పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 1224 - 1331

కృష్ణుడు మథురకు చనుట

(1224) అంత మఱునాడు సూర్యోదయకాలంబునం దనతోడఁ బయనంబునకు గమకించి నడచు గోపికలను “మరలివత్తు” నని దూతికా ముఖంబున నివర్తించి, కృష్ణుండు శకటంబులందుఁ గానుకలును గోరసంబు నిడికొని నందాదులైన గోపకులు వెనుదగుల నక్రూరచోదితంబైన రథంబెక్కి మథురాభిముఖుండై చను సమయంబున. (1225) "అదె చనుచున్నవాఁడు ప్రియుఁ డల్లదె తేరదె వైజయంతి య¯ ల్లదె రథ ఘోటకాంఘ్రి రజమా దెస మార్గము చూడుఁ" డంచు లో¯ నొదవెడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్¯ గదలక నిల్చిచూచి రటు కన్నుల కబ్బినయంత దూరమున్. (1226) ఇట్లు నక్రూర రామ సహితుండై చని చని. (1227) అవలోకించెను గృష్ణుఁడు ¯ ప్రవిమలకల్లోలపవన భాసితజన్య¯ న్నవసన్నపాపసైన్యం¯ గవిజనమాన్యం గళిందకన్యన్ ధన్యన్. (1228) కని, తత్కాళింది యందుఁ బరిక్షుణ్ణ మణిగణ సముజ్జ్వలంబు లగు జలంబులు ద్రావి, తరుసమూహ సమీపంబున రామసహితుండై కృష్ణుండు రథంబు ప్రవేశించె; నంత నక్రూరుండు వారలకు మ్రొక్కి వీడ్కొని కాళిందీహ్రదంబు జొచ్చి విధిపూర్వకంబుగా వేదమంత్రంబులు జపియించుచు.

అక్రూరుని దివ్యదర్శనములు

(1229) స్నానము చేసిచేసి నది చల్లని నీటను రామకృష్ణులన్¯ మానుగఁ జూచి "వారు రథమధ్యముపై వసియించి యున్నవా¯ రీ నది నీటిలోపలికి నెప్పుడు వచ్చి?" రటంచు లేచి మే¯ ధానిధి చూచె వారిని రథస్థుల భక్తమనోరథస్థులన్. (1230) చూచి వెఱఁగుపడి. (1231) "కంటిన్ మున్ను రథంబుపై; జలములోఁ గంటిం దుదిం గ్రమ్మఱం¯ గంటిం దొంటి రథంబుమీఁద; నిదె యీ కల్యాణచారిత్రు లే¯ వెంటం దోఁచిరి రెండు దిక్కుల; మనోవిభ్రాంతియో? నీటిలో¯ నుం టాశ్చర్యము; చూతు" నంచు మఱియు న్నూహించి మగ్నాంగుఁడై. (1232) పోషిత బాంధవుండు యదుపుంగవుఁ డా జల మందుఁ గాంచె స¯ ద్భాషు సహస్రమస్తక విభాసిత భూషు నహీశు భూమిభృ¯ ద్వేషుఁ గృపాభిలాషుఁ బ్రతివీర చమూ విజిగీషు నిత్య సం¯ తోషు నరోషు నిర్దళితదోషు ననేక విశేషు శేషునిన్. (1233) మఱియు నీలాంబర సంయుతుండును సిద్ధోరగాది సన్నుతుండునునై యొప్పు న ప్పాపఱేనిం దప్పక కనుంగొని. (1234) ఆ భోగి భోగపర్యంక మధ్యంబున;¯ వలనొప్పు పచ్చని వలువవాని¯ మేఘంబుపై నున్న మెఱుఁగు చందంబున¯ నురమున శ్రీదేవి యొప్పువాని¯ ముసురు తేఁటులు విప్ప ముఖచతుష్కముగల;¯ తనయుఁ డాడెడి బొడ్డుదమ్మివానిఁ¯ గదలని బహుపదక్రమవిశేషంబుల¯ రవము చూపెడి నూపురములవాని (1234.1) జలజగర్భ రుద్ర సనక సనందన¯ సద్ద్విజామర ప్రశస్యమాన¯ చరితుఁడైనవాని సౌందర్యఖనియైన¯ వాని నొక్క పురుషవర్యుఁ గాంచె. (1235) మఱియుఁ జారు లక్షణలక్షిత నఖ పాద గుల్ఫ జాను జంఘోరు కటి నాభి మధ్యోదరుండును; సాదరుండును; శ్రీవత్స కౌస్తుభ వనమాలికా విరాజిత విశాలవక్షుండును; బుండరీకాక్షుండును; శంఖ చక్ర గదా పద్మ హస్తుండును; సత్వగుణ ప్రశస్తుండును; బ్రహ్మసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకరకుండల కిరీటాది విభూషణుండును; భక్తజనపోషణుండును; సుందర కపోల ఫాల నాసాధర వదన కర్ణుండును; నీలనీరద వర్ణుండును గంబుకంధరుండును; గరుణాగుణ బంధురుండును; ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును; శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతీలోర్జా విద్యాశక్తి మాయాశక్త్యాది సేవితుండునునై యొప్పు నప్పరమేశ్వరునకు మ్రొక్కి భక్తిసంభ్రమంబు లగ్గంబులుగ గద్గదకంఠుండై దిగ్గనం గరంబులు ముకుళించి యిట్లని వినుతించె.

