పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 1332 - 1455

చాణూరునితో సంభాషణ

(1332) అని పలుకుచు సకలజనులును జూచుచుండ రామకృష్ణులకుఁ జాణూరుండు యిట్లనియె. (1333) "వనమార్గంబున గోపబాలకులతో వత్సంబులన్ మేపుచుం¯ బెనఁగన్ మిక్కిలి నేర్చినా రనుచు నీ పృథ్వీజనుల్ చెప్ప మా¯ మనుజేంద్రుం డిట మిమ్ముఁ జీరఁ బనిచెన్ మల్లాహవక్రీడకుం; ¯ జనదే కొంత పరాక్రమింప మనకున్ సభ్యుల్ విలోకింపఁగన్. (1334) జవసత్వంబులు మేలె? సాము గలదే? సత్రాణమే మేను? భూ¯ ప్రవరుం బోసన మిమ్మనంగ వలెనే? పాళీ లభీష్టంబులే? ¯ పవివో? కాక కృతాంతదండకమవో? ఫాలాక్షు నేత్రాగ్నివో? ¯ నవనీతంబుల ముద్దగాదు; మెసఁగన్ నా ముష్టి గోపార్భకా! (1335) జనములు నేర్చిన విద్యలు¯ జననాథునికొఱకుఁ గాదె? జననాథుఁడు నీ¯ జనములు మెచ్చఁగ యుద్ధం¯ బున మనముం గొంత ప్రొద్దు పుత్తమె? కృష్ణా!" (1336) అనిన విని హరి యిట్లనియె. (1337) "సాములు లేవు; పిన్నలము; సత్వము గల్దనరాదు; మల్ల సం¯ గ్రామ విశారదుల్ గులిశ కర్కశదేహులు మీరు; మీకడన్¯ నేము చరించు టెట్లు? ధరణీశుని వేడ్కలు చేయువారముం¯ గాము; వినోదముల్ సలుపఁ గాదనవచ్చునె యొక్కమాటికిన్. (1338) నీ తోడుత నేఁ బెనఁగెదఁ ¯ బ్రీతిన్ ముష్టికునితోడఁ బెనగెడి బలుఁ డు¯ గ్రాతత మల్లాహవమున¯ భూతలనాథునికి మెచ్చు పుట్టింతు సభన్." (1339) అనిన విని రోషించి చాణూరుం డిట్లనియె. (1340) "నాతోఁ బోరఁగ నెంతవాఁడ? విసిరో! నాపాటియే నీవు? వి¯ ఖ్యాతుండం; గులజుండ; సద్గుణుఁడ; సత్కర్మస్వభావుండ; నీ¯ కేతాదృగ్విభవంబు లెల్లఁ గలవే; యీ వీటఁ బోరాడుటల్¯ వ్రేతల్ చూడఁగఁ గుప్పిగంతు లిడుటే? వీక్షింపు గోపార్భకా! (1341) స్థాణున్ మెచ్చఁడు; బ్రహ్మఁ గైకొనఁడు; విష్వక్సేను నవ్వున్; జగ¯ త్ప్రాణున్ రమ్మనఁ డీడుగాఁ డని; మహా బాహాబలప్రౌఢి న¯ క్షీణుం; డాజికి నెల్లి నేఁ డనఁడు; వైచిత్రిన్ వినోదించు న¯ చ్చాణూరుం డొక గోపబాలు పనికిన్ శక్తుండు గాకుండునే? (1342) ప్రల్లద మేటికి గోపక!¯ బల్లిదుఁడను; లోకమందుఁ బ్రఖ్యాతుఁడ; నా¯ చల్లడము క్రింద దూఱని¯ మల్లురు లే రెందు ధరణిమండలమందున్. (1343) చలమున నను డాసి జలరాశిఁ జొరరాదు¯ నిగిడి గోత్రముదండ నిలువరాదు; ¯ కేడించి కుంభిని క్రిందికిఁ బోరాదు¯ మనుజసింహుఁడ నని మలయరాదు; ¯ చేరినఁ బడవైతుఁ జెయి చాపఁగారాదు¯ బెరసి నా ముందటఁ బెరుఁగరాదు; ¯ భూనాథ హింసకుఁ బోరాదు నను మీఱి¯ శోధింతుఁ గానలఁ జొరఁగరాదు; (1343.1) ప్రబలమూర్తి ననుచు భాసిల్లఁగారాదు; ¯ ధరఁ బ్రబుద్ధుఁడ నని దఱుమరాదు; ¯ కలికితనము చూపి గర్వింపఁగారాదు; ¯ తరముగాదు; కృష్ణ! తలఁగు తలఁగు. (1344) అదిగాక నీవు శ్రీహరి నంటేని. (1345) మహిమతో నుండగ మథురాపురము గాని¯ పొలుపార వైకుంఠపురము గాదు¯ గర్వంబుతో నుండఁ గంసుని సభ గాని¯ సంసార రహితుల సభయుఁ గాదు ¯ ప్రకటించి వినఁగ నా బాహునాదము గాని¯ నారదు వీణాస్వనంబు గాదు¯ చదురు లాడఁగ మల్లజన నిగ్రహము గాని¯ రమతోడి ప్రణయ విగ్రహము గాదు (1345.1) వెలసి తిరుగంగ వేదాంతవీధి గాదు¯ మొఱఁగిపో ముని మనముల మూల గాదు¯ సాఁగి నడువంగ భక్తుల జాడ గాదు¯ శౌరి! నా మ్రోల నీ వెందు జనియె దింక." (1346) అని పలికి. (1347) రోషాగ్నిధూమప్రరోహంబు కైవడి¯ శిరమున సన్నపు శిఖ వెలుంగ¯ నాశామదేభేంద్ర హస్తసన్నిభములై¯ బాహుదండంబులు భయదములుగ¯ లయసమయాంతకోల్లసిత దంష్ట్రల భంగిఁ¯ జాఁగిన కోఱ మీసములు మెఱయ¯ నల్లని తెగఁగల నడకొండ చాడ్పున¯ నాభీల నీలదేహంబు వెలయఁ (1347.1) జరణహతుల ధరణి సంచలింపఁగ నభో¯ మండలంబు నిండ మల్ల చఱచి¯ శౌరి దెసకు నడచెఁ జాణూర మల్లుండు¯ పౌరలోకహృదయభల్లుఁ డగుచు.

చాణూర ముష్టికులతో పోరు

(1348) ఇ ట్లగ్గలం బగు నగ్గలిక డగ్గఱిన మల్లునిం గని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన, వల్లవీవల్లభుం డుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసె; నట్లిద్దఱు నుద్దవిడి నున్నత విషమంబులగు ఠాణ లిడి, కరి కరియును, హరి హరియును గిరి గిరియునుం దాఁకు వీఁకం దలపడి యితరేతర హేతిహింసితంబులగు దవానలంబుల తెఱంగునఁ బరస్పర దీర్ఘనిర్ఘాత ఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున నన్యోన్య తుంగతరంగ తాడితంబు లగు కల్పాంతకాల సముద్రంబుల రౌద్రంబున నొండరుల ముష్టి ఘట్టనంబుల ఘట్టితశరీరులై దద్దరిలక డగ్గఱి గ్రద్దన నయ్యిద్దఱుం దిరుగు నెడ హరి చొచ్చి పేర్చి యార్చి జెట్టింబట్టి పడం దిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి నొచ్చి య చ్చపలుండు మీఱి మోర సారించి తెరలక పొరలం ద్రొబ్బిన న బ్బలానుజుం డుబ్బి గొబ్బున మేను వర్ధిల్ల నర్దాంగకంబున నుండి జానువుల నొత్తుచు నురవడింగరవడంబున నున్ననా దుర్నయుండును “బాల! మేలు మే”లని లీలం గాలు చొరనిచ్చి త్రోచినం జూచి యేచి ఖేచరు లగ్గించి యుగ్గడింప న గ్గోపకుమారుండు పాటవంబున రాటవంబునకుంజని వెన్నెక్కి నిక్కిన న క్కంసభటుండు మదజలరేఖా బంధురం బగు గంధసింధురంబు చందంబునఁ పదంబునుఁ బదంబునం జాఁపి కరంబునుఁ గరంబున గ్రహించి సహించి వహించి నైపుణ్యంబున లోపలం దిరిగి యట్టిట్టు దట్టించిన దిట్టతనంబునం దిటవు దప్పక న ప్పద్మలోచనుండు కేడించి యేచి సమతలంబున వైచి ప్రచండం బగు వాని పిచండంబు వాగించి కాలఁధిక్కరించి డొక్కరంబు గొనిన న య్యభ్యాసి సభ్యులు సన్నుతింపం గ్రమ్మఱించి జడ్డనం గా లడ్డగించి రక్షించుకొనిన నా రక్షోవైరి వైరి కటిచేలంబు పట్టి యెత్తి యొత్తి నడుమ రాగెయిడి సందుబెట్టి నవ్విన, న వ్విరోధికాలు కాలిలో నిడి వేధించి నిరోధించిన, నిరోధంబుఁ బాసి తిరిగిన వసుదేవుపట్టి పట్టిసంబుఁ గొని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబుపట్టి హుమ్మని నెమ్మొగంబునం గాలిడి మీఁదైనం గేళీ బాలకుండు కాలుగాల నివారించి మీఁదై నెగడియుండనీయక దుర్వారబలంబున విదలించిలేచి గృహీత పరిపంథి చరణుండయి విపక్షుని వక్షంబు వజ్రివజ్ర సన్నిభంబగు పిడికిటం బొడిచిన వాఁడు వాఁడిచెడక విజృంభించి యంభోరాశి మథనంబునం దిరుగు శైలంబు పోలిక నేల జిఱజిఱం దిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీఁద నుఱికిన నతండు కృష్ణపాద సంధి పరిక్షిప్తపాదుండై యెగసి లేచి సముద్ధతుం డయ్యె, న య్యెడ. (1349) బలభద్రుఁడు ముష్టికుఁడును¯ బలములు మెఱయంగఁ జేసి బాహాబాహిం¯ బ్రళయాగ్నుల క్రియఁ బోరిరి¯ వెలయఁగ బహువిధములైన విన్నాణములన్. (1350) ఇవ్విధంబున. (1351) వల్లవులు పెనఁగి రున్నత¯ గల్లులతో భిన్నదిగిభకరవల్లులతో¯ మల్లురతో రిపుమానస ¯ భల్లులతో భీతగోపపల్లులతోడన్.

పౌరకాంతల ముచ్చటలు

(1352) ఆ సమయంబునం బౌరకాంతలు మూఁకలు గట్టి వెచ్చనూర్చుచు ముచ్చటలకుం జొచ్చి తమలో నిట్లనిరి. (1353) "మంచి కుమారులం గుసుమ మంజు శరీరులఁ దెచ్చి చెల్లరే¯ యంచిత వజ్రసారులు మహాద్రి కఠోరులు నైన మల్లురం¯ గ్రించులఁ బెట్టి రాజు పెనఁగించుచుఁ జూచుచు నున్నవాఁడు; మే¯ లించుకలేదు; మాను మనఁ డిట్టి దురాత్ముని మున్ను వింటిమే? (1354) చూచెదరు గాని సభికులు¯ నీ చిన్నికుమారకులకు నీ మల్లురకు¯ న్నో చెల్ల! యీడు గాదని¯ సూచింపరు పతికిఁ దమకు శోకము గాదే? (1355) వేణునాళములమై వెలసిన మాధవుం¯ డధరామృతము లిచ్చి యాదరించుఁ¯ బింఛదామములమై పెరిగిన వెన్నుండు¯ మస్తకంబునఁ దాల్చి మైత్రి నెఱపుఁ¯ బీతాంబరములమై బెరిసిన గోవిందుఁ¯ డంసభాగమునఁ బాయక ధరించు¯ వైజయంతికలమై వ్రాలినఁ గమలాక్షుఁ;¯ డతి కుతూహలమున నఱుతఁ దాల్చుఁ (1355.1) దనరు బృందావనంబునఁ దరులమైనఁ¯ గృష్ణుఁ డానందమునఁ జేరి క్రీడ సల్పు¯ నెట్టి నోముల నైన ము న్నిట్టి విధము¯ లేల కామైతిమో యమ్మ! యింక నెట్లు? (1356) పాపపు బ్రహ్మ; గోపకుల పల్లెలలోన సృజింపరాదె; ము¯ న్నీ పురిలోపలన్ మనల నేల సృజించె? నటైన నిచ్చలుం¯ జేపడుఁ గాదె; యీ సుభగుఁ జెందెడి భాగ్యము సంతతంబు నీ¯ గోపకుమారుఁ బొంద మును గోపకుమారిక లేమి నోఁచిరో? (1357) గోపాలకృష్ణుతోడను¯ గోపాలన వేళలందుఁ గూడి తిరుగు నా¯ గోపాలు రెంత ధన్యులొ¯ గోపాలుర కైన నిట్టి గురురుచి గలదే? (1358) శ్రమజలకణసిక్తంబై¯ కమలదళేక్షణుని వదనకమలము మెఱసెన్¯ హిమజలకణసిక్తంబై¯ కమనీయం బగుచు నున్న కమలము భంగిన్. (1359) సభకుఁ బోవఁ జనదు; సభవారి దోషంబు¯ నెఱిఁగి యూరకున్ననెఱుఁగకున్న¯ నెఱిఁగి యుండియైన నిట్టట్టు పలికినఁ¯ బ్రాజ్ఞుఁ డైనఁ బొందుఁ బాపచయము." (1360) అని పెక్కండ్రు పెక్కువిధంబులం బలుకుచుండఁ దద్బాహు యుద్ధంబున.

చాణూర ముష్టికుల వధ

(1361) ధృతిచెడి లోఁబడె మల్లుం¯ డతులిత భవజలధితరికి హతరిపు పురికిన్¯ జితకరికిన్ ధృతగిరికిం¯ దత హరిరవ భరిత శిఖరిదరికిన్ హరికిన్. (1362) హరికిని లోఁబడి బెగడక¯ హరి యురము మహోగ్రముష్టి నహితుఁడు పొడువన్¯ హరి కుసుమమాలికాహత¯ కరి భంగిఁ బరాక్రమించెఁ గలహోద్ధతుఁడై. (1363) శౌరి నెఱిఁజొచ్చి కరములఁ ¯ గ్రూరగతిం బట్టి త్రిప్పి కుంభిని వైచెన్¯ శూరుం గలహ గభీరున్¯ వీరుం జాణూరు ఘోరు వితతాకారున్. (1364) శోణితము నోర నొలుకఁగఁ¯ జాణూరుం డట్లు కృష్ణ సంభ్రామణ సం¯ క్షీణుండై క్షోణిం బడి ¯ ప్రాణంబులు విడిచెఁ గంసు ప్రాణము గలఁగన్. (1365) బలభద్రుండును లోకులు¯ బలభద్రుం డనఁగఁ బెనఁగి పటుబాహుగతిన్¯ బలభేది మెచ్చఁ ద్రిప్పెను¯ బలవన్ముష్టికునిఁ గంసు బలములు బెగడన్. (1366) త్రిప్పి నేలవైవ దిగ్గన రక్తంబు¯ వదనగహ్వరమున వఱదవాఱ¯ ముష్టికుండు ఘోరముష్టి సత్వము చెడి¯ గూలె గాలిఁ దరువు గూలునట్లు. (1367) మఱియును. (1368) పాటవమునఁ బలుపిడికిట¯ సూటిం బడఁబొడిచె బలుఁడు శోభిత ఘన బా¯ హాటోప నృపకిరీటుం¯ గూటున్ వాచాటు నధిక ఘోర లలాటున్. (1369) అంత న ద్దనుజాంతకుండు చరణప్రహరణంబుల భిన్నమస్తకులం జేసి వాని చెలుల నంతకాంతికంబున కనిచిన. (1370) "వల్లవబాలకు లని మన¯ మల్లవరులు పెనఁగి నేడు మడిసిరి వీరల్¯ బల్లిదులు; తలఁడు తలఁ"డని¯ చెల్లాచెదరైరి పాఱి చిక్కిన మల్లుల్. (1371) మల్లురఁ జంపి గోపక సమాజములో మృగరాజు రేఖ శో¯ భిల్లఁగఁ బాదపద్మములఁ బెల్లుగ నందెలు మ్రోయ వచ్చు నా¯ వల్లవరాజనందనుల వారక చూచి మహీసురాదు ల¯ ల్లల్లన సంస్తుతించిరి ప్రియంబుగఁ గంసుఁడు దక్క నందఱున్. (1372) అంత సభాజనంబుల కలకలంబు నివారించి మంత్రులం జూచి కంసుం డిట్లనియె. (1373) "వల్లవబాలురన్ నగరి వాకిటికిన్ వెడలంగఁ ద్రొబ్బుఁ; డీ¯ గొల్లల ముట్టికోల్ గొనుఁడు; క్రూరుని నందునిఁ గట్టు; డుర్వికిం¯ దెల్లముగాఁగ నేడు వసుదేవునిఁ జంపుఁడు; తండ్రి గాఁడు వీఁ¯ డెల్లవిధంబులం; బరుల కిష్టుఁడు కావకుఁ డుగ్రసేనునిన్." (1374) అని పలుకు సమయంబున.

కంస వధ

(1375) జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛను¯ ల్లంఘింపన్ గమకించు సింహము క్రియన్ లక్షించి పౌరప్రజా¯ సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థి యై¯ లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్. (1376) తమగమున కెగురు యదు స¯ త్తమగణ్యునిఁ జూచి ఖడ్గధరుఁడై యెదిరెం¯ దమ గమివారలు వీరో¯ త్తమగణవిభుఁ డనఁగఁ గంసధరణీపతియున్. (1377) పక్షీంద్రుం డురగంబుఁ బట్టు విధ మొప్పన్ గేశబంధంబు లో¯ క క్షోభంబుగఁ బట్టి మౌళిమణు లాకల్పాంతవేళాపత¯ న్నక్షత్రంబుల భంగి రాల రణసంరంభంబు డిందించి రం¯ గక్షోణిం బడఁద్రొబ్బెఁ గృష్ణుఁడు వెసం గంసున్ నృపోత్తంసునిన్. (1378) మంచాగ్రంబుననుండి రంగధరణీమధ్యంబునం గూలి యే¯ సంచారంబును లేక చిక్కి జను లాశ్చర్యంబునుం బొందఁగా¯ బంచత్వంబును బొంది యున్న విమతుం బద్మాక్షుఁ డీడ్చెన్ వడిం¯ బంచాస్యంబు గజంబు నీడ్చు పగిదిన్ బాహాబలోల్లాసియై. (1379) రోషప్రమోద నిద్రా¯ భాషాశన పాన గతులఁ బాయక చక్రిన్¯ దోషగతిఁ జూచి యైన వి¯ శేషరుచిం గంసుఁ డతనిఁ జెందె నరేంద్రా! (1380) ఆ సమయంబున.

కంససోదరుల వధ

(1381) గోపాలుఁ డొక్కఁ డద్దిర¯ భూపాలకుఁ జంపె వీనిఁ బొడువుం డేత¯ ద్రూపాలస్యము లేలని¯ తాపాలఘురోషు లగుచు దర్పోద్ధతులై. (1382) న్యగ్రోధుండును గహ్వుఁడున్ మొదలుగా నానాయుధానీక సా¯ మగ్రిం గంసుని సోదరుల్గవియుఁడున్ మాద్యద్గజేంద్రాభుఁడై¯ యుగ్రుండై పరిఘాయు ధోల్లసితుఁడై యొండొండఁ జెండాడి కా¯ లాగ్రక్షోణికిఁ బంచె రాముఁడు గరీయస్థేముఁడై వారలన్. (1383) అ య్యవసరంబున. (1384) చేతులఁ దాళము లొత్తుచుఁ¯ జేతోమోదంబుతోడ సిగముడి వీడం¯ బాతర లాడుచు మింటను¯ గీతము నారదుఁడు పాడెఁ గృష్ణా! యనుచున్. (1385) వారిజభవ రుద్రాదులు¯ భూరికుసుమవృష్టిఁ గురిసి పొగడిరి కృష్ణున్¯ భేరులు మ్రోసెను నిర్జర¯ నారులు దివి నాడి రధిక నటనముల నృపా!

కంసుని భార్యలు విలపించుట

(1386) అంతం గంసాదుల కాంతలు భర్తృమరణదుఃఖాక్రాంతలై కరంబుల శిరంబులు మోదికొనుచు నశ్రుసలిలధారాపరిషిక్త వదనలై సదనంబులు వెలువడి వచ్చి వీరశయ్యా నిద్రితులైన విభులం గౌఁగిలించుకొని సుస్వరంబుల విలపించి; రందుఁ గంసు భార్య లిట్లనిరి. (1387) "గోపాలసింహంబు గోపించి వెల్వడి¯ నిను గజేంద్రుని భంగి నేడు గూల్చె¯ యాదవేంద్రానిల మాభీలజవమున¯ నిను మహీజము మాడ్కి నేల వ్రాల్చె¯ వాసుదేవాంభోధి వారి యుద్వేలమై¯ నిను దీవి కైవడి నేడు ముంచె¯ దేవకీసుతవజ్రి దేవత లలరంగ¯ నినుఁ గొండ క్రియ నేడు నిహతుఁ జేసె (1387.1) హా! మనోనాథ! హా! వీర! హా! మహాత్మ! ¯ హా! మహారాజ! నీ విట్లు హతుఁడవైన¯ మనుచు నున్నార మక్కట! మమ్ముఁ బోలు¯ కఠినహృదయలు జగతిపైఁ గలరె యెందు? (1388) భూతముల కెగ్గుచేసిన¯ భూతంబులు నీకు నెగ్గు పుట్టించె వృథా¯ భూత మగు మనికి యెల్లను¯ భూతద్రోహికిని శుభము పొంద దధీశా! (1389) గోపాలకృష్ణుతోడను¯ భూపాలక! మున్ను తొడరి పొలిసినవారిన్¯ నీ పాల బుధులు చెప్పరె¯ కోపాలస్యములు విడిచి కొలువం దగదే."

దేవకీ వసుదేవుల విడుదల

(1390) అని విలపించుచున్న రాజవల్లభల నూరార్చి, జగద్వల్లభుండైన హరి కంసాదులకుం బరలోకసంస్కారంబులు చేయం బనిచి దేవకీ వసుదేవుల సంకలియలు విడిపించి, బలభద్ర సహితుండై వారలకుం బ్రణామంబులు జేసిన. (1391) కని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్¯ జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా¯ జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి¯ ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై. (1392) "మమ్ముఁ గంటిరిగాని మా బాల్య పౌగండ¯ కైశోర వయసులఁ గదిసి మీర¯ లెత్తుచు దించుచు నెలమి మన్నించుచు¯ నుండు సౌభాగ్యంబు నొంద రైతి; ¯ రాకాంక్ష గలిగియున్నది దైవయోగంబు¯ /> తల్లిదండ్రుల యొద్ద తనయు లుండి¯ యే యవసరమున నెబ్బంగి లాలితు¯ లగుచు వర్ధిల్లుదు రట్టి మహిమ (1392.1) మాకు నిన్నాళ్ళు లే దయ్యె మఱియు వినుఁడు¯ నిఖిల పురుషార్థహేతువై నెగడుచున్న¯ మేని కెవ్వార లాఢ్యులు మీరకారె¯ యా ఋణముఁ దీర్ప నూఱేండ్లకైనఁ జనదు. (1393) చెల్లుబడి గలిగి యెవ్వఁడు¯ తల్లికిఁ దండ్రికిని దేహధనముల వృత్తుల్¯ చెల్లింపఁ డట్టి కష్టుఁడు ¯ ప్రల్లదుఁ డామీఁద నాత్మపలలాశి యగున్. (1394) జననీజనకుల వృద్ధులఁ¯ దనయుల గురు విప్ర సాధు దారాదులనే¯ జనుఁడు ఘనుఁ డయ్యుఁ బ్రోవక¯ వనరును జీవన్మృతుండు వాఁడు ధరిత్రిన్. (1395) అదియునుం గాక. (1396) కారాశాలల మా నిమిత్తము మిముం గంసుండు గారింపఁగా¯ వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపఁగా లేక ని¯ ష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహాకౌటిల్యసంచారులన్¯ సారాతిక్షములార! మమ్ముఁ గొఱతల్ సైరించి రక్షింపరే." (1397) అని యిట్లు మాయామనుష్యుండైన హరి పలికిన పలుకులకు మోహితులై వారల నంకపీఠంబుల నిడుకొని కౌఁగిలించుకొని వారి వదనంబులు కన్నీటం దడుపుచుఁ బ్రేమపాశబద్ధులై, దేవకీవసుదేవు లూరకుండి; రంత వాసుదేవుండు మాతామహుండైన యుగ్రసేనుం జూచి.

ఉగ్రసేనుని రాజుగ చేయుట

(1398) "అనఘ! యయాతి శాపమున యాదవ వీరులకున్ నరేశ్వరా¯ సనమున నుండరాదు; నృపసత్తమ! రాజవు గమ్ము భూమికిన్; ¯ నినుఁ గొలువంగ నిర్జరులు నీ కరిఁబెట్టుదు రన్య రాజులం¯ బనిగొను టెంత; రమ్ము జనపాలనశీలివి గమ్ము వేడ్కతోన్." (1399) అని పలికి. (1400) మన్నించి రాజుఁ జేసెను¯ వెన్నుఁడు సత్యావధాను విశ్రుతదానున్¯ సన్నుతమానున్ గదన¯ చ్ఛిన్నాహితసేను నుగ్రసేనున్ దీనున్. (1401) తదనంతరంబ తొల్లి కంసభీతులై విదేశంబులం గృశియించు చున్న యదు, వృష్ణి, భోజ, మరు, దశార్హ, కకురాంధక ప్రముఖు లగు సకల జ్ఞాతి సంబంధులను రావించి చిత్తంబు లలర విత్తంబు లిచ్చి వారి వారి నివాసంబుల నుండ నియమించె; ని వ్విధంబున. (1402) మధుసూదన సత్కరుణా¯ మధురాలోకన విముక్త మానస భయులై¯ మధురవచనములఁ దారును¯ మథురానగరంబు ప్రజలు మనిరి నరేంద్రా!

