పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 1673 - 1762

ప్రవర్షణ పర్వ తారోహణంబు

(1673) మఱియుం బలాయమానులై బహుయోజనంబుల దూరంబు చని విశ్రాంతులై తమకు డాఁగ నెల వగునని యింద్రుండు మిక్కిలి వర్షింపఁ "బ్రవర్షణా"ఖ్యంబై పదునొకండు యోజనంబుల పొడవును నంతియ వెడలుపునుం గల గిరి యెక్కి రంత. (1674) ఆ శైలేంద్రముఁ జుట్టి రా విడిసి రోషావిష్టుఁడై మాగధో¯ ర్వీశుం డా వసుదేవ నందనులఁ దా వీక్షింపఁగా లేక త¯ న్నాశేచ్ఛన్ బిల సాను శృంగములఁ బూర్ణక్రోధుఁడై కాష్ఠముల్¯ రాశుల్గా నిడి చిచ్చుపెట్టఁ బనిచెన్ రౌద్రంబుతో భృత్యులన్. (1675) ఇట్లు జరాసంధపరిజన ప్రదీపితంబైన మహానలంబు దరికొనియె; నందు. (1676) పొగ లెగసెఁ బొగల తుదలను¯ మిగులుచు మిడుఁగుఱులు నిగిడె మిడుఁగుఱగమి ము¯ న్నుగ బ్రహ్మాండము నిండను¯ భగభగ యని మంట లొదివె భయదము లగుచున్. (1677) మఱియు న మ్మహానలంబు బిలసాను శృంగ వృక్ష లతాకుంజపుంజంబుల దరికొని శిఖలు కిసలయంబులుగ విస్ఫులింగంబులు విరులుగ, సముద్ధూత ధూమపటలంబులు బంధురస్కంధశాఖా విసరంబులుగ, ననోహకంబు కైవడి నభ్రంకషం బై ప్రబ్బి కఠోరసమీరణ సమున్నత మహోల్కాజాల తిరోహిత వియచ్చర విమానంబును, వివిధ విధూమవిస్ఫులింగ విలోకనప్రభూత నూతనతారకా భ్రాంతి విభ్రాంతి గగనచరంబును, సంతప్యమాన సరోవర సలిలంబును, విశాలజ్వాలాజాల జాజ్వల్యమాన తక్కోల చందనాగరు కర్పూరధూమ వాసనావాసిత గగనకుహరంబును, గరాళకీలాజాల దందహ్యమాన కీచకనికుంజపుంజ సంజనిత చిటచిటారావ పరిపూరిత దిగంతరాళంబును, భయంకర బహుళతరశాఖాభిద్యమాన పాషాణఘోషణపరిమూర్ఛిత ప్రాణిలోకంబును సంతప్యమాన శాఖిశాఖాంతర నిబిడ నీడనిహిత శాబకవియోగ దుఃఖ డోలాయమాన విహంగకులంబును, మహాహేతిసందీప్యమాన కటిసూత్ర సంఘటిత మయూరపింఛ కుచకలశయుగళ భారాలస శబరకామినీసమాశ్రిత నిర్ఝరంబును, దగ్ధానేక మృగమిథునంబునునై యేర్చు నెడ. (1678) ఇల నేకాదశ యోజన¯ ముల పొడవగు శైలశిఖరమున నుండి వడిన్¯ బలకృష్ణులు రిపుబలముల¯ వెలి కుఱికిరి కానఁబడక విలసితలీలన్. (1679) ఇట్లు శత్రువుల వంచించి యాదవేంద్రులు సముద్రపరిఖంబైన ద్వారకానగరంబునకుం జనిరి; జరాసంధుండు వారలు దగ్ధులై రని తలంచుచు బలంబులుం దానును మగధదేశంబునకు మరలి చనియె” నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె.

రుక్మిణీకల్యాణ కథారంభము

(1680) ఆ వనజగర్భు పంపున¯ రైవతుఁ డను రాజు దెచ్చి రామున కిచ్చెన్¯ రేవతి యనియెడు కన్యను¯ భూవర! మును వింటి కాదె బుద్ధిం దెలియన్. (1681) తదనంతరంబ. (1682) ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్¯ జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ¯ ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా¯ భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. (1683) అనిన రాజిట్లనియె “మున్ను రాక్షసవివాహంబున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణిం గొనిపోయెనని పలికితివి; కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదుల జయించి తన పురంబునకుం జనియె; నదియునుం గాక. (1684) కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై¯ కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా¯ కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ¯ కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్. (1685) భూషణములు చెవులకు బుధ¯ తోషణము లనేక జన్మదురితౌఘ విని¯ శ్శోషణములు మంగళతర¯ ఘోషణములు గరుడగమను గుణభాషణముల్." (1686) అని రా జడిగిన శుకుం డిట్లనియె.

రుక్మిణీ జననంబు

(1687) "వినుము; విదర్భదేశమున వీరుఁడు, కుండినభర్త భీష్మకుం¯ డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు; లగ్రజుం¯ డనఘుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై¯ మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై. (1688) బాలేందురేఖ దోఁచిన¯ లాలిత యగు నపరదిక్కులాగున, ధరణీ¯ పాలుని గేహము మెఱసెను¯ బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్. (1689) మఱియును దినదినప్రవర్ధమాన యై. (1690) పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు¯ నబలలతోడ వియ్యంబు లందు; ¯ గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి¯ చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి; ¯ రమణీయ మందిరారామ దేశంబులఁ¯ బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు; ¯ సదమల మణిమయ సౌధభాగంబుల¯ లీలతో భర్మడోలికల నూఁగు; (1690.1) బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు;¯ శారికా కీర పంక్తికిఁ జదువు సెప్పు;¯ బర్హి సంఘములకు మురిపములు గఱపు;;¯ మదమరాళంబులకుఁ జూపు మందగతులు. (1691) అంత. (1692) దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ¯ వెలఁదికి మైదీఁగ వీడఁ దొడఁగెఁ; ¯ గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ¯ గాంతి నింతికి ముఖకమల మొప్పె; ¯ మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపఁ¯ బొలఁతికి జనుదోయి పొడవు జూపె; ¯ శౌరికి ధైర్యంబు సన్నమై డయ్యంగ¯ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యె; (1692.1) హరికిఁ బ్రేమబంధ మధికంబుగాఁ, గేశ¯ బంధ మధిక మగుచు బాలకమరెఁ; ¯ బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార¯ నెలఁత యౌవనంబు నిండి యుండె. (1693) ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రు లను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున. (1694) తన తండ్రి గేహమునకుం¯ జనుదెంచుచు నున్న యతిథిజనులవలనఁ గృ¯ ష్ణుని రూప బల గుణాదులు¯ విని, "కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁ"డని తలఁచెన్. (1695) ఆ లలన రూపు, బుద్ధియు, ¯ శీలము, లక్షణము, గుణముఁ జింతించి తగన్¯ "బాలారత్నముఁ దన కి¯ ల్లాలుగఁ జేకొందు"ననుచు హరియుం దలఁచెన్. (1696) అంత. (1697) బంధువు లెల్లఁ "గృష్ణునకు బాలిక నిచ్చెద"మంచు శేముషీ¯ సింధువులై విచారములు చేయఁగ, వారల నడ్డపెట్టి దు¯ స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి "మత్త పు¯ ష్పంధయవేణి నిత్తు శిశుపాలున"కంచుఁ దలంచె నంధుఁడై.

రుక్మిణి సందేశము పంపుట

(1698) అన్న తలంపు తా నెఱిఁగి, య న్నవనీరజగంధి లోన నా¯ పన్నత నొంది, యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి "గర్వ సం¯ ఛన్నుఁడు రుక్మి నేడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్నవాఁ, ¯ డెన్నివిధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే. (1699) అయ్యా! కొడుకు విచారము¯ లయ్యయు వారింపఁ జాలఁ డటు గాకుండన్¯ నెయ్య మెఱిఁగించి చీరుము¯ చయ్యన నిజసేవకానుసారిన్ శౌరిన్." (1700) అని కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరంబునకుం జని, ప్రతిహారుల వలనఁ దనరాక యెఱింగించి య న్నగధరుం డున్న నగరు ప్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండయి యున్న పురుషోత్తముం గాంచి “పెండ్లికొడుకవు గ” మ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్యదేవుండైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి, తనకు దేవతలు చేయు చందంబునం బూజలు చేసి, సరసపదార్థ సంపన్నంబైన యన్నంబుఁ బెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున నతని యడుగులు పుడుకుచు మెల్లన నతని కిట్లనియె. (1701) "జగతీసురేశ్వర! సంతోషచిత్తుండ¯ వై యున్న నీ ధర్మ మతిసులభము¯ వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ¯ బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు¯ తన ధర్మమున నుండుఁ దరలఁ డా ధర్మంబు¯ గోరిక లతనికిఁ గురియుచుండు¯ సంతోషిగాఁ డేని శక్రుఁడైన నశించు¯ నిర్ధనుండైనను నింద్రుఁ బోఁలు (1701.1) సంతసించెనేని, సర్వభూతసుహృత్త¯ ములకుఁ బ్రాప్తలాభ ముదిత మాన¯ సులకు శాంతులకును సుజనులకును గర్వ¯ హీనులకును వినతు లే నొనర్తు. (1702) ఎవ్వని దేశమం దునికి; యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ¯ కెవ్వని రాజ్యమందుఁ బ్రజలెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం¯ డివ్వనరాశి దుర్గమున కెట్లరుదెంచితి రయ్య! మీరు? లే¯ నవ్వులుగావు; నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ!" (1703) అని యిట్లు లీలాగృహీతశరీరుండైన య ప్పరమేశ్వరుం డడిగిన ధరణీసురవరుం డతనికి సవినయంబుగ నిట్లనియె “దేవా! విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలం; డా రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి; గల ద య్యిందువదన నీకుం గైంకర్యంబు జేయం గోరి వివాహమంగళ ప్రశస్తంబయిన యొక్క సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె నవదరింపుము. (1704) ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక¯ దేహతాపంబులు దీఱిపోవు¯ నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల¯ కఖిలార్థలాభంబు గలుగుచుండు¯ నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన¯ భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు¯ నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ¯ దడవిన బంధసంతతులు వాయు (1704.1) నట్టి నీ యందు నా చిత్త మనవరతము¯ నచ్చి యున్నది నీ యాన నాన లేదు, ¯ కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి! ¯ శ్రీయుతాకార! మానినీచిత్తచోర! (1705) ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ¯ జన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే¯ కన్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా¯ జన్యానేకపసింహ! నా వలననే జన్మించెనే మోహముల్? (1706) శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో¯ మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ¯ ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ¯ డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవత్ప్రతాపమున్ (1707) వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్¯ గతజన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే¯ సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని¯ ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్. (1708) అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో! ¯ పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా¯ వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే¯ యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్. (1709) "లోపలి సౌధంబులోన వర్తింపంగఁ¯ దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని¯ గావలివారలఁ గల బంధువులఁ జంపి¯ కాని తేరా"దని కమలనయన! ¯ భావించెదేని యుపాయంబు చెప్పెద¯ నాలింపు కులదేవయాత్రఁ జేసి¯ నగరంబు వెలువడి నగజాతకును మ్రొక్కఁ¯ బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ (1709.1) నెలమి మావారు పంపుదు రేను నట్లు¯ పురము వెలువడి యేతెంచి భూతనాథు¯ సతికి మ్రొక్కంగ నీవు నా సమయమందు¯ వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత! (1710) ఘను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె¯ వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ¯ యనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్¯ నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు, ప్రాణేశ్వరా! (1711) ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని¯ కర్ణరంధ్రంబుల కలిమి యేల? ¯ పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని¯ తనులతవలని సౌందర్య మేల? ¯ భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని¯ చక్షురింద్రియముల సత్వ మేల? ¯ దయిత! నీ యధరామృతం బానఁగా లేని¯ జిహ్వకు ఫలరససిద్ధి యేల? (1711.1) నీరజాతనయన! నీ వనమాలికా¯ గంధ మబ్బలేని ఘ్రాణ మేల? ¯ ధన్యచరిత! నీకు దాస్యంబు జేయని¯ జన్మ మేల? యెన్ని జన్మములకు." (1712) అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌంద ర్యాది విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి “కర్తవ్యం బెద్ది చేయ నవధరింపు” మని సవర్ణనంబుగా మఱియు నిట్లనియె. (1713) "పల్లవ వైభవాస్పదములు పదములు¯ కనకరంభాతిరస్కారు లూరు; ¯ లరుణప్రభామనోహరములు గరములు¯ కంబు సౌందర్య మంగళము గళము; ¯ మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు¯ చక్షురుత్సవదాయి చన్నుదోయి; ¯ పరిహసితార్ధేందు పటలంబు నిటలంబు¯ జితమత్త మధుకరశ్రేణి వేణి; (1713.1) భావజాశుగముల ప్రాపులు చూపులు; ¯ కుసుమశరుని వింటికొమలు బొమలు; ¯ చిత్తతోషణములు చెలువ భాషణములు; ¯ జలజనయన ముఖము చంద్రసఖము. (1714) ఆ యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా¯ ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; దప్పదు జాడ్యములేల? నీవు నీ¯ తోయమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి¯ చ్చేయుము; శత్రులన్ నుఱుముజేయుము; చేయుము శోభనం బిలన్."

వాసుదే వాగమన నిర్ణయము

(1715) అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజతనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాదివిశేషంబులును విని, యవధరించి నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుం; డిట్లనియె (1716) "కన్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా¯ కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే¯ మున్నె యెఱుంగుదున్; బరులమూఁక లడంచి కుమారిఁ దెత్తు వి¯ ద్వన్నుత! మ్రానుఁ ద్రచ్చి నవవహ్నిశిఖన్ వడిఁదెచ్చు కైవడిన్. (1717) వచ్చెద విదర్భభూమికిఁ; ¯ జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్¯ దెచ్చెద బాలన్ వ్రేల్మిడి ¯ వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్." (1718) అని పలికి, రుక్మిణీదేవి పెండ్లినక్షత్రంబుఁ దెలిసి, దన పంపున రథసారథి యైన దారకుండు సైబ్య సుగ్రీవ మేఘ పుష్పవలాహకంబు లను తురంగంబులం గట్టి రథమాయత్తంబు చేసి తెచ్చిన నమోఘ మనోరథుండైన హరి తానును, బ్రాహ్మణుండును రథారోహణంబు సేసి యేకరాత్రంబున నానర్తకదేశంబులు గడచి, విదర్భదేశంబునకుఁ జనియె; నందు కుండినపురీశ్వరుండైన భీష్మకుండు కొడుకునకు వశుండై కూఁతు శిశుపాలున కిత్తునని తలంచి, శోభనోద్యోగంబులు చేయించె; నప్పుడు. (1719) రచ్చలు గ్రంతలు రాజమార్గంబులు¯ విపణిదేశంబులు విశదములుగఁ¯ జేసిరి; చందనసిక్త తోయంబులు¯ గలయంగఁ జల్లిరి; కలువడములు¯ రమణీయ వివిధతోరణములుఁ గట్టిరి¯ సకల గృహంబులు చక్కఁ జేసి; ¯ కర్పూర కుంకు మాగరుధూపములు పెట్టి¯ రతివలుఁ బురుషులు నన్ని యెడల (1719.1) వివిధవస్త్రములను వివిధమాల్యాభర¯ ణానులేపనముల నమరి యుండి¯ రఖిల వాద్యములు మహాప్రీతి మ్రోయించి¯ రుత్సవమున నగర మొప్పియుండె. (1720) అంత నా భీష్మకుండు విహితప్రకారంబునం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి నభిషిక్తంజేసి వస్త్రయుగళభూషితం గావించి రత్నభూషణంబు లిడంజేసి, ఋగ్యజుస్సామధర్వణ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి; పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదితన్యాయంబున హోమంబు గావించె; మఱియు నా రాజు దంపతుల మేలుకొఱకుఁ దిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీదేవతల కొసంగెను; అయ్యవసరంబున. (1721) భటసంఘంబులతో రథావళులతో భద్రేభయూథంబుతోఁ¯ బటువేగాన్విత ఘోటకవ్రజముతో బంధుప్రియశ్రేణితోఁ¯ గటుసంరంభముతో విదర్భతనయం గైకొందు నంచున్ విశం¯ కటవృత్తిం జనుదెంచెఁ జైద్యుఁడు గడున్ గర్వించి య వ్వీటికిన్. (1722) "బంధులఁ గూడి కృష్ణబలభద్రులు వచ్చినఁ బాఱదోలి ని¯ ర్మంథర వృత్తిఁ జైద్యునికి మానినిఁ గూర్చెద"మంచు నుల్లస¯ త్సింధుర వీర రథ్య రథ సేనలతోఁ జనుదెంచి రా జరా¯ సంధుఁడు దంతవక్త్రుఁడును సాల్వ విదూరక పౌండ్రకాదులున్. (1723) మఱియు నానాదేశంబుల రాజు లనేకు లేతెంచి; రందు శిశుపాలు నెదుర్కొని పూజించి భీష్మకుం డొక్కనివేశంబున నతని విడియించె; నంతఁ దద్వృత్తాంతంబు విని. (1724) "హరి యొకఁ డేగినాఁడు మగధాదులు చైద్యహితానుసారులై¯ నరపతు లెందఱేనిఁ జనినారు కుమారికఁ దెచ్చుచోట సం¯ గరమగుఁ దోడు గావలయుఁ గంసవిరోధికి"నంచు వేగఁ దా¯ నరిగె హలాయుధుండు గమలాక్షుని జాడ ననేక సేనతోన్. (1725) ఆలోపల నేకతమున¯ నాలోలవిశాలనయన యగు రుక్మిణి ద¯ న్నా లోకలోచనుఁడు హరి¯ యాలోకము చేసి కదియఁ డని శంకితయై. (1726) "లగ్నం బెల్లి; వివాహముం గదిసె, నేలా రాఁడు గోవిందుఁ? డు¯ ద్విగ్నం బయ్యెడి మానసంబు; వినెనో వృత్తాంతమున్? బ్రాహ్మణుం¯ డగ్నిద్యోతనుఁ డేటికిం దడసె? నా యత్నంబు సిద్ధించునో? ¯ భగ్నంబై చనునో? విరించికృత మెబ్భంగిన్ బ్రవర్తించునో? (1727) ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁడై చిక్కెనో? ¯ విని, కృష్ణుం డిది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం¯ డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యామహాదేవియున్¯ నను రక్షింప నెఱుంగునో? యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?" (1728) అని వితర్కించుచు. (1729) "పోఁ"డను "బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి; వాసుదేవుఁడున్¯ "రాఁ" డను;"నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుడున్¯ "లేఁ" డను;"రుక్మికిం దగవు లే, దిటఁ జైద్యున కిత్తు నంచు ను¯ న్నాఁ" డను;"గౌరి కీశ్వరికి నావలనం గృపలేదు నే"డనున్. (1730) చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికం¯ గప్పదు; వక్త్రతామరసగంధ సమాగత భృంగసంఘమున్¯ రొప్పదు; నిద్ర గైకొన; దురోజ పరస్పర సక్త హారముల్¯ విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులు ద్రిప్ప దెప్పుడున్. (1731) తుడువదు కన్నులన్ వెడలు తోయకణంబులు; కొప్పు చక్కఁగా¯ ముడువదు; నెచ్చెలిం గదిసి ముచ్చటకుం జన; దన్న మేమియుం¯ గుడువదు; నీరముం గొనదు; కూరిమిఁ గీరముఁ జేరి పద్యముం¯ నొడువదు; వల్లకీగుణవినోదము సేయదు; డాయ దన్యులన్. (1732) మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ¯ జలకము లాడదు జలజగంధి; ¯ ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి¯ పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి; ¯ వనకేళిఁ గోరదు వనజాతలోచన¯ హంసంబుఁ బెంపదు హంసగమన; ¯ లతలఁ బోషింపదు లతికా లలిత దేహ¯ తొడవులు తొడువదు తొడవు తొడవు; (1732.1) తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు;¯ గమలగృహముఁ జొరదు కమలహస్త;¯ గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన¯ మాలి రాఁడు తగవుమాలి"యనుచు. (1733) మఱియును. (1734) మలఁగున్ మెల్లని గాలికిం; బటునటన్మత్త ద్విరేఫాలికిం¯ దలఁగుం; గోయల మ్రోఁతకై యలఁగు; నుద్యత్కీరసంభాషలం¯ గలఁగున్; వెన్నెలఁవేడిమి న్నలఁగు; మాకందాంకురచ్ఛాయకుం¯ దొలఁగుం; గొమ్మ మనోభవానలశిఖా దోధూయ మానాంగియై.

వాసుదే వాగమనంబు

(1735) ఇట్లు హరిరాక కెదురుచూచుచు, సకల ప్రయోజనంబులందును విరక్త యయి, మనోజానలంబునం బొగులు మగువకు, శుభంబు చెప్పు చందంబున, వామోరు లోచన భుజంబు లదరె; నంతఁ గృష్ణు నియోగంబున బ్రాహ్మణుండు చనుదెంచిన, నతని ముఖలక్షణం బుపలక్షించి, యా కలకంఠకంఠి మహోత్కంఠతోడ నకుంఠిత యై, మొగంబునం జిఱునగవు నిగుడ, నెదురు జని, నిలువంబడిన, బ్రాహ్మణుం డిట్లనియె. (1736) "మెచ్చె భవద్గుణోన్నతి; కమేయ ధనావళు లిచ్చె నాకుఁ; దా¯ వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై¯ వచ్చిననైన, రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ¯ సచ్చరితంబు, భాగ్యమును, సర్వము నేడు ఫలించెఁ గన్యకా!" (1737) అనిన వైదర్భి యిట్లనియె. (1738) "జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి, నా సందేశముం జెప్పి; నన్¯ నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్; నీ యంత పుణ్యాత్మకుల్¯ గలరే? దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం¯ జలిఁ గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!" (1739) అని నమస్కరించె; నంత రామకృష్ణులు దన కూఁతు వివాహంబునకు వచ్చుట విని, తూర్యఘోషంబులతో నెదుర్కొని, విధ్యుక్తప్రకారంబునం బూజించి, మధుపర్కంబు లిచ్చి, వివిధాంబరాభరణంబులు మొదలైన కానుక లొసంగి, భీష్మకుండు బంధుజనసేనా సమేతులైన వారలకుం దూర్ణంబున సకల సంపత్పరిపూర్ణంబులైన నివేశంబులు కల్పించి, విడియించె; నిట్లు కూడిన రాజుల కెల్లను వయోవీర్య బలవిత్తంబు లెట్లట్ల కోరిన పదార్థంబు లెల్ల నిప్పించి, పూజించె; నంత విదర్భపురంబు ప్రజలు హరిరాక విని, వచ్చి చూచి, నేత్రాంజలులం దదీయ వదనకమల మధుపానంబుఁ జేయుచు. (1740) "తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం¯ దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య, మీ యిద్దఱిం¯ దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా? దర్పాహతారాతియై¯ మగఁడౌఁ గావుతఁ! జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్." (1741) అని పలికి రా సమయంబున. (1742) సన్నద్ధులై బహు శస్త్ర సమేతులై¯ బలిసి చుట్టును వీరభటులు గొలువ¯ ముందట నుపహారములు కానుకలు గొంచు¯ వర్గంబులై వారవనిత లేఁగఁ¯ బుష్ప గంధాంబర భూషణ కలితలై¯ పాడుచు భూసురభార్య లరుగఁ¯ బణవ మర్దళ శంఖ పటహ కాహళ వేణు¯ భేరీధ్వనుల మిన్ను పిక్కటిలఁగఁ (1742.1) దగిలి సఖులు గొల్వఁ దల్లులు బాంధవ¯ సతులు దోడ రాఁగ సవినయముగ¯ నగరు వెడలి నడచె నగజాతకును మ్రొక్క¯ బాల చికుర పిహిత ఫాల యగుచు. (1743) మఱియు, సూత మాగధ వంది గాయక పాఠక జను లంతంత నభినందించుచుఁ జనుదేర మందగమనంబున, ముకుంద చరణారవిందంబులు డెందంబునం దలంచుచు నిందుధరసుందరీ మందిరంబు చేరి సలిల ధారా ధౌత చరణ కరారవింద యై వార్చి శుచియై, గౌరీసమీపంబునకుం జనియె నంత ముత్తైదువలగు భూసురోత్తముల భార్యలు భవసహితయైన భవానికి మజ్జనంబు గావించి, గంధాక్షత లిడి, వస్త్రమాల్యాది భూషణంబుల నలంకరించి ధూపదీపంబు లొసంగి నానావిధోపహారంబులు సమర్పించి, కానుకలిచ్చి, దీపమాలికల నివాళించి రుక్మిణీదేవిని మ్రొక్కించి; రప్పుడు. (1744) "నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్¯ మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె¯ ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని¯ న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!" (1745) అని గౌరీదేవికి మ్రొక్కి పతులతోడం గూడిన బ్రాహ్మణభార్యలకు లవణాపూపంబులును, తాంబూల కంఠసూత్రంబులును, ఫలంబులు, నిక్షుదండంబులు నిచ్చి రుక్మిణీదేవి వారలం బూజించిన. (1746) వార లుత్సహించి వలనొప్ప దీవించి¯ సేస లిడిరి యువతి శిరమునందు; ¯ సేస లెల్లఁ దాల్చి శివవల్లభకు మ్రొక్కి¯ మౌననియతి మాని మగువ వెడలె. (1747) ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవ నర్తకుం డెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడచూపిన మోహినీదేవత కైవడి, దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మందరాచల మంథాన మథ్యమాన ఘూర్ణిత ఘుమఘుమాయిత మహార్ణవమధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభవంబున, బహువిధ ప్రభాభాసమానయై యిందుధరసుందరీ మందిరంబు వెడలి మానసకాసార హేమకమల కానన విహరమాణ మత్తమరాళంబు భంగి మందగమనంబునఁ గనకకలశ యుగళ సంకాశ కర్కశ పయోధరభార పరికంప్యమాన మధ్యయై, రత్నముద్రికాలంకృతంబైన కెంగేల నొక్క సఖీలలామంబు కైదండఁ గొని, రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప నరవింద పరిమళ కుతూహలావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబులైన కుంతలజాలంబులు ముఖమండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప నధర బింబఫలారుణ మరీచిమాలికలు రదనకుంద కుట్మంబుల కనురాగంబు సంపాదింప, మనోజాతకేతన సన్నిభంబైన పయ్యెదకొంగు దూఁగ; సువర్ణమేఖలాఘటిత మణి కిరణపటలంబు లకాల శక్రచాప జనకంబులై మెఱయఁ జెఱుకువిలుతుం డొరఁ బెఱికి వాఁడి యిడి జళిపించిన ధగద్ధగాయానంబులగు బాణంబుల పగిది, సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువులు సేయఁ, బాద సంచారంబున హరిరాక కెదురుచూచుచు వీరమోహినియై చనుదెంచుచున్న సమయంబున. (1748) అళినీలాలకఁ బూర్ణచంద్రముఖి, నేణాక్షిం, బ్రవాళాధరం, ¯ గలకంఠిన్, నవపల్లవాంఘ్రియుగళన్, గంధేభకుంభస్తనిం, ¯ బులినశ్రోణి నిభేంద్రయాన, నరుణాంభోజాతహస్తన్, మహో¯ త్పల గంధిన్, మృగరాజమధ్యఁ గని విభ్రాంతాత్ములై రందఱున్. (1749) మఱియు న య్యింతి దరహాస లజ్జావనోకంబులం జిత్తంబు లేమఱి ధైర్యంబులు దిగనాడి, గాంభీర్యంబులు విడిచి, గౌరవంబులు మఱచి, చేష్టలు మాని, యెఱుక లుడిగి, యాయుధంబులు దిగవైచి, గజ తురగ రథారోహణంబులు చేయనేరక, రాజులెల్ల నేలకు వ్రాలి; రా యేణీలోచన తన వామకర నఖంబుల నలకంబులు దలఁగం ద్రోయుచు నుత్తరీయంబు చక్కనొత్తుచుఁ గడకంటి చూపులం గ్రమంబున నా రాజలోకంబు నాలోకించుచు. (1750) కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం, గంఠీరవేంద్రావల¯ గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతరవక్షున్, మేఘసంకాశదే¯ హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిఁ, బీతాంబరున్, ¯ ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.

రుక్మిణీ గ్రహణంబు

(1751) కని తదీయ రూప వయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషంబులకు సంతసించి, మనోభవశరాక్రాంతయై రథారోహణంబు గోరుచున్న య వ్వరారోహం జూచి, పరిపంథి రాజలోకంబు చూచుచుండ మందగమనంబున గంధసింధురంబు లీలం జనుదెంచి ఫేరవంబుల నడిమి భాగంబుఁ గొనిచను కంఠీరవంబు కైవడి, నిఖిల భూపాలగణంబుల గణింపక దృణీకరించి, రాజకన్యకం దెచ్చి హరి తన రథంబుమీఁద నిడికొని భూనభోంతరాళంబు నిండ శంఖంబు పూరించుచు బలభద్రుండు తోడ నడవ, యాదవవాహినీ పరివృతుండై ద్వారకానగర మార్గంబు పట్టి చనియె; నంత జరాసంధవశు లైన రాజు లందఱు హరిపరాక్రమంబు విని సహింప నోపక. (1752) "ఘన సింహంబుల కీర్తి నీచమృగముల్ గైకొన్న చందంబునన్¯ మన కీర్తుల్ గొని బాలఁ దోడ్కొనుచు నున్మాదంబుతో గోపకుల్¯ చనుచున్నా రదె; శౌర్య మెన్నటికి? మీ శస్త్రాస్తముల్ గాల్పనే? ¯ తనుమధ్యన్ విడిపింపమేని నగరే ధాత్రీజనుల్ క్రంతలన్." (1753) అని యొండొరులఁ దెలుపుకొని, రోషంబులు హృదయంబుల నిలుపుకొని, సంరంభించి, తనుత్రాణంబులు వహించి, ధనురాది సాధనంబులు ధరియించి, పంతంబులాడి, తమతమ చతురంగబలంబులం గూడి, జరాసంధాదులు యదువీరుల వెంటనంటఁ దాఁకి, "నిలునిలు"మని ధిక్కరించి పలికి, యుక్కుమిగిలి, మహీధరంబుల మీఁద సలిలధారలు కురియు ధారాధరంబుల చందంబున బాణవర్షంబులు గురియించిన యాదవసేనలం గల దండనాయకులు కోదండంబు లెక్కిడి, గుణంబులు మ్రోయించి, నిలువంబడి; రప్పుడు. (1754) అరిబల భట సాయకముల¯ హరిబలములు గప్పఁబడిన నడరెడు భీతిన్¯ హరిమధ్య సిగ్గుతోడను¯ హరివదనముఁ జూచెఁ జకితహరిణేక్షణయై. (1755) ఇట్లు చూచిన. (1756) "వచ్చెద రదె యదువీరులు ¯ వ్రచ్చెద రరిసేన నెల్ల వైరులు పెలుచన్¯ నొచ్చెదరును విచ్చెదరును¯ జచ్చెదరును నేఁడు చూడు జలజాతాక్షీ!" (1757) అని రుక్మిణీదేవిని హరి యూరడించె; నంత బలభద్ర ప్రముఖులైన యదువీరులు ప్రళయవేళ మిన్నునం బన్ని బలుపిడుగు లడరించు పెనుమొగుళ్ళ వడువున జరాసంధాది పరిపంథిరాజచక్రంబు మీఁద నవక్ర పరాక్రమంబున శిఖిశిఖా సంకాశ నిశిత శిలీముఖ, నారాచ, భల్ల ప్రముఖంబులైన బహువిధ బాణపరంపరలు గురియ నదియును విదళిత మత్త మాతంగంబును, విచ్ఛిన్న తురంగంబును విభిన్న రథవరూధంబును, వినిహత పదాతియూధంబును, విఖండిత వాహ వారణ రథారోహణ మస్తకంబును, విశకలిత వక్షోమధ్య కర్ణ కంఠ కపోల హస్తంబును, విస్ఫోటిత కపాలంబును, వికీర్ణ కేశజాలంబును, విపాటిత చరణ జాను జంఘంబును, విదళిత దంత సంఘంబును, విఘటిత వీరమంజీర కేయూరంబును, విభ్రష్ట కుండల కిరీట హారంబును, విశ్రుత వీరాలాపంబును, విదార్యమాణ గదా కుంత తోమర పరశు పట్టిస ప్రాస కరవాల శూల చక్ర చాపంబును, వినిపాతిత కేతన చామర ఛత్రంబును, విలూన తనుత్రాణంబును, వికీర్యమాణ ఘోటకసంఘ రింఖాసముద్ధూత ధరణీపరాగంబును, వినష్ట రథ వేగంబును, వినివారిత సూత మాగధ వంది వాదంబును, వికుంఠిత హయహేషా పటహ భాంకార కరటిఘటా ఘీంకార రథనేమి పటాత్కార తురగ నాభిఘంటా ఘణఘణాత్కార వీరహుంకార భూషణ ఝణఝణాత్కార నిస్సాణ ధణధణాత్కార మణినూపుర క్రేంకార కింకిణీ కిణకిణాత్కార శింజనీటంకార భట పరస్పరధిక్కార నాదంబును, వినిర్భిద్యమాన రాజసమూహంబును, విద్యమాన రక్తప్రవాహంబును, విశ్రూయమాణ భూతబేతాళ కలకలంబును, విజృంభమాణ ఫేరవ కాక కంకాది సంకులంబును, బ్రచలిత కబంధంబును బ్రభూత పలల గంధంబును బ్రదీపిత మేదో మాంస రుధిర ఖాదనంబును, బ్రవర్తిత డాకినీ ప్రమోదంబును, నయి యుండె; నప్పుడు.

