పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ - 530 - 652

బ్రహ్మ తర్కించుకొనుట

(530) “మందం గల్గిన వత్సబాలకులు నా మాయా గుహాసుప్తులై¯ యెందుం బోవరు; లేవ రిప్పుడును; వేఱే చేయ నా కన్యు లొం¯ డెందున్ లేరు; విధాతలుం బరులు; వీ రెవ్వార లెట్లైరొకో? ¯ యెం దేతెంచిరొ కృష్ణుతో మెలఁగువా? రేఁడయ్యెడిన్ నేఁటికిన్. (531) బ్రహ్మపంపునఁ గాని పుట్టదు ప్రాణిసంతతి యెప్పుడున్¯ బ్రహ్మ నొక్కఁడ గాని వేఱొక బ్రహ్మ లేఁడు సృజింపఁగా ¯ బ్రహ్మ నేను సృజింప నొండొక బాలవత్సకదంబ మే¯ బ్రహ్మమందు జనించె? నొక్కట బ్రహ్మమౌ నది చూడఁగాన్.” (532) అని యిట్లు సకలంబును సుకరంబుగ నెఱింగెడి నెఱవాది ముదుక యెఱుకగలప్రోడ వెఱంగుపడి గ్రద్దనఁ బెద్దప్రొద్దు తద్దయుం దలపోసి కర్జంబు మందల యెఱుంగక కొందలపడుచు నాందోళనంబున. (533) మోహము లేక జగంబుల¯ మోహింపఁగఁ జేయ నేర్చి మొనసిన విష్ణున్¯ మోహింపించెద ననియెడు¯ మోహమున విధాత తాన మోహితుఁ డయ్యెన్. (534) పగలు ఖద్యోతరుచి చెడుపగిది రాత్రి¯ మంచు చీఁకటి లీనమై మాయుమాడ్కి¯ విష్ణుపై నన్యమాయలు విశద మగునె? ¯ చెడి నిజేశుల గరిమంబుఁ జెఱుచుఁ గాక. (535) మఱియును. (536) "పుట్టితి; బుద్ధి యెఱింగితిఁ; ¯ బుట్టించితి జగము; సగము పోయెను బ్రాయం; ¯ బిట్టివి నూతన సృష్టులు ¯ పుట్టుట లే; దౌర! యిట్టి బూమెలు భూమిన్." (537) అని యిట్లు తలవాకిట వాణి గల పోఁడిమిచే వాఁడిమి కెక్కిన నలుమొగంబుల తక్కరిగొంటు పెనుదంట పలువెంటలైన తన మనంబున వితర్కించి, విచారించు నెడ, నతండు కనుగొనుచుండ నబ్బాలకులు మేఘశ్యాములును, హార కుండల కిరీట వనమాలికాభిరాములును, శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘటిత కాంచీగుణోద్దాములును, నాపాదమస్తక తులసీదళదాములును, విలస దంగుళీయకస్తోములును, శంఖ చక్ర గదా కమల హస్తులును, జతుర్భుజప్రశస్తులును పీతకౌశేయవాసులును, చంద్రికాధవళహాసులును, కరుణాకటాక్షవీక్షణ విలాసులును, రవికోటిభాసులును, ననంత సచ్చిదానందరూప మహితులును, యణిమాదిగుణోపేతులును, విజాతీయభేదరహితులును, శ్రీమన్నారాయణ ప్రతిమాన విగ్రహస్వరూపులునై తమకుఁ బరతంత్రులగుచు నృత్తగీతాది సేవావిశేషంబులకుం జొచ్చి మెలంగుచు మూర్తిమంతంబు లయిన బ్రహ్మాదిచరాచరంబులును, నణిమాదిసిద్ధులును, మాయాప్రముఖంబులయిన శక్తులును, మహదాది చతుర్వింశతి తత్వంబులును, గుణక్షోభకాలపరిణామ హేతుసంస్కారకామ కర్మగుణంబులును సేవింప వేదాంతవిదులకయిన నెఱుంగరాని తెఱంగున మెఱయుచుఁ గానబడిన వారలం గనుంగొని. (538) "బాలురఁ గంటి నాచెయిది బాసినవారిని మున్ను వారి నేఁ¯ బోలఁగఁ జూచునంతటన భూరినిరర్గళదుర్గమప్రభా¯ జాలముతోడఁ జూపులకుఁ జాలమిఁ దెచ్చుచు నున్నవార; లే¯ మూలమొ మార్గమెయ్యదియొ? మోసము వచ్చెఁగదే విధాతకున్." (539) అని సకలేంద్రియంబులకు వెక్కసంబైన స్రుక్కి. (540) ఏ పరమేశు తేజమున నీ సచరాచరమైన లోక ము¯ ద్ధీపిత మయ్యె నట్టి విభుతేజముఁ గన్నులఁ జక్కఁ జూడఁగా¯ నోపక పారవశ్యమును నొందుచు సంస్తిమితాఖిలేంద్రియుం¯ డై పరమేష్టి మైమఱచె నప్పుడు చిత్రపురూపుకైవడిన్. (541) ఇట్లు మాయాతీతుండును, వేదాంత విజ్ఞాన దుర్లభుండును, స్వప్రకాశానందుండునునైన తన బాహుళ్యంబుఁ జూచి నివ్వెఱ పడిన బ్రహ్మంగని యీశ్వరుండు. (542) బాలుండై చతురాననుండు తన యీ బ్రహ్మాభిమానంబునన్¯ లోలుండై మతిదప్పి నా మహిమ నాలోకింప నేతెంచెఁ దా¯ నాలోకింపఁగ నెంతవాఁ? డనుచు మాయాజాలమున్ విప్పి త¯ ల్లీలా రూపము లెల్ల డాఁచె నటఁ గేళీచాతురీధుర్యుఁడై. (543) అంతలోన నజీవుండు సజీవుండైన తెఱంగున నెనిమిది కన్నులు గల వేల్పుగమికాఁడు తేఱి తెప్పఱి కాలుఁ గేలుఁ గదలించి చెచ్చెరం గన్నులు విచ్చిచూడ సమర్థుండై ముందటఁ గని వెనుకఁ జూచి, దివి విలోకించి దిక్కులు వీక్షించి, యెల్లయెడలం గలయ దర్శించి తన పురోభాగంబున హరి సంచరించుటం జేసి జాతివైరంబు లేని నర పక్షి మృగాదులకు నాటపట్టయి సిరి గలిగి కామ క్రోధాది రహితులకు జీవనంబైన బృందావనంబుఁ బొడగాంచి; యందు. (544) తన కన్యములు లేక తనరారి ముమ్మూల¯ విభుడయ్యుఁ గ్రేపుల వెదకువాని¯ నఖిలజ్ఞుఁడై యొక్కఁడయ్యు నజ్ఞాకృతిఁ¯ జెలికాండ్రఁ బెక్కండ్రఁ జీరువాని¯ బహిరంతరాద్యంత భావశూన్యుండయ్యు¯ నంతంత నడుగు చొప్పరయువాని¯ గురుగభీరుండయ్యుఁ గురువులు వాఱుచు¯ నట్టిట్టు పాతరలాడువాని (544.1) జాతిరహితుఁ డయ్యుఁ జతుర గోపార్భక¯ భావ మెల్ల నచ్చుపడిన మేటి¯ చెలువువాని హస్త శీతాన్నకబళంబు¯ వానిఁ గాంచె నపుడు వాణిమగఁడు. (545) కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనుఱికి కనకదండ సుకుమారంబైన శరీరముతోడ నేలఁ జాగిలంబడి మణిగణ సుప్రకాశంబు లైన తన కిరీటశిఖరప్రదేశంబు లా కుమారుని పాదపద్మంబులు మోవ మ్రొక్కి తోరంబులగు నానందబాష్పజల పూరంబుల నతని యడుగులు గడిగి మఱియును. (546) అడుగులపైఁ బడు లేచున్¯ బడుఁ గ్రమ్మఱఁ లేచు, నిట్లు భక్తిన్ మును దాఁ¯ బొడగనిన పెంపుఁ దలఁచుచు¯ దుడుకని మహిమాబ్ధి నజుఁడు దుడు కడఁచె నృపా! (547) అంత నల్లనల్లన లేచి నిలుచుండి నయనారవిందంబులు దెఱచి, గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబులు వంచి కృతాంజలియై దిగ్గన డగ్గుత్తిక యిడుచు నేకచిత్తంబున జతుర్ముఖంబుల నిట్లని స్తుతియించె.

బ్రహ్మ పూర్ణిజేయుట

(548) “శంపాలతికతోడి జలదంబు కైవడి¯ మెఱుఁగు టొల్లియతోడి మేనివానిఁ¯ కమనీయ మృదులాన్నకబళ వేత్ర విషాణ¯ వేణుచిహ్నంబుల వెలయువాని¯ గుంజా వినిర్మిత కుండలంబులవాని¯ శిఖిపింఛవేష్టిత శిరమువానిఁ¯ వనపుష్పమాలికావ్రాత కంఠమువాని¯ నళినకోమల చరణములవానిఁ (548.1) గరుణ గడలుకొనిన కడగంటివాని గో¯ పాలబాలుభంగిఁ బరగువాని¯ నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని¯ నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష! (549) నను మన్నించి భవజ్జనంబులకు నానందంబు నిండించు నీ¯ తను రూపం బిదె నా మనంబున కచింత్యం బయ్యె; నీ యుల్లస¯ ద్ఘన విశ్వాకృతి నెవ్వఁ డోపు? నెఱుఁగన్ గైవల్యమై యొప్పు నా¯ త్మ నివేద్యంబగు నీదు వైభవము చందం బెట్టిదో? యీశ్వరా! (550) విజ్ఞాన విధము లెఱుఁగక¯ తద్జ్ఞులు నీ వార్త చెప్పఁ దను వాఙ్మనముల్¯ యజ్ఞేశ! నీకు నిచ్చిన¯ యజ్ఞులు నినుఁబట్టి గెలుతు రజితుఁడవైనన్. (551) శ్రేయములుఁ గురియు భక్తిని¯ జేయక కేవలము బోధసిద్ధికిఁ దపమున్¯ జేయుట విఫలము; పొల్లున¯ నాయము జేకుఱునె తలఁప నధికం బైనన్. (552) నిజముగ నిన్నెఱుఁగఁగ మును¯ నిజవాంఛలు నిన్నుఁ జేర్చి నీ కథ వినుచున్¯ నిజకర్మలబ్ధ భక్తిన్¯ సుజనులు నీ మొదలిటెంకిఁ జొచ్చి రధీశా! (553) విక్రియాశూన్యమై విషయత్వమును లేని¯ దగుచు నాత్మాకారమై తనర్చు¯ నంతఃకరణ మొక్క యధిక సాక్షాత్కార¯ విజ్ఞానమునఁ బట్టి వే ఱొరులకుఁ¯ నెఱుఁగంగ రానిదై యేపారి యుండుటఁ¯ జేసి నీ నిర్గుణ శ్రీవిభూతి¯ బహిరంగవీధులఁ బాఱక దిరములై¯ యమలంబు లగు నింద్రియములచేత (553.1) నెట్టకేలకైన నెఱుఁగంగ నగుగాని¯ గుణవిలాసి వగుచుఁ గొమరుమిగులు¯ నీ గుణవ్రజంబు నేర రా దెఱుఁగంగ¯ నొక్క మితము లేక యుంట నీశ! (554) తారా తుషార శీకర¯ భూరజములకైన లెక్క బుధు లిడుదురు; భూ¯ భారావతీర్ణకరుఁ డగు¯ నీ రమ్యగుణాలి నెన్న నేర రగణ్యా! (555) ఏ వేళం గృపఁ జూచు నెన్నఁడు హరిన్ వీక్షింతు నం చాఢ్యుఁడై¯ నీ వెంటంబడి తొంటి కర్మచయమున్ నిర్మూలముం జేయుచున్¯ నీ వాఁడై తను వాఙ్మనోగతుల నిన్ సేవించు విన్నాణి వో¯ కైవల్యాధిపలక్ష్మి నుద్దవడిఁ దాఁ గైకొన్నవాఁ డీశ్వరా! (556) మాయలు గల్గువారలను మాయలఁ బెట్టెడి ప్రోడ నిన్ను నా¯ మాయఁ గలంచి నీ మహిమ మానముఁ జూచెద నంచు నేరమిం¯ జేయఁగఁ బూనితిం; గరుణ చేయుము; కావుము; యోగిరాజ వా¯ గ్గేయ! దవాగ్నిఁ దజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే. (557) సర్వేశ! నే రజోజనితుండ; మూఢుండఁ¯ బ్రభుఁడ నేనని వెఱ్ఱి ప్రల్లదమున¯ గర్వించినాఁడను; గర్వాంధకారాంధ¯ నయనుండ గృపఁజూడు ననుఁ; బ్రధాన¯ మహదహంకృతి నభో మరుదగ్ని జల భూమి¯ పరివేష్టితాండకుంభంబులోన¯ నేడు జేనల మేన నెనయు నే నెక్కడ?¯ నీ దృగ్విధాండంబు లేరి కైన (557.1) సంఖ్య జేయంగ రానివి; సంతతంబు¯ నోలిఁ బరమాణవుల భంగి నొడలి రోమ¯ వివరముల యందు వర్తించు విపులభాతి¯ నెనయుచున్న నీ వెక్కడ? నెంతకెంత? (558) కడుపులోపల నున్న పాపఁడు కాలఁ దన్నినఁ గిన్కతో¯ నడువఁ బోలునె క్రాఁగి తల్లికి? నాథ! సన్నము దొడ్డునై¯ యడఁగి కారణ కార్యరూపమునైన యీ సకలంబు నీ¯ కడుపులోనిదె గాదె? పాపఁడఁ గాక నే మఱి యెవ్వఁడన్? (559) భూరి లయ జలధినిద్రిత¯ నారాయణనాభికమలనాళమున నజుం¯ డారఁయఁ బుట్టె ననుట నిజ¯ మో! రాజీవాక్ష! పుట్టె నోటు తలంపన్. (560) నళినాక్ష! నీ వాది నారాయణుండవు¯ జలము నారము జీవచయము నార¯ మందు నీవుంట నీ యం దవి యుంటను¯ నారాయణుండను నామ మయ్యె¯ సకల భూతములకు సాక్షి వధీశుండ¯ వబ్ధి నిద్రించు నారాయణుఁడవు¯ నీ మూర్తి యిది నీకు నిజమూర్తి యనరాదు¯ నళిననాళము త్రోవ నడచి మున్ను (560.1) కడఁగి నూఱేండ్లు వెదికి నేఁ గాననయితి¯ నేకదేశస్థుఁడవు గా వనేక రుచివి¯ జగములోనుందు; నీలోన జగములుండు¯ నరుదు; నీ మాయ నెట్లైన నగుచు నుండు. (561) వినుమో; యీశ్వర! వెల్పలన్ వెలుఁగు నీ విశ్వంబు నీ మాయ గా¯ క నిజంబైన యశోద యెట్లుగనియెం? గన్నార నీ కుక్షిలోఁ¯ గనెఁ బోఁ గ్రమ్మఱఁ గాంచెనే? భవదపాంగశ్రీఁ బ్రపంచంబు చ¯ క్కన లోనౌ; వెలి యౌను; లోను వెలియుం గాదేఁ దదన్యం బగున్; (562) ఒకఁడై యుంటివి; బాలవత్సములలో నొప్పారి తీ వంతటన్¯ సకలోపాసితులౌ చతుర్భుజులునై సంప్రీతి నేఁ గొల్వఁగాఁ¯ బ్రకటశ్రీ గలవాఁడ వైతి; వటుపై బ్రహ్మాండముల్ జూపి యొ¯ ల్లక యిట్లొక్కఁడవైతి; నీ వివిధ లీలత్వంబుఁ గంటిం గదే? (563) ఎఱిఁగిన వారికిఁ దోఁతువు¯ నెఱిఁ బ్రకృతింజేరి జగము నిర్మింపఁగ నా¯ తెఱఁగున రక్షింపఁగ నీ¯ తెఱఁగున బ్రహరింప రుద్రు తెఱఁగున నీశా! (564) అదియునుం గాక. (565) జలచర మృగ భూసుర నర¯ కులముల జన్మించి తీవు కుజనులఁ జెఱుపన్¯ జెలిమిని సుజనుల మనుపను¯ దలపోయఁగ రాదు నీ విధంబు లనంతా! (566) మ్రబ్బుగొలిపి యోగమాయ నిద్రించిన¯ యో! పరాత్మభూమ! యోగిరాజ! ¯ యే తెఱంగు లెన్ని యెంత యెచ్చోట నీ¯ హేల లెవ్వఁ డెఱుఁగు నీశ్వరేశ! (567) అది గాన నిజరూప మనరాదు; కలవంటి¯ దై బహువిధదుఃఖమై విహీన¯ సంజ్ఞానమై యున్న జగము సత్సుఖబోధ¯ తనుఁడవై తుదిలేక తనరు నీదు¯ మాయచేఁ బుట్టుచు మనుచు లే కుండుచు¯ నున్న చందంబున నుండుచుండు; ¯ నొకఁడ; వాత్ముఁడ; వితరోపాధి శూన్యుండ¯ వాద్యుండ; వమృతుండ; వక్షరుండ; (567.1) వద్వయుండవును; స్వయంజ్యోతి; వాపూర్ణుఁ¯ డవు; పురాణపురుషుఁడవు; నితాంత¯ సౌఖ్యనిధివి; నిత్యసత్యమూర్తివి; నిరం¯ జనుఁడ వీవు; తలఁపఁ జనునె నిన్ను. ? (568) దేవా! యిట్టి నీవు జీవాత్మ స్వరూపకుఁడవు, సకలాత్మలకు నాత్మయైన పరమాత్మ స్వరూపకుఁడవు నని యెవ్వ రెఱుంగుదురు, వారు గదా గురు వనియెడు దినకరునివలనఁ బ్రాప్తంబైన యుపనిషదర్థజ్ఞానం బను సునేత్రంబునంజేసి సంసార మిథ్యాసాగరంబుఁ దరించిన చందంబున నుండుదురు; రజ్జువందు రజ్జువని యెఱింగెడి యెఱుక లేకుండ, న య్యెఱుంగమి నది సర్పరూపంబయి తోఁచిన పిదప నెఱింగిన వారివలన రజ్జువు రజ్ఝువని యెఱుంగుచుండ, సర్పరూపంబు లేకుండు కైవడి, నాత్మ యప్పరమాత్మ యని యెవ్వ రెఱుంగరు వారి కయ్యెఱుంగమివలన సకల ప్రపంచంబు గలిగి తోఁచు; నాత్మ యప్పరమాత్మ యని యెవ్వరెఱుంగుదురు, వారి కయ్యెఱుకవలనఁ బ్రపంచంబు లేకుండు నజ్ఞాన సంభావిత నామకంబులైన సంసార బంధ మోక్షంబులు, జ్ఞాన విజ్ఞానంబులలోనివి గావు; కావునఁ గమలమిత్రున కహోరాత్రంబులు లేని తెఱంగునఁ, బరిపూర్ణ జ్ఞానమూర్తి యగు నాత్మ యందు నజ్ఞానంబులేమిని బంధంబును సుజ్ఞానంబు లేమిని మోక్షంబు లే; వాత్మవయిన నిన్ను దేహాదికంబని తలంచియు, దేహాదికంబు నిన్నుఁగాఁ దలంచియు, నాత్మ వెలినుండు నంచు మూఢులు మూఢత్వంబున వెదకుచుందురు; వారి మూఢత్వంబుఁ జెప్పనేల? బుద్ధిమంతులయి పరతత్వంబు గాని జడంబును నిషేధించుచున్న సత్పురుషులు తమ తమ శరీరంబుల యంద నిన్నరయుచుందు రదిగావున. (569) దేవా! నీ చరణప్రసాదకణలబ్ధిం గాక లేకున్న నొం¯ డేవెంటం జను నీ మహామహిమ నూహింపంగ నెవ్వారికిన్? ¯ నీ వారై చనువారిలో నొకఁడనై నిన్ గొల్చు భాగ్యంబు నా¯ కీవే యిప్పటి జన్మమం దయిన నొం డెం దైన నో! యీశ్వరా! (570) క్రతుశతంబునఁ బూర్ణ కుక్షివి; గాని నీ విటు క్రేపులున్¯ సుతులునై చనుఁబాలు ద్రావుచుఁ జొక్కి యాడుచుఁ గౌతుక¯ స్థితిఁ జరింపఁగఁ దల్లులై విలసిల్లు గోవుల గోపికా¯ సతుల ధన్యత లెట్లు చెప్పగఁ జాలువాఁడఁ గృపానిధీ! (571) పరిపూర్ణంబుఁ బురాణముఁ¯ బరమానందంబునైన బ్రహ్మమె చెలికాఁ¯ డరు దరుదు నందఘోష¯ స్థిరజనముల భాగ్యరేఖ చింతింపంగన్ (572) ఏకదశేంద్రియాధీశులు చంద్రాదు¯ లేను ఫాలాక్షుండు నిట్లు గూడఁ¯ బదుమువ్వురము నెడపడక యింద్రియ పాత్ర¯ ముల నీ పదాంభోజముల మరంద¯ మమృతంబుగాఁ ద్రావి యమర నేకైకేంద్రి¯ యాభిమా నులుమయ్యు నతి కృతార్థ¯ భావుల మైతిమి; పరఁగ సర్వేంద్రియ¯ వ్యాప్తులు నీ మీఁద వాల్చి తిరుగు (572.1) గోప గోపికాజనముల గురు విశిష్ట¯ భాగ్య సంపదఁ దలపోసి ప్రస్తుతింప¯ నలవిగా దెవ్వరికి నైన నంబుజాక్ష! ¯ భక్తవత్సల! సర్వేశ! పరమపురుష! (573) ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని¯ న్నీలోకంబున నీ వనాంతరమునం దీ మందలోఁ గృష్ణ యం¯ చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ¯ వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే? (574) నిను హింసించిన పూతనాదులకు మున్ నీ మేటి సంకేత మి¯ చ్చిన నీకుం బుర దార పుత్ర గృహ గో స్త్రీ ప్రాణ దేహాదు లె¯ ల్లను వంచింపక యిచ్చు గోపకులకున్ లక్షింప నే మిచ్చెదో? ¯ యని సందేహము దోఁచుచున్నది ప్రపన్నానీకరక్షామణీ! (575) దేహము కారాగేహము¯ మోహము నిగళంబు; రాగముఖరములు రిపు¯ వ్యూహములు భక్తితో ని¯ న్నూహింపఁని యంతదడవు నో! కమలాక్షా! (576) ఆశ్రయించు జనుల కానందసందోహ¯ మీఁ దలంచి వివిధ హేలతోడ¯ నప్రపంచకుండ వయ్యుఁ బ్రపంచంబు¯ వెలయఁజేయు దీవు విశ్వమూర్తి! (577) ఎఱిఁగిన వార లెఱుంగుదు¯ రెఱుఁగన్ బహు భాషలేల? నీశ్వర! నీ పెం¯ పెఱుఁగ మనోవాక్కులకున్¯ గుఱిచేయం గొలది గాదు గుణరత్ననిధీ! (578) సర్వము నీవ యెఱుంగుదు¯ సర్వవిలోకనుఁడ వీవ; జగదధిపతివిన్; ¯ సర్వాపరాధి నను నో! ¯ సర్వేశ! యనుగ్రహింపు; చనియెద నింకన్. (579) జిష్ణు! నిశాటవిపాటన! ¯ వృష్ణికులాంభోజసూర్య! విప్రామర గో¯ వైష్ణవ సాగర హిమకర! ¯ కృష్ణా! పాషండధర్మగృహదావాగ్నీ!

పులినంబునకు తిరిగివచ్చుట

(580) దేవా! నీకుఁ గల్పపర్యంతంబు నమస్కరించెద”నని యివ్విధంబున సంస్తుతించి ముమ్మాఱు వలగొని పాదంబులపైఁ బడి వీడ్కొని బ్రహ్మ తన నెలవునకుం జనియె; నతని మన్నించి భగవంతుండైన హరి తొల్లి చెడి తిరిగి వచ్చిన వత్సబాలకులం గ్రమ్మఱం గైకొని పులినంబుకడఁ జేర్చె; నిట్లు. (581) క్రించు దనంబున విధి దము¯ వంచించిన యేఁడు గోపవరనందను లొ¯ క్కించుక కాలంబుగ నీ¯ క్షించిరి రాజేంద్ర! బాలకృష్ణుని మాయన్. (582) ఏ మహాత్ము మాయ నీ విశ్వమంతయు¯ మోహితాత్మక మయి మునిగి యుండు¯ నట్టి విష్ణుమాయ నర్భకు లొక్క యేఁ¯ డెఱుఁగ కుండి రనుట యేమి వెఱఁగు? (583) అప్పుడు. (584) “చెలికాఁడా! యరుదెంచితే యిచటికిన్? క్షేమంబునం గ్రేపులున్¯ నెలవుల్ జేరె నరణ్యభూమివలనన్ నీ వచ్చునం దాకఁ జ¯ ల్దులు వీ రించుక యెవ్వరుం గుడువ; రా లోకింపు; ర”మ్మంచు నా¯ జలజాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలన్ డింభకుల్. (585) ఇట్లు బాలకులతోడఁ జల్ది గుడిచి వారలకు నజగర చర్మంబు చూపుచు వనంబున నుండి తిరిగి. (586) ప్రసన్నపింఛమాలికా ప్రభావిచిత్రితాంగుఁడుం¯ బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం¯ బ్రసన్న గోప బాలగీత బాహువీర్యుఁ డయ్యు ను¯ ల్లసించి యేగె గోపకుల్ జెలంగి చూడ మందకున్. (587) ఆ సమయంబున. (588) పెనుఁబాము దమ్ము మ్రింగిన¯ మన నందసుతుండు పాము మర్దించి మమున్¯ మనిచె నరణ్యములోపల¯ నని ఘోషించిరి కుమారు లా ఘోషములోన్." (589) అనిన విని నరేంద్రుం డిట్లనియె

