పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 1562 - 1672

కృష్ణుడు విజృంభించుట

(1562) ఇట్లు తన మొనలు విఱిగి పాఱినం గనుంగొని, సమరసంరంభంబున హరి విశ్వంభరాభరణ వేదండ తుండాభంబులగు బాహుదండంబులం బెంచి, విజృంభించి, బ్రహ్మాండకుహరకుంభ పరిస్ఫోటనం బగు పాంచజన్య నినదంబు నిబిడ నిర్ఘాత శబ్దంబులుగ నుదంచిత పింఛదామంబు సంక్రందన చాపంబుగఁ, బ్రశస్త హస్తలాఘవంబున శరాకర్షణ సంధాన మోక్షణంబు లేర్పడక, నిర్వక్ర చక్రాకారాంబుతోడ మార్తాండమండల ప్రభా ప్రచండం బగు శార్ఙ్గ కోదండంబు క్రొమ్మెఱుంగులు మెఱుంగులుగ, దిగ్గజేంద్ర కర్ణభీషణంబులగు గుణఘోషంబులు ఘుమఘుమారావ దుస్సహంబు లయిన గర్జనంబులుగ రథ తురంగమ రింఖా సముద్ధూత పరాగపటల పరంపరా సంపాదిత పుంజీభూతంబగు పెంజీఁకటి యిరులుగ నసమసమరసన్నాహ చాతురీ విశేషంబులకుం జొక్కి నిక్కి కరంబు లెత్తి నర్తనంబులం బ్రవర్తించు నారద హస్త విన్యాసంబులు లీలాతాండవమండిత మహోత్కంఠంబు లగు నీలకంఠంబులుగ సుందర స్యందననేమి నిర్ఘోషభీతులై కుంభి కుంభంబులపై వ్రాలు వీరులు మత్తమయూర కేకారవ చకితులై యువతీ కుచకుంభంబుల మీఁద వ్రాలెడు కాముకులుగ నానా నరేంద్ర రక్తపిపాసా పరవశంబులై వాచఱచుచున్న భూతవ్రాతంబులు వర్షవర్షేతి నిస్వనంబు లొసంగు చాతకంబులుగ నభంగ సంగర ప్రేరకుండగు హలాయుధుండు వృష్టికారణంబగు మందసమీరణంబుగ, ననల్ప కల్పాంతకాల నీలవలాహకంబు భాతిం బరఁగు మేని చాయతోడం దోయజనాభుం డరాతి చతురంగ దేహక్షేత్రంబులం బుంఖానుపుంఖంబులుగ నసంఖ్యాత బహువిధ దివ్యబాణవర్షంబు గురియునెడ శస్త్రాస్త్రపరంపరా సంఘట్టన జనితంబులగు మిడుఁగుఱులు వర్షాకాలవిహిత విద్యోతమాన ఖద్యోతంబులుగ, విశిఖ వికీర్ణ వీర కోటిర ఘట్టిత పద్మరాగశకలంబు లింద్రగోపంబులుగ, మహిత మార్గణ విదళిత మత్తమాతంగ కుంభ మౌక్తికంబులు వడగండ్లుగఁ, జటు లార్ధచంద్రశరచ్ఛిన్న చరణంబులై "కృష్ణ! కృష్ణ! నిలునిలు"మని పలుకుచుం గూలెడి మేనులు కృషీవల కర పరశుధారా విదళిత మూలవిశాల సాలంబులుగ, భాసురభల్లభగ్నంబులైన వదనగహ్వరంబులవలన డుల్లెడు దంతపుంజంబులు మాలతీకుసుమ మంజరులుగ నవ్య నారాచభిన్న దేహంబులయి దిగ్గనఁ గ్రొగ్గండ్లవలన వెడలు రక్త స్యందసందోహంబులతో సంచరింపక ప్రాణంబులు విడుచు శుండాలంబులు సెలయేఱులతోడి కొండలుగఁ గఠోరకాండ ఖండితంబు లైన భుజాదండంబులతోడం గలసిపడిన వజ్రమయ కంఠికాభరణంబులు భోగిభోగసమేత కేతకీ కుసుమంబులుగఁ బ్రళయార్ణవ కల్లోల శబ్దసన్నిభంబులైన భేరీరవంబులు భీకర భేకీనికర రవంబులుగ దారు ణేషు విలూన వాహ వారణ మనుజ మస్త మస్కిష్కంబు రొంపియునై సొంపుమెఱయ నాభీల కీలాల ప్రవాహంబులు ప్రవహించె; నందు భుజంబులు భుజంగంబులుగఁ, గపాలంబులు కమఠంబులుగ, శిరోజంబులు శైవలంబులుగఁ, గరంబులు మీనంబులుగ, హయంబులు నక్రంబులుగ గజంబులు దీవులుగ ధవళఛత్రంబులు నురువులుగఁ, జామరంబులు కలహంసంబులుగ, భూషణరత్నరేణురాసులు పులినంబులుగ నొప్పె; నప్పుడు.

బలరాముడు విజృంభించుట

(1563) హసిత హరినీలనిభ వసనము విశాలకటి¯ నసమ నయనాద్రి పరిలసితమగు మేఘో¯ ల్లసనము వహింపఁ గరకిసలయము హేమ మణి¯ విసర వలయద్యుతులు దెసల తుదలందుం¯ బసలు గురియంగ సరభసమున బలుండు దర¯ హసితము ముఖాబ్జమున నెసఁగ ఘనకాలా¯ య సమయ మహోగ్రతర ముసలము వడిన్ విసరి¯ కసిమసఁగి శత్రువుల నసువులకుఁ బాపెన్. (1564) ప్రళయసమయాంతకుని చెలువునఁ గటాక్షముల¯ నలఘు చటులాగ్ని కణములు చెదరఁ గోలా¯ హలముగ సువర్ణమణివలయ నిచయోజ్జ్వలిత¯ హలము వడిఁజాఁచి శిరములు నురములు న్ని¯ ర్దళితములుగన్ శకలములుగ నొనరింపఁ గని¯ బెలుకుఱి జరాసుతుని బలము రణవీధిన్¯ జలిత దనుజావళికి బలికి భయభీత సుర¯ ఫలికిఁ ద్రిజగచ్ఛలికి హలికిఁ దల డించెన్. (1565) రోషోద్రేకకళాభయంకర మహారూపంబుతో నొక్క చే¯ నీషాదండము సాఁచి లాంగలము భూమీశోత్తమగ్రీవలన్¯ భూషల్ రాలఁ దగిల్చి రాఁదిగిచి సంపూర్ణోద్ధతిన్ రోఁకటన్¯ వేషంబుల్ చెడమొత్తె రాముఁడు రణోర్విన్ నెత్తురుల్ జొత్తిలన్. (1566) హలిహలహృత కరికుంభ¯ స్థల ముక్తాఫలము లోలిఁ దనరెఁ గృషిక లాం¯ గల మార్గ కీర్ణ బీజా¯ వలి కైవడి నద్భుతాహవక్షేత్రమునన్. (1567) తఱిమి హలి హలము విసరుచు¯ నెఱిఁ గదిసిన బెగడి విమతనికరము లెడలై¯ వెఱఁగుపడు నొదుఁగు నడఁగును¯ మఱుపడుఁ జెడు మడియుఁ బొరలు మరలుం దెఱలున్. (1568) హరి తిగ్మగోశతంబుల¯ హరిదంతర మెల్లఁ గప్పు నాకృతిఁ గడిమిన్¯ హరి తిగ్మగోశతంబుల¯ హరిదంతర మెల్లఁ గప్పె నతిభీకరుఁడై. (1569) పదుగురేగురు దీర్ఘబాణము ల్గాఁడిన¯ గుదులు గ్రుచ్చిన భంగిఁ గూలువారుఁ; ¯ దలలు ద్రెవ్విన మున్ను దారు వీక్షించిన¯ వారల నొప్పించి వ్రాలువారుఁ; ¯ బదములు దెగిబడ్డ బాహులఁ బోరి ని¯ ర్మూలిత బాహులై మ్రొగ్గువారు; ¯ క్షతముల రుధిరంబు జల్లింప నిర్ఝర¯ యుత శైలములభంగి నుండువారు; (1569.1) భ్రాతృ పుత్ర మిత్ర బంధువుల్ వీఁగిన¯ నడ్డమరుగుదెంచి యడఁగువారు; ¯ వాహనములు దెగిన వడి నన్యవాహనా¯ ధిష్ఠులగుచు నెదిరి ద్రెళ్ళువారు. (1570) ఈ కాయంబులఁ బాసినంతటనె మా కెగ్గేమి? జేతృత్వమున్¯ నీకుం జెల్లదు కృష్ణ! నిర్జరులమై నిన్నోర్తు మీమీఁదటన్¯ వైకుంఠంబున నంచుఁ బల్కు క్రియ దుర్వారాస్త్ర భిన్నాంగులై¯ యాకంపింపక గొందఱాడుదురు గర్వాలాపముల్ గృష్ణునిన్. (1571) ఇ వ్విధంబున. (1572) జగతీశ! యేమిచెప్పుదు? ¯ నగణితలయవార్ధి భయదమై మూఁగిన య¯ మ్మగధేశు బలము నెల్లను¯ దెగఁ జూచిరి హరియు హలియుఁ దీవ్రక్రీడన్. (1573) భువన జనుస్థితవిలయము¯ లవలీలం జేయు హరికి నరినాశన మెం¯ త విషయమైన మనుజుఁడై¯ భవ మొందుటఁ జేసి పొగడఁ బడియెం గృతులన్. (1574) ఆ సమయంబున. (1575) అంహఃకర్ములు దల్లడిల్ల భయదాహంకారుఁడై సీరి దో¯ రంహం బొప్ప హలాహతిన్ రథ ధనూరథ్యంబులం గూల్చి త¯ త్సంహారస్పృహఁ జొచ్చి పట్టెను జరాసంధున్ మదాంధున్ మహా¯ సింహంబుం బ్రతిసింహముఖ్యము బలశ్రీఁ బట్టు నేర్పేర్పడన్. (1576) ఇట్లు పట్టుకొని.

జరాసంధుని విడుచుట

(1577) కుంఠితులై పరుల్ బెగడ ఘోరబలుండు బలుండు వాని సో¯ ల్లుంఠము లాడుచుం దిగిచి లోకభయంకరమైన ముష్టిచేఁ¯ గంఠగతాసుఁ జేసి తమకంబున మొత్తఁగ భూభరక్షయో¯ త్కంఠుఁడు చక్రి మీఁదెఱిఁగి కార్యము గల్దని మాన్పి యిట్లనున్. (1578) "దుఃఖింపం బనిలేదు; పొమ్ము; బలసందోహంబులం దెమ్ము; చే¯ తఃఖేదం బెడలంగ రమ్ము; రిపులం దండింపు; కాదేని భూ¯ స్వఃఖేలజ్జన మెల్ల మెచ్చ నృప! నీ శౌర్యోన్నతుల్ జూపి మే¯ దఃఖండంబులు భూతముల్ దినఁ దనుత్యాగంబు చేయం దగున్." (1579) అని నగుచు విడిపించిన విడివడి చిడిముడికి నగ్గలంబైన సిగ్గున మ్రొగ్గి నెమ్మొగంబు చూపక, కోప కపట భావంబులు మనంబునం బెనంగొనఁ దపంబు చేసి యైన వీరలం జయించెద నని పలాయితులైన రాజులం గూడుకొనుచు జరాసంధుండు విరిగి చనియె; సురలు కుసుమవర్షంబులు గురియ హలియు హరియును మధురానగర జన వందిమాగధ జేగీయమానులై వీణా వేణు మృదంగ శంఖ దుందుభి నినదంబు లాకర్ణించుచు, మృగమద జలసిక్త విమల వీధికాశతంబును, వివిధ విచిత్ర కేతనాద్యలంకృతంబును సువర్ణ మణిమయ జయస్తంభ నిబద్ధ తోరణ సంయుతంబును, వేద నాద నినాదితంబును, సంతుష్టజన సంకుల గోపురంబునునైన పురంబుఁ బ్రవేశించి; రందు. (1580) "వెల్లువలైన వైరినృపవీరుల నెల్ల జయించి వీటికిన్¯ బల్లిదులైన కృష్ణబలభద్రులు వచ్చుచునున్నవారు రం; ¯ డుల్లములారఁ జూత" మని యున్నత సౌధము లెక్కి వారిపైఁ¯ బల్లవ పుష్ప లాజములఁ బౌరపురంధ్రులు చల్లి రెల్లెడన్. (1581) ఇట్లు పురంబు ప్రవేశించి యుద్ధప్రకారంబెల్ల నుగ్రసేనున కెఱింగించి కృష్ణుం డిచ్ఛావిహారంబుల నుండె; మఱియు నెక్కువ మత్సరంబున నమ్మాగధుండు మహీమండలంబునంగల దుష్టమహీపతుల నెల్లం గూడుకొని సప్తదశ వారంబులు సప్తదశాక్షౌహిణీ బల సమేతుండై మథురానగరంబుపై విడిసి మాధవ భుజాప్రాకార రక్షితు లగు యాదవులతోడ నాలంబు చేసి నిర్మూలిత బలుండై పోయి క్రమ్మఱ నష్టాదశ యుద్ధంబునకు వచ్చునెడం గలహ విద్యావిశారదుం డగు నారదుండు కాలయవను కడకుం జని యిట్లనియె.

కాలయవనునికి నారదుని బోధ

(1582) "యవనా! నీవు సమస్త భూపతుల బాహాఖర్వగర్వోన్నతిం¯ బవనుం డభ్రములన్ హరించు పగిదిన్ భంజించియున్నేల యా¯ దవులన్ గెల్వవు? వారలన్ మఱచియో దర్పంబు లేకుండియో? ¯ యవివేకస్థితి నొందియో? వెఱచియో? హైన్యంబునం జెందియో? (1583) యాదవులలోన నొక్కఁడు¯ మేదినిపై సత్వరేఖ మెఱసి జరాసం¯ ధాదులఁ దూలం దోలెనుఁ¯ దాదృశుఁ డిలలేడు వినవె తత్కర్మంబుల్." (1584) అనిన విని, కాలయవనుం డిట్లనియె. (1585) "ఏమీ; నారద! నీవు చెప్పిన నరుం డే రూపువాఁ? డెంతవాఁ? ¯ డే మేరన్ విహరించు? నెవ్వఁడు సఖుం? డెందుండు? నేపాటి దో¯ స్సామర్థ్యంబునఁ గయ్యముల్ సలుపు? నస్మద్బాహు శౌర్యంబు సం¯ గ్రామక్షోణి భరించి నిల్వఁ గలఁడే? గర్వాఢ్యుఁడే? చెప్పుమా!" (1586) అనిన విని దేవముని యిట్లనియె. (1587) "నీలజీమూత సన్నిభ శరీరమువాఁడు¯ తామరసాభ నేత్రములవాఁడు¯ పూర్ణేందుబింబంబుఁ బోలెడి మోమువాఁ¯ డున్నత దీర్ఘ బాహువులవాఁడు ¯ శ్రీవత్సలాంఛనాంచిత మహోరమువాఁడు¯ కౌస్తుభమణి పతకంబువాఁడు ¯ శ్రీకర పీతకౌశేయ చేలమువాఁడు¯ మకరకుండల దీప్తి మలయువాఁడు (1587.1) రాజ! యింతంతవాఁ డనరానివాఁడు¯ మెఱసి దిక్కుల నెల్లను మెఱయువాఁడు¯ తెలిసి యే వేళలందైనఁ దిరుగువాఁడు¯ పట్టనేర్చినఁ గాని లోఁబడనివాఁడు." (1588) అని మఱియు నితర లక్షణంబులుం జెప్పిన విని, సరకుజేయక. (1589) “యాదవుఁ డెంతవాఁడు ప్రళయాంతకుఁడైన నెదిర్చె నేనియుం¯ గాదనఁ బోర మత్కలహ కర్కశ బాహుధనుర్విముక్త నా¯ నా దృఢ హేమపుంఖ కఠినజ్వలదస్త్ర పరంపరా సము¯ ద్పాదిత వహ్నికీలముల భస్మము చేసెదఁ దాపసోత్తమా!”

కాలయవనుని ముట్టడి

(1590) అని పలికి కాలయవనుండు మూడుకోట్ల మ్లేచ్ఛవీరులం గూడుకొని, శీఘ్రగమనంబున దాడివెడలి, మథురాపురంబుమీఁద విడిసినం జూచి, బలభద్ర సహితుండై కృష్ణుం డిట్లని వితర్కించె. (1591) "యవనుండు పుర మెల్ల నావరించెను నేటి¯ యెల్లిటి యెల్లుండి యీ నడుమను¯ మాగధుండును వచ్చి మనమీఁద విడియును¯ యవన మాగధులు మహాప్రబలులు¯ పురి రెండువంకలఁ బోరుదు రట్టిచో¯ నోపిన భంగి నొక్కొక్కచోట¯ మనము యుద్ధముఁ సేయ మఱియొక్కఁ డెడఁ సొచ్చి¯ బంధుల నందఱఁ బట్టి చంపు (1591.1) నొండె గొనిపోయి చెఱఁబెట్టు నుగ్రకర్ముఁ¯ డైన మాగధుఁ; డదిగాన యరివరులకు¯ విడియఁ బోరాడఁగా రాని విషమభూమి¯ నొక్క దుర్గంబుఁ జేసి యం దునుపవలయు." (1592) అని వితర్కించి సముద్రు నడిగి సముద్రమధ్యంబునం బండ్రెండు యోజనంబుల నిడుపు నంతియ వెడల్పుం గల దుర్గమ ప్రదేశంబు సంపాదించి, తన్మధ్యంబునం గృష్ణుండు సర్వాశ్చర్యకరంబుగ నొక్క నగరంబు నిర్మింపు మని విశ్వకర్మం బంచిన.

ద్వారకానగర నిర్మాణము

(1593) వరుణుపురముకంటె వాసవుపురికంటె¯ ధనదువీటికంటె దండధరుని¯ నగరికంటె బ్రహ్మ నగరంబుకంటెఁ బ్ర¯ స్ఫుటముగాఁగ నొక్క పురముఁ జేసె. (1594) అందు. (1595) ఆకసము తోడిచూ లనఁ ¯ బ్రాకారము పొడవు గలదు పాతాళమహా¯ లోకముకంటెను లోఁ తెం¯ తో కల దా పరిఖ యెఱుఁగ దొరక దొకరికిన్. (1596) కోటయు మిన్నును దమలోఁ¯ బాటికి జగడింప నడ్డపడి నిల్చిన వా¯ చాటుల రుచిఁ దారకములు¯ కూటువలై కోటతుదలఁ గొమరారుఁ బురిన్. (1597) సాధుద్వార కవాట కుడ్య వలభి స్తంభార్గళాగేహళీ¯ వీధీవేది గవాక్ష చత్వర సభా వేశ్మ ప్రఘాణ ప్రపా¯ సౌధాట్టాలక సాల హర్మ్య విశిఖా సౌపాన సంస్థానముల్¯ శ్రీధుర్యస్థితి నొప్పుఁ గాంచనమణి స్నిగ్ధంబులై య ప్పురిన్. (1598) కూడి గ్రహంబులు దిరుగఁగ¯ మేడలతుది నిలువులందు మెలఁగెడి బాలల్¯ క్రీడింపరు పురుషులతో¯ వ్రీడం దద్వేళ లందు విను మా వీటన్. (1599) ఆయత వజ్ర నీలమణి హాటక నిర్మిత హర్మ్య సౌధ వా¯ తాయనరంధ్ర నిర్యదసితాభ్ర మహాగరు ధూపధూమముల్¯ తోయద పంక్తులో యనుచుఁ దుంగమహీరుహ రమ్యశాఖలం¯ జేయుచునుండుఁ దాండవవిశేషము ల ప్పురి కేకిసంఘముల్. (1600) సరస నడచుచుండి సౌధాగ్ర హేమ కుం¯ భములలోన నినుఁడు ప్రతిఫలింప¯ నేర్పరింపలేక నినులు పెక్కం డ్రంచుఁ ¯ బ్రజలు చూచి చోద్యపడుదు రందు. (1601) శ్రీరమణీయ గంధములఁ జెన్నువహించుఁ బురీవనంబులం¯ గోరక జాలకస్తబక కుట్మల పుష్పమరందపూర వి¯ స్ఫార లతా ప్రకాండ విటపచ్ఛద పల్లవవల్లరీ శిఫా¯ సారపరాగ మూల ఫల సంభృత వృక్షలతా విశేషముల్. (1602) శ్రీకరములు జనహృదయ వ¯ శీకరములు మందపవనశీర్ణ మహాంభ¯ శ్శీకరములు హంస విహం¯ గాకరములు నగరి కువలయాబ్జాకరముల్. (1603) నవకుసుమామోద భరా¯ జవనము రతిఖిన్నదేహజ స్వేదాంభో¯ లవనము సమధిగతవనము¯ పవనము విహరించుఁ బౌరభవనము లందున్. (1604) బ్రహ్మత్వము లఘు వగు నని ¯ బ్రహ్మయు బిరుదులకు వచ్చి పట్టఁడుగా కా¯ బ్రహ్మాది కళలఁ దత్పురి ¯ బ్రహ్మజనుల్ బ్రహ్మఁ జిక్కు వఱుపరె చర్చన్ (1605) నగరీభూసుర కృత లస¯ దగణిత మఖధూమ పిహితమై గాక మహా¯ గగనము నీలం బగునే? ¯ మిగులఁగ బెడగగునె గ్రహసమృద్ధం బయ్యున్. (1606) తిరుగరు పలు కర్థులకును¯ సురుఁగరు ధన మిత్తు రితర సుదతీమణులన్¯ మరుగరు రణమునఁ బిఱిఁదికి¯ నరుగరు రాజన్యతనయు లా నగరమునన్. (1607) రత్నాకరమై జలనిధి¯ రత్నము లీ నేర దద్ది రత్నాకరమే? ¯ రత్నములఁ గొనుదు రిత్తురు¯ రత్నాకరజయులు వైశ్యరత్నములు పురిన్. (1608) తుంగంబులు కరహత గిరి¯ శృంగంబులు దానజల వశీకృత భంగీ¯ భృంగంబులు శైలాభ స¯ మాంగంబులు నగరి మత్తమాతంగంబుల్. (1609) ప్రియములు జితపవన మనో¯ రయములు కృతజయము లధికరమణీయ గుణా¯ న్వయములు సవినయములు ని¯ ర్భయములు హతరిపుచయములు పట్టణ హయముల్. (1610) పులుల పగిదిఁ గంఠీరవ¯ ముల క్రియ శరభముల మాడ్కి ముదిత మదేభం¯ బుల తెఱఁగున నానావిధ¯ కలహమహోద్భటులు భటులు గల రా వీటన్. (1611) ఆ వీట నుండువారికి¯ భావింపఁగ లేవు క్షుత్పిపాసాదులు త¯ ద్గోవింద కృపావశమున¯ దేవప్రతిమాను లగుచు దీపింతు రిలన్. (1612) ఆసక్తి కృష్ణముఖావలోకనమంద¯ హరిపాదసేవనమంద చింత¯ వెఱపు నారాయణ విముఖకార్యములంద¯ పారవశ్యము విష్ణుభక్తి యంద¯ బాష్పనిర్గతి చక్రిపద్య సంస్తుతులంద¯ పక్షపాతము శార్ఙ్గిభక్తులంద¯ లేమి గోవిందాన్య లీలాచరణమంద¯ శ్రమము గోవిందపూజనములంద (1612.1) బంధ మచ్యుతపరదుష్టపథములంద ¯ జ్వరము మాధవవిరహితక్షణములంద¯ మత్సరము లీశు కైంకర్యమతములంద¯ నరవరోత్తమ! వినుము త న్నాగరులకు. (1613) మఱియు న ప్పురవరంబున హరికిం బారిజాతమహీజంబును సుధర్మ మనియెడి దేవసభను దేవేంద్రుం డిచ్చెఁ; గర్ణైకదేశంబుల నలుపు గలిగి మనోజవంబులును శుక్లవర్ణంబులు నైన తురంగంబుల వరుణుం డొసంగె; మత్స్య కూర్మ పద్మ మహాపద్మ శంఖ ముకుంద కచ్ఛప నీలంబు లను నెనిమిది నిధులఁ గుబేరుండు సమర్పించె; నిజాధికార సిద్ధికొఱకుఁ దక్కిన లోకపాలకులును దొల్లి తమకు భగవత్కరుణా కటాక్షవీక్షణంబుల సంభవించిన సర్వసంపదల మరల నతిభక్తితో సమర్పించి రి వ్విధంబున. (1614) దర్పించి చేసి పురము స¯ మర్పించెను విశ్వకర్మ మంగళగుణ సం¯ తర్పిత గహ్వరికిని గురు¯ దర్పిత దుఃఖప్రవాహ తరికిన్ హరికిన్.

పౌరులను ద్వారకకు తెచ్చుట

(1615) ఇట్లు విశ్వకర్మ నిర్మితంబైన ద్వారకానగరంబునకు నిజయోగ ప్రభావంబున మథురాపురజనుల నందఱం జేర్చి, బలభద్రున కెఱింగించి; తదనుమతంబున నందనవనంబు నిర్గమించు పూర్వదిగ్గజంబు పెంపున, మేరుగిరిగహ్వరంబు వెలువడు కంఠీరవంబు తెఱంగున హరిహయ దిగంతరాళంబున నుదయించు నంధకారపరిపంథికైవడి మథురానగరంబు వెలువడి నిరాయుధుండై యెదుర వచ్చుచున్న హరిం గని. (1616) "కరి సంఘంబులు లేవు; రావు తురగౌఘంబుల్; రథవ్రాతముల్¯ పరిసర్పింపవు; రారు శూరులు ధనుర్భాణాసి ముఖ్యాయుధో¯ త్కరముం బట్టఁడు; శక్రచాప యుత మేఘస్ఫూర్తితో మాలికా¯ ధరుఁ డొక్కం డదె నిర్గమించె నగరద్వారంబునం గంటిరే. (1617) ఎన్నే నయ్యె దినంబు లీ నగరిపై నేతెంచి పోరాటకున్¯ మున్నెవ్వండును రాఁడు వీఁడొకఁడు నిర్ముక్తాయుధుం డేగు దెం¯ చెన్న న్నోర్వఁగనో ప్రియోక్తులకునో శ్రీఁ గోరియో చూడుఁ" డం¯ చు న్నాత్మీయజనంబుతోడ యవనేశుం డిట్లు తర్కింపఁగన్. (1618) విభులగు బ్రహ్మప్రముఖుల¯ కభిముఖుఁడై నడవకుండునట్టి గుణాఢ్యుం¯ డిభరాజగమన మొప్పఁగ¯ నభిముఖుఁడై నడచెఁ గాలయవనున కధిపా. (1619) ఆ సమయంబు న య్యాదవేంద్రుని నేర్పడం జూచి. (1620) వనజాతాక్షుఁడు సింహమధ్యుఁడు రమావక్షుండు శ్రీవత్సలాం¯ ఛనుఁ డంభోధరదేహుఁ డిందుముఖుఁ డంచద్దీర్ఘబాహుండు స¯ ద్వనమాలాంగద హార కంకణ సముద్యత్కుండలుం డీతఁ డా¯ ముని సూచించిన వీరుఁ డౌ ననుచు న మ్మూఢుండు గాఢోద్ధతిన్.

కాలయవనుడు వెంటజనుట

(1621) చటులవాలాభీల సైంహికేయుని భంగి¯ లాలితేతర జటాలతిక దూలఁ ¯ బ్రళయావసర బృహద్భాను హేతిద్యుతిఁ¯ బరుషారుణ శ్మశ్రుపటలి వ్రేలఁ¯ గాదంబినీఛన్న కాంచనగిరిభాతిఁ¯ గవచ సంవృత దీర్ఘకాయ మమర¯ వల్మీక సుప్త దుర్వారాహి కైవడిఁ¯ గోశంబులో వాలు కొమరు మిగుల (1621.1) నార్చి పేర్చి మించి యశ్వంబుఁ గదలించి¯ కమలసంభవాది ఘనులకైనఁ¯ బట్టరాని ప్రోడఁ బట్టెద నని జగ¯ దవనుఁ బట్టఁ గదిసె యవనుఁ డధిప! (1622) ఇటు దన్నుఁ బట్టవచ్చినఁ¯ బటుతర జవరేఖ మెఱసి పట్టుబడక ది¯ క్తటము లదుర హరి పాఱెం¯ జటులగతిన్ వాఁడు దోడఁ జనుదేరంగన్. (1623) అప్పుడు కాలయవనుం డిట్లనియె. (1624) "యదువంశోత్తమ! పోకుపోకు రణ మీ నర్హంబు; కంసాదులం¯ గదనక్షోణి జయించి తీ వని సమిత్కామంబునన్ వచ్చితిన్; ¯ విదితఖ్యాతులు వీటిపోవ నరికిన్ వెన్నిచ్చి యిబ్భంగి నే¯ గుదురే రాజులు? రాజమాతృఁడవె? వైగుణ్యంబు వచ్చెంజుమీ? (1625) బలిమిన్ మాధవ! నేఁడు నిన్ను భువనప్రఖ్యాతిగాఁ బట్టుదున్¯ జలముల్ సొచ్చిన, భూమి క్రిందఁ జనినన్, శైలంబుపై నెక్కినన్, ¯ బలిదండన్ విలసించినన్, వికృతరూపంబుం బ్రవేశించినన్, ¯ జలధిన్ దాఁటిన, నగ్రజన్మ హలి కాశ్వాటాకృతుల్ దాల్చినన్. (1626) అదియునుం గాక. (1627) శరముల్ దూఱవు; మద్ధనుర్గుణలతాశబ్దంబు లేతేర; వీ¯ హరిరింఖోద్ధతిధూళి గప్ప; దకటా! హాస్యుండవై పాఱె; దు¯ ర్వరపై నే క్రియఁ బోరితో కదిసి మున్ వాతాశితోఁ గేశితో¯ గరితో మల్లురతో జరాతనయుతోఁ గంసావనీనాథుతోన్." (1628) అని పలుకుచుఁ గాలయవనుండు వెంట నరుగుదేర సరకుచేయక మందహాసంబు ముఖారవిందంబునకు సౌందర్యంబు నొసంగ “వేగిరపడకు; రమ్ము ర” మ్మనుచు హరియును. (1629) అదె యిదె లోఁబడె నని పట్టవచ్చినఁ¯ గుప్పించి లంఘించుఁ గొంతతడవు¯ పట్టరా; దీతని పరు వగ్గలం బని¯ భావింపఁ దన సమీపమున నిలుచు¯ నడరి పార్శ్వంబుల కడ్డంబు వచ్చినఁ¯ గేడించి యిట్టట్టు గికురుపెట్టు; ¯ వల్మీక తరు సరోవరము లడ్డంబైన¯ సవ్యాపసవ్య సంచరతఁ జూపుఁ; (1629.1) బల్లముల డాఁగు; దిబ్బల బయలుపడును; ¯ నీడలకుఁ బోవు; నిఱుముల నిగిడి తాఱు¯ "నన్నుఁ బట్టిన నీవు మానవుఁడ"వనుచు¯ యవనుఁ డెగువంగ బహుజగదవనుఁ డధిప! (1630) మఱియును. (1631) సకలభూతవ్రాత సంవాసుఁ డయ్యును¯ వనములు నగములు వరుస దాఁటు; ¯ లోకోన్నతుండును లోకచక్షుఁడు నయ్యు¯ మాటిమాటికి నిక్కి మగిడి చూచుఁ; ¯ బక్ష విపక్ష సంబంధ శూన్యుం డయ్యుఁ¯ దనుఁ విపక్షుఁడు వెంటఁ దగుల నిగుడు; ¯ విజయాపజయభావ విరహితుం డయ్యుఁ దా¯ నపజయంబునుఁ జెందినట్లు తోఁచు; (1631.1) నభయ భయ విహీనుఁ డయ్యు భీతుని మాడ్కిఁ¯ గానఁబడును సర్వకాలరూపుఁ¯ డయ్యుఁ గాలచకితుఁడైన కైవడి వన¯ మాలి పఱచు వెఱపుమాలి యధిప! (1632) ఇ వ్విధంబున. (1633) దారిత శాత్రవ భవను న¯ పార మహావేగ విజిత పవనున్ యవనున్¯ దూరఁము గొనిచని కృష్ణుఁడు¯ ఘోరంబగు నొక్క శైలగుహ వడిఁ జొచ్చెన్. (1634) అదె లోఁబడె నిదె లోఁబడె¯ నదె యిదె పట్టెద నటంచు నాశావశుఁడై¯ యదుసింహుని పదపద్ధతి¯ వదలక గిరిగహ్వరంబు వాఁడుం జొచ్చెన్. (1635) ఇట్లు చొచ్చి మూఢహృదయంబునుం బోలెఁ దమఃపూర్ణంబయిన గుహాంతరాళంబున దీర్ఘతల్పనిద్రితుండయి గుఱక లిడుచున్న యొక్క మహాపురుషునిం గని శ్రీహరిగాఁ దలంచి. (1636) “ఆలము చేయలేక పురుషాధమ! దుర్లభ కంటకద్రుమా¯ భీల మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గ సింహ శా¯ ర్దూల తరక్షు సంకలిత దుర్గపథంబునఁ బాఱుతెంచి యీ¯ శైలగుహన్ సనిద్రుక్రియఁ జాఁగి నటించినఁ బోవనిత్తునే? (1637) ఎక్కడ నెవ్వారలకును¯ జిక్క వనుచు నారదుండు చెప్పెను; నాకుం¯ జిక్కి తి వెక్కడఁ బోయెదు? ¯ నిక్కముగా నిద్రపుత్తు ని న్నీ కొండన్.”

కాలయవనుడు నీరగుట

(1638) అనుచు యవనుఁ డట్టహాసంబు గావించి¯ చటుల కఠిన కులిశ సదృశమైన¯ పాదమెత్తి తన్నెఁ బాఱి తద్దేహంబు¯ నగగుహం బ్రతిస్వనంబు నిగుడ. (1639) తన్నిన లేచి నీల్గి కనుదమ్ములు మెల్లన విచ్చి లోపలన్¯ సన్నపు గిన్క వర్ధిల దిశల్గని దృష్టి సమిద్ధ విగ్రహో¯ త్పన్న మహాగ్నికీలముల భస్మముచేసె నతండు సాయక¯ చ్ఛిన్నవిరోధికంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్. (1640) ఇట్లేక క్షణమాత్రంబున యవనుండు నీఱయ్యె” ననిన విని రాజు యిట్లనియె. (1641) "ఎవ్వఁడాతఁ డతని కెవ్వండు దండ్రి? ఘో¯ రాద్రిగుహకు నేటి కతఁడు వచ్చి¯ నిద్రపోయె? యవను నిటు గాల్ప నెట్లోపెఁ? ¯ దెలియఁ బలుకు నాకు ధీవరేణ్య!" (1642) అనినం బరీక్షిన్నరేంద్రునకు నతికుతూహలంబుతో శుకయోగివర్యుం డిట్లనియె “నిక్ష్వాకు కులసంభవుండు మాంధాత కొడుకు ముచికుందు డను రాజు, రాక్షసభీతులైన వేల్పులం బెద్దగాలంబు సంరక్షించిన; మెచ్చి వా రమరలోక రక్షకుండైన యా రాజకుమారుని కడకుం జేరి వరంబు వేఁడు మనిన; వారలం గనుంగొని మోక్షపదం బడిగిన; వార లతని కిట్లనిరి. (1643) "జగతిన్ నిర్గతకంటకం బయిన రాజ్యంబున్ విసర్జించి శూ¯ రగణాగ్రేసర! పెద్దకాలము మమున్ రక్షించి; తీలోన నీ¯ మగువల్ మంత్రులు బంధులున్ సుతులు సంబంధుల్ భువిన్లేరు కా ¯ లగతిం జెందిరి; కాల మెవ్వరికి దుర్లంఘ్యంబు దా నారయన్. (1644) కాలము ప్రబలురకును బలి¯ కాలాత్ముం డీశ్వరుం డగణ్యుఁడు జనులం¯ గాలవశులఁగాఁ జేయును¯ గాలముఁ గడవంగలేరు ఘను లెవ్వారున్. (1645) వర మిచ్చెద మర్థింపుము¯ ధరణీశ్వర! మోక్షపదవి దక్కను మే మె¯ వ్వరమును విభులము గా మీ¯ శ్వరుఁ డగు హరి దక్క మోక్షసంగతిఁ జేయన్." (1646) అని పలికిన దేవతలకు, నమస్కరించి ముచికుందుఁడు నిద్రఁ గోరి దేవదత్త నిద్రావశుండయ్యి పర్వతగుహాంతరాళంబున శయనించి యుండె; యవనుండు నీఱయిన పిమ్మట హరి ముచికుందుని ముందఱ నిల్చిన. (1647) వనరుహలోచను వైజయంతీదామ¯ శోభితు రాకేందు సుందరాస్యు¯ మకరకుండలకాంతి మహితగండస్థలుఁ¯ గౌస్తుభగ్రైవేయు ఘనశరీరు ¯ శ్రీవత్సలాంఛనాంచితవక్షు మృగరాజ¯ మధ్యుఁ జతుర్భాహు మందహాసుఁ¯ గాంచన సన్నిభ కౌశేయవాసు గాం¯ భీర్య సౌందర్య శోభితుఁ బ్రసన్ను (1647.1) న మ్మహాత్ముఁ జూచి యాశ్చర్యమును బొంది¯ తన్మనోజ్ఞదీప్తిఁ దనకుఁ జూడ¯ నలవిగాక చకితుఁడై యెట్టకేలకుఁ¯ బలికెఁ బ్రీతి నవనిపాలకుండు. (1648) "శశివో? యింద్రుఁడవో? విభావసుఁడవో? చండప్రభారాశివో? ¯ శశిచూడామణివో? పితామహుఁడవో? చక్రాంకహస్తుండవో? ¯ దిశలున్ భూమియు మిన్ను నిండె నిదె నీ తేజంబుఁ జూడంగ దు¯ ర్వశ; మెవ్వండ విటేల వచ్చి తిచటన్ వర్తించె దేకాకివై. (1649) ఈ యడవి విషమకంటక¯ భూయిష్ఠము ఘోరసత్వపుం జాలభ్యం¯ బో! యయ్య! యెట్లు వచ్చితి? ¯ నీ యడుగులు కమలపత్ర నిభములు సూడన్. (1650) మహాత్మ! యేను నీకు శుశ్రూషణంబుజేయం గోరెద నీ జన్మగోత్రంబు లెఱింగింప నే నర్హుండనైన నెఱింగింపు; నే నిక్ష్వాకువంశ సంభవుండను; మాంధాతృ నందనుండను; ముచికుందుం డనువాఁడ; దేవహితార్థంబు చిరకాల జాగరశ్రాంతుండనై నిద్ర నొంది యింద్రియ సంచారంబులు మఱచి. (1651) ఏ నిద్రించుచు నుండ నొక్క మనుజుం డేతెంచి దుష్కర్ముఁడై¯ తా నీఱై చెడె నాత్మకిల్బిషమునన్ దర్పోగ్రుడై; యంతటన్¯ శ్రీనాథాకృతివైన నిన్నుఁ గని వీక్షింపన్నశక్తుండనై¯ దీనత్వంబునుఁ జెందితిన్ ననుఁ గృపాదృష్టిన్ విలోకింపవే." (1652) అనిన విని మేఘగంభీర భాషణంబుల హరి యిట్లనియె. (1653) "భూరజంబులనైన భూనాథ! యెన్నంగఁ¯ జనుఁ గాని నా గుణ జన్మ కర్మ¯ నామంబు లెల్ల నెన్నంగ నెవ్వరుఁ జాల¯ రదియేల; నాకును నలవిగాదు¯ నేలకు వ్రేగైన నిఖిల రాక్షసులను¯ నిర్జించి ధర్మంబు నిలువఁబెట్ట ¯ బ్రహ్మచే మున్నునేఁ బ్రార్థింపఁబడి వసు¯ దేవు నింటను వాసుదేవుఁ డనఁగ (1653.1) గరుణ నవతరించి కంసాఖ్యతో నున్న¯ కాలనేమిఁ జంపి ఖలుల మఱియు ¯ ద్రుంచుచున్నవాఁడఁ దొడరి నీ చూడ్కి నీ¯ ఱైనవాఁడు కాలయవనుఁ డనఘ! (1654) వినుము; తొల్లియు నీవు నన్ను సేవించిన కతంబున నిన్ననుగ్రహింప నీ శైలగుహకు నేతెంచితి; నభీష్టంబులైన వరంబు లడుగు మిచ్చెద మద్భక్తులగు జనులు క్రమ్మఱ శోకంబున కర్హులు గా"రనిన హరికి ముచికుందుండు నమస్కరించి, నారాయణదేవుం డగుట యెఱింగి యిరువదియెనిమిదవ మహాయుగంబున నారాయణుం డవతరించు నని మున్ను గర్గుండు చెప్పుటఁ దలచి.

