పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : నవమ స్కంధం

ఓం శ్రీరామ

పోతన తెలుగు భాగవతం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

పోతన

శ్రీమదాంధ్ర మహా భాగవత విశిష్ఠాధిక్యానికి కారణం బమ్మెర పోతనామాత్యుల నిబద్ధత. ఆచార్య సి. నారాయణ రెడ్డి గారు అన్నట్లు పునర్జన్మ లేకుండా జన్మసాఫల్యం కావించుకోవాలని ఆకాంక్షించారు పోతన. వేయి నిగమాలు చదివినా సుగమంగాని ముక్తి భాగవత నిగమం పఠిస్తే అత్యంత సుగమం అవుతుందని విశ్వసించాడు. ఆ ముక్తి వాంఛే కర్షకకవి పోతనచేత భాగవత తెనుగీకరణ చేయించింది. అలా పోతరాజనే శుకరాజు “శుఖముఖసుధాద్రవమున మొనసి యున్న” భాగవతఫల రసాస్వాదనం తెలుగు రసిక విదుల మహిత భాగధేయం.

నవమ స్కంధం

భారతావనిలో మిక్కిలి ప్రభావశాల వంశాలు సూర్య వంశం, చంద్ర వంశం, శ్రీరాముడు సూర్యవంశ శిరోమణి, కృష్ణుడు యదువంశ కడలి పాలిటి చంద్రుడు. చంద్రవంశపు ధర్మరాజాదుల వెన్నుదన్ను. అలా కృష్ణావతారం చంద్ర వంశపు మహారాజులతో అవినాభావ సంబంధం ఉన్నదే. అట్టి ఘనతరములైన రెండు వంశాల చరిత్రలను నవమ స్కంధంలో అత్యద్భుతంగా వర్ణించారు. ఆ పురాణ పురుషుల పరమ భాగవతుల వర్తనలు మనకు చక్కటి మార్గదర్శకాలు.

భాగవతోత్తముడు అంబరీష మహారాజు ఏకదాశి వ్రతం చేసాడు. అతిధిగా దూర్వాసుడు వచ్చి స్నానానికి గంగకు వెళ్ళాడు. భోజనానికి ఎంతకీ రాడు. ద్వాదశ పారణ చేయాలి. అప్పుడు విప్రులు ధర్మ సందేహం ఎంతో అందంగా తీర్చారు.

అతిథి పోయిరామి నధిప! యీ ద్వాదశి
పారణంబు మానఁ బాడి గాదు
గుడువకుంట గాదు కుడుచుటయును గాదు
సలిలభక్షణంబు సమ్మతంబు.

తరవాత కోపంతో కృత్యను ప్రయోగించి దూర్వాసుడు భంగపడ్డాడు.

గరుని మనుమడు అంశుమంతుని వినయం చూసి ఋషి “యాగాశ్వాన్ని తీసుకెళ్ళు, గంగ ఉదకంతో బూడిద కుప్పలు తడిస్తే మీ తండ్రులు ఉత్తమగతులు పొందుతా”రని శలవిస్తూ యిలా చెప్పాడు.

గుఱ్ఱముఁ గొనిపో బుద్ధుల
కుఱ్ఱఁడ! మీ తాతయొద్దకున్ నీతండ్రుల్
వెఱ్ఱులు నీఱై రదె! యీ
మిఱ్ఱున గంగాజలంబు మెలఁగ శుభమగున్.

రామాయణ ఘట్టం వివరిస్తు హనుమంతుడు సముద్రం దాటుటను వివరించిన బహుళ జనాదరణ పొందిన పద్యం

అలవాటు కలిమి మారుతి
లలితామిత లాఘవమున లంఘించెను శై
వలినీగణసంబంధిన్
జలపూరిత ధరణి గగన సంధిం గంధిన్.

యాదవ వంశ భూషణుడు, సాక్షాత్తు శ్రీహరి అవతారుడు శ్రీకృష్ణుని వర్ణించే అత్యంత సుందరమైన పద్యం

నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.

లాంటి మృదుమధుర, మనోజ్ఞన సుధారస పూరితాలైన పద్యాలతో అలంకరించినది యీ నవమ స్కంధం. బమ్మర పోతనామాత్యుల ఘంటం తేనెలో మునిగి, పంచదార అద్ది, ఆస్వాదించమని తెలుగింటికి తెచ్చింది.

వృత్తాల వారీ పద్యాల లెక్క

పద్యగద్యలు = 736 +తేసీతో =44 +ఆసీతో =22; మొత్తం = 802

పద్యం ఛందోప్రక్రియ = నవమ స్కంధంమొత్తం = 802వచనం. = 283కంద పద్యం. = 184సీస పద్యం. = 66తేటగీతి సీసంతో. = 44మత్తేభం. = 47చంపకమాల. = 15ఉత్పలమాల. = 29ఆటవెలది. = 75తేటగీతి. = 5శార్దూలం. = 23మత్తకోకిల. = 3ఆటవెలది సీసంతో. = 22గద్యం. = 1మాలిని. = 1ఇంద్ర వజ్రం. = 1

కృతఙ్ఞతలు

భాగవత గణానాధ్యాయంలో భాగంగా యూనీకోడీకరించిన తెలుగు భాగవత సంకలనానికి ఆధారభూతమైన పుస్తకములకు, రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాల సంస్థలకు, సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులకు, ఇతర వ్యక్తులకు, జాలగూడు మున్నగు వాటికి అమూల్య సహాయం అందించిన వారికి, అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -