాటించి యంత్రంబులున్¯ నాకారాతుల మానసంబులును భిన్నత్వంబు సెందంగ న¯ స్తో కాకారుఁడు శౌరి యొత్తె విలయోద్ధూతాభ్ర నిర్ఘాత రే¯ ఖాకాఠిన్యముఁ బాంచజన్యము విముక్తప్రాణి చైతన్యమున్. (160) అంత లయకాల కాలాభ్రగర్జనంబు పగిది నొప్పు నమ్మహా ధ్వని విని పంచశిరుం డైన మురాసురుండు నిదుర సాలించి యావులించి నీల్గి లేచి జలంబులు వెడలివచ్చి హరిం గని ప్రళయకాల కీలికైవడి మండుచు దుర్నిరీక్ష్యుండై కరాళించుచుం దన పంచముఖంబులం పంచభూతమయం బయిన లోకంబుల మ్రింగ నప్పళించు చందంబునం గదిసి యాభీల కీలాజటాలంబగు శూలంబున గరుడుని వైచి భూనభోంతరంబులు నిండ నార్చుచు. (161) దురదురఁ బరువిడి బిరుసున¯ హరి హరి! నిలు నిలువు మనుచు నసురయుఁ గదిసెన్¯ మురముర! దివిజుల హృదయము¯ మెరమెర యిదె యడఁగు ననుచు మెఱసెన్ హరియున్. (162) అప్పుడు. (163) గరుడునిపైఁ బడ వచ్చిన¯ మురశూలము నడుమ నొడిసి ముత్తునియలుగాఁ¯ గరముల విఱిచి ముకుందుఁడు¯ ముర ముఖముల నిశితవిశిఖములు వడిఁ జొనిపెన్. (164) గద వ్రేసెన్ మురదానవుండు హరిపైఁ; గంసారియుం దద్గదన్¯ గదచేఁ ద్రుంచి సహస్రభాగములుగాఁ గల్పించె; నాలోన వాఁ¯ డెదురై హస్తము లెత్తికొంచు వడి రా నీక్షించి లీలాసమ¯ గ్రదశన్ వాని శిరంబులైదును వడిన్ ఖండించెఁ జక్రాహతిన్. (165) ఇట్లు శిరంబులు చక్రిచక్రధారాచ్ఛిన్నంబు లయిన వజ్రివజ్రధారా దళితశిఖరంబై కూలెడి శిఖరిచందంబున మురాసురుండు జలంబులందుఁ గూలిన, వాని సూనులు జనకవధజనిత శోకాతురులై జనార్దను మర్దింతు మని రణకుర్దనంబునం దామ్రుండు, నంతరిక్షుండు, శ్రవణుండు, విభావసుండు, వసుండు, నభస్వంతుండు, నరుణుండు నననేడ్వురు యోధులు సక్రోధులై కాలాంతకచోదితం బైన ప్రళయపవన సప్తకంబు భంగి నరకాసుర ప్రేరితులై రయంబునఁ బీఠుండనియెడు దండనాథుం బురస్కరించుకొని, పఱతెంచి హరిం దాఁకి శర శక్తి గదా ఖడ్గ కరవాల శూలాది సాధనంబులు ప్రయోగించిన. (166) ఆ దనుజేంద్రయోధ వివిధాయుధసంఘము నెల్ల నుగ్రతన్¯ మేదినిఁ గూలనేయుచు సమిద్ధనిరర్గళ మార్గణాళిఁ గ్ర¯ వ్యాదకులాంతకుండసుర హస్త భుజానన కంఠ జాను జం¯ ఘాదులఁ ద్రుంచివైచెఁ దిలలంతలు ఖండములై యిలం బడన్. (167) మఱియు హరి శరజాలచక్రనిహతులయి తనవారలు మడియుటకు వెఱంగుపడి రోషించి గరుడగమనుని దూషించి తన్ను భూషించుకొని సరకు సేయక నరకుండు వరకుండలప్రముఖాభరణభూషితుండయి దానసలిలధారాసిక్త గండంబులును, మహోద్దండశుండాదండంబులు నైన వేదండంబులు తండంబులై నడువ వెడలి భండనంబునకుం జని. (168) బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి¯ స్థల శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై¯ లలనారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను¯ జ్జ్వలనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్. (169) కని కలహంబునకు నరకాసురుండు గమకింపం దమకింపక విలోకించి సంభ్రమంబున.