ముచికుందుడు స్తుతించుట

(1655) "నీ మాయఁ జిక్కి పురుష¯ స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు; వి¯ త్తామయ గృహగతమై సుఖ¯ తామసమై కామవంచితంబై యీశా! (1656) పూని యనేకజన్మములఁ బొంది తుదిం దన పుణ్యకర్మ సం¯ తానము పేర్మిఁ గర్మ వసుధాస్థలిఁ బుట్టి ప్రపూర్ణదేహుఁడై¯ మానవుఁడై గృహేచ్ఛఁబడు మందుఁ డజంబు తృణాభిలాషి యై¯ కానక పోయి నూతఁబడు కైవడి నీ పదభక్తిహీనుఁడై. (1657) తరుణీ పుత్ర ధనాదుల¯ మరిగి మహారాజ్యవిభవ మదమత్తుఁడనై¯ నరతను లుబ్ధుఁడ నగు నా¯ కరయఁగ బహుకాల మీశ! యాఱడుఁబోయెన్. (1658) ఘట కుడ్య సన్నిభం బగు¯ చటుల కళేబరముఁ జొచ్చి జనపతి నంచుం¯ బటు చతురంగంబులతో¯ నిటునటుఁ దిరుగుదును నిన్ను నెఱుఁగమి నీశా! (1659) వివిధ కామ లోభ విషయ లాలసు మత్తు¯ నప్రమత్తవృత్తి నంతకుండ¯ వైన నీవు వేళ యరసి త్రుంతువు సర్ప¯ మొదిఁగి మూషకంబు నొడియు నట్లు. (1660) నరవరసంజ్ఞితమై రథ¯ కరిసేవితమైన యొడలు కాలగతిన్ భీ¯ కరమృగభక్షితమై దు¯ స్తరవిట్క్రిమిభస్త్రిసంగతం బగు నీశా! (1661) సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగఁ¯ జారుపీఠ మెక్కి సార్వభౌముఁ¯ డైన సతులగృహము లందుఁ గ్రీడాసక్తి¯ వృత్తినుండు; నిన్ను వెదకలేఁడు. (1662) మానసంబు గట్టి మహితభోగంబులు¯ మాని యింద్రియముల మదము లడఁచి¯ తపము చేసి యింద్రతయ గోరుఁ గాని నీ¯ యమృత పదముఁ గోరఁ డజ్ఞుఁ డీశ! (1663) సంసారి యై యున్న జనునకు నీశ్వర!¯ నీ కృప యెప్పుడు నెఱయఁ గల్గు¯ నప్పుడ బంధంబు లన్నియుఁ దెగిపోవు¯ బంధమోక్షంబైనఁ బ్రాప్త మగును¯ సత్సంగమంబు; సత్సంగమంబున నీదు¯ భక్తి సిద్ధించు; నీ భక్తివలన¯ సన్ముక్తి యగు; నాకు సత్సంగమునకంటె¯ మును రాజ్యబంధ నిర్మూలనంబు (1663.1) గలిగినది దేవ! నీ యనుగ్రహము గాదె? ¯ కృష్ణ! నీ సేవగాని తక్కినవి వలదు; ¯ ముక్తి సంధాయి వగు నిన్ను ముట్టఁ గొలిచి¯ యాత్మబంధంబు గోరునే యార్యుఁ డెందు? (1664) కావున రజస్తమస్సత్వగుణంబుల ననుబంధంబు లగు నైశ్వర్య శత్రు మరణ ధర్మాది విశేషంబులు విడిచి యీశ్వరుండును విజ్ఞాన ఘనుండును, నిరంజనుండును, నిర్గుణుండును, నద్వయుండును నైన పరమపురుషుని ని న్నాశ్రయించెదఁ; జిరకాలంబు కర్మఫలంబులచేత నార్తుండనై క్రమ్మఱం దద్వాసనల సంతుష్టుండనై తృష్ణం బాయక శత్రువులైన యింద్రియంబు లాఱింటిని గెలువలేని నాకు శాంతి యెక్కడిది? విపన్నుండ నైన నన్ను నిర్భయుం జేసి రక్షింపు” మనిన ముచికుందునికి హరి యిట్లనియె. (1665) "మంచిది నీదు బుద్ధి నృపమండన! నీవు పరార్థ్య మెట్లు వ¯ ర్తించిన నైనఁ గోరికల దిక్కునఁ జిక్కవు మేలు నిర్మలో¯ దంచితవృత్తి నన్ గొలుచు ధన్యు లబద్ధులు నెట్లు నీకు ని¯ శ్చంచలభక్తి గల్గెడిని సర్వము నేలుము మాననేటికిన్. (1666) నరేంద్రా! నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి, మృగయావినోదంబుల జంతువుల వధియించినాఁడవు; తపంబునఁ దత్కర్మ విముక్తుండవై తర్వాతి జన్మంబున సర్వభూత సఖిత్వంబు గలిగి, బ్రాహ్మణ శ్రేష్ఠుండవై నన్నుఁ జేరెద” వని వీడ్కొలిపిన హరికిఁ బ్రదక్షింబు వచ్చి నమస్కరించి గుహ వెడలి సూక్ష్మప్రమాణ దేహంబులతో నున్న మనుష్య పశు వృక్షలతాదులం గని కలియుగంబు ప్రాప్తం బగు నని తలంచి యుత్తరాభిముఖుండై తపోనిష్ఠుం డగుచు సంశయంబులు విడిచి, సంగంబులు పరిహరించి విష్ణుని యందుఁ జిత్తంబు చేర్చి గంధమాదనంబు ప్రవేశించి మఱియు నరనారాయణ నివాసంబైన బదరికాశ్రమంబు చేరి, శాంతుండై హరి నారాధించుచుండె, నిట్లు ముచికుందుని వీడ్కొని. (1667) అచ్ఛిద్రప్రకట ప్రతాపరవిచే నాశాంతరాళంబులంన్¯ బ్రచ్ఛాదించుచుఁ గ్రమ్మఱన్ మథురకుం బద్మాక్షుఁ డేతెంచి వీ¯ డాచ్ఛాదించి మహానిరోధముగఁ జక్రాకారమై యున్న యా¯ మ్లేచ్ఛవ్రాతము నెల్లఁ ద్రుంచె రణభూమిం బెంపు సొంపారఁగన్.

జరసంధుడు గ్రమ్మర విడియుట

(1668) ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు న మ్మథురానగరంబునం గల ధనంబు ద్వారకానగరంబునకుం బంచిన మనుష్యులు గొనిపోవు నెడ. (1669) ఘోటకసంఘాత ఖురసమున్నిర్గత¯ ధూళి జీమూత సందోహముగను¯ మహనీయ మదకల మాతంగ కటదాన¯ ధారలు కీలాలధారలుగను¯ నిరుపమ స్యందననేమి నిర్ఘోషంబు¯ దారుణ గర్జిత ధ్వానముగను¯ నిశిత శస్త్రాస్త్ర మానిత దీర్ఘరోచులు¯ లలిత సౌదామినీ లతికలుగను (1669.1) శత్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను¯ వృష్టికాలము వచ్చు న వ్విధముఁ దోఁప¯ నేగుదెంచె జరాసంధుఁ డిరువదియును¯ మూడు నక్షౌహిణులు దన్ను మొనసి కొలువ. (1670) ఇటు చనుదెంచి యున్న మగధేశ్వర వాహినిఁ జూచి యుద్ధ సం¯ ఘటనము మాని మానవుల కైవడి భీరుల భంగి నోడి ముం¯ దటి ధనమెల్ల డించి మృదుతామరసాభ పదద్వయుల్ క్రియా¯ పటువులు రామకేశవులు పాఱిరి ఘోరవనాంతరంబులన్. (1671) ఇట్లు పఱచుచున్న కృష్ణబలభద్రులం జూచి వారల ప్రభావంబు లెఱుంగక పరిహసించి. (1672) "ఓ యదువీరులార! రభసోద్ధతిఁ బాఱకుఁ; డిట్లు పాఱినం¯ బోయెడువాఁడఁ గాను; మిము భూమి నడంగిన మిన్ను బ్రాకినం¯ దోయధిఁ జొచ్చినం దగిలి త్రుంచెద"నంచు సమస్త సేనతోఁ¯ బాయక వచ్చె వెంటఁబడి బాహుబలాఢ్యుఁడు మాగధేశుఁడున్.