పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : షష్ఠ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

రచన

సంస్కృత భాగవత కర్త పరాశర తనయుడు వ్యాసభగవానులు.
భాగవత ప్రయోక్త వ్యాసుని తనయుడు శుకబ్రహ్మ.
ఆంధ్రీకరించి తెలుగులకు ప్రసాదించిన వారు పోతన, సింగయ, గంగన, నారయాది ప్రభ్రుతులు.
మ్మహానుభావులు, ప్రాతః స్మరణీయులు, తెలుగు జాతికి

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆంధ్రీకరించబడిన సంస్కృత మూల భాగవతాన్ని పోతన భాగవతం అంటారు. యిది 15వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది. కాని మొత్తం అంతా పోతన ప్రణీతం కాదన్నది యధార్థం. కొన్ని భాగాలు లుప్తం కావటం వలన కాని, పోతనా మాత్యులే విడిచి పెట్టుటచేత కాని, శిష్యులకు కొంత భాగం చేయమని అప్పజెప్పుట వలన కాని యితరులచే పూరించ బడింది. అలా లుప్తం కాడానికి కారణంగా అప్పటి పరిపాలకుడు సర్వజ్ఞ సింగమ నాయకుడు, తనకు అంకితమిమ్మన్నా యివ్వలేదన్న కోపంతో భూస్థాపితం చేసాడని. తరువాత వాటిని బయటకు తీసినా అనేక తాళపత్రాలు చెడిపోయా యని అంటారు. అవేకాక కాలప్రభావం అనండి, రాజకీయ అలజడులు అనండి, మరోటి అనండి యేమైతేనేం స్కంధాలు, పదాలు, పద్యాలు కొన్ని పూరించబడుట జరిగింది, ప్రక్షిప్తం కావటం జరిగింది.

సింగయ

వాటిని పక్కనపెట్టి, అలా పూరించిన వాటిని స్థూలంగా తీసుకుంటే పంచమ స్కంధము గంగన కృతి, షష్ఠ స్కంధము సింగయ కృతి, ఏకాదశ ద్వాదశ స్కంధాలు నారయ కృతి అనవచ్చు; షష్ఠ స్కంధలో ఎరుచూరి సింగయ కవి మాత్రమే అదొక స్వతంత్ర రచన వలె భాగవతారంభలో పాటించిన సంప్రదాయాన్ని యనుసరించి సకల దేవతా ప్రార్థన, పూర్వకవి వందనం, కృతిపతి నిర్ణయం, గ్రంధకర్త వంశవర్ణన, షష్ఠ్యంతాలు వ్రాసారు. షష్ఠ స్కంధంలో అజమిళోపాఖ్యానం, వృత్రాసుర వృత్తాంతం, ధధీచి మహర్షి త్యాగం, దేవాసుర యుద్ధం, చిత్రకేతోపాఖ్యానం మున్నగు మిక్కిలి రసవత్తర ఘట్టాలను సింగయగారు బహు చక్కగా వర్ణించారు. ఎందరో యితర కవులు కూడ షష్ఠస్కంధం వ్రాసినా, బమ్మర పోతనామాత్యుని సరళిని దగ్గరగా అనుసరించిన కారణం వలననే పోతన భాగవతంలో సింగయ కృతి సుస్థిర స్థానం పొందింది అంటారు పండితులు. అది యేమైనా నిశ్చయంగా వారి జన్మాంతర సుకృత విశేషం వల్లనే పోతన భాగవతంలో స్థానం పొందగలిగారు అని చెప్పవచ్చు.

చిన్న చిన్న పదాలలో చక్కటి భావాన్ని అలవోకగా ప్రస్ఫుటం చేయటంలో వీరిది అందెవేసిన చెయ్యి. వీరు బహుఛందో ప్రయోగ సమర్థులు. 9014 పద్యగద్యలతో ఉన్న బృహత్గ్రంధం పోతన తెలుగు భాగవతంలో తరచి చూస్తే 31 ఛందోరీతులు ఉన్నాయి. 631 పద్యాలు ఉన్న ఈ షష్ఠ స్కంధంలో సింగయ 24 రకాల ఛంధో ప్రక్రియలు ప్రయోగించారు. వాటిలో ఒకమారు మాత్రమే వాడిన ఛందోరీతులు గ్రంథం మొత్తంలో పది ఉన్నాయి. పోతన తెలుగు భాగవతం మొత్తంలో ఒకేమారు ప్రయోగించిన 10 ఛందోప్రక్రియలలో మహాస్రగ్ధర, తోటకము, మంగళమహాశ్రీ, వనమయూరము, శ్లోకము, స్రగ్విణి ఆరింటిని, 631 పద్యగద్యలు గల తన షష్ఠ స్కంధంలో, సింగయ ప్రయోగించారు. అవి కాక తన షష్ఠ స్కంధంలో ఒకేమారు ప్రయోగించిన ఛందోప్రక్రియలు ఇంద్రవ్రజము, ఉత్సాహము, స్రగ్దర, మూడు ఉన్నాయి.

షష్ఠ స్కంధము

పూర్వకవులను సంభావిస్తూ సింగయ వ్యాసుని స్మరించి రెండు పద్యాలు, ఇతర పూర్వ కవులను ఉద్దేశించి ఒక సీసపద్యం వ్రాసి,

ఎమ్మెలు చెప్పనేల? జగమెన్నఁగఁ బన్నగరాజశాయికిన్
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
నమ్మినవాని భాగవత నైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెఱ పోతరాజుఁ గవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్.

అని ఒక ప్రత్యేక ఉత్ఫలమాలను వేసారు పోతనామాత్యులవారికి. ఈ పద్యంలో పోతరాజు అనటం భాగవత నైష్ఠికుడు అనటం సింగయకు ఆయన యెడల గల భక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు.

కవకవనై పదనూపుర
రవరవ లాగుబ్బుకొన్న రతిపతి గతులం
జివచివనై విటు చెవులకు
రవళిన్ రతిసల్పు రతుల రవరవ గనియెన్.

అంటు అజామిళోపాఖ్యానంలో గలగలలాడుతో మదన క్రీడ సాగిస్తున్న వృషలిని వర్ణనతో కూడ పండితుల ప్రశంస పొందినవాడు సింగయ. ఇంత రసవత్తరంగా శృంగారం వర్ణించిన చేతితోనే, భక్తిరసాన్నిదక్షుడు పునరుజ్జీవితుడైన సందర్భంలో ఎంతో చక్కగా జాలువారించాడు.

సర్వేశుఁడు సర్వాత్ముఁడు
సర్వగతుం డచ్యుతుండు సర్వమయుండై
సర్వంబుఁ జేరి కొలువఁగ
సర్వగుఁడై దక్షునకుఁ బ్రసన్నుం డయ్యెన్.

"బాగా ఆకలివేస్తున్న ఆవు దూడలు; ఇంకా సరిగా ఈకలు రానట్టి పక్షికూనలు తల్లికోసం ఎంతగా తపిస్తాయో; భర్త విదేశాలకు వెళ్తే యువతి భర్తను కోరి ఎంత తహతహలాడి పోతుందో; అంత గట్టిగా నిన్ను జేరాలని అంతగా ఆరాటపడు తున్నానయ్యా నారాయణా! శ్రీహరి!" అని ప్రార్దిస్తున్నది అరివీర భయంకరుడై వృత్రాసురుడనే రాక్షస ప్రభువు.

ఆఁకలి గొన్న క్రేపులు రయంబున నీకలురాని పక్షులున్
దీకొని తల్లికిన్ మఱి విదేశగతుండగు భర్త కంగజ
వ్యాకులచిత్త యైన జవరాలును దత్తఱ మందు భంగి నో!
శ్రీకర! పంకజాక్ష! నినుఁ జేరఁగ నామది గోరెడుం గదే.

వృత్తాల వారీ పద్యాల లెక్క

పద్యగద్యలు = 631 +తేసీతో 41 +ఆసీతో 34; మొత్తం = 706

పద్యం ఛందస్సు = షష్ఠ స్కంధ సంఖ్య || పద్యం ఛందస్సు = షష్ఠ స్కంధ సంఖ్యమొత్తం = 606 || = 1) వచనం. = 108 || 13) తరలం. = 52) కంద పద్యం = 147 || 14) లయ గ్రాహి. = 33) సీస పద్యం. = 75 || 15) గద్యం. = 14) తేటగీతి సీసంతో. = 41 || 16) ఇంద్ర వజ్రం. = 15) మత్తేభం. = 10 || 17) ఉత్సాహం. = 16) చంపకమాల. = 32 || 18) స్రగ్దర. = 17) ఉత్ఫలమాల. = 49 || 19) మహా స్రగ్దర. = 18) ఆటవెలది. = 46 || 20) తోటకం. = 19) తేటగీతి. = 32 || 21) మంగళ మహాశ్రీ. = 110) శార్దూలం. = 10 || 22) వన మయూరం. = 111) ఆటవెలది సీసంతో. = 34 || 23) శ్లోకం. = 112) మత్త కోకిల. = 4 || 24) స్రగ్విణి. = 1


లాంటి అద్భుతమైన రచనాశైలి, వస్తువు గలదీ అయిన ఈ షష్ఠ స్కంధమును ఆస్వాదిద్దాం రండి.

సంకలన కర్త

లపల్లి వంశంలో తల్లి వెంకటరత్నంగారు తండ్రి అచ్యుత రామయ్య గారు లకు కీ.శ. 1949లో జన్మించాను. నన్ను సాంబశివరావు అంటారు. ఎలక్ట్రికలు ఇంజనీరుగా ఎమ్.ఇ.ఎస్., రాష్ట్ర విద్యుత్ సంస్థలలో పనిచేసాను. 2007లో పదవీవిరమణానంతరం ఈ భాగవత కార్యక్రమం, గణనాధ్యాయం అని భావగ్రహణం (conceptualisation) చేసికొని, ఆ ప్రయత్నంలో భాగంగా ఈ తెలుగు భాగవతం యూనీకోడీకరణ కార్యక్రమం 2007 అక్టోబరు 12న ఆరంభించాను.

కృతఙ్ఞతలు

కృషికి వలసిన సమస్తమైన పుస్తకముల రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాల సంస్థలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులకు, ఇతర వ్యక్తులకు, మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించుట నిర్వహించుట మున్నగు వాటికి అమూల్య సహాయం అందించిన వారికి, గాత్ర ప్రదానులకు అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -