పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : పోతన ధ్వని మార్గం

పోతన ధ్వని మార్గము

రామాయణ, భారతేతిహాసములకు వచ్చినంతగా కావ్యప్రశస్తి భాగవతానికి రాలేదు. ఆద్యంతములకు అనుస్యూతమైన కథ లేకపోవడం వల్లా, సృష్టి క్రమమూ, రాజవంశములు, భగవత్స్తుతి మొదలగు వాటి ప్రాధాన్యం వల్లా భాగవతము పురాణంగానే ప్రసిద్ధి - తెలుగు లోనూ, సంస్కృతం లోనూ కూడా.

అయితే భాగవతం లోని అనేక ఉపాఖ్యానాలు వేనికవి స్వతంత్ర కావ్యాలుగా పరిగణించవచ్చు. కావ్యలక్షణా లైన రస ధ్వన్యలంకారాదులన్నీ ప్రధానమైన ఉపాఖ్యానాలలో ఉన్నవి. ఇవి కాక, దశమ స్కంధ మంతా ఒక కావ్యమే. ఆంధ్ర మహా భాగవతం లోని కవితా గుణం మహామహుల చేత విస్తృతంగా వ్యాఖ్యానింపబడింది. ఇక్కడ పోతన ధ్వనిని వేరు వేరు సందర్భాలలో ఎట్లా పోషించినాడన్న స్వల్ప విషయం మాత్రమే పరిశీలించెదము.

సంక్షిప్తంగా, కావ్యాత్మగా కాక, కేవల కావ్యగుణంగా, ధ్వని అంటే లక్ష్య లక్షణార్థాల నధిగమించి, ప్రతీయమానమైన మరొక వృత్తాంతాన్నో, అనుభవాన్నో, భవిష్యత్ ఘటననో తెలియ జెప్పేది. మహాకవులు ఈ ధ్వనిని శ్లేష వల్లనో, వ్యంగ్యార్థం వల్లనో, శబ్ద సంయోజనం వల్లనో, పద్య నిర్మాణ శిల్పం వల్లనో, లేక కేవలం ప్రతీక ల నుపయోగించో సాధించగలరు. విస్తృతార్థంలో రసాలంకారాదులన్నీ ధ్వని విషయములే నన్న వాదం ఉంది.

పోతన కథా విషయికంగానే కాక, స్తుతి స్తోత్రములలో కూడా ధ్వనిని నిక్షిప్తం చేసినాడనవచ్చు. ఒక ప్రసిద్ధ మైన పద్యం - కుంతీ దేవి కృష్ణుని స్తుతించినప్పటిది.

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

ఇందులో శృంగార రత్నాకరా అన్న సంబోధన పోతన స్వతంత్రించి చేసినది - అమూలకము. కృష్ణుడు గోపికాలోలుడు, అష్ట మహిషులు కలవాడు, పదహారు వేల రాజ కన్యలను పరిణయమాడిన వాడు - కనుక శృంగార మునకు సముద్రుని వంటివాడు. ఇది వాచ్యార్థము.

నరుడు అర్జునుడు. నరసఖుడు నారాయణుడు. నరనారాయణులు బదరికావనం లో తపస్సు చేస్తున్నపుడు వారి తపో భంగం కొరకు ఇంద్రుడు అప్సరసల పంపించాడట. అప్పుడు వారు సిగ్గు పడేట్లుగా, నారాయణుడు తన తొడలో నుండి వారికన్నా అందమైన అప్సరసను సృష్టించి ఇంద్రునికి కానుకగా పంపించినాడు. ఊరువులో నుండి వచ్చినది కనుక, ఆ అప్సర ఊర్వశి అయినది.

అప్సరసలు పుట్టినది సముద్రం లో. తన తొడ నుండి ఊర్వశిని (అనేక అప్సరసలని మరొక పాఠం) పుట్టించినాడు కనుక నారాయణుడు శృంగార సముద్రుడైనాడు! ఈ సంబోధన ఆ కథను జ్ఙాపకం చేస్తున్నది.

హిరణ్యాక్షుని మరణం తర్వాత వాని సోదరుడు హిరణ్య కశ్యపుడు విష్ణువు ఎక్కడ దాగుకొన్నా సంహరిస్తానని ప్రతిన చేశాడు. ఆ సందర్భం లోనిదిది.

భుజశక్తి నాతోడఁ బోరాడ శంకించి-
    మున్నీట మునిఁగిన మునుఁగుఁ గాక;
లయించి పెనఁగు నా చలసంభ్రమమున-
    కెఱఁగి వెన్నిచ్చిన నిచ్చుఁ గాక;
గడంబు సైఁపక సౌకర్యకాంక్షియై-
    యిల క్రింద నీఁగిన నీఁగుఁ గాక;
క్రోధించి యటుగాక కొంత పౌరుషమున-
    రి భంగి నడరిన డరు గాక;
ఠినశూలధారఁ గంఠంబు విదళించి,
వాని శోణితమున వాఁడి మెఱసి,
త్సహోదరునకు హిఁ దర్పణము జేసి,
మెఱసివత్తు మీకు మేలు దెత్తు.

వాచ్యార్థము స్పష్టమే.
పై నాలుగు పాదములు నాలుగు విష్ణ్వవతారములను ధ్వనిస్తున్నవి. 'మున్నీట మునిగిన..' మత్స్యావతారము; 'అచల సంభ్రమమున...వెన్నిచ్చిన..' మందర పర్వతమును వీపుపై మోసిన కూర్మావతారము; 'ఇల క్రింద నీగిన...' భూమిని మోసిన వరాహావతారము; 'హరి భంగి నడచిన...' ఇది రాబోవు నరసింహావతారము - హరి అనగా విష్ణువు, సింహము అన్న శ్లేష.

ఈ విధంగా దశావతారములను ధ్వనింప జేయడం పోతన కిష్టమైన ప్రక్రియ. మరొక మూడు, నాలుగు చోట్ల ఇటువంటి పద్యాలు కనిపించుతవి.

హిరణ్య కశ్యపుడు ఎక్కడ వెతికినా విష్ణువు కన్పించ లేదు - విష్ణు లోకంలో, స్వర్గంలో, పాతాళంలో ఎక్కడా లేడు. కనుక విష్ణువు కిష్టమైన యఙ్ఙ యాగాదులను, విప్రులను బాధించమని హిరణ్య కశ్యపుడు అనుచరులను ఆజ్ఞాపిస్తాడు - వానిని రక్షించడానికైనా విష్ణువు బయట పడవచ్చునని.

మరి ఎక్కడా కనిపించని విష్ణువు ఎక్కడి కెళ్ళినట్లు? దీనికి సమాధానం వామనావతారం లో ఉంది. వామనుడు భిక్ష కై బలి చక్రవర్తి కడకు వచ్చినాడు. భిక్షార్థి కనుక బలి చక్రవర్తిని పొగడుతున్నాడు, మీ తాత ముత్తాతలు ఇటువంటివారని.

మీ ముత్తాత హిరణ్య కశ్యపుడు శూలధారియై వెంట బడుతున్నపుడు విష్ణువు భయగ్రస్తుడై తప్పించుక పోతున్నాడట.

దురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం బోవ భీ
ప్రదుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియం బైవచ్చు” నంచుం గ్రియా
విదుఁడబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం
ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై.

ఇది సమూలకమే. వీని కెదురై పోరాడలేమని, విష్ణువు తెలివిగా హిరణ్య కశ్యపుని శ్వాస ద్వారా వెళ్లి వాని హృదయం లో దాగు కొన్నాడట! విచిత్రమైన ధ్వని. వాచ్యంగా బలికి సంతోషం కలిగించే మాట - తన ముత్తాతకు భయపడి విష్ణువు పారినాడని. ధ్వని పర్యాయంగా విష్ణువు హిరణ్య కశ్యపుని హృదయం లోనే ఉన్నాడని. అది కూడా బలికి సంతోష కరమైనదే. హిరణ్య కశ్యపుడు బాహ్య ప్రపంచంలో అంతటా వెతికినాడు, కాని తనలో వెతుకు కొనలేదు, కనుక విష్ణువు కనిపించలేదు. ప్రహ్లాద చరిత్ర చదివిన మనకు "ఎందెందు వెదకిన..." వంటి పద్యాలు జ్ఙాపకం వచ్చి చక్కిలిగింతలు పెట్టినట్లవుతుంది. విష్ణ్వవతారమైన వామనుడే చిరుహాసంతో చేసిన ఈ చమత్కృతి మనకూ సంతోషం కలిగిస్తుంది.

హిరణ్య కశ్యపుడే విశిష్టమైన పాత్ర. హిరణ్యాక్షుడు వధింపబడినప్పుడు హిరణ్య కశ్యపుడు తల్లికి, వదినకు వేదాంత తత్త్వం బోధించినాడు.

ర్వజ్ఞుఁ డీశుండు ర్వాత్ముఁ డవ్యయుం-
మలుండు సత్యుఁ డనంతుఁ డాఢ్యుఁ
డాత్మరూపంబున శ్రాంతమును దన-
మాయాప్రవర్తన హిమవలన
. . . .

"అవ్వా, ఇవ్విధంబున లక్షణ వంతుండుగాని ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంసరణంబున యోగ వియోగంబుల నొందించు..."

ఇది శుద్ధ వేదాంతము. అయితే వేదాంతి యైన హిరణ్య కశ్యపుడి దృష్టిలో విష్ణువెవ్వడు?

ముల నుండుఁ జొచ్చు ముని ర్గములోపల ఘోణిగాఁడు సం
న మెఱుంగ రెవ్వరును జాడ యొకింతయు లేదు తన్ను డా
సి మఱి డాయు వెంటఁబడి చిక్కక చిక్కఁడు వీని నొక్క కీ
లు మన మెల్ల లోఁబడక లోఁబడఁ బట్టుకొనంగవచ్చునే?
(వనము = అడవి, నీరు)

ఇది కూడా ద్వ్యర్థియే. విష్ణువు సహజ స్వభావానికి, తప్పించుకు పోవడానికీ సమానంగా వర్తిస్తుంది. ఇట్లా వ్యంగ్య వైభవమున్న పద్యాలు పోతనకు ప్రీతి పాత్రమైనవి (ఇది నాకు నెలవని యే రీతి బలుకుదు? నోక చోటనక యెందు నుండ నేర్తు - వామన చరిత్ర; మా సరివాడవా మా పాప గొనిపోవ? నేపాటి గలవాడ వేది వంశ? మెందు జన్మించితి వెక్కడ బెరిగితి? - రుక్మిణీ కల్యాణము). ఇది మూలమును కొంత విస్తరించి వ్రాసినదే, కాని మూలమును కూడా ప్రశంసింపక తప్పదు.

తస్య త్యక్తస్వభావస్య ఘృణేర్మాయావనౌకసః
భజంతం భజమానస్య బాలస్యేవాస్థిరాత్మనః.

వాడు ముందు మంచి వాడే, కాని తర్వాత స్వభావం మార్చుకొని మాయావిగా వరాహ మయ్యాడు; తనను పొగడే వాళ్ళ దగ్గరే చేరుతాడు, అల్లరి పిల్లవాని వలె ఒక దగ్గర నిలుకడగా ఉండలేడు!

మూలం లోని సున్నితమైన హాస్యం ఎందుకో పోతన దృష్టి కానలేదు! హిరణ్య కశ్యపుని కథలో ఉన్నన్ని చిక్కు ముళ్ళు మరే కథ లోనూ లేవనుకొంటాను.

పోతన ధ్వని ప్రస్తారానికి రుక్మిణీ కల్యాణములో నుండి మరొక ఉదాహరణ.

న్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
న్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
న్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
న్యానేకపసింహ! నా వలననే న్మించెనే మోహముల్?

ముందు పద్యం లోనే రుక్మిణి అంటుంది, 'నీ యాన, నాన లేదు' - లజ్జ విడిచి పెట్టుకొని చెబుతున్నానని. పై పద్యంలో మళ్ళీ సమర్థించుకొంటున్నది - సర్వ గుణాభిరాముడవైన నిన్ను ఏ కన్యలు కోరరు? ముందు లక్ష్మీ దేవి కూడా నిన్నే వరించినది, నేనే మొదటి దానను కాదు కదా' అని. ఇక్కడ రెండర్థాలు ధ్వనిస్తున్నవి - ఒకటి, రుక్మిణి లక్ష్మీ దేవి అంశ యని. రెండవది, ' నా వలననే జన్మించెనే మోహముల్' - రుక్మిణీ కృష్ణులకు మన్మథుడు ప్రద్యుమ్నునిగా జన్మించుతాడు. మన్మథుడే మోహము కల్పించేవాడు కదా. ఇది భవిష్యదర్థ సూచకము, పోతన స్వతంత్రించి వ్రాసినదే.

కొన్నిచోట్ల ధ్వని వాచ్యమే అన్నంత స్పష్టంగా ఉంటుంది. - భ్రమర గీతల లో ' భ్రమరా, దుర్జనమిత్ర ముట్టకుమ మా పాదాబ్జంబులన్..' వంటివి, అవి ఉదాహరించ నవసరం లేదు. ఒక్కొకచో పోతన వ్యాసునితో పోటీ పడినట్లుంటుంది. కృష్ణుడు రథం ఇరుసేనల మధ్య నిలిపి నపుడు భీష్మ స్తవం లోనిది.

మూలం -
సపది సఖి వచో నిశమ్య మధ్యే, నిజ పరయోర్బలయో రథం ప్రవేశ్య
స్థితవతి, పర సైనికాయు రక్ష్ణా హృతవతి, పార్థ సఖే రతిర్మమాస్తు.

'స్థితవతి ........హృతవతి' (రథము నిలిపి, శత్రు సైన్యము యొక్క ఆయువును చూపులతో హరిస్తున్నాడు) అన్న ప్రయోగం హృద్యమైనది. పోతన అనువాదంలో మరికొంత శోభ చేకూరింది.

రుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో
రు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం
భూపాయువు లెల్లఁ జూపులన శుంత్కేళి వంచించు నీ
మేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.

పరులు - ఇతరులు, శత్రువులు అన్న అర్ధాలలో ఉపయోగింప బడింది. 'పరభూపాయువు లెల్ల జూపులన శుంభత్కేళి వంచించు' - శత్రు రాజుల ప్రాణములను చూపులతోనే హరించువాడు. ఇక్కడ 'శుంభత్కేళి' మకుటాయమానమై ఉన్నది - క్రీడామాత్రంగా, మాయతో అన్న ధ్వని. అందువలన మూలం లోని పార్థ సఖుడు, ఇక్కడ పరమేశ్వరుడైనాడు! 'మయైవైతే నిహతాః పూర్వమేవ' (గీత) అని కదా! భీష్మ స్తుతి లోనిదే మరొక ప్రసిద్ద మైన పద్యం - మూలానుసారియే కాని అనువాదంలో అప్రయత్నంగా సిద్ధించిన ధ్వని.

త్రిగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ
బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్ర సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
వియుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

అపురూపమైన కృష్ణుని వర్ణన! వాచ్యార్థం స్పష్టంగానే ఉన్నది, అందరికీ తెలిసినదే. తనువు - సూక్ష్మ మైనది, వ్యాపించే గుణం కలది - నీలాకాశము. మూడు లోకములనూ మోహింపజేసే కాంతి - భూనభోంతరాళములలో వ్యాపించిన తేజస్సు. ప్రాభాత నీరజ బంధు ప్రభ చేలము - కపిశ వర్ణము ఆకాశాన్ని రంజింప జేస్తున్నది. ఇక్కడి వరకు అమూర్తమైన కృష్ణ తత్త్వం ఆకాశ సామ్యంగా వర్ణింపబడిందనుకోవచ్చు. వ్రజ సంయుక్త- దుమ్ము కొట్టుకొనిపోయిన - ఇక్కడి నుండి భౌమమైన కృష్ణుని స్వరూపము. వన్నెకాడు - నానా వర్ణములతో శోభించేవాడని ఒక అర్థము. మరొక అర్థం - వగలాడు, మాయ చేసేవాడు, మాయామానుషుడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. మూర్తాయై నమః అమూర్తాయై నమః.
మా విజయున్ జేరెడు - మా అర్జునునితో కూడినందు వలన మాకు సన్నిహితుడైనవాడు - ఇది కృష్ణుని పై ఒక స్వామ్యము, భక్తుల హక్కు!

