పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : తృతీయ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

సురుచిరము, సువిశాలము, సుజ్ఞేయము నైన భాగవత భక్తి సామ్రాజ్ఞానికి మకుటంలేని మహారాజు మన బమ్మెర పోతరాజు. అందుకే కోడూరి వేంకటాచలపతి “భూరి సత్కళా ద్విజరాజుఁ బోతరాజు” అని; కరుణశ్రీ

ఖ్యాతి గడించుకొన్న కవులందరు లేరె! అదేమి చిత్రమో
పోతన యన్నచో కరిగిపోవు నెడంద, జొహారు సేతకై
చేతులు లేచు; ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా
నాతని పేరులో గలదొ! ఆయన గంటములోన నున్నదో!


అని ఉంటారు. మరి కల్లూరి వెంకటనారాయణ రావు “పోతన కవీంద్రా! రససుధాపూర్ణ చంద్రా!” అని సంభోదించారు.

పోతనామాత్యులు

వ్యాసభట్టారకుల సంస్కృత మూలరచనను బమ్మెరవారు తెనిగించిన తీరు, తెన్ను, తెగువ అంత ఎన్నదగినవి. సత్యమా కాదా అన్నది పక్కనపెట్టి వారి జీవితంలో జరిగినది అని జనబాహుళ్యంలో ప్రచారం పొందిన ఘట్టం స్మరిద్దాం. ఒక తొలకరివేళ మన పోతరాజు గారు పొలంలో ఉన్నారు. కొడుకు జోడెద్దుల నాగలి కట్టి దున్నుతున్నాడు. ఇంతలో కవిసార్వభౌముడు శ్రీనాథుడు పల్లకీ యెక్కి దర్పంగా వస్తున్నాడు. దూరంనుంచి తండ్రీకొడుకులను చూసాడు. ఎంత చెప్పినా భాగవతాన్ని రాజుకి అంకిత మివ్వటం లేదనే గుర్రుతో, ఒక పక్క పల్లకీబొంగు మోస్తున్న బోయీలను తప్పుకోమన్నాడు. అయినా పల్లకీ చక్కగానే వెళ్తోంది. అది చూసిన కొడుకు తండ్రి వంక చూసాడు. తండ్రి కన్నెత్తి వెలపలెద్దు వదిలెయ్యి అన్నాడు. నాగలి నడకకేం నట్లు పడలేదు. పౌరుషంతో శ్రీనాథుడు ఈ పక్క బోయిలను కూడ తప్పుకోమన్నాడు. పల్లకీ గాల్లో వెళ్తోంది. కొడుకు మళ్ళా తండ్రిని చూసాడు. తండ్రి తలాడించాడు. కొడుకు లోపలెద్దు కూడ వదిలేసాడు. అయినా నాగలి నవకంగా నమ్మకంగా దుక్కి దున్నేస్తోంది. అంతే కవిసార్వభౌములు పల్లకీ దిగివచ్చి పోతరాజు పాదాలమీద పడ్డాడు. కౌగలించుకొని కుశల మడిగాడు కర్షకకవి. అమ్మో మా కరుణశ్రీ “కర్షకకవి అనేస్తున్నావు నాకే కవికర్షకుడా? కర్షకకవా? అని అనుమానం తీరలే” దని కోప్పడతారేమో.

తృతీయ స్కంధము

లం హలం రెంటి వాడి గల ఈ కవికర్షకునికి భక్తైనా రక్తైనా నల్లేరుపైబండి నడకే.

ఈ సౌకుమార్య మీ వయ
సీ సౌందర్యక్రమంబు నీ ధైర్యంబు
న్నీ సౌభాగ్య విశేషము
నే సతులకుఁ గలదు? చూడ నిదిచిత్రమగున్


.అని వెంపర్లాడారట సంధ్యాసుందరిని చూసిన అసురులు. ఎంత చక్కటి శృంగారం.

హరియుం దన మాయాగతిఁ
బరికించియుఁ గాన డయ్యె; బరిమితి లేమిన్
మఱి మాయా వినిమోహిత
చరితముఁ గనుఁ గొందు; రెట్లు చతురాస్యాదుల్.


విష్ణుమాయ అంత చిక్కటిదట. మరి యుద్దవుని భక్తి పారవశ్యం వర్ణన

కంటిఁ గంటి భవాబ్ది దాటఁగ గంటి నాశ్రితరక్షకుం
గంటి యోగిజనంబు డెందము గంటిఁ జుట్టముఁ గంటి ము
క్కంటికిం గనరాని యొక్కటిఁ గంటిఁ దామరకంటిఁ జే
కొంటి ముక్తివిధానముం దలకొంటి సౌఖ్యము లందగన్.


ఇలా చెప్పుకుంటే పోతే పోతన పద్యాలకు అంతే ఉండదు. అందులోనూ 1055 పద్యగద్యలతో తెలుగు భాగవతములోనే మూడవ పెద్దది ఈ తృతీయ స్కంధము. ప్రసిద్ధమైన “శ్రీనాథనాథా. . .” దండకమూ ఈ స్కంధములోనిదే. తెలుగుభాగవతం గల రెంటిలోనూ రెండవ దయిన శ్రీమానినీమానచోరా. . . దండకం (10.1-1236-దం.) దశమ స్కంధములో ఉంది.

వృత్తాల వారీ పద్యాల లెక్క

పద్యగద్యలు = 288 +తేసీతో 138; మొత్తం = 1193

పద్యం ఛందోప్రక్రియ = తృతీయ స్కంధం
మొత్తం = 1193
వచనం. = 246
కంద పద్యం. = 339
సీస పద్యం. = 138
తేటగీతి సీసంతో. = 138
మత్తేభం. = 69
చంపకమాల. = 116
ఉత్పలమాల. = 53
ఆటవెలది. = 4
తేటగీతి. = 82
శార్దూలం. = 1
మత్తకోకిల. = 1
తరలం. = 3
గద్యం. = 1
మాలిని. = 1
దండకం. = 1

లాంటి అమృత గుళికలెన్నో ఉన్న తృతీయస్కంధంలో యాదవాదుల నిర్యాణం, మహదాదుల సంభావాది, సూక్ష్మ మహా కాలాలు. చతుర్యుగ పరిమాణాదులు, వరాహావతారం, కపిలావతారం, భక్తియోగం, సాంఖ్యయోగం లాంటి అద్భుతాలు వివరించబడ్డాయి. సృష్టి, స్థితి, లయలలో స్థితికిదర్పణం అంటారు ఈ స్కంధాన్ని.

కృతఙ్ఞతలు

కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలకు, ప్రచురణకర్తలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులు, ఇతర వ్యక్తులు, అంతర్జాల సంస్థలకు. మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించుట నిర్వహించుట, ప్రతి పద్యగద్యకు గాత్ర ప్రదానం మున్నగు పనులకు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన వారికి, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -