పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 1456 - 1561

భ్రమర గీతములు

(1456) అని యిటు గోపికల్ పలుక నం దొక గోపిక కృష్ణపాదచిం¯ తనమునఁ జొక్కి చేరువను దైవవశంబునఁ గాంచె నుజ్జ్వల¯ త్సునిశిత సద్వివేకముఁ బ్రసూనమరంద మదాతిరేకమున్¯ ఘనమృదునాద సంచలిత కాముక లోకముఁ జంచరీకమున్. (1457) కని హరి దన్నుం బ్రార్థింపఁ బుత్తెంచిన దూత యని కల్పించుకొని యుద్ధవునికి నన్యాపదేశంబై యెఱుకపడ నయ్యళికిం దొయ్య లిట్లనియె. (1458) "భ్రమరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర¯ ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్ప్రాణేశదామప్రసూ¯ న మరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁగా¯ క మమున్నేఁపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్. (1459) ఒక పువ్వందలి తేనెఁ ద్రావి మధుపా! యుత్సాహివై నీవు వే¯ ఱొకటిం బొందెడి భంగి మ మ్మధరపియ్యూషంబునం దేల్చి మా¯ యకలం కోజ్జ్వల యౌవనంబు గొని యన్యాసక్తుఁ డయ్యెన్ విభుం¯ డకటా! యాతని కెట్లు దక్కె సిరి? మిధ్యాకీర్తి యయ్యెంజుమీ. (1460) భృంగా! కృష్ణుఁడు మంచివాఁ డనుచు సంప్రీతిం బ్రశంసించె; దీ¯ సంగీతంబున నేము చొక్కుదుమె? తచ్చారిత్రముల్ వింతలే? ¯ యంగీకారము గావు మాకుఁ; బురకాంతాగ్రప్రదేశంబులన్¯ సంగీతం బొనరింపు వారిడుదు రోజ న్నీకు నిష్ఠార్థముల్. (1461) సమదాళీశ్వర! చూడు ముజ్జ్వలిత హాసభ్రూవిజృంభంబులన్¯ రమణీయుండగు శౌరిచేఁ గరఁగరే రామల్ త్రిలోకంబులం? ¯ బ్రమదారత్నము లక్ష్మి యాతని పదాబ్జాతంబు సేవించు ని¯ క్కము నే మెవ్వర మా కృపాజలధికిం గారుణ్యముం జేయఁగన్? (1462) రోలంబేశ్వర! నీకు దౌత్యము మహారూఢంబు; నీ నేరుపుల్¯ చాలున్; మచ్చరణాబ్జముల్ విడువు మస్మన్నాథపుత్రాదులన్¯ లీలం బాసి పరంబు డించి తనకున్ లీనత్వముం బొందు మ¯ మ్మేలా పాసె విభుండు? ధార్మికులు మున్నీ చందముల్ మెత్తురే. (1463) వాలిం జంపెను వేటగాని పగిదిన్ వంచించి; దైత్యానుజన్¯ లోలం బట్టి విరూపిఁ జేసెను; బలిన్ లోభంబుతోఁగట్టి యీ¯ త్రైలోక్యంబు మొఱంగి పుచ్చుకొనియెన్; ధర్మజ్ఞుఁడే మాధవుం? ¯ డేలా షట్పద! యెగ్గు మా వలన నీ కెగ్గింపఁగా నేటికిన్. (1464) పన్నుగ మింటిపై కెగసి పాఱు విహంగములైన వీనులం¯ ద న్నొక మాటు విన్న గృహ దార సుతాదులఁ బాసి విత్తసం¯ పన్నత డించి సంసరణపద్ధతిఁ బాపెడువాఁడు నిత్యకాం¯ క్ష న్నెఱి నున్న మా బ్రతుకు సైఁచునె యేల మధువ్రతోత్తమా! (1465) కమనీయంబగు వేఁటకానిపలు కాకర్ణించి నిక్కంబుగాఁ¯ దమ చిత్తంబులఁ జేర్చి చేరి హరిణుల్ దద్బాణ నిర్భిన్నలై¯ యమితోగ్రవ్యధ నొందుభంగి హరిమాయాలాపముల్ నమ్మి దుః¯ ఖములం జెందితి మంగజాస్త్ర జనితోగ్రశ్రాంతి నిందిందిరా! (1466) బంధుల బిడ్డలన్ మగల భ్రాతలఁ దల్లులఁ దండ్రులన్ మనో¯ జాంధతఁ జేసి డించి తను నమ్మిన మమ్ము వియోగదుర్దశా¯ సింధువులోనఁ ద్రోచి యిటు చేరక పోవుట పాడిగాదు; పు¯ ష్పంధయ! మీ యధీశునకుఁ బాదములంబడి యొత్తి చెప్పవే. (1467) కాంచనరత్నసంఘటిత సౌధంబులే¯ మా కుటీరంబులు మాధవునకు? ¯ వివిధ నరేంద్రసేవిత రాజధానియే¯ మా పల్లె యదువంశమండనునకు? ¯ సురభిపాదప లతాశోభితారామమే¯ మా యరణ్యము సింహమధ్యమునకుఁ? ¯ గమనీయ లక్షణ గజ తురంగంబులే; ¯ మా ధేనువులు కంసమర్దనునకు? (1467.1) రూప విభ్రమ నైపుణ్య రూఢలైన¯ మగువలమె మేము మన్మథమన్మథునకు? ¯ నేల చింతించు మముఁ? గృష్ణుఁ డేల తలఁచుఁ? ¯ బృథివి నథిపులు నూతన ప్రియులు గారె. ?

ఉద్ధవుడు గోపికల నూరార్చుట

(1468) అని మఱియు నిట్లనేక విధంబులఁ గృష్ణసందర్శన లాలసలై పలుకుచున్న గోపికల వచనంబులు విని యుద్ధవుండు మధురాలాపంబుల నూరార్చుచు, యిట్లనియె. (1469) "జపదానవ్రత హోమ సంయమ తపస్స్వాధ్యాయ ముఖ్యంబులన్¯ నిపుణుల్ గోరియు నే విభున్ మనములన్ నిల్పంగలే రట్టి స¯ ద్విపులాకారునిపై మహామహిముపై విశ్వేశుపై మీ కజ¯ స్ర పటుధ్యానము లిట్లు నిల్చునె? భవచ్చారిత్రముల్ చిత్రముల్. (1470) నను మీకడకుం గృష్ణుఁడు¯ పనిపంపెడు వేళఁ బిలిచి పలికిన పలుకుల్¯ వినుఁ; డన్నియు వివరించెద¯ వనజేక్షణలార! మీరు వగవకుఁ డింకన్." (1471) అని హరివచనంబులుగా నిట్లనియె. (1472) "ఎల్లకార్యములకు నేను ప్రధానకా¯ రణము గావున, మీకు రమణులార! ¯ కలుగదు మద్వియోగము, చరాచరరూప¯ ములలో మహాభూతములు వసించు¯ కరణి నుండుదు సర్వగతుఁడనై నే మనః¯ ప్రాణ బుద్ధి గుణేంద్రి యాశ్రయుండ¯ నాత్మయం దాత్మచే నాత్మఁ బుట్టింతు ర¯ క్షింతును ద్రుంతు హృషీకభూత (1472.1) గుణగణాకార మాత్మలోఁ గొమరుమిగుల¯ నిబిడ మాయానుభవమున నిత్యశుద్ధ¯ మాత్మవిజ్ఞానమయము నై యమరు గుణము ¯ ప్రకృతికార్యమనోవృత్తిఁ బట్టి పొందు. (1473) కలఁగని లేచి మున్నుఁ గలఁ గన్న సమస్తవిధంబు గల్ల గాఁ¯ దలఁచిన భంగి మానసపదార్థముచే నిఖిలేంద్రియార్థముల్¯ బలమునఁ గట్టి తద్జ్ఞుఁడు ప్రపంచము లేదనుఁ దన్మనంబుఁ దా¯ రలయక గట్టుడున్ బుధుల కవ్వల నొండొక భేదమున్నదే? (1474) సాంఖ్య యోగ నిగమ సత్య తపో దమ¯ ములు మనోనిరోధమును గడపల¯ గాఁగ నుందు జలధి కడపలగాఁ గల¯ నదుల భంగి నళిననయనలార! (1475) చెలువల్ దవ్వుల నున్న వల్లభులపైఁ జిత్తంబులం గూర్తు రు¯ త్కలికం జేరువవారికంటె నదియుంగా దెప్పుడున్ నన్ను మీ¯ రలు చింతించుచు నుండఁగోరి యిటు దూరస్థత్వముం బొందితిం¯ దలకం బోలదు నన్నుఁ బొందెదరు నిత్యధ్యానపారీణులై."

ఉద్ధవునికడ గోపికలు వగచుట

(1476) అని మీకుం జెప్పు మని కృష్ణుండు సెప్పె” ననవుడు నుద్ధవునికి గోపికలు సంతసించి యిట్లనిరి. (1477) "ఇమ్ములనున్నవాఁడె హరి? యిక్కడి కెన్నడు వచ్చు వచ్చి మా¯ యుమ్మలికంబుఁ బాపునె ప్రియుం డిట వచ్చెదనన్న సైఁతురే? ¯ య మ్మథురాపురీ రమణు లడ్డము వత్తురుగాక చెల్లరే! ¯ మమ్ము విధాత నిర్దయుఁడు మన్మథవేదన పాలు సేసెనే. (1478) మఱచునొకో మదిం దలఁచి మాధవుఁ డా యమునాతటంబునం¯ దఱుచగు దివ్యసౌరభ లతా గృహసీమల నేము రాగ; మా¯ మఱువులనుండి నీడలకు మమ్మెలయించి కలంచి దేహముల్¯ మఱచినఁ దేల్చి నూల్కొలిపి మన్మథలీలలఁ దేల్చు చందముల్. (1479) నీతో నర్మగృహంబులం బలుకునే నే మెల్ల వంశోల్లస¯ ద్గీత భ్రాంతలమై కళిందతనయా తీరంబునం జేరినం¯ జేతోజాత సుఖంబులం దనిపి మా చిత్తస్థితుల్ చూడ లీ¯ లా తంత్రజ్ఞతఁ దాఁగి మెల్లన మదాలాపంబు లాలించుటల్. (1480) ముచ్చట వేళలఁ జెప్పునె¯ యచ్చుగ మును నేము నోము నప్పుడు జలముల్¯ సొచ్చిన మా చేలంబులు ¯ మ్రుచ్చిలి యిచ్చిన విధంబు మూలం బెల్లన్. (1481) ఏకాంతంబున నీదుపైఁ నొరగి తా నేమేని భాషించుచో¯ మా కాంతుండు వచించునే రవిసుతా మధ్యప్రదేశంబునన్¯ రాకాచంద్ర మయూఖముల్ మెఱయఁగా రాసంబు మాతోడ నం¯ గీకారం బొనరించి బంధనియతిం గ్రీడించు విన్నాణముల్. (1482) తనుఁబాసి యొక్కింత తడవైన నిటమీఁద¯ నేలపై మేనులు నిలువ వనుము¯ నేలపై మేనులు నిలువక యట మున్న¯ ధైర్యంబు లొక్కటఁ దలగు ననుము¯ ధైర్యంబు లొక్కటఁ దలఁగిన పిమ్మటఁ¯ జిత్తంబు లిక్కడఁ జిక్క వనుము¯ చిత్తంబు లిక్కడఁ జిక్కక వచ్చినఁ¯ బ్రాణంబు లుండక పాయు ననుము (1482.1) ప్రాణములుపోవ మఱి వచ్చి ప్రాణవిభుఁడు ¯ ప్రాణిరక్షకుఁ డగు తన్నుఁ బ్రాణులెల్లఁ¯ జేరి దూఱంగ మఱి యేమి సేయువాఁడు¯ వేగ విన్నప మొనరింపవే మహాత్మ! (1483) తగులరె మగలను మగువలు? ¯ దగులదె తను మున్ను కమల? తగవు విడిచియుం¯ దగిలిన మగువల విడుచుట¯ దఁగ దని తనుఁ దగవు బలుకఁ దగుదువు హరికిన్. (1484) విభుఁడు మా వ్రేపల్లె వీధుల నేతేరఁ¯ జూతుమే యొకనాడు చూడ్కు లలరఁ? ¯ బ్రభుఁడు మాతో నర్మభాషలు భాషింప¯ విందుమే యొకనాఁడు వీను లలరఁ? ¯ దనువులు పులకింప దయితుండు డాసినఁ¯ గలుగునే యొకనాఁడు కౌఁగలింపఁ? ¯ బ్రాణేశు! మమ్మేల పాసితి వని దూఱఁ¯ దొరకునే యొకనాఁడు తొట్రుపడఁగ? (1484.1) వచ్చునే హరి మే మున్న వనముఁ జూడఁ? ¯ దలఁచునే భర్త మాతోడి తగులు తెఱఁగుఁ? ¯ దెచ్చునే విధి మన్నాథుఁ దిట్టువడక? ¯ యెఱుఁగ బలుకు మహాత్మ! నీ కెఱుఁగ వచ్చు." (1485) అని “దుఃఖార్ణవమగ్నంబయిన గోపకులంబు నుద్ధరింపుము రమానాథ” యని గోపికలు వగచి తదనంతరంబ మఱియు నుద్ధవ నిగదితంబు లయిన కృష్ణసందేశంబులవలన విరహవేదనలు విడిచి యుద్ధవునిం బూజించి; రిట్లు కృష్ణలీలావర్ణనలు చేయుచు వ్రేపల్లె నుద్ధవుండు గొన్ని నెల లుండి నందాదుల వీడ్కొని మరలి రథారూఢుండై చనిచని. (1486) సారమతిఁ బ్రణుతి సేయుచు¯ నారయ నుద్ధవుఁడు గాంచె నఘసంహారిన్¯ హారిన్ మథురానగర వి¯ హారిన్ రిపుజన మదాపహారిన్ శౌరిన్. (1487) కని యథోచితంబుగా భాషించుచుఁ దనచేత నందాదులు పుత్తెంచిన కానుకలు బలకృష్ణులకు నుగ్రసేనునికి వేఱువేఱ యిచ్చె” నని చెప్పి శుకుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

కుబ్జగృహంబున కేగుట

(1488) "తను మున్నంగజకేళిఁ గోరిన లతాతన్విన్ రతిక్రీడలం¯ దనుపం గోరి జనార్దనుం డరిగె రత్నస్వర్ణ మాల్యాను లే¯ పన భూషాంబర ధూపదీప పరిదీప్తంబై మనోజప్రదీ¯ పనమై యున్న తదీయ గేహమునకుం బంచేషుపంచేషుఁడై. (1489) ఇ ట్లరిగి త ద్గేహంబున. (1490) కాము శరము వోలెఁ గమలారికళ వోలె¯ మెలఁగి యాడనేర్చు మెఱుఁగు బోలె¯ నిఖిలభువనమోహినీదేవతయుఁ బోలెఁ¯ జెలువు మెఱసియున్న చెలువఁ గనియె. (1491) హరి యేతెంచిన లేచి సంభ్రమముతో నాళీ సమూహంబుచే¯ సిరి యొప్పన్ విహితోపచారములు తాఁ జేయించి సౌవర్ణ సుం¯ దరతల్పస్థితుఁ జేసి యుద్ధవుని నుద్యత్ప్రీతిఁ బూజించి భా¯ సుర పీఠంబున నుండఁ బంచి మది నౌత్సుక్యంబు శోభిల్లఁగన్. (1492) ఆళీనివహ నివేదిత¯ మాలా మృగనాభిపంక మణిమయభూషా¯ చేలాలంకృత యగుచును¯ హేలావతి గోరె వనరుహేక్షణుఁ గవయన్.

కుబ్జతో క్రీడించుట

(1493) లీలావతీకృతోల్లస¯ దేలా కర్పూర మిళిత హిత మధుర మహా¯ హాలారసపాన మద¯ శ్రీలాలిత యగుచు నబల చేరెం గృష్ణున్. (1494) సరసాలోకనవృష్టి పైఁ గురియుచున్ సమ్యగ్వచో వైఖరిం¯ గరఁగం జేసి సువర్ణకంకణసమగ్రం బైన సైరంధ్రి కేల్¯ గరపద్మంబునఁ బట్టి తల్పమున కాకర్షించి గంభీరతం¯ బరిరంభాదుల నానపుచ్చి మరుసంభావించుచున్ వేడుకన్. (1495) జాతియుఁ గాలముం గళయు సత్వము దేశము భావచేష్టలున్¯ ధాతువుఁ బ్రాయముం గుణముఁ దద్దశయుం హృదయంబుఁ జూడ్కియుం¯ బ్రీతి విశేషముం దెలిసి పెక్కువిధంబులఁ దొయ్యలిన్ మనో¯ జాత సుఖంబులం దనిపె శౌరి వధూహృదయాపహారియై. (1496) కరపద్మంబుల మాధవుఁ¯ గరమొప్పం గౌఁగిలించి కామానలముం¯ గరభోరువు వర్జించెను¯ గర మరు దని తోడిశీతకరముఖు లలరన్. (1497) సనకాదుల్ దలపోసి కానని విభున్ సర్వప్రభున్ దుర్లభున్¯ మును దా నిచ్చిన యంగరాగ సుకృతామోదంబునం గూడియున్¯ ఘన నిర్వాణవిభూతి యిమ్మనక నా కంజాక్షి "యేఁ బాయఁజా¯ ల ననుం గొన్ని దినంబు లంగభవకేళిం దేల్పవే?"నావుడున్. (1498) వనిత గోరుకొనిన వరమిచ్చి యా శౌరి¯ యుద్ధవుండు దాను నువిద యిల్లు¯ వెడలె నపుడు తియ్యవిలుకాఁడు సురభితోఁ¯ దీఁగయిల్లు వెడలు తెఱఁగు మెఱయ. (1499) ఏ వేదంబులఁ గానని¯ దేవోత్తముఁ గాంచి ముక్తి తెరు వడుగక రా¯ జీవేక్షణ రతి యడిగెను¯ భావింపఁ దదీయ కర్మఫల మెట్టిదియో. (1500) కారుణ్యంబునఁ గృష్ణుఁడు¯ తారుణ్యము మెఱసి మదనతంత్రంబుల లీ¯ లారణ్యవీధిఁ దేల్చెను¯ సైరంధ్రిన్ విభవవిజిత శక్రపురంధ్రిన్. (1501) తదనంతరంబ కృష్ణుం డుద్ధవ రామ సహితుండై హస్తినాపురంబునకు నక్రూరునిం బనుపందలంచి తద్గృహంబునకుం జనిన నతండు వారలం గని లేచి రామకృష్ణులకు నమస్కరించి యుద్ధవుం గౌఁగలించుకొని వారి నందఱ యధావిధిం బూజించి హరిపాదంబులు తన తొడలమీఁద నిడుకొని యిట్లనియె. (1502) "అనుచరులుఁ దానుఁ గంసుఁడు¯ చనియెన్ మీచేత జమునిసదనంబునకున్¯ ఘనులార! మీ బలంబున¯ నొనరఁగ యాదవకులంబు నుద్ధృత మయ్యెన్.

అక్రూరుడు పొగడుట

(1503) మహాత్ములార! మీరు విశ్వాదిపురుషులరు, విశ్వకారణులరు, విశ్వమయులరగుట మీకుఁ గార్యకారణంబులు లే; వధరింపుము. పరమేశ్వరా! నీవు రజోగుణంబున నఖిలంబు సృజియించి కారణరూపంబునఁ దదనుప్రవిష్టుండవై కృతదృష్టకార్యరూప ప్రపంచాకారంబున దీపించుచుందువు; కార్యరూప చరాచర దేహంబులకుం గారణంబులైన భూప్రముఖంబు లనుగతంబులైనఁ గార్యరూప దేహంబులునై ప్రకాశించు చందంబున నొక్కండవుఁ గారణరహితుండవు నాత్మతంత్రుండవునై యుండియు విశ్వాకారంబునఁ బెక్కగుదువు సృష్టి స్థితి లయంబులఁ జేయుచుండియును విజ్ఞానమూర్తి వగుటం బరిభ్రాంతుండైన జీవుని భంగి గుణకర్మబద్ధుండవు కావు; కావున సిద్ధంబు తన్నిమిత్తంబున బంధహేతువు సిద్ధింపదు. (1504) పరఁగ జీవునికైన బంధమోక్షము లంట¯ వంటునే పరతత్వమైన నిన్ను¯ నంటునే యీశ! దేహాద్యుపాధులు నని¯ ర్వచనీయములుగాన వరుస నీకు¯ జన్మంబు జన్మసంశ్రయ భేదమును లేదు¯ కావున బంధమోక్షములు లేవు; ¯ గణుతింప ని న్నులూఖలబద్ధుఁ డనుటయు¯ నహిముక్తుఁ డనుటయు నస్మదీయ (1504.1) బాలబుద్ధిఁ గాదె? పాషండ ముఖర మా¯ ర్గములచేత నీ జగద్ధితార్థ¯ మైన వేదమార్గ మడఁగిపో వచ్చిన¯ నవతరించి నిలుపు దంబుజాక్ష. (1505) ఆ నీవు ధరణిభారము¯ మానిచి రక్కసుల నెల్ల మర్దించుటకై¯ యానకదుందుభి యింటను¯ మానక జన్మించితివి సమంచితకీర్తిన్. (1506) త్రిజగత్పావన పాదతోయములచే దీపించి వేదామర¯ ద్విజ ముఖ్యాకృతివైన నీవు కరుణన్ విచ్చేయుటం జేసి మా¯ నిజగేహంబులు ధన్యతం దనరెఁ బో; ని న్నార్యు లర్చింపఁగా¯ నజితత్వంబులు వారి కిత్తు వనుకంపాయత్త చిత్తుండవై. (1507) ఏ పుణ్యాతిశయప్రభావముననో యీ జన్మమం దిక్కడన్¯ నీ పాదంబులు గంటి నిన్నెఱిఁగితిన్ నీవుం గృపాళుండవై¯ నాపై నర్మిలిఁజేసి మాన్పఁ గదవే నానా ధనాగార కాం¯ తా పుత్రాదులతోడి బంధనము భక్తవ్రాతచింతామణీ!" (1508) అని పలికిన నగుచు నక్రూరునికి మాటలవలన సంసారబంధం బగు మోహంబును గీలుకొలుఁపుచు హరి యిట్లనియె. (1509) "బంధుండవు సద్ద్యోహిత¯ సంధుండవు వావిఁ జూడ జనకుఁడవు కృపా¯ సింధుండ వెల్ల గుణముల¯ నంధుండవుగావు ప్రోవ నర్హుండ వెందున్. (1510) కొలుతురు మర్త్యు లిష్టములు గోరి శిలామయ దేవసంఘమున్¯ జలమయ తీర్థసంఘమును సంతతము న్నటు వారు గొల్వఁగా¯ వలదన రాదుగాక భగవత్పద భక్తులరైన మీ క్రియన్¯ సొలయక దేవతీర్థములు చూచిన యంతనె కోర్కు లిచ్చునే.

అక్రూరుని హస్తిన పంపుట

(1511) మహాత్మా! పరమభాగవతుండవైన నీవు మాకభీష్టంబు లొనరింప నర్హుండవు; వినుము పాండురాజు పరలోకగతుండైనఁ గుంతీ సహితులైన పాండవులు ధృతరాష్ట్రు శాసనంబున నేతెంచి కరిపురంబున నున్నవారఁట; నిజపుత్రమోహితుం డగు న య్యంధ నృపతి వారి యందు సమత్వంబునం జరింపం డటుగావున. (1512) వారలు బంధులు గావున¯ వారలకును మే లొనర్చి వా రలరంగా¯ వారింప వలయు దుస్థితి¯ వారిజరిపువంశ! పొమ్ము వారిం జూడన్." (1513) అని పలికి సంకర్షణోద్ధవసహితుండై హరి నిజగృహంబునకుంజనుటయు నక్రూరుండు కౌరవరాజధాని యగు కరిపురికరిగి యందు ధృతరాష్ట్ర భీష్మ విదుర బాహ్లిక భారద్వాజ గౌతమ దుర్యోధన కర్ణాశ్వత్థామాదులం గుంతీసహితులైన పాండవులం దక్కిన బంధువులనుం గని యధోచిత సత్కారంబుల నొంది తత్తద్వర్తనంబు లెఱింగికొనుచుఁ గొన్నిదినంబు లుండ నొక్కనాడు విదురుండు విన నేకతంబున నక్రూరునికిఁ గుంతి యిట్లనియె.

అక్రూరునితో కుంతి సంభాషణ

(1514) "అన్నా! తల్లులుఁ దండ్రులున్ భగినులున్ నల్లుండ్రు మద్భ్రాతలున్¯ నిన్నుం బొమ్మనువేళ నే మనిరి? మా నెవ్వల్ విచారింతురే? ¯ యున్నారా సుఖయుక్తులై? మృగి వృక వ్యూహంబులో నున్న రే¯ ఖ న్నే నిక్కడ నున్నదానఁ గుమనః కౌరవ్యమధ్యంబునన్. (1515) కఱపించెన్ ఫణికోటిచే; లతికలం గట్టించి గంగానదిన్¯ నెఱిఁ ద్రోపించె; విషాన్వితాన్న మొసఁగెన్; నిద్రారతిం జెంది యే¯ మఱియుండం బొడిపించె నాయుధములన్మత్ప్రుత్రులం; దేమియుం¯ గొఱగాఁ డీ ధృతరాష్ట్రసూనుఁడు మహాక్రూరుండు కార్యంబులన్. (1516) బలుఁడుం గృష్ణుఁడు నెన్నఁడైనఁ దమలో భాషించి మేనత్త బి¯ డ్డలకున్ మేలు తలంతురే? వగపులన్ డయ్యంగఁ బాలై రయో¯ జలజాతాక్షుఁడు భక్తవత్సలుఁ డిలాచక్రంబు భాగించి యి¯ మ్ముల నిప్పించునె నా కుమారకులకున్ ముఖ్యప్రకారంబునన్." (1517) అని పలికి కృష్ణునిఁ జిత్తంబున నిల్పి నమస్కరించి సంకీర్తనంబు చేసి “సర్వాత్మ! సర్వపాలక! పుండరీకాక్ష! శరణాగతనైన నన్ను రక్షింపు రక్షింపు” మని వగచుచున్న కుంతికి నక్రూరుండు విదురసమేతుండై ప్రియవచనంబుల దుఃఖోపశమనంబు చేసి వీడ్కొని బంధుమిత్ర మధ్యంబున సుఖోపవిష్టుండైన ధృతరాష్ట్రున కిట్లనియె.

అక్రూర ధృతరాష్ట్రుల సంభాషణ

(1518) "నీ యనుజుండు పాండుధరణీవిభుఁ డీల్గిన నీవు భూమి ధ¯ ర్మాయతబుద్ధి నేలుచుఁ బ్రజావళిఁ గాచుచు గౌరవంబుతోఁ¯ బాయక లోకులందు సమభావతఁ జేసితివేనిఁ గీర్తియున్¯ శ్రేయముఁ గల్గు వేఱొకటి చేసిన దుర్గతిగల్గు భూవరా! (1519) అవనీశ! పాండవులందు నీ నందను¯ లందు సమానుండ వగుట బుద్ధి¯ యెవ్వనితో యోగ మిం దెవ్వనికి నిత్య¯ మంగనాగార పుత్రాదికముల¯ వలన నయ్యెడి దేమి? వసుమతి నొక జంతు¯ వుదయింప నొక జంతు వుక్కడంగు¯ నొకఁడు పుణ్యము జెందు నొకఁడు పాపము నొందు¯ మీనజీవనభూత మిళిత జలముఁ (1519.1) దత్తనూజు లెట్లు ద్రావుదు రట్లు మూ¯ ఢాత్ము విత్త మెల్ల నపహరింతు¯ రహితులైన కొడుకు లటమీఁద మనియైనఁ¯ జచ్చియైనఁ దండ్రి జాడఁ జనరు (1520) కావున మూఢాత్ముఁడవై¯ నీ వార్జించిన ధనంబు నీ పుత్రులు దు¯ ర్భావులు పుచ్చుకొనంగా¯ భూవర! నిందితుఁడ వగుదు భూనాకములన్. (1521) నిందం బొందకు మయ్య! యీ తనువు దా నిద్రా కళా దృష్టమౌ¯ సందోహంబు విధంబు నిల్వదు సుమీ; జాత్యంధతం బొందియున్¯ మందప్రజ్ఞత లేల చేసెదవు సమ్యగ్జ్ఞాన చక్షుండవై¯ సందేహింపక యిమ్ము పాండవులకున్ సర్వంసహా భాగమున్." (1522) అనిన ధృతరాష్ట్రుం డిట్లనియె. (1523) "నీ మాట మంచిది నిశ్చయ మగు; నైన¯ నస్థిరంబైన నా యంతరంగ¯ మందు నిల్వదు సుదామాచలస్ఫటిక శి¯ లాతత ద్యుతి తటిల్లతిక భంగి; ¯ నమృతంబు నొందియు నానందితుఁడు గాని¯ నరుమాడ్కి నేను నానంద మొంద; ¯ నీశ్వరాజ్ఞావిధ మెవ్వఁడు దప్పింప¯ నోపు విజ్ఞానియై యుండియైన (1523.1) విశ్వమెల్లఁ జేసె విభజించి గుణముల¯ నెవ్వఁ డనుసరించె నెవ్వఁ డవని¯ భారమెల్లఁ బాపఁ బ్రభవించె దేవకి¯ కెవ్వఁ డాత్మతంత్రుఁ డీశ్వరుండు. (1524) అట్టి కృష్ణునకు నమస్కరించెద; నా నందనందనుని దివ్యచిత్తంబునం గల తెఱంగునన్ బ్రతుకం గలవార” మని వీడ్కొలిపిన, నక్రూరుం డతని తలంపెఱింగి “నీతలంపుఁ గనుగొంటి నీకిష్టం బగునట్లు వర్తింపు” మని పలికి మరలి మథురకుం జనుదెంచి తదీయ వృత్తాంతంబు రామకృష్ణుల కెఱింగించె; నంతఁ గంసుభార్యలగు నస్తియు బ్రాస్థియు విధవలయి దుఃఖించుచుం దమ తండ్రి యయిన జరాసంధుని కడకుం జని.

అస్తిప్రాస్తులు మొరపెట్టుట

(1525) "వాండ్రున్ వీండ్రును రాజులే యనుచు గర్వప్రౌఢితో యాదవుల్¯ వేండ్రంబైన బలంబుతో మథురకున్ వే వచ్చి నిష్కారణం¯ బాండ్రున్ బిడ్డలు బంధులున్ వగవఁ గంసాదిక్షమానాథులం¯ దండ్రీ! చంపిరి కృష్ణుచేత నిటు వైధవ్యంబు వచ్చెన్ జుమీ." (1526) అనిన విని, ప్రళయకాలానలంబు తెఱంగున మండిపడి శోకరోషంబులు బంధురంబులుగా జరాసంధుం డిట్లనియె. (1527) "ఏమీ? కంసునిఁ గృష్ణుఁడే రణములో హింసించె నోచెల్ల! నా¯ సామర్థ్యంబు దలంప డించుకయు మచ్చండప్రతాపానలో¯ ద్దామార్చుల్ వడి నేడు గాల్చు యదుసంతానాటవీ వాటికన్¯ భూమిం గ్రుంగిన నింగిఁ బ్రాకిన మహాంభోరాశిలోఁ జొచ్చినన్. (1528) యాదవ విరహిత యగుఁ బో¯ మేదిని నాచేత నేడు మీఁదుమిగిలి సం¯ పాదిత బలులై హరి రు¯ ద్రాదులు నింద్రాదు లెవ్వ రడ్డం బైనన్." (1529) అని పలికి సమరసన్నాహ సంకులచిత్తంబునఁ గోపంబు దీపింప సంగరభేరి వ్రేయించి కదలి. (1530) దక్షుండై యిరువదిమూ¯ డక్షౌహిణులైన బలము లనుగతములుగా¯ నాక్షణమ జరాసంధుఁడు ¯ ప్రక్షోభముతోడ మథురపైఁ జనియె నృపా! (1531) గంధేభ తురగ రథ భట¯ బంధుర చరణోత్థితోగ్ర పాంసుపటల యో¯ గాంధీభూతములై దివి¯ మంథరగతి నడచె నపుడు మార్తాండ హరుల్.

జరాసంధుని మథుర ముట్టడి

(1532) ఇట్లు చని నిరంతర కిసలయ, పత్ర, కోరక, కుసుమ, ఫలభార వినమిత వృక్షవిలసిత మహోద్యానంబును; నుద్యానవనభాగ వలమాన జలోన్నయన దారుయంత్ర లతానిబద్ధ కలశ విముక్త సలిలధారా శీకరపరంపరా సంపాదిత వర్షాకాలంబును; గాలకింకర సదృశ వీరభట రథ తురగ సామ జానీక సంకులంబును; గులాచార ధర్మప్రవీణ పౌరజన భాసురంబును, సురాభేద్యమాన మహోన్నతాట్టాలక యంత్ర భయంకర ప్రాకారచక్రంబును; జక్ర, సారస, హంసాది కలకలరవ కలిత సరోవరంబును; సరోవర సంఫుల్ల హల్లక కమల పరిమళమిళిత పవన విరాజితంబును; జితానేక మండలేశ్వర భూషణ మణిగణ రజోనివారిత మదగజేంద్ర దానజల ప్రభూత పంకంబును; బంకరహిత యాదవేంద్రదత్త సువర్ణాచల కల్పతరు కామధేను సమ్మర్దిత విద్వజ్జన నికేతనంబును; గేతన సన్నిబద్ధ చామర మయూర చాప శింజనీనినద పరిపూరితాభ్రంబును; నభ్రంలిహ మహాప్రాసాద సౌధ గవాక్షరంధ్ర నిర్గత ఘనసార ధూపధూమపటల విలోకన సంజనిత జలధర విభ్రాంత శిఖండితాండవ రుచిరంబును; జిరతరానేక దేవాలయ జోఘుష్యమాణ తూర్యనినద పరిభావిత పారావార కల్లోల ఘోషంబును; ఘోషకామినీ ప్రాణవల్లభ బాహుదండ పరిరక్షితంబునై, పరులకు నలక్షితంబైన మథురానగరంబు చేరి, వేలాలంఘనంబు చేసి, వెల్లివిరిసిన మహార్ణవంబు తెఱంగునఁ బట్టణంబునకు ముట్టణంబుచేసి, చుట్టును విడిసిన జరాసంధుని బలౌఘంబుఁగని వేళావిదుం డగు హరి తన మనంబున. (1533) "ఐదున్నాలుగునాఱురెండునిరుమూ డక్షౌహిణుల్ సుట్టి సం¯ ఛాదించెన్ బురమెల్ల మాగధునెడన్ సామంబు దానంబు సం¯ భేదంబున్ బనిలేదు దండవిధి శోభిల్లం బ్రయోగించి యీ¯ భూదేవీ గురుభార మెల్ల నుడుపం బోలున్ జయోద్భాసినై. (1534) ఏ నవతరించు టెల్లను¯ మానుగఁ జతురంత ధరణిమండలభరమున్¯ మానుపుకొఱకుం గాదే¯ పూనెద నిది మొదలు దగిలి భూభర ముడఁపన్. (1535) మగధనాథుఁ బోర మడియింపఁ బోలదు¯ మడియకున్న వీఁడు మరలమరల¯ బలముఁ గూర్చుకొనుచుఁ బఱతెంచుఁ బఱతేఱఁ ¯ ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ." (1536) అని యిట్లు చింతించుచున్న సమయంబున నభోభాగంబుననుండి మహాప్రభా సమేతంబులును, సపరిచ్ఛదసూతంబులును, ననేక బాణ బాణాసన చక్రాది వివిధాయుధోపేతంబులునైన రథంబులు రెండు మనోరథంబులు పల్లవింప దైవయోగంబునం జేరవచ్చినం జూచి హరి సంకర్షణున కిట్లనియె. (1537) “కంటే రామ! రథంబు లాయుధములున్ గాఢప్రకాశంబులై¯ మింటన్ వచ్చెను వీనిఁ గైకొని సురల్ మెచ్చన్ నృపశ్రేణులం¯ బంటింపం బనిలేదు చంపుము ధరాభారంబు వారింపు మీ¯ వెంటన్ నీ యవతారమున్ సఫలమౌ వేవేగ లె మ్మాజికిన్.” (1538) అని పలికి.

జరాసంధునితో పోర వెడలుట

(1539) ఖరులై దృఢకవచ ధను¯ శ్శరులై యధిగత రథానుచరులై మదవ¯ త్కరులై ఘన హరులై బల¯ హరు లయ్యెడ నాజి కేగి రతిభీకరులై. (1540) ఇట్లు సమరసన్నాహంబునం బురంబు వెడలి. (1541) అన్యులు తల్లడిల్ల దనుజాంతకుఁ డొత్తె గభీరఘోష కా¯ ఠిన్య మహాప్రభావ వికటీకృత పద్మభవాండ జంతు చై¯ తన్యము ధన్యమున్ దివిజ తాపస మాన్యముఁ బ్రీత భక్త రా¯ జన్యము భీత దుశ్చరిత శాత్రవసైన్యముఁ బాంచజన్యమున్. (1542) సింధుర భంజనపూరిత¯ బంధురతర శంఖనినద భారమున జరా¯ సంధునికిం గల సైన్యము¯ లంధములై సంచలించె నాహవభూమిన్.

జరాసంధుని సంవాదము

(1543) అ య్యవసరంబున మాగధుండు మాధవున కిట్లనియె. (1544) "అదలించి రొప్పంగ నాలమందలు గావు¯ గంధగజేంద్ర సంఘములు గాని¯ పరికించి వినఁగ నంభారవంబులు గావు¯ వాజీంద్ర హేషారవంబు గాని¯ పదహతిఁ గూల్పంగఁ బాత బండ్లివి గావు¯ నగసమానస్యందనములు గాని ¯ ప్రియము లాడంగ నాభీరలోకము గాదు¯ కాలాభ వైరివర్గంబు గాని (1544.1) యార్ప వనవహ్ని గాదు బాణాగ్ని గాని¯ మురియ బృందావనము గాదు మొనలు గాని¯ యమున గాదు నటింప ఘోరాజి గాని¯ పోరు నీకేల గోపాల! పొమ్ముపొమ్ము. (1545) తరుణిం జంపుటయో బకున్ గెడపుటో ధాత్రీజముల్ గూల్చుటో¯ ఖరునిం ద్రుంచుటయో ఫణిం బఱపుటో గాలిన్ నిబంధించుటో¯ గిరి హస్తంబునఁ దాల్చుటో లయమహాగ్నిస్ఫార దుర్వార దు¯ ర్భర బాణాహతి నెట్లు నిల్చెదవు సప్రాణుండవై గోపకా! (1546) అదియునుం గాక. (1547) గోపికావల్లకీ ఘోషణంబులు గావు¯ శింజనీరవములు చెవుడుపఱచు¯ వల్లవీకరముక్త వారిధారలు గావు¯ శరవృష్టి ధారలు చక్కుచేయు¯ ఘోషాంగనాపాంగ కుటిలాహతులు గావు¯ నిశితాసి నిహతులు నిగ్రహించు¯ నాభీరకామినీ హస్తాబ్జములు గావు¯ ముష్టి ఘాతంబులు మురువడంచు (1547.1) నల్ల వ్రేపల్లెగాదు ఘోరావనీశ¯ మకరసంఘాత సంపూర్ణ మగధరాజ¯ వాహినీసాగరం బిది వనజనేత్ర! ¯ నెఱసి నిను దీవి కైవడి నేడు ముంచు." (1548) అనిన శ్రీహరి యిట్లనియె. (1549) "పంతములేల తొల్లి జనపాలురఁ బోరుల గెల్చినాఁడ వం¯ డ్రంతియ చాలదే? బిరుదు లాడుట బంటుతనంబు త్రోవయే? ¯ యింతటఁ దీఱెనే? మగధ! యేటికిఁ బ్రేలెదు? నీవ యేల క¯ ల్పాంత మహోగ్రపావకునినైన హరింతు వరింతు సంపదన్. (1550) గోపాలుఁడ వని పలికితి¯ భూపాలక! దీన నేమి? పోరాడంగా¯ గోపాల మహీపాల¯ వ్యాపారాంతరము దెలియవచ్చుం బోరన్." (1551) అనిన రోషబంధురుండై జరాసంధుం డిట్లనియె. (1552) "బాలుఁడ వీవు కృష్ణ! బలభద్రునిఁ బంపు రణంబు సేయ; గో¯ పాలక! బాలుతోడ జనపాలశిఖామణి యైన మాగధుం¯ డాలము సేసె నంచు జను లాడెడి మాటకు సిగ్గు పుట్టెడిం¯ జాలుఁ దొలంగు దివ్యశరజాలుర మమ్ము జయింపవచ్చునే?" (1553) అనిన నగధరుం డిట్లనియె. (1554) "పొగడుకొనుదురే శూరులు; ¯ మగటిమిఁ జూపుదురు గాక మాగధ! నీకున్¯ మగతనము గలిగెనేనియుఁ¯ దగు మెఱయ వికత్థనములు దగ దీ పోరన్." (1555) అనిన రోషించి. (1556) పవనుఁడు మేఘరేణువుల భాను కృశానులఁ గప్పు కైవడిన్¯ వివిధబలౌఘముం బనిచి వేగమ మాగధుఁ డావరించె భూ¯ మ్యవన చరిష్ణులన్ విమతమానవనాథ నిరాకరిష్ణులన్¯ దివిషదలంకరిష్ణుల నతిస్థిరజిష్ణుల రామకృష్ణులన్. (1557) హయహేషల్ గజబృంహితంబులు రథాంగారావముల్ శింజనీ¯ చయ టంకారములున్ వివర్ధిత గదా చక్రాస్త్ర నాదంబులున్¯ జయశబ్దంబులు భేరి భాంకృతులు నిస్సాణాది ఘోషంబులున్¯ భయదప్రక్రియ నొక్కవీఁక నెగసెన్ బ్రహ్మాండభేద్యంబుగన్.

జరాసంధునిసేన పోరాటము

(1558) మఱియు నయ్యెడ మాగధ మాధవ వాహినులు రెండు నొండొంటిం దాఁకి రౌద్రంబున సంవర్తసమయ సముద్రంబుల భంగి నింగికిం బొంగి చెలంగి చలంబునం దలపడి పోరునెడ మసరుకవిసి మహారణ్యంబులు వెలువడి మార్కొను మదగజంబుల మాడ్కిని, మహోత్కంఠంబులగు కంఠీరవంబుల గ్రద్దన, దుర్లభంబులగు శరభంబుల చాడ్పునం, బ్రచండంబులగు గండభేరుండంబుల గమనికం దమతమ మొనలకుం దలకడచి వీరరసంబుల వివిధరూపంబులైన విధంబునం బదుగురు నూర్వు రేవురు గములై కులకుధర గుహాంతరాళంబులు నిండ సింహనాదంబు లొనర్చుచు, నార్చుచు నట్టహాసంబులు సేయుచు, నరివీరుల రోయుచు పటహ కాహళ భేరీ శంఖ శబ్దంబులకు నుబ్బుచు, గర్వంబులం బ్రబ్బుచు, గదల వ్రేయుచుఁ గాండంబు లేయుచు, ముద్గరంబుల నొత్తుచు, ముసలంబుల మొత్తుచుఁ, గుంతంబుల గ్రుచ్చియెత్తుచుఁ గరవాలంబులం ద్రెంచుచుఁ, జక్రంబులం ద్రుంచుచు శస్త్రంబులఁ దఱుగుచుఁ, జిత్రంబులం దిరుగుచు పరిఘంబులఁ ద్రిప్పికొట్టుచుఁ, బ్రాసంబులఁ బెట్టుచు, శూలంబులఁ జిమ్ముచు, సురియల గ్రుమ్ముచు బహుభంగులఁ బరాక్రమించు వీరభటులును, నిబిడ నీరంధ్రం నేమినిర్ఘోషంబుల నాకాశంబు నిరవకాశంబుగ ననర్గళ చక్రమార్గణంబులం బడు పదాతులును జదియు నరదంబులును వివిధాయుధ ప్రయోగంబుల వైరుల వ్రచ్చి వందఱలాడు రథికులును, రథిక శరపరంపరలఁ గంపింపక మహామోఘ మేఘధారలకుఁ జలింపని ధరణీధరంబుల చాడ్పున రథంబులకుం గవిసి కల్పాంతకాల దండిదండ ప్రచండంబులగు శుండాదండంబులు సాఁచి యూఁచి కడనొగ లొడిసి తిగిచి కుదిచి విఱిచి కూబరములు నుఱుములుగ జిఱజిఱం ద్రిప్పివైచియు, భటులం జటుల గతి బంతుల క్రియ నెగుర వైచి దంతంబుల గ్రుచ్చియు ఘోటకంబుల వ్రచ్చియు విచ్చలవిడిం దిరుగు కరులును, వజ్రి వజ్రధారలకుం దప్పి కకుప్పులకు నెగయు ఱెక్కలుగల గిరుల సిరులం బక్కెరల తోడ హేషారవ భీషణంబులయి మనోజవంబులగు తురంగంబులం బఱపి తురంగ పదపాంసుపటల ప్రభూత బహుళాంధకారంబులు కరకలిత కఠోర ఖడ్గ మరీచి జాలంబుల నివారించుచు నానాప్రకారంబులం బ్రతివ్యూహంబులం జించి చెండాడు రాహుత్తులుం గలిగి సంగ్రామంబు భీమం బయ్యె నందు. (1559) చెడు రథములుఁ దెగు హరులును¯ బడు కరులును మడియు భటులుఁ బఱచు రుధిరమున్¯ మడియు తల లొఱగు తనువులుఁ¯ బొడి యగు తొడవులును మథురిపుని దెసఁ గలిగెన్. (1560) భీతంబై హతసుభట¯ వ్రాతంబై భగ్న తురగ వారణ రథ సం¯ ఘాతంబై విజయశ్రీ¯ వీతంబై యదుబలంబు విఱిగె నరేంద్రా! (1561) యోధాగ్రేసరుఁ డా హలాయుధుఁడు లోకోత్కృష్ట బాహాబల¯ శ్రీ ధౌరేయుఁడు కృష్ణుఁ డిట్టి ఘనులం జిత్రంబు; నే డిట్లు సం¯ రోధించెన్; బలముం దెరల్చె; మగధేంద్రుం డంచు నీక్షించుచున్¯ సౌధాగ్రంబులఁ బౌరకాంతలు మహాసంతప్తలై రెంతయున్.