పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 403 - 529

గుహ్యకులు కృష్ణుని పొగడుట

(403) ఇట్లు నిర్మూలంబు లై పడిన సాలంబులలోనుండి కీలికీలలు వెల్వడు పోలిక నెక్కుడు తేజంబున దిక్కులు పిక్కటిల్లం బ్రసిద్ధు లైన సిద్ధు లిద్దఱు వెడలివచ్చి ప్రబుద్ధులై భక్తలోకపాలకుండైన బాలకునకు మ్రొక్కి లేచి కరకమలంబులు మొగిడ్చి యిట్లనిరి. (404) "బాలుఁడవె నీవు? పరుఁడ వ¯ నాలంబుఁడ వధికయోగి వాద్యుడవు తను¯ స్థూలాకృతి యగు విశ్వము¯ నీ లీలారూప మండ్రు నిపుణులు కృష్ణా! (405) ఎల్లభూతంబుల కింద్రియాహంకృతి¯ ప్రాణంబులకు నధిపతివి నీవ; ¯ ప్రకృతియుఁ బ్రకృతిసంభవమహత్తును నీవ¯ వీని కన్నిటికిని విభుఁడ వీవ; ¯ ప్రాకృతగుణవికారములఁ బొందక పూర్వ¯ సిద్దుఁడ వగు నిన్నుఁ జింత జేయ¯ గుణయుతుం డోపునే? గుణహీన! నీ యంద¯ కల గుణంబుల నీవ కప్పఁబడుదు; (405.1) మొదల నెవ్వని యవతారములు శరీరు¯ లందు సరిదొడ్డు లేని వీర్యముల దనువు¯ లడర జన్మించి వారల యందుఁ జిక్క; ¯ వట్టి పరమేశ! మ్రొక్కెద మయ్య! నీకు. (406) భువనములు చేయఁ గావఁగ¯ నవతీర్ణుఁడ వైతి కాదె యఖిలేశ్వర! యో¯ గివరేణ్య! విశ్వమంగళ! ¯ కవిసన్నుత! వాసుదేవ! కల్యాణనిధీ! (407) తపస్వివాక్యంబులు దప్ప వయ్యెన్; ¯ నెపంబునం గంటిమి నిన్నుఁ జూడన్¯ దపంబు లొప్పెన్; మముఁ దావకీయ¯ ప్రపన్నులం జేయుము భక్తమిత్రా! (408) నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్¯ నీ పేరం బనిచేయు హస్తయుగముల్ నీ మూర్తిపైఁ జూపులున్¯ నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్¯ నీ పై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!" (409) అని యిట్లు కీర్తించిన గుహ్యకులం జూచి నగుచు నులూఖల బద్ధుండైన హరి యిట్లనియె. (410) "తమతమ ధర్మముఁ దప్పక¯ సములై నను నమ్మి తిరుగు సభ్యులకును బం¯ ధము ననుఁ జూచిన విరియును¯ గమలాప్తుఁడు పొడమ విరియు ఘనతమము క్రియన్. (411) కారుణ్యమానసుం డగు¯ నారదువచనమునఁ జేసి ననుఁ బొడఁగనుటన్¯ మీరు ప్రబుద్ధుల రైతిరి¯ చేరెన్ నామీఁది తలఁపు సిద్ధము మీకున్." (412) అని యీశ్వరుండు మీరు “మీ నెలవులకుం బొం” డని యానతిచ్చిన, మహాప్రసాదం బని వలగొని పెక్కు మ్రొక్కులిడి, నలకూబర మణిగ్రీవు లుత్తర భాగంబున కరిగి రంత; నందాదు లైన గోపాలకులు నిర్మూలంబులై పడిన సాలంబుల చప్పుడు పిడుగు చప్పు డని శంకించి వచ్చి చూచి. (413) "ఈ పాదపములు గూలఁగ¯ నీ పాపఁ డులూఖలమున నిటు బద్ధుండై¯ యే పగిది బ్రతికెఁ? గంటిరె; ¯ వాపోవఁడు; వెఱవఁ; డెట్టివాఁడో యితఁడున్. (414) పిడుగు పడదు; గాక పెనుగాలి విసరదు; ¯ ఖండితంబు లగుట గానరాదు; ¯ బాలుఁ డితఁడు; పట్టి పడఁ ద్రోయఁజాలఁడు; ¯ తరువు లేల గూలె ధరణిమీఁద" (415) అని పెక్కండ్రు పెక్కువిధంబుల నుత్పాతంబులు గావలయు నని శంకింప నక్కడ నున్న బాలకు లిట్లనిరి. (416) "నందుని కొమరుఁడు వినుఁ డీ¯ సందున మును దూఱి ఱోలు సరి యడ్డముగా¯ ముందటి కీడ్చిన మద్దులు ¯ గ్రందుకొనం గూలె; జనులఁ గంటి మిరువురన్." (417) అని యిట్లు పలికిన బాలకాలాపంబులు విని మిథ్యారూపంబు లని కొందఱనిరి; కొందఱు నానావిధంబుల సందేహించి; రంత నందుండు వికసిత వదనారవిందుం డగుచుఁ బట్టి కట్లు విడిచెను; నట్టి యెడఁ దన తెఱం గెవ్వరు నెఱుంగకుండవలె నని ఠవరకుమారుండు. (418) పాడున్ మందుని భంగి; గోపవనితల్ పాణిధ్వనుల్ సేయఁగా¯ నాడున్ జంత్రముకైవడిం; బరవశుండై హస్తముల్ త్రిప్పుచుం; ¯ జూడన్ నేరని వాని భంగి జనులం జూచున్; నగున్; బాలురం¯ గూడున్ బెద్దలపంపు చేయఁజను; డాగున్; మట్టిఁ జిట్టాడుచున్.

కపటబాల లీలలు

(419) "చుంచొదువుఁ బాలు ద్రావు ము¯ దంచితముగ" ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ¯ జుం చొదువ దనుచు లీలా¯ చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా! (420) సెలగోల పట్టుకొని జల¯ కలశములో నీడఁ జూచి "కలశయుతుండై¯ సెలగోలఁ బాపఁ డొకఁ డిదె¯ తలచెన్ ననుఁ గొట్ట" ననుచుఁ దల్లికి జెప్పెన్. (421) "భిక్షులు వచ్చెద రేడ్చిన; ¯ భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్¯ శిక్షించెద"; రని చెప్పిన¯ భిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లు నృపా! (422) ఇట్లు కృష్ణుండు బహువిధంబులఁ గపటబాలలీలల వినోదింప, బృహద్వనంబున నందాదు లైన గోపవృద్ధులు మహోత్పాతంబు లగుటయు, వానివలన బాలుం డుత్తరించుటయుఁ జూచి యేకాంతంబున నొక్కనాడు విచారింప నుపనందుం డను వృద్ధగోపకుండు తన యెఱుక మెఱసి యిట్లనియె.

బృందావనము బోవతలచుట

(423) "ఇక్కడ నుందురే మనుజు? లీ మన కృష్ణున కెగ్గు చేయఁగా¯ రక్కసురాలు చ న్నొసఁగె; ఱాలపయిన్ సుడిగాలి వీచెఁ; బై¯ గ్రిక్కిఱియం దరుల్ వడియెఁ; గేశవు సత్కృపఁ దప్పెఁ; జాలు నేఁ¯ డెక్కడి కైనఁ బోవలయు నిం కిట గోపకులార! వింటిరే? (424) కసవు గల దిరవు పసులకు¯ లస దద్రి నదీ మహీజ లతికావళిఁ బెం¯ పెసఁగును, గాపురమునకును¯ బొసఁగును బృందావనంబు పొదఁ డచ్చటికిన్."

బృందావనమునకు బోవుట

(425) అని పలుకు నుపనందుని పలుకుల కార్యులైన గోపకు “లిదియ కార్యంబు మందల” యని కొందల మందక యాలమందల నమంద గమనంబున ముందఱ నడవం బనిచి పిఱుందం గ్రందుకొనకుండ, బాల వృద్ధ నారు లెక్కిన తేరులు సాగించి తారు తను త్రాణ తూణీర బాణధరులై విండ్లు బట్టుకొని నడవ, బండ్ల వెనుకం గొమ్ము లిమ్ములం బూరించుచు నవార్యంబులగు తూర్యరవంబులు సెలంగ, నార్య, పురోహిత సమేతులై వేడుకలు కొనలునిగుడ మొన లేర్పఱచుకొని పావనం బగు బృందావనంబునకుం జని రప్పుడు. (426) పసుపు లాడి యురోజకుంకుమ పంకశోభితలై లస¯ ద్వసనలై కచభారచంపకదామలై సు లలామలై¯ పసిఁడిమాడల కాంతు లఱ్ఱులఁ బర్వఁ దేరులమీఁద బెం¯ పెసఁగ బాడిరి వ్రేత లా హరిహేల లింపగు నేలలన్.

బృందావనము జొచ్చుట

(427) అప్పుడు రోహిణీయశోద లేక రథంబునఁ బరిపూర్ణమనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారల వినోదంబులకుఁ బ్రమోదంబు నొందుచుండి; రిట్లు గోపకులు బృందావనంబు జొచ్చి యం దర్ధచంద్రాకారంబుగ శకట సందోహంబు నిలిపి మందలు విడియించి వసియించిరి. (428) చెందిరి బలమాధవు లభి¯ నందించుచుఁ బరమ పావనము సంచిత కా¯ ళిందీ సంజీవనమున్¯ బృందావనమున్ మునీంద్రబృందావనమున్. (429) ఇట్లు బృందావనంబు చెంది, కొంత కాలంబునకు రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడుకొని వేడుక లూదుకొన దూడలఁ గాచుచు. (430) వేణువు లూఁదుచు వివిధ రూపములతో¯ గంతులు వైతురు గౌతుకమున; ¯ గురుకంబళాదుల గోవృషంబులఁ బన్ని¯ పరవృషభము లని ప్రతిభటింతు; ¯ రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జలు¯ మొఱయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ¯ బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి¯ వేటు లాడుదురు ప్రావీణ్య మొప్ప; (430.1) వన్య జంతు చయంబుల వానివాని¯ పదురు పదురుచు వంచించి పట్టఁబోదు; ¯ రంబుజాకరములఁ జల్లులాడఁ జనుదు; ¯ రా కుమారులు బాల్యవిహారు లగుచు. (431) పోరుదురు గికురు పొడుచుచు; ¯ దూఱుదురు భయంబు లేక తోరపుటిరవుల్; ¯ జాఱుదురు ఘనశిలాతటి; ¯ మీఱుదు రెన్నంగరాని మెఁలకువల నృపా!

వత్సాసుర వధ

(432) అంత నొక్కనాడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులుం దారును గ్రేపుల మేప నొక్క రక్కసుండు క్రేపు రూపున వచ్చి వారల హింసింపం దలంచి. (433) క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ ¯ గ్రేపులలో నిదియె మంచి క్రేపనఁగఁ గడుం¯ జూపట్టి భక్త సంగతిఁ ¯ గ్రేపై చనువాని మ్రోలఁ గ్రేపై తిరిగెన్. (434) వాని నెఱింగి కృష్ణుండు రామునకుం జెప్పి (435) "ఇది యొక మంచిలేగ; వినుఁ డెంతయు నొప్పెడి"నంచు దాని త¯ త్పదములు తోఁకయున్ బిగియఁబట్టి చెలంగి వెలంగ మ్రానితోఁ¯ జదియఁగ నొక్క పెట్టుగొని చంపెఁ గుమారుఁడు లేఁగరక్కసుం¯ గుదులుకొనంగ బాలకులు గోయని యార్వ నఖర్వ లీలతోన్. (436) ఇట్లు రక్కసుండు వ్రేటుపడి విశాలంబగు సాలంబుతో నేలం గూలెను; అప్పుడు (437) గొంగడు లెగురఁగ వైచుచుఁ¯ జంగున దాఁటుచును జెలఁగి చప్పట లిడుచుం¯ బొంగుచుఁ గృష్ణుని బొగడుచు ¯ ద్రుంగిన రక్కసునిఁ జూచి త్రుళ్ళిరి కొమరుల్. (438) ఆ సమయంబున వేలుపులు విరులవానలు గురియించి రివ్విధంబున. (439) వత్సముల పగిది జగముల¯ వత్సలతన్ మనుపఁ జూచువాఁడై యుంటన్¯ వత్సముల మేపు చుండియు¯ వత్సాసురుఁ జంపె భక్తవత్సలుఁ డధిపా! (440) మఱియు నొక్కనాడు రేపకడ గోపకుమారులు క్రేపులం గొంచు నడవికిం జని యెండంబడి మెండుకొనిన దప్పిని బెండుపడిన తమ తమ లేఁగకదుపుల నేర్పరించి నిలువరించుకొని కలంకంబు లేని యొక్క కొలంకున నీరు ద్రావించి తారును జలపానంబు జేసి వచ్చునెడ నందు.

బకాసుర వధ

(441) అకలంకులు బాలురు గని¯ రకుటిలదంభోళిహతసితాద్రి శిఖర రూ¯ పకమున్ హరిహింసారం¯ భకమున్ బకమున్ విశాల భయదాంబకమున్. (442) కని దాని యొడలిపొడవునకు వెఱఁగుపడి చూచుచుండ. (443) ఎల్ల పనులు మాని యేకాగ్రచిత్తుఁ డై¯ మౌనివృత్తి నితర మతము విడిచి¯ వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి¯ చేర్చి బకుఁడు తపసి చెలువుఁ దాల్చె. (444) ఇ వ్విధంబున నొదుగు పెట్టుకొని యుండి. (445) చంచువు దీఁటి పక్షములు జల్లున విచ్చి పదంబు లెత్తి కు¯ ప్పించి నభంబుపై కెగసి, భీషణ ఘోషణ వక్తృడై విజృం¯ భించి గరుత్సమీరమున భిన్నము లై తరులోలిఁ గూలఁగా¯ మించి బకాసురుం డొడిసి మ్రింగె సహిష్ణునిఁ జిన్నికృష్ణునిన్. (446) సంగడి లోకము లన్నియు ¯ మ్రింగుచుఁ గ్రక్కుచును బయల మెలఁగించుచు ను¯ ప్పొంగెడు వేడుకకాఁ డటు ¯ మ్రింగుడుపడె బకునిచేత మీఁ దెఱిఁగి నృపా! (447) దనుజుఁడు మ్రింగినఁ గృష్ణునిఁ¯ గనలేక బలాది బాలకప్రముఖు లచే¯ తనులై వెఱఁ గందిరి చ¯ య్యనఁ బ్రాణములేని యింద్రియంబుల భంగిన్. (448) అట్లు మ్రింగుడుపడి లోనికిం జనక. (449) కంఠోపాంతము దౌడలున్ మెఱముచుం గాలాగ్ని చందంబునం¯ గుంఠీభూతుఁడు గాక వేండ్రమగు నా గోపాలబాలున్ జయో¯ త్కంఠున్ బ్రహ్మగురున్ మహామహిముఁ జక్కం మ్రింగ రాదంచు సో¯ ల్లుంఠం బాడుచు వాఁడు గ్రక్కె వెడలన్ లోకం బశోకంబుగన్. (450) క్రక్కి మహాఘోషముతోఁ¯ జక్కగఁ దనుఁ బొడువరాఁగఁ జంచులు రెండున్¯ స్రుక్కఁగఁ బట్టి తృణము క్రియ ¯ గ్రక్కున హరి చీరె బకునిఁ గలహోత్సుకునిన్. (451) అప్పు డా నందనందనుమీఁద వేలుపులు చాలపులుగా నందన మల్లికాది కుసుమవర్షంబులు హర్షంబునం గురియించిరి; దేవవాద్యంబులు మొరసె; రామాది గోపకుమారులు ప్రాణంబులతోఁ గూడిన యింద్రియంబులునుం బోలెఁ గ్రమ్మఱ కృష్ణునిం గని రమ్మని కౌఁగిలించుకొని కృష్ణసహితులయి లేఁగదాఁటుల మరల దాఁటించుకొని మందగమనంబున మంద కరిగిరి; వారలచేత నా వృత్తాంతం బంతయు విని వెఱంగుపడి గోపగోపికాజనంబులు. (452) “ఆపదలమీఁద నాపద¯ లీ పాపనిఁ జెంది తొలఁగె; నీ యర్భకుపై¯ వే పడిన ఖలులు దహనుని¯ వైపున శలభముల పగిదిఁ బడిరి ధరిత్రిన్.” (453) అని పలికిరి; మఱియు నా రామకృష్ణులు క్రేపులం గాచు తఱి. (454) కపులమై జలరాశిఁ గట్టుదమా యని¯ కట్టుదు రడ్డంబు కాలువలకు; ¯ మునులమై తపములు మొనయుదమా యని¯ మౌనులై యుందురు మాటలేక; ¯ గంధర్వవరులమై గానవిద్యలు మీఱఁ¯ బాడుదమా యని పాడఁ జొత్తు; ¯ రప్సరోజనులమై యాడుదమా యని¯ యాఁడు రూపముఁ దాల్చి యాఁడఁ జనుదు; (454.1) రమర దైత్యవరులమై యబ్ధిఁ ద్రత్తమా¯ యని సరోవరముల యందు హస్త¯ దండచయముఁ ద్రిప్పి తరుతురు తమ యీడు¯ కొమరు లనుచరింపఁ గొమరు మిగుల.

చల్దులు గుడుచుట

(455) అంత నొక్కనాఁడు రామకృష్ణులు కాంతారంబున బంతిచల్దులు గుడువ నుద్యోగించి ప్రొద్దున లేచి, గ్రద్దనం దమ యింటి లేఁగకదుపులం గదలించి, సురంగంబులగు శృంగంబులు పూరించిన విని, మేలుకని, సంరంభంబున గోపడింభకులు చలిది కావడులు మూఁపున వహించి, సజ్జంబులగు కజ్జంబులు గట్టుకొని పదత్రాణ వేత్రదండంధరులయి, లెక్కకు వెక్కసంబైన తమతమ క్రేపుకదుపులం జప్పుడించి రొప్పుకొనుచు, గాననంబు జొచ్చి, కాంచనమణి పుంజగుంజాది భూషణ భూషితులయ్యును, ఫల కుసుమ కోరక పల్లవ వల్లరులు తొడవులుగా నిడుకొని, కొమ్ములి మ్ముగఁ బూరించుచు వేణువు లూఁదుచుఁ, దుమ్మెదలం గూడి పాడుచు, మయూరంబులతోడం గూడి యాడుచుఁ, బికంబులం గలసి కూయుచు, శుకంబులం జేరి రొదలు జేయుచుఁ, బులుగుల నీడలం బాఱుచుఁ, బొదరిండ్లం దూఱుచు సరాళంబులగు వాఁగులు గడచుచు, మరాళంబుల చెంత నడచుచు, బకమ్ములం గని నిలుచుచు, సారసంబులం జోపి యలంచుచు, నదీజలంబులం దోఁగుచుఁ, దీగె యుయ్యెలల నూఁగుచు, బల్లంబులం డాఁగుచు, దూరంబుల కేగుచుఁ, గపుల సంగడిఁ దరువులెక్కుచు ఫలంబులు మెక్కుచు రసంబులకుంజొక్కుచు నింగికి న్నిక్కుచు నీడలు చూచి నవ్వుచుఁ, గయ్యంబులకుం గాలుదువ్వుచు, చెలంగుచు, మెలంగుచు, వ్రాలుచు, సోలుచు బహుప్రకారంబుల శరీర వికారంబులు జేయుచు మఱియును. (456) ఒకనొకని చల్దికావిడి¯ నొకఁ డొకఁ డడకించి దాఁచు; నొకఁ డొకఁ డది వే¯ ఱొక డొకని మొఱఁగికొని చను¯ నొక డొకఁ డది దెచ్చి యిచ్చు నుర్వీనాథా! (457) ఒక్కఁడు ము న్నేమఱి చన¯ నొక్కఁడు బలుబొబ్బ వెట్టు నులికిపడన్; వే¯ ఱొక్కఁడు మిట్టి తటాలున¯ నొక్కని కనుదోయి మూయు నొక్కఁడు నగఁగన్. (458) తీపుగల కజ్జ మన్యుఁడు¯ కోపింపఁగ నొడిసి పుచ్చుకొని త్రోపాడం¯ బైపడి యది గొని యొక్కఁడు ¯ క్రేపులలో నిట్టునట్టుఁ గికురించు నృపా! (459) వనజాక్షుఁడు ము న్నరిగిన¯ మునుపడఁగా నతని నేనె ముట్టెద ననుచుం¯ జని మునుముట్టనివానిన్¯ మునుముట్టినవాఁడు నవ్వు మొనసి నరేంద్రా! (460) ఇ వ్విధంబున. (461) ఎన్నఁడునైన యోగివిభు లెవ్వని పాదపరాగ మింతయుం¯ గన్నులఁ గాన రట్టి హరిఁ గౌఁగిఁటఁ జేర్చుచుఁ జెట్టఁ బట్టుచుం¯ దన్నుచు గ్రుద్దుచున్ నగుచుఁ దద్దయుఁ బైఁపడి కూడి యాడుచుం¯ మన్నన జేయు వల్లవకుమారుల భాగ్యము లింత యొప్పునే? (462) విందులకును బ్రహ్మసుఖా¯ నందం బై భక్తగణమునకు దైవత మై¯ మందులకు బాలుఁ డగు హరి¯ పొందుఁ గనిరి గొల్ల; లిట్టి పుణ్యులు గలరే?"

