పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సభలు సమావేశాలు : 2018 పంచమ వార్షికోత్సవాలు

శ్రీరామ

శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతి, శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతి మహాస్వాముల వారి దివ్య ఆశీర్వచనాల బలంతో ఈ విళంబి నామ సంవత్సరంలో నిర్వహింపబడిన, 2018 భాగవత జయంత్యుత్సవములలో భాగంగా వివిధ పోటీలు, కార్యక్రమాలు, సభలు హైదరాబాదు, సింగపూరు మఱియు విరవలలో ఉత్సాహభరితంగా సుసంపన్నంగా జరిగాయి.



హైదరాబాదు:-

⇑⇑. . . 2018-09-02 తారీఖు సాయంకాలం దేవనార్ అంధుల పాఠశాల, బేగంపేట, హైదరాబాదు ప్రాంగణంలో భాగవతులు దేవనార్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ డా. సాయిబాబా గౌడ్; ప్రముఖ నటులు భక్తులు శ్రీ తనికెళ్ళ భరణి; భారతీయ స్టేట్ బేంకు మేనేజరు స్వయంకృషితో దృష్టిలోపాన్ని అధిగమించి విజయం సాధించిన శ్రీ దేవగుప్తాపు సుధాకర్, బికాం, ఎమ్.బిఎ(HCU); భాగవత గణనాధ్యాయిల దివ్య సమక్షంలో, బండి శ్రీనివాస శర్మ వ్యాఖ్యానంతో జయప్రదంగా జరిగినది. సభ దేవనార్ విద్యార్థినులు ప్రార్థనాగీతంతో ఆరంభమైనది, సాంస్కృతిక కార్యక్రమంలో దేవనార్ విద్యార్థులు ప్రహ్లాద నాటిక బహు ప్రతిబావంతంగా ఆహ్లాదభరితంగా ప్రదర్శించారు.

"ఆంధ్ర మహాభాగవతం - మహిళల మహనీయత" అనే అంశంపై 2012లో పిహెచ్.డి పట్టాపొందిన డా. కాకుమాను భూలక్ష్మి, ఎమ్ఎ (సంస్కృతాంధ్రములు), ఎమ్.ఫిల్, పిహెచ్.డి వారికి, శ్రీ తనికెళ్ళ భరణిగారి అమృత హస్తాల మీదుగా భాగవతరత్న పురస్కారం ప్రదానం చేయబడింది. పురస్కార పత్రంతో పాటు, సన్మాన పత్రం, ఆండ్రాయిడ్ టాబ్లెట్టు, చిరు సత్కార ప్రదానం చేయడం జరిగింది. కృష్ణాష్టమి, భాగవత సంస్కృతి పోటీలు 2వ ఆవృత్తి విజేతలు శ్రీ. గుఱ్ఱంగడ్డ రఘువంశి వారికి ప్రథమ బహుమతి; శ్రీమతి ముద్దు లక్ష్మి వారికి ద్వితీయ బహుమతి; మఱియు వి. వెంకట అనంతరాం వారికి తృతీయ బహుమతి ప్రదాన సత్కారాలు చేయడమైనది. తరువాత, శ్రీమతి మంథా భానుమతి వారికి క్రిందటి ఏడాది పాల్గొని అందుకోలేకపోయిన ధృవపత్రం ప్రదానం చేయడం జరిగింది.
ఆహ్వానితులు సాయిబాబాగౌడ్ వారికి, భరణిగారికి, సుధాకర్ గారికి జ్ఞాపిక ప్రదానం ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది. భాగవత బంధువు శ్రీ రాజాచంద్రకు భాగవత ప్రచారంలో అందిస్తున్న విశిష్ఠ కృషికి గుర్తింపుగా జ్ఞాపిక ప్రదానం చిరు సన్మానం చేయడం జరిగింది. ప్రహ్లాద నాటిక దర్శకులు దేవనార్ ఉపాధ్యాయులు మురళి గారికి; కార్యక్రమ నిర్వహణలో విశేష సహకారం అందించిన దేవనార్ సంస్థ వారి తరఫున శ్రీ రామకృష్ణ గారికి, శ్రీమతి పద్మ గారికి సన్మానం చేయడం జరిగింది.

తమ స్పూర్తివంతమైన భాషణలతో భరణిగారు తెలుగుభాగవత, భాగవతుల విశిష్టాదులను వివరించారు, సుధాకర్ గారు "తెలుగుభాగవతం జాలగూడులోని పద్యాలను విషయాలను జాస్ సాఫ్టువేరు సాయంతో కంప్యూటరు ఎలా వినిపిస్తుందో" సోదాహరణంగా వివరించారు. ఈవిధంగా అంతర్జాలంలోని తెలుగు విషయాలను సైతం కంప్యూటరు చదువుతుంటే దృష్టిలోపాన్ని అదిగమిస్తూ అందుకోవచ్చు. ఈ విషయంలో కావలసిన వారికి సహకారం అందిస్తానని తెలిపారు. ఇది ఎంతో ఉపయోగకరమైన వినూత్న విజ్ఞాన ఉపకరణము. పిమ్మట, హేవిళంబినామ సంవత్సరం (2017) భాగవతరత్న పురస్కార గ్రహీత డా. వీపూరి వేంకటేశ్వర్లు, ఎమ్ఎ, పిహెచ్.డి (స్వర్ణపతకం) వారు సంకలనం చేసిన "భాగవతలహరి (పరిశోధనా వ్యాస సంకలనం)" అనే దివ్య పొత్తము, శ్రీ భాగవత గణనాధ్యాయి దంపతుల చేతుల మీదుగా వేదికపై గల శ్రీకృష్ణభగవానుల వారి చరణాల వద్ద ఆవిష్కరింపబడింది. ఇది వివిధ సాహితీ పత్రికల యందు ప్రచురింప బడిన ఇరవై ఒక్క చక్కటి వ్యాసాల సమాహారం. ఈ చిరంజీవి ఇలాంటివి అనేకం తెలుగు సాహితీ జగత్తుకు సమర్పిస్తూ, అనేక ఉన్నతోన్నత శిఖరాలు అధిరోహించేలా మా నల్లనయ్య అనుగ్రహించు గాక అని పెద్దలు ఆశీర్వదించారు.

విచ్చేసి సభను సుసంపన్నం గావించిన ఆహ్వానితులకు, పండితులకు, ప్రముఖులకు, పెద్దలకు, సభికులకు ఎల్లఱకు మఱియు తమ సహాకారం అందించిన సర్వులకు హృదయపూర్వక ధన్యవాదములు సమితి తెలుపుకుంటోంది. ముఖ్యంగా చిరంజీవులు దేవనార్ విద్యార్థులు ప్రదర్శించిన క్రమశిక్షణ, సంయమనం, సహకారం, ప్రతిభలకు ప్రత్యేక అభినందన సమేత శుభాశీస్సులు. ఈ కార్యక్రమంలో భాగవత బంధువులు గణనాధ్యాయి దంపతులు, బండి శ్రీనివాసు దంపతులు, మోపూరు ఉమామహేశ్, రామక సత్యం, ఆదిత్య, చింతా రామకృష్ణ కవి, అన్నపరెడ్డి సత్యన్నారాయణ రెడ్డి మున్నగువారు పాల్గొన్నారు.



సింగపూరు:-

⇑⇑,,,,

ఆంధ్రజ్యోతిలో పడిన ఛాయాచిత్రం

సింగపూర్ సిటీలో, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘‘తెలుగు భాగవత ప్రచార సమితి’’, ‘‘గణనాలయము’’ సంస్థల ఆధ్వర్యంలో సింగపూర్‌లో 2018- సెప్టెంబర్ 2న “భాగవత జయంత్యుత్సవం 2018” ఘనంగా అత్యంత ఆకర్షణీయంగా జరిగింది. పిల్లలలో భాగవత తత్వం పట్ల ఆసక్తి పెంచేవిధంగా వారికి భాగవత ఇతివృత్తానికి సంబంధించిన చిత్రలేఖనము, కథల పోటీలను నిర్వహించారు.

ఛాయాచిత్రాల కోసం క్లిక్ చేయండి

పోటీలలో విజేతలకు ధృవపత్రాలను అందజేసారు. పిల్లలకు పెద్దలకు కూడా అనువైన విధంగా కార్యక్రమం రూపొందడంతో సింగపూర్‌లోని తెలుగు వారందరూ అధిక సంఖ్యలో సకుటుంబంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాద వితరణ గావించారు. భాగవత పారాయణము, భక్తి పాటలు, పిల్లల పాటలు, ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణాష్టమిని సింగపూర్ వాసులు అందరూ కలిసి వైభవోపేతంగా ఆనందదాయకంగా పాల్గొన్నారు. భాగవతంలోని వివిధ పాత్రల వేషధారణలతో చిన్నారులు ప్రత్యేకంగా ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమ ముఖ్యఅతిథిగా ప్రముఖ వక్త ఉపనిషత్తులలో పట్టభద్రుడు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాలకు మాజీ డీజీపీ, డా. కరణం అరవిందరావు విచ్చేసి తమ అమూల్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలను ఆన్‌లైన్‌, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడంవల్ల ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, విద్యాధరి, రవితేజ, రాధిక, లావణ్య, మమత, నమ్రత, భరద్వాజ్, శ్రీధర్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.



విరవ:-

⇑⇑... తెలుగు భాగవతం ఆర్గ్ ప్రాంతీయ శాఖ బాధ్యులు శ్రీ రాజాచంద్ర ఆధ్వర్యంలో విరవ గ్రామంలో గల ప్రాధమిక పాఠశాలలో 2018-09-15 తారీఖున భాగవత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగు భాగవత ప్రచార సమితి కార్యదర్శి శ్రీ బండి శ్రీనివాస శర్మ గారు, తెలుగు భాగవతం యాప్ నిర్మాత ప్రచురణ కర్త శ్రీ ఫణి కిరణ్ గారు మరియు ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భాగవత జయంతి ఉత్సవాలలో భాగంగా పిల్లలకు సింగపూరు శాఖ వారు నిర్వహించిన అంతర్జాల భాగవత పద్యాల పోటీ , బొమ్మల పోటీ విరవలో నిర్వహించి, పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం చేయడమే కాకుండా పోటీలో పాల్గొన్న 128 మంది చిన్నారులకు సర్టిఫికెట్లు ప్రోత్సాహక బహుమతులు అందించారు.

(అ) బొమ్మల పోటీ విజేతలు:
1.వరలక్ష్మి-8వ. తరగతి
2.శ్రీ సాయి తేజ - 6వ. తరగతి
3.విజయ ప్రకాష్ -6వ. తరగతి
4.తనూజ - 7వ. తరగతి

(ఆ) పద్యాల పోటీ విజేతలు :
1. విజయలక్ష్మీ
2. కనకమహాలక్ష్మి
3. ప్రతాప్
4. సాయి శివ వెంకట వీరేంద్ర