సత్యభామ యుద్ధంబు

(170) వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ¯ శ్రేణిం దాల్చి ముఖేందుమండల మరీచీజాలముల్‌ పర్వఁగాఁ¯ బాణిం బయ్యెదఁ జక్కగాఁ దుఱిమి శుంభద్వీరసంరంభయై¯ యేణీలోచన లేచి నిల్చెఁ దన ప్రాణేశాగ్ర భాగంబునన్. (171) జన్యంబున దనుజుల దౌ¯ ర్జన్యము లుడుపంగఁ గోరి చనుదెంచిన సౌ¯ జన్యవతిఁ జూచి యదురా¯ జన్యశ్రేష్ఠుండు సరససల్లాపములన్. (172) "లేమా! దనుజుల గెలువఁగ¯ లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా¯ లే మాను మాన వేనిన్¯ లే మా విల్లందికొనుము లీలం గేలన్. " (173) అని పలికి. (174) హరిణాక్షికి హరి యిచ్చెను¯ సురనికరోల్లాసనమును శూరకఠోరా¯ సురసైన్యత్రాసనమును¯ బరగర్వనిరాసనమును బాణాసనమున్. (175) ఆ విల్లంది బలంబు నొంది తదగణ్యానంత తేజోవిశే¯ షావిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయై¯ తా వేగన్ సగుణంబుఁ జేసె ధనువుం దన్వంగి దైత్యాంగనా¯ గ్రీవాసంఘము నిర్గుణంబుగ రణక్రీడా మహోత్కంఠతోన్. (176) నారి మొరయించె రిపు సే¯ నా రింఖణ హేతువైన నాదము నిగుడన్¯ నారీమణి బలసంప¯ న్నారీభాదికము మూర్ఛనంద నరేంద్రా! (177) సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు¯ శింజినీరవముతోఁ జెలిమి సేయఁ¯ దాటంక మణిగణ ధగధగ దీప్తులు¯ గండమండలరుచిఁ గప్పికొనఁగ¯ ధవళతరాపాంగ ధళధళ రోచులు¯ బాణజాలప్రభాపటలి నడఁప¯ శరపాత ఘుమఘుమశబ్దంబు పరిపంథి¯ సైనిక కలకల స్వనము నుడుప (177.1) వీర శృంగార భయ రౌద్ర విస్మయములు¯ గలసి భామిని యయ్యెనో కాక యనఁగ¯ నిషువుఁ దొడుగుట దివుచుట యేయుటెల్ల¯ నెఱుఁగరా కుండ నని సేసె నిందువదన. (178) పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా¯ విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్¯ జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్¯ సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్. (179) అలినీలాలక చూడ నొప్పెసఁగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో¯ నలికస్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స¯ ల్లలితజ్యానఖపుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో¯ వలయాకార ధనుర్విముక్త విశిఖవ్రాతాహతారాతియై. (180) బొమ్మ పెండిండ్లకుఁ బో నొల్ల నను బాల¯ రణరంగమున కెట్లు రాఁ దలంచె? ¯ మగవారిఁ గనినఁ దా మఱుఁగుఁ జేరెడు నింతి¯ పగవారి గెల్వనే పగిదిఁ జూచెఁ? ¯ బసిఁడియుయ్యెల లెక్క భయ మందు భీరువు¯ ఖగపతి స్కంధమే కడిఁది నెక్కె? ¯ సఖుల కోలాహల స్వనము లోర్వని కన్య¯ పటహభాంకృతుల కెబ్భంగి నోర్చె? (180.1) నీలకంఠములకు నృత్యంబుఁ గఱపుచుఁ¯ నలసి తలఁగిపోవు నలరుఁబోఁడి¯ యే విధమున నుండె నెలమి నాలీఢాది¯ మానములను రిపులమాన మడఁప? (181) వీణెఁ జక్కఁగఁ బట్ట వెర వెఱుంగని కొమ్మ¯ బాణాసనం బెట్లు పట్ట నేర్చె? ¯ మ్రాఁకునఁ దీగెఁ గూర్పంగ నేరని లేమ¯ గుణము నే క్రియ ధనుఃకోటిఁ గూర్చె? ¯ సరవి ముత్యము గ్రువ్వఁ జాలని యబల యే¯ నిపుణత సంధించె నిశితశరముఁ? ¯ జిలుకకుఁ బద్యంబు సెప్ప నేరని తన్వి¯ యస్త్రమంత్రము లెన్నఁ డభ్యసించెఁ? (181.1) బలుకు మనినఁ బెక్కు పలుకని ముగుద యే¯ గతి నొనర్చె సింహగర్జనములు? ¯ ననఁగ మెఱసెఁ ద్రిజగదభిరామ గుణధామ¯ చారుసత్యభామ సత్యభామ. (182) జ్యావల్లీధ్వని గర్జనంబుగ; సురల్‌ సారంగయూథంబుగా; ¯ నా విల్లింద్రశరాసనంబుగ; సరోజాక్షుండు మేఘంబుగాఁ; ¯ దా విద్యుల్లతభంగి నింతి సురజిద్దావాగ్ని మగ్నంబుగాఁ¯ బ్రావృట్కాలము సేసె బాణచయ మంభశ్శీకరశ్రేణిగాన్. (183) రాకేందుబింబమై రవిబింబమై యొప్పు¯ నీరజాతేక్షణ నెమ్మొగంబు; ¯ కందర్పకేతువై ఘన ధూమకేతువై¯ యలరుఁ బూఁబోఁడి చేలాంచలంబు; ¯ భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై¯ మెఱయు నాకృష్టమై మెలఁత చాప; ¯ మమృత ప్రవాహమై యనల సందోహమై¯ తనరారు నింతిసందర్శనంబు; (183.1) హర్షదాయియై మహారోషదాయియై¯ పరఁగు ముద్దరాలి బాణవృష్ణి; ¯ హరికి నరికిఁ జూడ నందంద శృంగార¯ వీరరసము లోలి విస్తరిల్ల. (184) ఇవ్విధంబున. (185) శంపాలతాభ బెడిదపు¯ టంపఱచే ఘోరదానవానీకంబుల్‌¯ పెంపఱి సన్నాహంబుల¯ సొంపఱి భూసుతుని వెనుకఁ జొచ్చెన్ విచ్చెన్.

నరకాసురుని వధించుట

(186) అయ్యవసరంబునం గంససంహారి మనోహారిణిం జూచి సంతోషకారియుం, గరుణారసావలోకన ప్రసారియు, మధురవచన సుధారస విసారియుం, దదీయ సమరసన్నాహ నివారియునై యిట్లనియె. (187) "కొమ్మా! దానవ నాథుని¯ కొమ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై¯ కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ¯ గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్. " (188) అని పలికి సమ్మానరూపంబులును, మోహనదీపంబులును, దూరీకృత చిత్తవిక్షేపంబులునైన సల్లాపంబులం గళావతిం దద్దయుఁ బెద్దఱికంబు సేసి, తత్కరకిసలయోల్లసిత బాణాసనంబు మరల నందుకొనియె; నప్పుడు సురవైరి మురవైరి కిట్లనియె. (189) "మగువ మగవారి ముందఱ¯ మగతనములు సూప రణము మానుట నీకున్¯ మగతనము గాదు; దనుజులు¯ మగువల దెసఁ జనరు మగలమగ లగుట హరీ! " (190) అనిన హరి యిట్లనియె. (191) "నరకా! ఖండించెద మ¯ త్కరకాండాసనవిముక్త ఘనశరముల భీ¯ కరకాయు నిన్ను సుర కి¯ న్నరకాంతలు సూచి నేఁడు నందం బొందన్." (192) అని పలికి హరి నరకాసురయోధులమీఁద శతఘ్ని యను దివ్యాస్త్రంబు ప్రయోగించిన నొక్క వరుసను వారలందఱు మహావ్యథం జెందిరి; మఱియును. (193) శర విచ్ఛిన్న తురంగమై పటుగదాసంభిన్న మాతంగమై, ¯ యురుచక్రాహత వీరమధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై, ¯ సురభిత్సైన్యము దైన్యముం బొరయుచున్ శోషించి హైన్యంబుతో¯ హరి మ్రోలన్ నిలువంగ లేక పఱచెన్ హాహానినాదంబులన్. (194) అప్పుడు. (195) మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు¯ శస్త్రసముదయముల జనవరేణ్య! ¯ మురహరుండు వరుస మూఁడేసి కోలలన్¯ ఖండితంబు సేసె గగన మందు. (196) వెన్నుని సత్యను మోచుచుఁ¯ బన్నుగఁ బద నఖర చంచు పక్షాహతులన్¯ భిన్నములు సేసె గరుడుఁడు¯ పన్నిన గజసముదయములఁ బౌరవముఖ్యా! (197) మఱియును విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపం జాలక హతశేషంబైన సైన్యంబు పురంబు సొచ్చుటం జూచి, నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతి శక్తిం గొని గరుడుని వైచె; నతండును విరులదండ వ్రేటునఁ జలింపని మదోద్దండ వేదండంబునుంబోలె విలసిల్లె; నయ్యవసరంబున గజారూఢుండై కలహరంగంబున (198) సమదేభేంద్రము నెక్కి భూమిసుతుఁ డా చక్రాయుధున్ వైవ శూ¯ లము చేఁబట్టిన, నంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురో¯ త్తమ చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర¯ త్నమయోదగ్ర వినూత్నకుండల సమేతంబైన తన్మూర్ధమున్. (199) "ఇల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో! ¯ తల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం దన్నుం గృపం గావఁడే! ¯ చెల్లంబో! తలఁ ద్రుంచె"నంచు నిల నాక్షేపించు చందంబునన్¯ ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై. (200) "కంటిమి నరకుడు వడఁగా¯ మంటిమి నేఁ"డనుచు వెస నమర్త్యులు మునులున్¯ మింటం బువ్వులు గురియుచుఁ¯ బంటింపక పొగడి రోలిఁ బద్మదళాక్షున్. (201) అంత భూదేవి వాసుదేవుని డగ్గఱ నేతెంచి జాంబూనదరత్న మండితంబైన కుండలంబులును, వైజయంతియను వనమాలయును, వరుణదత్తంబయిన సితచ్ఛత్త్రంబును, నొక్క మహారత్నంబును సమర్పించి మ్రొక్కి భక్తి తాత్పర్యంబులతోడం గరకమలంబులు ముకుళించి, విబుధవందితుండును, విశ్వేశ్వరుండును నైన దేవదేవుని నిట్లని వినుతించె. (202) "అంభోజనాభున కంభోజనేత్రున¯ కంభోజమాలాసమన్వితునకు¯ నంభోజపదున కనంతశక్తికి వాసు¯ దేవునకును దేవదేవునకును¯ భక్తులు గోరినభంగి నే రూపైనఁ¯ బొందువానికి నాదిపురుషునకును¯ నఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ¯ డయినవానికిఁ, బరమాత్మునకును, (202.1) ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి, ¯ నీకు వందనంబు నే నొనర్తు¯ నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప¯ రాపరాత్మ మహిత! యమితచరిత! (203) దేవా! నీవు లోకంబుల సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్త్వగుణంబును, సంహరించుటకుఁ దమోగుణంబును ధరియింతువు; కాలమూర్తివి, ప్రధానపూరుషుండవు, పరుండవు, నీవ; నేనును, వారియు, ననిలుండు, వహ్నియు, నాకాశంబుఁ, భూతతన్మాత్రలును, నింద్రియంబులును, దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్త్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన నీ యంద సంభవింతుము. (204) దయ నిటు సూడుమా! నరకదైత్యుని బిడ్డఁడు వీఁడు; నీ దెసన్¯ భయముననున్నవాఁడు; గడుబాలుఁ; డనన్యశరణ్యుఁ; డార్తుఁ; డా¯ శ్రయరహితుండు; దండ్రి క్రియ శౌర్యము నేరఁడు; నీ పదాంబుజ¯ ద్వయిఁ బొడఁగాంచె భక్తపరతంత్ర! సువీక్షణ! దీనరక్షణా! " (205) అని యిట్లు భూదేవి భక్తితోడ హరికిం బ్రణమిల్లి వాక్కుసుమంబులం బూజించిన నర్చితుండై భక్తవత్సలుం డయిన పరమేశ్వరుండు నరకపుత్త్రుం డయిన భగదత్తున కభయంబిచ్చి, సర్వసంపదలొసంగి నరకాసురగృహంబు ప్రవేశించి యందు.

కన్యలం బదాఱువేలం దెచ్చుట

(206) రాజకులావతంసుఁడు పరాజిత కంసుఁడు సొచ్చి కాంచె ఘో¯ రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుఁ డు¯ త్తేజిత శక్తిఁ దొల్లిఁ జెఱదెచ్చినవారిఁ బదాఱువేల ధా¯ త్రీజన మాన్యలన్ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్. (207) కని రా రాజకుమారికల్‌ పరిమళత్కౌతూహలాక్రాంతలై¯ దనుజాధీశ చమూవిదారు నతమందారున్ శుభాకారు నూ¯ తనశృంగారు వికారదూరు సుగుణోదారున్ మృగీలోచనా¯ జన చేతోధనచోరు రత్నమకుటస్ఫారున్ మనోహారునిన్. (208) కని యతని సౌందర్య గాంభీర్య చాతుర్యాది గుణంబులకు మోహించి, తమకంబులు జనియింప, ధైర్యంబులు సాలించి, సిగ్గులు వర్జించి, పంచశరసంచలిత హృదయలై, దైవయోగంబునం బరాయత్తంబులైన చిత్తంబుల నమ్మత్తకాశినులు దత్తరంబున మనోజుండుత్తలపెట్ట నతండు దమకుఁ బ్రాణవల్లభుండని వరియించి. (209) "పాపపురక్కసుండు సెఱపట్టె నటంచుఁ దలంతుఁ మెప్పుడుం¯ బాపుఁడె? వాని ధర్మమునఁ బద్మదళాక్షునిఁ గంటి మమ్మ! ము¯ న్నీ పురుషోత్తముం గదియ నేమి వ్రతంబులు సేసినారమో? ¯ యా పరమేష్ఠి పుణ్యుఁడుగదమ్మ! హరిన్ మముఁ గూర్చె నిచ్చటన్ (210) ఉన్నతి నీతఁడు గౌఁగిట¯ మన్నింపఁగ నింక బ్రదుకు మానిని మనలో¯ మున్నేమి నోము నోఁచెనొ¯ సన్నుతమార్గముల విపిన జల దుర్గములన్. (211) విన్నారమె యీ చెలువముఁ? ¯ గన్నారమె యిట్టి శౌర్యగాంభీర్యంబుల్‌? ¯ మన్నార మింతకాలముఁ¯ గొన్నారమె యెన్నఁ డయినఁ గూరిమి చిక్కన్. (212) వనజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన¯ గదిసి వ్రేలుదు గదా కంఠమందు; ¯ బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన¯ మెఱసి యుండుదు గదా మేనునిండఁ; ¯ గన్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన¯ నొప్పు సూపుదుఁ గదా యురమునందు; ¯ బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన¯ మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి; (212.1) పద్మగంధి! నేను బర్హదామము నైనఁ¯ జిత్ర రుచుల నుందు శిరమునందు"¯ ననుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు¯ గములు గట్టి గరుడగమనుఁ జూచి. (213) భూనాథోత్తమ! కన్యకల్‌ వరుస "నంభోజాతనేత్రుండు న¯ న్నే నవ్వెం దగఁ జూచె డగ్గఱియె వర్ణించెన్ వివేకించె స¯ మ్మానించెం గరుణించెఁ బే రడిగె సన్మార్గంబుతోఁ బెండ్లి యౌ¯ నేనే చక్రికి దేవి" నంచుఁ దమలో నిర్ణీత లై రందఱున్. (214) ఇట్లు బహువిధంబులం దమతమ మన్ననలకు నువ్విళ్ళూరు కన్నియలం బదాఱువేల ధవళాంబరాభరణ మాల్యానులేపనంబు లొసంగి, యందలంబుల నిడి, వారలను నరకాసుర భాండాగారంబులం గల నానావిధంబు లయిన మహాధనంబులను, రథంబులను, దురంగంబులను, ధవళంబులై వేగవంతంబులై యైరావతకుల సంభవంబులైన చతుర్దంత దంతావళంబులను, ద్వారకానగరంబునకుం బనిచి; దేవేంద్రుని పురంబునకుం జని యదితిదేవి మందిరంబు సొచ్చి, యా పెద్దమ్మకు ముద్దు సూపి, మణికిరణ పటల పరిభావితభానుమండలంబులైన కుండలంబు లొసంగి, శచీసమేతుండైన మహేంద్రునిచేత సత్యభామతోడం బూజితుండై, పిదప సత్యభామ కోరిన నందనవనంబు సొచ్చి.

పారిజా తాపహరణంబు

(215) హరి కేలం బెకలించి తెచ్చి భుజగేంద్రారాతిపైఁ బెట్టె సుం¯ దరగంధానుగతభ్రమద్భ్రమరనాదవ్రాతముం బల్లవాం¯ కుర శాఖా ఫల పర్ణ పుష్ప కలికా గుచ్ఛాది కోపేతమున్¯ గిరిభిత్త్రాతముఁ బారిజాతముఁ ద్రిలోకీయాచకాఖ్యాతమున్. (216) ఇట్లు పారిజాతంబును హరించి యదువల్లభుండు వల్లభయుం దానును విహగవల్లభారూఢుండై చనుచున్న సమయంబున. (217) నరకాసురుని బాధ నలఁగి గోవిందుని¯ కడ కేగి తత్పాదకమలములకుఁ¯ దన కిరీటము సోఁక దండప్రణామము¯ ల్గావింప నా చక్రి కరుణ సేసి¯ చనుదెంచి భూసుతు సమయించి తనవారిఁ¯ దన్ను రక్షించుటఁ దలఁప మఱచి¯ యింద్రుండు బృందారకేంద్రత్వ మదమునఁ¯ "బద్మలోచన! పోకు పారిజాత (217.1) తరువు విడువు" మనుచుఁ దాఁకె నడ్డము వచ్చి¯ తఱిమి సురలు నట్లు దాఁకి రకట! ¯ యెఱుకవలదె నిర్జరేంద్రత కాల్పనే? ¯ సురల తామసమును జూడ నరిది. (218) ఇట్లు దనకు నొడ్డారించి యడ్డంబు వచ్చిన నిర్జరేంద్రాదుల నిర్జించి తన పురంబునకుం జని, నిరంతర సురభి కుసుమ మకరంద మాధురీ విశేషంబులకుఁ జొక్కిచిక్కక నాకలోకంబుననుండి వెంటనరుగుదెంచు తుమ్మెదలకు నెమ్మిదలంచుచున్న పారిజాతమ్ము నాశ్రితపారిజాతుం డయిన హరి మహాప్రేమాభిరామ యగు సత్య భామతోఁ గ్రీడించు మహోద్యానంబున సంస్థాపించి, నరకాసురుని యింటం దెచ్చిన రాజకన్యక లెందఱందఱకు నన్నినివాసంబులు గల్పించి గృహోపకరణంబులు సమర్పించి.

పదాఱువేల కన్యల పరిణయం

(219) అమితవిహారుఁ డీశ్వరుఁ డనంతుఁడు దా నొక నాఁడు మంచి ల¯ గ్నమునఁ బదాఱువేల భవనంబులలోనఁ బదాఱువేల రూ¯ పములఁ బదాఱువేల నృపబాలలఁ బ్రీతిఁ బదాఱువేల చం¯ దముల విభూతినొందుచు యథావిధితో వరియించె భూవరా! (220) దానములందు సమ్మద విధానములం దవలోకభాషణా¯ హ్వానములందు నొక్క క్రియ నా లలితాంగుల కన్ని మూర్తు లై¯ తా ననిశంబు గానఁబడి తక్కువ యెక్కువలేక యుత్తమ¯ జ్ఞాన గృహస్థధర్మమునఁ జక్రి రమించెఁ బ్రపూర్ణకాముఁడై. (221) తరుణులు బెక్కం డ్రయినను¯ బురుషుఁడు మనలేఁడు సవతి పోరాటమునన్, ¯ హరి యా పదాఱువేవురు¯ తరుణులతో సమత మనియె దక్షత్వమునన్. (222) ఎన్నే భంగుల యోగమార్గముల బ్రహ్మేంద్రాదు లీక్షించుచున్¯ మున్నే దేవునిఁ జూడఁగానక తుదిన్ మోహింతు; రా మేటి కే¯ విన్నాణంబుననో సతుల్‌ గృహిణులై విఖ్యాతి సేవించి ర¯ చ్ఛిన్నాలోకన హాస భాషణ రతిశ్లేషానురాగంబులన్. (223) ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు¯ నానీత వస్తువులందుకొనుచు¯ సౌవర్ణమణిమయాసనములు వెట్టుచుఁ¯ బదములు గడుగుచు భక్తితోడ¯ సంవాసితస్నానజలము లందించుచు¯ సద్గంధవస్త్రభూషణము లొసఁగి¯ యిష్ట పదార్థంబు లిడుచుఁ దాంబూ లాదు¯ లొసఁగుచు విసరుచు నోజ మెఱసి (223.1) శిరము దువ్వుచు శయ్యపైఁ జెలువు మిగుల ¯ నడుగు లొత్తుచు దాసీసహస్రయుక్త ¯ లయ్యుఁ గొలిచిరి దాసులై హరి నుదారుఁ ¯ దారకాధిప వదనలు దారు దగిలి. (224) నన్నే పాయఁడు; రాత్రులన్ దివములన్ నన్నే కృపం జెందెడిన్; ¯ నన్నే దొడ్డగఁ జూచు వల్లభలలో నాథుండు నా యింటనే ¯ యున్నా డంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా ¯ యన్నుల్‌ గాఢ పతివ్రతాత్వ పరిచర్యా భక్తియోగంబులన్. (225) ఆ రామలతో నెప్పుడుఁ ¯ బోరాములు సాల నెఱపి పురుషోత్తముఁడున్ ¯ గారామునఁ దిరిగెను సౌ ¯ ధారామ లతాసరోవిహారముల నృపా! (226) ఏ దేవుఁడు జగముల ను¯ త్పాదించును మనుచుఁ జెఱుచుఁ బ్రాభవమున మ¯ ర్యాదారక్షణమునకై ¯ యా దేవుం డట్లు మెఱసె యాదవులందున్. (227) అంత నొక్కనాఁడు రుక్మిణీదేవి లోఁగిట మహేంద్రనీల మరకతాది మణిస్తంభ వలభి విటంకపటల దేహళీకవాట విరాజమానంబును, శాతకుంభ కుడ్య గవాక్ష వేదికా సోపానంబును, విలంబమాన ముక్తాఫలదామ విచిత్ర కౌశేయవితానంబును, వివిధ మణిదీపికా విసర విభ్రాజమానంబును, మధుకరకులకలిత మల్లికాకుసుమ మాలికాభిరామంబును, జాలకరంధ్ర వినిర్గత కర్పూరాగరుధూప ధూమంబును, వాతాయన విప్రకీర్ణ శిశిరకర కిరణస్తోమంబును, బారిజాతప్రసవామోద పరిమిళితపవనసుందరంబు నయిన లోపలిమందిరంబున శరచ్చంద్రచంద్రికా ధవళపర్యంక మధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుండై యుండ, సఖీజనంబులుం దానును డగ్గఱి కొలిచి యుండి. (228) కుచకుంభములమీఁది కుంకుమతో రాయు¯ హారంబు లరుణంబు లగుచు మెఱయఁ; ¯ గరపల్లవము సాఁచి కదలింప నంగుళీ¯ యక కంకణప్రభ లావరింపఁ; ¯ గదలిన బహురత్న కలిత నూపురముల¯ గంభీర నినదంబు గడలుకొనఁగఁ; ¯ గాంచన మణికర్ణికా మయూఖంబులు¯ గండపాలికలపై గంతు లిడఁగఁ; (228.1) గురులు నర్తింపఁ బయ్యెద కొంగు దూఁగ; ¯ బోటిచే నున్న చామరఁ బుచ్చుకొనుచు ¯ జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి ¯ వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె. (229) అప్పుడు.