పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 1203-1280

శ్రుతి గీతలు

(1203) అని చెప్పిన బాదరాయణికి నభిమన్యునందనుం డిట్లనియె “మునీంద్రా! ఘటపటాదివస్తు జాతంబు భంగి నిర్దేశింప నర్హంబు గాక, సత్త్వాదిగుణశూన్యం బైన బ్రహ్మంబునందు సత్త్వాది గుణగోచరంబులైన వేదంబులే క్రమంబునం బ్రవర్తించు, నట్టి చందంబు నాకెఱిఁగింపు” మనిన భూవరునకు మునివరుం డిట్లనియె; “సకల చేతనాచేతనాంతర్యామియైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు గావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియమనః ప్రాణశరీరంబు లను సృజియించి; చేతనవర్గంబునకు జ్ఞానప్రదుండగుం గావున సకల నిగమసమూహంబులును దత్స్వరూప గుణవైభవప్రతిపాదకంబులు గావున, ముఖ్యంబై ప్రవర్తించు; శ్రుతిస్తోత్రం బుపనిషత్తుల్యంబు; ననేక పూర్వఋషి పరంపరాయాతంబును నైన దీనిని శ్రద్ధాయుక్తుండై యెవ్వం డనుసంధించు, నతనికి మోక్షంబు సులభంబు; దీనికి నారాయణాఖ్యాతంబగునొక్క యుపాఖ్యానంబు గలదు; వినిపింతు వినుము; భగవత్ప్రియుండైన నారదుం డొక్కనాఁడు నారాయణాశ్రమంబునకుం జని ఋషిగణసమేతుం డైన నారాయణఋషిం గనుంగొని నీవు నన్నడిగినట్ల యమ్మహాత్ముని నడిగిన నతండు మున్నీయర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్యయోగీంద్రులు ప్రశ్న సలిపిన, వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీ కెఱింగించెద” నని చెప్పందొడంగె; “శయానుం డైన రాజశ్రేష్ఠునిఁ దత్పరాక్రమ దక్షతాది చిహ్నంబు లను నుతియించు వందిజనంబుల చందంబున జగదవసాన సమయంబున ననేక శక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబుసేయు విధంబు నారాయణుండు నారదునకుం జెప్పిన తెఱుంగు విను"మని యిట్లనియె. (1204) "జయజయ హరి! దేవ! సకలజంతువులకు¯ జ్ఞానప్రదుండవుగాన వారి ¯ వలన దోషంబులు గలిగిన సుగుణ సం¯ తానంబుగాఁ గొని జ్ఞానశక్తి ¯ ముఖ్యషడ్గుణ పరిపూర్ణతఁ జేసి మా¯ యాత్మవిశిష్టుండ వగుచుఁ గార్య ¯ కారణాత్మకుఁడవై కడఁగి చరించుచు¯ నున్న నీయందుఁ బయోరుహాక్ష! (1204.1) తివిరి యామ్నాయములు ప్రవర్తించుఁ గాన ¯ ప్రకట త్రిగుణాత్మకం బైన ప్రకృతితోడి ¯ యోగ మింతయు మాన్పవే! యోగిమాన ¯ సాంబుజాత మధువ్రత!" యని నుతించి. (1205) "అదియునుం గాక. (1206) పరమవిజ్ఞాన సంపన్ను లైనట్టి యో¯ గీంద్రులు మహితనిస్తంద్ర లీలఁ ¯ బరిదృశ్యమానమై భాసిల్లు నిమ్మహీ¯ పర్వత ముఖర ప్రపంచ మెల్ల ¯ బరఁగ బ్రహ్మస్వరూపము గాఁగఁ దెలియుదు¯ రెలమి నీవును జగద్విలయవేళ ¯ నవశిష్టుఁడవు గాన ననఘ! నీ యందు నీ¯ విపుల విశ్వోదయవిలయము లగు (1206.1) ఘట శరావాదు లగు మృద్వికారములు మృ ¯ దాత్మకంబైన యట్లు పద్మాయతాక్ష! ¯ తవిలి కారణరూపంబుఁ దాల్చి లీలఁ ¯ గడఁగు నీయందు బుద్ధి వాక్కర్మములను. (1207) అలవడఁ జేయుచు నుందురు ¯ బలకొని యిలఁ బెట్టఁబడిన పదవిన్యాసం ¯ బులు పతనకారణముగా ¯ నలవున సేవించుచునుఁ గృతార్థులు నగుచున్. (1208) లీలం బ్రాకృతపూరుష ¯ కాలాదిక నిఖిలమగు జగంబుల కెల్లన్ ¯ మాలిన్య నివారక మగు ¯ నీ లలితకథాసుధాబ్ధినిం గ్రుంకి తగన్. (1209) భరిత నిదాఘ తప్తుఁ డగు పాంథుఁడు శీతలవారిఁ గ్రుంకి దు¯ ష్కర మగు తాపముం దొఱగు కైవడి సంసరణోగ్రతాపమున్ ¯ వెరవునఁ బాయుచుండుదురు నిన్ను భజించుమహాత్మకుల్‌ జరా¯ మరణ మనోగదంబులఁ గ్రమంబునఁ బాయుట సెప్ప నేటికిన్? (1210) అదియునుం గాక. (1211) అనయంబు దేహి నిత్యానిత్య సద్విల¯ క్షణమునఁ బంచకోశవ్యవస్థ ¯ నభివృద్ధిఁ బొరయుచు నందులోపల నున్న¯ ప్రాణాన్నబుద్ధి విజ్ఞానమయము ¯ లను చతుష్కోశంబు లవ్వల వెలుఁగొందు¯ నానందమయుఁ డీవు గాన దేవ! ¯ సురుచిర స్వప్రకాశుండవు నీ పరి¯ గ్రహము గల్గుటఁ జేసి కాదె ప్రకృతి (1211.1) మహ దహంకార పంచతన్మాత్ర గగన ¯ పవన తేజోంబు భూ భూతపంచకాది ¯ కలిత తత్త్వముల్‌ బ్రహ్మాండకార్య కరణ ¯ మందు నెపుడు సమర్థంబు లగుటఁ జూడ. (1212) కోరి శరీరులు భవదను ¯ సారంబున నిహపరైక సౌఖ్యంబులఁ బెం ¯ పారఁగ నందుచు నుందురు ¯ ధీరజనోత్తము లనంగ దివిజారిహరా! (1213) నిన్ను ననుసరింప నేరని కుజనులు ¯ పవనపూర్ణ చర్మభస్త్రి సమితి ¯ యోజఁ జేయుచుందు రుచ్ఛ్వసనంబులు ¯ బలసి యాత్మదేహభజను లగుచు. (1214) దేవ! కొందఱు సూక్ష్మదృక్కు లైనట్టి మ¯ హాత్మకు లుదరస్థుఁ డైన వహ్ని ¯ గా మదిఁ దలఁతురు కైకొని మఱికొంద¯ ఱారుణు లనుపేర నమరు ఋషులు ¯ లీల సుషుమ్ననాడీ మార్గగతుఁడవై¯ హృత్ప్రదేశమునఁ జరించుచున్న ¯ రుచి దహరాకాశ రూపిగా భావింతు¯ రట్టి హృత్పద్మంబునందు వెడలి (1214.1) వితతమూర్ధన్యనాడికాగతుల నోలి ¯ బ్రహ్మరంధ్రంబుఁ బ్రాపించి పరమపురుష! ¯ సుమహితానందమయ పరంజ్యోతిరూపి ¯ వైన నినుఁ బొంది మఱి పుట్ట రవని యందు. (1215) మఱియు వివిధ కాష్ఠాంతర్గతుం డయిన వాయుసఖుండు తద్గత దోషంబునం బొరయక నిత్యశుద్ధుఁడై తరతమ భావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబు లయిన విచిత్రశరీరంబుల యందు నంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్రయోనిగతం బైన హేయంబులం బొరయక సకలాత్మ సమంబై బ్రహ్మం బయిన నిన్ను నైహికాముష్మిక ఫలసంగమంబు లేక విగత రజోగుణంబులం దగిలి కొందఱు భజియించుచుండుదు; రదియునుం గాక, దేవా! భవదీయ సంకల్పాధీనంబు లయిన శరీరంబులం బ్రవేశించి యున్న జీవసమూహంబు నీకు శేషభూతం బని తెలిసి కొందఱు భవనివారకం బయిన శ్రీమత్త్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థు లగుదురు మఱియును. (1216) అనఘ! దుర్గమమైన యాత్మతత్త్వంబు ప్ర¯ వర్తించుకొఱకు దివ్యంబులైన ¯ యంచిత రామకృష్ణాద్యవతారముల్‌¯ భజియించియున్న నీ భవ్యచరిత ¯ మను సుధాంభోనిధి నవగాహనము సేసి¯ విశ్రాంతచిత్తులై వెలయుచుండి ¯ మోక్షంబు బుద్ధినపేక్షింపనొల్లరు¯ మఱియుఁగొందఱు భవచ్చరణపంక (1216.1) జములఁ దగిలి పుణ్యతము లైన హంసల ¯ వడువు నొంది భాగవతజనముల ¯ నొనరువారు ప్రకట యోగిజనప్రాప్య ¯ మైన ముక్తిఁ గోర రాత్మ లందు. (1217) కొందఱు నీ శరీరము లకుంఠితభక్తి భవద్వశంబులై ¯ చెందఁగ నీ పదాబ్జములు సేరి భజించుచుఁ దత్సుఖాత్ములై ¯ యుందురు కొందఱీ తనువు లోలి ధరించి భవత్పదాబ్జముల్‌ ¯ పొందుగఁ గొల్వలేక నిలఁ బుట్టుచుఁ జచ్చుచు నుందు రవ్యయా! (1218) యమ నియమాది యోగమహితాత్మకులైన మునీంద్రులున్ విరో¯ ధమునఁ దలంచు చైద్యవసుధావర ముఖ్యనృపుల్‌ ఫణీంద్ర భో¯ గము లన నొప్పు బాహువులు గల్గిన నిన్ను భజించు గోపికల్‌ ¯ క్రమమున నేమునున్ సరియ కామె భవత్కృప కంబుజోదరా! (1219) అరవిందాక్ష! భవత్స్వరూప మిలఁ బ్రత్యక్షంబునం గాన నె¯ వ్వరికిం బోలదు శాస్త్రగోచరుఁడవై వర్తింతు వీ సృష్టి ముం ¯ దర సద్రూపుఁడవైన నీ వలననే ధాత్రాద్యమర్త్యుల్‌ జనిం ¯ చిరి నిన్నంతకు మున్నెఱుంగఁ గలమే చింతింప నేమచ్యుతా! (1220) అట్టి నిన్నుఁ బరమాణుకారణవాదులైన కణ్వ గౌతమాదులును, బ్రకృతి కారణవాదులయిన సాంఖ్యులును, దేహాత్మవాదులయిన బౌద్ధులును, వివిధంబులైన కుతర్కంబులచేతం బరస్పరావ్యాహతంబులైన మతంబులు దమతమ కుతర్కవాదంబుల సమర్థించుచు నిన్నుం దెలియలేరు; మహాభాగ్యవంతులయిన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షం బైన నివి యన్నియు నసత్యంబు లని కానవచ్చు; వెండియుఁ గొందఱీ సచరాచర వస్తుజాతంబులకు నంతర్యామివై సర్వంబు నీవ యగుటం దెలియలేక నిత్యం బనియు, ననిత్యం బనియు విపరీతబుద్ధిం దెలియుదురు; గాని భవదీయ దివ్యతత్త్వంబు నిక్కంబుగఁ దెలియజాలరు; కొందఱు జగచ్ఛరీరుండవుగాన జగద్రూపకుండవైన నిన్నుం గటకమకుటకర్ణికాది వివిధ భూషణభేదంబులం గనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వికారానుగతుండ వయ్యును నిఖిల హేయప్రత్యనీక కల్యాణగుణాత్మకుండవై యుండుదు వని యాత్మ విదులయిన వారు దెలియుదు; రదియునుం గాక. (1221) వనజాతాక్ష! భవత్పదాబ్జయుగ సేవాసక్తు లైనట్టి య¯ జ్జనముల్‌ మృత్యుశిరంబుఁదన్ని ఘనసంసారాంబుధిన్ దాఁటి పా¯ వనులై లోకములుం బవిత్రములుగా వర్తించుచున్ నిత్య శో ¯ భనమై యొప్పెడి ముక్తిఁ బొందుదురు శుంభద్వైభవోపేతులై. (1222) మిము సద్భక్తి భజింపనొల్ల కిల దుర్మేధం బ్రవర్తించు నీ ¯ చ మతివ్రాతము నేర్పునం బసులఁ బాశశ్రేణి బంధించు చం ¯ దమునం బెక్కగు నామరూపములచేతన్ వారి బంధించి దు¯ ర్గమ సంసారపయోధిఁ ద్రోతువు దళత్కంజాతపత్త్రేక్షణా! (1223) దేవా! కర్మమూలంబు లయిన పాణి పాదంబులు లేనివాఁడ వయ్యును స్వతంత్రుఁడవు గావున బ్రహ్మాదులు భవత్పరతంత్రులై యుండుదురు; స్థిర చర రూపంబులు గల చేతనకోటికి నీవు సర్వవిధ నియంతవు; గావున నీ కృపావలోకనంబు గల వారికి మోక్షంబు కరస్థితంబై యుండు; భవత్కృపావలోకనంబు లేని దుష్టాత్ములు దుర్గతిం గూలుదు; రట్టి జీవులు దేవతిర్మఙ్మనుష్యస్థావ రాది శరీరంబులు సొచ్చి యణురూపులై యుందు; రందును నీ వంతరాత్మ వగుచు నుందువు; మఱియును. (1224) మదిఁదల పోయఁగ జల బు¯ ద్బుదములు ధరఁ బుట్టి పొలియు పోలిక గల యీ ¯ త్రిదశాది దేహములలో ¯ వదలక వర్తించు నాత్మవర్గము నోలిన్. (1225) ప్రళయవేళ నీవు భరియింతు వంతకుఁ ¯ గారణంబ వగుటఁ గమలనాభ! ¯ భక్తపారిజాత! భవభూరితిమిరది ¯ నేశ! దుష్టదైత్యనాశ! కృష్ణ! (1226) అనఘ! జితేంద్రియస్ఫురణు లయ్యును జంచలమైన మానసం¯ బను తురగంబు బోధమహితాత్మ వివేకపు నూలి త్రాట న¯ ల్లన గుదియంగఁ బట్టను దలంచుచు ముక్తి కుపాయలాభ మే ¯ యనువును లేమికిన్ వగల నందెడు నాత్మలువో తలంపఁగన్. (1227) గురు పదపంకజాతములు గొల్వని వారలువో మహాబ్ధి ని¯ స్తరణకుఁ గర్ణధారరహితంబగు నావను సంగ్రహించు బే ¯ హరి గతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందు రం¯ బురుహదళాక్ష! నీవు పరిపూర్ణుఁడవై తనరారఁగా నొగిన్. (1228) పుత్రదార గృహక్షేత్ర భూరివిషయ ¯ ఘన సుఖాసక్తుఁ డగుచు నే మనుజుఁ డేని ¯ నర్థిఁ జరియించు వాఁడు భవాబ్ధిలోనఁ ¯ జెంది యెన్నాళ్ళకును దరిఁ జేర లేఁడు. (1229) జగతిపై బహుతీర్థ సదనంబు లనఁ గల్గి¯ పుణ్యానువర్తన స్ఫురితు లగుచుఁ ¯ బాటించి నీ యందు బద్ధమత్సరములు¯ లేక భక్తామరానోకహంబ ¯ వగు భవత్పాదాబ్జయుగళంబు సేవించి¯ భవపాశముల నెల్లఁ బాఱఁదోలి ¯ సమమతులై యదృచ్ఛాలాభ తుష మేరు¯ సమముగాఁ గైకొని సాధు లగుచుఁ (1229.1) బాదతీర్థంబు గల మహాభాగవత జ ¯ నోత్తమోత్తము లైనట్టి యోగివరుల ¯ వార కెప్పుడు సేవించువాఁడు వొందుఁ ¯ బ్రవిమలానందమయ మోక్షపదము మఱియు. (1230) సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీజగత్తు సత్తు గావలయు; నది యెట్లనినం గనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబులయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు వలికిన విని యద్వైతవాది యిట్లను; నెయ్యది యుత్పన్నంబు గాదది సత్తును గా; దను వ్యతిరేక వ్యాప్తి నియమంబు నిత్యసత్యంబైన బ్రహ్మంబునందుఁ దర్కహతంబగుం గావునం బ్రపంచంబు మిథ్య యని నిరూపించిననా ప్రపంచంబు బ్రహ్మవిశేషణంబై కార్యకారణావస్థలు గలిగియున్న యంతమాత్రంబున మిథ్యగానేర; దా ప్రపంచంబునకుఁ గార్యకారణావస్థలు నిత్యంబులు గావున నవస్థాద్వయ యుక్తంబయిన ప్రపంచంబు నిత్యంబనిన వెండియు నద్వైతి యిట్లను; బహుగ్రంథ ప్రతిపాదితం బయిన జగన్మిథ్యాత్వంబు లేమి యెట్లనిన నదియునుం గర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకం బైన కుతర్క సమేతం బైన భారతి యంధపరంపరా వ్యవహారంబునం జేసి భ్రమియింపఁజేయుఁ; గారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబయిన సూక్ష్మరూపంబునం బ్రపంచంబు సత్తై యుండు; సత్యంబు బాధాయోగ్యంబు గావున నీకు శేషంబయి యుండుఁ గావున నీవు దేహగతుండైన దేహియందు నంతర్యామివయ్యుం గర్మఫలంబులం బొరయక కర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవై యుందు; వట్టి నిన్ను నజ్ఞులైన మానవులు నిజకంఠ లగ్నంబయిన కంఠికామణి నిత్యసన్నిహితంబై వెలుంగుచుండినను గానకవర్తించు తెఱంగునఁ దమహృదయపద్మమధ్యంబున ననంతతేజోవిరాజమానుండవై ప్రకాశించు నిన్నుం దెలియలేరు; సకల బ్రహ్మాండనాయకుండవైన నీయందు శ్రుతులు ముఖ్య వృత్తిం బ్రవర్తించు"నని శ్రుత్యధిదేవతలు నారాయణు నభినందించిన తెఱంగున సనందనుండు మహర్షుల కెఱింగించిన ప్రకారం బని నారాయణర్షి నారదునకుం జెప్పిన నమ్మహాత్ముండు మజ్జనకుండైన వేదవ్యాసమునీంద్రునకు నుపన్యసించె; నయ్యర్థంబు నతండు నాకుం జెప్పిన విధంబున నీకుం జెప్పితి; నీ యుపాఖ్యానంబు సకల వేదశాస్త్ర పురాణేతిహాససారం; బుపనిషత్తుల్యంబు; దీనిం బఠించువారును వినువారును విగతకల్మషులై యిహపర సౌఖ్యంబుల నొంది వర్తింతు;” రని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె.

విష్ణు సేవా ప్రాశస్త్యంబు

(1231) “మునినాథోత్తమ! దేవమానవులలో ముక్కంటి సేవించు వా¯ రనయంబున్ బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండ న¯ వ్వనజాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు స¯ న్మునివర్యుల్‌ గడుఁ బేద లౌటకు గతంబున్ నా కెఱింగింపవే.” (1232) నావుడు శుకయోగి నరనాథుఁ గనుఁగొని¯ విను మెఱింగింతుఁ దద్విధము దెలియ ¯ "ఘనశక్తిసహితుండు కాలకంధరుఁడు దా¯ వినుతగుణత్రయాన్వితుఁడు గాన ¯ రాగాదియుక్తమై రాజిల్లు సంపద¯ లాతనిఁ గొలుచు వారందు చుందు; ¯ రచ్యుతుఁ, బరము, ననంతు, గుణాతీతుఁ, ¯ బురుషోత్తముని, నాదిపురుషు, ననఘు, (1232.1) నర్థి భజియించువారు రాగాది రహితు ¯ లగుచు దీపింతు రెంతయు ననఘచరిత! ¯ ధర్మనందనుఁ డశ్వమేధంబు సేసి ¯ పిదప సాత్త్విక కథనముల్‌ ప్రీతితోడ. (1233) నారదసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం ¯ కేరుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం ¯ డారిన భక్తిమై నడిగి నట్ల యతండును మందహాస వి¯ స్ఫార కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్. (1234) "వసుమతీనాథ! యెవ్వనిమీఁద నా కను¯ గ్రహ బుద్ధి వొడము నా ఘనుని విత్త ¯ మంతయుఁ గ్రమమున నపహరించిన వాఁడు¯ ధనహీనుఁ డగుచు సంతాప మంద ¯ విడుతురు బంధు ల వ్విధమున నొందిలి¯ యై చేయునదిలేక యఖిలకార్య ¯ భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి¯ నెఱపుచు విజ్ఞాననిరతుఁ డగుచు (1234.1) బిదప వాఁ డవ్యయానందపదము నాత్మ ¯ నెఱిఁగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుఁ ¯ గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు ¯ వదలి భజియింతు రితరదేవతల నెపుడు. (1235) సేవింప వారు దమకుం ¯ గావించిన శోభనములు గని నిజములుగా ¯ భావించి వారి మఱతురు ¯ భావములఁ గృతఘ్నవృత్తిపని తమ పనిగన్. (1236) మెలఁగుచు నుందురు దీనికిఁ ¯ గలదొక యితిహాస మిపుడు గైకొని నీకుం ¯ దెలియఁగఁ జెప్పెద దానన ¯ యలవడు నీ వడుగు ప్రశ్న కగు నుత్తరమున్.

వృకాసురుండు మడియుట

(1237) శకుని యను దైత్యు తనయుఁడు ¯ వృకుఁ డనువాఁ డొకఁడు దుర్వివేకుఁడు సుజన¯ ప్రకరముల నలఁపఁ దెరువున ¯ నొకనాఁ డొదిగుండి దివ్యయోగిం గడఁకన్. (1238) కనుంగొని. (1239) కరములు ముకుళించి "మునీ ¯ శ్వర! నారద! లలితధీవిశారద! నన్నుం ¯ గరుణించి యాన తీ శుభ ¯ కరు లగు హరి హర హిరణ్యగర్భులలోనన్ (1240) కడఁగి కొలువ శీఘ్రకాలంబులోనన ¯ యిష్టమైన వరము లిచ్చునట్టి ¯ దైవ మెవ్వఁ" డనిన దానవుఁ గనుఁగొని ¯ మునివరుండు పలికె ముదముతోడ. (1241) “వినుము; దుర్గుణసుగుణంబులలో నొక్కటి యెచ్చటం గలుగు నచ్చట నాక్షణంబ కోపప్రసాదఫలంబులు సూపువాఁ డమ్మువ్వుర యందు ఫాలలోచనుఁ డివ్విధంబుఁ దెలిసినవారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి యసమానసామ్రాజ్య వైభవంబుల నొంది ప్రసిద్ధులై; రట్లుగాన నీవు నమ్మహాత్ముని సేవింపు; మతనివలన నభిమతఫలంబులు వేగంబ ప్రాప్తం బయ్యెడి” నని చెప్పిన నతం డా క్షణంబ. (1242) దీపించు కేదార తీర్థంబునకు నేగి¯ యతిసాహసాత్మకుం డగుచు నియతి ¯ లోకముల్‌ వెఱఁగంద నా కాలకంధరు¯ వరదుని నంబికావరునిఁ గూర్చి ¯ తన మేనికండ లుద్దండుఁడై ఖండించి¯ యగ్ని కాహుతులుగా నలర వేల్చి ¯ దర్పకారాతి ప్రత్యక్షంబుగాకున్న;¯ జడియక సప్తవాసరము నందుఁ (1242.1) బూని తత్తీర్థమునఁ గృతస్నానుఁ డగుచు ¯ వెడలి మృత్యువు కోఱనా వెలయునట్టి ¯ గండ్రగొడ్డంటఁ దన మస్తకంబు దునుము ¯ కొనఁగఁ బూనిన నయ్యగ్నికుండమునను. (1243) అరుదుగ వెలువడి రుద్రుఁడు ¯ గరుణ దలిర్పంగ వానికర మాత్మకరాం ¯ బురుహమునఁ బట్టి "తెగువకుఁ ¯ జొర వలవదు; మెచ్చు వచ్చె సుమహిత చరితా! (1244) నీమదిఁ బొడమిన కోరిక ¯ లేమైనను వేఁడు మిపుడ యిచ్చెద"ననినం ¯ దా మనమున సంతసపడి ¯ యా మనుజాశనుఁడు హరుపదాంబుజములకున్. (1245) వందనం బాచరించి యో "యిందుమకుట! ¯ ఫాలలోచన! వరద! మత్పాణితలము ¯ నేను నెవ్వని తలమీఁద నిడిన వాఁడు ¯ మస్తకము నూఱు వ్రయ్యలై మడియ నీవె! " (1246) అని వేఁడిన నమ్మాటలు ¯ విని మదనారాతి నవ్వి విబుధాహితు కో ¯ రిన వరముఁ దడయ కిచ్చిన ¯ దనుజుఁడు తద్వర పరీక్షఁ దాఁ జేయుటకున్. (1247) ఆ క్షణంబు వరదాన గర్వంబున నుద్వృత్తుండై కడంగి. (1248) ఆ హరుమస్తకమునఁ గడు ¯ సాహసమునఁ జేయి వెట్ట జడియక కదియ¯ "న్నోహో! తన మెచ్చులు దన ¯ కాహా! పై వచ్చె"ననుచు నభవుఁడు భీతిన్. (1249) దనుజుఁడు దన వెనువెంటం ¯ జనుదే ముల్లోకములను సంత్రాసముఁ గై ¯ కొని పాఱ, సురలు మనములఁ ¯ దనికిరి దానికిని బ్రతివిధానము లేమిన్. (1250) అట్లు చనిచని. (1251) నిరుపమానందమై నిఖిల లోకములకు¯ నవలయై యమృతపదాఖ్యఁ దనరి ¯ దినకర చంద్ర దీధితులకుఁ జొరరాక¯ సలలిత సహజ తేజమున వెలుఁగు ¯ సమధికంబగు శుద్ధసత్త్వ గరిష్ఠమై¯ కరమొప్ప యోగీంద్రగమ్య మగుచు ¯ హరిపదధ్యాన పరాయణులైన త¯ ద్దాసుల కలరు నివాస మగుచుఁ (1251.1) బ్రవిమలానంత తేజోవిరాజమాన ¯ దివ్యమణి హేమకలిత సందీప్త భవ్య ¯ సౌధమండపతోరణ స్తంభ విపుల ¯ గోపురాది భాసురము వైకుంఠపురము. (1252) కనుంగొని యమ్మహాస్థానంబు డాయంజనుటయు, నప్పుండరీ కాక్షుం డఖండవైభవంబునం గుండలీశ్వర భోగతల్పంబునం బరమానంద కందళితహృదయారవిందుం డై యిందిరానయన చకోరకంబుల నిజమందహాస సాంద్ర చంద్రికావితతిం దేల్చుచు, నార్తభక్తజన రక్షణంబు పనిగా మెలంగుచు, వివిధ వినోదంబులం దగిలి యుండియు, ఫాలలోచనుం డద్దనుజపాలునకుం దలంపక యిచ్చిన వరంబు దన తలమీఁదవచ్చినం గలంగి చనుదెంచుట తన దివ్యచిత్తంబున నెఱింగి, యక్కాలకంధరుని యవస్థ నివారింపం దలంచి యయ్యిందిరాదేవి తోడి వినోదంబు సాలించి యప్పుడు. (1253) తాపింఛరుచితోడఁ ద్రస్తరించెడు మేనుఁ, ¯ బసిఁడిముంజియుఁ, దగు పట్టుగొడుగు, ¯ ధవళాంశురుచి జన్నిదంబునుఁ, దిన్నని¯ దండంబుఁ, జేతఁ గమండలువునుఁ, ¯ బసుపుగోఁచియుఁ, జిన్ని పట్టెవర్ధనమును, ¯ రాజితంబైన మృగాజినంబుఁ, ¯ దూలాడు సిగయును, వ్రేలుమాఱట గోఁచి, ¯ వేలిమిబొట్టును, వ్రేళ్ళ దర్భ, (1253.1) దనర సందీప్త హవ్య వాహన సమాన ¯ కాంతిఁ జెలువొంది, యద్భుత క్రమ మెలర్పఁ ¯ జతురగతి నప్డు వటుక వేషంబు దాల్చి ¯ వచ్చి యా నీచ దానవవరునిఁ జేరి. (1254) కైతవంబున నతనికి నమస్కరించి, మృదుమధుర భాషణంబుల ననునయించుచు, నయ్యసురవరున కిట్లను; “నివ్విధంబున మార్గపరిశ్రాంతుండవై యింత దూరంబేల చనుదెంచితి? సకల సౌఖ్య కారణంబైన యీ శరీరంబు నిరర్థకంబు సేసి వృథాయాసంబున దుఃఖపఱుపం దగునే? యియ్యెడం గొంతతడవు విశ్రమింపు; మీ ప్రయాసంబునకుఁ గతంబెయ్యది? కపటహృదయుండవు గాక నీ యధ్యవసాయం బెఱింగింపందగునేని నెఱింగింపు” మని మృదు మధురంబుగాఁ బలికిన నమ్మహాత్ముని సుధారసతుల్యంబు లయిన వాక్యంబులు విని సంతసిల్లి, యప్పిశితాశనుండు దన పూనినకార్యం బతని కెఱింగించిన. (1255) హరి దరహాస మొప్పఁ బిశితాశనుఁ గన్గొని పల్కె "దానవే ¯ శ్వర! మును దక్షుశాపమునఁ జాలఁ బిశాచిప తౌట సూనృత¯ స్ఫురణము మాని సంతతము బొంకుచునుండు పురారిమాట నీ¯ వరయక వెంట నేఁగఁ దగ దాతని చేఁతలు మాకు వింతలే? (1256) నిజము పలికె నేని నెఱిఁ దన తలమీఁద ¯ నీ కరంబు మోపనీక తలఁగి ¯ వచ్చునోటు! నితనివలనఁ బ్రత్యయమునఁ ¯ దగుల నేమి గలదు దనుజవర్య! (1257) అశుచి యగుచు నతని నంటఁగఁ బని గాదు ¯ కాలుఁ జేయిఁ గడిగి కడఁక వార్చి ¯ యతనివెంట వేడ్క నరుగుదువే నీవు ¯ నవల నంటఁ దగును నసురనాథ! (1258) అతి దుశ్శంకలు మాని పొ"మ్మనిన దైత్యారాతి మాయా విమో¯ హితుఁడై విస్మృతి నొంది తామసముచే నేపారి వాఁ డాత్మ పా ¯ ణితలంబుం దన నెత్తి మోపికొని తా నేలన్ వెసం గూలె వి¯ శ్రుతదంభోళిహతిన్ వడింబడు మహా క్షోణీధరంబో యనన్. (1259) అట్లు దన తల నూఱువ్రయ్యలై నేలం గూలిన యసురం గని యప్పుడు. (1260) సుర లసురాంతకు మీఁదన్ ¯ వరమందారప్రసూన వర్షము లోలిం ¯ గురిసిరి తుములంబై దివి ¯ మొరసెన్ సురదుందుభిప్రముఖతూర్యంబుల్‌. (1261) పాడిరి గంధర్వోత్తము ¯ లాడిరి దివి నప్సరసలు నన్యోన్యములై ¯ కూడిరి గ్రహములు భయముల ¯ వీడిరి మునికోటు లంత విమలచరిత్రా! (1262) మురహరుఁ డెల నవ్వొలయఁగఁ ¯ బురుహరుఁ దగఁ జూచి పలికె "భూతేశ్వర! యీ ¯ నరభోజనుండు నీ కి¯ త్తఱి నెగ్గొనరింపఁ దలఁచి తానే పొలిసెన్. (1263) అది యట్టిద కాదె! యిజ్జగంబున నధికుండయిన వానికి నపకారంబు గావించిన మానవునకు శుభంబు గలుగునే? యదియునుంగాక జగద్గురుండవగు నీ కవజ్ఞ దలంచు కష్టాత్ముండు వొలియుటం జెప్పనేల? యిట్టి దుష్టచిత్తుల కిట్టి వరంబులిచ్చుట కర్జంబు గా"దని యప్పురాంతకు వీడ్కొలిపిన, నతండు మురాంతకు ననేక విధంబుల నభినందించి నిజ మందిరంబునకుం జనియె"నని చెప్పి యిట్లనియె. (1264) “మానవనాయక! యీ యా ¯ ఖ్యానముఁ జదివినను వినిన ఘనపుణ్యులు ని¯ త్యానంద సౌఖ్యములఁ బెం ¯ పూనుదు రటమీఁద ముక్తి నొందుదు రెలమిన్!” (1265) అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. (1266) "జననాయక! యింకఁ బురా ¯ తనవృత్తం బొకటి నీకుఁ దగ నెఱిఁగింతున్. ¯ వినుము తపోమహిమలఁ జెం ¯ దిన మునిజనములు సరస్వతీనది పొంతన్.

