పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

బమ్మెర పోతన : భీష్మ స్తుతి - రూప చిత్రణము

ఆచార్య. చొప్పకట్ల సత్యన్నారాయణ
28-09-2018.
మ:
త్రిజగ న్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ
రజ బంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజసంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
- భాగవతం - ప్రథమ స్కంధం - 217 పద్యము. బమ్మెఱ పోతన మహాకవి!

ఆంధ్ర సాహిత్య క్షేత్రమును సుసంపన్న మొనరించిన కవులలో నొక్కొక్కరి దొక్కొక్క మార్గము. పోతన గారిది యద్భుతమైన రూప చిత్రణా మార్గము. తాను వర్ణించు పాత్రను పాఠకుల కట్టెదుట నిలుపుట పోతన ప్రత్యేకత.. భీష్మ స్తుతిలోని యీపద్యము అతని రూప చిత్రణకు చక్కని యుదాహరణము.
"ముల్లోకాలనూ పరవశింపఁ జేసే నల్లని మేనికాంతితో నొప్పారుచు. ప్రభాత కాలమున సంధ్యాకాంతుల నుపమించు బంగరు వస్త్రమును ధరించి. నల్లని ముంగురులతోనొప్పు ముఖారవిందము చూపరులకు విందుచేయ, మా యర్జునుని సమీపమున దిరుగాడు సొగసుగాడగు కృష్ణుడు నామదిలో నెల్లవేళలా నిలచి యుండు గాక!"- యని పద్యభావము!
విశేషాంశములు: కృష్ణుడు నల్లనివాడే! కానీ ఆ నీలమేఘశరీరకాంతి ముల్లోకాలనూ పరవశింపజేసేదట! ఆ పరవశంలో భీష్ముడుగూడా భాగస్వామియేగదా! కృష్ణుని దర్శించినవారందరూ ఆరూప వీక్షణంతో పరవశులౌతారని భావం. చేలము నీరజబంధుప్రభమైనది. బంగరు చేలము; దానికాంతులు బాలసూర్యకాంతులతో సమానము. సూర్యుడు లోకబాంధవుడు. కృష్ణుడు -
సకల విశ్వబాంధవుడని సూచనచేయుట.
ముఖమా అరవింద సమానము. అదియు నీలాలక యుక్తము. అలకలనగా ముంగురులు. అవి కొదమతుమ్మెదల గుంపులనుబోలి ముఖారవిందమునకు మరింత యందమును కలిగించుచున్నవని భావము.
ఆయన వన్నెలాడట.ఎన్నివేషములో !యెన్నిషోకులో! చెప్పతరముగానివాడని భావము.
ఆయన చేరునది విజయుని కడకు. అనగా కృష్ణుని పయనము విజయము వైపునకే యని సూచన!
ఇంతటి మనోజ్ఙమైనభావనలతో పోతనగారు భాగవతంలో యీపద్యాన్ని చిత్రించి రసజ్ఙులకు కానుక జేశారు.
స్వస్తి!