శ్రీమానినీచోర దండకము

(1236) శ్రీమానినీమానచోరా! శుభాకార! వీరా! జగద్ధేతుహేతుప్రకారా! సమస్తంబు నస్తంగతంబై మహాలోలకల్లోల మాలాకులాభీల పాథోనిధిం గూలఁగా బాలకేళీగతిం దేలి నారాయణాఖ్యం బటుఖ్యాతిఁ శోభిల్లు నీ నాభికంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నాణి యై మన్న యా బమ్మ యుత్పన్నుఁ డయ్యెం గదా పావ కాకాశ వాతావనీ వార్యహంకార మాయామహామానసాదుల్ హృషీకాదులున్ లోకముల్ లోకబీజంబులున్ నిత్యసందోహమై నీ మహాదేహమం దుల్లసించున్; వసించున్; నశించున్; జడత్వంబు లేకాత్మ యై యొప్పు నీ యొప్పిదం బెల్ల నోచెల్ల; చెల్లన్ విచారింపఁ దారెంత; వారెంత వారైన మాయాదులా మాయతోఁ గూడి క్రీడించు లోకానుసంధాత యౌ ధాత నిర్ణేతయే? నీ కళారాశికిం గొంద ఱంభోజగర్భాదు లధ్యాత్మ లందున్న శేషాధిభూతంబు లందు న్ననేకాధిదైవంబు లందున్ సదా సాక్షివై యుందువంచుం దదంతర్గతజ్యోతి వీశుండ వంచుం ద్రయీపద్ధతిం గొంద ఱింద్రాదిదేవాభిదానంబులన్, నిక్క మొక్కండ వంచున్ మఱిం గొంద ఱారూఢకర్మంబులం ద్రెంచి సంసారముం ద్రుంచి సన్యస్తులై మించి విజ్ఞానచక్షుండ వంచున్, మఱిం బాంచరాత్రానుసారంబునం దన్మయత్వంబుతోఁ గొందఱీ వాత్మ వంచున్, మఱిం గొంద ఱా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వుబాటింతు వంచున్; మఱిన్ నీవు నారాయణాఖ్యుండ వంచున్; శివాఖ్యుండ వంచున్; మఱిం బెక్కుమార్గంబులన్ నిన్ను నగ్గింతు; రెగ్గేమి? యేఱుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ విశేషంబు లెల్లన్ విశేషంబులై డింది నీ యం దనూనంబు లీనంబులౌ; నేక రాకేందుబింబంబు కుంభాంతరంభంబులం బింబితంబైన వేఱున్నదే? యెన్ననేలా ఘటాంతర్గతాకాశముల్ దద్ఘటాంతంబులం దేకమౌ రేఖ లోకావధిన్ వీక నే పోకలం బోక; యేకాకివై యుండు; దీశా! కృశానుండు నెమ్మోము, సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబు లంభోనిధుల్ గుక్షి, శల్యంబు లద్రుల్, లతాసాలముల్ రోమముల్, గాలి ప్రాణంబు, బాహుల్ సురేంద్రుల్, ఘనంబుల్ కచంబుల్, నభోవీధి నాభిప్రదేశంబు, రేలుంబగళ్ళున్ నిమేషంబు, లంభోజగర్భుండు గుహ్యంబు, వర్షంబు వీర్యంబు, నాకంబు మూర్ధంబుగా నేకమై యున్న నీమేని దండం బయోజాత గర్భాండముల్ మండితోదుంబరానోకహానేక శాఖా ఫలాపూరి తానంత జంతు ప్రకాండంబు లీలం బ్రసిద్ధోదరాశిస్థ జంతుప్రకారంబుగా నిండి యుండున్; మహారూప! నీ రూపముల్ వెగ్గలం బుగ్గడింపన్; లయాంభోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్ వేధకున్ వేదరాశిం బ్రసాదింపవే; ద్రుంపవే కైటభశ్రీమధుం జక్రివై మొత్తవే; యెత్తవే మందరాగంబు రాగంబుతోఁ గూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరుం గొమ్ములన్ నిమ్ములం జిమ్ముచుం గ్రువ్వవే త్రెవ్వవే ఘోరవైరిన్ నృసింహుండవై దండివై, దండి వైరోచనిం జూచి యాచింపవే, పెంపవే మేను బ్రహ్మాండము న్నిండఁ, బాఱుండవై రాజకోటిన్ విపాటింపవే, రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్, శుద్ధ బుద్ధుండవై వైరిదా రాంతరంగంబు లన్నంతరంగంబులుంగాఁ గరంగింపవే పెంపు దీపింపవే కల్కిమూర్తిం బ్రవర్తించు నిన్నెన్న నేనెవ్వఁడన్; నన్ను మాయావిపన్నున్ విషణ్ణుం బ్రపన్నుం బ్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్పా! కృపాకల్ప! వందారుకల్పా! నమస్తే నమస్తే నమస్తే నమః. (1237) కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్¯ జలవాంఛారతి నెండమావులకు నాసల్ చేయు చందంబునం¯ దలఁతున్ సత్యములంచు; మూఢుఁడ వృధాతత్వజ్ఞుఁడన్నాకు నీ¯ విలసత్పాదయుగంబుఁ జూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ!" (1238) అని మఱియును వినుతింప, నక్రూరునికి యమునాజలంబుల లోనం దన మొదలి మేను చూపి, చాలించి, నటునికైవడిఁ దిరోహితుండైన, నక్రూరుండు నీరు వెడలి వెఱంగుపడుచు వచ్చి, రథారోహణంబు చేసిన హరి యిట్లనియె. (1239) “జలములు చేరువ నున్నవి¯ తలపోయఁగ నీవు పోయి తడ వయ్యె; నదీ¯ జలముల నభమున ధరణిం¯ గలుగని చోద్యములు నీకుఁ గానంబడెనే?" (1240) అనిన నతం డిట్లనియె. (1241) "నీలోన లేని చోద్యము¯ లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్¯ నేలన్ నింగిని దిక్కుల;¯ నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!" (1242) అని పలికి సాయంకాలంబునకు నక్రూరుండు మథురానగరంబు చేర రథంబు గడపె నంతట నటమున్న చని నందాదులు పురోపవనంబున విడిసి యుండ వారలం గూడుకొని కృష్ణుం డక్రూరునిం జూచి “నీవు రథంబు గొనుచు నగరంబునకుం జనుము మేము వెనుక వచ్చెద” మనిన నతం డిట్లనియె. (1243) "నా యింటికి విచ్చేయుము¯ నీ యంఘ్రి సరోజరేణునికరము సోకన్¯ నా యిల్లు పవిత్రం బగు ¯ శ్రీయుత! నీ భటునిఁ బెద్ద సేయం దగదే." (1244) అని మఱియుం బ్రార్థించిన హరి యిట్లనియె. (1245) "యదుకుల విద్వేషణుఁడై¯ మదమున వర్తించు కంసు మర్దించి భవ¯ త్సదనంబుఁ జూడ వచ్చెదఁ¯ బొద యీ స్యందనముఁ గొనుచుఁ బురమున కనఘా!" (1246) అని పలికిన నక్రూరుండు పురంబునకుం జని రామకృష్ణులు వచ్చిరని కంసున కెఱింగించి తన గృహంబునకుం జనియె; నంత నపరాహ్ణంబున బలభద్ర గోపాల సహితుండై కృష్ణుండు.

కృష్ణుడు మథురను గనుట

(1247) పరిఖల్ గోటలు కొమ్మలుం బడగలుం బ్రాసాదముల్ వీధులున్¯ హరులుం దేరులు వీరులున్ గజములున్ హర్మ్యంబులున్ వాద్యముల్¯ తరుణుల్ ధాన్యములున్ ధనంబులు మహోద్యానంబులున్ దీర్ఘికల్¯ గర మాశ్చర్యరుచిం దనర్చు మథురన్ గాంచెన్ విభుం డంతటన్. (1248) కని య ప్పురంబు ప్రవేశించి వచ్చు సమయంబున. (1249) "నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము; గోపకామినీ¯ బృందము నోముపంట; సిరివిందు దయాంబుధి యోగిబృందముల్¯ డెందము లందుఁ గోరెడు కడింది నిధానము చేరవచ్చె నో! ¯ సుందరులార! రండు చని చూతము కన్నుల కోర్కిదీరఁగన్. " (1250) అని మఱియు గోవింద సందర్శన కుతూహలంబునం బౌరసుందరులు పరస్పరాహూయమానలై భుంజానలై భోజన భాజనంబులు దలంగఁ ద్రోచియు, శయానలై లేచియు, నభ్యంజ్యమానలై జలంబులాడకయు, గురుజనశిక్ష్యమాణలై యోడకయు, గృహకార్య ప్రవర్తమానలై పరిభ్రమింపకయు, రమణరమమాణలై రమింపకయు, శిశుజన బిభ్రాణలై డించియు నలంకుర్వాణలై యన్యోన్య వస్త్రాభరణ మాల్యానులేపనంబులు వీడ్వడ ధరించియు నరిగి. (1251) వీటఁ గల చేడె లెల్లను¯ హాటకమణిఘటిత తుంగ హర్మ్యాగ్రములం¯ గూటువలు గొనుచుఁ జూచిరి¯ పాటించి విశాలవక్షుఁ బద్మదళాక్షున్. (1252) "వీఁడఁటే రక్కసి విగతజీవగఁ జన్నుఁ¯ బాలు ద్రావిన మేటిబాలకుండు; ¯ వీఁడఁటే నందుని వెలఁదికి జగమెల్ల¯ ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు; ¯ వీఁడఁటే మందలో వెన్నలు దొంగిలి¯ దర్పించి మెక్కిన దాఁపరీఁడు; ¯ వీఁడఁటే యెలయించి వ్రేతల మానంబు¯ చూఱలాడిన లోకసుందరుండు; (1252.1) వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు¯ వీనిఁ బొందని జన్మంబు విగత ఫలము¯ వీనిఁ బలుకని వచనంబు విహగ రుతము¯ వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు; (1253) చెలియా! గోపిక లీ కుమారతిలకుం జింతించుచుం బాడుచుం¯ గలయం బల్కుచు నంటుచున్ నగుచు నాకర్షించుచున్ హస్తగా¯ మలకక్రీడకుఁ దెచ్చి నిచ్చలును సమ్మానంబులం బొందఁగాఁ¯ దొలి జన్మంబుల నేమి నోఁచిరొ కదే దుర్గప్రదేశంబులన్?" (1254) అని మఱియుఁ బౌరకాంతలు¯ మునుకొని హరిరూపు నేత్రముల వెంటను లోఁ¯ గొని తాల్చిరి హృదయములను¯ జనితప్రమదమున విరులు సల్లుచు నధిపా! (1255) మఱియును. (1256) నానావిధ గంధములు ప్ర¯ సూనఫలాదులును హరితశుభలాజములుం¯ గానుక లిచ్చుచు విప్రులు¯ మానుగఁ బూజించి రా కుమారోత్తములన్.

రజకునివద్ద వస్త్రము ల్గొనుట

(1257) ఆ సమయంబున నగరద్వారంబున నుండి వచ్చు రాగకారుం డగు నొక్క రజకునిం గాంచి హరి యిట్లనియె. (1258) "విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి మేము; మాకు మా¯ మందలలోనఁ గట్టికొన మంచి పటంబులు లేవు; నీ ముడిన్¯ సుందరధౌత చేలములు శోభిలుచున్నవి; తెమ్ము నిన్ను మే¯ లందెడు; నిమ్ము రాజుదెస నల్లుర; మో! రజకాన్వయాగ్రణీ!" (1259) అనిన రోషించి వాఁ డిట్లనియె. (1260) "ఎట్టెట్రా? మనుజేంద్రు చేలములు మీ కీఁ బాడియే? మీరలుం¯ గట్టం బోలుదురే? పయో ఘృత దధి గ్రాసంబులన్ మత్తులై¯ యిట్టాడం జనెఁగాక గొల్లలకు మీ కెబ్బంగి నోరాడెడిన్; ¯ గట్టా! ప్రాణముఁ గోలుపోయెదు సుమీ కంసోద్ధతిన్ బాలకా! (1261) మా రాజుసొమ్ముఁ గైకొన¯ నే రాజులు వెఱతు; రింత యెల్లిదమే; నీ¯ కీ రాజరాజగృహమున¯ నీ రాజసమేల? గొల్ల! యేగుము తలఁగన్." (1262) అనిన విని రోషించి. (1263) ఘోర కరాగ్రతలంబున¯ ధీరుఁడు కృష్ణుండు శిరము దెగిపడఁ గొట్టెం¯ బౌరుల గుండెలు పగులఁగ¯ వీరోద్రేకిన్ మదావివేకిన్ జాకిన్. (1264) అంత భగ్నశిరుం డైన రజకుం జూచి వానివారలు వెఱచి పటంబులు డించి పఱచిన రామకృష్ణులు వలసిన వస్త్రంబులు ధరియించి కొన్ని గోపకుల కొసంగి చనుచుండ. (1265) అంతట నొక వాయకుఁ డా¯ క్రంతన్ వసుదేవసుతులఁ గని బహువర్ణా¯ త్యంతమృదు పటాభరణము¯ లెంతయు సంతసముతోడ నిచ్చెన్ మెచ్చన్. (1266) కారుణ్యంబున వానిఁ గైకొని యలంకారంబు గావించి శృం¯ గారోదంచిత దిగ్గజేంద్ర కలభాకారంబులం బొల్చి రా¯ శూరుల్; మాధవుఁ డంత వాయకుని శుశ్రూషన్ మహాప్రీతుఁడై¯ సారూప్యంబును లక్ష్మియు న్నొసఁగె నైశ్వర్యాది సంధాయియై.

సుదాముని మాలలు గైకొనుట

(1267) అంత నా రామకృష్ణులు సుదాముం డను మాలాకారు గృహంబునకుం జనిన; నతండు గని లేచి గ్రక్కున మ్రొక్కి చక్కన నర్ఘ్య పాద్యాదికంబు లాచరించి; సానుచరు లయిన వారలకుఁ దాంబూల కుసుమ గంధంబు లొసంగి యిట్లనియె. (1268) "పావన మయ్యె నా కులము; పండెఁ దపంబు; గృహంబు లక్ష్మికిన్¯ సేవిత మయ్యె; నిష్ఠములు సేకుఱె; విశ్వనిదానమూర్తులై¯ భూవలయంబుఁ గావ నిటు పుట్టిన మీరలు రాకఁ జేసి నే¯ నే విధ మాచరింతుఁ? బను లెయ్యెవి? బంట; నెఱుంగఁ జెప్పరే." (1269) అని పలికి. (1270) దామోదర రాముల కు¯ ద్దామ యశోహసిత తుహినధాములకు వధూ¯ కాములకుఁ దెచ్చి యిచ్చె సు¯ దాముఁడు ఘనసురభి కుసుమదామము లధిపా! (1271) వారును మాలికుఁ డిచ్చిన¯ భూరి కుసుమ దామములను భూషితులై నీ¯ కోరిన వరమిచ్చెద మని¯ కారుణ్యము సేయ నతఁడు గని యిట్లనియెన్. (1272) "నీ పాదకమల సేవయు¯ నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం¯ తాపార భూతదయయునుఁ¯ దాపసమందార! నాకు దయచేయఁ గదే!" (1273) అని వేఁడికొనిన నిచ్చి మఱియు మాధవుం డమ్మాలికునకు బలాయుః కాంతి కీర్తి సంపద లొసంగి వాని గృహంబు వెడలి రాజవీధిం జనిచని.

కుబ్జ ననుగ్రహించుట

(1274) ఆ నళినాక్షుఁడు గాంచెను¯ నానా లేపముల భాజనముఁ జేఁగొనుచుం¯ బూని చనుదెంచు దానిని¯ నానన రుచి నిచయ వినమితాబ్జం గుబ్జన్. (1275) కని యిట్లనియె. (1276) "ఎవ్వరిదానవు? లేపము¯ లెవ్వరికిం గోరికొనుచు నేగెదు? నీ పే¯ రెవ్వరు మా కి మ్మిన్నియు¯ నివ్వటిలెదు చక్కనగుచు నీరజనేత్రా!" (1277) అనిన న య్యబల యిట్లనియె. (1278) "చక్కనివాఁడ వౌదు; సరసంబుల నొంపకు; మెల్లవారికిం¯ జక్కఁదనంబు లెక్కడివి; చారుశరీర! త్రివక్ర యండ్రు; నే¯ నిక్కము కంసుదాసిని; వినిర్మల లేపన విద్యదాన; నన్¯ మిక్కిలి రాజుమెచ్చుఁ; దగ మీరు విలేపనముల్ ధరింపరే!" (1279) అని పలికి యా కుమారుల¯ తనువులు నగవులును వీక్షితమ్ములు మాటల్¯ తన చిత్తముఁ గరఁగించిన¯ ననులేపము లిచ్చె వారి కబల ప్రియముతోన్. (1280) ఇవ్విధంబునఁ గుబ్జ యిచ్చిన లేపంబు¯ లన్నియుఁ దాను దేహమున నలఁది¯ కొని ప్రసన్నత నొంది కుబ్జ మువ్వంకల¯ యొడలు చక్కఁగ నొత్తి యునుపఁ దలఁచి¯ తత్పదంబుల మీఁదఁ దన పదంబులు ద్రొక్కి¯ హస్తాంగుళద్వయ మబల గవుద ¯ క్రింద విప్పుగ నిడి కృష్ణుఁడు మీఁదికి¯ నెత్తఁగ వక్రత లెల్ల మాని (1280.1) చక్కనైన చిత్తజన్ముబాణము క్రియఁ¯ గొమరుమిగిలి పిఱుఁదుఁ గుచయుగంబు¯ సొంపుఁ జేయఁ దరుణి సుందరమూర్తి యై¯ కమలనయనుఁ జూచి కాంక్షతోడ. (1281) "వేంచేయుము నా యింటికిఁ¯ బంచశరాకార"! యనుచుఁ బైకొం గాక¯ ర్షించి హరిఁ దిగిచెఁ గామిని¯ పంచాశుగబాణజాల భగ్నహృదయయై. (1282) కామిని తిగిచినఁ గృష్ణుఁడు¯ రాముని వీక్షించి నగుచు "రాజానన! మ¯ త్కామితముఁ దీర్చి పిదపన్¯ నీ మందిరమునకు వత్తు నే డలుగకుమీ!" (1283) అని వీడుకొలిపి కృష్ణుండు విపణిమార్గంబునం జనిచని తాంబూల మాలికాగంధంబులును బహువిధంబు లయిన కానుకలు పౌరు లిచ్చినఁ బరిగ్రహించుచు ధనుశ్శాల కరిగి యందు.

విల్లు విరుచుట

(1284) సురరాజు వింటికైవడి¯ గురుతరమై భూరివీరగుప్తంబై దు¯ స్తరమైన విల్లు పొడగని¯ నరులు వల దనంగ బిట్టు నగి వికసితుఁడై. (1285) బంధుల్ మేలన వామహస్తమునఁ జాపం బెత్తి మౌర్వీలతా¯ సంధానం బొనరించి కొంచెపుఁదెగన్ శబ్దించుచున్ ధీరతా¯ సింధుం డా హరి దాని ఖండితముగాఁ జేసెన్ జనుల్ చూడగా¯ గంధేభంబు రసాలదండము నొగిన్ ఖండించు చందంబునన్. (1286) కోదండభగ్ననిర్గత¯ నాదము వీనులకు భీషణం బై యాశా¯ రోదోంతరములు నిండుచు¯ భేదించెన్ భోజవిభుని బింకము నధిపా! (1287) అప్పుడు. (1288) "అద్దిర! రాచవిల్ విఱిచె నర్భకుఁ డింతయు శంకలేక నేఁ¯ డుద్దవిడిన్ సహింపఁ దగ దుగ్రతఁ బట్టుద"మంచుఁ గ్రుద్దులై¯ గ్రద్దన లేచి తద్ధనువు కావలివా రరుదేర వారి న¯ య్యిద్దఱుఁ గూడిఁబట్టి మడియించిరి కార్ముకఖండ హస్తులై. (1289) ఇట్లు రామకృష్ణులు మథురాపురంబున విహరించి వెడలి విడిదులకుం జని; రంత.

సూర్యాస్తమయ వర్ణన

(1290) గగనారణ్య చరాంధకార గజముం గాలాహ్వయ వ్యాధుఁ డ¯ చ్చుగఁ బట్టన్ గమకించి మచ్చిడుటకై చూతాంకురశ్రేణిచే¯ నొగిఁ గల్పించిన కందుకం బనఁగ సూర్యుం డంత వీక్షింపఁగాఁ¯ దగె మందప్రభతోడఁ బశ్చిమ మహాధాత్రీ ధరేంద్రంబునన్. (1291) తరుణుఁడగు శీతకిరణుని¯ మరిగి వియల్లక్ష్మి తన్నుమాని ముదుకఁడున్¯ ఖరకరుఁడు ననుచు ద్రొబ్బిన¯ కరణిన్ రవి పశ్చిమాద్రికడఁ గ్రుంకె నృపా! (1292) కళలు గలుగుఁ గాక; కమల తోడగుగాక; ¯ శివుని మౌళిమీఁదఁ జేరుఁ గాక; ¯ యన్యు నొల్లఁ దపనుఁ డైన మత్పతి యని¯ సాధ్విభంగిఁ గమలజాతి మొగిడె. (1293) సుందర సాయంసంధ్యా¯ వందన విప్రార్ఘ్యతోయ వజ్రహతోద్య¯ న్మందేహాసుర రక్త¯ స్యందము క్రియఁ గెంపుసొం పెసఁగె నపరదిశన్. (1294) భూమి నిండి మింటఁ బూర్ణమై కర్కట ¯ మకర మీనరాశి మహితమైన¯ హరియశస్సుధాబ్ధి యందుల తుంపురు¯ లనఁగఁ జుక్క లొప్పె నాకసమున. (1295) ఎల్లదిశలు నిండిన శ్రీ¯ వల్లభుగుణమహిమ బ్రహ్మ వాసించుటకై¯ చల్లిన మృగమద మనఁగా¯ వెల్లివిరిసెఁ దమము గగనవీధుల నెల్లన్. (1296) ఆ చీఁకటి వెనుదగిలినఁ ¯ బ్రాచీదిశనుండి గంతు పరువున రవి భ¯ ర్మాచలము మలఁక త్రోవను¯ వే చనియెంగాక నిలిచి విఱుఁగక యున్నే. (1297) మీకును వైరి; యెప్పుడును మిక్కిలి మాకును వైరి; రాజు దో¯ షాకరుఁ; డింక వచ్చు జలజాతములార! మదీయ బాలురం¯ జేకొనుఁ డంచు బాలకులఁ జీఁకటి దాఁచిన భంగిఁ జిక్కి రా¯ రాక వసించెఁ దుమ్మెదలు రాత్రి సరోరుహకుట్మలంబులన్.