రాజలోక పలాయనంబు

(1758) మగిడి చలించి పాఱుచును మాగధ ముఖ్యులు గూడి యొక్కచో¯ వగచుచు నాలిఁ గోల్పడినవాని క్రియం గడు వెచ్చనూర్చుచున్¯ మొగమునఁ దప్పిదేరఁ దమ ముందటఁ బొక్కుచునున్న చైద్యుతోఁ¯ "బగతుర చేతిలోఁ బడక ప్రాణముతోడుత నున్నవాఁడవే." (1759) అని మఱియును. (1760) "బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ; ¯ బ్రతుకు గలిగెనేని భార్య గలదు; ¯ బ్రతికితీవు; భార్యపట్టు దైవమెఱుంగు; ¯ వగవ వలదు చైద్య! వలదు వలదు." (1761) "వినుము, దేహధారి స్వతంత్రుండు గాఁడు, జంత్రగానిచేతి జంత్రపుబొమ్మకైవడి నీశ్వరతంత్ర పరాధీనుండై, సుఖదుఃఖంబులందు నర్తనంబులు సలుపుఁ; దొల్లి యేను మథురాపురంబుపైఁ బదియేడు మాఱులు పరాక్రమంబున విడిసి, సప్తదశవారంబులు చక్రిచేత నిర్మూలిత బలచక్రుండనై కామపాలుచేతం బట్టుబడి కృష్ణుండు గరుణ చేసి విడిపించి పుచ్చిన వచ్చి; క్రమ్మఱ నిరువదిమూ డక్షౌహిణులం గూడుకొని పదునెనిమిదవ మాఱు దాడిచేసి శత్రువులం దోలి విజయంబు చేకొంటి; నిట్టి జయాపజయంబులందు హర్షశోకంబులం జెంద నే నెన్నండు; నేటి దినంబున నీ కృష్ణు నెదిరి పోర మన రాజలోకం బెల్ల నుగ్రాక్షుం గూడికొని పోరిన నోడుదు; మింతియ కాక దైవయుక్తంబైన కాలంబునం జేసి లోకంబులు పరిభ్రమించుచుండు; నదియునుం గాక. (1762) తమకుం గాలము మంచిదైన మనలం ద్రైలోక్య విఖ్యాతి వి¯ క్రములన్ గెల్చిరి యాదవుల్ హరి భుజాగర్వంబునన్ నేడు; కా¯ లము మేలై చనుదెంచెనేని మనమున్ లక్షించి విద్వేషులన్¯ సమరక్షోణి జయింత; మింతపనికై శంకింప నీ కేటికిన్."