పద్యనిర్మాణం లోనూ ధ్వనిని సాధించ వచ్చు. వామనుడు బలి చక్రవర్తి దగ్గర దానానికై చెయిసాచినప్పటి వర్ణన.

రారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం
లాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌస్స్వామిజిన్మస్తముం
లాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్
విలశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్.

చివరి మూడు విశేషణములు లక్ష్మీ దేవి సంబంధమైనవే. పునరుక్తి వలె కనుపించవచ్చు, కాని కాదు. వామనుడడిగిన మూడడుగులకు సంకేతంగా ఆ చేయి ముమ్మారు వర్ణింపబడింది. ఆ మూడున్నూ లక్ష్మీ పరమైనవి కావడం కూడా విశేషము - లక్షీపతి యైన వాడు భిక్ష అడుగుతున్నాడు! ఆ పైని విశేషణం కూడా అర్థవంతమైనదే. 'ఖండిత దివౌకస్స్వామిజిన్మస్తమున్' - పరాస్తుడైన ఇంద్రుని ఆశీర్వదించిన హస్తము - బలి చేకొన్న స్వర్గము తిరిగి ఇంద్రుని కిప్పించడం ధ్వనిస్తుంది. ఒక్క అంత్యప్రాసలను గమనించకపోతే, ఈ పద్యం నన్నయ వ్రాసినదే ననుకోవచ్చు!

పద్యశిల్పమునకు మరొక ఉదాహరణ -
బాల కృష్ణుడు మన్ను తిన్నాడేమో నని యశోద దండించబోగా, నా నోటిలో మట్టి వాసన ఉందేమో చూడమని కృష్ణుడు నోరు తెరచి చూయించాడు. ఆ నోటిలో యశోద బ్రహ్మాండమును చూసింది. అయితే ఆ బ్రహ్మాండ మును వర్ణిస్తూ పోతన ఒక శార్దూలమో, మత్తేభమో వ్రాసియుండ వచ్చు కదా. కాని, వ్రాసినది ఒక చిన్న కంద పద్యం మాత్రమే!

లితాంగి కనుంగొనె
బాలుని ముఖమందు జలధి ర్వత వన భూ
గో శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

బ్రహ్మాండమంతా కృష్ణుని చిన్ని నోటిలో ఇమిడినట్లే, ఈ కందం లోనూ ఇమిడి పోయింది! శబ్ద సంయోజనంతో సాధించిన ధ్వని ఇది. అక్రూరుడు నదిలో కృష్ణుని విశ్వరూపం చూసిన తర్వాత చెప్పిన వర్ణన కూడా ఇట్లే ఉంది. రామ కధలో రాముని వర్ణన మరొక శిల్పము.

నల్లని వాడు, పద్మ నయనంబులవాడు మహాశుగంబులన్ విల్లు

ను దాల్చువాడు కడు విప్పగు వక్షము వాడు మేలు పై జల్లెడు వాడు నిక్కిన భుజంబుల వాడు యశంబు దిక్కులన్ జల్లెడు వాడు నైన రఘు సత్తము డిచ్చుత మాకభీష్టముల్.

వెంటనే గోపికా గీతల లోని 'నల్లని వాడు, పద్మ నయనంబులవాడు కృపారసంబు పై జల్లెడువాడు...' జ్ఙాపకం వస్తున్నది! రామకృష్ణుల కభేదమని ధ్వని.

ఇప్పటికే వ్యాసం పెద్దదై పోయింది - భాగవతం కదా!

  ~ చీర్ల చంద్రశేఖర