పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 3 : దశమ పూర్వ 1000 - 1102

ఆత్మారాముడై రమించుట

(1000) ఈ పంచబాణాగ్ని నేమిట నార్తుము¯ నీ మంజువాగ్వృష్టి నెగడదేని? ¯ నీ మన్మథాంభోధి నే త్రోవఁ గడతుము¯ నీ దృష్టి నావ యై నిలువదేని? ¯ నీ చిత్తజధ్వాంత మే జాడఁ జెఱుతుము¯ నీ హాసచంద్రిక నిగుడదేని? ¯ నీ దర్పకజ్వర మే భంగి నడఁతుము¯ నీ నవాధరసుధ నింపవేని? (1000.1) నెట్లు నిర్వహింతు? మేలాగు మాలాగు; ¯ కరుణ చేయ వేనిఁ గదియ వేని¯ మరుఁడు నిర్దయుండు మన నిచ్చునే? యశో¯ దా కుమార! యువతి ధైర్య చోర! (1001) అమరులఁ గాచిన హరిక్రియఁ¯ గమలేక్షణ! నీవు నేడు కరుణ నభయహ¯ స్తము మా యురముల శిరములఁ ¯ బ్రమదంబున నిడుము మూర్ఛ పాల్పడకుండన్. (1002) కట్టా తలమునకలునై¯ దట్టపు విరహాగ్ని శిఖలు తరుణుల నేఁపన్¯ నెట్టుం బలుకవు చూడవు¯ కట్టిఁడివి గదా కుమార! కరుణోదారా!" (1003) అని యిట్లు కుసుమశరుని శరపరంపరా పరవశలై యోపికలు లేక పలికిన గోపికల దీనాలాపంబులు విని, నవ్వి యోగీశ్వరేశ్వరుండైన కృష్ణుం డాత్మారాముండై వారలతో రమించె నప్పుడు. (1004) కరుణాలోకములం బటాంచల కచాకర్షంబులన్ మేఖలా¯ కర బాహు స్తన మర్శనంబుల నఖాంకవ్యాప్తులన్, నర్మవా¯ క్పరిరంభంబుల మంజులాధర సుధాపానంబులం గాంతలం¯ గరగించెన్ రతికేళిఁ గృష్ణుడు గృపం గందర్పుఁ బాలార్చుచున్. (1005) మక్కువ వికసిత వదనలు¯ చక్కఁగఁ దనుఁ గొల్వ హాసచంద్రికతోడన్¯ మిక్కి లి మెఱసెను గృష్ణుఁడు¯ చుక్కలగమి నడిమి పూర్ణసోముని భంగిన్. (1006) సతులు దన్నుఁ బాడ సంప్రీతి నాడుచు¯ నఱుత నున్న వైజయంతితోడ¯ వనజలోచనుండు వనభూషణుం డయ్యె¯ యువతిజన శతంబు లోలిఁ గొలువ (1007) చిక్కక యీశుఁడై యెదిరిఁ జిక్కులఁ బెట్టెడు మాయలానికిం¯ జిక్కి కృతార్థలై మరుని చిక్కులఁ జొక్కి లతాంగు లుండగా¯ మక్కువ శాంతి చేయుటకు మన్ననఁ జేసి ప్రసన్నుఁ డౌటకుం¯ జక్కన నా విభుండు గుణశాలి తిరోహితుఁడయ్యె న య్యెడన్. (1008) ఇట్లు హరి కనుమొఱంగి చనినఁ గరిం గానక తిరుగు కరేణువుల పెల్లున నుల్లంబులు దల్లడిల్ల వల్లవకాంతలు తదీయ గమన హాస విలాస వీక్షణ విహార వచన రచనానురాగంబులం జిత్తంబులు గోల్పడి, వివిధ చేష్టలకుం బాల్పడి, తదాత్మకత్వంబున నేన నేన కృష్ణుండ నని కృష్ణాగుణావేశంబులం జరియించుచు.

గోపికలు కృష్ణుని వెదకుట

(1009) భూతముల లోన వెలిఁ బ్ర¯ ఖ్యాతుం డగునట్టివానిఁ; గాంతలు కాళిం¯ దీ తీర వనాంతరముల ¯ భ్రాంతిన్ వెదుకంగఁ జనిరి పాడుచు నధిపా! (1010) "పున్నాగ కానవే! పున్నాగవందితుఁ¯ దిలకంబ! కానవే తిలకనిటలు; ¯ ఘనసార! కానవే ఘనసారశోభితు¯ బంధూక! కానవే బంధుమిత్రు; ¯ మన్మథ! కానవే మన్మథాకారుని¯ వంశంబ! కానవే వంశధరునిఁ; ¯ జందన! కానవే చందనశీతలుఁ¯ గుందంబ! కానవే కుందరదను; (1010.1) నింద్రభూజమ! కానవే యింద్రవిభవుఁ; ¯ గువల వృక్షమ! కానవే కువలయేశుఁ; ¯ బ్రియకపాదప! కానవే ప్రియవిహారు;"¯ ననుచుఁ గృష్ణుని వెదకి ర య్యబ్జముఖులు. (1011) మఱియును. (1012) "నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ¯ జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా¯ జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో! ¯ మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే! (1013) అంగజునైనఁ జూడ హృదయంగముఁడై కరఁగించు వాఁడు శ్రీ¯ రంగదురంబు వాఁడు, మధురంబగు వేణురవంబు వాఁడు మ¯ మ్మంగజుపువ్వుఁదూపులకు నగ్గము చేసె లవంగ! లుంగ నా¯ రంగములార! మీకడకు రాఁడు గదా! కృప యుంచి చూపరే! (1014) మానినీమన్మథు మాధవుఁ గానరే¯ సలలితోదార వత్సకములార! ¯ సలలితోదార వత్సక వైరిఁ గానరే¯ సుందరోన్నత లతార్జునములార! ¯ సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే¯ ఘనతర లసదశోకంబులార! ¯ ఘనతర లసదశోకస్ఫూర్తిఁ గానరే¯ నవ్య రుచిరకాంచనంబులార! (1014.1) నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే¯ గహనపదవిఁ గురవకంబులార! ¯ గహనపదవి గురవక నివాసిఁ గానరే¯ గణికలార! చారుగణికలార! (1015) అదె నందనందనుం డంతర్హితుం డయ్యెఁ¯ బాటలీతరులార! పట్టరమ్మ! ¯ హేలావతులఁ గృష్ణ! యేల పాసితి వని¯ యైలేయ లతలార! యడుగరమ్మ! ¯ వనజాక్షుఁ డిచటికి వచ్చి డాఁగఁడు గదా;¯ చూతమంజరులార! చూడరమ్మ! ¯ మానినీమదనుతో మారాక యెఱిఁగించి¯ మాధవీలతలార! మనుపరమ్మ! (1015.1) జాతిసతులఁ బాయ నీతియె హరి కని¯ జాతులార! దిశలఁ జాటరమ్మ! ¯ కదళులార! పోయి కదలించి శిఖిపింఛ¯ జూటుఁ దెచ్చి కరుణఁ జూపరమ్మ! (1016) హరి చరణములకుఁ బ్రియవై¯ హరి నిను మన్నింప భద్ర మందెడు తులసీ! ¯ హరి నీ దెస రాఁడు గదా¯ హరి చొప్పెఱిఁగించి శుభము లందింపఁగదే. (1017) పొగడఁ దగువానిఁ గానరే పొగడలార! ¯ యీ డెఱుంగని విభుఁ జూపుఁ డీడెలార! ¯ మొల్లమగు కీర్తివాఁ డేడి మొల్లలార! ¯ శుక నిగదితునిఁ జెపుఁడు కింశుకములార! (1018) తరుణీకుచ కుంకుమ యుత¯ హరికంధర దామగంధ మడరెడు చూడ్కిన్¯ హరిఁ గనిన పగిదిఁ దనరెడి¯ హరిణీ! హరిజాడఁ బుణ్యమయ్యెడిఁ జెపుమా! (1019) కిటి యై కౌఁగిటఁ జేర్చెను¯ వటుడై వర్ధిల్లి కొలిచె వడిఁ గృష్ణుండై¯ యిటు పదచిహ్నము లిడెఁ గ్రిం¯ దటి బామున నేమి నోచి తమ్మ ధరిత్రీ!"