భృగుమహర్షి శోధనంబు

(1267) వితతక్రియ లొప్పఁగ స¯ త్క్రతువుల నొనరించు చచటఁ గైకొని లక్ష్మీ ¯ పతి భవ పితామహులలో ¯ నతులితముగ నెవ్వ రధికు లని తమలోనన్. (1268) ఇట్లు దలపోసి తన్మమహత్త్వం బంతయుం తెలిసి రమ్మని భృగు మహాముని నమ్మువ్వురు వేల్పులకడకుం బంపిన నత్తాపసోత్తముండు సనిచని ముందట. (1269) జలరుహసంజాత సభా ¯ స్థలమున కొగి నేఁగి యతని సత్త్వగుణంబుం ¯ దెలియుటకై నుతివందన ¯ ములు సేయక యున్న నజుఁడు ముసముస యనుచున్. (1270) మనమునఁ గలఁగుచు భృగుఁ దన ¯ తనుజాతుం డనుచు బుద్ధిఁ దలఁచినవాఁడై ¯ ఘనరోషస్ఫురితాగ్నిని ¯ ననయము శాంతోదకముల నల్లన నార్చెన్. (1271) మహితతపోధనుండు మునిమండనుఁ డయ్యెడఁ బాసి వెండియు¯ న్నహిపతిభూషుఁ గాన రజతాద్రికి నేగిన నగ్గిరీంద్రుపైఁ ¯ దుహినమయూఖశేఖరుఁడు దుర్గయుఁ దానును విశ్రమించుచున్¯ ద్రుహిణతనూభవుండు సనుదెంచుట కాత్మఁ బ్రమోదమందుచున్. (1272) కనుఁగొని భ్రాతృస్నేహం ¯ బునఁ గౌఁగిటఁ జేర్చు ననుచు ముక్కంటి రయం¯ బున నెదురేగిన ముని రు¯ ద్రుని యందలి సత్త్వగుణ మెఱుంగుటకొఱకై. (1273) అతనిం గైకొనక యూరకుండిన. (1274) ఆ నిటలాంబకుండు గమలాసన నందనుఁ జూచి భూరి కా ¯ లానల రోషవేగ భయదాకృతిఁ దాల్చి పటుస్ఫులింగ సం ¯ తానము లొల్క శూలమునఁ దాపసముఖ్యు నురంబు వ్రేయఁగాఁ¯ బూనినఁ బార్వతీరమణి బోరన నడ్డము వచ్చి చెచ్చెరన్; (1275) తన విభుపాదములకు వం ¯ దనముం గావించి సముచితప్రియముల న¯ య్యనలాక్షుని కోపము మా ¯ న్చిన నమ్మునినాథుఁ డచట నిలువక చనియెన్. (1276) పొలుపొందు వైకుంఠపురమున కర్థితోఁ¯ జని యందు సమధికైశ్వర్య మొప్పఁ ¯ గమలాంక పర్యంకగతుఁడై సుఖించు న¯ క్కౌస్తుభభూషు వక్షస్థ్సలంబుఁ ¯ దన పాదమున బిట్టు దన్నెఁ దన్నినఁ బాన్పు¯ డిగి వచ్చి మునిఁ జూచి నగధరుండు ¯ పదముల కెఱఁగి "యో! పరమతపోధన!¯ యీగతి నీ వచ్చు టెఱుఁగ లేక (1276.1) యున్న నా తప్పు మన్నించి నన్నుఁ గరుణఁ ¯ జూచి యీ దివ్యమణిమయస్ఫూర్తిఁ దనరు ¯ రుచిర సింహాసనమునఁ గూర్చుండు దివ్య ¯ తాపసోత్తమ! యభయప్రదాననిపుణ! (1277) అలఘుపవిత్ర! భవత్పద ¯ జలములు నను నస్మదీయ జఠరస్థ జగం ¯ బుల లోకపాలురను బొలు ¯ పలరఁగఁ బుణ్యులనుఁ జేయు ననఘచరిత్రా! (1278) మునీంద్రా! భవదీయ పాదాబ్జహతి మద్భుజాంతరంబునకు భూషణం బయ్యె; భవదాగమనంబు మాఁబోటివారికి శుభావహం బగుంగాదె; యేను ధన్యుండ నైతి"నని మృదుమధురాలాపంబుల ననునయించిన నమ్మునివరుండు లక్ష్మీనాథు సంభాషణంబులకుఁ జిత్తంబునం బరమానందంబు నొంది, యమ్ముకుందు ననంతకల్యాణగుణనిధి నభినందించి, యానందబాష్పధారాసిక్త కపోలుం డగుచుఁ దద్భక్తి పారవశ్యంబున నొండు పలుకనేరక యతనిచేత నామంత్రణంబువడసి మరలి సరస్వతీతీరంబున నున్న మునుల సన్నిధికిం జనుదెంచి వారలం గనుంగొని. (1279) మునినాయకులతోడఁ దన పోయి వచ్చిన¯ తెఱఁగును దనమది దృష్టమైన ¯ మూఁడుమూర్తుల విధంబును నెఱింగించిన¯ విని వారు మనముల విస్మయంబు ¯ నంది చిత్తంబున సందేహమునుఁ బాసి¯ చిన్మయాకారుండు, శ్రీసతీశుఁ, ¯ డనుపముఁ, డనవద్యుఁ, డఖిల కల్యాణగు¯ ణాకరుఁ, డాదిమధ్యాంతరహితుఁ, (1279.1) డై తనర్చిన పుండరీకాక్షుఁ డొకఁడ ¯ కాక గణుతింప దైవ మొక్కరుఁడు వేఱ ¯ కలఁడె యనుబుద్ధి విజ్ఞాన కలితు లగుచు ¯ హరిపదాబ్జాతయుగళంబు నర్థిఁ గొలిచి. (1280) అట్లు సేవించి యవ్యయానందంబయిన వైకుంఠధామంబు నొంది; రని చెప్పి వెండియు నిట్లనియె.