పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 131 - 262

దేవకీ వసుదేవుల పూర్వఙన్మ

(131) అని యిట్లు దేవకీదేవి విన్నవించిన నీశ్వరుం డిట్లనియె; “నవ్వా! నీవు తొల్లి స్వాయంభువ మన్వంతరంబున పృశ్ని యను పరమపతివ్రతవు; వసుదేవుఁడు సుతపుఁ డను ప్రజాపతి; మీ రిరువురును సృష్టికాలంబున బ్రహ్మపంపునం, బెంపున నింద్రియంబులం జయించి తెంపున వాన గాలి యెండ మంచులకు సైరించి యేకలములై యాకలములు దిని యే కలంకంబును లేక వేండ్రంబుగఁ బండ్రెండువేల దివ్యవర్షంబులు తపంబులఁ జేసిన నెపంబున మీ రూపంబులు మెఱయ యోజనాజపంబులు జేసి, డాసి, పేర్చి, యర్చింప మీకు నాకుఁ గలరూపుఁ జూపి యేను "దిరంబులగు వరంబులు వేఁడుఁ"డనిన మీరు నా మాయం బాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డయడ్డంబున దుర్దమం బగు నపవర్గంబుఁ గోరక నా యీడు కొడుకు నడిగిన మెచ్చి యట్ల వరం బిచ్చి మీ కేను "పృశ్నిగర్భుం"డను నర్భకుండ నయితి; మఱియును. (132) అదితియుఁ గశ్యపుఁ డనగా¯ విదితుల రగు మీకుఁ గుఱుచవేషంబున నే¯ నుదయించితి "వామనుఁ"డన ¯ ద్రిదశేంద్రానుజుడనై ద్వితీయభవమునన్ (133) ఇప్పుడు మూఁడవ బామున¯ దప్పక మీ కిరువురకునుఁ దనయుఁడ నైతిం¯ జెప్పితిఁ బూర్వము మీయం¯ దెప్పటికిని లేదు జన్మమిటపై నాకున్ (134) నందనుఁ డనియుం బరమా¯ నందంబగు బ్రహ్మ మనియు ననుఁ దలచుచు నా¯ పెందెరువు నొందెదరు; నా¯ యందలి ప్రేమమున భవము నందరు మీరల్"

కృష్ణుడు శిశురూపి యగుట

(135) అని యిట్లు పలికి యీశ్వరుం డా రూపంబు విడిచి. (136) ఱెప్ప లిడక తలిదండ్రులు¯ తప్పకఁ దనుఁ జూడ మాయఁ దనరి లలితుఁడై¯ యప్పు డటు గన్న పాపని¯ యొప్పున వేడుకలు జేసె నొకకొన్ని నృపా!

కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట

(137) అంత వసుదేవుండు దనకుం జేయవలసిన పను లీశ్వరుండైన హరివలన నెఱింగిన వాడు గావున. (138) ఆ పురిటి యిల్లు వెలువడి¯ పాపనిఁ దరలించుకొనుచుఁ బఱచెద ననుచున్¯ రూపింప నందుభార్యకుఁ¯ బాప యగుచు యోగమాయ బ్రభవించె నృపా! (139) అ య్యవసరంబున (140) బిడ్డనిఁ గరముల ఱొమ్మున¯ నడ్డంబుగ బట్టి పదము లల్లన యిడుచున్¯ జడ్డనఁ గావలి వారల¯ యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్. (141) అంత నట. (142) నందుని సతికి యశోదకుఁ¯ బొందుగ హరి యోగమాయ పుట్టిన మాయా¯ స్పందమున నొక్క యెఱుఁగమి ¯ క్రందుకొనియె నూరివారిఁ గావలివారిన్. (143) అప్పుడు చప్పుడు కాకుండఁ దప్పుటడుగు లిడుచు, నినుప గొలుసుల మెలుసులు వీడిన దాలంబులు మహోత్తాలుండైన బిడ్డనికి నడ్డంబు గాక కీలూడి వీడిపడ, నరళంబులు విరళంబు లయిన సరళంబులగు మొగసాలలం గడచి, పాఁపఱేఁడు వాకిళ్ళు మరల మూయుచుఁ బడగ లెడగలుగ విప్పి, కప్పి, యేచి, కాచికొని వెంట నంటి రాఁగ దూఁగి నడచునెడ. (144) ఆ శౌరికిఁ దెరువొసఁగెఁ బ్ర¯ కాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశా¯ కాశ యగు యమున మును సీ¯ తేశునకుఁ బయోధి త్రోవ యిచ్చిన భంగిన్.

శయ్యన నుంచుట

(145) ఇట్లు యమున దాఁటి, దూఁటి, చని నందుని మందం జేరి, యం దమంద నిద్రం బొంది, యొడ లెఱుంగని గొల్లలం దెలుప నొల్లక , నిత్యప్రసాద యగు యశోదశయ్య నొయ్యన చిన్నినల్లనయ్య నునిచి, చయ్యన నయ్యవ్వ కూఁతు నెత్తుకొని మరల నింటికిఁ బంటింపక వచ్చి య చ్చిఱుతపాపను దేవకి ప్రక్కం జక్క నిడి. (146) పదముల సంకెల లిడుకొని¯ మదిఁ దలఁకుచు శూరసుతుడు మందుఁడు బోలెన్¯ బెదరుగల రీతి దేహము¯ గదలించుచు నొదిఁగియుండె గఱువతనమునన్ (147) వనజాక్షునిఁ దెచ్చుటయును¯ దనసుతఁ గొనిపోవుటయును దా నెఱుఁగక మూఁ¯ గిననిద్ర జొక్కియుండెను¯ వనజాక్షి యశోద రేయి వసుధాధీశా! (148) అంత బాలిక యావు రని యేడ్చు చిఱుచప్పు¯ డాలించి వేకన నాఁకయింటి¯ కావలివారు మేల్కని చూచి తలుపుల¯ తాళముల్ తొంటివిధమున నుండఁ¯ దెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్ళాడె¯ రమ్ము రమ్మని భోజరాజుతోడఁ¯ జెప్పిన నాతఁడు చిడిముడి పాటుతోఁ¯ దల్పంబుపై లేచి తత్తఱమున (148.1) వెండ్రుకలు వీడఁ బైచీర వ్రేలియాడ¯ దాల్మి కీలూడ రోషాగ్ని దర్పమాడ¯ భూరివైరంబుతోఁ గూడఁ బురిటియింటి¯ జాడఁ జనుదెంచి యా పాపఁ జంపఁ గదియ.