గోపికల తాదాన్యతోన్మత్తత

(1020) అనుచు మదనోన్మాదచిత్తలై తదాత్మకత్వకంబునఁ గృష్ణు లీలల ననుకరించుచు. (1021) పూతన యై యొక్క పొలఁతి చరింపంగ¯ శౌరి యై యొక కాంత చన్నుగుడుచు; ¯ బాలుఁడై యొక భామ పాలకు నేడ్చుచో¯ బండి నే నను లేమఁ బాఱఁదన్ను; ¯ సుడిగాలి నని యొక్క సుందరి గొనిపోవ¯ హరి నని వర్తించు నబ్జముఖియు; ¯ బకుఁడ నే నని యొక్క పడఁతి సంరంభింపఁ¯ బద్మాక్షుఁడను కొమ్మ పరిభవించు; (1021.1) నెలమి రామకృష్ణు లింతు లిద్దఱు గాఁగ¯ గోపవత్సగణము కొంద ఱగుదు¯ రసురవైరి ననుచు నబల యొక్కతె చీరుఁ¯ బసుల మనెడి సతుల భరతముఖ్య! (1022) "లోకమెల్లఁ గుక్షిలోపల నున్నది¯ మాధవుండ నేను మాత వీవు¯ చూడు"మనుచు నొక్క సుందరి యొకతెకు¯ ముఖము దెఱచి చూపు ముఖ్యచరిత! (1023) "వెన్నలు దొంగిలి తినియెడి¯ వెన్నుఁడ"నని యొకతె నుడువ వేఱొక్కతె చే¯ సన్నల యశోద నంచునుఁ ¯ గ్రన్ననఁ గుసుమముల దండఁ గట్టు నిలేశా! (1024) "కాళియఫణి యిది వీరలు¯ కాళియఫణి సతులు మ్రొక్కఁ గడఁగిరి నే గో¯ పాలకుమారుఁడ"ననుచును¯ లీలాగతి నాడు నొక్క లేమ నరేంద్రా! (1025) "తరుణులు గోపకు లందఱు¯ హరిహయుఁ డిదె వాన గురిసె హరి నే"నని భా¯ సుర చేలాంచల మొక్కతె¯ గిరి నెత్తెద ననుచు నెత్తుఁ గెంగేల నృపా! (1026) "మీరలు గోపకు లే నసు¯ రారిని దావాగ్ని వచ్చె నటు చూడకుఁడీ¯ వారించెద"నని యొక్కతె¯ చేరి బయల్ కబళనంబు చేయు నరేంద్రా! (1027) ఇట్లు తన్మయత్వంబున గోపసుందరులు బృందావనంబునం గల తరులతాదుల హరి నడుగుచు, దుర్గమం లయిన విపినమార్గంబుల సరోజాత కేతన హల కులిశ కలశాంకుశాది లక్షణలక్షితంబులై మనోహరంబు లయిన హరిచరణంబుల చొప్పుఁగని తప్పక చెప్పి కొనుచుఁ దమలో నిట్లనిరి. (1028) "కొమ్మకుఁ బువ్వులు కోసినాఁ డిక్కడ¯ మొనసి పాదాగ్రంబు మోపినాఁడు¯ సతి నెత్తుకొని వేడ్క జరిగినాఁ డిక్కడఁ¯ దృణములోఁ దోపఁదు తెఱవ జాడ ¯ ప్రియకు ధమ్మిల్లంబు పెట్టినాఁ డిక్కడఁ¯ గూర్చున్న చొప్పిదె కొమరు మిగులు¯ నింతికిఁ గెమ్మోవి యిచ్చినాఁ డిక్కడ¯ వెలఁది నిక్కిన గతి విశదమయ్యె (1028.1) సుదతితోడ నీరు చొచ్చినాఁ డిక్కడఁ¯ జొచ్చి తా వెడలిన చోటు లమరెఁ¯ దరుణిఁ గాముకేళిఁ దనిపినాఁ డిక్కడఁ¯ ననఁగి పెనఁగియున్న యంద మొప్పె. (1029) మఱియును. (1030) ఒక యెలనాగ చెయ్యూఁదినాఁ డిక్కడ¯ సరస నున్నవి నాల్గు చరణములును¯ నొక నీలవేణితో నొదిఁగినాఁ డిక్కడ¯ మగ జాడలో నిదె మగువ జాడ¯ యొక లేమ మ్రొక్కిన నురివినాఁ డిక్కడ¯ రమణి మ్రొక్కిన చొప్పు రమ్యమయ్యె¯ నొక యింతి కెదురుగా నొలసినాఁ డిక్కడ¯ నన్యోన్యముఖములై యంఘ్రు లొప్పె (1030.1) నొకతె వెంటఁ దగుల నుండక యేగినాఁ¯ డడుగుమీఁదఁ దరుణి యడుగు లమరె¯ నబల లిరుగెలంకులందు రాఁ దిరిగినాఁ¯ డాఱు పదము లున్నవమ్మ! యిచట. (1031) ఈ చరణంబులే యిందునిభానన!¯ సనకాది ముని యోగ సరణి నొప్పు; ¯ నీ పాదతలములే యెలనాగ! శ్రుతివధూ¯ సీమంతవీధులఁ జెన్నుమిగులు; ¯ నీ పదాబ్జంబులే యిభకులోత్తమయాన!¯ పాలేటిరాచూలి పట్టుకొమ్మ; ¯ లీ సుందరాంఘ్రులే యిందీవరేక్షణ!¯ ముక్తికాంతా మనోమోహనంబు; (1031.1) లీ యడుగల రజమె యింతి! బ్రహ్మేశాది¯ దివిజవరులు మౌళిదిశలఁ దాల్తు"¯ రనుచుఁ గొంద ఱబల లబ్జాక్షుఁ డేగిన¯ క్రమముఁ గనియు నతనిఁ గానరైరి. (1032) అప్పుడు. (1033) పతుల దైన్యంబును భామల క్రౌర్యంబుఁ¯ జూపుచు విభుఁ డొక్క సుదతితోడ¯ విహరింప నది యెల్ల వెలఁదుల వర్జించి¯ "నా యొద్దనున్నాఁడు నాథుఁ"డనుచు¯ గర్వించి రాఁ జాలఁ "గమలాక్ష! మూఁపున¯ నిడుకొను"మనుఁడు న య్యీశ్వరుండు¯ మొఱఁగి పోయినఁ దాపమును బొంది "యో! కృష్ణ!¯ యెక్కడఁ జనితి ప్రాణేశ! రమణ! (1033.1) నీకు వరవుడ నయ్యెద నిలువు"మనుచు¯ వగవఁ గొందఱు కాంతలా వనితఁ జూచి¯ "వరుఁడు మన్నింప గర్వించి వనజనేత్ర¯ చిక్కె నేఁ"డని వెఱఁగును జెంది రపుడు. (1034) మఱియును. (1035) "ఈ పొదరింటిలో నిందాఁకఁ గృష్ణుండు¯ నాతోడ మన్మథనటన మాడె¯ నియ్యోల మగుచోట నిందాఁకఁ జెలువుండు¯ గాఢంబుగా నన్నుఁ గౌఁగలించె¯ నీ మహీజము నీడ నిందాఁక సుభగుండు¯ చిట్టంటు చేతల సిగ్గుగొనియె¯ నీ పుష్పలత పొంత నిందాఁక దయితుండు¯ నను డాసి యధరపానంబు చేసె (1035.1) నీ ప్రసూనవేది నిందాఁక రమణుండు¯ కుసుమ దామములను గొప్పుఁ దీర్చె"¯ ననుచుఁ గొంద ఱతివ లంభోజనయనుని¯ పూర్వలీలఁ దలఁచి పొగడి రధిప! (1036) అని యిబ్బంగి లతాంగు లందఱును బృందారణ్య మం దీశ్వరున్¯ వనజాక్షుం బరికించి కానక విభున్ వర్ణించుచుం బాడుచున్¯ మనముల్ మాటలుఁ జేష్ఠలుం గ్రియలు న మ్మానాథుపైఁ జేర్చి వే¯ చని ర య్యామున సైకతాగ్రమునకున్ సంత్యక్త గేహేచ్ఛలై. (1037) చని గోపికలు హరి నుద్దేశించి యిట్లనిరి.

గోపికల విరహపు మొరలు

(1038) "నీవు జనించిన కతమున¯ నో! వల్లభ! లక్ష్మి మంద నొప్పె నధికమై¯ నీ వెంటనె ప్రాణము లిడి¯ నీ వా రరసెదరు చూపు నీ రూపంబున్. (1039) శారదకమలోదరరుచి¯ చోరకమగు చూపువలన సుందర! మమ్ముం¯ గోరి వెల యీని దాసుల¯ ధీరత నొప్పించు టిది వధించుట గాదే? (1040) విషజలంబువలన విషధరదానవు¯ వలన ఱాలవానవలన వహ్ని¯ వలన నున్నవానివలనను రక్షించి¯ కుసుమశరునిబారిఁ గూల్పఁ దగునె? (1041) నీవు యశోదబిడ్డడవె? నీరజనేత్ర! సమస్తజంతు చే¯ తో విదితాత్మ; వీశుఁడవు; తొల్లి విరించి దలంచి లోక ర¯ క్షావిధ మాచరింపు మని సన్నుతి చేయఁగ సత్కులంబునన్¯ భూవలయంబుఁ గావ నిటు పుట్టితి గాదె మనోహరాకృతిన్. (1042) చరణసేవకులకు సంసార భయమును¯ బాఁపి శ్రీకరంబు పట్టు గలిగి¯ కామదాయి యైన కరసరోజంబు మా¯ మస్తకముల నునిచి మనుపు మీశ! (1043) గోవుల వెంటఁ ద్రిమ్మరుచుఁ గొల్చినవారల పాపసంఘముల్¯ ద్రోవఁగఁజాలి శ్రీఁ దనరి దుష్ట భుజంగఫణా లతాగ్ర సం¯ భావితమైన నీ చరణపద్మము చన్నులమీఁద మోపి త¯ ద్భావజ పుష్పభల్ల భవబాధ హరింపు వరింపు మాధవా! (1044) బుధరంజనియును సూక్తయు¯ మధురయు నగు నీదు వాణి మరఁగించెను నీ¯ యధరామృత సంసేవన¯ విధి నంగజతాప మెల్ల విడిపింపఁ గదే. (1045) మగువల యెడ నీ క్రౌర్యము¯ తగునే? నిజభక్తభీతిదమనుఁడ వకటా! ¯ తగదు భవద్దాసులకును¯ నగు మొగముం జూపి కావు నళినదళాక్షా! (1046) ఘనలక్ష్మీ యుతమై మహా శుభదమై కామాది విధ్వంసియై¯ సనకాది స్తుతమై నిరంతర తప స్సంతప్తపున్నాగ జీ¯ వనమై యొప్పెడు నీ కథామృతము ద్రావం గల్గునే భూరి దా¯ న నిరూఢత్వము లేనివారలకు మానారీమనోహారకా! (1047) నీ నగవులు నీ చూడ్కులు¯ నీ నానావిహరణములు నీ ధ్యానంబుల్¯ నీ నర్మాలాపంబులు¯ మానసముల నాటి నేడు మగుడవు కృష్ణా! (1048) ఘోషభూమి వెడలి గోవుల మేపంగ¯ నీరజాభమైన నీ పదములు¯ కసవు శిలలు దాఁకి కడునొచ్చునో యని¯ కలఁగు మా మనములు కమలనయన! (1049) మాపటివేళ నీవు వనమధ్యము వెల్వడి వచ్చి గోష్పద¯ ప్రాపిత ధూళిధూసరిత భాసిత కుంతలమై సరోరుహో¯ ద్ధీపిత మైన నీ మొగము ధీరజనోత్తమ! మాకు వేడ్కతోఁ¯ జూపి మనంబులన్ మరునిఁ జూపుదు గాదె క్రమక్రమంబునన్. (1050) భక్తకామదంబు బ్రహ్మ సేవిత మిలా¯ మండనంబు దుఃఖమర్దనంబు¯ భద్రకరమునైన భవదంఘ్రియుగము మా¯ యురములందు రమణ! యునుపఁదగదె? (1051) సురతవర్ధనంబు శోకాపహరణంబు ¯ స్వనిత వంశనాళ సంగతంబు¯ నన్యరాగజయము నైన నీ మధురాధ¯ రామృతమునఁ దాప మార్పు మీశ! (1052) నీవడవిం బగల్ దిరుగ నీ కుటిలాలకలాలితాస్య మి¯ చ్ఛావిధిఁ జూడకున్న నిమిషంబులు మాకు యుగంబులై చనుం¯ గావున రాత్రు లైన నినుఁ గన్నుల నెప్పుడుఁ జూడకుండ ల¯ క్ష్మీవర! ఱెప్ప లడ్డముగఁ జేసె నిదేల? విధాత క్రూరుఁడై (1053) అక్కట! బంధులున్ మగలు నన్నలుఁ దమ్ములుఁ బుత్రకాదులున్¯ నెక్కొని రాత్రిఁ బోకుఁడన నీ మృదుగీతరవంబు వీనులన్¯ వెక్కసమైన వచ్చితిమి వేగమె మోహము నొంది నాథ! నీ¯ వెక్కడ బోయితో? యెఱుఁగ మీ క్రియ నిర్దయుఁ డెందుఁ గల్గునే? (1054) మదనుఁ డార్వంగ నీ వాడు మంతనములు¯ నవరసాలోకనంబగు నగుమొగంబు¯ కమల కిరవైన మహితవక్షస్థలంబు¯ మా మనంబుల లోఁగొని మరపెఁ గృష్ణ! (1055) అరవిందంబులకంటెఁ గోమలములై యందంబులై యున్న నీ¯ చరణంబుల్ కఠినంబులై మొనయు మా చన్నుంగవల్ మోవఁగా¯ నెఱియంబోలు నటంచుఁ బొక్కుదుము నీ యీ కర్కశారణ్య భూ¯ పరిసంచారము కృష్ణ! నీ ప్రియలకుం బ్రాణవ్యధం జేయదే? (1056) కట్టా! మన్మథు కోలలు¯ నెట్టన నో నాఁట బెగడి నీ పాదంబుల్¯ పట్టికొనఁగ వచ్చిన మము ¯ నట్టడవిని డించి పోవ న్యాయమె? కృష్ణా! (1057) హృదయేశ్వర! మా హృదయము¯ మృదుతరముగఁ జేసి తొల్లి మిక్కిలి కడ నీ¯ హృదయము కఠినము చేసెను¯ మదీయ సౌభాగ్య మిట్టి మందము గలదే? (1058) క్రమ్మి నిశాచరుల్ సురనికాయములన్ వడిఁదాఁకి వీఁక వా¯ లమ్ముల తెట్టెలన్ పఱవ నడ్డము వచ్చి జయింతు వండ్రు నిన్¯ నమ్మిన ముగ్ధలన్ రహితనాథల నక్కట! నేఁడు రెండు మూఁ¯ డమ్ముల యేటుకాఁ డెగువ నడ్డము రాఁ దగదే కృపానిధీ! (1059) తియ్యవిలుకాఁడు డీకొని ¯ వ్రయ్యలుగాఁ దూఱనేసె వనితల మనముల్¯ నియ్యాన యింక నైనం¯ గుయ్యాలింపం గదయ్య! గోవింద! హరీ!"

గోపికలకు ప్రత్యక్షమగుట

(1060) అని యిట్లంగన లంచితస్వరముతో నంకించుచుం బాడుచుం¯ దను "రావే"యని చీరి యేడువ జగత్రాణుండు త్రైలోక్య మో¯ హనుఁడై మన్మథ మన్మథుం డయి మనోజ్ఞాకారియై హారియై ¯ ఘనపీతాంబరధారియై పొడమెఁ దత్కాంతాసమీపంబునన్. (1061) వచ్చిన వల్లభుఁ గనుగొని¯ విచ్చేసె నటంచు సతులు వికసిత ముఖులై¯ యచ్చుగ నిల్చిరి ప్రాణము¯ వచ్చిన నిలుచుండు నవయవంబుల భంగిన్. (1062) అతివ యొక్కతె భక్తి నంజలి గావించి¯ ప్రాణేశు కెంగేలుఁ బట్టుకొనియె¯ నింతి యొక్కతె జీవితేశ్వరు బాహువు¯ మూపున నిడుకొని ముదము నొందె¯ వనిత యొక్కతె తన వల్లభు తాంబూల¯ చర్విత మాత్మ హస్తమునఁ దాల్చెఁ¯ బడతి యొక్కతె ప్రియుపదములు విరహాగ్ని¯ తప్తకుచంబులఁ దాఁపుకొనియె (1062.1) భామ యొకతె భ్రుకుటిబంధంబు గావించి ¯ ప్రణయభంగ రోషభాషణమున¯ దష్టదశన యగుచు దండించు కైవడి¯ వాఁడి చూడ్కిగముల వరునిఁ జూచె. (1063) హరిముఖకమలముఁ జూచుచుఁ¯ దరుణి యొకతె ఱెప్పలిడక తనియక యుండెన్¯ హరిపదకమలముఁ జూచుచు¯ మరిగి తనివి లేని సుజను మాడ్కి నరేంద్రా! (1064) ఒక్క లతాంగి మాధవుని యుజ్జ్వలరూపము చూడ్కితీఁగలం¯ జిక్కఁగఁ బట్టి హృద్గతముఁ జేసి వెలిం జనకుండ నేత్రముల్¯ గ్రక్కున మూసి మేనఁ బులకంబులు క్రమ్మఁగఁ గౌగలించుచుం ¯ జొక్కములైన లోచవులఁ జొక్కుచు నుండెను యోగి కైవడిన్. (1065) "ఎలయించి ప్రాణేశ! యెందుఁ బోయితి" వని¯ తోరంపుటలుకతో దూఱె నొకతె¯ "జలజాక్ష! ననుఁబాసి చనఁగ నీ పాదంబు¯ లెట్లాడె"నని వగ నెయిదె నొకతె; ¯ "నాథ! నీ వరిగిన నా ప్రాణ మున్నది¯ కూర్మియే యిది" యని కుందె నొకతె¯ "యీశ్వర! నను నిన్ను నిందాఁకఁ బాపెనే¯ పాపపు విధి" యని పలికె నొకతె (1065.1) "తలఁగి పోవు నట్టి తప్పేమి సేసితి¯ నధిప! పలుకు ధర్మ" మనియె నొకతె¯ "యేమినోము ఫలమొ హృదయేశ! నీ మోము¯ మరలఁ గంటి" ననుచు మసలె నొకతె. (1066) "పలికిన ప్రతిజ్ఞఁ దప్పెడిఁ¯ బలికించినఁ గాని రమణుఁ బలుక"నటంచుం¯ గలకంఠి యొకతె చెలితోఁ¯ బలుకుల నమృతములు గురియు పలుకులఁ బలికెన్. (1067) "పట్టినఁ గాని మనోవిభుఁ¯ బట్టఁ గదా?"యంచుఁ నొక్క బాలిక సఖి చే¯ పట్టుకొని చెప్పె ధైర్యము¯ పట్టెల్లను మరునిటెంకి పట్టుగ నధిపా! (1068) "చెలువుఁడు చెప్పకపోయిన"¯ సొలపున నొక ముగ్ధ "మున్ను చూడ"ననుచు నౌ¯ దల వంచి యుండఁ జాలక¯ దల యెత్తెను లోన మరుఁడు దలయెత్త నృపా! (1069) ఇవ్విధంబున. (1070) హరిసురుచిర లలితాకృతిఁ¯ దరుణులు గని ముక్త విరహతాప జ్వరలై¯ పరమోత్సవంబు సలిపిరి¯ పరమేశ్వరుఁ గనిన ముక్తబంధుల భంగిన్. (1071) అంత న క్కాంతుండు కాంతాజనపరిక్రాంతుండై వనాంతరంబున శక్తినికర సంయుక్తుండైన పరమపురుషుడునుంబోలె వారలం దోడ్కొని మందార కుంద కుసుమపరిమళ మిళిత పవమానమానిత మధుకరనికర ఝంకార సుకుమారంబును, శరత్కాల చంద్రకిరణ సందోహ సందళితాంధకారంబును యమునాతరంగ సంగత కోమల వాలుకాస్ఫారంబునై యమలినంబైన పులినంబు ప్రవేశించె; వారును జ్ఞానకాండంబున నీశ్వరుంగని శ్రుతులు ప్రమోదంబునం గామానుబంధంబుల విడిచిన విధంబున హరిం గని విరహవేదనల విడిచి పరిపూర్ణమనోరథలై. (1072) పాఠీననయన లెల్ల న¯ కాఠిన్య పటాంచలములఁ గౌతుకములు హృ¯ త్పీఠముల సందడింపఁగఁ¯ బీఠముఁ గల్పించి రంతఁ బ్రియునకు నధిపా! (1073) పరమయోగి హృదయ భద్రపీఠంబుల¯ నుండు మేటి వ్రజవధూత్తరీయ¯ పీఠమున వసించి పెంపారెఁ ద్రిభువన¯ దేవి లక్ష్మి మేనఁ దేజరిల్ల (1074) మదనోద్దీపితుఁడైన నాథునికి సన్మానంబు గావించుచున్¯ ముదితల్ హాసవిలోకవిభ్రమములన్ మోదించుచుం జేరి త¯ త్పదముల్ హస్తతలంబులం బిసుకుచుం బైముట్టుచున్ దూఱుచుం¯ జదురుల్ పల్కుచుఁ గూర్మి నిట్లనిరి యీషత్కోపదీప్తాస్యలై. (1075) "కొలచినఁ గొలుతురు కొందఱు¯ గొలుతురుఁ దముఁ గొలువకున్నఁ గొందఱు పతులం¯ గొలిచినను గొలువకున్నను¯ గొలువరు మఱికొంద ఱెలమి గోపకుమారా!"

గోపికలతో సంభాషించుట

(1076) అని తన్ను నుద్దేశించి రహస్యంబుగాఁ బల్కిన సుందరుల పలుకులు విని గోపాలసుందరుం డిట్లనియె. (1077) "కొలిచినఁ గొలుతురు కొందఱు పశువుల¯ భజనము భంగిని ఫలము కొఱకు¯ నై; సఖ్యధర్మములందు సిద్ధింపవు¯ కొందఱు తండ్రుల గుణముఁ దాల్చి¯ దయ గలవారును దగిన సుహృత్తులు¯ గొలువని వారలఁ గొల్తు రెపుడు¯ ధర్మకామంబులు తనరంగఁ గొందఱు¯ కొలువని వారినిఁ గొలుచువారిఁ (1077.1) గొలుచు తలఁపులేమిఁ గొలువ రాత్మారాము¯ లాప్తకాము లజ్ఞు లతికఠినులు¯ వారి యందుఁ బిదపవానిఁగాఁ జింతించి¯ యే లతాంగులార! యిట్టు లనుట. (1078) ఏనిం దెవ్వఁడ నైనం¯ గా నంగనలార! పరమకారుణికుండన్¯ మానసబంధుఁడ నిత్య¯ ధ్యానము మీ కొనరవలసి తలఁగితిఁ జుండీ. (1079) నను సేవించుచునున్నవారలకు నే నా రూపముం జూపఁ జూ¯ చినఁ జాలించి మదించి వారు మది నన్ సేవింపరో యంచు ని¯ ర్ధనికుం డాత్మధనంబు చెడ్డ నెపుడుం దత్పారవశ్యంబుఁ దా¯ ల్చిన భంగిన్ ననుఁ బాసి మత్ప్రియుఁడు దాఁ జింతించు నా రూపమున్ (1080) తగవు ధర్మముఁ జూడనొల్లక దల్లిదండ్రుల బంధులన్¯ మగల బిడ్డలఁ బాసి వచ్చిన మన్నిషక్తల మిమ్ము నేఁ¯ దగదు; పాసితిఁ దప్పు సైపుఁడు; తద్వియోగభరంబునన్¯ వగలఁ బొందుచు మీర లాడిన వాక్యముల్ వినుచుండితిన్. (1081) పాయని గేహశృంఖలలఁ బాసి నిరంతర మత్పరత్వముం¯ జేయుచు నున్న మీకుఁ బ్రతిజేయ యుగంబుల నైన నేర; నన్¯ బాయక కొల్చు మానసము ప్రత్యుపకారముగాఁ దలంచి నా¯ పాయుటఁ దప్పుగాఁ గొనక భామినులార! కృపన్ శమింపరే!" (1082) చక్కఁగ హరి యిటు పలికిన¯ చక్కని వాక్యముల నతని సంగమమున లో¯ నిక్కిన వియోగతాపము¯ లొక్కట విడిచిరి లతాంగు లుర్వీనాథా!

రాసక్రీడా వర్ణనము

(1083) ఆ సమయంబునన్ విభుఁ డనంతుఁడు కృష్ణుఁడు చిత్రమూర్తి యై¯ చేసెను మండలభ్రమణశీల పరస్పరబద్ధబాహు కాం¯ తా సువిలాసమున్ బహువిధస్ఫురితానన హస్త పాద వి¯ న్యాసము రాసముం గృతవియచ్చరనేత్ర మనోవికాసమున్. (1084) ఇట్లు బహుగతులం దిరుగ నేర్పరి యగు హరి దర్పించి తన యిరుకెలంకుల నలంకృతలై కళంకరహితచంద్రవదన లిద్దఱు ముద్దియ లుద్దిగొని వీణ లందుకొని వీణలం బ్రవీణలై, సొంపుమెఱసి యింపుగ వాయించుచు నానందలహరీ నిధానంబగు గానంబు చేయ; నవిరళంబై తరళంబుగాని వేడుక సరళంబగు మురళంబు లీలంగేల నందుకొని, మధురంబగు నధరంబునం గదియించి మించి కామినీజన కబరికా సౌగంధిక గంధ బంధుర కరాంగుళీ కిసలయంబులు యతిలయంబులం గూడి వివరంబుగ మురళీవివరంబుల సారించి పూరించుచు; సరిలేని భంగిం ద్రిభంగి యై కమల కర్ణికాకారంబున నడుమ నిలిచి;, మఱియు గోపసుందరు లెంద ఱందఱకు నందఱయి సుందరుల కవలియెడలం దానును దన కవలియెడల సుందరులును దేజరిల్ల; నృత్యవిద్యా మహార్ణవ వేలావలయ వలయితంబై, విస్మితాఖండలంబైన రాసమండలంబుఁ గల్పించి; వేల్పులు హర్షంబునం గుసుమవర్షంబులు గురియ; నందుఁ బ్రసూనమంజరీ సహచరంబు లైన చంచరీకంబుల మించుఁ బ్రకటించుచు; సువర్ణమణి మధ్యగంబు లైన మహేంద్రనీలంబుల తెఱంగు నెఱపుచుఁ; గరణీవిహారబంధురంబులైన సింధురంబుల చెలువుఁ గైకొలుపుచుఁ; బల్లవిత కుసుమిత లతానుకూలంబులైన తమాలంబుల సొబగు నిగుడించుచు; మెఱుపుతీఁగల నెడ నెడం బెడం గడరు నల్లమొగిళ్ళపెల్లు చూపుచుఁ; దరంగిణీ సంగతంబు లైన రోహణాచల శృంగంబుల బాగు లాగించుచు; జగన్మోహనుండై యుండి; రక్తకమలారుణంబులునుఁ, జంద్రశకల నిర్మల నఖర సంస్ఫురణంబులును, శ్రుతినితంబినీ సీమంత వీధికాలంకరణంబులును, సనక సనందనాది యోగీంద్ర మానసాభరణంబులును నైన చరణంబులు గదియనిడి; సమస్థితి నంజలి పుటంబులం బుష్పంబు లుల్లసిల్లఁ జల్లి; సల్లలిత కమలప్రశస్తంబు లైన హస్తంబులు వల్లవీజనుల కంఠంబులపై నిడి; తాను గీతానుసారంబగు విచిత్ర పాదసంచారంబులు సలుపుచు; వర్తులాకార రాసబంధంబుల నర్తనంబునంబ్రవర్తించి; వెండియు వ్రేతలుం దానును శంఖ పద్మ వజ్ర కందుక చతుర్ముఖ చక్రవాళ చతుర్భద్ర సౌభద్ర నాగ నంద్యావర్త కుండలీకరణ ఖురళీ ప్రముఖంబులైన విశేష రాసబంధంబులకుం జొక్కి; యేకపాద సమపాద వినివర్తిత గతాగత వలిత వైశాఖ మండల త్రిభంగి ప్రముఖంబులైన తానకంబుల నిలుచుచుఁ; గనకకింకిణీ మంజుల మంజీర శింజనంబులు జగజ్జనకర్ణ రంజనంబులై చెలంగ, ఘట్టిత మర్దిత పార్శ్వగ ప్రముఖంబులైన పాదకర్మభేదంబులు చేయుచు; సమపాద శకటవదన మతల్లి శుక్తి ప్రముఖంబులైన పార్థివచారి విశేషంబులును. నపక్రాంత డోలాపాదసూచీ ప్రముఖంబులైన వ్యోమచారి విశేషంబులం జూపుచు; సురేంద్రశాఖి శాఖామనోహరంబులు, నపహసిత దిక్కరీంద్రకరంబులునుఁ ద్రిలోక క్షేమకరంబులును నగు కరంబులం దిరంబులగు రత్నకటకంబుల మెఱుంగులు నింగి చెఱంగులం దఱచుకొన నర్ధచంద్ర కర్తరీముఖ కపిత్థ కటకాముఖ శుకతుండ లాంగూల పద్మకోశ పతాక ప్రముఖంబులైన స్వస్వభావసూచక నానావిధ కరభావంబు లాచరించుచుఁ’ గటినిబద్ధ సువర్ణవర్ణ చేలాంచల ప్రభానికరంబులు సుకరంబులై దిశాంగనా ముఖంబులకు హరిద్రాలేపన ముద్రాలంకారంబు లొసంగుచు; నాస్కందిత భ్రమర శకటాసన ప్రముఖంబు లైన జానుమండల భేదంబులు, నలాత దండలాత లలిత విచిత్ర ప్రముఖంబులైన దైవమండలంబు లొనర్చుచుఁ; గమనీయ కంబుకంఠాభిరామంబులు, నుద్దామ తేజస్తోమంబులును నైన నీల మౌక్తిక వజ్ర వైఢూర్య దామంబుల రుచు లిందిరాసుందరీ మందిరంబులై సుందరంబులయిన యురంబులం దిరుగుడుపడి కలయంబడ నంగాంతర వాహ్యలకు ఛత్ర ప్రముఖంబులైన భ్రమణ విశేషంబుల విలసించుచు; నిద్దంబులగు చెక్కుటద్దంబుల నుద్దవిడిఁ దద్దయుం బ్రభాజిత చంద్రమండలంబు లగు కుండలంబుల మెఱుంగు మొత్తంబులు నృత్యంబు లొనరింపఁ, గటిభ్రాంత దండరచిత లలాట తిలక మయూర లలిత చక్రమండల నికుంచిత గంగావతరణ ప్రముఖంబులైన కరణంబు లెఱింగించుచు; వెలిదమ్మి విరుల సిరుల చెన్నుమిగులు కన్నులవలని దీనజనదైన్య కర్కశంబులై తనరు కటాక్షదర్శన జాలంబులు జాలంబులై కామినీజన నయనమీనంబుల నావరింప, లలితకుంచిత వికాస ముకుళ ప్రముఖంబు లైన చూడ్కులం దేజరిల్లుచు; ననేక పరిపూర్ణచంద్రసౌభాగ్య సదనంబులగు వదనంబులఁ బ్రసన్నరాగంబులు బ్రకటించుచు; నుదంచిత పింఛమాలికా మయూఖంబు లకాల శక్రచాపంబుల సొంపు సంపాదింప, నికుంచి తాకుంచిత కంపి తాకంపిత పరివాహిత పరావృత్త ప్రముఖంబులైన శిరోభావంబులు నెఱపుచు; మృగనాభి తిలకంబులుగల నిటలఫలకంబులఁ జికుంరబుల నికరంబులు గప్ప, నపరాజిత సూచికావిద్ధపరిచ్ఛిన్న విష్కంభ రేచిత ప్రముఖంబులగు నంగహారంబుల విలసిల్లు చరణ కటి కర కంఠ రేచకంబు లాచరించుచు; నొప్పెడు నప్పు డా రాసంబు సంజనిత సకల జన మానసోల్లాసకరంబై; సుధార్ణవంబునుం బోలె నుజ్జ్వలరసాభిరామంబై; రామరాజ్యంబునుంబోలె రాగపరిపూర్ణంబై; పూర్ణచంద్రమండలంబునుం బోలెఁ గువలయానందంబై; నందనవనంబునుంబోలె భ్రమరవిరాజమానంబై; మానధనుని చిత్తంబునుంబోలెఁ బ్రధానవృత్తి సమర్థంబై; సమర్థకవివిలసనంబునుంబోలె బహుప్రబంధభాసురంబై; సురలోకంబునుంబోలె వసుదేవనందన విశిష్టంబై; శిష్టచరితంబునుంబోలె ధరణీగగనమండలసుందరంబై; సుందరీరత్నంబునుంబోలె నంగహార మనోహరంబై; హరవధూనిలయంబునుంబోలె ననేకచారి సుకుమారంబై; సుకుమార వృత్తంబునుంబోలె నుద్దీపితవంశంబై, యుండె; నందు. (1085) నడుములు వీగియాడఁ, జిఱునవ్వులు నివ్వటిలంగ, హారముల్¯ సుడివడ, మేఖలల్ వదలఁ, జూడ్కిమెఱుంగులు పర్వ, ఘర్మముల్¯ పొడమఁ, గురుల్ చలింప, శ్రుతిభూషణముల్ మెఱయన్, సకృష్ణలై¯ పడతుక లాడుచుం జెలఁగి పాడిరి మేఘతటిల్లతాప్రభన్. (1086) అంకరహితేందు వదనలు¯ పంకజలోచనునిఁ గూడి పరఁగ నటింపం¯ గింకిణుల నూపురంబుల¯ కంకణముల మ్రోఁత లెసఁగెఁ గర్ణోత్సవమై. (1087) హరిణీనయనలతోడను¯ హరి రాసక్రీడ చేయ నంబరవీధిన్¯ సురనాథులు భార్యలతో¯ సొరిది విమానంబు లెక్కి చూచి రిలేశా! (1088) కురిసెం బువ్వుల వానలు¯ మొరసెన్ దుందుభులు మింట ముదితలుఁ దారున్¯ సరసన్ గంధర్వపతుల్¯ వరుసన్ హరిఁ బాడి రపుడు వసుధాధీశా! (1089) రామలతోడను రాసము¯ రామానుజుఁ డాడఁ జూచి రాగిల్లి మనో¯ రాములమీఁద వియచ్చర¯ రామలు మూర్ఛిల్లిపడిరి రామవినోదా! (1090) తారాధిపనిభవదనలు¯ తారాధిపవంశుఁ గూడి తారు నటింపం¯ దారలుతోడ సుధాంశుఁడుఁ¯ దారును వీక్షింప రేయి దడవుగ జరిగెన్. (1091) యమునా కంకణ చారియై వనజ పుష్పామోద సంచారియై¯ రమణీఘర్మ నివారియై మదవతీ రాసశ్రమోత్తారియై¯ ప్రమదామానస నవ్యభవ్యసుఖ సంపత్కారియై చేరి యా¯ కమలాక్షుం డలరంగ గాలి విసరెం గల్యాణభావంబునన్. (1092) అప్పుడు.