అఘాసుర వధ

(463) అని పలికి శుకయోగీంద్రుండు మఱియు ని ట్లనియె. (464) "అమరు లమృతపానంబున¯ నమరిన వా రయ్యు నే నిశాటుని పంచ¯ త్వమునకు నెదుళ్ళు చూతురు¯ తము నమ్మక యట్టి యఘుఁడు దర్పోద్ధతుఁడై. (465) బకునికిఁ దమ్ముఁడు గావున¯ బకమరణముఁ దెలిసి కంసు పంపున గోపా¯ లక బాలురఁతోఁ గూఁడను¯ బకవైరినిఁ ద్రుంతు ననుచుఁ బటురోషమునన్. (466) "బాలురు ప్రాణంబులు గో¯ పాలురకు; మదగ్రజాతు ప్రాణము మా ఱీ¯ బాలురఁ జంపిన నంతియ¯ చాలును; గోపాలు రెల్ల సమసిన వారల్." (467) అని నిశ్చయించి, యోజనంబు నిడుపును, మహాపర్వతంబు పొడుపును, గొండతుదల మీఱిన కోఱలును, మిన్నుదన్ని పన్నిన నల్ల మొగిళ్ళ పెల్లుగల పెదవులును, బిలంబులకు నగ్గలంబు లయిన యిగుళ్ళ సందులును, నంధకారబంధురంబయిన వదనాంతరాళంబును, దావానల జ్వాలాభీలంబయిన దృష్టిజాలంబును, వేఁడిమికి నివాసంబులయిన యుచ్ఛ్వాస నిశ్వాసంబులును మెఱయ, నేల నాలుకలు పఱచుకొని ఘోరంబగు నజగ రాకారంబున. (468) "జాపిరము లేక యిప్పుడు ¯ గ్రేపుల గోపాలసుతులఁ గృష్ణునితోడన్¯ గీపెట్టఁగ మ్రింగెద" నని¯ పాపపు రక్కసుఁడు త్రోవఁ బడి యుండె నృపా! (469) ఆ సమయంబున. (470) "ఒక వన్యాజగరేంద్ర మల్లదె గిరీంద్రోత్సేధ మై దావ పా¯ వక కీలా పరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోర వ¯ హ్ని కరాళాతత జిహ్వతోడ మనలన్ హింసింప నీక్షించుచున్¯ వికటంబై పడి సాగి యున్నది పురోవీధిం గనుంగొంటిరే?" (471) అని యొండొరులకుం జూపుచు. (472) "బకునిం జంపిన కృష్ణుఁ డుండ మనకుం బామంచుఁ జింతింప నే¯ టికి? రా పోదము దాఁటి; కాక యది కౌటిల్యంబుతో మ్రింగుడున్¯ బకువెంటం జనుఁ గృష్ణుచేత" ననుచుం బద్మాక్షు నీక్షించి యు¯ త్సుకులై చేతులు వ్రేసికొంచు నగుచున్ దుర్వారులై పోవగన్. (473) వారలం జూచి హరి తన మనంబున. (474) “అర్భకు లెల్లఁ బాము దివిజాంతకుఁ డౌట యెఱుంగ; రక్కటా! ¯ నిర్భయులై యెదుర్కొనిరి నేఁ గల” నంచు “విమూఢు” లంచు నా¯ విర్భవదాగ్రహత్వమున వెందగులన్ దమ లేఁగపిండుతో¯ దుర్భర ఘోర సర్ప ఘన తుండ బిలాంతముఁ జొచ్చి రందఱున్. (475) అ య్యవసరంబున. (476) వేల్పుల్ చూచి భయంబు నొంద గ్రసనావేశంబుతో నుజ్జ్వల¯ త్కల్పాంతోజ్జ్వలమాన జిహ్వ దహనాకారంబుతో మ్రింగె న¯ స్వల్పాహీంద్రము మాధవార్పిత మనోవ్యాపార సంచారులన్¯ యల్పాకారుల శిక్యభారులఁ గుమారాభీరులన్ ధీరులన్. (477) ఇట్లు పెనుబాముచేత మ్రింగుడుపడు సంగడికాండ్ర గమిం జూచి కృష్ణుండు. (478) “పడుచులు లేఁగలుం గలసి పైకొని వత్తురు తొల్లి కృష్ణ! మా¯ కొడుకు లదేల రా; రనుచు గోపిక లెల్లను బల్క నేక్రియన్¯ నొడివెద? నేఁడు పన్నగము నోరికి వీరికి నొక్కలంకెగా¯ నొడఁబడ నేలచేసె? విధి యోడక జేయుఁగదయ్య! క్రౌర్యముల్.” (479) అని తలపోసి, నిఖిలలోచనుండును, నిజాశ్రిత నిగ్రహమోచనుండు నైన తమ్మికంటి, మింటి తెరువరులు మొఱలిడ రక్కసు లుక్కుమిగుల వెక్కసంబగు నజగరంబయి యున్న య న్నరభోజను కుత్తుకకుం బొత్తుగొని మొత్తంబు వెంటనంటం జని తమ్ము నందఱఁ జిందఱ వందఱ చేసి మ్రింగ నగ్గలించు నజగరంబు కంఠద్వారంబున సమీరంబు వెడలకుండఁ దన శరీరంబుఁ బెంచి గ్రద్ధన మిద్దెచఱచి నట్లుండ. (480) ఊపిరి వెడలక కడుపున¯ వా పొదవినఁ బాము ప్రాణవాతంబులు సం¯ తాపించి శిరము వ్రక్కలు¯ వాపికొనుచు వెడలి చనియెఁ బటు ఘోషముతోన్. (481) క్రూరవ్యాళ విశాల కుక్షిగతులన్ గోవత్ససంఘంబుతో¯ గారుణ్యామృతవృష్టిచేత బ్రతుకంగాఁ జూచి వత్సంబులున్¯ వారుం దాను దదాస్యవీధి మగుడన్ వచ్చెన్ ఘనోన్ముక్తుఁడై¯ తారానీకముతోడ నొప్పెసఁగు నా తారేశు చందంబునన్. (482) అమరవరులకొఱకుఁ గమలజాండం బెల్ల¯ బలిఁ దిరస్కరించి బలియు వడుగు¯ గోపసుతులకొఱకుఁ బాపపుఁ బెనుబాము¯ గళము దూఁటుగట్ట బలియకున్నె? (483) ఆ పెనుబాము మేన నొక యద్భుతమైన వెలుంగు దిక్తటో¯ ద్దీపకమై వడిన్ వెడలి దేవపథంబునఁ దేజరిల్లుచున్¯ క్రేపులు బాలురున్ బెదరఁ గృష్ణుని దేహము వచ్చి చొచ్చె నా¯ పాపఁడు చొచ్చి ప్రాణములఁ బాపిన యంతన శుద్ధసత్వమై. (484) తన రూ పొకమా ఱైనను¯ మనమున నిడుకొనినఁ బాపమయు నైనను లోఁ¯ గొనిచను హరి తను మ్రింగిన¯ దనుజునిఁ గొనిపోవకున్నె తనలోపలికిన్?

సురలు పూలు గురియించుట

(485) తదవసరంబున, సురలు కుసుమ వర్షంబులు గురియించిరి; రంభాదు లాడిరి; గంధర్వాదులు పాడిరి; మేఘంబులు మృదంగంబుల భంగి ఘోషించె; సిద్ధ గణంబులు జయజయ భాషణంబులు భాషించి; రంత. (486) ఆ వాద్యంబులు, నా మహాజయరవం, బా పాట, లా యాటలున్¯ దేవజ్యేష్ఠుఁడు పద్మజుండు విని ప్రీతిన్ భూమి కేతెంచి "నే¯ డీ వత్సార్భకులన్ భుజంగపతి హింసింపంగ నీ బాలకుం¯ డేవెంటన్ బ్రతికించె? మే", లనుచు నూహించెం గడుం నివ్వెఱన్. (487) అంత న య్యజగర చర్మంబు కొన్ని దివసంబుల కెండి పెద్దకాలంబు గోపాలబాలురకు కేళీబిలంబై యుండె; నిట్లు కౌమార విహారంబుల నైదవ యేటఁ గృష్ణుం డఘాసురునిం దెగఁ జూచుటయుఁ దమ్ముంగాచుటయు నాఱవయేటిదైన పౌగండవృత్తాంతం బని చిత్తంబుల గోపకుమారులు దలంచుచుందు” రని చెప్పిన న ప్పుడమిఱేఁ డ ప్పరమయోగీంద్రున కిట్లనియె. (488) "అయిదేండ్లు కౌమార; మటమీఁద నయిదేండ్లు¯ పౌగండ మనియెడు ప్రాయ మందు; ¯ నయిదేండ్లవాడైఁన యబ్జాక్షుచరితంబు¯ పౌగండ మని గోపబాలు రెల్లఁ¯ దలఁతు రంటివి యెట్లు తలతురు వారలు?¯ నిరుడు చేసిన పని నేటి దనఁగ¯ వచ్చునే? యిది నాకు వరుసతో నెఱిఁగింపు"¯ మనవుడు యతిచంద్రుఁడైన శుకుఁడు (488.1) యోగ దృష్టిఁజూచి యొక్కింత భావించి¯ "వినుము రాజవర్య! వినయధుర్య! ¯ పరమగుహ్య మనుచుఁ బలుకుదు రార్యులు¯ శిష్యజనుల కీవు జేయు తలఁపు." (489) ప్రియురాలివలని వార్తలు ¯ ప్రియజనులకు నెల్లప్రొద్ధుఁ బ్రియ మగు భంగిన్¯ ప్రియుఁడగు హరిచరితంబులు ¯ ప్రియభక్తుల కెల్లయెడలఁ బ్రియములు గావే? (490) అని పలికి యోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె; "న ట్లఘాసురు మొగంబువలనం గడచి చనిన లేఁగల గోపకుమారులం బ్రతికించి వారును దానునుం జని చని. (491) కనియెం గృష్ణుఁడు సాధునీరము మహాగంభీరముం బద్మకో¯ కనదాస్వాద వినోద మోద మదభృంగ ద్వంద్వ ఝంకారమున్¯ ఘనకల్లోల లతావితాన విహరత్కాదంబ కోలాహల¯ స్వనవిస్ఫారము మందవాయుజ కణాసారంబుఁ గాసారమున్. (492) కని తమ్మికంటి తమ్ముల యింటి సొబగునకు నిచ్చ మెచ్చుచుఁ జెచ్చెర గాలి నోలిం గదలెడు కరళ్ళ తుంపురుల జల్లు పెల్లున నొడళ్ళు గగుర్పొడువఁ గొలంకు కెలంకులఁ గాయ పండుల గెలల వ్రేగున వీఁగి పట్టుగల చెట్టుతుటుము నీడల నొప్పుచున్న యిసుక తిప్పల విప్పుఁ జూచి వేడుక పిచ్చలింప నెచ్చెలుల కిట్లనియె.

చల్దు లారగించుట

(493) "ఎండన్ మ్రగ్గితి రాఁకటం బడితి రింకేలా విలంబింపఁగా¯ రండో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్క డీ¯ దండన్ లేఁగలు నీరు ద్రావి యిరవందం బచ్చికల్ మేయుచుం¯ దండంబై విహరించుచుండఁగ నమందప్రీతి భక్షింతమే?" (494) అనిన “నగుఁగాక” యని వత్సంబుల నుత్సాహంబున నిర్మలంబు లగు జలంబులు ద్రావించి, పచ్చికల మొల్లంబులుగల పల్లంబుల నిలిపి చొక్కంబులగు చల్దిచిక్కంబులు చక్కడించి. (495) జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులై యున్న ఱే¯ కుల చందంబునఁ గృష్ణునిం దిరిగిరాఁ గూర్చుండి వీక్షించుచున్¯ శిలలుం బల్లవముల్ దృణంబులు లతల్ చిక్కంబులుం బువ్వు లా¯ కులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవరా! (496) మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు¯ నూరుఁగాయలు దినుచుండు నొక్క; ¯ డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి¯ "చూడు లే"దని నోరు చూపునొక్కఁ; ¯ డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి¯ కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ; ¯ డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన¯ మనుచు బంతెనగుండు లాడు నొకఁడు; (496.1) "కృష్ణుఁ జూడు"మనుచుఁ గికురించి పరు మ్రోల¯ మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు; ¯ నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు నొక్కఁడు; ¯ ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు. (497) అ య్యవసరంబున. (498) కడుపున దిండుగాఁ గట్టిన వలువలో¯ లాలిత వంశనాళంబు జొనిపి¯ విమల శృంగంబును వేత్రదండంబును¯ జాఱి రానీక డాచంక నిఱికి¯ మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది¯ ముద్ద డాపలిచేత మొనయ నునిచి¯ చెలరేఁగి కొసరి తెచ్చిన యూరుగాయలు¯ వ్రేళ్ళ సందులయందు వెలయ నిఱికి (498.1) సంగడీల నడుమఁ జక్కగఁ గూర్చుండి¯ నర్మభాషణముల నగవు నెఱపి¯ యాగభోక్త కృష్ణుఁ డమరులు వెఱఁగంద¯ శైశవంబు మెఱసి చల్ది గుడిచె. (499) ఇట్లు కృష్ణసహితు లయిన గోపకుమారులు చల్దులు గుడుచునెడఁ గ్రేపులు మేపులకుం జొచ్చి, పచ్చని గఱికిజొంపంబుల గుంపుల కుఱికి, లంపులు మేయుచు, ఘోరంబగు నరణ్యంబు నడుమం దోరంబగు దూరంబు జనిన, వానింగానక వెఱచుచున్న గోపడింభకులకు నంభోజనయనుం డిట్లనియె.