కృష్ణుడు అత్మీయు డగుట

(590) "కని మనిచి యెత్తి పెంచిన¯ తనుజన్ములకంటె నందతనయుం డా ఘో¯ షనివాసులకు మనోరం¯ జనుఁ డెట్లయ్యెను? బుధేంద్ర! చను నెఱిఁగింపన్." (591) అనిన శుకుం డిట్లనియె. (592) “అఖిల జంతువులకు నాత్మవల్లభమైన¯ భంగి బిడ్డలు నిండ్లుఁ బసిఁడి మొదలు¯ వస్తువు లెవ్వియు వల్లభంబులు గావు¯ సకలాత్మకుండైన జలజనేత్రు¯ డఖిల జంతువులకు నాత్మ గావున ఘోష¯ వాసుల కెల్లను వల్లభత్వ¯ మున మిక్కిలొప్పెను మూడులోకములకు¯ హితము చేయఁగ జలజేక్షణుండు (592.1) మాయతోడ మూర్తిమంతుడై యొప్పారు; ¯ గలఁ డతండు నిఖిల గణము లందు¯ భవతిధాతు వెట్లు భావార్థమై సర్వ¯ ధాతు గణమునందుఁ దనరు నట్లు. (593) శ్రీపతి పదమను నావను ¯ బ్రాపించి భవాబ్ధి వత్సపదముగ ధీరుల్¯ రూపించి దాఁటి చేరుదు¯ రాపత్పద రహితు లగుచు నమృతపదంబున్. (594) అఘునిఁ జంపి కృష్ణుఁ డాప్తులు దానును¯ జల్ది గుడిచి జలజసంభవునకుఁ¯ జిద్విలాసమైన చెలువుఁ జూపిన కథఁ¯ జదువ వినినఁ గోర్కి సంభవించు. (595) అని చెప్పి మఱియు వ్యాసనందనుం డిట్లనియె (596) రాగంబున బలకృష్ణులు¯ పౌగండవయస్కు లగుచుఁ బశుపాలకతా¯ యోగంబున బృందావన¯ భాగంబునఁ గాఁచి రంతఁ బశువుల నధిపా!

ఆలకదుపుల మేప బోవుట

(597) అయ్యెడఁ గృష్ణుం డొక్కనాడు రేపకడ లేచి, వేణువు పూరించి బలభద్ర సహితుండై గోపకుమారులు దన్ను బహువారంబులు గైవారంబులు జేయ, మ్రోల నాలకదుపుల నిడుకొని నిరంతర ఫల కిసలయ కుసుమంబులును, కుసుమ మకరంద నిష్యంద పానానం దేందిందిర కదంబంబును, గదంబాది నానాతరులతా గుల్మ సంకులంబును, గులవిరోధరహిత మృగపక్షిభరితంబును, భరితసరస్సరోరుహపరిమళమిళిత పవనంబును నైన వనంబుఁ గని యందు వేడుకం గ్రీడింప నిశ్చయించి వెన్నుం డన్న కిట్లనియె. (598) శాఖాపుష్పఫలప్రభారనతలై చర్చించి యో! దేవ! మా¯ శాఖిత్వంబు హరింపు; మంచు శుకభాషన్ నీ కెఱింగించుచున్¯ శాఖాహస్తములం బ్రసూనఫలముల్ జక్కన్ సమర్పించుచున్¯ శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే. (599) నిఖిల పావనమైన నీ కీర్తిఁ బాడుచు¯ నీ తుమ్మెదలు వెంట నేగుదెంచె¯ నడవిలో గూఢుండవైన యీశుఁడ వని; ¯ ముసరి కొల్వఁగ వచ్చె మునిగణంబు¯ నీలాంబరముతోడి నీవు జీమూత మ¯ వని నీలకంఠంబు లాడఁ దొడఁగెఁ ¯ బ్రియముతోఁ జూచు గోపికలచందంబున¯ నినుఁ జూచె నదె హరిణీచయంబు (599.1) నీవు వింద వనుచు నిర్మలసూక్తులు¯ పలుకుచున్న విచటఁ బరభృతములు¯ నేఁడు విపినచరులు నీవు విచ్చేసిన¯ ధన్యులైరి గాదె తలఁచి చూడ. (600) నీ పాదములు సోఁకి నేడు వీరుత్తృణ¯ పుంజంబుతో భూమి పుణ్య యయ్యె¯ నీ నఖంబులు దాఁకి నేడు నానాలతా¯ తరుసంఘములు గృతార్థంబు లయ్యె¯ నీ కృపాదృష్టిచే నేడు నదీ శైల¯ ఖగ మృగంబులు దివ్యకాంతిఁ జెందె¯ నీ పెన్నురము మోవ నేడు గోపాంగనా¯ జనముల పుట్టువు సఫల మయ్యె”; (600.1) నని యరణ్యభూమి నంకించి పసులను¯ మిత్రజనులు దాను మేపు చుండి¯ నళినలోచనుండు నదులందు గిరులందు¯ సంతసంబు మెఱయ సంచరించె. (601) మఱియు నయ్యీశ్వరుండు.

ఆవుల మేపుచు విహరించుట

(602) ఒకచోట మత్తాళి యూధంబు జుమ్మని¯ మ్రోయంగ జుమ్మని మ్రోయుచుండు¯ నొకచోటఁ గలహంసయూధంబు గూడి కేం¯ కృతులు జేయంగఁ గేంకృతులు జేయు¯ నొకచోట మదకేకియూధంబు లాడంగ¯ హస్తాబ్జములు ద్రిప్పి యాడఁ దొడఁగు¯ నొకచోట వనగజయూధంబు నడవంగ¯ నయముతో మెల్లన నడవఁజొఁచ్చుఁ (602.1) గ్రౌంచ చక్ర ముఖర ఖగము లొక్కొకచోటఁ¯ బలుక వానియట్ల పలుకుఁ గదిసి¯ పులుల సింహములను బొడగని యొకచోటఁ¯ బఱచు మృగములందుఁ దఱచు గూడి. (603) మఱియును. (604) "రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ!¯ రమ్ము భగీరథరాజతనయ! ¯ రా సుధాజలరాశి! రా మేఘబాలిక!¯ రమ్ము చింతామణి! రమ్ము సురభి! ¯ రా మనోహారిణి! రా సర్వమంగళ!¯ రా భారతీదేవి! రా ధరిత్రి! ¯ రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి!¯ రమ్ము మందాకిని! రా శుభాంగి!" (604.1) యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు¯ లడవిలోన దూరమందు మేయ¯ ఘనగభీరభాషఁ గడునొప్పఁ జీరు నా¯ భీరజనులు బొగడఁ బెంపు నెగడ. (605) కాంతార విహారమ్ముల ¯ శ్రాంతుండై గోపకాంకశయుఁడగు నన్నన్¯ సంతుష్టిఁ బొందఁజేయు ని¯ రంతర కరచరణ మర్శనాదుల నధిపా! (606) పాడుచు నాడుచు ముచ్చట¯ లాడుచు నొండొరులఁ దాఁకు నాప్తులఁ గని బి¯ ట్టాడుచుఁ జేతులు వ్రేయుచుఁ ¯ గ్రీడింతురు నగుచు బలుఁడుఁ గృష్ణుఁడు నొకచోన్. (607) ఇవ్విధంబున. (608) వేదాంత వీధుల విహరించు విన్నాణి¯ విహరించుఁ గాంతారవీధులందు; ¯ ఫణిరాజశయ్యపైఁ బవళించు సుఖభోగి¯ వల్లవ శయ్యలఁ బవ్వళించు; ¯ గురుయోగి మానసగుహలఁ గ్రుమ్మరు మేటి¯ గ్రుమ్మరు నద్రీంద్ర గుహలలోనఁ; ¯ గమలతోడఁ బెనంగి కడు డయ్యు చతురుఁ డా¯ భీరజనులతోడఁ బెనఁగి డయ్యు; (608.1) నఖిల లోకములకు నాశ్రయుండగు ధీరుఁ¯ డలసి తరులనీడ నాశ్రయించు¯ యాగభాగచయము లాహరించు మహాత్ముఁ¯ డడవిలోని ఫలము లాహరించు (609) ఆ సమయంబున. (610) అలసినచోఁ గొంద ఱతిమోదమున వీపు¯ లెక్కించుకొని పోదు రేపు మెఱసి; ¯ సొలసి నిద్రించినచోఁ నూరుతల్పంబు¯ లిడుదురు కొందఱు హితవు గలిగి; ¯ చెమరించి యున్నచోఁ జిగురుటాకులఁ గొంద¯ ఱొయ్యన విసరుదు రుత్సహించి; ¯ దవ్వేగి నిలుచుచోఁ దడయకఁ గొందఱు¯ పదము లొత్తుదు రతిబాంధవమున; (610.1) గోపవరులు మఱియుఁ గొందఱు ప్రియమున¯ మాధవునకుఁ బెక్కుమార్గములను¯ బనులు చేసిరెల్ల భవములఁ జేసిన¯ పాపసంచయములు భస్మములుగ.

ధేనుకాసుర వధ

(611) అ య్యవసరంబున శ్రీదామ నామధేయుం డయిన గోపాలకుండు రామకేశవులం జూచి యిట్లనియె. (612) "దూరంబునఁ దాలతరు¯ స్ఫారం బగు వనము గలదు; పతితానుపత¯ ద్భూరిఫలసహిత మది యే¯ ధీరులుఁ జొర వెఱతు రందు ధేనుకుఁ డుంటన్. (613) ఆ ధేనుకాసురుండు మహాశూరుండును, ఖరాకారుండును నై సమాన సత్వసమేతులైన జ్ఞాతులుం దానును మనుష్యులం బట్టి భక్షించుచుండు; నయ్యెడఁ బరిమళోపేతంబులైన నూతన ఫల వ్రాతంబు లసంఖ్యాకంబులు గలవు; వినుఁడు. (614) ఫలగంధము నాసాపుట¯ ముల జొచ్చి కలంచి చిత్తములఁ గొనిపోయెన్¯ ఫలముల నమలింపుఁడు మము; ¯ బలియురకును మీకు దైత్యభటు లడ్డంబే?" (615) అని పలికిన చెలికాని పలుకు లాదరించి విని నగి వారునుం దారును నుత్తాలంబగు తాలవనంబునకుం జని; యందు. (616) తత్తఱమున బలభద్రుఁడు¯ తత్తాలానోకహములఁ దనభుజబలసం¯ పత్తిఁ గదల్చుచు గ్రక్కున¯ మత్తేభము భంగిఁ బండ్లు మహిపై రాల్చెన్. (617) అప్పుడు పండ్లు రాల్చిన చప్పుడు చెవులకు దెప్పరంబయిన, నదిరిపడి రిపుమర్దన కుతుకంబున గార్దభాసురుండు (618) పదవిక్షేపములన్ సవృక్షధరణీభాగంబు గంపింపఁగా¯ రదముల్ దీటుచుఁ గత్తిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీ¯ తిదమై తూలఁగఁ గావరంబున సముద్దీపించి గోపాలకుల్¯ బెదరన్ రాముని ఱొమ్ముఁ దన్నె వెనుకై బీరంబు తోరంబుగన్. (619) మఱియును దనుజుఁడు రామునిఁ¯ గఱవఁగ గమకించి తెఱపిఁ గానక యతనిం¯ జుఱచుఱఁ జూచుచు శౌర్యము¯ పఱిబోవఁగ నింత నంతఁ బదమలఁ దన్నెన్ (620) అంత బలభద్రుండు రౌద్రాకారంబున గర్దభాసురుపదంబులు నాలుగు నొక్క కేల నంటంబట్టి బెట్టుదట్టించి త్రిప్పి విగతజీవునిం జేసి. (621) ఒక తాలాగ్రముఁ దాఁక వైవ నది కంపోద్రిక్తమై త్రుళ్ళి వే¯ ఱొక తాలాగ్రము పైఁబడ న్నదియు నయ్యుగ్రాహతిన్ నిల్వ కొం¯ డొక తాలాగ్రము పైఁ బడన్ విఱిగి యిట్లొండొంటిపైఁ దాలవృ¯ క్షకముల్ గూలెఁ బ్రచండ మారుతము దాఁకం గూలు చందంబునన్. (622) తంతువులందుఁ జేలము విధంబున నే పరమేశు మూర్తి యం¯ దింతయుఁ బుట్టునట్టి జగదీశుఁ డనంతుఁడు దైత్యమాతృ ని¯ ట్లంతము జేయు టెంతపని? యద్భుత మే విను మంతలోన వాఁ¯ డంతముఁ బొందు టెల్లఁ గని యాతని బంధులు గార్దభంబులై. (623) బలకృష్ణులపైఁ గవిసిన¯ బలియుర ఖరదైత్యభటులఁ బశ్చిమపాదం¯ బుల బట్టి తాల శిఖరం¯ బుల కెగురఁగ వైచి వారు పొరిగొని రధిపా! (624) అప్పుడు. (625) ఆలమున నోలిఁ గూలిన¯ తాలద్రుమఖండ దైత్యతనుఖండములన్¯ కీలితమై ధర జలధర¯ మాలావృతమైన మింటి మాడ్కిన్ వెలిగెన్ (626) ధేనుకవనమున నమలిరి¯ మానవు లావేళఁ దాఁటి మ్రాకుల ఫలముల్; ¯ ధేనువులు మెసఁగెఁ గసవులు; ¯ ధేనుకహరభక్తకామధేనువు గలుగన్. (627) ఆ సమయంబున సురలు విరులవానలు గురియించి దుందుభులు మొరయించి; రంతఁ గమలలోచనుండు గోపజన జేగీయమాన వర్తనుండై, యన్నయుం దానును గోగణంబులం దోలుకొని మందకు జనియె; న య్యెడ. (628) గోపదరేణు సంకలిత కుంతలబద్ధ మయూరపింఛు ను¯ ద్దీపిత మందహాస శుభదృష్టి లసన్ముఖు వన్యపుష్ప మా¯ లా పరిపూర్ణు గోపజన లాలిత వేణురవాభిరాము నా¯ గోపకుమారునిం గనిరి గోపసతుల్ నయనోత్సవంబుగన్. (629) కమలనయను వదనకమల మరందంబు¯ దవిలి నయన షట్పదముల వలనఁ ¯ ద్రావి దిన వియోగతాపంబు మానిరి¯ గోపకాంత లెల్లఁ గోర్కు లలర. (630) ఇట్లు గోపికలు సాదరంబుగం జూడ వ్రీడాహాస వినయంబులం జూచుచుం గ్రీడాగరిష్ఠుండైన ప్రోడ గోష్ఠంబు ప్రవేశించె; నంత రోహిణీ యశోదలు కుఱ్ఱలవలని మచ్చికలు పిచ్చలింప నిచ్చకువచ్చిన ట్లయ్యై వేళల దీవించిరి; వారును మజ్జనోన్మర్దనాదు లంగీకరించి, సురభి కుసుమ గంధంబులు గైకొని, రుచిర చేలంబులు గట్టికొని, రసోపపన్నంబు లయిన యన్నంబులు గుడిచి, తృప్తు లయి, మంజులశయ్యల సుప్తులై యుండి; రందు.

విషకలిత కాళింది గనుగొనుట

(631) ఒకనాడు బలభద్రుఁ డొక్కఁడు రాకుండ¯ గోపాలకులు దానుఁ గూడి కృష్ణుఁ¯ డడవికిఁ జని యెండ నా గోవులును గోప¯ కులు నీరుపట్టునఁ గుంది డస్సి¯ కాళిందిలో విషకలిత తోయముఁ ద్రావి¯ ప్రాణానిలంబులు వాసి పడిన¯ యోగీశ్వరేశుండు యోగివంద్యుఁడు గృష్ణుఁ¯ డీక్షణామృతధార లెలమిఁ గురిసి (631.1) పసుల గోపకులను బ్రతికించె మరలంగ; ¯ వారుఁ దమకుఁ గృష్ణువలన మరలఁ ¯ బ్రతుకు గలిగెనంచు భావించి సంతుష్ట¯ మానసములఁ జనిరి మానవేంద్ర! (632) కాళియఫణిదూషిత యగు¯ కాళిందిఁ బవిత్రఁ జేయఁగా నుత్సుకుఁడై¯ కాళిందీజలవర్ణుఁడు¯ కాళియు వెడలంగ నడిచెఁ గౌరవముఖ్యా!” (633) అనిన “న య్యగాధజలంబుల వలన మాధవుం డెట్టి నేర్పున సర్పంబు దర్పంబు మాపి వెడలించె, నందుఁ బెద్దకాలం బా వ్యాళం బేల యుండె? నెఱిగింపుము. (634) తొఱ్ఱులఁ గాచిన నందుని¯ కుఱ్ఱని చరితామృతంబు గొనకొని చెవులన్¯ జుఱ్ఱంగఁ దనివి గల్గునె; ¯ వెఱ్ఱుల కైనను దలంప? విప్రవరేణ్యా! " (635) అనిన శుకుం డిట్లనియె. (636) "మానవేశ్వర! యొక్క మడుఁగు కాళిందిలోఁ¯ గల; దది యెప్పుడుఁ గాళియాహి¯ విషవహ్నిశిఖలచే వేచు చుండును; మీఁదఁ¯ బఱతెంచినంతన పక్షులైనఁ¯ బడి మ్రగ్గు; నందుఁ దద్భంగశీకరయుక్త¯ పవనంబు సోఁకినఁ బ్రాణు లెవ్వి¯ యైన నప్పుడ చచ్చు; నట్టి యా మడుఁగులో¯ నుదకంబు పొంగుచు నుడుకుచుండుఁ (636.1) జూచి వెఱగంది కుజనుల స్రుక్కఁజేయ¯ నవతరించిన బలువీరుఁ డాగ్రహించి¯ "భుజగవిషవహ్నిదోషంబుఁ బొలియఁజేసి¯ సుజలఁ గావించి యా నదిఁ జూతు" ననుచు. (637) కృతనిశ్చయుండై, పూర్వజన్మ భాగ్యంబునం దన చరణ సంస్పర్శనంబునకు యోగ్యంబై, తత్సమీపంబున విశాల విటపశాఖా కదంబంబుతో నున్న కదంబభూజంబు నెక్కి.