గోపికలవద్ద పాడుట

(1093) ప్రమద యొకర్తు మాధవుఁడు పాడ విపంచి ధరించి కేల సం¯ భ్రమమునఁ దంత్రి మీటుచుఁ దిరంబుగ ఠాయముచేసి యొక్క రా¯ గముఁ దగ నాలపించి సుభగస్వరజాతులు వేఱువేఱు కా¯ నమరఁగఁ బాడెఁ దన్ రమణుఁ డౌనన దారువు లంకురింపఁగన్. (1094) ఆడుచుఁ బాడుచు నందొక¯ చేడియ మంజీర మంజు శింజిత మమరం¯ గూడి హరికరము చనుగవ¯ పై డాయఁగఁ దిగిచె జఘనభారాలసయై. (1095) చందనలిప్తంబై యర¯ విందామోదమున నొప్పు విపులభుజము గో¯ విందుఁ డొక తరుణి మూపుఁనఁ¯ బొందించిన నది దెమల్చి పులకించె నృపా! (1096) చెలువ యొక్కతె చెక్కుఁ జెక్కుతో మోపిన¯ విభుఁడు తాంబూలచర్వితముఁ బెట్టె¯ నాడుచు నొక లేమ యలసినఁ బ్రాణేశుఁ¯ డున్నత దోస్తంభ మూఁతఁ జేసెఁ¯ జెమరించి యొకభామ చేరినఁ గడగోరఁ¯ జతురుఁడు గుచఘర్మజలముఁ బాపె¯ నలకంబు లొక యింతి కళిక చిత్రకరేఖ¯ నంటినఁ బ్రియుఁడు పాయంగ దువ్వెఁ (1096.1) బడతి యొకతె పాటపాడి డస్సిన యధ¯ రామృతమున నాథుఁ డాదరించె¯ హార మొక్క సతికి నంసావృతంబైనఁ¯ గాంతుఁ డురముఁ జేర్చి కౌఁగలించె. (1097) హాసంబులఁ గరతల వి¯ న్యాసంబుల దర్శనముల నాలాపములన్¯ రాసశ్రాంతల నా హరి¯ సేసెన్ మన్ననలు కరుణఁ జేసి నరేంద్రా! (1098) హరితనుసంగ సుఖంబునఁ¯ బరవశలై వ్రేత లెల్లఁ బయ్యదలు నిజాం¯ బరములు నెఱుఁగమి చోద్యమె? ¯ సురసతు లీక్షించి కరఁగి చొక్కిరి మింటన్. (1099) ఇట్లు భగవంతుండైన కృష్ణు డాత్మారాముం డయ్యును గోపసతు లెంద ఱందఱకు నందఱై నిజప్రతిబింబంబులతోడం గ్రీడించు బాలు పోలిక రాసకేళి సలిపిన. (1100) తగఁ గూడి యాడి మనముల¯ నగెఁ జూచెం బలికె నందనందనుఁ డనుచున్¯ మగువలు పెద్దఱికముతోఁ¯ బొగడిరి తమ పూర్వజన్మపుణ్యశ్రేణిన్.

గోపికలతో జలక్రీడ లాడుట

(1101) ఇట్లు హరి రాసకేళి చాలించి, కరకాంచితలగు తటిల్లతల చెలువున ఘర్మ సలిలకణాక్రాంత లగు కాంతలంగూడి జలక్రీడా కుతూహలుండై యమునాజలంబుఁ జొర, నందు ముందర సుందరులు జొచ్చి పదప్రమాణంబు, జానుదఘ్నంబు, కటిద్వయసంబు, మధ్యమాత్రంబు, కుచంబులబంటి యని పలుకుచుం గుచ నయన నాభివివర కుంతలంబులు చక్రవాక జలచరావర్త శైవాలంబుల చందంబున నందంబుగ నీడుపొందిన యేఱులని కళిందనందన కరంబులు చాచి పరిరంభంబులకు నారంభించుకైవడి నెదురు చనుదెంచి తాఁకు తరంగంబులకు నులుకుచు, సారసంబులకుం గరంబులు చాఁచుచు మరాళంబులం జోపుచుఁ జెన్నుమిగిలిన చన్నుల యెత్తువత్తు మను నెపంబులఁ దపంబుల నీటఁ గావించు మాడ్కిని సంచరించు చక్రవాకంబులం దోలుచు నితాంతకాంతి సదనంబు లగు వదనంబులకు నోడి వ్రీడంజెంది కంది చందురుఁడు చలమ్ముడిగి జలమ్మునం బడి కంపించు కరణి, నిజకరచలితజలప్రతిఫలితుండై కదలు చంద్రునిం గని మెచ్చి సోలుచు, సలిలావగాహసమయ సముచ్చలిత వారి శీకర పరంపరలవలన మకరందపానమత్త మధుకర పక్షవిక్షేపణ సంజాతవాత సముద్ధూత కుముదాది పరాగపటలంబులం జేరుచు మోముదమ్ముల కమ్మఁదనమ్ములకు మూఁగి, జుమ్మురను తుమ్మెదలకు వెఱచుచుఁ గరంబుల నీ రెగయం జఱచుచు నీలనీరద నిపతిత పయోబిందు సందోహంబులం దడియు పువ్వుదీవియల బాగునఁ గృష్ణు కరద్వయంబునం జిలుకు తోయంబులం దడియుచుఁ గ్రందుకొని సుడియుచు, నసమబాణుని పులుకడిగినకుసుమబాణంబుల పగిది మేనులు మెఱయ సలిలావగాహనపరాయత్త చిత్త లగుచు మొత్తంబులై సరస భాషణంబులం ద్రుళ్ళుచు బాహుల నీరు నించుచు హరిమీఁదం జల్లుచుఁ జల్లునెడం దడఁబడ దాఁటుచు దాఁటి చనక నిలువరించుచు వినోదింప, హరియుం గరేణుకర వికీర్ణ నీరధారాభిషిక్తంబగు శుండాలంబు లీల నాభీరకామినీకర సముజ్ఝిత జలాసారంబులం దోఁగుచు, వ్రజవధూజన హస్తప్రయుక్త కల్హార కైరవ పరాగపటలంబువలన భూతిభూషణసిరి వహించుచు గోపికాజన పాణికిసలయ సమున్ముక్త కమలదళంబుల వలన సహస్రనయనుని రూపుఁ జూపుచు గోపాలబాలికా కుచకలశ కుంకుమ పంకంబువలనఁ బ్రభాతబాలభానుని భంగి భాసిల్లుచు, ఘోషయోషా కటాక్ష విక్షేపణంబులవలన మధుపపరివృత హరిచందన సౌందర్యంబు నొందుచు, వల్లవీహాసరుచుల వలనఁ జంద్రికా ప్రభాభాసిత నీలశైలంబు క్రియ నమరె; నంత.