పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 1763- సంపూర్ణం

రుక్మి యనువాని భంగంబు

(1763) అని యిట్లు జరాసంధుండు నతని యొద్ది రాజులును శిశుపాలుని పరితాపంబు నివారించి, తమతమ భూములకుం జనిరి; శిశుపాలుండు ననుచర సేనాసమేతుండయి తన నగరంబునకుం జనియె నంత రుక్మి యనువాఁడు కృష్ణుండు రాక్షసవివాహంబునం దన చెలియలిం గొనిపోవుటకు సహింపక, యేకాక్షౌహిణీబలంబుతోడ సమరసన్నాహంబునం గృష్ణుని వెనుదగిలి పోవుచుఁ దన సారథితో యిట్లనియె. (1764) "బల్లిదు, నన్ను భీష్మజనపాల కుమారకుఁ జిన్నచేసి నా¯ చెల్లెలి రుక్మిణిం గొనుచుఁ జిక్కని నిక్కపు బంటుబోలె నీ¯ గొల్లఁడు పోయెడిన్; రథము గూడఁగఁ దోలుము; తేజితోల్లస¯ ద్భల్ల పరంపరన్ మదముఁ బాపెదఁ జూపెద నా ప్రతాపమున్." (1765) అని యిట్లు రుక్మి హరి కొలంది యెఱుంగక సారథి నదలించి రథంబుఁ గూడం దోలించి "గోపాలక! వెన్నమ్రుచ్చ! నిమిషమాత్రంబు నిలు నిలు” మని ధిక్కరించి, బలువింట నారి యెక్కించి మూడు వాఁడి తూపుల హరి నొప్పించి యిట్లనియె. (1766) "మా సరివాఁడవా మా పాపఁ గొనిపోవ?¯ నేపాటి గలవాడ? వేది వంశ? ¯ మెందు జన్మించితి? వెక్కడఁ బెరిగితి?¯ వెయ్యది నడవడి? యెవ్వఁ డెఱుఁగు? ¯ మానహీనుఁడ వీవు; మర్యాదయును లేదు¯ మాయఁ గైకొని కాని మలయ రావు; ¯ నిజరూపమున శత్రునివహంబుపైఁ బోవు¯ వసుధీశుఁడవు గావు వావి లేదు; (1766.1) కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు¯ విడువు; విడువవేని విలయకాల¯ శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల¯ గర్వ మెల్లఁ గొందుఁ గలహమందు." (1767) అని పలికిన నగధరుండు నగి, యొక్క బాణంబున వాని కోదండంబు ఖండించి, యాఱు శరంబుల శరీరంబు దూఱనేసి, యెనిమిది విశిఖంబుల రథ్యంబులం గూల్చి, రెండమ్ముల సారథింజంపి, మూడువాఁడి తూపులం గేతనంబుఁ ద్రుంచి మఱియు నొక్క విల్లందినం ద్రుంచి, వెండియు నొక్క ధనువు పట్టిన విదళించి క్రమంబునఁ బరిఘ పట్టిస శూల చర్మాసి శక్తి తోమరంబులు ధరియించినం దునుకలు సేసి క్రమ్మఱ నాయుధంబు లెన్ని యెత్తిన నన్నియు శకలంబులు గావించె; నంతటం దనివిజనక వాఁడు రథంబు డిగ్గి ఖడ్గహస్తుండై దవానలంబుపైఁ బడు మిడుత చందంబునం గదిసిన ఖడ్గ కవచంబులు చూర్ణంబులు చేసి, సహింపక మెఱుంగులు చెదర నడిదంబు పెఱికి జళిపించి వాని శిరంబు తెగవ్రేయుదు నని గమకించి, నడచుచున్న నడ్డంబు వచ్చి రుక్మిణీదేవి హరిచరణారవిందంబులు పట్టుకొని యిట్లనియె. (1768) "నిన్నునీశ్వరు దేవదేవుని నిర్ణయింపఁగ లేక యో¯ సన్నుతామలకీర్తిశోభిత! సర్వలోకశరణ్య! మా¯ యన్న యీతఁడు నేడు చేసె మహాపరాధము నీ యెడన్¯ నన్ను మన్నన చేసి కావు మనాథనాథ! దయానిథీ! (1769) కల్ల లేదని విన్నవించుట గాదు వల్లభ! యీతనిన్¯ బ్రల్లదుం దెగఁజూచితేనియు భాగ్యవంతుల మైతి మే¯ మల్లుఁ డయ్యె ముకుందుఁ డీశ్వరుఁ డంచు మోదితు లైన మా¯ తల్లిదండ్రులు పుత్ర శోకముఁ దాల్చి చిక్కుదు రీశ్వరా!" (1770) అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో¯ వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీ కలాపంబుతోఁ¯ గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ¯ క్కిన రుక్మిం దెగ వ్రేయఁబోక మగిడెన్ గృష్ణుండు రోచిష్ణుఁడై. (1771) ఇట్లు చంపక "బావా! ర"మ్మని చిఱునగవు నగుచు వానిం, బట్టి బంధించి, గడ్డంబును మీసంబునుం దలయును నొక కత్తివాతి యమ్మున రేవులువాఱఁ గొఱిగి విరూపిం జేసె; నంతట యదువీరులు పరసైన్యంబులం బాఱఁదోలి, తత్సమీపంబునకు వచ్చి; రప్పుడు హతప్రాణుండై కట్టుబడి యున్న రుక్మిం జూచి కరుణజేసి, కామపాలుండు వాని బంధంబులు విడిచి హరి డగ్గఱి యిట్లనియె. (1772) "తల మనక భీష్మనందనుఁ¯ దలయును మూతియును గొఱుగఁ దగవే? బంధుం¯ దలయును మూతియు గొఱుగుట¯ తల తఱుఁగుటకంటెఁ దుచ్ఛతరము మహాత్మా! (1773) కొందఱు రిపు లని కీడును; ¯ గొందఱు హితు లనుచు మేలుఁ గూర్పవు; నిజ మీ¯ వందఱి యందును సముఁడవు; ¯ పొందఁగ నేలయ్య విషమబుద్ధి? ననంతా!" (1774) అని వితర్కించి పలికి రుక్మిణీదేవి నుపలక్షించి యిట్లనియె. (1775) "తోడంబుట్టినవాని భంగమునకున్ దుఃఖించి మా కృష్ణు నె¯ గ్గాడం జూడకు మమ్మ! పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం¯ గీడున్ మేలునుఁ జెందు; లేఁ డొకఁడు శిక్షింపంగ రక్షింప నీ¯ తోడంబుట్టువు కర్మశేష పరిభూతుం డయ్యె నే డీ యెడన్." (1776) "చంపెడి దోషము గలిగినఁ¯ జంపఁ జనదు బంధుజనులఁ జను విడువంగాఁ¯ జంపిన దోషము సిద్ధము¯ చంపఁగ మఱి యేల మున్న చచ్చిన వానిన్. (1777) బ్రహ్మచేత భూమిపతుల కీ ధర్మంబు¯ గల్పితంబు రాజ్యకాంక్షఁ జేసి¯ తోడిచూలు నైనఁదోడఁ బుట్టినవాఁడు¯ చంపుచుండుఁ గ్రూర చరితుఁ డగుచు. (1778) భూమికి ధన ధాన్యములకు¯ భామలకును మానములకుఁ బ్రాభవములకుం¯ గామించి మీఁదుఁ గానరు ¯ శ్రీ మదమున మానధనులు చెనఁకుదు రొరులన్. (1779) వినుము, దైవమాయం జేసి దేహాభిమానులైన మానవులకుం బగవాఁడు బంధుండు దాసీనుండు నను భేదంబు మోహంబున సిద్ధం బయి యుండు జలాదుల యందుఁ జంద్రసూర్యాదులును ఘటాదులందు గగనంబును బెక్కులై కానంబడు భంగి దేహధారుల కందఱకు నాత్మ యొక్కండయ్యును బెక్కండ్రై తోఁచు; నాద్యంతంబులు గల యీ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంబై, యాత్మ యందు నవిద్య చేతఁ గల్పితంబై, దేహిని సంసారంబునం ద్రిప్పు సూర్యుండు తటస్థుండై యుండం బ్రకాశమానంబులైన దృష్టి రూపంబులుంబోలె నాత్మ తటస్థుండై యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబు లగు నాత్మకు వేఱొక్కటితోడ సంయోగవియోగంబులు లేవు వృద్ధి క్షయంబులు చంద్రకళలకుంగాని చంద్రునికి లేని కైవడి జన్మనాశంబులు దేహంబునకుంగాని యాత్మకుఁ గలుగనేరవు; నిద్రబోయినవాఁ డాత్మను విషయఫలానుభవంబులు చేయించు తెఱంగున నెఱుక లేని వాఁడు నిజము గాని యర్థంబు లందు ననుభవము నొందుచుండుఁ; గావున. (1780) అజ్ఞానజ మగు శోకము¯ విజ్ఞానవిలోకనమున విడువుము నీకుం¯ బ్రజ్ఞావతికిం దగునే¯ యజ్ఞానుల భంగి వగవ, నంభోజముఖీ!" (1781) ఇట్లు బలభద్రునిఁచేతఁ దెలుపంబడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని యుండె; నట రుక్మి యనువాఁడు ప్రాణావశిష్టుండై, విడువంబడి తన విరూపభావంబునకు నెరియుచు "హరిం గెలిచికాని కుండినపురంబుఁ జొర"నని ప్రతిజ్ఞ చేసి, తత్సమీపంబున నుండె; నివ్విధంబున.

రుక్మిణీ కల్యాణంబు

(1782) రాజీవలోచనుఁడు హరి¯ రాజసమూహముల గెల్చి రాజస మొప్పన్¯ రాజిత యగు తన పురికిని¯ రాజాననఁ దెచ్చె బంధురాజి నుతింపన్. (1783) అంత నయ్యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహకృత్యంబును బ్రవర్తమాన గీత వాద్య నృత్యంబును, బ్రతిగృహాలంకృత విలసితాశేష నరనారీ వర్గంబును, బరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల దానసలిలధారా సిక్త రాజమార్గంబును బ్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముక కదళికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణకుంభంబును, విభూషిత సకల గృహవేదికా కవాట దేహళీ స్తంభంబును, విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును, సముద్ధూత కేతన విభ్రాజితంబును నై యుండె; న య్యవసరంబున. (1784) ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై¯ భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం¯ ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్¯ సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. (1785) సతులుం దారునుఁ బౌరులు¯ హితమతిఁ గానుకలు దెచ్చి యిచ్చిరి కరుణో¯ న్నత వర్ధిష్ణులకును మా¯ నిత రోచిష్ణులకు రుక్మిణీకృష్ణులకున్. (1786) హరి పెండ్లికిఁ గైకేయక¯ కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్¯ పరమానందముఁ బొందిరి¯ ధరణీశులలోన గాఢ తాత్పర్యములన్. (1787) హరి యీ తెఱఁగున రుక్మిణి¯ నరుదుగఁ గొనివచ్చి పెండ్లియాడుట విని దు¯ ష్కరకృత్య మనుచు వెఱగం¯ దిరి రాజులు రాజసుతులు దిక్కుల నెల్లన్. (1788) అనఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ ¯ గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి¯ పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి¯ ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు." (1789) అని చెప్పి.

పూర్ణి

(1790) కువలయరక్షాతత్పర! ¯ కువలయదళ నీలవర్ణ కోమలదేహా! ¯ కువలయనాథ శిరోమణి! ¯ కువలయజన వినుత విమలగుణ సంఘాతా! (1791) సరసిజనిభ హస్తా! సర్వలోక ప్రశస్తా! ¯ నిరుపమ శుభమూర్తీ! నిర్మలారూఢ కీర్తీ! ¯ పరహృదయ విదారీ! భక్తలోకోపకారీ! ¯ గురు బుధజన తోషీ! ఘోరదైతేయ శోషీ! (1792) ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బయిన శ్రీమహాభాగతం బను మహాపురాణంబు నందు దేవకీదేవి వివాహంబును; గగనవాణీ శ్రవణంబును; గంసోద్రేకంబును; వసుదేవ ప్రార్థనయును; యోగమాయా ప్రభావంబును; బలభద్రుని జన్మంబును; బ్రహ్మాది సుర స్తోత్రంబును; గృష్ణావతారంబును; ఘోష ప్రవేశంబును; యోగనిద్రా చరితంబును; నంద పుత్రోత్సవంబును; బూతనా సంహారంబును; శకట భంజనంబును; దృణావర్తు మరణంబును; గ ర్గాగమనంబును; నారాయణాది నామ నిర్దేశంబును; బాలక్రీడయును; మృ ద్భక్షణంబును; వాసుదేవ వదనగహ్వర విలోక్యమా నాఖిల లో కాలోకనంబును; నవనీత చౌర్యంబును, యశోదా రోషంబు; నులూఖల బంధనంబు; నర్జునతరుయుగళ నిపాతనంబును; నలకూబర మణిగ్రీవుల శాప మోక్షణంబును; బృందావన గమనంబును; వత్స పాలనంబును; వత్సాసుర వధయును; బకదనుజ విదారణంబు; నఘాసుర మరణంబును; వ త్సాపహరణంబును; నూతన వత్స బాలక కల్పనంబును; బ్రహ్మ వినుతియు; గో పాలకత్వంబును; గార్దభాసుర దమనంబును; కాళియ ఫణి మర్దనంబును; గరుడ కాళియ నాగ విరోధ కథనంబును; బ్రలంబాసుర హింసనంబును; దవానల పానంబును; వర్షర్తు వర్ణనంబును; శరత్కాల లక్షణంబును; వేణు విలాసంబును; హేమంత సమయ సమాగమంబును; గోపక న్యాచరిత హవిష్య వ్రతంబును; గాత్యాయనీ సేవనంబును; వల్లవీ వస్త్రాపహరణంబును; విప్రవనితా దత్తాన్న భోజనంబు; నింద్రయాగ నివారణంబును; నంద ముకుంద సంవాదంబును; పర్వత భజనంబును; బాషాణ సలిల వర్షంబును; గోవర్ధ నోద్ధరణంబును; వరుణకింకరుండు నందుని గొనిపోయిన హరి తెచ్చుటయును; వేణు పూరణంబును; గోపికాజన ఘోష నిర్గమంబును; యమునాతీర వన విహరణంబును; గృ ష్ణాంతర్ధానంబును; ఘోషకామనీ గ ణాన్వేషణంబును; గోపికా గీతలును; హరి ప్రసన్నతయును; రాస క్రీడనంబును; జలకేళియును, సర్పరూపకుం డైన సుదర్శన విద్యాధరుండు హరిచరణ తాడనంబున నిజరూపంబు పడయుటయును; శంఖచూడుం డను గుహ్యకుని వధించుటయును; వృషభాసుర విదళనంబును; నారదోపదేశంబున హరి జన్మకథ నెఱంగి కంసుండు దేవకీవసుదేవుల బద్ధులం జేయుటయును; ఘోటకాసురుం డైన కేశియను దనుజుని వధియించుటయును; నారద స్తుతియును; వ్యోమదానవ మరణంబు; నక్రూ రాగమంబు; నక్రూర రామకృష్ణుల సల్లాపంబును; ఘోష నిర్గమంబును; యమునా జలాంతరాళంబున నక్రూరుండు హరి విశ్వరూపంబును గాంచుటయు; నక్రూర స్తవంబును; మథురానగర ప్రవేశంబును; రజక వధయును; వాయక మాలికులచే సమ్మానంబు నొందుటయును; కుబ్జా ప్రసాద కరణంబును; ధను ర్భంగంబును; గంసు దుస్వప్నంబును; గువలయాపీడ పీడనంబును; రంగస్థల ప్రవేశంబును; జాణూర ముష్టికుల వధయును; గంస వధయును; వసుదేవదేవకీ బంధ మోక్షణంబు; నుగ్రసేను రాజ్య స్థాపనంబును; రామకృష్ణులు సాందీపుని వలన విద్య లభ్యసించుటయును; సంయమనీ నగర గమనంబును; గురుపుత్ర దానంబు; నుద్ధవుని ఘోష యాత్రయును; భ్రమరగీతలును; గు బ్జావాస గమనంబును; గరినగరంబునకు నక్రూరుండు చని కుంతీదేవి నూరార్చుటయును; గంసభార్య లగు నస్తి ప్రాస్తులు జరాసంధునకుఁ గంసు మరణం బెఱింగించుటయును; జరాసంధుని దండయాత్రయును; మథురానగర నిరోధంబును; యుద్ధంబున జరాసంధుండు సప్తదశ వారంబులు పలాయితుం డగుటయును; నారద ప్రేరితుండై కాలయవనుండు మథురపై దాడివెడలుటయును; ద్వారకానగర నిర్మాణంబును; మథురాపుర నివాసులం దన యోగబలంబున హరి ద్వారకానగరంబునకుం దెచ్చుటయును; కాలయవనుడు హరి వెంటజని గిరిగుహ యందు నిద్రితుండైన ముచికుందుని దృష్టి వలన నీఱగుటయును; ముచికుందుండు హరిని సంస్తుతి చేసి తపంబునకుం జనుటయును; జరాసంధుండు గ్రమ్మఱ రామకృష్ణులపై నేతెంచుటయును; బ్రవర్షణ పర్వతారోహణంబును; గిరి దహనంబును; గిరి డిగ్గనుఱికి రామకృష్ణులు ద్వారకకుం జనుటయును; రుక్మిణీ జననంబును; రుక్మిణీ సందేశంబును; వాసుదే వాగమనంబును; రుక్మిణీ గ్రహణంబును; రాజలోక పలాయనంబును; రుక్మి యనువాని భంగంబును; రుక్మిణీ కల్యాణంబును యను కథలుఁ గల దశమస్కంధంబు నందుఁ బూర్వభాగము సమాప్తము.