క్రేపుల వెదక బోవుట

(500) “వినుఁ డో! బాలకులార! క్రేపు లటవీవీధిన్ మహా దూరముం¯ జనియెన్ గోమల ఘాసఖాదన రతోత్సాహంబుతో నెందుఁ బో¯ యెనొ? యే మయ్యెనొ క్రూరజంతువులచే నే యాపదం బొందెనో? ¯ కని తెత్తుం గుడువుండు చల్ది గొఱఁతల్ గాకుండ మీ రందఱున్.” (501) అని చెప్పి, (502) కర్ణాలంబిత కాక పక్షములతో గ్రైవేయహారాళితో¯ స్వర్ణాభాసిత వేత్రదండకముతో సత్పింఛదామంబుతోఁ¯ బూర్ణోత్సాహముతో ధృతాన్నకబళోత్ఫుల్లాబ్జహస్తంబుతోఁ¯ దూర్ణత్వంబున నేఁగె లేఁగలకునై దూరాటవీవీధికిన్. (503) ఇ ట్లేగుచు. (504) "ఇచ్చోఁ బచ్చిక మేసిన; ¯ విచ్చోఁ ద్రావినవి తోయ; మేగిన విచ్చో; ¯ నిచ్చోట మంద గొన్నవి; ¯ యిచ్చోఁ బాసినవి; జాడ యిదె యిదె" యనుచున్. (505) కంజదళాక్షుఁడు వెదకెను¯ గొంజక లేఁగల నపార గురుతృణవనికా¯ పుంజంబుల భీకర మృగ ¯ కుంజంబుల దరుల గిరులఁ గొలఁకుల నదులన్. (506) అంత.

బ్రహ్మ వత్స బాలకుల దాచుట

(507) "బాలుం డయ్యు నితం డఘాసురుఁడు ద్రుంపన్ బాలురం గ్రేపులన్¯ యేలీలన్ బ్రతికించెనొక్కొ? భువి నూహింపం గడుం జోద్య" మం¯ చాలో నంబుజసంభవుండు చని మాయా బాలు శుంభద్బలం¯ బాలోకింపఁ దలంచి డాఁచె నొకచో నా లేఁగలన్ బాలురన్. (508) ఆ సమయంబున, దూడలు పోయిన జాడ యెఱుంగక, తప్పి య ప్పద్మలోచనుం డెప్పటి కొలంకుకడకు వచ్చి, యచ్చోట నె నెచ్చెలులం గానక వారిం జీరి, లేకుండుట నిశ్చయించి గోవిందుండు విశ్వవిదుండు గావున నిది విరించి మొఱంగని యెఱింగి తిరిగి పోవుచు. (509) "వంచింపం బనిలేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులన్ బాలురన్¯ వంచించెం గనుఁ బ్రామి; తన్ను మరలన్ వంచించు టాశ్చర్యమే? ¯ వంచింపం మనకేల? తెచ్చుటకునై వ"ల్దంచు బ్రహ్మాండము¯ ల్వంచింపన్ మరలింప నేర్చు హరి లీలన్ మందహాసాస్యుఁడై. (510) "గోపాలసుతులు లే రని¯ గోపికలకుఁ జెప్ప నేల? గోపాలకులున్¯ గోపికలు నలర బాలుర ¯ క్రేపులరూపముల నేఁ జరించెద ననుచున్. "

వత్స బాలకుల రూపు డగుట

(511) కరముల్ పాదములున్ శిరంబు లవలగ్నంబుల్ ముఖంబుల్ భుజాం¯ తరముల్ ముక్కులు గన్నులుం శ్రవణముల్ దంతాదులున్ దండ కాం¯ బర స్రగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన త¯ త్పరతల్ వీడ్వడకుండఁ దాల్చె విభుఁ డా వత్సార్భకాకారముల్. (512) రూపంబు లెల్ల నగు బహు¯ రూపకుఁ డిటు బాలవత్సరూపంబులతో¯ నేపారు టేమి చోద్యము? ¯ రూపింపఁగ నతని కితరరూపము గలదే? (513) మరలుపు మనియెడు కర్తయు¯ మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్¯ పరికింపఁ దాన యై హరి¯ మరలం జనె లీలతోడ మందకు నధిపా! (514) ఇట్లు బాలవత్సరూపంబులతో విహరించుచు మందకు వచ్చి వారివారి దొడ్ల నయ్యై వత్సంబుల ముందఱి కందువల నిలిపి, తత్తద్బాలరూపంబుల నందఱి గృహంబులం బ్రవేశించి వేణునాదంబులు చేసిన. (515) కొడుకుల వేణునాదములు గొబ్బున వీనులకుం బ్రియంబు లై¯ ముడిపడ లేచి యెత్తుకొని మూర్కొని తల్లులు గౌగలించుచుం¯ జడిగొనఁ జేపువచ్చి తమచన్నుల యందు సుధాసమంబు లై¯ వెడిలెడి పాలు నిండుకొనువేడుక నిచ్చిరి తత్సుతాళికిన్. (516) మఱియుఁ దల్లు లుల్లంబులం బెల్లుగ వెల్లిగొనిన వేడుకలం దమనందనులకు నలుంగు లిడి, మజ్జనంబులు గావించి, గంధంబు లలంది తొడవులు దొడిగి నిటలతటంబుల రక్షాతిలకంబులు పెట్టి, సకలపదార్థసంపన్నంబులైన యన్నంబు లొసంగి సన్నములు గాని మన్ననలు చేసిరి. (517) ఏ తల్లుల కే బాలకు¯ లే తెఱఁగునఁ దిరిగి ప్రీతి నెఁసగింతురు ము¯ న్నా తల్లుల కా బాలకు¯ లా తెఱఁగునఁ బ్రీతిఁ జేసి రవనీనాథా! (518) ఆ సమయంబున. (519) పాయని వేడ్కతో నునికిపట్టులకుం జని గోవులెల్ల నం¯ బే యని చీరి హుమ్మనుచుఁ బేరిచి మూర్కొని పంచితిల్లి పె¯ ల్లై యతిరేకమై పొదుగులం దెడలేక స్రవించుచున్న పా¯ లాయెడ నాకుచున్ సుముఖలై యొసఁగెన్ నిజవత్సకోటికిన్. (520) వ్రేతలకును గోవులకును ¯ మాతృత్వము జాలఁ గలిగె మఱి మాధవుపై¯ మాత లని హరియు నిర్మల¯ కౌతూహల మొప్పఁ దిరిగెఁ గడు బాల్యమునన్. (521) ఘోషజనుల కెల్లఁ గుఱ్ఱలపై వేడ్క¯ పూఁటపూఁట కెలమిఁ బొటకరించె¯ నిచ్చ గ్రొత్త యగుచు నీరజాక్షునిమీఁద¯ వేడ్క దమకుఁ దొల్లి వెలసినట్లు. (522) ఇట్లు కృష్ణుండు బాలవత్సరూపంబులు దాల్చి తన్నుఁ దాన రక్షించుకొనుచు, మందను వనంబున నమంద మహిమంబున నొక్క యేఁడు గ్రీడించె, నా యేటికి నైదాఱు దినంబులు కడమపడి యుండ నం దొక్కనాఁడు బలభద్రుండును, దానును వనంబునకుం జని మందచేరువ లేఁగల మేప నతి దూరంబున గోవర్థన శైలశిఖరంబున ఘాసంబులు గ్రాసంబులు గొనుచున్న గోవు లా లేఁగలం గని. (523) ముదమున హుంకరించుచును; మూఁపులపై మెడ లెత్తి చాఁచుచున్¯ బదములు నాల్గు రెండయిన బాగునఁ గూడఁగ బెట్టి దాఁటుచున్¯ వదనములన్ విశాలతర వాలములన్ వడి నెత్తి పాఱి యా¯ మొదవులు చన్నులంగుడిపె మూఁతుల మ్రింగెడిభంగి నాకుచున్. (524) అంత గోపకులు గోవుల వారింప నలవి గాక దిగ్గన నలుకతోడి సిగ్గు లగ్గలంబుగ దుర్గమ మార్గంబున వానివెంట నంటి వచ్చి లేఁగల మేపుచున్న కొడుకులం గని. (525) అయ్యలఁ గంటి మంచుఁ బులకాంకురముల్ వెలయంగఁ గుఱ్ఱలం¯ జయ్యన డాసి యెత్తికొని సంతస మందుచుఁ గౌగలింపఁ దా¯ రయ్యెడ నౌదలల్ మనము లారఁగ మూర్కొని ముద్దు చేయుచున్¯ దయ్య మెఱుంగు; గోపకులు దద్దయు నుబ్బిరి నిబ్బరంబుగన్. (526) ఇట్లు బాలకాలింగనంబుల నానందబాష్పపూరిత నయనులై గోపకులు గోవుల మరలించుకొని తలంగిచన వారలం జూచి బలభ ద్రుండు తనలోఁ నిట్లని తలంచె.

బలరాము డన్న రూ పెరుగుట

(527) "చన్ను మానిన యట్టి శాబకశ్రేణిపై¯ గోగణంబులకును గోపకులకు¯ నిబ్బంగి వాత్సల్య మెబ్బంగి నుదయించె?¯ హరిఁ దొల్లి మన్నించునట్లు వీరు¯ మన్నించు చున్నారు మమతఁ జేయుచుఁ బ్రీతి¯ నంబుజాక్షునిఁ గన్న యట్లు నాకుఁ ¯ బ్రేమయయ్యెడి, డింభబృందంబుఁ గనుఁగొన్న¯ నిది మహాద్భుత మెందు నెఱుఁగరాదు (527.1) మనుజ దైవత దానవ మాయ యొక్కొ? ¯ కాక నా భర్త యగుచున్న కమలనయను¯ మాయయో గాక యితరులమాయ నన్నుఁ¯ గలఁప నోపదు; విభుమాయ కాఁగ నోపు." (528) అని మున్ను ముగ్ధుఁ డయ్యును¯ దన యందుల దివ్యదృష్టిఁ దప్పక బుద్ధిన్¯ దన చెలికాండ్రను గ్రేపుల¯ వనజాక్షుం డనుచుఁ జూచె వసుధాధీశా! (529) ఇట్లు విజ్ఞానదష్టిం జూచి యెఱింగియు నమ్మక బలదేవుండు గొందలపడుచుఁ గృష్ణుం జూచి “మహాత్మా! తొల్లి యెల్ల క్రేపులును ఋషుల యంశం బనియును గోపాలకులు వేల్పుల యంశం బనియును దోఁచుచుండు; నిపుడు వత్సబాలకసందోహంబు సందేహంబు లేక నీవ యని తోఁచుచున్నది; యిది యేమి?” యని యడిగిన యన్నకు నున్నరూపంబు వెన్నుండు మన్ననఁ జేసి క్రన్నన నెఱింగించె నతండు నెఱింగె; యివ్వింధంబున హరి బాల వత్సంబులు దాన యై సంచరించిన యేఁడు విరించికిఁ దన మానంబున నొక్క త్రుటిమాత్రం బైన విరించి చనుదెంచి వత్సబాలకాకారుండైన కృష్ణబాలకుం జూచి వెఱంగుపడి యిట్లని వితర్కించె.