చంద్రోదయ వర్ణన

(1298) ప్రాచీదిశాంగనా ఫాలతలంబున¯ దీపించు సింధూరతిలక మనఁగ¯ దర్పించి విరహుల ధైర్యవల్లులు త్రెంప¯ దర్పకుం డెత్తిన దాత్ర మనఁగ¯ నలిగి కాలకిరాతుఁ డంధకారమృగంబు¯ ఖండింప మెఱయించు ఖడ్గ మనఁగ¯ గగనతమాలవృక్షము తూర్పుకొమ్మను¯ లలితమై మెఱయు పల్లవ మనంగఁ (1298.1) దొగలు సంతసిల్ల దొంగలు భీతిల్లఁ¯ గడలి మిన్నుముట్టి కడలుకొనఁగఁ¯ బొడిచె శీతకరుఁడు భూరిచకోరక¯ ప్రీతికరుఁడు జారభీతికరుఁడు. (1299) దర్పిత తారాధిప పరి¯ సర్పిత కిరణౌఘమిళిత సకలదిశంబై¯ యేర్పడి కమలభవాండము¯ కర్పూరపు క్రోవి భంగిఁ గనుపట్టె నృపా. (1300) ఆ రేయి గోపయుతులై¯ క్షీరాన్నముఁ గుడిచి రామకృష్ణులు మదిఁ గం¯ సారంభ మెఱిఁగి యిష్ట వి¯ హారంబుల నప్రమత్తులై యుండి రిటన్

కంసుడు దుశ్శకునము ల్గనుట

(1301) తన పురికి రామకృష్ణులు¯ చనుదెంచి నిజానుచరులఁ జంపుటయు మహా¯ ధనువుఁ గదిసి విఱుచుటయును¯ విని కంసుఁడు నిద్రలేక విహ్వలమతియై. (1302) కర్ణరంధ్రములు చేఁ గప్పిన లోపలి¯ ప్రాణ ఘోషము వినఁబడక డిందెఁ¯ దోయాదికములందుఁ దొంగిచూచుచు నుండ¯ తల గానరాదయ్యెఁ దనువుమీఁదఁ¯ గరశాఖ నాసికాగ్రంబుపై నిడి చూడ¯ గ్రహతారకలు రెంటఁ గానబడియె¯ వెలుఁగున నిలుచుండి వీక్షింపఁగా మేని¯ నీడ సరంధ్రమై నేలఁ దోఁచె (1302.1) నడుగుజాడ దృష్టమౌట లే దయ్యెను¯ దరువులెల్ల హేమతరువు లగుచు¯ మెఱయుచుండెఁ గాలమృత్యువు డగ్గఱ¯ బుద్ధి యెల్లఁ గలఁగె భోజపతికి. (1303) గరళముఁ దినుటయుఁ బ్రేతము¯ బరిరంభించుటయు నగ్నభావుఁ డవుటయున్¯ శిరమునఁ దైలము పడుటయు¯ ఖరపతి నెక్కుటయు నతఁడు కలలోఁ గనియెన్. (1304) మఱియు రక్త కుసుమమాలికాధరుండై యొక్కరుండును నెక్కడేనియుం జనుచున్నవాఁడ నని కలఁ గాంచి మరణహేతుక భీతిం జింతాక్రాంతుండై నిద్రఁజెందక వేగించుచున్న సమయంబున. (1305) అరుణ హరినఖర విదళిత¯ గురుతిమిరేభేంద్రకుంభకూట వినిర్ము¯ క్త రుధిరమౌక్తికముల క్రియ¯ సురపతిదిశఁ గెంపుతోడఁ జుక్కలు మెఱసెన్.

సూర్యోదయ వర్ణన

(1306) పౌలోమి తన బాలు పాన్పుపైఁ గనుపట్టఁ¯ బన్నిన పవడంపు బంతి యనఁగ¯ నాయురర్థముల వ్యయంబు లొత్తులి చాటు¯ కాలశాంఖికు చేతి ఘంట యనఁగ¯ ఘనజంతుజీవితకాలరాసుల విధి¯ గొల్వనెత్తిన హేమకుంభ మనఁగఁ¯ బశ్చిమదిక్కాంత పరఁగఁ గైసేయుచో¯ ముందట నిడుకొన్న ముకుర మనఁగఁ (1306.1) గోకతాపోపశమదివ్యఘుటిక యనఁగఁ¯ బద్మినీకాంత నోములఫల మనంగ¯ మూడుమూర్తుల సారంపు ముద్ద యనఁగ¯ మిహిరమండల ముదయాద్రిమీఁద నొప్పె. (1307) వచ్చెం జల్లని గాడ్పులు¯ విచ్చెం గమలములు; దమము విరిసి బిలంబుల్¯ చొచ్చెం; బద్మమరందము¯ మెచ్చెం దుమ్మెదలు గ్రోలి మిహిరుఁడు పొడమన్. (1308) సంకాశితోదయాచల¯ పంకజసఖ కిరణరాగ పరిపూర్ణంబై¯ పంకేరుహగర్భాండము¯ కుంకుమ సలిలంపుఁ గ్రోవి కొమరున నొప్పెన్. (1309) తదనంతరంబ.

మల్లరంగ వర్ణన

(1310) పాషాణ వల్మీక పంకాది రహితంబు; ¯ మృదులకాంచననిభ మృణ్మయంబు¯ గమనీయ కస్తూరికా జలసిక్తంబు; ¯ బద్ధచందనదారు పరివృతంబు¯ మహనీయ కుసుమదామధ్వజ తోరణ; ¯ మండితోన్నత మంచ మధ్యమంబు ¯ బ్రాహ్మణ క్షత్రాది పౌరకోలాహలం; ¯ బశ్రాంత తూర్యత్రయాంచితంబు (1310.1) నిర్మలంబు సమము నిష్కంటకంబునై¯ పుణ్యపురుషు మనముఁ బోలి కంస¯ సైన్య తుంగ మగుచు సంతుష్ట లోకాంత¯ రంగమైన మల్లరంగ మొప్పె. (1311) ఆ మల్లరంగ పరిసర ¯ భూమిస్థిత మంచమందు భోజేంద్రుఁడు మా¯ న్యామాత్యసంయుతుండై¯ భూమీశులు గొలువ నుండెఁ బొక్కుచు నధిపా. (1312) సకలాంభోనిధి మేఖలావహనముం జాలించి యేతెంచు నా¯ గ కులాగంబుల భంగి నొప్పుచుఁ దగం గైసేసి చాణూర ము¯ ష్టికకూటుల్ చలకోసలుల్ గురువులన్ సేవించుచున్ రంగధా¯ త్రికి నేతెంచిరి తూర్యఘోషముల నుద్రేకం బనేకంబుగన్. (1313) నందాదులైన గోపకు¯ లందఱు చని కానుకలు సమర్పించి నృపున్¯ సందర్శించి తదనుమతిఁ¯ జెంది మహామంచముల వసించిరి వరుసన్. (1314) అంత నా రామకృష్ణులు నలంకృతులై మల్లదుందుభి నినదంబు విని సందర్శన కుతూహలంబున. (1315) ఓడక రంగద్వారము¯ జాడం జని వారు కనిరి సమద కువలయా¯ పీడంబున్ భిన్నపరా¯ క్రీడంబుం బ్రమదకంటకిత చూడంబున్.

కరిపాలకునితో సంభాషణ

(1316) కని తత్కరిపాలకశ్రేష్ఠుండైన యంబష్ఠునికి మేఘనాదగంభీర భాషణంబుల రిపుభీషణుం డగు హరి యిట్లనియె. (1317) "ఓరీ! కుంజరపాల! మా దెసకు నీ యుద్యన్మదేభేంద్రముం¯ బ్రేరేఁపం బనిలేదు; త్రిప్పు మరలం బ్రేరేఁపినన్ నిన్ను గం¯ భీరోగ్రాశనితుల్య ముష్టిహతులన్ భేదించి నే డంతకుం¯ జేరంబుత్తు మహత్తరద్విపముతో సిద్ధంబు యుద్ధంబునన్." (1318) అని పలికి. (1319) మించిన కొప్పుఁ జక్కనిడి మేలనఁ బచ్చనిచీర కాసె బం¯ ధించి లలాటకుంతలతతిన్ మరలించుచు సంగరక్రియా¯ చుంచుతఁ బేర్చి బాలకుఁడు చూచు జనంబులు దన్ను బాపురే! ¯ యంచు నుతింప డగ్గఱియె హస్తజితాగము గంధనాగమున్.

కువలయాపీడముతో బోరుట

(1320) అంజక బాలకుఁ డనియునుఁ¯ గొంజక దయమాలి రాజకుంజర! యంతన్¯ గుంజరమును డీకొలిపెనుఁ¯ గుంజరపాలకుఁడు గోపకుంజరుమీఁదన్. (1321) మఱియు, న య్యనేకపం బనేకపపాలక ప్రేరితంబై, మహావాత సంఘాత సముద్ధూతంబగు విలయకాల కీలికేళిని బిట్టు మిట్టిపడి, మృత్యుదేవత యెత్తునం, గాలు పోలిక, శమను గమనిక నెదిరి మదసలిల పరిమళ లుబ్ధ పరిభ్రమదదభ్ర భ్రమర గాయక ఝంకృతు లహుంకృతి సొంపు సంపాదింపం, గులకుంభినీధర గుహాకుంభ గుంభనంబుగ ఘీంకరించి, రోషభీషణ శేషభోగిభోగ భయంకరంబగు కరంబున శౌరిం జీరి, చీరికిం గొనక, పట్టఁ నందుపట్టి యట్టిట్టు గెంటి, విధుంతుద వదన గహ్వరంబువలన విడివడి యుఱుకు తరణి కరణి దర్పించి, కుప్పించి, పాదమధ్యంబునకు నసాధ్యుండై దూఁటి, దాఁటి మాటుపడినం సింధురంబు గ్రోధబంధురంబై మహార్ణవమధ్య మంథాయమాన మంథరమహీధరంబు కైవడి జిఱజిఱం దిరిగి కానక భయానకంబై కాలి వెరవునం గని, పొంగి, చెంగటం బ్రళయదండిదండ ప్రశస్తంబగు హస్తంబు వంచి వంచించి చుట్టిపట్టి పడవేయం గమకించినం జలింపక తెంపున హరి కరి పిఱింది కుఱికి మహారాహు వాలవల్లి కాకర్షణోదీర్ణుం డగు సుపర్ణు తెఱంగున నెగిరి శుండాలంబు వాలంబు లీలం గేల నొడిసిపట్టి జళిపించి పంచవింశతి బాణాసన ప్రమాణ దూరంబున జిఱజిఱం ద్రిప్పి వైవ, న వ్వారణంబు దుర్నివారణంబై రణంబున కోహటింపక సవ్యాపసవ్య పరిభ్రమణంబుల నవక్రంబై కవిసిన నపసవ్యసవ్యక్రమణంబులఁ దప్పించి రొప్పి కుప్పించి యెదుర్కొనినఁ గర్కశుండై మేచకాచలతుంగ శృంగ నిభంబగు కుంభికుంభంబు చక్కటి వ్రక్కలై చెక్కులెగయ దురంత కల్పాంత జీమూత ప్రభూత నిర్ఘాత నిష్ఠురంబగు ముష్టి సారించి యూఁచి పొడిచినం దద్వికీర్ణపూర్ణ రక్తసిక్త మౌక్తికంబులు వసుంధరకు సంధ్యారాగ రక్త తారకాచ్ఛన్నం బగు మిన్ను చెన్నల వరింప నిలువరింపక మ్రొగ్గి మోఁకరిలి మ్రొగ్గక దిగ్గన న గ్గజంబు లేచి చూచి త్రోచి నడచి, సంహారసమయ సముద్ర సంఘాత సంభూత సముత్తుంగ భంగ సంఘటితం బగు కులాచలంబుక్రియఁ గ్రమ్మఱ న మ్మహాభుజుని భుజాదండంబువలన ఘట్టితంబై, కట్టలుక ముట్టి నెట్టి డీకొని ముమ్మరమ్ముగం గొమ్ములం జిమ్మిన న మ్మేటి చేసూటి మెఱసి హస్తాహస్తి సంగరంబునఁ గరంబొప్పి దప్పింబడ నొప్పించిన నకుంఠిత కాలకంఠ కఠోర భల్లభగ్నం బగు పురంబు పగిది జలధిం జటుల ఝంఝానిల వికలంబగు కలంబు కైవడి న మ్మదకలభంబు బలంబు దక్కి చిక్కి స్రుక్కిపడి, లోభికరంబునుంబోలె దానసలిలధారావిరహితంబై, విరహి తలంపునుం బోలె నిరంతర చిత్తజాతజనక నిగ్రహంబై, గ్రహణకాలంబును బోలెఁ బరాధీనఖరకరంబై, ఖరకరోదయంబునుం బోలె భిన్నపుష్కరంబై, పుష్కరవైరి విలసనంబునుం బోలె నభాసిత పద్మకంబై యున్న సమయంబున. (1322) కాలం ద్రొక్కి సలీలుఁడై నగవుతోఁ గంఠీరవేంద్రాకృతిం¯ గేలన్ భీషణ దంతముల్ పెఱికి సంక్షీణంబుగా మొత్తి గో¯ పాలగ్రామణి వీరమౌళిమణియై ప్రాణంబులం బాపె నా¯ శైలేంద్రాభముఁ బ్రాణలోభము నుఁదంచత్సారగంధేభమున్.

మల్లావనీ ప్రవేశము

(1323) మఱియు దంతిదంత తాడనంబుల దంతావళపాలకుల హరించి తత్ప్రదేశంబుఁ బాసి. (1324) కరిదంతంబులు మూఁపులందు మెఱయన్ ఘర్మాంబువుల్ మోములన్¯ నెరయన్ గోపకు లంతనంత మెలయన్ నిత్యాహవస్థేము లా¯ హరిరాముల్ చనుదెంచి కాంచిరి మహోగ్రాడంబరాపూరితా¯ మర మర్త్యాది జనాంతరంగము లసన్మల్లావనీరంగమున్. (1325) మహితరౌద్రంబున మల్లుర కశనియై¯ నరుల కద్భుతముగ నాథుఁ డగుచు¯ శృంగారమునఁ బురస్త్రీలకుఁ గాముఁడై¯ నిజమృత్యువై కంసునికి భయముగ¯ మూఢులు భీభత్సమునుఁ బొంద వికటుఁడై¯ తండ్రికి దయరాఁగఁ దనయు డగుచు¯ ఖలులకు విరసంబుగా దండియై గోప¯ కులకు హాస్యంబుగాఁ గులజుఁ డగుచు (1325.1) బాంధవులకుఁ బ్రేమ భాసిల్ల వేలుపై¯ శాంత మొనర యోగి జనుల కెల్లఁ¯ బరమతత్వ మగుచు భాసిల్లె బలునితో¯ మాధవుండు రంగమధ్య మందు. (1326) అప్పుడు. (1327) చచ్చిన కుంభీంద్రంబును¯ వచ్చిన బలమాధవులను వరుసం గని తా¯ నొచ్చిన చిత్తముతోడుతఁ¯ జెచ్చెరఁ గడు వెఱచె భోజసింహుం డధిపా. (1328) ధీరుల వస్త్ర మాల్య మణి దీప్త విభూషణధారులన్ నటా¯ కారుల సర్వలోక శుభకారుల మానవ మానినీ మనో¯ హారుల రంగభూతల విహారుల గోపకుమారులన్ మహా¯ వీరులఁ జూచి చూచి తనివిం దుదిముట్టక లోకు లందఱున్. (1329) సన్నుత రామకృష్ణముఖ చంద్రమయూఖ సుధారసంబులం¯ గన్నులఁ ద్రావు చందమునఁ గాంచుచు జిహ్వల నంటి చూచు లీ¯ ల న్నుతి చేయుచుం గరములం బరిరంభము చేయు భంగి న¯ త్యున్నతిఁ జూపుచుం దగిలి యొండొరుతోడ రహస్యభాషలన్. (1330) "వసుదేవు నివాసంబున¯ వసుధన్ రక్షింప వీరు వైష్ణవతేజో¯ ల్లసనమునఁ బుట్టినారఁట¯ పసిబిడ్డ లనంగఁ జనదు పరదేవతలన్. (1331) చంపె రక్కసిఁ బట్టి; చక్రవాకునిఁగూల్చెఁ¯ బడ ద్రొబ్బె మద్దుల; బకునిఁ జీఱె; ¯ నఘదైత్యుఁ బొరిగొనె; నడరి వత్సకుఁ ద్రుంచె¯ గిరి యెత్తి దేవేంద్రుఁ గ్రిందుపఱిచెఁ; ¯ గాళియు మర్దించె; గహనానలముఁ ద్రావెఁ¯ గేశి నంతకుపురి క్రేవ కనిచె; ¯ మయుపుత్రుఁ బరిమర్చె; మఱియు దానవ భటు¯ ల హరించి గోపకులంబుఁగాచె; (1331.1) గోపకాంతల మనముల కోర్కిదీర్చె; ¯ నీ సరోరుహలోచనుండీ శుభాంగుఁ¯ డీ మహామహుఁడీ దిగ్గజేంద్ర మడఁచె; ¯ మనుజమాత్రుఁడె తలపోయ మాధవుండు."