పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2019 - సింగపూర్ భాగవత జయంతి సంబరాలు

సింగపూర్ భాగవత జయంత్యుత్సవ సంబరాలు – 2019

తేదీ : 31/08/19

సింగపూరీ భాగవత జయంతి -1 సింగపూరీ భాగవత జయంతి -1  సింగపూర్ లో ఆగష్టు 31వ తేదీ శనివారం నాడు, "తెలుగు భాగవత ప్రచార సమితి" మరియు "గణనాలయము" సంస్థల వారు భాగవత జయంత్యుత్సవం 2019 ఎంతో ఆకర్షణీయంగా నిర్వహించాము. సింగపూర్ లో మూడవసారి జరుగుతున్న ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సింగపూర్ వాసులు ఉత్సాహంగా పాల్గొని, ఎంతో ఆనందించారు. కార్యక్రమం Facebgokలో ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన సుమారు 2200 మంది భాగవత బంధువులు, అభిమానులు ఎందరో ప్రపంచం నలుమూలలనుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  సనాతన హిందూ ధర్మానికి తలమానికమైన "శ్రీమద్భాగవత" గ్రంధంలోని భక్తితత్వం ప్రతిఒక్కరికి అన్నికాలాలలోనూ ఆదర్శప్రాయము కావాలనే సంకల్పంతో, మన పోతన తెలుగు భాగవతం మరింత ప్రాచుర్యంలోనికి తెచ్చే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాము.

  పిల్లలలో కూడా భాగవత తత్వం పట్ల ఆసక్తి పెంచేవిధంగా వారికి భాగవత ఇతివృత్తానికి సంబంధించిన పద్యాల / కథల పోటీలను నిర్వహించాము.

  పిల్లలను పెద్దలను అలరించే విధంగా ఉన్న ఈ కార్యక్రమంలో భక్తి పాటలు, పిల్లల పాటలు, కధలు, నృత్యరూపకం అలాగే భాగవతంలోని రుక్మిణీ సందేశమూ మరియు అచ్యుతరత్న భాగవత మాల (సంక్షిప్త భాగవతం) పారాయణం వంటి ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణాష్టమిని సింగపూర్ వాసులు అందరూ కలిసి వైభవోపేతంగా జరుపుకోవడం ఆనందదాయకంగా మైన విషయం. భాగవతం లోని చక్కటి పద్యాలను, కధలను చిన్నారులు చదివి అందరినీ అలరించారు. కార్యక్రమము అనంతరం పాల్గొన్న భక్తులు అందరికీ అన్నప్రసాద వితరణ గావించాము.

  ఈ కార్యక్రమ ముఖ్యఅతిథిగా ప్రముఖ వక్త, ఉపనిషత్తులలో పట్టభద్రుడు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు డీజీపీగా పదవీవిరమణ చేసిన, డా. కరణం అరవిందరావు గారు విచ్చేసి తమ అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. రుక్మిణీ కళ్యాణానికి ఉన్న ప్రాముఖ్యతనే కాక, అందులో ఎంతటి వేదాంత సారాంశం ఉందోకూడా అందరికీ అర్ధమయ్యే రీతిలో తమ ప్రసంగం ద్వారా చక్కటి విశ్లేషణ చేశారు.

  భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ అధ్యక్షులు ఊలపల్లి భాస్కర కిరణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని పలువురు ప్రముఖులు, రత్నకుమార్ గారు, ఇండిక్ అకాడమీ స్థాపకులు హరి కిరణ్ గారు, సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. భరద్వాజ్, లావణ్య, విద్యాధరి భాస్కర కిరణ్, ఉమాదేవి, వేణు మల్లవరపు, సురేష్ చివుకుల, అపర్ణ తదితరులు కూడా పాల్గొన్నారు. వీరందరికీ మనఃపూర్వక ధన్వాదములు.
చక్కటి వేదికను ఇచ్చి ఎంతో ప్రోత్సాహం అందించిన ఆలయం వారికీ, పూజారులకూ; అందంగా వేదిక అలంకరణ, వినుకరులు (మైక్), ఛాయాచిత్రీకరణలు, ప్రత్యక్షప్రసారాలు, సహకారం చేసిన మా మిత్రులు అందరకూ, ఎంతో ఓర్పుగా నేర్పుగా కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్యకర్తలు అందరికీనూ; మరియూ ముఖ్యంగా బహు చక్కని క్రమశిక్షణతో, మిక్కిలి ఉత్సాహంతో పాల్గొనిన సభ్యులు కళాకారులు పిల్లలూ అందరికీ వినయపూర్వక ధన్యవాదములు.
పత్రికా మాధ్యమం వారు ఆంధ్రజ్యోతి, ఈక్షణం వార్తాపత్రికలలో ఈ శుభ వార్తలను ప్రచురించి తగిన ప్రాచుర్యం కల్పించిన ఆత్మీయ పాత్రికేయ మిత్రులకూ; సాంఘిక మాధ్యమంలో ప్రరంచవ్యాప్తంగా అందరికీ అందించుటలో ఎంతో సహాయపడిన ముఖపుస్తకం (Facsbook) వారికీ అనేక ధన్యవాదములు.

>