దేవకి బిడ్డను విడువ వేడుట

(149) అంత దేవకీదేవి యడ్దంబు వచ్చి యిట్లనియె. (150) "అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ¯ మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా¯ దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో¯ వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్. (151) కట్టా; యార్గురు కొడుకులఁ¯ బట్టి వధించితివి; యాఁడుఁబడుచిది; కోడల్; ¯ నెట్టన చంపఁగ వలెనే? ¯ కట్టిఁడివి గదన్న! యన్న! కరుణింపఁ గదే. (152) పుత్రుడు నీ బ్రతుకునకును¯ శత్రుండని వింటిగాన సమయింపఁ దగున్; ¯ పుత్రులకు నోచ నైతిని¯ పుత్రీదానంబు జేసి పుణ్యముఁ గనవే.”

మాయ మింటనుండి పలుకుట

(153) అని పయ్యెదఁ జక్కఁ సవరించుకొనుచుఁ, బలవరించుచు, భ్రాంతిపడి కూఁతున్ గ్రక్కున నక్కునం జక్క హత్తుకొని, చెక్కుచెక్కున మోపి, చయ్యన నుత్తరీయాంచలంబున సంచలతం గప్పి, చప్పుడుగాఁ గుయ్యిడ, నయ్యెడం గ్రయ్యం బడి వాఁడు పోఁడిమి చెడఁ, దోబుట్టువుం దిట్టి, చిట్టిపట్టి నావురని వాపోవఁ, గావరంబున నడుగు లొడిసి తిగిచి, వడిం బెడిసిపడం బుడమిపైం బడవైచిన, న బ్బాలయు నేలంబడక, లీల నెగసి, నవ్య దివ్య మాలికా గంధ బంధుర మణి హారాంబరాద్యలంకార మనోహారిణియు, గదా శంఖ చక్ర పద్మశర చాపాసి శూలధారిణియునై, యెనిమిది కరంబులం గరంబొప్పుచు, సిద్ధ చారణ కిన్నర గరుడ గంధర్వాది వైమానిక నికాయంబు గానికలిచ్చి పొగడ, నెగడుచు, నచ్చరల యాట పాటలకు మెచ్చుచు, మింటనుండి కంటఁబడి, కంటుపడఁ, గంసుని కిట్లనియె. (154) "తెంపరివై, పొరిం బొరిని, దేవకిబిడ్డలఁ జిన్నికుఱ్ఱలం¯ జంపితి, వంతనైన నుపశాంతి వహింపక, ఱాలమీఁద నొ¯ ప్పింపితి, విస్సిరో! యిదియు బీరమె? నా సరసన్ జనించి నిన్¯ జంపెడు వీరుఁ డొక్క దెస సత్కృతి నొందెడువాడు; దుర్మతీ!" (155) అని పలికి. (156) మహనీయ గుణాస్పదయై, ¯ మహిలో నా దేవి జనము మన్నింపంగా, ¯ బహు నామ నివాసంబుల, ¯ బహునామములం జరించె భద్రాత్మికయై. (157) అంత నాబోటి పలికిన కలికి పలుకులు ములుకులై, చెవులఁ జిలికిన, నులికిపడి, జళుకు గదిరిన మనంబున, ఘనంబుగ వెఱఁగంది, కంది, కుందెడు దేవకీవసుదేవుల రావించి, యాదరంబున సంభావించి, చేరి, వారితో నిట్లనియె. (158) "పాపుఁడ; బాలఘాతకుఁడ; బంధు విరక్తుఁడ; దుష్ట చిత్తుఁడన్; ¯ గోపనుఁడన్; జరన్మృతుఁడఁ; గ్రూరుఁడ; బ్రాహ్మణహంత భంగి మీ ¯ పాపల జంపితిన్; బయలి పల్కుల నమ్మితి; సాధులార! నా¯ పాపము లుగ్గడింపక, కృపాపరులై కనరే! శమింపరే! (159) ఒక్కెడఁ బ్రాణులందఱు నిజోచితకర్మము లోలిఁ ద్రిప్పగా, ¯ నొక్కొక మేనితో బొడమి, యొక్కొక త్రోవను రాకపోకలం¯ జిక్కులఁ బొందుచుండుదురు; చెల్మిని సంసృతితోడఁ బాయ, రే¯ నెక్కడి హంత? మీ శిశువు లెక్కడి హన్యులు? దూఱనేటికిన్? (160) పగతురఁ జెఱిచితి ననియును, ¯ బగతురచేఁ జెడితి ననియు, బాలుఁడు తలఁచున్; ¯ బగ చెలుములు లే వాత్మకుఁ¯ బగచెలుముల కీలు కర్మబంధము సుండీ!" (161) అని పలికి, కన్నీరు నించి, వగచి, వెఱచుచు, దేవకీవసుదేవుల పాదంబులఁ బట్టుకొని, సంకెలలు విప్పించి, మిక్కిలి యక్కఱ గల వాక్యంబుల నైక్యంబులు నెఱపిన, వారును బరితప్తుం డైన కంసునిఁ జూచి, రోషంబును బాసి; రంత నా వసుదేవుండు బావ కిట్లనియె. (162) "బావా! నీ వచనంబు నిక్కము సుమీ; ప్రాణుల్ గతజ్ఞాను లై¯ నీవే నంచును లోభ మోహ మద భీ నిర్మిత్రతామోద శో ¯ కావేశంబుల నొండొరుం బొడుతు రేకాకారుఁడై సర్వరూ¯ పావిష్టుండగు నీశ్వరుం దెలియలే రన్యోన్యవిభ్రాంతులై"

కంసునికి మంత్రుల సలహా

(163) అని యిట్లు బ్రసన్నులైన దేవకీవసుదేవుల యనుజ్ఞ వడసి, కంసుం డింటికిం జని, యా రేయి గడపి, మఱునాఁడు ప్రొద్దునం గ్రద్దనం దనకుం బరతంత్రులగు మంత్రుల రావించి, యోగనిద్ర వలనం దా వినిన వృత్తాంతం బంతయు మంతనంబున నెఱింగించిన, నపుడు వార లతని కిట్లనిరి. (164) "ఇట్టయినఁ దడయ నేటికి? ¯ పట్టణముల, మందలందుఁ, బల్లెల నెల్లన్¯ బుట్టెడి పెరిఁగెడి శిశువులఁ¯ బట్టి వధించెదము; మమ్ముఁ బంపు మధీశా! (165) భవదీయోజ్జ్వల బాహుచాప విలసద్బాణావళీ భగ్నులై, ¯ దివిజాధీశ్వరు లే క్రియంబడిరొ? యే దేశంబులం డాఁగిరో?¯ శివునిం జొచ్చిరొ? బ్రహ్మఁ జెందిరొ? హరిన్ సేవించిరో? మౌని వృ¯ త్తి వనాంతంబుల నిల్చిరో? మనకు శోధింపం దగున్ వల్లభా! (166) నొచ్చిరి శాత్రవు లనుచును¯ విచ్చలవిడిఁ దిరుగ వలదు, వివిధాకృతులన్¯ మ్రుచ్చిలి వత్తురు; వారలు¯ సచ్చిన యందాఁక మఱవఁ జన దధిపునకున్. (167) ఒత్తికొనుచు రానీఁజనఁ¯ దెత్తిన రోగముల, రిపుల, నింద్రియముల ను¯ త్పత్తి సమయములఁ జెఱుపక¯ మెత్తన గారాదు; రాదు మీఁద జయింపన్. (168) అమరశ్రేణికి నెల్లఁ జక్రి ముఖరుం; డా చక్రి యేధర్మమం¯ దమరున్; గోవులు, భూమిదేవులు, దితిక్షామ్నాయ కారుణ్య స¯ త్యములున్, యాగ తపోదమంబులును, శ్రద్ధాశాంతులున్ విష్ణుదే ¯ హము; లిన్నింటిని సంహరించిన నతం డంతంబునుం బొందెడిన్. (169) కావున. (170) చంపుదుమే నిలింపులను? జంకెల ఱంకెలఁ దాపసావళిం ¯ బంపుదుమే కృతాంతకుని పాలికిఁ? గ్రేపులతోడ గోవులం¯ ద్రుంపుదుమే? ధరామరులఁ దోలుదుమే? నిగమంబులన్ విదా¯ రింపుదుమే? వసుంధర హరింపుదు మే? జననాథ! పంపుమా. " (171) అని పలుకు మంత్రుల మంత్రంబుల నిమంత్రితుండై, బ్రాహ్మణ నిరోధంబు నిషిద్ధం బని తలంపక కాలపాశబద్ధుండయి, విప్రాది సాధుమానవులఁ జంప దానవులం బంపి, యంతిపురంబునకుం జనియె; ననంతరంబ యా రక్కసులు వెక్కసంబు లగు మొక్కలంబుల సజ్జనుల పజ్జలం బడి, తర్జన గర్జన భర్జనాది దుర్జనత్వంబులం జేసి, నిర్జించి పాపంబు లార్జించిరి. (172) వెదకి వెదకి, దైత్యవీరులు సాధుల¯ నడఁప, వారి బలము లడఁగిపోయె;¯ యశము, సిరియు, ధర్మ, మాయువు, భద్రంబు, ¯ నార్యహింసజేయ నడఁగుఁగాదె.

కృష్ణునికి జాతకర్మచేయుట

(173) అంత మందలో నందుండు నందనుండు పుట్టుట యెఱింగి, మహానందంబున నెఱవాదులగు వేదవిదులం బిలిపించి, జలంబులాడి, శుచియై, శృంగారించుకొని, స్వస్తి పుణ్యాహవాచనంబులు చదివించి, జాతకర్మంబు జేయించి, పితృదేవతల నర్చించి, క్రేపులతోడఁగూడఁ గైజేసిన పాఁడిమొదవుల రెండులక్షలను, గనక కలశ మణి వసన విశాలంబులైన తిల శైలంబుల లేడింటిని భూదేవతల కిచ్చిన. (174) "ఈ యాభీరకుమారుఁడు ¯ శ్రీయుతుడై, వీర వైరిజేతయునై, దీ¯ ర్ఘాయుష్మంతుం డగు"నని¯ పాయక దీవించి రపుడు బ్రాహ్మణ జనముల్. (175) దుందుభులు మొరసె; గాయక¯ సందోహము పాడె; సూతసముదాయముతో¯ వందిజనులు కీర్తించిరి; ¯ క్రందుగ వీతెంచె భద్రకాహళ రవముల్. (176) పల్లవ తోరణసురుచిర¯ వల్లీధ్వజరాజిధూపవాసనములతో, ¯ సల్లలితములై యొప్పెను¯ వల్లవవల్లభుల యిండ్ల వాకిం డ్లెల్లన్ (177) పసుపులు నూనెలు నలఁదిన¯ పసఁ దనరి, సువర్ణ బర్హి బర్హ ప్రభతోఁ¯ బసిమి గలిగి, వెలుగొందుచుఁ, ¯ బసు లన్నియుఁ మందలందుఁ బ్రసరించె, నృపా! (178) క్రేళ్ళుఱికి మసలె లేఁగలు; ¯ మల్లడిగొని ఱంకె లిడియె మదవృషభంబుల్; ¯ పెల్లుగ మొదవులు పొదుఁగుల¯ జల్లించెం బాలు, బాలుసంభవవేళన్ (179) ఆరఁగఁ జదివెడి పొగడెడి¯ వారికి, విద్యలను బ్రతుకువారికి, లేమిం¯ జేరిన వారికి నెల్లను¯ గోరక మును నందు డిచ్చె గోధనచయముల్. (180) ఆ సమయంబున. (181) కంచుకములు, తలచుట్లును, ¯ గాంచన భూషాంబరములుఁ, గడు మెఱయఁగ నే¯ తెంచిరి, గోపకు లందఱు¯ మంచి పదార్థములు గొనుచు మాధవుఁ జూడన్. (182) ఏతెంచి, చూచి చెలఁగుచు¯ నేతులఁ, బెరుఁగులను, బాల, నీళ్ళను, వెన్నం¯ బ్రీతి వసంతము లాడిరి¯ యేతరులై, సరసభాష లెసగన్ గొల్లల్. (183) తదనంతరంబ. (184) "ఏమినోము ఫలమొ? యింత ప్రొ ద్దొక వార్త¯ వింటి మబలలార! వీను లలర; ¯ మన యశోద, చిన్నిమగవానిఁ గనె నట¯ చూచి వత్త మమ్మ! సుదతులార! " (185) అని యొండొరుల లేపికొని, గోపిక లోపికలు లేని చిత్తంబుల నెత్తిన తత్తఱంబు లొత్తుకొన, నుదారంబులగు శృంగారంబులతో నిండ్లు వెలువడి. (186) జడగతులును, బలుపిఱుదులుఁ, ¯ బిడికెడు నడుములును, వలుఁద బిగి చనుఁగవలున్, ¯ వెడఁద నయనములు, సిరి తడఁ¯ బడు మోములు, భ్రమర చికుర భరములు, నమరన్. (187) వేడుకతోడఁ గ్రొమ్ముడులు వీడఁ, గుచోపరి హారరేఖ ల¯ ల్లాడఁ, గపోలపాలికల హాటకపత్రరుచుల్ వినోదనం¯ బాడఁ, బటాంచలంబు లసియాడఁగఁ, జేరి, యశోద యింటికిన్¯ జేడియ లేగి, చూచి రొగి జిష్ణుని విష్ణునిఁ జిన్నికృష్ణునిన్. (188) చూచి సంతసించి, తెచ్చిన కానుక లిచ్చి.

జలక మాడించుట

(189) పాపనికి నూనెఁ దలయంటి, పసుపుఁ బూసి, ¯ బోరుకాడించి, "హరిరక్ష పొ"మ్మటంచు¯ జలము లొక కొన్ని చుట్టి రాఁజల్లి, తొట్ల¯ నునిచి, దీవించి, పాడి ర య్యువిద లెల్ల. (190) "జోజో కమలదళేక్షణ! ¯ జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా! ¯ జోజో పల్లవకరపద! ¯ జోజో పూర్ణేందువదన! జోజో"యనుచున్. (191) ఇ వ్విధంబున. (192) పలు తోయంబులు జగములఁ¯ బలు తోయములందు ముంచి, భాసిల్లెడి యా¯ పలుతోయగాఁడు, వల్లవ¯ లలనా కరతోయములఁ జెలంగుచుఁ దడియున్. (193) లోకములు నిదుర వోవఁగ¯ జోకొట్టుచు, నిదురవోని సుభఁగుడు, రమణుల్¯ జోకొట్టి పాడ, నిదురం¯ గైకొను క్రియ నూరకుండెఁ గను దెఱవకయున్. (194) ఏ బాము లెఱుగక యేపారు మేటికిఁ¯ బసుల కాపరియింటఁ బాము గలిగె; ¯ నే కర్మములు లేక యెనయు నెక్కటికిని¯ జాత కర్మంబులు సంభవించె; ¯ నే తల్లి చనుఁబాలు నెఱుఁగని ప్రోడ, య¯ శోద చన్నుల పాల చొరవ నెఱిఁగె; ¯ నే హాని వృద్ధులు నెఱుఁగని బ్రహ్మంబు¯ పొదిఁగిటిలో వృద్ధిఁ బొందఁ జొచ్చె; (194.1) నే తపములనైన నెలమిఁ బండనిపంట¯ వల్లవీ జనముల వాడఁ బండె; ¯ నే చదువుల నైన నిట్టిట్టి దనరాని¯ యర్థ మవయవముల నంద మందె. (195) చెయువుల్ జేయుతఱిన్ విధాతకరణిం జెన్నొందు, సంతోష దృ¯ ష్టి యుతుండై నగుచున్ జనార్దనుని మాడ్కిం బొల్చు, రోషించి యు¯ న్న యెడన్ రుద్రునిభంగి నొప్పును, సుఖానందంబునం బొంది త¯ న్మయుడై బ్రహ్మముభాతి బాలుఁ డమరు న్బాహుళ్య బాల్యంబునన్. (196) అ య్యవసరంబున (197) కొడుకుఁ గన్న వేడ్క కొనసాగ రోహిణిఁ¯ జీరఁబంచి, చిత్రచేలములను¯ మండనముల నిచ్చి, మన్నించె, నందుఁ డా¯ యంబుజాక్షి ప్రీతయై చరించె.

నందుడు వసుదేవుని చూచుట

(198) అది మొదలు మొదవుల కదుపులు పొదువులు గలిగి యుండె; నంత నందుండు గోపకుల ననేకుల గోకులరక్షకుం దక్షులైన వారిని నియమించి, మథురకుం జని, కంసునకు నేఁటేఁటం బెట్టెడి యరింబెట్టి, వీడ్కొని, వసుదేవుని కడకుం జని, యథోచితంబుగ దర్శించిన. (199) నందుని గనుఁగొని ప్రాణముఁ¯ బొందిన బొందియునుఁ బోలెఁ బొలుపారుచు, నా¯ నందాశ్రులు గడకన్నుల ¯ గ్రందుకొనం, గేలుసాఁచి కౌఁగిటఁ జేర్చెన్. (200) మఱియుఁ గౌఁగిలించుకొని, సుఖాసీనునింగాఁజేసి, వసుదేవుండు దన కొడుకువలని మోహంబు దీపింప నందుని కిట్లనియె. (201) "సంతతి లే దని మును ఘన¯ చింతనముల మునిఁగి, ముదిసి చిక్కిన నీకున్¯ సంతతి గలిగెను; భాగ్యము; ¯ సంతతిహీనునికి సౌఖ్యసంతతి గలదే? (202) పొడగంటి నిన్ను; బ్రతికితిఁ;¯ గడచితి నాపదల నింకఁ గార్యములం దే¯ యెడమడుగు లేని నెచ్చలిఁ¯ బొడగాంచుట చచ్చి మఱలఁ బుట్టుట గాదే? (203) పలుపాటులఁబడు జనులకు¯ నిల నొకచో నుండఁ గలదె? యేఱుల వెంటం¯ గలసి చను, మ్రాఁకు లన్నియుఁ ¯ బలువెంటలఁ బోవుఁగాక; పాయక యున్నే? (204) పలురోగంబుల నొందకున్నవె పసుల్? పాలిచ్చునే ధేనువుల్? ¯ గొలఁకుల్ వాగులు వారిపూరితములే? గోష్ఠ ప్రదేశంబులం¯ బులులున్ దుప్పులు సంచరింపవు గదా? పొల్పారునే ఘోషముల్? ¯ కలవే పచ్చని పూరిజొంపములు, తత్కాంతార భాగంబులన్? (205) తన పుత్ర మిత్ర ముఖరులఁ¯ దనుపక, చూడకయు, వారు దఱిఁగి నశింపన్¯ మనుచు గృహమేధియాశ్రమ¯ మున నుండెడువాని, కొక్క మోదము గలదే? (206) నీ కాంతయొద్ద నీవును¯ నీ కాంతయు గారవింప, నినుఁ దండ్రిగ నా¯ లోకించుచు నీ మందను¯ నా కొడు కున్నాఁడె? నంద! నందాన్వితుఁడై."

వసుదేవ నందుల సంభాషణ

(207) అనిన నందుం డిట్లనియె. (208) "నీకున్ దేవకికిన్ జనించిన సుతానీకంబుఁ దోడ్తోడ ము¯ న్నీకంసుండు వధించె; మీ సుతఁ దుదిన్ హింసింపఁ, జే తప్పి, తా¯ నాకాశంబున కేగె; బాల యిది; దైవాధీనమాపద్దశన్¯ శోకంబందునె తజ్ఞుఁ; డూఱడిలు! నా సూనుండు నీ సూనుఁడే." (209) అనిన వసుదేవుండు నందునికి మఱియు నిట్లనియె. (210) "జనపతి కరి యిడితివి; మముఁ¯ గనుఁగొంటివి; మేము నిన్నుఁ గంటిమి; మే ల¯ య్యెను; బొమ్మింకను గోకుల¯ మున నుత్పాతములు దోఁచు మునుకొనవలయున్. " (211) అని పలికి వసుదేవుండు నందాదులైన వల్లవుల వీడ్కొలిపిన వారలు గొబ్బున వడిగల గిబ్బలం బూనిన శకటంబులు ప్రకటంబులుగ నెక్కి, తమతమ పల్లెల త్రోవలుపట్టి చని; రా నందుండు ప్రతీతంబులైన యుత్పాతంబులు ముందరఁ బొడగని "శౌరి తనతోఁ బలికిన పలుకులు తప్ప"వనుచుఁ దలంచుచుం జనియె; నంత.

పూతన వ్రేపల్లె కొచ్చుట

(212) కంసుపంపున బాలఘాతిని పూతన¯ పల్లెల, మందలఁ, బట్టణముల¯ నిల నెల్లచో, బాలహింస గావించుచుఁ¯ జనుచు, నెవ్వని పేరు శ్రవణవీధిఁ¯ బడినయంతన సర్వభయనివారణ మగు¯ నట్టి దైత్యాంతకుం డవతరించి¯ యున్న నందునిపల్లె కొకనాడు ఖేచరి¯ యై వచ్చి యందు మాయాప్రయుక్తిఁ (212.1) గామరూపిణి యై చొచ్చి, కానకుండ¯ నరిగి, యిల్లిల్లు దప్పక యరసికొనుచు, ¯ నందగృహమున బాలుని నాద మొకటి¯ విని ప్రమోదించి, సుందరీవేష యగుచు. (213) క్రాలుకన్నులు, గుబ్బచన్నులుఁ, గందుఁవొందని చందురుం, ¯ బోలు మోమును, గల్దు లేదను బుద్ధి దూఱని కౌను, హే¯ రాళమైన పిఱుందు, పల్లవరాగ పాద కరంబులుం, ¯ జాల దొడ్డగు కొప్పు, నొప్పగ సర్వమోహనమూర్తితోన్ (214) కాంచనకుండల కాంతులు, గండయు¯ గంబునఁ గ్రేళ్ళుఱుకన్, జడపై¯ మించిన మల్లెల మేలిమి తావులు¯ మెచ్చి, మదాళులు మింటను రా, ¯ నంచిత కంకణహారరుచుల్ చెలు¯ వారఁగఁ, బైవలు వంచల నిం¯ చించుక జారఁగ నిందునిభానన¯ యేగెఁ గుమారుని యింటికినై. (215) ఆ సమయంబునన్.

పూతన బాలకృష్ణుని చూచుట

(216) సిరి మమ్మున్ బ్రతుకంగఁ జూచుకొఱకై, శృంగారవేషంబుతో¯ నరుదేనోపు నటంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి త¯ త్పరులై చూడ, లతాంగి బోయి కనియెం, బర్యంక మధ్యంబునం¯ బరు, భస్మానలతేజు, దుర్జనవధ ప్రారంభకున్, డింభకున్. (217) కని కదియవచ్చు సమయంబున. (218) ఆ లోకేశ్వరుఁ, డా చరాచరవిభుం, డా బాలగోపాలుఁ, డా¯ బాలధ్వంసిని గొంటు కంటిడి వెసన్ బాలింతచందంబునన్, ¯ బాలిండ్లన్ విష మూని, వచ్చుట మదిన్ భావించి, లో నవ్వుచున్¯ గాలుం గేలు నెఱుంగకున్న కరణిం గన్మోడ్చి, గుర్వెట్టుచున్.

పూతన కృష్ణుని ముద్దాడుట

(219) ఆ పాపజాతి సుందరి¯ యా పాపని పాన్పుఁ జేర నరిగి, కరములన్¯ లేపి, చనుంగవ శిశువున్¯ మోపుచు ముద్దాడి, శిరము మూర్కొని, పలికెన్. (220) "చను నీకు గుడుపఁజాలెడి¯ చనువారలు లేరు; నీవు చనవలె"ననుచుం¯ "జనుఁగుడుపి, మీఁద నిలుకడఁ¯ జనుదాన" ననంగ, వేడ్కఁ జనుఁ జనుఁ గుడుపన్. (221) "నా చనుఁబా లొక గ్రుక్కెఁడు¯ నో! చిన్నికుమార! త్రావు మొయ్యన; పిదపన్¯ నీ చెలువ మెఱుఁగ వచ్చును;¯ నా చెలువము సఫల మగును; నళినదళాక్షా!" (222) అని బాలు నుద్దేశించి, ముద్దాడెడి భంగి మాటలాడెడి చేడియం జూచి.

పూతన కృష్ణునికి పాలిచ్చుట

(223) "వనితా! ముట్టకు మమ్మ; చన్ను గుడుపన్వల్దమ్మ; నీ చన్నుమా¯ తనయుం డొల్లఁడు; వాసి పొ"మ్మని యశోదా రోహిణుల్ జీరఁ, గై¯ కొన, కీక్షించుచు మాయఁ బన్ని, పెలుచం గోశంబులో వాలు మె¯ ల్పున రాజిల్లుచు, మాట మెత్తఁదనమున్, లోవాడియు న్నేర్పడన్. (224) కదిసి కలికిపలుకులు పలుకుచు, నులుకుజెడి జళుకు సొరక, యెదుర నిదురంగదిరిన ఫణిని, ఫణి యని యెఱుంగక, గుణమతిం దిగుచు జడమతి బెడంగునఁ, గఱటి జఱభితెఱవ వెరవునం జనుదెంచి, పఱపునడుమ నొఱపు గలిగి, మెఱయుచుఁ, గనుంగవం దెఱవక, వెఱపు మఱపు నెఱుంగక, కొమరుమిగులు చిఱుత కొమరునిం దిగిచి, తొడలనడుమ నిడుకొని, యొడలు నివురుచు, నెడనెడ మమతం గడలుకొలుపుచు, “నాఁకొన్న చిన్నియన్న! చన్ను గుడువు” మని చన్నిచ్చు సమయంబున.

పూతన సత్తువ పీల్చుట

(225) మేల్కొన్న తెఱఁగున మెల్లనఁ గనువిచ్చి¯ క్రేగంటఁ జూచుచుఁ, గిదికి నీల్గి, ¯ యావులించుచుఁ జేతు లాకసంబునఁ జాఁచి¯ యొదిఁగిలి యాఁకొన్న యోజ నూది, ¯ బిగిచన్నుగవఁ గేలఁ బీడించి, కబళించి¯ గ్రుక్క గ్రుక్కకు గుటుగుటుకు మనుచు, ¯ నొక రెండు గ్రుక్కల నువిద ప్రాణంబులు¯ సైతము, మేనిలో సత్వ మెల్లఁ (225.1) ద్రావె, నదియును గుండెలు దల్లడిల్ల, ¯ జిమ్మ దిరుగుచు నిలువక, శిరము వ్రాల¯ "నితర బాలుర క్రియవాఁడ వీవు గావు;¯ చన్ను విడువుము; విడువుము; చాలు"ననుచు.

పూతన నేలగూలుట

(226) నిబ్బరపు దప్పి మంటలు ¯ ప్రబ్బిన, ధృతి లేక, నేత్ర పద హస్తంబుల్¯ గొబ్బున వివృతములుగ, నా¯ గుబ్బనుచున్నట్టి కూఁతఁ గూలెన్ నేలన్. (227) అదరెం గొండలతోడ భూమి; గ్రహతారానీకముల్ మింటిపై¯ బెదరెన్; దిక్కుల మాఱు మ్రోత లెసఁగెన్; భీతిల్లి లోకంబులుం¯ గదలం బాఱెను; వజ్రభిన్నగిరిరేఖం బూర్వదేహంబుతోఁ¯ ద్రిదశధ్వంసిని గూలి, కుయ్యిడిన దద్దీర్ఘోరు ఘోషంబునన్. (228) అప్పుడు దెప్పరమగు నా¯ చప్పుడు హృదయములఁ జొచ్చి, సందడి పెట్టన్, ¯ ముప్పిరిఁగొని పడి; రెఱుకలు¯ దప్పి ధరన్, గొల్ల లెల్లఁ దల్లడపడుచున్ (229) ఆ జఱభిరండ రక్కసి¯ నైజశరీరంబు నేల నలియంబడినన్¯ యోజనమున్నర మేర ధ¯ రాజంబులు నుగ్గులయ్యె, రాజవరేణ్యా! (230) దారుణ లాంగలదండ దంతంబులు¯ నగ గహ్వరముఁ బోలు నాసికయును, ¯ గండశైలాకృతి గల కుచయుగమును¯ విరిసి తూలెడు పల్లవెండ్రుకలును, ¯ జీఁకటినూతులఁ జెనయు నేత్రంబులుఁ¯ బెనుదిబ్బఁ బోలెడి పెద్ద పిఱుఁదుఁ, ¯ జాఁగుకట్టలఁ బోలు చరణోరుహస్తంబు¯ లింకినమడువుతో నెనయు కడుపుఁ, (230.1) గలిగి షట్క్రోశ దీర్ఘమై కదిసి చూడ, ¯ భయదమగు దాని ఘనకళేబరముఁ జూచి, ¯ గోపగోపీజనంబులు గుంపుగూడి, ¯ బెగడుచుండిరి మనముల బెదరు గదిరి. (231) ఇ వ్విధంబునన్. (232) ఆ తఱిఁ గుడువఁగ నడచెన్, ¯ నూతనఫుల్లాబ్జలోచనుఁడు, హరి మృత్యు¯ ద్యోతనఁ గృతముని సముదయ¯ యాతనఁ, బూతన నెఱింగి యాతనలీలన్. (233) విషధరరిపు గమనునికిని¯ విషగళ సఖునికిని, విమల విష శయనునికిన్, ¯ విషభవభవ జనకునికిని, ¯ విషకుచచను విషముఁ గొనుట విషమే తలపఁన్? (234) అంత నా గోపగోపీజనంబులు దెలిసి, రోహిణీయశోదలం గూడుకొని, బెగ్గడిలక డగ్గఱి. (235) నేలంగూలిన దాని పెన్నురముపై నిర్భీతిఁ గ్రీడింప, "నో! ¯ బాలా! ర"మ్మని మూపుఁ జేర్చుకొని, సంస్పర్శించి, యూరార్చుచున్¯ గోలాంగూలముఁ ద్రిప్పి, గోవురజమున్ గోమూత్రముం జల్లి, త¯ ద్బాలాంగంబుల గోమయం బలఁది; రా పండ్రెండు నామంబులన్. (236) మఱియు నంతటం దనియక, గోపిక లాచమనంబు జేసి దక్షులై, మునుపుగాఁ దమకు రక్షాకరంబగు బీజన్యాసంబు సేసికొని, "చిన్నియన్న! నీ యడుగు లజుండును, జానువు లనిలుండును, దొడలు యజ్ఞుండును, గటితలం బచ్యుతుండును, గడుపు హయాస్యుండును, హృదయంబు గేశవుండును, నురము నీశుండును, గంఠంబు నినుండును, భుజంబుల జతుర్భుజుండును, ముఖంబు త్రివిక్రముండును, శిరం బీశ్వరుండును రక్షింతురు; ముందు చక్రియు, వెనుక గదాధరుండైన హరియుఁ, బార్శ్వంబుల ధనుర్ధరుండైన మధువైరియు, నసిధరుండగు నజనుండును, గోణంబుల శంఖచక్ర గదాధరుండైన యురుగాయుండును, మీఁదు నుపేంద్రుడును, గ్రిందు దార్క్ష్యుండు, నంతటను హలధరుండగు పురుషుండును, గాతురు; నీ యింద్రియంబుల హృషీకేశుండును, బ్రాణంబుల నారాయణుండును, జిత్తంబు శ్వేతద్వీపపతియును, మనంబును యోగీశ్వరుండైన కపిలుండును, బుద్ధిని బృశ్నిగర్భుండు, నహంకారంబున భగవంతుండైన పరుండును బాలనంబు సేయుదురు; నీవు క్రీడించునెడ గోవిందుండును, శయనించు తఱి మాధవుండును, నడచువేళ వైకుంఠుండును, గూర్చున్న సమయంబున శ్రీపతియును, గుడుచు కాలంబున సర్వభక్షకుం డయిన యజ్ఞభుజుండు నేమఱకుండుదురు; నిన్నుఁ బేర్కొనిన దుస్వప్న వృద్ధబాలగ్రహంబులును, గూశ్మాండ, డాకినీ, యాతుధానులును, భూత ప్రేత యక్ష రాక్షస పిశాచ వినాయకులును, గోటరాదులును, జ్యేష్ఠాది భూతనాథులును, మాతృకాదిగణంబులు నశియింతురు; నీ యందుఁ బ్రాణేంద్రియ శరీరనిరోధంబు లైన యున్మాదంబులు, నపస్మారంబులును, మహోత్పాతంబులును బొందకుండుం గావుత!"యని రక్షచేసి దీవించి; రంత. (237) ఆ పెద్ద వేడబంబుల¯ పాపనికిని జన్నుఁ గుడిపి, పానుపుపై సం¯ స్థాపించి, కప్పి, "కూరుకు¯ మో పాపఁడ!"యని యశోద యొయ్యనఁ బాడెన్. (238) అంత నందుండు మొదలయిన గోపకులు మథురనుండి వచ్చి, రక్కసి మేనుఁ గని, వెఱఁగుపడి, “మున్ను వసుదేవుం డుత్పాతంబు లెఱింగి చెప్పె; నతండు మహాయోగి” యని పొగిడి, కఠోరం బగు పూతన యొడలు గుఠారంబుల నఱకి, తమ కుటీరంబులకుం దవ్వగు ప్రదేశంబున పటీరంబుల దహనంబు, సంగ్రహించి దహించి; రంత. (239) పొగిలి పొగిలి, కాలు మగువదేహంబున¯ నగరు పరిమళముల పొగలు వెడలె;¯ దేహకల్మషములు శ్రీహరి ముఖమునఁ¯ ద్రావఁబడుటఁ జేసి, భూవరేణ్య! (240) హరి దనమీఁదం బదములు¯ గరములు నిడి, చన్ను గుడిచి, కదిసినమాత్రన్¯ హరిజనని పగిదిఁ బరగతి¯ కరిగెను దురితములు బాసి యసురాంగనయున్. (241) వెన్నుని కొకమఱి విషమగు¯ చన్నిచ్చిన బాలహంత్రి చనెనట దివికిన్;¯ వెన్నునిఁ గని, పెంచుచుఁ దన¯ చన్నిచ్చిన సతికి మఱియు జన్మము గలదే? (242) హరిఁ గని, చన్నులు గుడిపెడి¯ తరుణులు ప్రాపించు పదము తలఁపఁగ వశమే? ¯ హరి యారగించుటకుఁ బా¯ ల్గురిసిన ధేనువులు ముక్తి కొనలఁ జరించున్. (243) ఆ పూతన మెయిగంధము¯ గోపాలు రెఱింగి, "యిట్టి కువనిత యొడలం¯ దీపాటి స్వాదుగంధము ¯ ప్రాపించునె"యనుచుఁ జనిరి పల్లెల కధిపా! (244) అంత నందుండు పరమానందంబున నింటికిఁ జని, వ్రేతలచేత రక్కసిచేత లన్నియు నెఱంగి, వెఱఁగుపడి, పాపని లేపి, శిరంబు మూర్కొని, ముద్దాడి, ముదంబున నుండె;” నని చెప్పిన విని, పరీక్షిన్నరేంద్రుఁ డిట్లనియె. (245) "ఏయే యవతారంబుల¯ నే యే కర్మములు జేసె నీశుఁడు హరి; భ¯ ద్రాయతనము లన్నియు వినఁ¯ బాయదు చిత్తంబు; చెవులపండువు లయ్యెన్. (246) ఉరుసంసారపయోనిధి¯ తరణంబులు, పాపపుంజ దళనంబులు, శ్రీ¯ కరణంబులు, ముక్తి సమా¯ చరణంబులు, బాలకృష్ణు సంస్మరణంబుల్. (247) అని “తరువాత బాలకృష్ణుం డేమి చేసె? నా యందుఁ గృపగలదేనిం జెప్పవే!” యని యడిగిన, రాజునకు శుకుం డిట్లనియె.

