పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : తన వెంటన్ సిరి

ఒకసారి పుట్టపర్తి నారాయణాచార్యుల వారు, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న వారణాశి రామమూర్తి గారు పరమాచార్యుల వారి వద్దకు వెళ్లారు. భాగవతానువాదం గురించి ప్రస్తావన వచ్చింది. రామమూర్తి గారు స్వామి వారికి గజేంద్రమోక్షంలోని పోతన పద్యాన్ని వినిపించారు:

తన వెంటన్ సిర్ లచ్చి వెంటనవరోధ వ్రాతమున్ దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ
య్యన వైకుంఠపురంబునం గలుగు వారాబాల గోపాలమున్

దీనిని వినగానే స్వామి వారు ఇదే మోస్తరుగా సంస్కృతములో ఒక అభాణకమున్నదని, అది పోతన గారి కాలానికి పూర్వపుదైతే బహుశా పోతన దానిని చూచి ఉండవచ్చునని చెప్పారు. ఆ అభాణకము తాము వినలేదని, వినిపించవలసిందిగా పుట్టపర్తి వారు పరమాచార్యుల వారిని విన్నవించారు. అప్పుడు స్వామి ఒకటి రెండు నిమిషాలు ఆగి ఆ అభాణకాన్ని వినిపించారు:

లీలాలోలతమాం రమామగణయన్ నీలామనాలోకయన్
ముంచన్ కించమహీం అహీశ్వరమయం ముంచన్ హఠాద్వంచయన్
ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం
శ్రీగోవింద ఉది త్వరత్వర ఉదైత్ గ్రాహగ్రహార్తం గజం

ఈ శ్లోకం ఉన్నట్లు మహామహులైన పండితులకే తెలియదు, స్వామి జ్ఞాన సంపద, ధారణా శక్తి అంత మహత్తరమైనది.

శ్రీగురుభ్యోనమః
(నీలంరాజు వేంకటశేషయ్య గారి నడిచే దేవుడు పుస్తకం నుండి)