పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : ఈనాడు అంతర్యామి పోతన

ఈనాడు అంతర్యామి : 15-03-2018
పరమాత్మ


pothana.antమనిషి మనసులో ప్రశ్న మొలిస్తే, ఆ వెంటనే జవాబు కోసం వెతుకులాట మొదలవుతుంది. అతడి ప్రయత్నం కొనసాగుతున్నకొద్దీ, ఆత్మను ఆవరించి ఉన్న ‘జడత్వం’ అనే ముసుగు తొలగిపోతుంది. దాని స్థానంలో చేతనత్వం చోటుచేసుకుంటుంది. ఆ సాధకుడు ఆధ్యాత్మిక మార్గానికి మళ్లుతాడు. అతడు కచ్చితంగా భక్తుడిగా మారతాడు.
భక్తిమార్గంలో వినిపించే పదం ‘ఎవడు’. ఆ మూడక్షరాల మాటలోనే ఎన్నో భావాలు ఇమిడి ఉన్నాయి. అందులో అమాయకత్వం ఉంది. గడుసుతనమూ కనిపిస్తుంది. తెలిసిన తత్వంతో పాటు తెలియనితనం సైతం దాగి ఉంటుంది. ‘ఎవడు’ అని పలికే తీరును బట్టి, లోపలి భావం ప్రశ్నగానే కాక జవాబుగా కూడా పనిచేస్తుంది. అందుకే ఆ పదం పోతన మహాకవికి ఎంతో అభిమానపాత్రమై నిలిచింది. ఆ ఒక్క పదమే ఆయువుపట్టు అనిపించేలా, దాన్ని ఆయన పలు సందర్భాల్లో, అర్థాల్లో వాడాడు. అదీ ఆ సహజ కవి దూరదృష్టి!
కేనోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు చేసిన పనీ అదే! వాటిని సామాన్యులు ఉన్నపళంగా చదవలేరు. ఒకవేళ చదివినా, వారికి ఉపనిషత్తులు అప్పటికప్పుడు అవగతం కాకపోవచ్చు. అలాంటివారికీ ఉపనిషత్‌ స్ఫురణ కలిగే విధంగా, పోతనామాత్యుడు ‘ఎవడు’ పద ప్రయోగాన్ని వివిధ రూపాల్లో చేశాడు.
భారతం, భాగవతం- రెండింటినీ వ్యాసుడే సంస్కృతంలో రచించాడు. భాగవతానికి పోతన అనువాద పటిమ- దాన్ని ఆయనే రాశాడన్నంత పేరు సంపాదించిపెట్టింది. వ్యాస భారతంలోని ఆనుశాసనిక పర్వం 149వ అధ్యాయంలో విష్ణు సహస్ర నామాలున్నాయి. భీష్ముడు వాటిని యుధిష్ఠిరుడికి ఉపదేశించాడంటారు. ఆ పేర్ల గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ‘ఎవరి నామాన్ని ఉచ్చరిస్తే సంసార బంధనాలన్నీ తొలగిపోతాయో...’ అంటాడు వ్యాసుడు. ఆయన మీద భక్తిభావం గల పోతన- భాగవతంలోనిది కాకపోయినా తన అనువాద ప్రారంభంలో ‘ఎవరి అవతారం అన్ని ప్రాణులకీ సుఖాన్ని కలగజేస్తుందో, ఎవరి శుభనామం తలిస్తే అందరి సంసార బంధనాలూ తొలగిపోతాయో, ఎవరి చరితను హృదయంలోకి చేరిస్తే మృత్యుభయం ఉండదో...’ అని రాశాడు. అక్కడ పరమాత్మ, భగవంతుడు వంటి పదాలు ఉపయోగించకుండా ‘ఎవరి’ పదాన్ని ప్రయోగించడంలోనే గొప్ప ఆంతర్యముంది.
భగవంతుడు గొప్పవాడని కొందరు నమ్ముతారు. మరికొందరు- మానవమాత్రుడే గొప్ప అని తలుస్తారు. ఇంకొందరు వేరొకర్ని విశ్వసిస్తారు. ఎవరు అనే పదప్రయోగంతో పోతన- ఎవరికి నచ్చినవారిని వారు ఆ స్థానంలో ఊహించుకునే స్వేచ్ఛనిచ్చాడు. అదే సందర్భంలో ఆయన గడుసుదనమూ ప్రస్ఫుటమవుతుంది. జరిగేవన్నీ చెప్పి, ఆ ‘ఎవరో’ అనేది స్పష్టంగా చెప్పకుండా వదిలేస్తే...‘ఇంతకీ ఎవరది’ అని అందరి మనసుల్లోనూ ఒకే ప్రశ్న అంకురిస్తుంది. అలాంటివాడి కోసమే అన్వేషణ సాగుతుంది. ఆ ప్రయత్నంలో వివరం తెలుసుకున్నవారే ముక్తులవుతారు. ఆ ప్రయత్నాన్ని వారికే వదిలేశాడాయన!
అష్టమ స్కందంలో ‘ఈ జగత్తు ఎవరి వల్ల జనిస్తోందో, ఎవరి అధీనంలో ఉందో, ఎవరి కారణంగా నశిస్తున్నదో...’ అంటాడు పోతన. సృష్టికి మూలకారణం ఎవరో, ఆది మధ్య అంతం లేనివారెవరో, అన్నీ తామే అయిన వారెవరో... అంటూ వర్ణిస్తాడు. అలాంటి ఆత్మభవుడై(తనంత తాను జన్మించి)న పరమాత్మను శరణు వేడుతున్నాను’ అంటాడాయన. భక్తుల్లో అలా ఉత్కంఠ పెంచుతూ, ‘ఇన్ని లక్షణాలున్నవాడు పరమాత్మ ఒక్కడే’ అని జవాబు చెబుతాడు. ఎక్కువ ఎవరూ లేరన్నంతగా అన్నిసార్లూ ముక్తాయిస్తాడు. పరమాత్మకు భక్తుడు కాకుండా, ఇక ఆ పాఠకుడు ఎలా తప్పించుకుంటాడు?
అష్టమ స్కంద ప్రారంభంలో ‘ఎవడు’ అనే పదాన్ని రెండు అర్థాల్లో వాడిన తీరు, పోతన రచనా పాటవానికి ప్రతీక. ఎంత వెతికినా, అన్ని లక్షణాలూ ఉన్నవాడు ఆ సర్వవ్యాపి అయిన అంతర్యామి ఒక్కడే! అంత గొప్పవాణ్ని కనుగొన్న జీవుడు ఆరాధించకుండా ఉండలేడు. అందువల్ల అతడు జీవన్ముక్తి పొందగలుగుతాడు. సామాన్యులూ మోక్షప్రాప్తి పొందే మార్గం చూపిన పోతన- మహానుభావుడు!

- అయ్యగారి శ్రీనివాసరావు