పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ ఉత్తర 1105-1202

సకలరాజుల శిక్షించుట

(1105) అట్టియెడ సకలరాజ లోకంబును గృష్ణుని విభవంబునకుం జూపోపక యసంఖ్యంబులగు మూఁకలు గట్టి యమ్మహాత్ముని మాహాత్మ్యంబు దెలియక దర్పాంధులై కడంగి (1106) భావభవప్రసూన శరబాధిత మానసులై సమస్త ధా¯ త్రీవరనందనుల్‌ బలుపుఁ దెంపునుఁ బెంపును సొంపు నేర్పడన్ ¯ దేవకిరీటరత్న రుచిదీపిత పాదసరోజుఁడైన రా ¯ జీవదళాక్షుఁ దాఁకిరి విశృంఖల వృత్తి నతిప్రయత్నులై. (1107) అంత. (1108) సరసిజలోచనుండు నిజశార్‌ఙ్గశరాసనముక్త హేమ పుం ¯ ఖరుచిరశాతసాయక నికాయములన్ రిపుకోటి నేసి సిం ¯ ధురరిపు విక్రమప్రకట దోర్బలుఁడై విలసిల్లి యొత్తె దు¯ స్తర చలితాన్యసైన్యమును సజ్జనమాన్యముఁ బాంచజన్యమున్. (1109) ఆ తఱి భూరిబాహుబలులైన విరోధి నరేశ్వరుల్‌ మృగ¯ వ్రాతము లొక్కపెట్ట మృగరాజకిశోరముపై నెదిర్చి న¯ ట్లాతురులై చతుర్విధ సమగ్ర బలంబులతోడఁ గూడి ని¯ ర్ధూత కళంకుఁడైన నవతోయజనేత్రునిఁ జుట్టు ముట్టినన్. (1110) అలిగి మురాంతకుండు కులిశాభశరంబుల నూత్నరత్నకుం ¯ డలములతో శిరంబులు, రణన్మణినూపురరాజితోఁ బదం ¯ బులుఁ, గటకాంగుళీయక విభూషణచాప శరాలితోడఁ జే ¯ తులు, నిలఁగూలఁగా విజయదోహలియై తునుమాడె వెండియున్ (1111) హతశేషులు సొక్కాకుల ¯ గతిఁ దూల నిశాతపవనకాండముల సము¯ ద్ధతి నేసి తోలి విజయో ¯ న్నతుఁడై నిజనగరి కేగె నగధరుఁ డంతన్. (1112) అట్లు మహిత మంగళాలంకృతంబును, నతిమనోహర విభవాభిరామంబు నగు ద్వారకానగరంబున కరుగుదెంచిన మజ్జనకుండును బ్రియంబునఁ దోడన చనుదెంచి. (1113) రణిత వినూత్న రత్న రుచిరస్ఫుట నూపుర, హార, కర్ణభూ¯ షణ, కటకాంగుళీయక, లసత్పరిధాన, కిరీట, తల్ప, వా ¯ రణ, రథ, వాజి, హేతినికరంబులనుం, బరిచారికాతతిం ¯ బ్రణుతగుణోత్తరుం డయిన పద్మదళాక్షున కిచ్చె నెమ్మితోన్. (1114) ఇట్లు మహనీయతేజోనిధియైన మాధవు దయాపరిలబ్ధనిఖిల వస్తువిస్తారుం డయ్యును, నిజాధికారశుద్ధికొఱకు మరలఁ గన్యారత్నంబును, వినూత్నరత్నవ్రాతంబును సమర్పించె; నని భూసుర విసరంబులు వినుతింప మా తండ్రియైన బృహత్సేనుండు నన్నును సమస్త వస్తువులను గృష్ణునకు సమర్పించి, క్రమంబున సకల యాదవులనుం బూజించి మరలి నిజపురంబునకుం జనియె” నని చెప్పినఁ గుంతియు గాంధారియుఁ గృష్ణయు, నఖిల నృపాలకాంతాజనంబులును, గోపికలుం దమతమ మనంబుల సర్వభూతాంతర్యామియు, లీలామానుష విగ్రహుండును నైన పుండరీకాక్ష చరణారవింద స్మరణానంద పరవశలై కృష్ణుం బ్రశంసించి; రంత.

వసుదేవుని గ్రతువు

(1115) బలవదరాతిమర్దనులఁ, బాండురనీలనిభప్రభాంగులం, ¯ గలిత నిజాననాంబుజ వికాస జితాంచిత పూర్ణచంద్ర మం ¯ డలులఁ, బరేశులన్, నరవిడంబనులం, గరుణాపయోధులన్, ¯ విలసదలంకరిష్ణుల, నవీనసహిష్ణుల, రామకృష్ణులన్. (1116) సందర్శించు తలంపుల నందఱుఁ దమ హృదయారవిందంబులఁ బ్రేమంబు సందడిగొన నప్పుడు. (1117) ధీరమతిన్ ద్విత, త్రితక, దేవల, సాత్యవతేయ, కణ్వులున్, ¯ నారద, గౌతమ, చ్యవన, నాకుజ, గార్గ్య, వసిష్ఠ, గాలవాం ¯ గీరస, కశ్య, పాసిత, సుకీర్తి, మృకండుజ, కుంభసంభవాం ¯ గీరులు, యాజ్ఞవల్క్య, మృగ, శృంగ, ముఖాఖిల తాపసోత్తముల్‌. (1118) చనుదెంచినం గృష్ణుండు వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి వందనంబు లాచరించి వివిధార్చనలు గావించి యిట్లనియె. (1119) "సన్మునీశ్వరులార! జన్మభాక్కులమైన¯ మాకు నిచ్చోట సమ్మతిని దేవ ¯ నికరదుష్ప్రాపులు నిరుపమయోగీంద్రు¯ లైన మీ దర్శనం బబ్బెఁ గాదె ¯ ధృతి మందభాగ్యు లింద్రియపరతంత్రులు¯ నైన మూఢాత్ముల కనఘులార! ¯ భవదీయ దర్శన, స్పర్శన, చింతన, ¯ పాదార్చనలు దుర్లభంబు లయ్యు (1119.1) నేఁడు మాకిట సులభమై నెగడెఁ గాదె! ¯ జగతిపైఁ దీర్థభూతులు సాధుమతులు ¯ మిమ్ము దర్శించుటయు చాలు నెమ్మితోడ ¯ వేఱ తీర్థంబు లవనిపై వెదక నేల? (1120) అదియునుం గాక, యుదకమయంబులైన తీర్థంబులును; మృచ్ఛిలామయంబు లైన దేవగణంబులును; దీర్థదేవతారూపంబులు గాకుండుట లే; దయిననవి చిరకాల సేవనార్చనలంగాని పావనంబు సేయవు; సత్పురుషులు దర్శనమాత్రంబునం బావనంబు సేయుదు" రని వెండియు. (1121) "ఆదిత్య, చంద్రాగ్ని, మేదినీ, తారాంబు¯ మారుతాకాశ, వాఙ్మనము లోలిఁ ¯ బరికింపఁ దత్తదుపాసనంబులఁ బవి¯ త్రములుసేయఁగ సమర్థములు గావు; ¯ సకలార్థగోచరజ్ఞానంబు గల మహా¯ త్మకులు దారు ముహూర్తమాత్ర సేవఁ ¯ జేసి పావనములు సేయుదు; రదియు న¯ ట్లుండె ధాతుత్రయ యుక్తమైన (1121.1) కాయమం దాత్మబుద్ధియుఁ, గామినీ కు ¯ మారులందు స్వకీయాభిమానములునుఁ, ¯ దివిరి జలమునఁ దీర్థబుద్ధియునుఁ జేయు ¯ నట్టి మూఢుండు పశుమార్గుఁ డనఁగఁ బరఁగు." (1122) అని యివ్విధంబునం గృష్ణుం డాడిన సాభిప్రాయంబు లగు వాక్యంబులు విని; య మ్మునీంద్రులు విభ్రాంతహృదయులై యూరకుండి, ముహూర్తమాత్రంబున క మ్మహాత్ము ననుగ్రహంబు వడసి, మందస్మితముఖులై, య ప్పుండురీకాక్షున కి ట్లనిరి “దేవా! నేమునుం దత్త్వవిదుత్తము లయిన బ్రహ్మరుద్రాదులును, భవదీయ మాయావిమోహితులమై యుందుము; నిగూఢం బయిన నీ యిచ్ఛ చేత మమ్ము ననుగ్రహించితివి; భవదీయ చరిత్రంబులు విచిత్రంబు; లి మ్మేదిని యొక్కటి యయ్యును బహురూపంబులఁ గానంబడు విధంబున నీవును మొదలఁ గారణరూపంబున నేకం బయ్యును ననేక రూపంబులు గైకొని, జగదుత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతంబునా నద్భుత కర్మంబులం దగిలి, లీలావతారంబులు గైకొని, దుష్టజన నిగ్రహంబును, శిష్టజన రక్షణంబును గావించు చుందు; వదియునుంగాక వర్ణాశ్రమధర్మంబు లంగీకరించి, పురుషరూపంబున వేదమార్గంబు విదితంబు సేసిన బ్రహ్మరూపివి; తపస్స్వాధ్యాయ నియమంబులచేత నీ హృదయంబు పరిశుద్ధంబు; గావున బ్రహ్మస్వరూపంబులైన వేదంబు లందు వ్యక్తావ్యక్త స్వరూపంబు లేర్పడఁగా నుందువు; కావున బ్రాహ్మణకులంబు నెల్ల బ్రహ్మకులాగ్రణివై రక్షించిన మహానుభావుండవు; మాయా జవనికాంతరితుండవైన నిన్నును నీ భూపాలవర్గంబును, నేమును దర్శింపం గంటిమి; మా జన్మ విద్యా తపో మహిమలు సఫలంబు లయ్యె; నీకు నమస్కరించెద” మని బహువిధంబులఁ గృష్ణు నభినందించి, య మ్మురాంతకుఁ జేత నామంత్రణంబులు వడసి తమతమ నివాసంబులకుం బోవందలంచు నవసరంబున. (1123) అ మ్మునీశ్వరులకు నానకదుందుభి¯ యతిభక్తి వందనం బాచరించి ¯ "తాపసోత్తములార! ధర్మతత్త్వజ్ఞులు¯ మన్నించి వినుఁడు నా విన్నపంబు ¯ సత్కర్మ వితతిచే సంచితకర్మ చ¯ యంబు వాపెడు నుపాయంబు నాకు ¯ ఘన దయామతిఁ జెప్పుఁ" డనిన న మ్మునివరుల్‌¯ భూవరుల్‌ విన వసుదేవుఁ జూచి (1123.1) యెలమిఁ బలికిరి "నిఖిల యజ్ఞేశుఁ డైన ¯ కమలలోచనుఁ గూర్చి యాగములు సేయు; ¯ కర్మమునఁ బాయు నెట్టి దుష్కర్మ మైన; ¯ నిదియె ధర్మంబు గాఁగ నీ మదిఁ దలంపు. (1124) అదియునుం గాక. (1125) దేవర్షి పితృ ఋణంబులు ¯ భూవర! మఖ వేదపాఠ పుత్రులచేతన్ ¯ వావిరి నీఁగని పురుషుఁడు ¯ పోవు నధోలోకమునకుఁ బుణ్యచ్యుతుఁడై. (1126) అట్లగుటం జేసి నీవును. (1127) వరతనయాధ్యయనంబులఁ ¯ దరియించితి ఋణయుగంబుఁ; దడయక ధరణీ ¯ వర! దేవ ఋణము సవనా ¯ చరణుఁడవై యీఁగు టొప్పు సమ్మతితోడన్" (1128) అనవుడు న వ్వసుదేవుఁడు ¯ మునివరులకు ననియె వినయమున "మీరలు సె¯ ప్పిన యట్లు మఖము సేసెద ¯ దినకరనిభులార! మీరు దీర్పఁగవలయున్!" (1129) అని యభ్యర్థించి య మ్మునీంద్రుల యాజకులంగా వరించి, య ప్పుణ్యతీర్థోపాంతంబున మహేంద్రామితవైభవంబున, నష్టాదశ భార్యాసమేతుండై దీక్షఁ గైకొని, యమ్మహాధ్వరంబు వేదోపదిష్ట విధిం బరిసమాప్తించి, ఋత్విఙ్నికాయంబుల బహుదక్షిణలం దనిపి, భార్యాసమేతుండై యవభృథస్నానం బాచరించి, వివిధ రత్నమణి మయభూషణ విచిత్రాంబర సురభి సుమానులేపనంబులు ధరించి, నిఖిల భూదేవ ముని బంధు రాజలోకంబుల నుచిత సత్కారంబులఁ బ్రీతులం గావించిన వారును గృష్ణానుమతి నాత్మనివాసంబులకుం జని; రందు. (1130) ఆ తఱి నుగ్రసేన వసుధాధిప, పంకజనాభ, ముష్టికా ¯ రాతులు దమ్ము నర్థి మధురప్రియభాషల నిల్వ వేఁడినం ¯ గౌతుక మాత్మ నివ్వటిలఁగా వసియించిరి గోపగోపికా ¯ వ్రాతముతోడ నచ్చట ధరావర! నందయశోద లిమ్ములన్. (1131) హరినయముల హరి ప్రియముల ¯ హరిమధురాలాపములను హరికథల మనో ¯ హరలీలఁ దగిలి నందుఁడు ¯ నిరుపమగతి నచట మూఁడు నెల లుండె నృపా! (1132) జలరుహలోచనాది యదుసత్తము లందఱు నన్నిభంగులం¯ గలిత విభూషణాంబర నికాయము లిచ్చి బహూకరించి వీ¯ డ్కొలిపిన నందముఖ్యులు ముకుందపదాబ్జ మరందపాన స¯ ల్లలిత నిజాత్మ షట్పదములన్ మరలించుచు నెట్టకేలకున్. (1133) చనిచని. (1134) మరలి మరలి "కృష్ణ! మాధవ! గోవింద! ¯ పద్మనాభ! భక్త పారిజాత! ¯ దేవదేవ!" యనుచుఁ దివిరి చూచుచు మధు ¯ రాభిముఖులు నగుచు నరిగి రంత. (1135) క్రమమున నచ్చటఁ బ్రావృ¯ ట్సమయం బగుటయును బంధుజన యాదవ వ¯ ర్గము లోలిఁ గొలువ సురగణ¯ నమితులు బలకృష్ణు లాత్మనగరంబునకున్. (1136) వచ్చి సుఖంబుండు నంత.

మృతులైన సహోదరులఁ దెచ్చుట

(1137) అవనీశ! యొక్కనాఁ డానకదుందుఖి¯ భార్య పద్మాక్షుండు బలుఁడుఁ దొల్లి ¯ శరధిలోఁ జొచ్చిన గురుతనూభవునిని¯ మరలంగఁ దెచ్చిన మహిమ లెల్ల ¯ జనములు దమలోన సన్నుతుల్‌ సేయంగ¯ విని తన సుతులు దుర్వృత్తుఁడైన ¯ కంసుచే నిహతులై కాలునిపురి నున్న¯ వారి నందఱఁ జూడఁ గోరి కృష్ణ (1137.1) బలులకడ కేగి కన్నుల బాష్పకణము ¯ లొలుక "నో రామ! రామ! నిత్యోన్నతాత్మ! ¯ పరమపావనమూర్తి! యో మురవిభేది! ¯ యిందిరానాథ! యోగీశ్వరేశ! కృష్ణ! (1138) ముర కంస చైద్య పౌండ్రక ¯ నరక జరాతనయ యవన నరనాయకులన్ ¯ దురితాత్ములఁ బొరిగొని భూ ¯ భర ముడిపిన యట్టి మేటిబలులు దలంపన్. (1139) జనన వృద్ధి విలయ సంగతి నిఖిలంబుఁ ¯ బొందఁ జేయు పరమపురుషులార! ¯ మీకు లీల లౌట మీ రని నమ్మిన ¯ దాన నేను వినుఁ డుదారులార!" (1140) అని యనేక విధంబుల వినుతించుచు నిట్లనియె; “మీరలు మహానుభావులరు; మీరు తొల్లి యనేకకాలంబు సనినక్రిందట మృతుండై, దండధరుమందిరంబున నున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులఁ బరిపూర్ణంబులై ప్రకాశింప; నక్కాలుని చెంతనుండి మగుడందెచ్చి గురుదక్షిణగా నొసంగితి; రివ్విధంబునం గంసునిచేత హతులైన మత్పుత్త్రులనందఱ మరలం దెచ్చి నా మనంబున నున్న దుఃఖంబు నివారింపవలయు” నని దేవకీదేవి ప్రార్థించినం దమతల్లి యాడిన మృదుమధురవాక్యంబు లత్యాదరంబున నాదరించి, యప్పుడు బలకృష్ణులు దమ యోగమాయా మహత్త్వంబున సుతలంబునకుం జని; రట్టి యెడ. (1141) కనియెన్ దానవుఁ, డింద్రసేనుఁడు దళత్కంజాక్షులన్, దక్షులన్, ¯ ఘనసారాంబుదవర్ణులన్, నిఖిలలోకైకప్రభాపూర్ణులం, ¯ దనరారన్ హలచక్రపాణులను, భక్తత్రాణులన్, నిత్యశో ¯ భనవర్ధిష్ణుల, రామకృష్ణుల, జయభ్రాజిష్ణులన్, జిష్ణులన్. (1142) కని హితకోటితో నెదురుగాఁ జనుదెంచి మనోనురాగ సం ¯ జనిత కుతూహలుం డగుచుఁ జాఁగిలి మ్రొక్కి సమగ్ర కాంచనా ¯ సనముల నుంచి తచ్చరణసారససేచన సర్వలోక పా ¯ వన సలిలంబు లౌదల ధ్రువంబుగఁ దాల్చి సుభక్తి యుక్తుఁ డై. (1143) సురభి కాలాగరు హరిచంద నై లాది¯ ధూపంబు లా విశ్వరూపకులకుఁ, ¯ గాంచనపాత్ర సంగతరత్న కర్పూర¯ దీపంబు లా జగద్దీపకులకుఁ, ¯ బాయసాపూపాన్న పక్వఫలాది నై¯ వేద్యంబు లా వేదవేద్యులకునుఁ, ¯ దనరు వినూత్నరత్నప్రభాభాసి తా¯ భరణంబు లా దైత్యహరణులకును, (1143.1) మిలమిలని మంచుతోఁ బొలుపలరు బహు వి ¯ ధాంబరంబులు నీలపీతాంబరులకు, ¯ సలలిత కుసుమమాలికా మలయజాను ¯ లేపనంబులు భూరినిర్లేపులకును. (1144) సమర్పించి యప్పుండరీకాక్షుని చరణారవిందంబు లొత్తుచు నా నందబాష్పపూరంబు తోరంబుగా రోమాంచ కంచుకిత శరీరుండగుచుం దన గరకమలంబులు ఫాలభాగంబునం గదియించి యిట్లని స్తుతియించె. (1145) ధీయుతుఁడై “నమో భగవతే! హరయే! పరమాత్మనే! ముకుం ¯ దాయ! సమస్తభక్తవరదాయ! నమః పురుషోత్తమాయ! కృ¯ ష్ణాయ! మునీంద్రవంద్యచరణాయ! సురారిహరాయ! సాంఖ్యయో¯ గాయ! వినీల భాస్వదలకాయ! రథాంగధరాయ వేధసే!" (1146) అని యభినందించి యిట్లనియె. (1147) "రాజస తామసాత్ములకు రాదుగదా నినుఁగాన నవ్యపం¯ కేజదళాయతాక్ష! మునిగేయ! పవిత్రచరిత్ర! విస్ఫుర¯ ద్రాజకళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న వి¯ భ్రాజితపాదపీఠ! భవబంధవిమోచన! పద్మలోచనా! (1148) మది నూహింపఁగ యోగివర్యులు భవన్మాయా లతాబద్ధులై ¯ యిదమిత్థమ్మనలేరు తామసులమై యేపారు మాబోఁటి దు¯ ర్మదు లేరీతి నెఱుంగఁ జాలుదురు సమ్యగ్ధ్యానధీయుక్తి? నీ ¯ పదముల్‌ సేరెడి త్రోవఁ జూపి భవకూపంబుం దరింపింపవే! (1149) వైరముచేతఁ జేదినృపవర్గముఁ, గామముచేత గోపికల్‌, ¯ మీఱినభక్తి నాశ్రితులు మిమ్ము నహర్నిశమున్ మనంబులం ¯ దారఁగనీక రూపగుణతత్పరులై మిముఁ బొందు కైవడిన్ ¯ భూరివివేక సత్త్వగుణముల్‌ గల దేవత లంద నేర్తురే! (1150) కాన భవత్పదపద్మ¯ ధ్యానంబునఁ గాని శాస్త్రతత్త్వంబులచేఁ ¯ గానరు శ్రుతిసంవేద్యం ¯ బైన భవత్పదముఁ జిన్మయాకార! హరీ! (1151) దేవా! యే నరుండైన నేమి శ్రద్ధాగరిష్ఠచిత్తుండై మిమ్ము సేవించు నట్టి మహాత్ముండు విధిచోదితంబయిన ప్రమాణంబువలన విముక్తుండై వర్తించు; నట్లుగావున యోగీశ్వరుండవైన నీ వీశితవ్యుల మైన మమ్ము నిష్పాపులం జేయు” మని నుతించి మఱియు నిట్లనియె. (1152) “కంటిగంటి భవాబ్ధి దాఁటఁగఁ గంటి ముక్తినిధానముం ¯ గంటి నీ కరుణావలోకముఁ గంటి బాపము వీడ ము¯ క్కంటి తామరచూలియుం బొడఁ గాననట్టి మహాత్మ! నా ¯ యింటికిం జనుదెంచి తీశ్వర! యేఁ గృతార్థతఁ బొందితిన్. (1153) దేవా! యేను భవద్దాసుండ! నేది పంచినం జేయుదు; నిచ్చటికి మీరలు విజయంబు చేసిన కార్యం బానతీయవలయు” నని కరంబులు మొగిచి, విన్నవించినం బుండరీకాక్షుం డతని వాక్యంబులకు సంతసిల్లి యిట్లనియె (1154) "బలిదైత్య! విను మున్ను ప్రథమయుగంబున¯ నా మరీచికి భార్యయైన వర్ష ¯ యను నింతివలన నందను లార్వు రుద్భవ¯ మైరి వా రొక్కనాఁ డబ్జభవుఁడు ¯ తనపుత్త్రిపై మోహమునఁ గూడి రతికేళి¯ యొనరింప వీరు నవ్వుటయుఁ గ్రోధ ¯ మంది యాసురయోని యందుఁ బుట్టుం డని¯ ఘనశాప మిచ్చె న వ్వనజజుండు. (1154.1) తన్నిమిత్తమునను వారు దగిలి హేమ ¯ కశిపునకుఁ బుట్టి రంత నా కౌకసులకు ¯ నొదవ వీరలఁ దెచ్చి య య్యోగమాయ ¯ యడరి దేవకిగర్భము నందుఁ జొనుప. (1155) దొరఁకొని కంసుఁడు దోడ్తోఁ ¯ బొరిగొనెఁ దత్పుత్త్రశోకమునఁ దన చిత్తం ¯ బెరియఁగ దేవకి వారల ¯ దరిశింపఁగఁ గోరి పనుపఁ దగ నసురేంద్రా! (1156) వచ్చితిమి వారిఁ గ్రమ్మఱఁ ¯ దెచ్చెద మని తల్లి కోర్కిఁ దీర్పఁగ నిపు డే ¯ మిచ్చటికిని, నీకడఁ బొర ¯ పొచ్చెము లేకున్నవారె పో వీ రనఘా! (1157) వీరలఁ దోకొని యిపుడే ¯ ధారుణికిన్నేగి జనని తాపము వాపన్ ¯ వీరలు నంతట శాపముఁ ¯ దీఱి మదీయప్రసాదధీయుతు లగుచున్. (1158) పొలుపుగ సుగతిం బొందఁగఁ ¯ గల" రని హరి యానతిచ్చి కరుణాన్వితుఁడై ¯ బలిచే ననుమతిఁ గొని వా ¯ రలఁ దోకొని వచ్చె నిద్ధరామండలికిన్. (1159) అట్లు వారలం దోడితెచ్చి తల్లి కిట్లనియె. (1160) "కనుఁగొనుము వీరె నీ నం ¯ దను" లని జనయిత్రికడ ముదంబున వారి¯ న్నునిచిన నద్దేవకియును ¯ ఘనపుత్త్రస్నేహ మోహకలితాత్మకయై. (1161) చన్నులు దిగ్గనఁ జేపఁగఁ¯ గన్నులనానందబాష్పకణములుదొరఁగం ¯ గ్రన్నన కౌఁగిట నిడి "ననుఁ ¯ గన్నన్నలు వచ్చి" రనుచుఁ గౌతుక మొప్పన్. (1162) అట్లు కౌఁగిటం జేర్చి నిజాంకపీఠంబున నునిచి, శిరంబులు మూర్కొని, చిబుకంబులు పుణుకుచుం బ్రేమాతిశయమున మేనం బులకలొలయం జన్నిచ్చిన, వారును వైష్ణవమాయామోహితులై స్తన్యపానంబు సేయుచు భగవంతు డయిన రథాంగపాణి యంగ సంగంబున విగతకల్మషులై విధిశాపసాగరంబు హరిదయాకటాక్షంబను నావచేతం దరించి నిజస్వరూపంబులు ధరించి, కృష్ణునకుఁ దలిదండ్రులకు వందనం బాచరించి గగనపథంబున నిజస్థానంబున కరిగి; రంత దేవకీదేవి తన మనంబున. (1163) చచ్చిన బాలురఁ గ్రమ్మఱఁ ¯ దెచ్చుట గడుఁ జిత్ర మనుచు దేవకి మదిలో ¯ నచ్చెరువడి యిది యంతయు ¯ నచ్చపు హరిమాయ గాక! యని తలఁచె నృపా! (1164) పరమాత్ముఁ డఖిల జగదీ ¯ శ్వరుఁడగు కృష్ణుండు సేయు సత్కృత్యంబుల్‌ ¯ పరికింప నెన్నఁ బెక్కులు ¯ ధరణీవర!" యనిన రాజు తా ముని కనియెన్.

సుభద్రా పరిణయంబు

(1165) “మునినాథ! పార్థుండు వనజనాభుని సహో¯ దరి సుభద్రను నే విధమునఁ బెండ్లి ¯ యయ్యెను నా విధం బంతయు నాకును¯ దెలియంగ నెఱిఁగింపు ధీవిశాల!” ¯ యనవుడు నా వ్యాసతనయుఁ డాతనిఁ జూచి¯ “వినవయ్య! నృప! దేవవిభుని సుతుఁడు ¯ మును తీర్థయాత్రాసముత్సుకుండై చని¯ రమణఁ బ్రభాసతీర్థమున నుండి (1165.1) యా తలోదరితోడి నెయ్యంబు కలిమిఁ ¯ జూడఁ గోరుచు రాముఁడు సుందరాంగిఁ ¯ గౌరవేంద్రున కీ సమకట్టె ననుచుఁ ¯ దనకు నెఱుఁగ రా నా పురందరసుతుండు. (1166) అట్లు సుభద్రా దర్శనోత్సాహంబు దన మనంబున సందడిగొనం, ద్రిదండివేషంబు ధరియించి, ద్వారకాపురంబునకుం జనుదెంచి, యప్పౌరజనంబులు భక్తిస్నేహంబుల ననిశంబుఁ బూజింపం దన మనోరథసిద్ధి యగునంతకుం గనిపెట్టుకొని, వానకాలంబు సనునంతకు నప్పట్టణంబున నుండు సమయంబున. (1167) రాముఁడు తత్కపటాకృతిఁ ¯ దా మదిఁ దెలియంగలేక దగ నొకనాఁ డా ¯ భూమీవర తాపసుఁ బో ¯ రామిం గని యాత్మమందిరమునకుఁ దెచ్చెన్. (1168) తెచ్చి భిక్షసేయ దేవేంద్రతనయుండు ¯ గుడుచుచుండి యచటఁ గోరి మెలఁగు ¯ నసమబాణు మోహనాస్త్రంబుకైవడి ¯ వీరమోహి నన విహారలీల. (1169) అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున. (1170) జలరుహపత్త్రనేత్రు ననుసంభవ చారువధూలలామ స¯ ల్లలితవిహారవిభ్రమవిలాసము లాత్మకు విందు సేయ న¯ బ్బలరిపునందనుండు గని భావజసాయకబాధ్యమాన వి¯ హ్వలహృదయాబ్జుఁడై నిలిపె నత్తరుణీమణియందుఁ జిత్తమున్. (1171) ఆ తరుణీశిరోమణియు నర్జును, నర్జునచారుకీర్తి వి¯ ఖ్యాతుని, నింద్రనందను, నకల్మషమానసుఁ, గామినీ మనో ¯ జాతునిఁ జూచి పుష్పశర సాయకజర్జరితాంతరంగయై ¯ భీతిలి యుండె సిగ్గు మురిపెంబును మోహముఁదేఱు చూపులన్. (1172) అట్లా నృపసత్తమ మత్తకాశినులొండొరుల చిత్తంబులు చిత్తజాయత్తంబులై కోర్కులు దత్తరింపం దాల్ములువీడ సిగ్గునం జిట్టుముట్టాడుచున్నయంత నొక్కనాఁడు దేవతామహోత్సవ నిమిత్తం బత్తలోదరి పురంబు వెలుపలికి నరుగుదెంచిన నర్జునుండు గృష్ణ దేవకీ వసుదేవుల యనుమతంబు వడసి తోడనం దానును చని యప్పుడు. (1173) సాంద్రశరచ్చంద్ర చంద్రికా స్ఫూర్తిచే¯ రాజిల్లు పూర్ణిమారజనివోలెఁ, ¯ బూర్ణేందు బింబావతీర్ణమై యిలమీఁద¯ భాసిల్లు హరిణ డింభంబుఁ బోలె, ¯ సులలిత మేఘమండలమును నెడఁబాసి¯ వసుధఁ గ్రుమ్మరు తటిద్వల్లి వోలె, ¯ మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు¯ వొందిన పుత్తడిబొమ్మ వోలె. (1173.1) లలిత విభ్రమ రుచి కళాలక్షణములఁ ¯ బొసఁగ రూపైన శృంగారరసముఁ బోలె, ¯ నర్థిఁ జరియించుచున్న పద్మాయతాక్షిఁ ¯ బ్రకటసద్గుణభద్ర సుభద్రఁ జూచి. (1174) అప్పుడు డాయం జని యరదంబుపై నిడుకొని పోవుచుండం గనుంగొని యదుబలంబులు మదంబున నంటం దాఁకిన, నప్పు డయ్యాఖండలనందనుండు ప్రచండగాండీవ కోదండ నిర్ముక్త కాండంబులం దూలించి, యఖండ బాహుదండ విజయప్రకాండుండై ఖాండవప్రస్థపురంబున కరిగె; నట బలభద్రుండవ్వార్త విని విలయ సమయ సమీరసఖునికైవడిం బటురోష భీషణాకారుండై క్రోధించినం గని కృష్ణుండాదిగాఁగల బంధుజనంబు లతని చరణంబులకుం బ్రణమిల్లి మృదుమధుర భాషణంబుల ననునయించి యొడంబడునట్లుగా నాడిన నతండును సంతుష్టుండయి మనంబునఁ గలంకదేఱి, యప్పుడు. (1175) కరులం దేరుల నుత్తమ ¯ హరులన్ మణి హేమభూషణాంబరభృత్యో ¯ త్కర దాసికాజనంబుల ¯ నరణంబుగ నిచ్చి పంపె ననుజకుఁ బ్రీతిన్. (1176) ఇట్లు కృష్ణున కభిమతంబుగా నర్జునసుభద్రల కరణంబిచ్చి పంపె"నని చెప్పి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియె.

శ్రుతదేవ జనకుల చరిత్రంబు

(1177) "నరనాథ! విను భువనప్రసిద్ధంబుగ¯ దీపించు నట్టి విదేహదేశ ¯ మందు భూకాంతకు నాననదర్పణం¯ బనఁ దనర్చిన మిథి లను పురమునఁ ¯ గలఁడు శ్రీహరిపాదకంజాత భక్తుండు, ¯ గళితరాగాది వికారుఁ, డమల ¯ చరితుఁ, డక్రోధుండు, శాంతుండు, నిగమార్థ¯ కోవిదుం, డగు శ్రుతదేవుఁ డనెడి (1177.1) భూసురోత్తముఁ డొకఁ డనిచ్ఛాసమాగ ¯ తంబు తుషమైన హేమ శైలంబు గాఁగఁ ¯ దలఁచి పరితోష మందుచుఁ దగ గృహస్థ ¯ ధర్మమున నుండె సముచితకర్ముఁ డగుచు. (1178) ఆ పురి నేలువాఁడు బహుళాశ్వుఁడు నా నుతి కెక్కినట్టి ధా¯ త్రీపతి యా ధరామరునిరీతిని నిష్కలుషాంతరంగుఁడై¯ యే పనులందు ధర్మగతి నేమఱఁ కర్థిఁ జరించుచుండె ల¯ క్ష్మీపతి వారిపైఁ గరుణఁ జేసి ప్రసన్నముఖాంబుజాతుఁడై. (1179) అట్లు కృష్ణుండు వారల జూచువేడ్క నిజ స్యందనారూఢుండై, నారద, వామదేవాత్రి, కృష్ణ, రామ, సితారుణ, దివిజగురు, కణ్వ, మైత్రేయ, చ్యవనులును, నేనును మొదలైన మును లనుగమింపం జనుచుఁ దత్తద్దేశ నివాసులగు నానర్తక, ధన్వ, కురుజాంగల, వంగ ,మత్స్య, పాంచాల, కుంతి, మధు, కేకయ, కోస లాది భూవరులు, వివిధ వస్తుప్రచయంబులు గానిక లిచ్చి సేవింప, గ్రహమధ్యగతుండై దీపించు సూర్యునిం బోలి, యప్పుండరీకాక్షుండు మందస్మిత సుందరవదనారవిందుం డగుచు వారలం గరుణార్ద్రదృష్టిం జూచి, యోగక్షేమంబులరసి, సాదరభాషణంబుల నాదరించుచుఁ, గతిపయ ప్రయాణంబులం జనిచని విదేహనగరంబు డాయంజనుటయు; నా బహుళాశ్వుండు నమ్మాధవు రాక విని మనంబున హర్షించుచు వివిధపదార్థంబులు గానికలుగాఁగొని, తానును శ్రుతదేవుండును నెదురుగాఁ జనుదెంచి; యప్పుడు. (1180) ఆ మునికోటికిన్ వినయ మారఁగ వందన మాచరించి, యా ¯ తామరసాభలోచనుఁ డు,దారచరిత్రుఁడు, పాపగోత్ర సు¯ త్రాముఁడు, భక్తలోకశుభదాయకుఁ డైన రమేశు, సద్గుణ¯ స్తోముని పాదపద్మములు సోఁకఁగ మ్రొక్కి వినమ్రులై తగన్. (1181) కరములు మోడ్చి "యో! పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ¯ శ్వరులును మద్గృహంబునకువచ్చి మముం గృపసేసి యిచ్చటం¯ గర మనురక్తిఁ బూజనలు గైకొనుఁ" డంచు నుతించి వేఁడ నా ¯ హరి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్. (1182) తిరముగ వారి యిష్టములుదీర్పఁ దలంచి మురాసురారి యొం¯ డొరుల కెఱుంగకుండ మునియూథముఁదానును నేఁగె వారి మం¯ దిరముల కేకకాలమున ధీరత నా ధరణీవరుండు వా ¯ రిరుహదళాయతాక్షు మునిబృందములం గనకాసనంబులన్. (1183) కూర్చుండ నియమించి, కొమరారు కాంచన¯ కలధౌత కలశోదకములచేతఁ ¯ బాదముల్‌ గడిగి, తత్పావనజలములు¯ దానును సతియు బాంధవజనంబుఁ ¯ గర మర్థి నిజమస్తకంబుల ధరియించి, ¯ వివిధార్చనములు సద్విధి నొనర్చి, ¯ మణిభూషణాంబర మాల్యానులేపన¯ రాజిత ధూప నీరాజనములు (1183.1) భక్తిఁ గావించి, పరిమృష్ట బహు విధాన్న ¯ పాయసాపూప పరిపక్వఫలము లోలి ¯ నారగింపఁగఁ జేసి, కర్పూరమిళిత ¯ లలిత తాంబూలములు నెయ్య మలర నొసఁగె. (1184) ఇట్లు సమర్పించి, యనంతరంబ యమ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును బొంది. (1185) హరిపదపద్మయుగ్మము నిజాంకతలంబునఁ జేర్చి యొత్తుచుం¯ "బురుషవరేణ్య! యీ నిఖిలభూతగణావలి యాత్మలందు సు¯ స్థిరమతిఁ గర్మసాక్షివి సుధీవర! నీ పదభక్తకోటితో ¯ నరయ నుమాధినాథ చతురాస్యులుఁ బోలరటందు వెప్పుడున్. (1186) అట్టి లోకవిదితం బయిన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయ పాదారవిందంబు లందు నొకానొకవేళ లేశమాత్రధ్యానంబుగల నా గృహంబున కకించనుండని చిత్తంబునం దలంపక భక్తవత్సలుండ వగుటంజేసి విజయం జేసితివి; భవత్పాదపంకేరుహ ధ్యానసేవారతిం దగిలిన మహాత్ములు త్వద్ధ్యానంబు వదలం జాలుదురే? నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనం గోరిక గలవారలకు నిన్నైన నిత్తువు గదా!” యని వెండియు నిట్లనియె. (1187) "కృష్ణ! పరమాత్మ! యదుకుల క్షీరవార్ధి ¯ పూర్ణచంద్రమ! దేవకీపుత్త్ర! సుజన ¯ వినుత! నారాయణాచ్యుత! వేదవేద్య! ¯ భక్తజనపోషపరితోష! పరమపురుష! (1188) శ్రీ పురుషోత్తమాఖ్య! యదుసింహకిశోరక! భక్తలోకర¯ క్షాపరతంత్ర! నీవు మునిసంఘముఁ గొన్నిదినంబు లుండవే ¯ నీ పదపద్మ రేణువులు నెమ్మి మదీయగృహంబు సోఁకినం ¯ దాపసవంద్య! యే నిపుడ ధన్యుఁడ నయ్యెదఁగాదె మాధవా!” (1189) అని యభ్యర్థించినం బ్రసన్నుండై యప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనకచక్రవర్తిం గరుణించి, యమ్మిథిలానగరంబునం బౌరజనంబులకు నున్నత శోభనంబులు గావించుచుం గొన్నిదినంబు లుండె; నంత. (1190) శ్రుతదేవుండును మోదియై మునిజనస్తోమంబుతో నిందిరా ¯ పతిఁ దోకొంచు నిజాలయంబునకు నొప్పన్నేగి, యచ్చోట స¯ మ్మతి దర్భాస్తరణంబులన్నునిచి, సమ్యగ్జ్ఞానపారీణుఁడై ¯ సతియుం దానుఁ బదాబ్జముల్‌ గడిగి చంచద్భక్తిఁ దత్తోయముల్‌. (1191) శిరములఁ దాల్చి, నవ్యతులసీదళదామ కుశప్రసూన వి¯ స్ఫుర దరవింద మాలికలఁ బూజ లొనర్చి, "గృహాంధకూప సం ¯ చరణుఁడ నైన నాకడకుఁ జక్రి దనంతనె వచ్చునట్టి సు¯ స్థిరమతి నే తపంబు మును సేసితినో?" యని సంతసించుచున్. (1192) మఱియుఁ దత్పాదతీర్థంబు మందిరమునఁ ¯ గలయఁ జిలికించి, సంప్రీతి గడలుకొనఁగఁ ¯ బత్త్ర ఫలపుష్పతోయముల్‌ భక్తి నొసగి, ¯ హరి మురాంతకమూర్తి నిజాత్మ నిలిపి. (1193) మానితంబుగ విశ్వనిదానమూర్తి ¯ యైన కృష్ణుండు దనయింట నారగించెఁ ¯ దన మనోరథసిద్ధియుఁ దనకు నబ్బె ¯ ననుచుఁ బైపుట్ట మల్లార్చి యాడుచుండె. (1194) తరుణియుఁ దానుఁ బుత్రులుఁ బదంపడి కృష్ణు భజించుచుండ, త¯ చ్చరణము లంకపీఠమునఁ జాఁచిన మెల్లన యొత్తుచున్ రమా¯ వరుఁ గని వల్కె "భక్తజనవత్సల! మామకభాగ్య మెట్టిదో ¯ హర చతురాస్యులున్నెఱుఁగ నట్టి నినుం గనుగొంటి నెమ్మితోన్. (1195) ముని యోగిమానసస్ఫుట ¯ వనజంబుల నెల్ల ప్రొద్దు వర్తించు భవ¯ ద్ఘనదివ్యమూర్తి నా లో ¯ చనగోచర మయ్యెఁ గాదె! సర్వాత్మ! హరీ! (1196) దేవా! నీ సచ్చరితంబులు గర్ణరసాయనంబులుగా నాకర్ణించుచు, నీకుం బూజలొనర్చుచు, నీచరణారవిందంబులకు వందనంబులు సేయుచు, నీ దివ్యనామ సంకీర్తనంబులు సేయుచుం, దమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మలబోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులం గానంబడుచుందువు; కర్మవిక్షిప్తచిత్తులైన వారి హృదయంబుల నుండియు, దూరగుండ వగుదు;” వని మఱియు నిట్లనియె. (1197) “నీకు మ్రొక్కెదఁ గృష్ణ! నిగమాంత సంవేద్య!¯ లోకరక్షక! భక్తలోకవరద! ¯ నీపాదసేవననిరతుని నన్ను నే¯ పనిఁ బంపె దానతి” మ్మనినఁ గృష్ణుఁ ¯ డెలనవ్వు మోమునఁ జెలువొంద నా విప్రు¯ కర మాత్మకరమునఁ గదియఁ జేర్చి ¯ పాటించి యతనితోఁ బలికెఁ “దపశ్శక్తి¯ వఱలిన యమ్మునివర్యు లెపుడుఁ (1197.1) దమ పదాంబుజరేణు వితానములను ¯ దవిలి లోకంబులను బవిత్రంబు సేయు ¯ వారు ననుఁ గూడి యెప్పుడు వలయు నెడల ¯ కరుగుదెంతురు నీ భాగ్య గరిమ నిటకు. (1198) చనుదెంచిరి; పుణ్యస్థలంబులును విప్రులును, దేవతలును, సంస్పర్శన దర్శనార్చనంబులం బ్రాణులను సమస్త కిల్బిషంబులం బాయంజేయుదు; రదియునుంగాక, బ్రాహ్మణుండు జననమాత్రంబున జీవకోటి యందు ఘనుండై యుండు, జపతపోధ్యానాధ్యయనాధ్యాత్మములం జతురుండై మత్కలాశ్రయుండయ్యెనేని నతం డుత్తముం డై వెలుంగు; నతనిం జెప్ప నేల?” యని వెండియు నిట్లనియె. (1199) “నా మది విప్రులపైఁ గల ¯ ప్రేమము నా తనువు నందుఁ బెట్టని కతనన్ ¯ భూమీసురు లర్హులు; నీ ¯ వీ మునులం బూజ సేయు మిద్ధచరిత్రా! (1200) ఇదియే నా కిష్టము ననుఁ ¯ బదివేలవిధంబు లొలయ భజియించుటగా ¯ మది కింపగు నటు గావున ¯ వదలని భక్తిన్ భజింపు వసుధామరులన్!” (1201) అని సర్వలోక విభుఁ డగు ¯ వనజోదరుఁ డానతిచ్చు వాక్యంబుల జా ¯ డన భూమీసురుఁ డమ్ముని ¯ జనులకు సద్భక్తిఁ బూజ సలిపెన్ వరుసన్. (1202) ఎనయఁగఁ గృష్ణుఁ డంత మిథిలేశ్వర భూసురులం గృపావలో ¯ కన మొలయన్ననూనసుభగస్థితిఁ బొందఁగఁ జేసి వారి వీ¯ డ్కొని రథమెక్కి దివ్యమునికోటియుఁ దానును వచ్చెఁ గ్రమ్మఱన్¯ జనవర! మోక్షదం బగు కుశస్థలికిం బ్రమదాంతరంగుఁడై!"