పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : అమ్మ చూపులు

మ.
రుఁజూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్,రోషరాగోదయా
వితభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
గం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్
సాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.
- యుద్ధరంగంలో సత్యభామ విజృంభణ పోతన కన్నులలో పొడసూపిన తీరిది.

మ.
రి జూచున్ హరిఁ జూచు జూచుకములం దందంద మందార కే
మాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెద కొంగొకింత దొలగం దోడ్తో శరాసారమున్
హాసామృత పూరముం గురియుచుం న్వంగి కేళీగతిన్
- నాచన సోముడు చేసిన సత్యభామ శృంగారరసావిష్కరణ యిది.

ఒకే 'ఒకడు నాచన సోముడు' అన్నాడు.సకలకవితాకళా సనాధుడు, విశ్వనాథుడు! ఈ అర్భకుని తులనలో యిక్కడ పోతన నిశ్చయముగా ఇంతింతై వటుడింతయై ఎదిగి నాచనను మించిపోయాడు. మూల భాగవత కథ ప్రకారం సత్యభామ యుద్ధానికి వెళ్ళింది, వ్యాస భాగవతం ప్రకారం కూడా. కానీ యుద్ధం చేయలేదు. మురాసురుడినీ, వాని కొడుకులను, నరకుడిని శ్రీహరియే సంహరించాడు. యుద్ధం చేయకుండా పని లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు అని, తెలుగు సత్యభామతో యుద్ధం చేయించారు. ఆ వంకతో అద్భుతమైన దృశ్యాన్ని అందించారు.

వ్యాసభాగవతం దశమ స్కంధంలో 59 వ అధ్యాయంలో 45 శ్లోకాలలో నరకాసుర వధా కథనం మనకు అందించాడు వ్యాస భగవానుడు.

యుద్ధానికి వెళ్ళిన సత్యకు సరదా పుట్టింది. సత్యాపతి సరదా సమతిక్రమించింది. ఆమెనేను యుద్ధం చేస్తానన్నది. ఈయన సరేనన్నాడు. తనతో చేసే ప్రణయయుద్ధాలేనా ఎప్పుడూ, శత్రువుతో చేసే ప్రళయ యుద్ధాన్నీ చూద్దాము అనుకున్నాడు. సత్యావధూసమర కౌశలాన్ని, సొగసుల సోరునూ చూస్తూ కూర్చున్నాడు.

యిప్పుడు సత్య శత్రువుకు ప్రళయ భీకరంగా, నాథునికి ప్రణయ శ్రీకరంగా కనిపించాలి. ఆమెలో వీర రసం, శృంగార రసం రెండూ సమానంగా పోషింపబడాలి. యుద్ధానికి వెళ్ళింది తన వీరనారీ తత్వాన్ని నాథునికి చూపించడంకోసమే కదా! దానికి కొంత ఎక్కువ ప్రాధాన్యత కనిపించాలి.

పోతన కనుగొన్న సత్య పరుడిని, వరుడిని ఇద్దరినీ రెండురకాలుగా చూస్తున్నది. ఆమె చూడడమంటే ఆమెనే నరకుడు, నాథుడు ఇద్దరూ చూస్తున్నారు చూపులు తిప్పుకోకుండా. తననే చూస్తున్న వారిని ఈమె మార్చిమార్చి చూస్తున్నది. ఈ ముగ్గురినీ కవి చూస్తున్నాడు.

పరుడిని అంటే పరాయివాడిని వంచడానికి చూసే చూపు చూస్తున్నది. వరుడిని, తన మరుడిని అలరించడానికి చూసే చూపు చూస్తున్నది. ఇక అంతా క్రమాలంకారమే. వాడిని రోషంతో చూస్తున్నది. తనవాడిని (అను)రాగోదయంతో చూస్తున్నది. దుష్టుడిని 'అవిరత భ్రూకుటి'తో అంటే తీక్షణంగా కనుబొమలు ఎగరేసి, వీరత్వం పొగరేసి చూస్తున్నది. ఇష్టుడిని మందహాసంతో అరవిరిసిన నవ్వుల అగరేసి చూస్తున్నది, మదనభావపు సెగరేపి చూస్తున్నది. నరకుడిని వీరభావంతో చూస్తున్నది. నాథుడిని శృంగారభావంతో చూస్తున్నది. కన్నులలో కెంపులు పూస్తున్నాయి. అన్యులమీద ఆగ్రహం వచ్చినా, ధన్యులమీద అనుగ్రహం వచ్చినా కనులలో ఆ మెరుపే వస్తుంది. వాడిమీద భయంకరములైన తూపుల సమూహాన్ని కురిపిస్తున్నది. తనవాడిమీద వశంకరములైన తీయని తీపుల తూపులు కురిపిస్తున్నది చంద్రబింబానన ఐన సత్యభామాదేవి! ఇక్కడ వీర, శృంగారభావ వీక్షణం సమానంగా కవితాసౌధ విమానంగా విలసిల్లింది. ఇంతవరకూ యిది పోతన గారి చూపు.

నాచన సోముని సత్య అరిని అంటే శత్రువును, హరి అంటే శ్రీకృష్ణుడిని ఇద్దరినీ చూస్తున్నది కానీ ఆమెలో శృంగార రసాధిక్యాన్నే చూస్తున్నాడు కవి. ఆమె మెడలో మందార పూమాలలు ధరించింది. ఆ మందార పూల పుప్పొడి రేణువులు, ఆ పూల మకరందపు బిందువులు అందంగా ఆమె స్తనాగ్రములపై మెరుస్తున్నాయి, కురుస్తున్నాయి. దానికితోడు బాణం వేస్తున్నప్పుడు కొద్దిగా ముందుకు వంగినపుడు పైట తొలిగిపోయింది. జోడుగా శరాసారమును దరహాసామృత పూరమును కురిపిస్తున్నది, ఆ సుందరాంగి ఖేలనగా. ఇక్కడ సత్యభామాదేవి అందమే కనిపిస్తున్నది. వీరత్వపు జాడ స్పష్టంగా లేదు. కేవలం లీలామాత్రంగా నరకుడి ఉనికినీ నరకాంతకుని ఉనికినీ చెప్పాడు.

పోతన చూపు సమగ్రమైన దృశ్యాన్ని చూసింది. నరకుడినీ, కృష్ణుడినీ, సత్యభామలోని వీరరసాన్నీ, శృంగార రసాన్నీ చూసింది. నాచన చూపు కేవలం సత్యావధూసౌందర్యాన్ని చూసింది.

సరే, యిక ముక్తాయింపు!
చూపులలో ఇన్ని రకాలు ఉంటాయా అంటే ఎందుకుండవు. 'తనను' కన్నవాళ్ళను చూసే చూపులో, 'తను' కన్నవాళ్ళను చూసే చూపులో, కట్టుకున్నవాడిని చూసే చూపులో, వాడిని కన్నవాళ్ళను, తోడబుట్టిన వాళ్ళను చూసే చూపులోని 'ప్రేమాభిమానాలలో విభిన్నత' ఎంత స్పష్టంగా ఉంటుంది, సరిగా కనులు తెరిచి చూడగలిగితే!

శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సన పరా
సరోషా గంగాయా గిరిశచరితే విస్మయవతీ
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ
సఖీషు స్మేరా తే మయి జనని ద్రుష్టిస్సకరుణా

శివుడిని శృంగార భావంతో ఆర్ద్రమైన చూపులతో, శివేతరులను ఏవగింపుతో, నాథుని నెత్తికెక్కి కూర్చున్న గంగను రోషంతో, హాలాహాల భక్షణం, త్రిపురాసుర మర్దనం, మహా రాక్షస విమర్దనం మొదలైన శివుని వీర గాథలను పెద్ద పెద్ద కళ్ళతో విస్మయంగానూ, (అసలే మీనాక్షి, విశాలాక్షి) ఎప్పుడు కాస్త సరసం పుట్టి దగ్గరికి తీసుకుంటాడు అనుకున్నా మెడనిండా ఒంటి నిండా ఉన్న ఆ పాడు పాములను భయముతో చూసే నీ చూపులు, కొలనులోని విచ్చిన పూల అతిశయాన్ని కలిగిన నీ చూపులు, నీ చెలికత్తెలను నవ్వుతూ చూసే నీ చూపులు ..నా తల్లీ! నన్ను కరుణతో చూస్తాయి (చూడాలి) అని ఆదిశంకరుడు అనలేదూ! అదీ అమ్మ చూపుల మహిమ!

-వనం వేంకట వరప్రసాదరావు2020-06-18