నందుని వ్రేపల్లెకు పంపుట

(1403) అంత నొక్కనాడు సంకర్షణ సహితుండై నందునిం జీరి గోవిందుం డిట్లనియె. (1404) "తండ్రిం జూడము తల్లిఁ జూడము యశోదాదేవియున్ నీవు మా¯ తండ్రిం దల్లియు నంచు నుండుదుము సద్ధర్మంబులం; దొల్లి యే¯ తండ్రుల్ బిడ్డల నిట్లు పెంచిరి? భవత్సౌజన్య భావంబులం¯ దండ్రీ! యింతటివార మైతిమిగదా! తత్తద్వయోలీలలన్. (1405) ఇక్కడ నున్న బాంధవుల కెల్లను సౌఖ్యము చేసి వత్తు మే¯ మక్కడికిన్; మదీయులకు నందఱికిన్ వినుపింపు మయ్య యే¯ మెక్కడ నున్న మాకు మది నెన్నఁడు పాయవు మీ వ్రజంబులో¯ మక్కువతోడ మీరు కృప మా కొనరించు క్రియావిశేషముల్." (1406) అని పలికి వస్త్రభూషణాదు లొసంగి సాదరంబుగం గౌఁగిలించుకొని గోవిందుం డనిచిన నందుండు ప్రణయవిహ్వలుండై బాష్పజలపూరితలోచనుం డగుచు వల్లవులుం దానును వ్రేపల్లెకుం జనియె; నంత

రామకృష్ణుల ఉపనయనము

(1407) గర్గాది భూసురోత్తమ¯ వర్గముచే నుపనయనము వసుదేవుఁడు స¯ న్మార్గంబునఁ జేయించెను¯ నిర్గర్వచరిత్రులకును నిజ పుత్రులకున్. (1408) ద్విజరాజ వంశవర్యులు ¯ ద్విజరాజ ముఖాంబుజోపదిష్టవ్రతులై¯ ద్విజరాజత్వము నొందిరి ¯ ద్విజరాజాదిక జనంబు దీవింపంగన్. (1409) ఉపనయ నానంతరంబున వసుదేవుండు బ్రాహ్మణులకు సదక్షిణంబులుగా ననేక గో హిరణ్యాది దానంబు లొసంగి తొల్లి రామకృష్ణుల జన్మసమయంబు లందు నిజమనోదత్తలైన గోవుల నుచ్చరించి యిచ్చి కామితార్థంబుల నర్థులకుం బెట్టె; నిట్లు బ్రహ్మచారులై. (1410) ఉర్విన్ మానవు లెవ్వరైన గురువా క్యోద్యుక్తులై కాని త¯ త్పూ ర్వారంభము సేయఁ బోల దనుచున్ బోధించు చందంబునన్¯ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్¯ గుర్వంగీకరణంబు సేయఁ జని; రా గోవిందుఁడున్ రాముఁడున్.

సాందీపుని వద్ధ శిష్యు లగుట

(1411) చని మహావైభవరాశియైన కాశిం జేరి తత్తీరంబున నవంతీపుర నివాసియు సకలవిద్యావిలాసియు నైన సాందీపుం డను బుధవర్యునిఁ గని యధోచితంబుగ దర్శించి, శుద్ధభావవర్తనంబుల భక్తి సేయుచునుండ, వారలవలన సంతుష్టుండై. (1412) వేదశ్రేణియు నంగకంబులు ధనుర్వేదంబుఁ దంత్రంబు మ¯ న్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్న్యాయముం దర్కవి¯ ద్యాదక్షత్వము రాజనీతియును శబ్దప్రక్రియం జెప్పె నా¯ భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూతప్రమోదంబునన్. (1413) అఱువదినాలుగు విద్యలు¯ నఱువదినాలుగు దినంబు లంతన వారల్¯ నెఱవాదులైన కతమున¯ నెఱి నొక్కొక నాటి వినికి నేర్చి రిలేశా! (1414) గురువులకు నెల్ల గురులై¯ గురులఘుభావములు లేక కొమరారు జగ¯ ద్గురులు త్రిలోకహితార్థము¯ గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్. (1415) ఇట్లు కృతకృత్యులైన శిష్యులం జూచి వారల మహాత్మ్యంబునకు వెఱఁగుపడి సభార్యుండైన సాందీపుం డిట్లనియె. (1416) "అంభోరాశిఁ బ్రభాసతీర్థమున ము న్నస్మత్తనూసంభవుం¯ డంభోగాహము సేయుచున్ మునిఁగి లేఁ డయ్యెం గృపాంభోనిధుల్¯ శుంభద్వీర్యులు మీరు మీ గురునకుం జోద్యంబుగా శిష్యతన్¯ గాంభీర్యంబునఁ బుత్రదక్షిణ యిడం గర్తవ్య మూహింపరే. (1417) శిష్యులు బలాఢ్యులైన వి¯ శేష్యస్థితి నొంది గురువు జీవించును ని¯ ర్దూష్యగుణ బలగరిష్ఠులు¯ శిష్యులరై గురుని కోర్కి సేయం దగదే?"

గురుపుత్రుని తేబోవుట

(1418) అనిన విని రామకృష్ణులు గుర్వర్థంబుగా దుర్వారరథారూఢులై రయంబునం జని రౌద్రంబున సముద్రంబుఁ జేరి యిట్లనిరి. (1419) "సాగర! సుబుద్ధితోడను¯ మా గురుపుత్రకునిఁ దెమ్ము మా ఱాడిన నీ¯ వాగడ మగుదువు దుస్సహ¯ వేగరణాభీల నిశిత విశిఖాగ్నులకున్." (1420) అనిన వారలకు జలరాశి యిట్లనియె. (1421) "వంచన యేమి లేదు యదువల్లభులార! ప్రభాసతీర్థమం¯ దంచితమూర్తి విప్రసుతుఁ డాఢ్యుఁడు తోయములాడుచుండ ను¯ త్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతిం గొనిపోయెఁ బోవఁగాఁ¯ బంచజనుండు మ్రింగె నతిభాసురశీలుని విప్రబాలునిన్." (1422) అని వాని వసియించు చో టెఱింగించిన. (1423) శంఖారావముతోడఁ బంచజనుఁ డాశంకించి చిత్తంబులో¯ సం ఖిన్నుండయి వార్థిఁ జొచ్చె దహనజ్వాలాభ హేమోజ్జ్వల¯ త్పుంఖాస్త్రంబునఁ గూల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందుఁ డ¯ ప్రేంఖచ్చిత్తుఁడు బాలుఁ గానక గురుప్రేమోదితోద్యోగుఁడై. (1424) దానవుని దేహజం బగు¯ మానిత శంఖంబుఁ గొనుచు మసలక బలుఁడుం¯ దో నేతేరఁగ రథి యై¯ దానవరిపుఁ డరిగె దండధరుపురికి నృపా! (1425) చని సంయమనీనామ నగరంబు చేరి తద్వారంబునఁ బ్రళయకాల మేఘగంభీర నినద భీషణం బగు శంఖంబు పూరించిన విని వెఱఁగుపడి. (1426) "అస్మద్బాహుబలంబుఁ గైకొనక శంఖారావమున్ మాన సా¯ పస్మారంబుగ నెవ్వఁ డొక్కొ నగరప్రాంతంబునం జేసె? మ¯ ద్విస్మేరాహవ రోషపావకునిచే విధ్వస్తుఁడై వాఁడు దా¯ భస్మంబై చెడు"నంచు నంతకుఁడు కోపప్రజ్వలన్మూర్తియై. (1427) వచ్చి రామకృష్ణులం గని వారు లీలామనుష్యు లైన విష్ణుమూర్తు లని యెఱింగి; భక్తితోడ శుశ్రూష చేసి సర్వభూతమయుం డగు కృష్ణునకు నమస్కరించి “యేమి చేయుదు నానతి” మ్మనిన నమహాత్ముండు యిట్లనియె. (1428) "చెప్పెద మా గురునందనుఁ¯ దప్పుగలుగఁ జూచి నీవు దండనమునకుం¯ దెప్పించినాఁడ వాతని¯ నొప్పింపుము మాకు వలయు నుత్తమచరితా!"

గురుపుత్రుని తెచ్చి ఇచ్చుట

(1429) అనిన విని "వీఁడె వీనిం¯ గొనిపొం"డని భక్తితోడ గురునందను ని¯ చ్చినఁ గృష్ణుఁడు వీడ్కొలిపెను¯ ఘనదుర్జనదమను మహిషగమనున్ శమనున్. (1430) ఇట్లు జము నడిగి తెచ్చి రామకృష్ణులు సాందీపునికిం బుత్రుని సమర్పించి “యింకనేమి చేయవలయు నానతిం” డనిన న మహాత్ముం డిట్లనియె. (1431) "గురునకుఁ గోరిన దక్షిణఁ¯ గరుణన్ మున్నెవ్వఁ డిచ్చె? ఘనులార! భవ¯ ద్గురునకుఁ గోరిన దక్షిణఁ¯ దిరముగ నిచ్చితిరి మీరు దీపితయశులై. (1432) కాలుని వీటికిఁ జని మృత¯ బాలకుఁ దే నొరుల వశమె? భవదీయ కృపన్¯ మేలు దొరఁకొనియె మాకు; వి¯ శాల మగుంగాత మీ యశము లోకములన్. (1433) మహాత్ములార! యేను కృతార్థుండ నైతి"నని దీవించిన సాందీపుని వీడ్కొని కృతకృత్యులై రామకృష్ణులు రథారోహణంబు చేసి మథురకుఁ జనుదెంచి పాంచజన్యంబుఁ బూరించిన విని నష్టధనంబులు గనినవారి భంగిం బ్రజలు ప్రమోదించి; రంత నొక్కనాఁ డేకాంతంబున. (1434) "నా పైఁ జిత్తము లెప్పుడున్ నిలుపుచున్ నా రాకఁ గాంక్షించుచున్¯ నా పే రాత్మల నావహించుచు వగన్ నానాప్రకారంబులన్¯ గోపాలాంగన లెంత జాలిఁబడిరో? కోపించిరో? దూఱిరో? ¯ వ్రేపల్లెన్ నిజధర్మ గేహములలో విభ్రాంతచైతన్యలై." (1435) అని చింతించి.

గోపస్త్రీలకడ కుద్ధవుని బంపుట

(1436) సిద్ధవిచారు గభీరున్¯ వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్¯ బుద్ధినిధి నమరగురుసము¯ నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యనఁ బలికెన్. (1437) "రమ్మా యుద్ధవ! గోపకామినులు నా రాకల్ నిరీక్షంచుచున్¯ సమ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో¯ తమ్మున్ నమ్మినవారి డిగ్గవిడువన్ ధర్మంబు గాదండ్రు; వే¯ పొమ్మా; ప్రాణము లే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్. (1438) "లౌకిక మొల్లక న న్నా¯ లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా¯ లోకనములఁ బోషింతును¯ నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్. (1439) సందేహము మానుం డర¯ విందాననలార! మిమ్ము విడువను వత్తున్¯ బృందావనమున కని హరి¯ సందేశము పంపె"ననుము సంకేతములన్." (1440) అని మందహాస సుందర వదనారవిందుండై కరంబు కరంబున నవలంబించి, సరసవచనంబు లాడుచు వీడుకొల్పిన నుద్ధవుండును రథారూఢుండై సూర్యాస్తమయ సమయంబునకు నందవ్రజంబు జేరి వనంబులనుండి వచ్చు గోవుల చరణరేణువులం బ్రచ్ఛన్న రథుండై చొచ్చి, నందు మందిరంబు ప్రవేశించిన.

నందోద్ధవ సంవాదము

(1441) ఆ పుణ్యాత్మునిఁ గౌఁగిలించుకొని నందాభీరుఁ డానంది యై¯ మా "పాలింటికిఁ గృష్ణు డీతఁ"డనుచున్ మన్నించి పూజించి వాం¯ ఛాపూర్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసముం బాపి స¯ ల్లాపోత్సాహముతోడ నిట్లనియె సంలక్షించి మోదంబునన్. (1442) "నా మిత్రుఁడు వసుదేవుఁడు¯ సేమంబుగ నున్నవాఁడె? చెలువుగఁ బుత్రుల్¯ నేమంబున సేవింప మ¯ హామత్తుండైన కంసుఁ డడగిన పిదపన్. (1443) అన్నా! భద్రమె? తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే? ¯ తన్నుం బాసిన గోపగోపికల మిత్రవ్రాతమున్ గోగణం¯ బు న్నిత్యంబు దలంచునే? వన నదీ భూముల్ ప్రసంగించునే? ¯ వెన్నుం డెన్నఁడు వచ్చు నయ్య! యిట మా వ్రేపల్లెకు న్నుద్ధవా? (1444) అంకిలి గలుగక మా కక¯ లంకేందుని పగిదిఁ గాంతిలలితంబగు న¯ ప్పంకజనయనుని నెమ్మొగ¯ మింక విలోకింపఁ గలదె యీ జన్మమునన్?" (1445) అని హరి మున్నొనరించిన¯ పను లెల్లనుఁ జెప్పి చెప్పి బాష్పాకుల లో¯ చనుఁడై డగ్గుత్తికతో¯ వినయంబున నుండె గోపవీరుం డంతన్. (1446) పెనిమిటి బిడ్డని గుణములు¯ వినిపింప యశోద ప్రేమవిహ్వలమతియై¯ చనుమొనలఁ బాలు గురియఁగఁ¯ గనుఁగొనలను జలము లొలుకఁగా బెగ్గిలియెన్. (1447) ఇట్లు గోవింద సందర్శనాభావ విహ్వలురైన యశోదానందులకు నుద్దవుం డిట్లనియె. (1448) "జననీజనకుల మిమ్ముం¯ గనుఁగొన శీఘ్రంబె వచ్చుఁ గని భద్రంబుల్¯ వనజాక్షం డొనరించును¯ మనమున వగవకుఁడు ధైర్యమండనులారా? (1449) బలుడుం గృష్ణుఁడు మర్త్యులే? వసుమతీ భారంబు వారింప వా¯ రల రూపంబులఁ బుట్టినాఁడు హరి నిర్వాణప్రదుం; డిప్పు డు¯ జ్జ్వలుఁడై ప్రాణవియోగకాలమునఁ దత్సర్వేశుఁ జింతించువాఁ¯ డలఘుశ్రేయముఁ బొందు బ్రహ్మమయుఁడై యర్కాభుఁడై నిత్యుఁడై (1450) అట్టి నారాయణుం డఖిలాత్మభూతుండు¯ కారణమానవాకారుఁడైనఁ¯ జిత్తంబు లతనిపైఁ జేర్చి సేవించితి¯ రతికృతార్థులరైతి; రనవరతము¯ శోభిల్లు నింధనజ్యోతి చందంబున¯ నఖిల భూతములందు నతఁ; డతనికి¯ జననీ జనక దార సఖి పుత్ర బాంధవ¯ శత్రు ప్రియాప్రియ జనులు లేరు (1450.1) జన్మకర్మములును జన్మంబులును లేవు¯ శిష్టరక్షణంబు సేయుకొఱకు¯ గుణవిరహితుఁ డయ్యు గుణి యగు సర్వ ర¯ క్షణ వినాశకేళి సలుపుచుండు."

గోపికలు యుద్ధవుని గనుట

(1451) అని మఱియుఁ బెక్కు విధంబుల హరి ప్రభావంబు లుపన్యసించుచు నారేయి గడపి మఱుఁనాడు దధిమథనశబ్దంబు లాకర్ణించుచు లేచి కృతానుష్ఠానుండై యుద్ధవుం డొక్క రహస్యప్రదేశంబున నున్న సమయంబున. (1452) "రాజీవాక్షుఁడు సుందరాస్యుఁడు మహోరస్కుండు పీతాంబరుం¯ డాజానుస్థిత బాహుఁ డంబురుహ మాలాలంకృతుం డుల్లస¯ ద్రాజత్కుండలుఁ డొక్క వీరుఁ డిచటన్ రాజిల్లుచున్నాఁడు మా¯ రాజీవాక్షుని భంగి"నంచుఁ గనిరా రాజాన్వయున్ గోపికల్. (1453) కని లజ్జాసహిత హాసవిలోకనంబులు ముఖంబులకుం జెలువొసంగ నిట్లనిరి. (1454) "ఎఱుఁగుదు మేము నిన్ను వనజేక్షణమిత్రుఁడ వీవు; కూరిమిన్¯ మెఱయుచుఁ దల్లిదండ్రులకు మే లెఱిఁగింపఁ బ్రియుండు పంపఁగా¯ వఱలెడు భక్తి వచ్చితివి; వారలనైన మనంబులోపలన్¯ మఱవఁడు శౌరి మేలు; మఱి మాన్యులు రాజున కెవ్వ రిచ్చటన్. (1455) మునివరులైనను బంధుల¯ ఘనసఖ్యము విడువలేరు గాక విడువరే¯ యనిమిత్తసఖ్య మాఁకటి¯ పనిదీరిన నళులు విరులఁ బాయునొ లేదో."