కాళిందిలో దూకుట

(638) కటిచేలంబు బిగించి పింఛమునఁ జక్కం గొప్పు బంధించి దో¯ స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త¯ త్కుటశాఖాగ్రము మీఁదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది¯ క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్. (639) భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కం¯ ఠీరవ పాత వేగ వికటీకృత దుర్విషభీషణోర్మి సం¯ పూరితమై వడిం గలఁగి పొంగి ధనుశ్శతమాత్ర భాగ వి¯ స్తారము బొందె న మ్మడుఁగు తప్తపయఃకణ బుద్బుదోగ్రమై. (640) పాఠీనాకృతిఁ దోయరాశినడుమన్ భాసిల్లి మున్నాఢ్యుఁడై¯ కాఠిన్యక్రియ నీదునేర్పు దనకుం గల్మిన్ భుజంగేంద్ర హృ¯ త్పీఠాగ్రంబున రోషవహ్ను లెగయన్ భీమంబుగా నీదె ను¯ ల్లోఠోత్తుంగతరంగమై మడుఁగు దుర్లోక్యంబుగా బాహులన్. (641) ఆ సమయంబున. (642) "బాలుం డొక్కఁడు వీఁడు నా మడుఁగు విభ్రాంతోచ్చలత్కీర్ణ క¯ ల్లోలంబై కలఁగం జరించె నిట నే లోనుంటఁ జూడండు; మ¯ త్కీలాభీల విశాల దుస్సహ విషాగ్నిజ్వాలలన్ భస్మమై¯ కూలం జేసెద నేడు లోకులకు నా కోపంబు దీపింపఁగన్." (643) అని తలంచి విజృంభించి. (644) ఘోరవిషానలప్రభలు గొబ్బునఁ గ్రమ్మఁగ సర్పసైన్య వి¯ స్ఫారుఁడు గాళియోరగుఁడు పాఱివడిం గఱచెన్ పయోధరా ¯ కారుఁ బయోవిహారు భయకంప విదూరు మహాగభీరు నా¯ భీరకుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్. (645) కఱచి పిఱుతివక మఱియును¯ వెఱవక నిజవదనజనిత విషదహనశిఖల్¯ మెఱయఁ దన నిడుద యొడలిని¯ నెఱి హరిఁ బెనగొనియె భుజగనివహపతి వడిన్. (646) ఇట్లు భోగిభోగ పరివేష్టితుండై, చేష్టలు లేనివాని తెఱంగునఁ గానంబడుచున్న ప్రాణసఖునిం గనుంగొని తత్ప్రభావంబు లెఱుంగక, తత్సమర్పిత ధన దార మనోరథ మానసులు గావున. (647) "అదె మన కృష్ణునిం గఱచి; యంతటఁ బోక భుజంగమంబు దు¯ ర్మదమున మేనఁ జుట్టుకొని మానక యున్నది; యింక నేమి చే¯ యుద? మెటఁజొత్త? మే పురుషు లోపుదు రీ యహి నడ్డపెట్ట నె¯ య్యది సదుపాయ?" మంచుఁ బడి రార్తరవంబులఁ దూలి గోపకుల్. (648) గోపకుమారకశేఖరు¯ నేపున సర్పంబు గఱచు టీక్షించి వగన్¯ మేపులకుఁ దొలఁగి గోవులు¯ వాపోవుచు నుండె వృషభ వత్సంబులతోన్. (649) భూతలము వడఁకె నుల్కా¯ పాతంబులు మింటఁ గానబడె ఘోషములో¯ వ్రేతలకును గోపక సం¯ ఘాతములకు నదరె గీడుకన్ను లిలేశా! (650) అంత నా దుర్నిమిత్తంబులు బొడగని బెగడు గదిరిన చిత్తంబుల నుత్తలపడుచు మందనున్న నంద యశోదాదులైన గోపగోపికా జనంబులు హరి దళసరి యెఱుంగక గోపాల గోగణ పరివృతుం డైన కృష్ణుం డెక్కడ నైనం జిక్కనోపునని పొక్కుచుం బెక్కువలైన మక్కువలు చెక్కులొత్త నొక్కపెట్ట బాలవృద్ధసమేతులై మహాఘోషంబున నా ఘోషంబు వెలువడి. (651) వా రిబ్భంగి నెఱుంగని¯ వారై హరిఁ జూడఁబోవ వడిగొని నగుచున్¯ వారింపఁ డయ్యె రాముఁడు¯ వారిని హరి లా వెఱుంగువాఁ డయ్యు నృపా! (652) అంతలోన వారునుం దానును గాంతారమార్గంబు పట్టిపోవుచు నెడనెడ గోపగోష్పదంబుల సందుల నింతనంత నక్కడక్కడ యవాంకుశ హల కమల కులిశ చక్ర చాప కేతనాది రేఖాలంకృతంబులై మార్గాభరణంబులయిన హరిచరణంబుల జాడఁ గని చొప్పుదప్పక చని దుర్ఘటంబైన యమునా తటంబుఁ జేరి వారిమధ్యంబున నితరుల కసాధ్యం బయిన సర్పంబుచేతఁ గాటుపడి దర్పంబుఁ జూపక భోగిభోగపరివృతుం డయిన శ్రీకృష్ణునిం గని "కృష్ణ కృష్ణేతి"విలాపంబులఁ దాపంబులం బొందుచు తత్కాలంబునఁ బ్రతికూలం బయ్యె ననుచు దైవంబుఁ దిట్టు గోపికలును గోపకులం గలసి మేతలుడిగి ఱెప్పలిడక కృష్ణునిం దప్పక చూచుచు నొఱలుచున్న గోవులం గని; రందు గోపికలు యశోదం బట్టుకొని విలపించుచుఁ గృష్ణు నుద్దేశించి యిట్లనిరి.