యశోద కృష్ణుని తొట్లనిడుట

(248) బాలకుం డొదిగిలఁ బడనేర్చెనని జన్మ¯ నక్షత్రమం దొకనాడు, నందు¯ పొలతి వేడుకతోడఁ బొరుగు వ్రేతలఁ జీరి¯ వాదిత్రగీతారవంబు చెలఁగ¯ విప్రులతోఁగూడ వేదమంత్రంబుల¯ నభిషేచనాదిక మాచరించి¯ వారి దీవెన లొంది వారికి మొదవులు¯ నన్నంబు జీరల నడిగినట్టు (248.1) లిచ్చి బాలుఁ దియ్య మెసఁగఁ బానుపుఁ జేర్చి¯ నిదురపుచ్చి గోపనివహమునకు¯ గోపికలకుఁ బూజ గొమరారఁ జేయుచు¯ జనని కొడుకు మఱచె సంభ్రమమున.

కృష్ణుడు శకటము దన్నుట

(249) ఆ సమయంబున. (250) నిదురించిన శిశు వాకొని¯ కిదుకుచుఁ జనుఁ గోరి కెరలి కిసలయ విలస¯ న్మృదు చక్రచాపరేఖా¯ స్పద పదమునఁ దన్నె నొక్క బండిన్ దండిన్. (251) శకటము హరి దన్నిన దివి ¯ బ్రకటం బై యెగసి యిరుసు భరమునఁ గండ్లున్¯ వికటంబుగ నేలంబడె¯ నకటా! యని గోపబృంద మాశ్చర్యపడన్. (252) అప్పు డందున్న సరసపదార్థంబులు వ్యర్థంబులై నేలంగూలుటం జూచి యశోదానంద ముఖ్యులైన గోపగోపికాజనంబులు పనులు మఱచి పబ్బంబులు మాని యుబ్బుచెడి వెఱపులు ఘనంబులుగ మనంబులందుఁ గదుర. (253) "మిన్నున కూరక నెగయదు¯ తన్న సమర్థుండు గాఁడు తల్పగతుం డీ¯ చిన్నికుమారుఁడు తేరే¯ విన్ననువున నెగసె దీని విధ మెట్టిదియో." (254) అని వితర్కించు సమయంబున (255) "బాలకుఁ డాకొని యేడ్చుచు¯ గా లెత్తినఁ దాఁకి యెగసెఁ గాని శకట మే¯ మూలమున నెగయ"దని య¯ బ్బాలుని కడ నాడుచుండి పలికిరి శిశువుల్. (256) ఇట్లు శిశువులు పలికిన పలుకులు విని. (257) "బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడం¯ గాలం దన్నుట యెక్క? డేల పడుచుల్ గల్లాడి? రీ జడ్డు ప¯ ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక" యం¯ చాలాపించుచుఁ బ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్. (258) అప్పుడా బాలుని రోదనంబు విని యశోద పఱతెంచి. (259) "అలసితివి గదన్న! యాకొంటివి గదన్న! ¯ మంచి యన్న! యేడ్పు మాను మన్న! ¯ చన్నుఁగుడువు మన్న! సంతసపడు మన్న!"¯ యనుచుఁ జన్నుఁగుడిపె నర్భకునకు. (260) అంత నబ్బాలునిమేన బాలగ్రహంబు సోఁకునుగదా యని శంకించి గోపకు లనేకు లనేక బలి విధానంబులు చేసిరి; బ్రాహ్మణులు దధికుశాక్షతంబుల హోమంబు లాచరించిరి; ఋగ్యజు స్సామ మంత్రంబుల నభిషేచనంబులు చేయించి స్వస్తి పుణ్యాహవాచనంబులు చదివించి కొడుకున కభ్యుదయార్థంబు నందుం డలంకరించిన పాఁడిమొదవుల విద్వజ్జనంబుల కిచ్చి వారల యాశీర్వాదంబులు గైకొని ప్రమోదించె” నని చెప్పి శుకుం డిట్లనియె. (261) "కొడుకు నొకనాడు తొడపై¯ నిడుకొని ముద్దాడి తల్లి యెలమి నివురుచోఁ¯ గడుదొడ్డ కొండ శిఖరము¯ వడువున వ్రేఁ గయ్యె నతఁడు వసుధాధీశా! (262) బరువైన కొడుకు మోవను¯ వెరవిఁడి యిలమీఁదఁ బెట్టి వెఱచి జనని దా¯ "ధరఁ గావఁ బుట్టిన మహా¯ పురుషుఁడు గాఁబోలు" ననుచు బుద్ధిఁ దలంచెన్.