పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : సప్తమ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

పోతన రచన

మ్మెర పోతనామాత్యులు సహజకవి, కవిత్వసామ్రాజ్య పట్టాభిషిక్తుడు. ప్రజాకవి. పరమ భాగవతుడు, భక్తాగ్రేసరుడు. అంతే కాదు నాదోపాసకుడు. నాద మాధుర్య సంకలిత సుందర శబ్దవిన్యాసభూయిష్ఠ వాగ్విశేషములతో పండించిన మహానుభావుడు. పండితులు చెప్పినది, తానాకళింపుజేసుకున్నది, తనకు కానవచ్చినది, తను జెప్పగలిగినది మాత్రం చెప్తాను అని సవినయంగా సరస గంభీరంగా చెప్పుట పోతన్నకే చెల్లింది. అంతటి పోతరాజు కలంనుంచి జాలువారిని మహాద్భుత భక్తిరసపూర్ణ ప్రహ్లాద చరిత్ర,, నరసింహావతార, హిరణ్యకశిపు వృత్తాంతాలు భాగవతంలోనే కాదు తెలుగు సాహితీ విశ్వంలోనే చెప్పుకోదగ్గవి. మరువరాని పోతన భాగవతం అనగానే ముఖ్యంగా గుర్తువచ్చేవి అద్భుతమైన పద్యాలు ఈ స్కంధంలో ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు:

చదువనివాఁ డజ్ఞుం డగు
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదువఁగ వలయును జనులకుఁ
జదివించెద నార్యులొద్ధఁ జదువుము తండ్రీ!

స్కంధంలోని సీస పద్యాలు. వీటికి వేరే వివరించవలసిన పనిలేదు. ఈ స్కంధం చూడగానే సీసం చెప్పాలంటే పోతనే చెప్పాలని అనిపించక మానదు.

మందారమకరందమాధుర్యమునఁ దేలు; మధుపంబుబోవునే మదనములకు?
నిర్మల మందాకినీవీచికలఁ దూఁగు; రాయంచ జనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు; కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందుచంద్రికా స్ఫురితచకోరక; మరుగునే సాంద్రనీహారములకు?
నంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
విను తగుణశీల! మాటలు వేయునేల?

రి కందపద్యం అందాన్ని బహుచక్కగా చూపించాలి అంటే మన బమ్మెర వారే చూపాలి. అందుకే అమృతగుళికలు అంటే యివే అని పండితుల నుండి పామరుల వరకు సర్వులు అంటారు.

ఇందు గలఁ డందు లేఁ డని
సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.

నరమూర్తిగాదు కేవల
హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది
హరిమాయారచిత మగు యథార్థము చూడన్.

వృత్తాల వారీ పద్యాల లెక్క

పద్యగద్యలు = 483 +తేసీతో =27 +ఆసీతో =21; మొత్తం = 531

పద్యం ఛందోప్రక్రియ = సప్తమ స్కంధంమొత్తం = 531వచనం. = 163కంద పద్యం. = 116సీస పద్యం. = 48తేటగీతి సీసంతో. = 27మత్తేభం. = 34చంపకమాల. = 9ఉత్పలమాల. = 35ఆటవెలది. = 23తేటగీతి. = 1శార్దూలం. = 49మత్తకోకిల. = 3ఆటవెలది సీసంతో. = 21గద్యం. = 1మాలిని. = 1


భాగవత అవతరణ

న దౌర్భాగ్యమెట్టిదో కాని ముందునుంచి మన కవుల కాలాదులు, వంశాదులు అందుబాటులో లేవు. మన పోతన్న విషయం కూడ అంతే. కాని పోతన భాగవతం మిక్కిలితర ప్రజాభిమానం సంతరించుకున్నది కనుక తెలుగు ప్రజల నాలుకలపై ఎన్నో కథలు ప్రాచుర్యం పొందాయి. వానిలో ఒకటి.

కప్పుడు వ్యాసులవారు కాశీకి పోయి, పరమేశ్వరుని భాగవతం ప్రజలకు మరింత చేరు వగుటకు సంస్కృత మంత సారవంత మైన భాషను కవిని యిమ్మని ప్రార్థించెనట. శంకరుడు పోతనగా పుట్టి తెలుగు భాషలో చెప్తాడు అని వరమిచ్చాడట. వాయుదేవుడు వెళ్ళి ఇంద్రునికి యిది చెప్పాడట. యింద్రుడు “దేవభాష సంస్కృతం మాత్రమే. తత్వం చెడకుండ భాగవతాన్ని ఏ యితర భాషలోనైన చెప్పబడితే ఆ భాషకు మూడు జన్మల పాటు దాసోహ మంటాను” అన్నాడట. పిమ్మట పోతన రచించబోతున్నా డని తెలిసి, ఎలాగైనా ఆపాలని సింగభూపాలునిగా జన్మంచి అమ్మహాగ్రంధాన్ని పాతిపెట్టించేడు. అంతట రాముడు కలలో శిక్షించగా, ఆమ్మహాగ్రంధాన్ని వెలికి తీయించి, క్రిమిదష్టమైన భాగాలను పూరింపజేసి, పోతనభాగవతానికి తెలుగు భాషకు దాసోహ మ్మని సేవజేసెను. అటుపిమ్మట శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథరాయలుగా రెండు, మూడు జన్మలలో పుట్టి దేవేంద్రుడు ఆంధ్రభాషకు సేవ చేసెను అంటారు. శైవమతావలంబకులైన బమ్మెర కుటుంబంలో పుట్టిన ఆ పోతన ఒకమారు గంగ ఒడ్డున ధ్యానంలో కూర్చుంటే, శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్కరించి, భాగవతాన్ని తెలుగులో చేయమని ఆజ్ఞాపించారుట. ఆంధ్రుల అదృష్ఠం అది. అలా తెలుగులో భాగవత పురాణం అవతరించింది

సంకలన కర్త

తూర్పు గోదావరి జిల్లా, ఊలపల్లి గ్రామస్థులు చిట్టిరాజుగారి కుమారుడు అచ్యుతరామయ్యగారు మఱియు విశాఖపట్నం జిల్లా శ్రీరామపురం గ్రామస్థులు సాంబశివ రావిగారి కుమార్తె వేంకట రత్నంగారు దంపతులు బహు సాత్వికులు ఉన్నత సంస్కారులు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు లక్ష్మీ నారాయణ దేవ్ మఱియు సాంబశివ రావు, ఇద్దరు కూతుళ్లు శేష కుమారి, లక్ష్మి. సాంబశివ రావు క్రీ.శ. 1949లో జన్మించాడు. ఆ బాలుడుని తల్లిదండ్రులు, అన్నగారు ఎంతో గారాబంగా పెంచారు. ఆటపాటలలోనే కాదు చదువులలో కూడా ముందుండే అతనిని, అనుగ్రహించి రాయవరం గ్రామస్థులు పూజారి తాతగారు పురాణ, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం పరిచయం చేసారు. కాలక్రమాన ఇవటూరి సూర్యభాస్కర రావుగారు, పోతాప్రగడ వారి ఆడబడుచు సూర్యకాంతంగారు దంపతుల పుత్రిక లలితను వివాహం చేసుకున్నారు. ఆ సాంబశివరావు దంపతులకు ఫణి కిరణ్, భాస్కర కిరణ్ అనే ఉత్తములు కలిగారు. ఈ ఊలపల్లి సాంబశివ రావు వృత్తిరీత్యా విద్యుత్తు ఇంజనీరుగా క్రీ.శ. 2007లో పదవీవిరమణ చేసాక, భాగవత గణనధ్యాయం చేపట్టారు. గణనాధ్యాయంలో భాగంగా ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ నిర్మాణం చేసి అంతర్జాలంలో అందిస్తున్నారు.

కృతఙ్ఞతలు

దీనికోసం ఎంతోమంది స్వచ్చందంగా; స్వలాభాన్ని వదులుకుని, తమ కాలాన్ని, శ్రమను; ఉచితంగా, అయాచితంగా త్యాగం చేశారు; వారందరికి కృతజ్ఞతా పూర్వక వందన సహస్రాలు సవినయంగా సమర్పించుకుంటున్నారు, భాగవత గణనాధ్యాయిని అని చెప్పుకునే ఈ సాంబశివరావు మరియు అతని బృందం. ఈ యత్నానికి అనేక గ్రంధాలూ, పుస్తకాలు, అంతర్జాల జాలగూళ్ళు, బ్లాగులు ఇంకా అనేకం సహాయ పడ్డాయి. అలాగే గణని లేదా గణన యంత్రాలు, చరవాణులు వంటి అనే అధునాతన పరికరాలు, సంస్థలు తమ అమూల్యమైన సేవ అందించాయి. ఇలా అసంఖ్యాక సహాయాలతో మన తెలుగు భాగవతం రూపుదిద్దుకో కలిగింది. వాటన్నిటికి, వారందరికి ధన్యవాద సమేత నమస్కారాలు చేయటం తప్ప ఏం చేయగలం. మరి ఋణం తీర్చుకోలేనంత గొప్ప సహాయాలు అవి.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -